[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]
~
సౌదామినీ పరిణయము భాగం 5
41.కం॥
ధవళ యశోలక్ష్మీ వై
భవ విశదీకృత దిగష్ట పర్యంతుడు రా
ఘవ రంగరాయడు భూ
ధవకీర్తిత గుణుఁడు నాకు తమ్ముండరయన్.
ఈ పద్యం చాలా గర్వంగా ఉన్నట్టు కనపడినా కానీ మృదువైన వంశోక్తి. ఇక్కడ “తమ్ముండరయన్” అన్న చివరి పదం భావానికి వారిద్దరిమధ్య ప్రేమను తెలుపుతూ మధురతను ఇస్తున్నది.
ధవళ యశోలక్ష్మీ వైభవ= తెల్లని, నిర్మలమైన కీర్తి లక్ష్మి వైభవంతో,
విశదీకృత దిగష్ట పర్యంతుడు = ఎనిమిది దిక్కులవరకు ప్రసిద్ధి చెందినవాడు,
రాఘవ రంగరాయడు = కవి తమ్ముడు (మానాయన),
భూధవ కీర్తిత గుణుడు = భూధవుడు (భూలోకాధిపతి/పండిత వర్గం) ప్రశంసించిన గుణవంతుడు,
నాకు తమ్ముడు అరయన్ = అతడే నా తమ్ముడు
సరళ భావం:
నిర్మలమైన కీర్తి వైభవంతో ఎనిమిది దిక్కులవరకు ప్రసిద్ధి చెందిన రాఘవ రంగరాయుడు, లోకప్రశంసలు పొందిన గుణవంతుడు అతడే నా తమ్ముడు.
42 సీ॥
వంశీయ పౌర్విక పౌంస్న విద్యాదుల నెల్ల నాయందు నూహింప గోఱు
నట్టిండ్రు నన్ సంస్కృతాంగ్ల యావన ద్రావిడ మ్లేచ్ఛ సారస్వతజ్ఞు
డని యనవద్య విద్యాబల కృత చతుర్విధ కవితా *ప్రభా విలసిత ప్ర
బంధ సంకలుడని వైద్య సంగీత మౌహూర్తిక శాస్త్ర *విద్యోత మాను॥
తే॥గీ॥
డని యజుస్సంహితా పాఠం యని నిలాప
నిందితుల పాల్జేయ సహియింప నేర్చి నట్టి
శాంతమతిని సీతారామచంద్రరాయ
నామధేయ దురంభరుండ నగునేను॥
పదార్థాలు:
వంశీయ పౌర్విక పౌంస్న విద్యాదులు = వంశపారంపర్యంగా వచ్చిన పురుషోచిత విద్యలు
ఎల్ల నాయందు నూహింప గోఱు నట్టిండ్రు = అవన్నీ నాలో ఉన్నాయని జనులు భావించేలా
సంస్కృతాంగ్ల యావన ద్రావిడ మ్లేచ్ఛ సారస్వతజ్ఞుడు= సంస్కృత, ఆంగ్ల, యావన (పర్షియన్/ఉర్దూ), ద్రావిడ మరియు ఇతర భాషాసాహిత్యాలలో జ్ఞానం గలవాడని
అనవద్య విద్యాబల కృత= నిర్దోషమైన విద్యాబలంతో సంపాదించిన
చతుర్విధ కవితా ప్రభావిలసిత ప్రబంధ సంకలుడు =నాలుగు విధాల కవిత్వ ప్రకాశంతో వెలిగే ప్రబంధాలను రచించినవాడని, వైద్య సంగీత మౌహూర్తిక శాస్త్ర విద్యోతమాను=వైద్యం, సంగీతం, ముహూర్తశాస్త్రం మొదలైన విద్యలలో ప్రకాశించే వాడని
యజుస్సంహితా పాఠం యని నిలాప=యజుర్వేద సంహితను పఠించేవాడని పేరు పొంది
నిందితుల పాల్జేయ సహియింప నేర్చి = నిందించే వారిని కూడా సహించగల నేర్పు సంపాదించి
నట్టి శాంతమతిని = అటువంటి శాంతస్వభావముగలసీతారామచంద్రరాయ నామధేయుడు=“సీతారామచంద్రరాయ” అనే పేరుగల
దురంభరుండ నగు నేను=నేను అట్టి భారమైన (గొప్ప) ఖ్యాతిని మోసే వాడను
సరళ భావానువాదం:
మా వంశపారంపర్యంగా వచ్చిన అనేక విద్యలు నాలోనే సమాహారమై ఉన్నాయని జనులు భావించే విధంగా, నేను సంస్కృతం, ఆంగ్లం, యావన భాషలు, ద్రావిడ భాషలు మరియు ఇతర సాహిత్యాలలో పాండిత్యాన్ని సంపాదించాను. నిర్దోషమైన విద్యాబలంతో నాలుగు విధాల కవిత్వ ప్రకాశంతో వెలిగే ప్రబంధాలను రచించాను. వైద్యం, సంగీతం, ముహూర్తశాస్త్రం వంటి అనేక విద్యల్లోనూ నాకు పరిజ్ఞానం ఉంది.
