Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-5

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 4

31 శా॥
ఆ వెంకయ్య విశిష్ట వర్తనకు దావై ద్రావిడామ్నాయ వి
ద్యా వైశద్యము నందు మిన్న యయి నైజార్ధాంగీ లక్ష్మాంబ తో
నేవేళం గమలా శ్రియః పతుల సాదృశ్యంబు దీపించి ధీ
మా విస్తారుని బుత్రునింగనియె రామారాయ నామాంచితున్

ప్రతిపదార్థం:

“ఆ వెంకయ్య విశిష్ట వర్తనకు దావై..” = ఆ వెంకయ్య తన విశిష్ట ప్రవర్తనకు పేరుగాంచినవాడు.

“ద్రావిడామ్నాయ విద్యా వైశద్యము నందు మిన్నయై”

ఇది చాలా ముఖ్యమైన పదబంధం.

ద్రావిడామ్నాయము= శ్రీవైష్ణవ ఆగమ, ఆళ్వారుల సంప్రదాయం

“విద్యా వైశద్యము” = ఆ విద్యలో పారదర్శక పాండిత్యం

“మిన్నయై” = అందరిలో మిన్నగా నిలిచినవాడు

అంటే శాస్త్రజ్ఞానం మరియు సంప్రదాయ నిబద్ధత.

“నైజార్ధాంగీ లక్ష్మాంబతో నేవేళం”

తన సహధర్మచారిణి లక్ష్మాంబతో కలిసి జీవించిన జీవన విధానం. ఇక్కడ కవి, దంపతుల ఐక్యతను సూచిస్తున్నాడు.

“కమలా శ్రియః పతుల సాదృశ్యంబు దీపించి”

ఇది అద్భుతమైన ఉపమానం!

వెంకయ్య–లక్ష్మాంబలను లక్ష్మీనారాయణుల జంటతో పోల్చాడు. ఇది వంశగాథలో అత్యున్నతమైన ప్రశంస.

“ధీమావిస్తారుని బుత్రుని గనియె రామారాయ నామాంచితున్” = అటువంటి దంపతులకు పుట్టిన కుమారుడు –

“ధీమావిస్తారుడు” =విస్తారమైన మేధాశక్తి గలవాడు

అతడు రామారాయ అని ప్రసిద్ధి పొందాడు.

శైలీ విశ్లేషణ

“ద్రావిడామ్నాయ విద్యా వైశద్యము”..

శాస్త్రపాండిత్యాన్ని కవిత్వంలో కూర్చిన చక్కటి సంధి

“గమలా శ్రియః పతుల సాదృశ్యం” – ఉపమా అలంకారం. పదప్రవాహం గంభీరంగా, రాజవంశ గాథల శైలిలో ఉంది.

నాకేమనిపిస్తున్నదంటే? ఇది సాధారణ కుటుంబ వర్ణన కాదు! ఒక ఆధ్యాత్మిక రాజవంశ చరిత్ర.

“వెంకయ్య–లక్ష్మాంబల జంటను లక్ష్మీనారాయణుల సరసన నిలబెట్టిన కవి గర్వం, వంశపారంపర్యంలో ఆధ్యాత్మిక గౌరవం ఎంత లోతుగా ఉందో తెలియజేస్తుంది.”నిజం చెప్పాలంటే.. ఈ వంశవర్ణనలో ఆధ్యాత్మిక గంభీరత మరియు కుటుంబ గౌరవం రెండూ కలసి ఉన్నాయి.

32 శా॥
రామారాయడు లౌక్యవైదిక యథార్థ ప్రాంచిత ప్రాభవ-
స్తోమార్ణోనిధి, పారదృశ్యత బుధస్తోత్రార్హుడై సదృశః,
కాముండై దగి ప్రాభ్వికాదరణ బేష్కార్నాయ బాఖ్యా లస
ద్భూమోద్యోగ యుగంబునందు నభిషిక్తుండై యతండెమ్మెయిన్

భావ విశ్లేషణ

ఈ పద్యంలో రామారాయునిలో నాలుగు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి:

“లౌక్య వైదిక యధార్థ ప్రాంచిత ప్రాభవ”

లౌకిక (ప్రాపంచిక) వ్యవహారాలలోను,

వైదిక (ధార్మిక) మార్గంలోను,

యథార్థతతో, సమన్వయంతో ప్రాభవం చూపినవాడు.

