[ఒద్దిరాజు సోదరులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ అనే ప్రబంధానికి భావానువాదం అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.]
~
సౌదామినీ పరిణయము భాగం 7
61- కం॥
అని ప్రావృషేణ్య జలము
క్స్వన తులితాదభ్ర విమల వైఖరి వినఁ జె
ప్పిన నా తమ్ముని హితమును
విని నిస్తులిత ప్రమోద విస్తృతమతినై॥
భావానువాదం:
వర్షాకాలంలో మేఘ జలధారల నినాదంలా నిర్మలమైన, గంభీరమైన వాక్యశైలితో చెప్పిన నా తమ్ముడి హితవును విని, అపారమైన ఆనందంతో నా మనసు విస్తరించింది.
ఇక్కడ రెండు చక్కని దృశ్యాలు ఉన్నాయి:
ప్రావృషేణ జలక్ష్వన వర్షపు జలధారల మృదుగంభీర నినాదం శ్రవణానందాన్ని కలిగించేది. అదేవిధంగా తమ్ముడి మాటలు సాంత్వనతో కూడుకున్నవి, శుద్ధమైనవి. నిస్తులిత ప్రమోదం అంటే సందేహభారం తొలగి, హృదయం విస్తరించిన స్థితి.
ఇది కథలో ఒక శాంతి – ప్రసన్నత లక్షణం.
ఇక కవి దృఢనిశ్చయంతో కృతి ప్రారంభించబోతున్నాడని స్పష్టంగా తెలుస్తున్నది.
చాలా సుందరమైన ఉపమానంతో రమణీయత ఈ పద్యంలో ఉంది!
62 – కం॥
క్రమముగ నయం ముహూర్తః
సుముహూర్తమ్మనుచు ననుజ సూక్తులు ప్రోత్సా
హముఁ గొల్ప జేయఁబూనితి
సమధికమతి నీ కృతిని యశమ్మని యిదియున్॥
భావానువాదం:
“ఇది క్రమబద్ధమైన శుభముహూర్తమే, ఇది అత్యుత్తమ సమయం” అని నా తమ్ముడు నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు నాలో ఉత్సాహాన్ని కలిగించాయి. “ఈ కృతి యశస్సును పొందుతుంది” అనే నమ్మకంతో మిక్కిలి ఉత్సాహంతో నేను ప్రారంభిస్తాను. ఈ పద్యంలో మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.. ప్రారంభించడానికి సుముహూర్తం, రచనకు దైవానుగ్రహ సమయం సిద్ధమైంది. మరొకటి తమ్ముడి ప్రోత్సాహం, సన్నిహితుల మాటలు స్ఫూర్తిదాయకంగా ఉండి రచన మొదలుపెట్టాలనుకున్నాను.
యశోనిశ్చయం మెదిలినప్పుడు ఈ కృతి కేవలం రచన కాదు! ధర్మసాధనని అనుకున్నారు.
ఇదే కథలో సంకల్ప స్థితి. ఇప్పటివరకు కవికి సందేహం తరువాత తమ్ముడి మాటలతొ విశ్వాసం దానివల్లనే ఉత్సాహం కలిగి, ఇక కార్యరూపం తాల్చుతున్నది.
కృతి ప్రశంస:
అత్యంత గాంభీర్యభరితమైన కృతి ప్రశంసా పద్యం ఇది.
63- మ॥
అకలంకమ్ము సనాతనాద్య తన ఘోరాంహో మహోగ్రాటవీ
ప్రకరధ్వంసక పావకమ్ము పఠనవ్యాపార నిస్తంద్రభ
క్తకులాత్మాభిలషత్సమస్త వరసంధాన ప్రభావైక క
ల్పక శోభాలలితమ్ము కార్ష్ణచరిత ప్రాచుర్య కావ్యమ్మిదన్॥
(“మహోగ్రాటవీ” = “మహా+ ఉగ్ర+అటవీ”; సంధి సమీకరణ.)
