Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-4

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 3

తే.గీ.:
అట్టు హరితస గోత్రమందట్టు యాఱు
వేల శాఖ నుదయరాజు పృథివి జనన
మందె నభ్యుదయ పరంపరాభివృద్ధిఁ
జెంది తన వంశలత యశమ్మంద బెంచ॥-21

అట్టు = అట్టి (ముందు చెప్పినట్లుగా గొప్ప)

హరితస గోత్రమందు = హరితస గోత్రంలో

అట్టు యాఱువేల శాఖ = అటువంటి ఆరు వేల శాఖలతో విస్తరించిన వంశంలో

ఉదయరాజు పృథివి జననమందె = ఉదయరాజు భూమిపై జన్మించాడు.

అభ్యుదయ పరంపరాభివృద్ధి జెంది = అభ్యుదయ పరంపరను అభివృద్ధి చేసి,

తన వంశలత యశమ్మంద బెంచ = తన వంశలతను కీర్తితో వికసింపజేశాడు.

భావం:

అటువంటి గొప్పదైన హరితస గోత్రంలో, ఆరు వేల నియోగి శాఖలో విస్తరించిన వంశంలో, ఉదయరాజు భూమిపై జన్మించి, అభ్యుదయ పరంపరను అభివృద్ధి పరచి, తన వంశలతను కీర్తితో విస్తరింపజేశాడు.

ముందు వంశం మేరు పర్వతంతో పోల్చారు,

క్షాత్ర–వేద విద్యా నిధిగా వర్ణించారు, ఇప్పుడు ఆ వంశానికి స్పష్టమైన గోత్రపరిచయం శాఖల విస్తృతి చేస్తూ… ఒక ప్రముఖ వ్యక్తి (ఉదయరాజు)జన్మించడం, ఆయనతోవంశాభివృద్ధి కావడం,ఇలా కథ ఇలా కొనసాగిస్తున్నారు కవి.

సీ.:
ఆంధ్రేశ్వరైధమానాజ్ఞ యెందు పరస్స
హాస్రాబ్దముల దాక వ్యాప్తి గాంచె
బ్రతిభా సమృద్ధ పరస్సహస్సస్రాంధక
విశ్రేష్టు లందు నావిర్భవించి
రాంధ్రానవద్య పద్య ప్రబంధ పరస్స
హస్రంబు నిర్మింపనయ్యె నెందు
ప్రబలాంధ్ర ధన్వి పరస్సహస్ర సహస్ర
మెందనంత ఖ్యాతి నందుచుండె

తే.గీ.:
నట్టి సుసమజ్ఞ గోలకొండాంధ్ర భూమి
గాకతీయేశ్వరాస్థాన ఘనతగన్న
యోరుగల్పట్టణమునకు దూరుపుఁదెస
నున్న యినుగుర్తి నివసించు నుదయరాజు- 22

ఇది నిజంగా వంశవర్ణన కాదు! ఒక భూభాగ చరిత్రను చెప్పే పద్యం.

ఇక్కడ కుటుంబం ముందు “దేశం” నిలబడుతున్నది. ఇది చాలా గొప్ప రచనా క్రమం.

(ఇలా విశ్లేషించే పాండిత్యం కానీ తాహతు కానీ నాకు లేదు! ఐనా స్టడీ చేసి చెప్తున్నాను)

పద్యార్థం:

“ఆంధ్రేశ్వరైధమాన ఆజ్ఞయంద సహస్రాబ్దముల దాక వ్యాప్తి గాంచె” = ఆంధ్రేశ్వరుని (ఆంధ్ర రాజ్యాధిపత్య) కృపతో సహస్రాబ్దాల పాటు వ్యాప్తి చెందిన సాహిత్య సంపద..

ఆంధ్ర కవిశ్రేష్టులందు నావిర్భవించి” = ప్రతిభాసంపన్న ఆంధ్ర మహాకవులలో అవతరించి..

“ఆంధ్రానవద్య పద్య ప్రబంధ సహస్రంబు నిర్మింపనయ్యె” = అపరాధరహితమైన వేలాది పద్యప్రబంధాలను సృష్టించిన సంప్రదాయం..

“ప్రబలాంధ్ర ధన్వి… అనన్త ఖ్యాతి నందుచుండె” =ఆంధ్రదేశపు కీర్తి విస్తరించి..

తర్వాత స్థల నిర్దేశం:

“గోలకొండాంధ్ర భూమి” (గోల్కొండ=)

“కాకతీయేశ్వర ఆస్థాన ఘనతగన్న”

(కాకతీయ పరిపాలన)

“యోరుగల్పట్టణము”= (వరంగల్లు).