ఇది ద్వంద్వ సమన్వయం –

లోక జీవితం మరియు శాస్త్ర జీవితం.

“ప్రాభవ స్తోమార్ణోనిధి” ప్రభావం ఒక సముద్రంలా విస్తరించింది.

“అర్ణోనిధి” – సముద్ర రూపకం అధ్భుతంగా ఉంది.

“బుధ స్తోత్రార్హుడు” పండితుల ప్రశంసలకు పాత్రుడు.

ఇది వంశగౌరవానికి ఉన్నత గుర్తింపు.

“భూమి ఉద్యోగ యుగంబునందు అభిషిక్తుడు”

ఆయన ఒక భూమికి సంబంధించిన పేష్కారు ఉద్యోగం చేసేవాడు.

“అభిషిక్తుడు” అన్న పదం రాజాభిషేకాన్ని స్మరింపజేస్తుంది.

అంటే సామాజికంగా గౌరవనీయమైన పదవిలో ఉండేవాడు.

కవిశైలి ప్రత్యేకత

“అర్ణోనిధి” రూపకం ఇది గంభీరంగా ఉంది.

లౌక్య–వైదిక సమన్వయం ధర్మరాజ లక్షణం వలె ఉంది. పండిత ప్రశంస సాహిత్య గౌరవాన్ని తెలుపుతున్నది. ఈ చిత్రణలో ఒక ధర్మపాలకుని రూపం కనిపిస్తున్నది.

“రామారాయునిలో లోకనిర్వహణ నైపుణ్యమూ, వైదికనిబద్ధతా పరిపక్వతా సమానంగా నిపుణత కలిగిఉన్నవాడు అనిపించింది.

33 కం॥
ధాత్రీజనతా సంస్తుతి
పాత్రీకృత గుణను కాశ్యపసగోత్రజ లో-
కత్రయ వర్ణిత సుందర
గాత్రిని జేపట్టి భార్యగా జూడాంబన్

భావవిశ్లేషణ

రామారాయుడు –

ధాత్రీజనతా సంస్తుతి పాత్రీకృత గుణను =ప్రజలచే ప్రశంసింపబడిన గుణశాలిని,

కాశ్యప సగోత్రజ=కాశ్యప మహర్షి వంశానికి చెందిన సతీ

లోకత్రయ వర్ణిత సుందర గాత్రిని= మూడు లోకాలలోనూ వర్ణించదగిన సౌందర్యం గలది

చూడాంబను భార్యగా వరించెను.

కాశ్యప గోత్రం ప్రస్తావన “కాశ్యప సగోత్రజ” అన్నపుడు

ఆ వధువు కేవలం సౌందర్యవతి కాదు;

ఋషివంశ పరంపర కలిగిన మగువ అని తెలుస్తున్నది.

కవిశైలి

“ధాత్రీజనతా సంస్తుతి” – ప్రజాభిమానాన్ని ముందుగా ఉంచారు.

“లోకత్రయ వర్ణిత సుందర గాత్రి” – అతిశయోక్తి అలంకారం.

వధువు పరిచయం → వంశగౌరవం మరియు ఋషిపరంపర, సౌందర్యం – మూడు విధాల యోగ్యురాలు.

ఇది కేవలం వివాహ వర్ణన కాదు;

వంశం మరో పవిత్ర వంశంతో కలిసిన ఘడియను చెప్పడం.

“రామారాయుని వైదిక వైభవానికి సమానంగా నిలిచే ఋషి వంశానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం.. వంశ చరిత్రలో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.