భావానువాదం:
ఈ కృతి దోషరహితమైనది, సనాతనమైన పరమతత్త్వాన్ని ప్రతిపాదించేది, ఘోరమైన పాపరూప అరణ్యాలను దహించే అగ్నిలాంటిది, నిస్సంకోచంగా భక్తుల పఠనానికి యోగ్యమైనది, భక్తులమనసులో ఉన్న సమస్త వరాలనుసాధించగల శక్తి కలిగిన, కల్పవృక్షంలా శోభాయమానమైన,శ్రీకృష్ణుని చరిత్ర ప్రాచుర్యంతో వెలుగొందేఅందమైన కావ్యమిది.
భావవిశ్లేషణ:
ఈ పద్యంలో కవి కృతి ప్రశంస చేస్తూ.. ఫలస్తుతి వలె కృతి గురించి నాలుగు ప్రధాన విశేషణాలు చెప్పారు. అవేమిటంటే?
- పాపదహన శక్తి:- “ఘోరాంహో మహోగ్రాటవీ ప్రకర ధ్వంసక పావకమ్ము”; అంటే పాపాల అరణ్యాన్ని దహించే అగ్ని.
- కల్పక సామ్యం:- “సమస్త వరసంధాన ప్రభావైక కల్పక”, అంటే కోరికలను తీర్చే కల్పవృక్షస్వరూపం.
- ఇంకా పాఠకులకు పఠన ఫలశ్రుతి:- భక్తిపూర్వక పఠనం ద్వారా శ్రేయస్సు కలగడం,
- కార్ష్ణ చరిత ప్రాచుర్యం:- అంటే కృష్ణతత్త్వ వివరణ ఈ కృతికి ప్రధాన లక్ష్యం.
ఇది కృతి ఫలశ్రుతి – ప్రశంసా రూపం.
ఇది కృష్ణచరిత్ర మహిమను విశదపరచే గంభీరమైన పద్యం.
64- మ॥
ఉదయాదిత్య కరప్రసారణ వశప్రోత్ఫుల్ల శోణాంబుజా
త దళాక్షుండగుఁ కృష్ణుమంజుల చరిత్రంబెప్పుడు శ్రేయస
ప్రదమౌటన్ పరమార్థనిష్ఠఁ గవి వర్యశ్రేణిచే శ్రేయసా
స్పదమౌ కావ్యసహస్రమేర్పడియె నవ్యప్రౌఢి వేభంగులన్॥
భావానువాదం:
ఉదయ సూర్యుని కిరణాలు తాకగా ఎఱ్ఱని కమలం వికసించినట్లు, అలాగే కమలనయనుడైన కృష్ణుని మంజులచరిత్ర ఎప్పటికప్పుడు శ్రేయస్సునే ప్రసాదిస్తుంది. పరమార్థనిష్ఠ గల కవుల పరంపరలో ఆ కృష్ణచరిత్ర ఆధారంగా అనేక కావ్యసహస్రాలు నూతన ప్రౌఢితో విభిన్న రూపాల్లో ఇది వరకే వచ్చాయి.
ఈ పద్యంలో మూడు ప్రధాన దృశ్యాలు ఉన్నాయి:
- ఉదయాదిత్య – కమల ఉపమానం సూర్యకిరణం ఎలా ఐతే కమల వికాసం ఔతుందో? అలా కృష్ణచరిత్ర చదివితే పాఠకులకు హృదయ వికాసం కలుగుతుంది.
- పరమార్థనిష్ఠ కవులు భక్తితో రచించిన రచనలు ఇది వరకే కృష్ణతత్త్వాన్ని ఎన్నో రూపాల్లో వివరించారు.
- నవ్యప్రౌఢి:- అదే తత్త్వం! కానీ, ప్రతి యుగంలో కవుల రచనలలో కొత్త శైలీ, కొత్త రసరూపం వస్తుంది కదా! అలా.. కృష్ణచరిత్ర అనేది అనంత స్రవంతి,
కవులు దానిని అనేక విధాలుగా ఆవిష్కరించారు,ఇది కూడా వాటిల్లో ఒకటి.