అలా ఆ మహాఘనత పొందిన గోలకొండాంధ్ర భూమిలో, కాకతీయుల ఆస్థాన వైభవాన్ని పొందిన వరంగల్ ప్రాంతానికి సమీపంలోనున్న ఇనుగుర్తి గ్రామమున నివసించిన ఉదయరాజు…

తాత్పర్యం:

ఇక్కడొక క్రమ పద్ధతిలో రాసారు.

దేశం → సాహిత్య సంప్రదాయం → రాజవంశ వైభవం → పట్టణం → గ్రామం → కుటుంబం.

అంటే కవి చెబుతున్నది:

“నా వంశం ఒక చిన్న కుటుంబం కాదు;

అది ఆంధ్ర సాహిత్య సముద్రంలో ఒక ప్రవాహం.”

ఇది గర్వం కాదు — సాంస్కృతిక అనుసంధానం.

కవిశైలీ విశ్లేషణ:

సహస్ర, సహస్రాబ్ద, సహస్ర ప్రబంధ.. పద పునరుక్తి ద్వారా వైశాల్యం సూచన.

భూగోళ నిర్దేశం.. కవికి చారిత్రక అవగాహన ఉంది అని మనకు తెలుస్తుంది.

గాంభీర్య గతి.. దీర్ఘ సమాసాలతో గొప్పనైన భావంతో రాసారు.

నాకున్న ఆధునిక దృష్టిలో.. గమనించినప్పుడు..

ఇప్పటి పాఠకుడికి ఈ భాగం చరిత్రాత్మక నేపథ్యంలా అనిపిస్తుంది.

“కవి తన కుటుంబాన్ని ఒక భూభాగపు సంస్కృతితో ముడిపెట్టి చూపుతున్నారు. వంశగౌరవం, ప్రాంతీయ గౌరవంతో ఏకమవుతుంది.”

ఇది మా ప్రాంత చరిత్రను కూడా స్పృశించే మంచి అవకాశం.

వ్యక్తిగతంగా నాకేమనిపించిందంటే ఇనుగుర్తి అనే గ్రామం పేరు పద్యంలో వినిపించగానే ఒక జీవంత అనుభూతి వస్తున్నది.

ఇది ఇక కేవలం సాహిత్య చర్చ కాదు! ఇది నా కుటుంబ మూలాల వైపు అడుగు వేసినట్టు, అందరినీ పరిచయం చేసుకున్నట్టనిపించింది.ఏదేమైనా జన్మభూమి పేరు చూడగానే గొప్ప భావన కలుగుతుంది కదా!

చం:
తత గుణరత్న భాక్కు విహితచ్ఛలుడార్య సమూహజుష్టుడు
న్నత రిపుజిత్వ రుండు భువన ప్రియుడు జ్వలుడిద్ధబోధుడా
యత ఋజువుగామియు శ్రుతాన్వాతుండప్రమాతి మాస్త్రంచు వ
గ్ర్యతర యశశ్వి యా యుదయరాజు సనాతన వైభవుడిలన్.. -23

పద్యార్థం:

“తత గుణరత్న భాక్” = అనేక గుణరత్నాలను ధరించినవాడు.

“విహితచ్ఛలుడు” = ఆచరణలో చిత్తశుద్ధి గలవాడు.

“ఆర్య సమూహ జుష్టుడు” = సజ్జనుల సమూహం చేత గౌరవింపబడినవాడు.

“ఉన్నత రిపుజిత్వరుండు” = శత్రువులను జయించిన ధైర్యవంతుడు (అక్షరార్థంలో కావచ్చు, లేదా గుణదోష జయం).

“భువన ప్రియుడు” = ప్రజలకు ప్రీతిపాత్రుడు.

“ఉజ్వలుడుిద్ధ బోధుడు” = ప్రకాశమానమైన జ్ఞానవంతుడు.

“ఆయత ఋజు వుగామియు” = విస్తార దృష్టి, సూటితనం కలవాడు.

“శ్రుతాన్వాతుండు” = వేదశ్రుతి అనుసరించినవాడు.

“అప్రమాతి” = అప్రమత్తుడు, ధర్మంలో జాగ్రత్తగలవాడు.

“వగ్ర్యతర యశశ్వి” =విశిష్టమైన కీర్తి గలవాడు.