34 శా॥
ఆ దాంపత్య మహా విభూతి ననసూయాత్రుల్ శచీనాక లో
కాధీశుల్ తుహినావనీధ్ర తనయాత్ర్య క్షుల్ పయః సింధు పు
త్రీ దాశార్హులు భారతీ విధులు సాతీ కౌశికులు చూచి సం
మోదంబంది ప్రశంసం జేసిరి మనఃస్ఫూర్తిన్ సదా వారలన్

ఇది సాధారణ ప్రశంస కాదు!

భావ విశ్లేషణ

“ఆ దాంపత్య మహా విభూతి” =  ఆ దంపతుల జీవితం మహా వైభవం..

తర్వాత కవి ఎవరు చూసి సంతోషించారో చెప్పే విధానం అద్భుతం:

అనసూయాత్రులు = అనసూయ , అత్రి మహర్షులు

శచీనాకలోకాధీశులు = శచీదేవి, ఇంద్రుడు

తుహినావనీధ్ర తనయాత్రక్ష్యులు= హిమవంతుని కుమార్తె పార్వతీ పరమేశ్వరులు

పయఃసింధు పుత్రీ దాశార్హులు =లక్ష్మీదేవి, కృష్ణ మూర్తి

భారతీ విధులు = సరస్వతీ బ్రహ్మలు,

సాతీ కౌశికులు =సుమతీ.. కౌశీకులు తన భార్యతో సహా

ఇంతటి దివ్య సమూహం ఆ దంపతులను చూచి =“మనఃస్ఫూర్తిగా” ప్రశంసించిరి.

అంటే = వారి దాంపత్యం దేవతల వరం పొందిన గొప్ప జంట అని కవి చెప్పుతున్నారు.

కవిశైలీ విశ్లేషణ

ఇది అతిశయోక్తి అలంకారం అత్యున్నత రూపం.

పురాణ దాంపత్యాల సరసన నిలబెట్టడం ద్వారా వంశగౌరవాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లారు. పదప్రవాహం శార్దూలవిక్రీడిత ఛందస్సుకు తగిన గంభీరతతో ఉంది.

ఇది చదువుతుంటే ఒక రాజసూయ యాగ సభలో ప్రశంసలు వినిపిస్తున్నట్టుంది.

నా దృష్టిలో ఇక్కడ పెద్దనాయన రాసిందేమిటంటే..

వంశదంపతును దేవి దంపతులు ఆశీర్వదించారు.

ఇది వంశాభిమానానికి ప్రతీక. “ఈ దంపతుల గృహజీవితం కేవలం కుటుంబవ్యవహారం కాదు; ధర్మ–భక్తి–సౌభాగ్య సమన్వయానికి చిహ్నం.” భార్యాభర్తలంటే ఇలా ఉండాలి కదా? అనిపిస్తుంది.

35 కం॥
ఆ యిరువురకు బయోనిధి
బీయూషము గతి జనించె వేంకటరామా
రాయడు సూరూప నిర్జిత
కాయజుడు విశిష్ట గుణ నికాయుడు నెమ్మిన్

ఈ పద్యం ఎంతో మృదువుగా, ఎంత గంభీరంగా ఉంది..

భావవిశ్లేషణ

“ఆ యిరువురకు బయోనిధి బీయూషము గతి జనించె” = ఆ దివ్యదంపతులకు పుట్టిన కుమారుడు..

“పయోనిధి బీయూషము”..

పయోనిధి = సముద్రం

పీయూషము = అమృతం

అంటే – సముద్రంలో పుట్టిన అమృతంలా అమూల్యమైన సంతానం..

ఇంతటి ఉపమానం వంశగర్వాన్ని ఎంత ఎత్తుకెళ్లిందోకదా! ఆయన పేరు వేంకటరామారాయుడు. పేరు వినగానే శ్రీవైష్ణవ సంప్రదాయం గుర్తొస్తుంది. వేంకటేశ–రామ నామ సమన్వయం.

గుణచిత్రణ

సురూపుడు అంటే సౌందర్యశాలీ..

నిర్జిత కాయజుడు అంటే.. మన్మథునికన్నా మిన్న;

విశిష్ట గుణ నికాయుడు.. గుణాల సమూహం;

ఇక్కడ రూపం మరియు గుణం రెండూ సమపాళ్లలో ఉన్నట్టు చెప్పారు.