65 – ఉ॥
ఇంతకుమున్న గావ్యరచనేంగిత రాజ్యరమాభిషక్తుల
త్యంత రస ప్రయుక్తిగ గాథల్ యదునాథుని పేరిటం బురా
ణాంతరగాథలన్ వెతకి యబ్బినదెల్ల రచించియుం
దయాస్వాంతమెలర్ప నా రచనకై మిగిలించి రహించిరిక్కథన్॥
సరళ భావానువాదం:
ఇప్పటికే అనేక మంది కవులు కవిత్వరచనలో నిపుణులై, ఎంతో చక్కని రసాత్మకంగా ఉన్న యదునాథుడైన కృష్ణుని పేరుతో ఎన్నో పురాణాల్లోని కథలను వెతికి, వారికి లభించినంతవరకు అన్నిటిని రచించారు. అయితే.. నా మీద దయతో.. నా మనసు సంతృప్తి పొందేందుకు కొంత మిగిలించారు. ఆ మిగిలిన కథనునేను స్వీకరించి రచించేందుకు సిద్ధపడ్డాను అని కవి వినయంగా అంటున్నారు.
ఇది కవిఅత్యంత వినయపూర్వక ప్రకటన!
“అన్నీ నేను చెప్పబోతున్నాను” అని కాదు!
“మిగిలినదాన్ని మాత్రమే నేను సమర్పిస్తున్నాను” అనే భావం. ఇది మన పూర్వ కవులు ఆచరించిన పద్ధతి కూడా!
“దయాస్వాంతమెలర్ప” అన్న పదప్రయోగం ఎంతో మృదువుగా చెప్పారు. అంటే ఈ రచన చేయడం కీర్తి కోసం కాదు! తన మనసు సంతృప్తికోసం రచన చేస్తున్నానని కవి అంటున్నారు.
66 – మ॥
ఇది కౌశాంబీ పురీ బృహధ్వజ ధరాభృద్రాట్తపః పుణ్య సం
పదభి ప్రాప్త తనూభవన్ విమలశోభాపూర్ణ సౌదామినిన్।
యదువంశాంబుధి పూర్ణిమైణధరు డబ్జాక్షుండు కృష్ణుండు వాః
ప్రదదేహుండు వరించుటం దెలుపు గావ్యశ్రేష్ఠమై యొప్పుటన్॥
భావం:
కౌశాంబీ పురీ = కౌశాంబీ నగరం,
బృహధ్వజధరాభృత్ రాజు = గొప్పదైన పతాకమున్న మహారాజు,
తపః పుణ్యసంపదభి ప్రాప్త తనూభవన్ =తన తపస్సుయొక్క పుణ్యఫలంతో జన్మించిన కుమార్తె,
విమల శోభాపూర్ణ సౌదామినిన్ = మచ్చలేని సౌందర్యంతో మెరుపువలె ప్రకాశించే వనిత (సౌదామిని)
యదువంశాంబుధి పూర్ణిమైందుధరుడు = యదు వంశ సముద్రానికి పౌర్ణమి చంద్రుడి వంటి వాడు.
అబ్జాక్షుడు కృష్ణుడు =కమల నేత్రుడు( కృష్ణుడు)
వాఃప్రదదేహుండు వరించుటం = ఆమెను వరించుట కథా వస్తువు.
సరళ భావానువాదం:
కౌశాంబీ నగరంలోని బృహధ్వజధరుడనే మహారాజుకు తాను చేసిన తపస్సుకు పుణ్యఫలంగా నిర్మల సౌందర్యంతో మెరుపులా ప్రకాశించే కుమార్తె జన్మించింది. ఆమెను యదువంశ సముద్రానికి పౌర్ణమి చంద్రుడి వంటివాడైన అందమైన కన్నులు కల (కమలనేత్రుడు) కృష్ణుడు వరిస్తాడనే విషయాన్ని తెలిపే ఈ కావ్యం గొప్పగా ఉండి యోగ్యమైనది అలంకార సౌందర్యం.