“యా ఉదయరాజు సనాతన వైభవుడిలన్” = ఆ ఉదయరాజు సనాతన వైభవానికి ప్రతీకగా నిలిచాడు.

తాత్పర్యం:

ఇది ఒక సంపూర్ణ పురుష లక్షణాల రాశి!

ధైర్యం, జ్ఞానం, ఋజుత్వం, శాస్త్రానుసరణ, ప్రజానుకూలత, కీర్తి.. ఇవి అన్నీ కలిపి వంశానికి మూలస్తంభం.

పెద్ద నాయన చెప్పేది:

“మా వంశం యాదృచ్ఛికంగా కాదు; గుణపారంపర్యంతో నిలిచింది.” అని నొక్కి చెప్తున్నారు.

కవిశైలీ విశ్లేషణ:

గుణపదాల వరుస – అలంకారాత్మక గణన శైలి.

శబ్ద గంభీరత ఉంది; మాధుర్యం కన్నా తన వంశ గొప్పనైన భావం ఎక్కువగా చెప్పారు.

సమాస పదబంధాల ద్వారా వైభవ చిత్రణ.

ఇది వంశ గౌరవానికి మంగళ వాక్యం.

నాదైన ఆధునిక దృష్టిలో..

ఇప్పటి పాఠకుడికి “రిపుజిత్వం” వంటి పదాలు యుద్ధార్థంగా అనిపించవచ్చు.

“ఇక్కడ శత్రు జయం అనేది బాహ్య శత్రువుల కంటే, దుర్గుణాలపై సాధించిన జయం అని మనం భావించుకోవచ్చు.”

అంతేకాదు! ఈ వంశవర్ణన చెబుతున్నప్పుడు అది కేవలం చరిత్ర కాదు! ఒక ఆత్మగౌరవ నడక వలె వినిపిస్తోంది.

కం.:
ఆ యుదయరాజు నిరత కృ
తాయుత పుణ్య పరిపాక మందెననగఁ బూ
ర్ణాయుష్మంతుల వజ్రి
ప్రాయుల నైదుగురఁ బుత్రవురులం గనియెన్.. – 24

పద్యార్థం:

“ఆ యుదయరాజు” = ఆ గుణసంపన్నుడైన ఉదయరాజు..

“నిరత కృతాయుత పుణ్య పరిపాక మందెననగ”= నిరంతరం చేసిన అనేక పుణ్యకార్యాల ఫలసిద్ధిగా..

“పూర్ణాయుష్మంతుల వజ్రి ప్రాయుల”= దీర్ఘాయుష్షు గల, వజ్రంలా దేహదారుఢ్యం కలవారు..

“నైదుగుర బుతువులలో”=ఐదుగురు కుమారులు కలిగారు.

తాత్పర్యం:

ఇది సాధారణ జనన వివరణ కాదు. కవి చెబుతున్నది: “సంతానం అనేది యాదృచ్ఛికం కాదు; పుణ్య పరిపాక ఫలం.”

పుణ్య పరిపాకం అంటే.. వంశగౌరవానికి దైవానుగ్రహ ఆధారం.

వజ్రి ప్రాయులు.. కేవలం బలవంతులు కాదు;

స్థిరత్వం, నిష్ఠ, ధర్మదృఢత. అంటే వంశంలో గుణపారంపర్యం కొనసాగిందని అన్యాపదేశంగా చెప్తున్నారు.

కవిశైలీ విశ్లేషణ:

“నిరత కృతాయుత పుణ్య పరిపాక” – దీర్ఘసమాసం ద్వారా భావగాంభీర్యం.

“వజ్రి ప్రాయులు” – రూపక అలంకారం.

సంక్షిప్తంగా, కానీ గొప్పగా చెప్పారు.

నా ఆధునిక దృష్టతో చూస్తే..

“పుణ్య పరిపాకం అనేది కేవలం మతపరమైన భావం మాత్రమే కాదు; అది పూర్వీకుల సద్గుణాల ఫలితంగా వచ్చిన సంస్కార వారసత్వం.” వంశవర్ణన విలువల పరంపరగా కనిపిస్తుంది.

పెదనాయన గారి వివరణ ఒక ప్రణాళిక వలె రాసారు.

ఉదయరాజు → ఐదుగురు కుమారులు.