యజుర్వేద సంహితను అధ్యయనం చేసినవాడనని పేరుపొందాను. నన్ను నిందించే వారినీ సహించగల శాంతస్వభావాన్ని అలవరచుకున్నాను.
అట్టి “సీతారామచంద్రరాయ” అనే పేరుగల వాడను నేనే.
ఈ పద్యం కవి యొక్క ఆత్మ పరిచయంకాని ఇది సాధారణ ఆత్మస్తుతి కాదు. ఇందులో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి:
వంశగౌరవం.. కవి తన విద్యను వ్యక్తిగత ప్రతిభగా మాత్రమే కాక..
“వంశీయ పౌర్విక విద్య” అని చెప్పి, పూర్వీకుల సంప్రదాయ వారసత్వంగా చూపుతున్నాడు. బహుముఖ ప్రజ్ఞ గల కవి కేవలం కవియే కాదు. భాషావేత్త, వేదపండితుడు, వైద్యజ్ఞుడు, సంగీతవేత్త, ముహూర్తశాస్త్రజ్ఞుడు, అని తన సమగ్రపాండిత్యాన్ని తెలియజేస్తున్నాడు. చివరికి కవి తన గొప్పతనాన్ని ఇలా స్థిరపరుస్తాడు:
నిందితులనూ సహించగల శాంతమతి”
అంటే అసలైన విద్యావంతుని లక్షణం – వినయం, సహనం.ఇలా అనేక విద్యలను వరుసగాపేర్కొనడం ద్వారా వైభవం పెరిగింది.చతుర్విధ కవితా ప్రభా విలసిత” వంటి పదబంధాలు వైదర్భీకవితా గాంభీర్యాన్ని చూపుతున్నాయి. పదప్రయోగం గంభీరమైనా భావవ్యక్తీకరణ స్పష్టంగాఉంది. ముందు, దైవస్తుతి, వంశవర్ణన, వంశమహానుభావుల గుణగణాలుఇప్పుడు ,తనను ఆ వంశపరంపరలోని విద్యాసంపన్నునిగా పరిచయం చేసుకుంటున్నాడు.
43.మ॥
పరఁగన్ గాశ్యప వంశదుగ్ధ జలధి ప్రాదుర్భవన్ సంతత
స్థిరచిత్తన్ నిరతాన్న దాన కరణోద్రేకం ద్రపారాశి సుం
దరదేహం గరుణామయం గుణవతిన్ నప్పిన్నఁ బెండ్లాడిబొం
పిరిగాజన్మకు సార్ధకంబయిన నెమ్మింగన్న నేనిమ్ముగన్
ఎంతో ఘనమైన ఆత్మపరిచయ శైలిలో ఉన్న పద్యమిది!
ముందుగా ఒక విషయం. పెద్దనాయనగారి ఆత్మప్రశంసాత్మక ప్రబంధ ప్రారంభంలో తన పరిచయం (self-introduction).
ఆ కాలం కవులు తమ వంశం, విద్యా వైభవం, గుణగణాలు చెప్పి తర్వాత కథలోకి ప్రవేశించేవారు. అదీ అలంకారభరితంగా.
