Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-7

[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]

~

సౌదామినీ పరిణయము భాగం 6

51- కం॥
కలయా? వైష్ణవమాయా?
ఫలితంబా యింద్రజాల పద్ధతియా యిట్టుల?
జాగ్రత్సమయంబునఁ

దొలకుటకుఁ గతంబు మదికిఁ దోఁపక యుండెన్॥

భావం:

ఇది కలనా? లేదా విష్ణుమాయనా? లేదా ఇంద్రజాల మహిమా? ఇలాంటి వింత దృశ్యం? ఇంత స్పష్టంగా, మెలుకువలో ఉండగానే ఇలా కనుమరుగవడం.. ఇంతకు ముందు నాకు ఎప్పుడూ ఈ అనుభవం కాలేదు.

రసస్ఫూర్తి:

ఈ పద్యంలో ప్రధానంగా కనిపించేది.. ఆశ్చర్య సంశయ భరితమైన శృంగారావేశం,ఆమె దర్శనం అంత అద్భుతం.. అది నిజమా? కలనా? మాయనా? అనిమనసు గందరగోళానికి లోనవుతున్నది.

“జాగ్రత్సమయంబున” అనే పదం ఈ అనుభవం స్వప్నం కాదని, నిజ జీవితంలోనూ అద్భుతాలు జరుగుతాయని తెలుపుతున్నది. దర్శన సౌందర్యం, క్షణిక లయ,ఆశ్చర్య సంశయం ఇలా భావపరంపర ఎంతో సహజంగా ముందుకు సాగుతున్నది ఈ సౌదామినిలో..

52- కం॥
అని యనితర దర విస్మయ
ఘనఘన రసరాశిఁ దుంబిగతిఁ గతిఁ గనలే
కనుదోఁగు మదిని కనుగాం
చిన యభ్రము గూర్చి యూహజేయుచునుండగన్॥

“యనితర = పోలికలేని.

భావానువాదం:

అలాంటి అపూర్వమైన దృశ్యాన్ని చూసి,విస్మయంతో గుండె గట్టిగా కొట్టుకుంటూ, ఆ అనుభూతి ఉద్ధృతిని తట్టుకోలేక, ప్రతిరోజూ నా మనసులో ప్రత్యక్షమౌతున్న ఆ రూపభ్రమ గురించి నాలో నేనే ఊహించుకుంటూ ఉండిపోయాను.

ఇక్కడ..

“అనితరదర విస్మయ” = ఇంతకు ముందెన్నడూ చూడని ఆశ్చర్యం;

“ఘనఘన రసరాశి”.. గాఢమైన అనుభూతి ప్రవాహం

“అభ్రము” =ఆకాశంలో మబ్బా? భ్రమనా? అనే అంతరంగ సంశయం. ఇది దర్శనం తర్వాత మనసు యొక్క స్థితి అది శాంతించదు, చూసింది నిజమో కాదో తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది. రూపవర్ణన;క్షణిక దర్శనం; మాయాసంశయం; అంతరంగ విస్మయం, ఊహా ప్రవాహం ఈ వర్ణనలతోకథా ప్రవాహం చాలా సహజంగా ముందుకు సాగుతున్నది. ఈ భావోద్వేగపు ఉద్ధృతిని చక్కగా వ్యక్తపరచింది.

53- కం॥
నా యనుజన్ముఁడు ధిషణ
ప్రాయ మనీషా వికాసి రాఘవ రంగా
రాయఁడు,నా పరిమెపుఁ గనె
నాయెడకతివేడ్క వచ్చెనంగాంచి వెసన్॥

“నా పెరిమెపుగనె” =నా ఆందోళన చూసి..

భావం:

నా తమ్ముడు.. బుద్ధిమంతుడు, వికసించిన ప్రజ్ఞ కలవాడైన రాఘవరంగరాయుడు.. నా మనసులో ఉన్న ఆందోళనను గమనించి,నన్ను చూసేందుకు, నేనెందుకు అలా ఉన్నానో తెలుసుకోవాలనే ఆత్రుతతో నా దగ్గరకు వచ్చాడు.

భావరేఖ:

ఇక్కడ వరకూ పెద్దనాయన దర్శన విస్మయంలో, సంశయంలో, ఊహల్లో మునిగిపోయారు.