వారి పేర్ల ప్రస్తావన,వారిలో విశిష్టుని గుణవర్ణన చేసారు. ఎందుకంటే వేర్లు లేని వృక్షం ఉండదు కదా! వారి గురించి తర్వాత తరాలకు చెప్పడం ఒకటైతే.. తన కృతజ్ఞతావిష్కరణ మరొక కారణం. ఏదేమైనా నేనుకూడా ఆ మూల పురుషులను తలచుకోవడం వారి ఆశీస్సులు కోరుతూ..నమస్కరించుకుంటూ..

తే.గీ.:
అయిత రాజన వద్దిరాజనఁగ గోప
రాజనఁగ సంబరాజన రామరాజు
నాగ వారలు వెలసి రనంత యశులు
వైష్ణవామేయ పంచకమున.. – 25

పద్యార్థం:

ఉదయరాజుకు పుట్టిన ఐదుగురు కుమారులు:

అయితరాజు, వద్దిరాజు, గోపరాజు, సంబరాజు, రామరాజు, అనే ఐదుగురు కుమారులు కలిసి “వైష్ణవామేయ పంచకము”గా ప్రసిద్ధులయ్యారు.

“వైష్ణవామేయ పంచకము” అంటే?

ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.

వైష్ణవభక్తి సంప్రదాయానికి చెందినవారు గానూ;

“అమేయ” అంటే కొలవలేనిది, అపరిమితమైనది.

“అపార వైష్ణవ భక్తితో వెలిగిన ఐదుగురు సోదరులు.”అని చెప్పుకోవచ్చు.

కవితా నైపుణ్యం:

పేర్ల పరంపర.. శబ్దసౌందర్యం.

“అనంత యశులు”.. శాశ్వత ఖ్యాతి.

“పంచకము” ..సమూహ గౌరవనామం.

ఇది కేవలం ఐదుగురు అన్నల పరిచయం కాదు!

ఒక ఆధ్యాత్మిక వంశం ప్రతిష్ఠ.

ఈ పద్యం చదివినప్పుడు నాకు కలిగిన భావమెలా ఉందంటే?

“వంశవర్ణనలో గుణపరంపర దైవభక్తి రూపంలో స్థిరపడినప్పుడు, అది కేవలం కుటుంబ చరిత్ర కాదు; సంస్కార వారసత్వ చరిత్ర అవుతుంది.” అని అలా వంశం మొత్తం భక్తిపరులని తెలుస్తున్నది.

కం:
వారల నామంబులే య
యవ్వారల వారల గృహాఖ్య బఱగెను మఱియు
వ్వారుఁ దమ వంశములఁ జె
ల్వారంగను మూలపురుషులైరి ముదమునన్.. – 26

భావము:

వారి సంతతిలో పుట్టిన వారిలోనే, ఆ ఐదుగురు కుమారుల పేర్లతో గృహనామాలు (ఇంటి పేర్లు) ఏర్పడ్డవి.

తమ తమ వంశాలకు వారు మూలపురుషులై, ఆనందంతో, గౌరవంతో ప్రసిద్ధులయ్యారు.

లోతైన భావమే కాదు! ప్రస్థుతమున్న ఎన్నోకుటుంబాల మూలపురుషులను తెలిపినవైనం.. కేవలం కుటుంబ విస్తరణ కాదు! “పేరు” నుంచి “పేరుప్రతిష్ఠ”కి మారిన క్షణం.

ఒక్కొక్కపేరు మీద ఒక గృహనామం అది ఒక వంశ చిహ్నంగా మారడం ఆ మూలపురుషత్వం.

ఇక్కడ “ముదమునన్” అనే పదం చాలా మృదువుగా ఉంది. అంటే బలవంతంగా రుద్దబడింది కాదు; ఆనందభరితమైన ఆమోదంతో ఆ మూల పురుషుల పేర్లు తమ ఇంటి పేర్లుగా మార్చుకున్నారని ఆ యా కుటుంబాల గౌరవమర్యాదలను తెలుపుతూ రాసారు.

“పేరు వంశానికి మార్గదర్శి అయినపుడు, ఆ వ్యక్తి కేవలం సంతానకర్త కాదు; సంస్కార మూలపురుషుడవుతాడు.” కదా!

కం:
వారలలో నయగుణ వి
స్తారుండగు వద్దిరాజు తనయున్ సత్యా
చారున్ మన్మథ తులితా
కారున్ సుకుమారున్ గనియె గట్టమరాజున్.-27

భావము:

ఆ వారసులలో నయగుణాలలో విస్తారుడైన వద్దిరాజు అనే అతనికి సత్యాచారుడై,మన్మథునితో సమానమైన సౌందర్యవంతుడై,సుకుమార స్వభావుడైన గట్టమరాజు అనే తనయుడు జన్మించాడు.