తాత్పర్యం:
“నా వంశపారంపర్య పురుషుల విద్యా వైభవమంతా నాలోనే ఉందని ఊహించవచ్చు. నేను సంస్కృతం, ఆంగ్లం, యవన (పర్షియన్/ముస్లిం భాషలు), ద్రావిడ భాషలు, మ్లేచ్ఛ భాషలలో పాండిత్యమున్న వాడిని. అనవద్యమైన విద్యాబలంతో నాలుగు విధాల కవిత్వ ప్రక్రియల్లో ప్రకాశించే వాడిని. ప్రబంధ రచనలో నిపుణుడిని. వైద్యం, సంగీతం, ముహూర్తశాస్త్రం వంటి శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడిని.”
పెద్ద నాయనగారు తనను బహుభాషా పండితుడు గా పరిచయం చేసుకున్నారు. కవిత్వం మాత్రమే కాదు – వైద్యం, సంగీతం, జ్యోతిషం కూడా తెలుసునని చెబుతున్నారు. ఇది కేవలం అహంభావం కాదు – ఆ కాలంలో పాండిత్య ప్రతిష్ఠను స్థాపించుకునే సాంప్రదాయం.
“యజుర్వేద సంహితను పఠించిన వాడిని అని చెప్పారు. నాపై అపవాదులు చేసేవారిని సహించలేక నేర్చుకున్న విద్యలతో నిలబడినవాడిని. నేను శాంత స్వభావుడిని.నా పేరు సీతారామచంద్రరాయ. దురంభరుండ దుర్బలుడు కాదు; గౌరవంగా నిలిచే వ్యక్తి అయిన నేను.”
వేదాధ్యయన పరంపరలోనివాడినని సూచనచేస్తున్నారు. విమర్శలను భరించకుండా, తన విద్యాబలంతో నిలబడ్డ వాడని చెప్పుకుంటున్నారు.
“శాంతిమతి” అనే పదం – అంతరంగ సమత్వాన్ని సూచిస్తుంది. ఇది ఒక విధంగా “నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు; నా మూలాలు బలమైనవి” అనే స్పష్టీకరణ.
“కాశ్యప వంశంలో పుట్టినవాడిని. పాలు పొంగే సముద్రంలా వంశపారంపర్య గౌరవంతో జన్మించినవాడిని. స్థిరచిత్తుడిని. ఎల్లప్పుడూ అన్నదానం చేయాలనే ఉత్సాహం కలవాడిని. సుందర రూపమున్నవాడిని. కరుణామయుడిని, గుణవంతుడిని ఇలాంటి పుణ్యజన్మ పొందిన నేను, ఈ జన్మను సార్థకం చేసుకున్నవాడిని.”
కాశ్యప గోత్ర ప్రస్తావన – బ్రాహ్మణీక వంశగౌరవ సూచనగా రాసారు. అన్నదానం – ధార్మికత, దాతృత్వం. తన జీవితం పుణ్యఫలమని భావన.
తాత్పర్యం:
ఈ మూడు భాగాలు కలిపి చూస్తే –
వంశగౌరవం; బహుభాషా పాండిత్యం; వేదాధ్యయనం;బహుశాస్త్ర పరిజ్ఞానం;దాతృత్వం, కరుణ;స్థిరచిత్తం…ఇవి అన్నీ కలిగిన కవిగా తాను పరిచయం చేసుకున్నారు.ఇది కేవలం ఆత్మప్రశంస కాదు!ప్రబంధం రాయబోయే కవి తనకు ఆ అర్హత ఉందని ప్రకటించడం. ఇది పెద్దనాయన గారి ఆత్మప్రశంసాత్మక ప్రబంధ ప్రారంభం (self-introduction). ఆ కాలం కవులు తమ వంశం, విద్యా వైభవం, గుణగణాలు చెప్పి తర్వాత కథలోకి ప్రవేశించేవారు. అదికూడా అలంకారభరితంగా. ఇలాంటి పద్యాలు చదివితే వంశవైభవం అక్షరాల రూపంలో మన ముందుకు నిలబడినట్టు ఉంటుంది .