ఇప్పుడు ఆ అంతర్మథనాన్ని గ్రహించిన సన్నిహితుడు, తమ్ముడు ప్రవేశించాడు. ఇది కథను ముందుకు నడిపే సన్నివేశం. కథా ప్రవాహంలో కీలకమైన మలుపుతిప్పే పద్యం. అంతర్మథనంలో ఉన్న పెద్దనాయన వద్దకు నాయన (తమ్ముడు) రావడం..

54 – శా॥
నాపజ్జన్ వసియింపఁ జేసికొని స్వాంతంబొప్పగాఁ,దమ్ముడా!
యీపట్లన్ గనినట్టి చిత్రకథ వింటే యంచునే గన్న యా
వ్యాపారంబు సహర్షబాష్పముగ నాద్యంతంబు నుత్సాహ ని-
ష్టాపూర్తిం దెలియంగఁ బల్కవిని, హర్షంబొప్పగానిట్లనెన్॥

“నా పజ్జన్” =“నా పక్కన్”;
“పల్కవిని” = “అంటే విని”

భావానువాదం:

నా తమ్ముడిని నా పక్కన కూర్చోబెట్టుకొని,మనసు కొంత స్థిరపడిన తర్వాత,“తమ్ముడా! ఈ మధ్య నాకు జరిగిన ఈ విచిత్రమైన సంఘటన వినవా?” అని ప్రారంభించాను. ఆ సంగతిని మొదటి నుంచి చివరి వరకు ఆనందభాష్పాలతో, ఉత్సాహపూర్వకంగా వివరిస్తూ చెప్పాను. అది చెప్తుండగా నాకు సంతోషం మరింత పెరిగింది.

భావరేఖ:

ఇప్పటివరకు కవి అంతరంగంలోనే మునిగిపోయాడు. ఇప్పుడు ఆ అనుభూతి సంభాషణగా మారింది. అంతరంగ దర్శనం కథగా రూపుదిద్దుకుంటున్నది.

విస్మయం = ఆశ్చర్యం ఉత్సాహంగా మారింది.

“సహర్ష బాష్పము” అన్న పదప్రయోగం ఆనందం, ఆశ్చర్యం, రసస్పూర్తి ఇవన్నీ కలసి చక్కని భావాన్ని వెలిబుచ్చుతున్నది.

55- శా॥
అన్నయ్యా! హరిలీలలందెలియ నౌ నా భక్తిభావోగ్రసం-
పన్న ప్రాంచిత వైభవానుగత తత్త్వజ్ఞాన నిష్ఠాభియున్,
ఘన్నీరేరుహవాసిగావున జనాభీష్టంబులందీర్ప నా
పన్నత్రాత యతండు దాసి కృపగాపాడున్ యథార్థంబుగన్॥

“ఘన్నీ రేరుహవాసి” = ఘనమైన నీరేరుహం పద్మం; పద్మవాసి = శ్రీమహావిష్ణువు అని భావం.

సరళ భావానువాదం:

“అన్నయ్యా! హరిలీలలను తెలిసికొని, భక్తిభావంతో నిండిపోయి,వాటి వైభవానుసారం తత్త్వజ్ఞాన నిష్ఠ కలిగి ఉన్నవాడై, పద్మవాసుడైన పరమేశ్వరుడు (విష్ణువు)ప్రజల కోరికలను నెరవేర్చి, శరణాగతులను రక్షించుతాడు. అతడు తన దాసులను కృపతో కాపాడుతాడు! ఇది యథార్థ సత్యమే.”

ఇది తమ్ముడు – అన్నయ్యకు ధైర్యం ఇచ్చే జవాబు. ఇక్కడ మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి:

భక్తి =హరిలీలల జ్ఞానం; జ్ఞానం = తత్త్వనిష్ఠ; శరణాగతి విశ్వాసం = దాసులను రక్షించే దేవుడు

సందేహం → విశ్వాసంగా మారబోతున్న సూచన కనపడుతున్నది.భక్తిరసం నిండి ఉన్న పద్యం ఇది.

56. కావున.. కాబట్టి

57 సీ॥
సనకాది మస్కరి సత్తముల్ ద్వారమ్ము
కడ నజస్రము పడిగాపువడినఁ
దానవారులు త్రయీధర్మ సూక్తస్తోత్ర
కృతిననుకంపఁ గాంక్షించి యున్న
దాపస శ్రేష్ఠ సంతతి నిరంతరముగ్ర
తర తపోవహ్ని సంతుప్తులయిన
యోగిసత్తములాత్మయోగ విజ్ఞాన
గానంద యోగనిష్ఠాప్తి గనిన
తే॥ గీ॥
నందరానట్టి శ్రీశాపాదాబ్జ సేవ
బహులతర పుణ్యపరిపాకవశత భ్రాంతి
దర్పణమ్మున స్మరణమాత్రన స్ఫురించె
నీకు నీ పుణ్యగరిమ వర్తింపవశమె॥

“మస్కరి సత్తముల్” = “ముని సత్తములు”;

“శ్రీశా” =విష్ణుపాదాబ్జం.