భావసూక్ష్మం:

నయగుణ విస్తారుడు.. ఇది తండ్రి గుణగణాల విస్తృతి.

అంటే కుటుంబ సంస్కారం ఇప్పటికే ఉన్నది.

సత్యాచారుడు ,నైతిక బలం, మన్మథ తులితాకారుడు –

రూప సౌందర్యం (శరీర-శోభ).

సుకుమారుడు.. బాహ్య సౌందర్యంతో పాటు అంతర్మృదుత్వం.

ఈ క్రమం చాలా బాగుంది. ముందు గుణం, తర్వాత ఆచారం, తర్వాత రూపం, చివర స్వభావ మాధుర్యం.

ఇలా వివరించారు.

సీ:
గట్టమరాజు వేడ్కం గాంచె వేంకట
రాజున, బుల్లమరాజున్ అంగ
బరఁగు బుత్రకుల నిర్వురు నందు బుల్లమ
రాజు కాంచెను దిమ్మరాజు,లక్ష్మ
రాజును మఱి మాదిరాజును ముగురఁ బు
త్రకుల వారిని; లక్ష్మరాజు సుతుల
గనియె ముగ్గురను జగ్గన్న, నర్సన్న, బు
ల్లన్నల నందు జగ్గన్న గనియె.

తే.గీ.:
సుతుని బుల్లమరాజు నా శుభచరితుడు
గనియె సుతపంచకమునందు ఘనుడు లక్ష్మ
రాజు; గనియెను సుతు యతిరాజు, నతడు
గాంచె సుతు సంబరాజును ఖ్యాతిమీఱ.. – 28

భావవివరణ

ఈ పద్యంలో కవి తరతరాలుగా వంశాన్ని శ్రేణీ బద్ధంగా కూర్చారు.

గట్టమరాజు.. ఆయనకు ఇద్దరు కుమారులు.

→ వేంకటరాజు, పుల్లమరాజు

పుల్లమరాజు.. ముగ్గురు కుమారులు.

→ తిమ్మరాజు, లక్ష్మరాజు, మాదిరాజు

లక్ష్మరాజుకు.. ముగ్గురు కుమారులు.

→ జగ్గన్న, నర్సన్న, పుల్లన్న

జగ్గన్నకు ఒకే కుమారుడు

→ పుల్లమరాజు (మరో తరం)

ఆ పుల్లమరాజు

→ ఐదుగురు సుతులు

వారిలో ఘనుడు లక్ష్మరాజు. ఆయనకు ఇద్దరు కుమారులు.

→ యతిరాజు→ సంబరాజు (ఖ్యాతిమీరినవాడు).

ఇది కేవలం పేర్ల పరంపర రాయడం కాదు!

ఒక సామాజిక, ఆధ్యాత్మిక, కులపర గౌరవ వారసత్వాన్ని చెప్పడం.

నాకు ప్రత్యేకంగా నచ్చిన అంశాలు..

“సుతపంచకము” – ఒకే పదంతో కుటుంబ విస్తారాన్ని చూపారు.

“ఖ్యాతిమీఱ” – తరతరాలుగా ఖ్యాతి పెరుగుతూనే ఉందని అంతర్లీన భావం.. క్లుప్తంగా బాగుంది.

ఉ.:
ఆతడుదారసత్వుడు, మహా ద్విజవర్య సమూహజుష్టుడు,
ర్వీతల నాక నాయకుడు, భీతజనాభయకారి, *లోకవి-
ఖ్యాత వదాన్యతా గుణ వికాసి, సురాలయ
ధైర్యుడు, ఆగమాఽ
ధ్యేత, సుగర్విత ద్విషదుదేజయుడార్జవ పూర్ణుడెన్నగన్.. -29

ప్రతి పదార్థం:

ఇక్కడ కవి ఆ మహానుభావుని ఇలా చిత్రిస్తున్నాడు:

ఉదారసత్వుడు; ధార్మిక సత్యనిష్ఠుడు; మహా ద్విజవర్య సమూహజుష్టుడు ; బ్రాహ్మణశ్రేష్ఠులచే సత్కృతుడు; నాయకుడు ..తన ప్రాంతానికో, వంశానికో నేతృత్వం వహించినవాడు;

భీతజనాభయకారి = భయపడినవారికి ధైర్యం ఇచ్చేవాడు

లోకవిఖ్యాత వదాన్యతా గుణవికాసి= దానగుణం విస్తరించినవాడు;

సురాలయ ధైర్యుడు = దేవాలయ నిర్మాణం/పరిరక్షణలో ముందుండేవాడు.