కవిశైలి ప్రత్యేకత

“పయోనిధి పీయూషము” – రూపకం అద్భుతం.

ఇది కేవలం కుమారుడు కాదు – వంశానికి అమృతకలశం వంటి వాడని.

అలాగే “నిర్జిత కాయజుడు” అన్నపుడు

మనసుకు వెంటనే గుర్తొచ్చేది కామదేవుడు..

అంటే సౌందర్యంలో మన్మథుడినీ జయించినవాడు.

“వేంకటరామారాయుని జననం వంశవృక్షానికి అమృతసంయోగం; రూపంలో మాధుర్యం, గుణంలో విశిష్టత సమన్వితమైన సంతానం.”

36 సీ॥
పసితనమందైన బల్కి బొంక నెఱుంగ
డాడుట యందైన దోడివారి
నడఁచుటయో కోపపడుటయో యెఱుగఁడు
గలనైనఁ దప్పుమార్గమున జనుట
నెఱుఁగఁడు వచ్చెడు నెడనైన నత్యాశఁ
దాల్చి యెఱుంగఁడు దనకు నెగ్గు
నొనరించు నట్టి వారినైనఁ జెడఁగోఱి
యెఱుఁగఁడు విన్నబోయి యెఱుగండు
తే. గీ.॥
వివధ విద్యా వివేక కోవిదుడుఁ బక్ష
పాత శూన్యుడుఁ జాతురీ భరిత వచసుఁ
డమలయశుడు వివేకి జనాఽభిగణ్య
రమ్య చరితుండు వేంకటరామారావు

ఇది చదివితే ఒక ప్రశాంత స్వభావం మన ముందే నిలబడినట్టుంది. ఎంత అందమైన వర్ణన!

వేంకట రామారావుకు పసితనంలో నుంచే అబద్ధాలాడడం తెలియదు, తల్లిదండ్రుల మాట వినకుండా ఉండడు, ఆటలు సమయంలో అనవసరంగా కోపగించుకోడు,

చెడు మార్గంలో నడవడు, ఎప్పుడూ అతిగా ఆశపడడు, తనకు మేలు చేసిన వారికి కీడు కోరుకోడు, ఎవరైనా పెద్దలు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేయడు, అతడు అనేక విద్యలలో ప్రవీణుడు, పక్షపాతం లేని స్వభావం కలవాడు,

వినసొంపుగా మాట్లాడుతాడు, మచ్చలేని కీర్తి కలవాడు వివేకవంతుడు, ప్రజలందరికీ గౌరవనీయుడు, అందమైన సద్గుణ చరిత్ర కలవాడు.

పెద్ద నాయనగారు వంశప్రస్తావనలో కేవలం గుణగణాల జాబితా ఇవ్వలేదు. “ఎఱుగడు” అనే పదాన్ని పదేపదే ఉపయోగించి – ఒక నిర్మల స్వభావాన్ని ప్రతిష్ఠించారు. ఆ పునరుక్తి అలంకారం చాలా అందంగా ఉంది.

37 తే.గీ.॥
కాశ్యపసగోత్ర సింధు రాకా శశాంకు
డైన కృష్ణ రాయండు జోగాంబ యందుఁ
గన్నసుత రంగనాయికాఖ్యం బరిణయ
మయ్యె వేంకటరామరావమలయశుడు

ఇది వంశ గౌరవాన్ని మృదువుగా, గంభీరంగా చెప్పిన పద్యం.

సరళ భావం

కాశ్యప గోత్రానికి చెందిన, సముద్రంపై పౌర్ణమి చంద్రుడిలా కాంతివంతుడైన కృష్ణరాయుడు, జోగాంబ గారి దంపతులకు వారికి పుట్టిన గన్నసుత (అంటే సంతానం) రంగనాయిక అనే ఆమెతో ఆ వంశంలో మచ్చలేని కీర్తి కలిగిన వేంకటరామారావుగారికి వివాహం జరిగింది.