భావానువాదం:

సనకాది మహామునులు ద్వారం దగ్గర ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటారు.దానవులే అయినా, వేదధర్మ సూక్తాలను స్తుతిస్తూ, అనుగ్రహం కోరుతూ ఉంటారు. మహాతపస్సుతో జ్వలిస్తూ యోగంలో స్థిరమైన యోగిసత్తములు ఆత్మజ్ఞానానందంలో నిష్ఠను కలిగి ఉన్నారు. ఇలాంటి మహనీయులు సేవించిన శ్రీపాదాబ్జసేవ.. అది ఎన్నో జన్మల పుణ్యపరిపాక ఫలమే. అటువంటి పుణ్యప్రభావంతోనే నీకు ఆ దర్శనం స్మరణమాత్రాన స్ఫురించింది. ఇది నీ పుణ్యగరిమ వల్లనే సంభవించింది.

భావరేఖ:

ఈ పద్యంలో ప్రధానంగా మూడు స్థాయిలు ఉన్నాయి:

మునులు – సనకాదులు (జ్ఞానపరంపర)

దానవులు – స్తోత్రం ద్వారా అనుగ్రహాకాంక్ష

యోగులు – ఆత్మజ్ఞాన నిష్ఠ కలవారు.

ఇంతటి మహనీయులకే దుర్లభమైన దర్శనం నీకు లభించింది అంటే అది యాదృచ్ఛికం కాదు! ఇది పుణ్యపరిపాక విశేషం; దర్శనం = దైవకృప యొక్క ఫలితం; స్మరణమే సాక్షాత్కారానికి వేదిక. ఇక్కడ భక్తిరసం తత్త్వరసంతో కలసిసాగుతున్నది.

58 – మ॥
పగనైనన్ వగనైన భీతినయినం బద్మాక్షు ధ్యానంబు సే
యగ నెట్లాధులు వ్యాధులుందొలగునో యారీతి గానే నిజ
మ్ముఁగనైనం గలనైన మానసిక సమ్మోహత్వమందైనఁ జి
హ్మగరాట్తల్పుని సేవగల్గగను జన్మంబౌను ధన్యంబుగన్॥

“జిహ్మగరాట్ తల్పుని” = వక్రగామి సర్పరాజు శేషుని తల్పంపై విశ్రాంతి తీసుకునే వాడు;

శేషశయనుడ= శ్రీమహావిష్ణువు.

భావానువాదం:

శత్రుత్వంతోనైనా, స్నేహంతోనైనా, లేదా భయంతోనైనా.. ఎలాగైనా సరే, పద్మాక్షుడైన భగవంతుని ధ్యానం చేస్తే అనేక బాధలు, వ్యాధులు తొలగిపోతాయి! ఇది నిజమే. అలాగే, మనసులో మోహం ఉన్నాసరే, శేషతల్పంపై శయనించే పరమాత్మను సేవించే అవకాశం లభిస్తే ఆ జన్మ ధన్యమవుతుంది.

ఈ పద్యంలో ఒక గొప్ప భక్తిసూత్రం ఉంది. భావం ఏదైనా సరే! ద్వేషం కానీ, భయం కానీ, స్నేహం కానీ, ప్రేమ కానీ – ఏ రూపమైనా భగవంతునిపై మనస్సు నిలిస్తే.. అది మోక్షదాయకమే! ఇది పురాణసిద్ధాంతం కూడా,

ఉదా॥ కంసుడు భయంతో కూడిన భక్తితో మోక్షం పొందాడు; శిశుపాలుడు ద్వేష భక్తితో మోక్షం పొందాడు. అలాగేగోపికలు.. ప్రేమభక్తి తో భగవదనుగ్రహం పొందారు. అందరికీ అంతిమ ఫలం పరమపదప్రాప్తి. అని ఇక్కడ తమ్ముడు అన్నయ్యకు చెప్పేదిఏమిటంటే? “నీ దర్శనం యాదృచ్ఛికం కాదు!”ఆ ధ్యానసంబంధమే నీ జన్మను ధన్యం చేస్తుంది.”అని అంటున్నాడు.