వంశ విభవ దీప్తి ముగించుకొని ప్రస్తావన లోనికి పయనిద్దాము.
44 మ॥
తిరమై శారద చంద్రికోద్ఘము సుసాంద్రీ భూతమై భూనభోం
తర సీమన్ వితృణాంతరాల సమనూన వ్యాప్తి విశ్వంబు ను
ద్ధుర భంగ ప్రకర ప్రకార సుఖదోద్యాంచిత క్షీర సా
గర విభ్రాంతిఁ గనంగఁజేయునొక తుంగజ్యోత్స్ని యౌ శర్వరిన్.
ఈ పద్యం గాంభీర్యభరితంగా ఉంది.
తిరమై శారద చంద్రికోద్ఘము సుసాంద్రీ భూతమై = శరదృతూవులోని చంద్రుడి వెలుగుతో కూడిన శీతలమైన, అందమైన ప్రతాపంతో భూమిపై ప్రకాశించిందని;
భూనభోంతర సీమన్ వితృణాంతరాల సమనూన వ్యాప్తి విశ్వంబు ను= భూమి, ఆకాశం అనే తేడాలేకుండా కాంతితో నిండినది; దాని పరిమాణం, విస్తీర్ణం విశ్వమంతటా వ్యాపించిందని;
ఉద్ధుర భంగ ప్రకర ప్రకార సుఖదోద్యాంచిత =దట్టమైన తెల్లని, కదలికల్లో, ప్రతి ప్రకారంలో సుఖప్రదమైన ఆహ్లాదాన్ని ప్రసారం చేస్తూ;
క్షీరసాగర విభ్రాంతి గనంగ జేయునొక తుంగజ్యోత్ని యౌ శర్వరిన్ = పాల సముద్రమో అనుకున్నట్లు వెన్నెల నలుదిక్కులా వ్యాపించింది.
భావం:
శరత్ కాలంలోని చంద్రిక వెలుగు చల్లదనంతో భూమి- ఆకాశం అని తేడా లేకుండా అంతటా వ్యాపించి, అన్ని దిక్కులలో ఆ కాంతి పాలసముద్రంలోని అలలు వ్యాపించినట్టుగా అంతటా నిండి, సంతోషాన్ని కలిగిస్తుండగా, అందులో నుండి ఒక వెన్నెల తరక ఎదురుగా వెలిగి పోతూఉన్నది.
45 శా॥
ప్రాసాదోపరి భాగసీమ సముదగ్ర స్వచ్ఛ పీఠంబునం
దాసీనుండనునై విశుద్ధ పటు విద్యాపాండితింగ్రాలుఁ బూ
ర్వా సంఖ్యాక కవీశ కోటికృత కావ్యానీక ముం గూర్చి యెం
తో సంతోష మెలర్ప మానసమునందుంబిట్టు దర్కించుచున్.
ప్రతిపదార్థం:
ప్రాసాదోపరి భాగసీమ సముదగ్ర స్వచ్ఛ పీఠంబునం = ప్రాసాదపు పైభాగంలో,ఉన్నతమైన, శుద్ధమైన పీఠం ఉంది.
అందాసీనుండనునై విశుద్ధ పటు విద్యా పాండిత్యం గ్రాలు బూర్వా సంఖ్యాక= ఆ మేడ పైభాగంలో ఉన్ననాకు, స్వచ్ఛమైన విద్యా-పాండిత్యం మరియు సంపన్నత తో కూడిన పూర్వ కవులందరి రచనలు చదివిన మనసుతో సంతోషంగా ఉన్నాను.
కవీశ కోటికృత కావ్యానీక ముంగూర్చి =కవుల మహా సంపత్తి, అనేక రచనలు, కావ్యసామ్రాజ్యం వారి కవితా లోకం ఇవన్నీ కవికి సంతృప్తిని ఇస్తున్నాయి.
ఎంతో సంతోషమెలర్ప మానసమునందుంబిట్టు దర్కించుచున్= చాలా ఆనందాన్నిస్తూ.. మనసులో ఇలా నాలో నేను తలపోస్తున్నాను.