ఆగమాధ్యేత= ఆగమశాస్త్రపారంగతుడు

ద్విషదుదేజయుడు= శత్రువులను ఓడించినవాడు

ఆర్జవపూర్ణుడు = నిష్కపట స్వభావం

ఇది ఒక రాజనీతిజ్ఞుడు ,ధర్మపరుడు, దాత, శాస్త్రవేత్త = అన్నీ కలిసిన సమగ్ర వ్యక్తి చిత్రీకరణ.

శైలీ అందం:

“వదాన్యతా గుణ వికాసి” – గుణం పుష్పంలా వికసిస్తున్నట్టు చూపించారు.

“భీతజనాభయకారి” – ఒక్క పదంతో రక్షకత్వాన్ని చెప్పారు.

“సురాలయ ధైర్యుడు” – దేవాలయ నిర్మాణ కర్త.

నా వంశ విశేషాలు చదువుతుంటే గర్వంగా ఉంది.

సీ.:
సంబరాజునకు బ్రశస్త సద్గుణ గణా
గారుడాచార్యయ్య గలిగె నతని
కిరువురు సుతులు విస్త్రత శేముషీ సమ
గ్రులు విష్ణుభక్తి ధుర్యులు యశో వి
శాలురునగు రంగశాయియు శ్రీనివా
సులు నందు శ్రీనివాసునకు బుత్రు
లైదుగురుద్వంబైరి జగ్గన్న సీ
నయ్య వెంకన్న పాపయ్య చిన్న

తే.గీ.:
రంగయాఖ్యులు వారిలోనన్ యవీయు
డైన వెంకయ్య కనియె పాపయ్య నాము
నట్టు పాపయ్య చిన్నమ్మ యందు గనియె
నరయ వెంకయ్య రఘునాథుడనెడు సుతుల.. – 30

ఇప్పుడు వంశవృక్షం కళ్లముందే విస్తరించిన వటవృక్షంలా కనిపిస్తున్నది.

భావ వివరణ:

“సంబరాజునకు బ్రశస్త సద్గుణ గుణాగారుడాచార్యయ్య గలిగె”

సద్గుణ గుణాగారుడు= సద్గుణాలు నిలయం.

సంబరాజుకు మంచి గుణాలున్న ఆచార్యుడనే వాడు. జన్మించాడు.

ఆయనకు ఇద్దరు కుమారులు..

రంగశాయి, శ్రీనివాసులు.

వీరిద్దరు..

“విస్తృత శేముషీ సమగ్రులు” = విస్తృతమైన మేధాశక్తి కలవారు,

“విష్ణుభక్తి ధుర్యులు” = భక్తిలో ముందువరుసలో నిలిచినవారు,

“యశోవిశాలులు” = కీర్తి విస్తరించినవారు,

ఇక్కడ “శేముషీ” అనే పదం వినగానే కవి పాండిత్యానికి ఒక మృదువైన వెలుగు కనబడింది.

శ్రీనివాసుని వంశం:

శ్రీనివాసునికి ఐదుగురు కుమారులు:

జగ్గన్న, సీనయ్య, వెంకన్న, చిన్నపాపయ్య.

వంశప్రవాహాన్ని సాక్షాత్కారంగా చూపిస్తున్నాడు.

తరువాతి శాఖవారిలో వెంకయ్యకు పాపయ్య,పాపయ్యకు చిన్నమ్మ ద్వారా వెంకయ్య, రఘునాథుడు అనే కుమారులు.

ఇది కుటుంబ చరిత్రలో ఒక స్పష్టమైన వంశపట్టిక.

కవిశైలి:

“సద్గుణ గుణాగారుడు” = ఒకే పదంలో వ్యక్తిత్వ గంభీరత,

“విష్ణుభక్తి ధుర్యులు” = ధుర్యుడు అంటే, ముందువరుసలో నిలిచినవాడు,

“యశోవిశాలులు” = యశస్సు విస్తారమైనదని చూపే రూపకం లాంటి వంశవర్ణన అయినా, రాజవంశ గాథలా గంభీరంగా రాసారు.

ఈ పేర్లు కేవలం వంశపట్టికలోని అక్షరాలు కాదు! ప్రతి పేరుకీ వెనుక భక్తి, మేధ, గౌరవం, క్రమశిక్షణ గల వంశమని తెలుస్తున్నది.

(సశేషం)

Exit mobile version