యదువంశాంబుధి – పూర్ణిమైందు = ఉపమాలంకారం
సౌదామినిన్ = నాయికా సౌందర్యానికి మెరుపు రూపకం. సముద్రం,చంద్రుడు దృశ్యరూపకంతో కృష్ణుని మహిమను వర్ణించారు.
ఇక్కడి నుంచి కథా నాయిక పరిచయం పూర్తై, వివాహకథకు మంగళప్రవేశం సిద్ధమవుతోంది.
భావప్రవాహం గంభీరంగా, మాధుర్యంతో ఉంది. రచన చాలా సమతుల్యంగా సాగుతున్నది. అత్యంత సమృద్ధమైన ప్రయోజన ప్రస్తావనా పద్యమిది. ఈ పద్యం లో ఈ ప్రబంధ కావ్యం ఎవరికోసం? ఏ ప్రయోజనంతో? (ఫలశృతి) అన్నది వివరిస్తున్నారు.
67 – సీ॥
ఐహికాఖిల ఫలప్రాప్తి గోరెడు నర
వర్గగృహాంగణ పారిజాత
మాముష్మికైక వాంఛా మనోవ్రజమున
కంబరాంచల బంధితామరమణి
భక్తి విద్యా ప్రతిభా గౌరవ ప్రతి
ష్ఠా స్వాంతులకు సదాచార్యబోధ
శృంగారరసమాత్ర గృధ్ను సంహతికి మ
నస్కార విస్తృతానంగవిద్య
తే॥గీ॥
కావ్య లక్షణ లక్ష్యవిజ్ఞాన గాఢ
లాలసులకు సర్వంకష లక్ష్యవృత్తి
పాఠకాలికి బర్వ సర్వరస జనక-
భవ్యచరిత సౌదామినీ పరిణయమ్ము॥
భావం:
ఈ ‘సౌదామినీ పరిణయం’ అనే కావ్యం, ఐహిక ఫలాలను కోరే గృహస్థులకు ఇంటి ఆవరణంలో పెరిగే పారిజాత వృక్షంలా మంచి ఫలితాలనిస్తుంది, మోక్షం కోరేవారికి కొంగున మణివంటిది. మనస్సులో ప్రతిష్ఠించుకున్న అమూల్య రత్నం వలె, భక్తి, విద్య, ప్రతిభ, గౌరవ ప్రతిష్ఠ కోరుకునే వారికి మంచి గురూపదేశం వంటిది, శృంగార రసానురక్తులకు విస్తారమైన అనంగవిద్యా ప్రసరణ వంటిది, కావ్యలక్షణ– లక్ష్య విజ్ఞాన గాఢ లాలసులకు సర్వాంగ సంపూర్ణ కావ్యప్రయోగదర్శనం. పాఠకులందరికీ సర్వరసజనకమైన, భవ్యమైన చరిత్ర ఈ సౌదామినీ పరిణయము.
గృహాంగణ పారిజాతము= రూపకోపమాలంకారం
మనోవ్రజము – కంబరాంచల బంధితామరమణి = సుకుమార భావచిత్రణ
సర్వరస జనకము = నవరస సమన్వయం సూచన
“సౌదామినీ” పదప్రయోగం = మెరుపు, శోభ, శృంగారసూచన.
కవి ఇక్కడ ఒక విశాలమైన ప్రయోజన నిరూపణ చేశారు. వారు చెప్పేదేమంటే? ఇది కేవలం కథ కాదు !ధర్మ, రస, శాస్త్ర, శృంగార సమ్మిళిత సమగ్ర కావ్యం అని అంటున్నారు. గంభీరత మరియు మాధుర్యం ఇంకా శాస్త్రబలం ఈ మూడు కూడా సమతుల్యంగా రచించారు.