భక్తి–కవిత్వ సమన్వయం ఎంత అందంగా వ్యక్తమైందో ఈ పద్యంలో స్పష్టంగా కనిపిస్తన్నది.

59 చ॥
కవిత నొనర్ప గాఢతర కాంక్ష తదీయ సుశుద్ధసిద్ధి మా-
ధవ కరుణైక లభ్యమను ధైర్యము నీ మదిఁ బాదుకొంటఁగే,
కేశవుఁడభయప్రదానము నొసంగెను దర్శనభాగ్యమిచ్చి నీ
కవు భయమేమి నేఁగలుగనంచు నెదంగయితో స్పృశించుచున్॥

భావానువాదం:

నీకు ఉన్న కవిత్వసిద్ధి పట్ల గాఢమైన కోరిక మరియు అది మాధవుని కరుణ వల్ల మాత్రమే సిద్ధించేదని నీవు ధైర్యంగా భావిస్తుండడగా, కేశవుడు నీకు దర్శనభాగ్యం ఇచ్చి అభయమిచ్చాడు. “ఇప్పుడు ఇక నీకు భయం ఎందుకు?” అని హృదయాన్ని తాకినట్లుగా స్పృశించాడు. కవి కవిత్వకాంక్షలో కవిత్వం అనేది కేవలం శ్రమఫలం కాదు! దైవం దయతోనే సిద్ధిస్తున్నది అనిఆయన నమ్మకం. ఎందుకంటే ఆ కృపతోనే దర్శనం అయింది. దాంతో అభయమిచ్చి ఆశీర్వాదించి, సాక్షాత్కారించాడు.

“నెదంగయితో స్పృశించుచున్” అన్న పాదం..

ఇది కేవలం శారీరక స్పర్శ కాదు; హృదయాన్ని తాకే దైవానుభూతి కలిగి, ఇక్కడి నుండి కవికిసందేహం పూర్తిగా తొలగిపోయి, దైవప్రేరణతో కవిత్వప్రవాహం ప్రారంభమయ్యే సూచన కనపడుతున్నది. ఇది సౌదామినీ పరిణయంలో ఒక ఆధ్యాత్మిక మలుపు.

60 – ఉ॥
కావున నీశ్వరార్పణముగా జగదీశ్వరునాజ్ఞ పొంటె ల
క్ష్మీవరుప్రీతికై గృతి రచింపుముదగ్రగభీరభావ సం భావితమై
శిరీషకుసుమ ప్రకరాయిత భూరిమార్దవం
బై వర గోస్తనీ ఫలసమంచితపాకమునై చెలంగగన్॥

భావానువాదం:

కాబట్టి, ఈ కృతిని ఈశ్వరార్పణ భావంతో, జగదీశ్వరుని ఆజ్ఞగా భావించి, లక్ష్మీపతికి ప్రీతికరంగా రచించు అన్నయ్యా! ఐతే అది గంభీరభావంతో నిండి ఉండాలి! ఎలా అంటే? శిరీషపుష్పగుచ్ఛంలా మృదుత్వంతో కూడిఉండాలి, అలా రాసిన కృతి పక్వమైన ఫలంలా మధుర ఫలితాన్ని అందిస్తుంది.

ఈ పద్యంలో తమ్ముడు – అన్నగారికి మూడు ప్రధాన సూచనలు చేసారు. నీవు రాసే కృతిని ఈశ్వరార్పణ భావంతో రాయాలి! అలాగే కృతి వ్యక్తిగతంగా పేరు ప్రతిష్ఠల కోసం రాయడం కాదు! దైవార్పణా భావంతో రాయాలి, అదే సమయంలో గంభీరంగా ఉంటూనే, మార్దవంగా ఉండి, భావంలో లోతు ఉండాలి! శైలిలో మృదుత్వం ఉండాలి. సాధనతో పండిన ఫలమే రుచికరం.

“శిరీషకుసుమ ప్రకరాయిత భూరిమార్దవం” అన్న ఉపమానం.. కవిత్వానికి అవసరమైన సౌమ్యతను చక్కగా సూచిస్తున్నది. ఇక్కడితో తమ్ముడి ఉపదేశం సంపూర్ణమైంది. ఇక కవి దైవప్రేరణతో కృతి ప్రారంభించబోతున్నాడు. ఇది నిజంగా మంగళప్రదమైన ప్రారంభం.

(సశేషం)

Exit mobile version