ఈ అన్ని వైభవాలు, సౌందర్యాలు కవికి హృదయ సంతృప్తి, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ పద్యం కొంత గంభీరంగా, సాహిత్యపరంగా శోభాయమానంగా ఉంది.
భావం:
ప్రాసాదపు పైభాగంలో, ఉన్నతమైన శుద్ధమైన పీఠంలో స్వచ్ఛమైన పాండిత్యం ఉన్నవారు, విద్యావంతులు, పాండిత్యంతో కూడిన కవులు వారి మహా రచనలు, అనేక రచనలు, కావ్య వైభవం అన్ని చూస్తూ నాకు హృదయంలో సంతృప్తి, ఆనందం కలిగి నేను నాలో ఆలా అనుకుంటున్నాను.
46 ఉ॥
ఆయసమాన భావరుచి యా సరసత్వ కవిత్వపాకమ
త్యాయాత పూర్వపుణ్యఫలమై భగవత్క్ళప గల్గి గల్గెనా।
కాయనవద్య సత్కవిత యబ్బుట సాధ్యమే వీత హేతుకం
బై యలరారు శ్రీశ్వర దయారస భాగ్యము గల్గునంతకున్॥
ఆ+ అసమాన =సమానం కాని
యా సరసత్వ = ఆ మంచి అభిరుచి గల
అత్యాయత = అత్యంత పరిపక్వమైన
భగవత్కృప గల్గ గల్గె నా =భగవంతుని దయ వల్ల కల్గిన
అబ్బుట = పొందిన
వీతు హేతుకం = నేను కారణమే కాదు
అలరారు = ప్రకాశించు
భావసారాంశం:
ఈ అసమాన భావరుచి, సరస కవిత్వ పరిపక్వత నా స్వశక్తి ఫలం కాదు, పూర్వజన్మ పుణ్యఫలం మరియు భగవత్కృప ఫలితం! అంతే కానీ నాదేమీ లేదు నిమిత్తమాత్రుడిని. ఈశ్వరుని దయ ఉంటేనే మంచి రచన చేయగలుగుతారు. ఇది ఎంతో వినయంతో కవి చెప్పిన మాట!
47 చ॥
స్ఫురదురుకీర్తి వైభవ విభూషితులౌ గవిలోక సాధ్యంబం
ధురకృతి జేయు వేడుక మనోగత కాంక్షగ నూఱి నిత్యముం,
ద్వరపడఁ జేయఁ జొచ్చె ధిషణాబల శూన్యునకెట్లు సాధ్యమై
సరిపడునంచు నిష్ప్రతిభ సందిలఁ దిక్కుల జూచుచుండగన్॥
భావానువాదం:
ఈ కవిలోకంలో మహాకీర్తి వైభవాలతో అలంకరించబడిన మహాకవుల వలె ఒక గంభీరమైన, అందమైన కృతి చేయాలనే ఆశ నా మనసులో ఎప్పటికప్పుడు ఉప్పొంగుతోంది. కానీ, తగిన బుద్ధిబలం లేనివాడినైన నాకు అది ఎలా సాధ్యం అవుతుంది? అది నా సామర్థ్యానికి సరిపోతుందా? కాదా? అని ఆలోచిస్తూ, ప్రతిభ లేనివాడనై ఏ దిశకు తిరగాలో తెలియక సందిగ్ధంగా చుట్టూ చూస్తూ నిలుచున్నాను.
ఈ పద్యంలో రసస్ఫూర్తి, కవి తనను తాను చిన్నచేసుకొని, మహాకవుల సమూహం ముందు నిలిచిన శిష్యునిలా వినమ్రతతో, స్వీయసందేహంతో నిలబడుతున్నారు. ఇది కేవలం నిరాశ కాదు! మహత్తర సాహసానికి ముందు కలిగే పవిత్రమైన సంకోచం.ఈ వినమ్రభావం తరువాత దైవానుగ్రహం ప్రస్తావన వస్తే.. పద్యపరంపర ఎంతో సౌందర్యంగా రచింపగలుగుతారు.