68- మ॥
హిత నీదృక్చుభ లక్షణాన్విత కథాశృంగారిణిన్ లోకభా
విత లావణ్యమయిం బతింవర యశోవిస్తార నే సద్గుణా
న్వితుచే యే యనురూప విశ్రుత కళానిర్ణిద్రుచే యే మహా
మతిచే బెట్టు తరింప నేర్చునని సంభావించు నాయాత్మలోన్॥
ప్రతిపదార్థం:
హిత నీదృక్ శుభలక్షణాన్విత = శ్రేయోమార్గాన్ని చూపగల శుభలక్షణాలతో కూడిన;
కథా శృంగారిణి = శృంగార రసముతో అలంకరించబడిన కథ;
లోక భావిత లావణ్యమయం = లోకానికి ఆహ్లాదకరమైన సౌందర్యపూర్ణం,
పతింవర యశో విస్తారనే = భర్త (కృష్ణుడు) యొక్క యశస్సును విస్తరింపజేసే;
సద్గుణాన్వితుచే = సద్గుణాలతో నిండి
అనురూప విశ్రుత కళా నిర్ణిద్రు = తగిన శాస్త్రపరమైన కళాజ్ఞానం కలిగి;
మహామతిచే బెట్టు తరింప నేర్చునని = గొప్ప బుద్ధితో సమర్థంగా రచించగలనని
నాయాత్మలోన్ సంభావించు = నా మనసులో ఆలోచిస్తున్నాను.
సరళ భావం:
ఈ శుభలక్షణాలతో నిండి, శృంగారరసంతో మేళవించబడి, లోకానికి లావణ్యమయంగా అనిపించే కథను, పతివరుడైన కృష్ణుని యశస్సును విస్తరింపజేసే విధంగా, సద్గుణాలతో, తగిన కళాపరిపక్వతతో, గొప్ప బుద్ధితో అన్వయార్ధంతో రచించగలననినా మనసులో నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ కవి తన అంతరంగ సంకల్పాన్ని వెల్లడిస్తున్నాడు.
ఇది గర్వంతో చెప్పేమాట కాదు! ఆత్మవిశ్వాసంతో కూడిన వినయోక్తి. ఇంతవరకు, పూర్వకవుల గౌరవం కావ్యప్రయోజన నిరూపణ, నాయిక పరిచయం, ఇప్పుడు కవి సంకల్ప ప్రకటన క్రమపద్ధతి ఎంతో శాస్త్రీయంగా ఉంది.
69 శా॥
క్ష్మాపాలాంగనలన్ వ్రజాంగనల నేకప్రీతి నేకాదర
వ్యాపారంబున నేలెఁదత్ప్రణయ కోపాటోప హేతిం దితి
క్షాపూర్తిన్ సహియించి వారలమనఃశాంతార్థ్యమై లోక ర
క్షాపర్యాప్త మహత్త్వుడయ్యు బ్రణతిం గావించె నట్లౌటచేన్॥
భావ వివరణ:
క్ష్మాపాలాంగనలు అంటే భూలోక రాజుల భార్యలు;
వ్రజాంగనలు వీరు నంద వ్రజంలో నివసించే గోపికలు;
ఏకప్రీతి ఏకాదర వ్యాపారంబున నేలె అంటే అనేక విధాల ప్రేమాభిమానాలను స్వీకరిస్తూ,
ప్రణయ కోపాటోప హేతి అర్ధమేమిటంటే ప్రణయకలహాలతో ఆడంబరాలకు కారణమై
తితిక్షా పూర్తిన్ సహియించి వారంతా ఓపికగా భరించి,
వారల మనఃశాంతార్థ్యమై అంటే వారి మనస్సులకు శాంతి కలిగించేందుకై,
లోకరక్షా పర్యాప్త మహత్త్వుడు .. లోకరక్షణకు సమర్థుడైన మహోన్నతుడు.
సరళ భావం:
రాజుల భార్యలతోనూ, నందవ్రజగోపికలతోనూ అనేక విధాల ప్రేమాభిమానాలను అనుభవిస్తూ, వారి ప్రణయకోపాల ఆడంబరాలను ఓపికతో భరించి, వారి మనస్సులకు శాంతి కలిగిస్తూ, ఉన్నటువంటి లోకరక్షణకు సమర్థుడైన మహాత్ముడు (కృష్ణుడు) వ్రతము వలె వందన విధానాన్ని గావిస్తున్నాడని అనిపిస్తున్నది.