ఇక్కడ “సింధు రాకా శశాంకుడు” అంటే సముద్రంపై వెలిగే పౌర్ణమి చంద్రుడు – గొప్ప ప్రశాంతతకు సూచకం.

కాశ్యప వంశ కిరీటంలో పౌర్ణమి చంద్రునిలా వెలిగిన కృష్ణరాయుడు.. జోగాంబ సహచర్యంలో సంస్కార సౌరభం విరజిమ్మగా,ఆ వంశవీణలో మరో స్వరంరంగనాయికగా నినదించి, నిర్మల కీర్తి మణిగా వెలసిన వేంకటరామారావును పరిణయమాడింది.

కాశ్యప గోత్రానికి చెందిన, సముద్రంపై పౌర్ణమి చంద్రునిలా కాంతివంతుడైన కృష్ణరాయుడు జోగాంబ గారితో కలసి జీవించాడు. వారికి పుట్టిన కుమార్తె రంగనాయకి. ఆ రంగనాయకి దేవిని నిర్మల కీర్తి కలిగిన వేంకటరామారావు వివాహం చేసుకున్నాడు.

38 మ॥
కలదే సాటి ధరిత్రి నామెకు ననంగ స్త్రీ నిభా కారకు
జ్జ్వల దాంధ్రామర భారతీద్వయ విశేష ప్రాజ్ఞతా ధారకున్
ప్రలసత్కృత్స్న సుభద్రతాయుత గుణవ్యాపారకున్ నిత్య ని
ర్మలినాచార కనుక్షణ క్రమ పరిశ్రంధత్కృపాగారకున్

ఈ పద్యం పూర్తి గూఢసమాసాలతో ఉంది.

మొత్తం పద్యం ఒకే వ్యక్తిని (ఆమెను) విశేషణాలతో వరుసగా వర్ణిస్తున్నది.

కలదే సాటి ధరిత్రి నామెకు=ఆమెకు భూమిపై సాటి ఎవరూ లేరు.

అనంగ స్త్రీనిభాకారకు = అనంగుడు (మన్మథుడు) సృష్టించిన సౌందర్యమూర్తిలా, స్త్రీ లావణ్య సంపన్నురాలు.

ఉజ్జ్వలదాంధ్రామర భారతీద్వయ విశేష ప్రాజ్ఞతా ధారకున్= ఉజ్వలద్ + ఆంధ్ర + అమరభారతీ ద్వయ

ఇక్కడ “అమరభారతీ” అంటే సంస్కృతం

“ఆంధ్ర” తెలుగు.. తెలుగు, సంస్కృత భాషలలో విశేష పాండిత్యం కలిగినది.

ప్రలసత్ కృత్స్న సుభద్రతా యుత గుణ వ్యాపారకున్ = సంపూర్ణ మంగళగుణాలతో ప్రకాశిస్తూ, ఆ గుణాలను ఆచరణలో విస్తరింపజేసే స్వభావం కలది.

నిత్య నిర్మలిన ఆచార= ఎల్లప్పుడూ నిర్మలమైన ఆచరణ కలది.

కనుక్షణ క్రమ పరిశ్రంధత్ కృపాగారకున్= ప్రతి క్షణం క్రమశిక్షణతో, హృదయం కరుణాసాగరం వలె నిండినది.

సరళ భావంలో ఇలా చెప్పుకోవచ్చు!

భూమిపై ఆమెకు సాటి ఎవరూ లేరు, మన్మథుని సృష్టిలా లావణ్యవతి,తెలుగు, సంస్కృత భాషలలో విశేష పాండిత్యం ఉన్న మహిళ, సంపూర్ణ మంగళగుణాలతో ప్రకాశించి,ఆ గుణాలను ఆచరణలో విస్తరింపజేసే స్వభావం ఆమెది. ఎప్పుడూ నిర్మలమైన ఆచారాన్ని పాటించేది.

ప్రతి క్షణం క్రమశిక్షణతో జీవించి,కరుణతో నిండిన హృదయం ఆమె స్వంతం.

“సుభద్రతాయుత గుణ వ్యాపారకున్”

ఇది కేవలం “మంచి గుణాలు ఉన్నది” కాదు.