48 సీ॥
నీలోత్పల చ్ఛవిజాల ధిక్కరణ ప్ర
వీణ వర్షాంబుద విగ్రహమ్ము,
భానుసుధాభాను వైభవ ధిక్కర
*ణాపకర్ణిక విశాలాక్షియుగము,*
తరుణార్కబింబ బంధురరాగ ధిక్కర
ణానూన శోణబింబాధరమ్ము,
శరద్దభ్రోత్ఫుల్ల కరహరుధిక్కర
ణోదగ్ర మృదుకరపాదయుగము।
తే॥గీ॥
ప్రావృడంబోధరాంతరేరమ్మ దాచ్ఛ
కాంతి ధిక్కరణ సమర్థ కామినీ,వి
రాజితామల విస్తృతోరఃస్థలమ్ము,
పసిజెలంగ మందస్మేర మెసఁగు వ్యక్తి॥
భావానువాదం:
ఆమె శరీర కాంతి వర్షాకాల మేఘాల నీలిమను సిగ్గుపడేలా చేసే నల్లకలువల రాశి కాంతిని మించిపోతున్నది, ఆమె విశాలమైన కన్నులు సూర్యచంద్రుల ఠీవినే తలదన్నే వెలుగులతో మెరుస్తున్నాయి, ఆమె అధరాలు ఉదయించే సూర్యబింబపు ఎఱుపును మించిపోయే మధుర రాగంతో ఎర్రగా కాంతులీనుతున్నాయి. ఆమె చేతులు, పాదాలుశరదృతువులో వికసించిన కమలాల మృదుత్వాన్నే అధిగమించే సౌందర్యంతో నిండిఉన్నాయి. ఆమె విశాలమైన వక్షస్థలం వర్షాకాల మేఘాల లోతైన కాంతినే సిగ్గుపడేలా చేసే స్వచ్ఛతతో ప్రకాశిస్తోంది. ముఖమంతా పసి వెలుగుల జిలుగుతో, స్వల్పమైన చిరు మందహాసంతో మృదువుగా వెలిగిపోతోంది.
49 కం॥
కట్టెదుట జాళువాహొం,
బట్టువలువ వల్లెవాటు పసలీనఁగఁ
గన్పట్టి, తనకేల నక్కున
ముట్టినటుల స్ఫురణ గొల్పి పురుచిత్రముగన్॥
కఠిన పదానికి అర్థం.
“జాళువా హొంబట్టు వలువ = బంగారు పట్టు వస్త్రాలు..
భావానువాదం:
ఆమె ఎదుట నిలబడి ఉండగా, బంగారు పట్టు వస్త్రం గాలి వీచికతో జాలువారుతూ శరీరానికి అంటుకుని, తనకు తానే తాకినట్లుగా వింతగా ఒక స్ఫురణను కలిగిస్తూ అద్భుతమైన దృశ్యమై ఎదుట నిలిచింది.
భావం:
ఇది మృదువైన శృంగార చిత్రణ. ఇక్కడ కవి నేరుగా శరీరవర్ణన చేయకుండా, గాలి, వస్త్రం, స్పర్శభావం ద్వారా సూక్ష్మంగా సౌందర్యాన్ని చూపిస్తున్నారు.
“తనకేలనక్కున ముట్టినటుల” అన్న పాదం స్పర్శస్ఫూర్తిని అత్యంత మృదువుగా వ్యక్తపరుస్తున్నది. ఇది అశ్లీలత కాదు! సూచనా మాత్రంగా శైలిలో చెప్పిన శిల్పసౌందర్యం..
50 కం॥
ఘనమునఁ దోచిన సౌదా
మిని వలె దృక్పథమతిక్రమించి పిధానం
బును బొందినటుల, గన్నుల
గనుపడ రోమోద్గమైక గాత్రుడనగుచున్॥
భావానువాదం:
మేఘ మధ్యలో ఒక మెరుపుతీగ ఒక్క క్షణం మెరిసి మళ్ళీ మేఘాల్లో దాగినట్లుగా, ఆమె రూపం కూడా క్షణకాలం దృష్టికి కనబడి తరువాత ఆవరణంలోకి జారిపోయినట్లు అనిపించింది. ఆ ఒక్క చూపుతోనే శరీరమంతా పులకలతో నిండిపోయి మౌనంగా నిలిచిపోయాను.
ఇక్కడ ప్రధాన దృశ్యం –
సౌదామిని (మెరుపు) ఉపమానం.
మెరుపు క్షణికం,దృష్టిని మైమరపింపజేసేది, వెంటనే మరుగైపోయింది, అదేవిధంగా ఆమె దర్శనం.. క్షణమాత్రంలో హృదయాన్ని కుదిపివేసి విరహస్పర్శలా పులకలెత్తించింది.
ఇది కేవలం శృంగారరసం కాదు! “ఆశ్చర్యమిశ్రిత శృంగార” భావం. ఈ వర్ణనల వల్ల “సౌదామినీ పరిణయం” అనే శీర్షిక ఇంకా సార్థకంగా అనిపిస్తున్నది.
ఈ పద్యం సుందరమైన ఉపమా చిత్రణ.. చాలా రసవత్తరమైన సంశయోక్తి ఈ పద్యం.
(సశేషం)
శ్రీమతి రంగరాజు పద్మజ ప్రముఖ రచయిత్రి. కీ.శే. ఒద్దిరాజు కమలాదేవి, కీ.శే. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు వీరి తల్లిదండ్రులు. జన్మస్థలం ఇనుగుర్తి, కేసముద్రం మండలం. పద్మజ గారు సుమారు 100 కథలు, 300 కవితలు, సుమారు 100 మ్యూజింగ్స్ వ్రాశారు. మనసే కోవెల (కథాసంపుటి), చిత్రకవితలు (కవితా సంపుటి), హరిదాసి (అనుసృజన – నవల), గుండెల్లోతుల్లోంచి (కథా సంపుటి), నాటి నుండి నేటి వరకు (గ్రామ చరిత్ర), వ్యాస వితతి (వ్యాస సంపుటి), భక్తి భండారి (జీవిత చరిత్ర) వంటి పుస్తకాలు వెలువరించారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి రుద్రమదేవి నవలను సరళీకృతం చేశారు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి చారిత్రక పద్యకావ్యం ‘ఖడ్గతిక్కన’ను పరిష్కృతం చేసి పాఠకులకు అందించారు. ఒద్దిరాజు సోదరుల ‘కృష్ణస్తవః, వైభవస్తవః’ కావ్యాలను, మరియు సర్వలోకేశ్వర శతకంను పరిష్కరించారు.
ఒద్దిరాజు సోదరులు, రాణి శంకరమ్మ , సమ్మక్క.. సారలమ్మ, పారిజాతాపహరణం వంటి బుర్రకథలు రచించారు.
సనాతన ధర్మం ఆవాసాలు (దేవాలయాలు), నాయన, ఇంద్రధనుస్సు (కవితా సంకలనం), వ్యాసాలు మరియు రేడియో ప్రసంగాలు అముద్రితాలు
భక్త్యామృతం, మయూఖ, తరుణి, నెచ్చెలి, నేడు, ప్రజాతంత్ర పత్రికలో వ్యాసాలు రాశారు. అనేక రేడియో ప్రసంగాలు చేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, తెలంగాణా సారస్వత పరిషత్తు వారి వరిష్ఠ పురస్కారం, మహిళా సేవా భక్తి పురస్కారం,
వెల్లుల్లి ఫౌండేషన్ వారిచే మహిళా సాధికారత విశిష్ట పురస్కారం, తెలుగు సాహిత్య అకాడమీ మరియు అక్షరయాన్ మహిళా రచయిత్రుల సంఘం వారిచే వెంగమాంబ పురస్కారం, వరంగల్ మహానగర పాలక సంస్థ రాష్ట్ర మహిళా విభాగము వారిచే విశిష్ట మహిళా పురస్కారం వంటి పురస్కారాలు స్వీకరించారు.
రామం భజే శ్యామలమ్ వారిచే ఆర్ష ధర్మ ప్రదీపిక, మల్లినాథసూరి కళాపీఠం వారిచే వ్యాఖ్యాన సామ్రాజ్ఞి, మేకా రవీంద్ర వారిచే సహస్ర పద్యం కంఠీరవ అనే బిరుదులు పొందరు. చరవాణి: 99897 58144