ఆ గుణాలు ఆమెకు సహజగుణాలు.

39 కం॥
ఆ దంపతులకు నరయఁగ
మాదగు గతజన్మ పుణ్య మహిమము పొంటెన్
గాదిలి బిడ్డల మైతిమి
సోదరుల మభేదభావ యుక్తులమందున్

భావం:

అలాంటి మహనీయ దంపతులకు సంతానమవడం మా గత జన్మ పుణ్యఫలమే.

వారి ఒడిలో పెరిగిన ముద్దుబిడ్డలమై, మేము అన్నదమ్ములముగా భేదభావం లేకుండా జీవించాము. లోతైన భావరస మేమిటంటే? ఇది కేవలం వంశ ప్రస్తావన కాదు; తల్లిదండ్రుల గొప్పతనాన్ని పూర్వజన్మ సుకృతఫలాన్ని గుర్తుచేస్తుంది.

“గాదిలి బిడ్డలమైతిమి” = ముద్దుబిడ్డల మయ్యాము. (హృదయస్పర్శిత భావం.)

“సోదరులమభేదభావ యుక్తులమందున్” = కుటుంబ సమన్వయం, పరస్పర కరుణా భావం ఉన్నవాళ్ళమని పరిచయం చేసుకున్నారు.

40 మ॥
సరస స్వాదు వచోవిలాసి కవితాసామ్రాజ్య లక్ష్మీ దురం
ధర చూడామణి సంస్కృతాంధ్ర యవనాంగ్ల ద్రావిడీ సాహితీ
పరిపూర్ణజ్ఞుడు వేద పాఠి విమలస్వాంతుండు లక్ష్మీ మనోం
బురుడాదిత్య పదారవింద మధుపీభూత ప్రభూతాత్ముఁడున్

ఈ పద్యం చూస్తే ఒక మహామహోపాధ్యాయుని ప్రతిమ ముందుకొస్తోంది ఇది గుణగణాల ఘన వర్ణన.

కఠిన పదాలకు అర్థాలు:

సరస స్వాదు వచో విలాసి= మధురమైన, రసమయమైన వాక్చాతుర్యంలో ప్రసిద్ధుడు,

కవితా సామ్రాజ్య లక్ష్మీ దురంధర చూడామణి= కవితా సామ్రాజ్యాన్ని భుజస్కంధాలపై మోసే శిరోమణి,

సంస్కృత–ఆంధ్ర–యవన–ఆంగ్ల–ద్రావిడీ సాహితీ పరిపూర్ణజ్ఞుడు= అనేక భాషల సాహిత్యంలో ప్రావీణ్యం కలవాడు,

వేద పాఠి= వేదాలను అభ్యసించినవాడు,

విమల స్వాంతుండు =నిర్మలమైన హృదయం కలవాడు.

లక్ష్మీమనోంబురుహ ఆదిత్య పదారవింద మధుపీభూత ప్రభూతాత్ముడు= లక్ష్మీదేవి మనసు పద్మరూపమై వికసించిన సూర్యుని పాదారవిందమునకు తేనెటీగవలె ఆనుకుని ఉన్న భక్తాత్ముడు (అంటే మహావిష్ణుభక్తుడు)

సరళ భావం

ఆయన మధురమైన వాక్చాతుర్యంలో ప్రసిద్ధి పొందినవాడు, కవితా సామ్రాజ్యంలో శిరోమణిగా నిలిచినవాడు, సంస్కృతం, తెలుగు, యవన (ఉర్దూ/పర్షియన్ భావం), ఆంగ్లం, ద్రావిడ భాషల సాహిత్యంలో ప్రావీణ్యం కలవాడు, వేదాలను అధ్యయనం చేసినవాడు,‌ నిర్మలమైన హృదయం కలవాడు, లక్ష్మీదేవి మనోపద్మాన్ని వికసింపజేసే ఆదిత్యుని పాదారవిందాలకు తేనెటీగవలె అంకితభావంతో లీనమైన మహాభక్తుడు.

(సశేషం)

Exit mobile version