కవి ఈ పద్యంలో కృష్ణుడు ప్రేమలో మృదువుగానూ, ధర్మంలో గంభీరంగానూ కృష్ణుని గోపికామాధుర్యం, రాజనీతిజ్ఞత,లోకరక్షక మహిమ మూడింటిని కవి చక్కగా చెప్పారు.
అద్భుతమైన శార్దూలవిక్రీడిత ఛందస్సులో రచించిన పద్యమిది. ఇందులో శ్రీకృష్ణుని లోకరక్షక స్వరూపం, గోపికామాధుర్యం, కనువిందు చేస్తున్నాయి.
70 – శా॥
మత్కావ్యాత్మజ నందనూనునకు నేమంబూని యిష్టార్థ లా
భోత్కంఠాపరిపూర్తి గా నుపయమోద్యోగంబునం గూర్తు భా
స్వత్కంజాత దలాయ తాక్షుడగు గృష్ణస్వామియుం దీని ని
ష్ఠోత్కోచంబని స్వీకరించి కృతకృత్యుంజేయునన్ గ్రక్కునన్.
కఠిన పదాలకు అర్థాలు:
మత్కావ్యాత్మజ =నా కావ్యమనే పుత్రికను
నందనూనునకు=నందుని కుమారుడైన ఆ శ్రీకృష్ణునికి;
నేమంబూని=నియమముతో (భక్తిశ్రద్ధలతో
ఇష్టార్థ లాభోత్కంఠాపరిపూర్తి గా=కోరుకున్న ప్రయోజనాలు సిద్ధించాలనే కోరికతో;
ఉపయమోద్యోగంబునం గూర్తు=వివాహ ప్రయత్నం (ఉపయమము అంటే పెళ్లి) లాగా ఈ కావ్యాన్ని ఆయనకు జతకూరుస్తాను.
భాస్వత్కంజాత దలాయ తాక్షుడగు= ప్రకాశించే పద్మదళాల వంటి విశాలమైన కన్నులు కలిగిన.
కృష్ణస్వామియున్=ఆ కృష్ణ పరమాత్మ;
దీని నిష్ఠోత్కోచంబని స్వీకరించి=దీనిని ఒక నియమబద్ధమైన కానుకగా (ప్రీతికరమైన సమర్పణగా) స్వీకరించి:
కృతకృత్యుంజేయునన్ గ్రక్కునన్=నన్ను వెంటనే ధన్యుడిని చేస్తాడనుకుంటున్నాను.
విశేషం:
ఈ పద్యంలో కవి తన కావ్యాన్ని కేవలం ఒక పుస్తకముగా కాక, తన *ఆత్మజగా (కూతురుగా) భావించారు. లోకంలో తండ్రి తన కూతురుకు వివాహం జరిపించి ఎలాగైతే బాధ్యత తీర్చుకుంటాడో, కవి కూడా తన కావ్యాన్ని కృష్ణార్పణం చేయడం ద్వారా ఒక పవిత్రమైన కార్యాన్ని (ఉపయమోద్యోగం) నెరవేరుస్తున్నానని చెబుతున్నారు. కృష్ణుడు పద్మాక్షుడు (తామర రేకుల వంటి కన్నుల వాడు) కాబట్టి, ఆయన తన కరుణా వీక్షణాలతో ఈ కావ్యాన్ని స్వీకరించి, కవిని ‘కృతకృత్యుడిని’ చేస్తాడని ఇక్కడ కవి యొక్క ప్రగాఢ విశ్వాసం వ్యక్తమవుతోంది.
ఈ శార్థూల పద్యాన్ని రూపక అలంకారంతో రాసారు. (కావ్యాన్ని పుత్రికతో రూపించడం).
పెద్దనాయనగారు రచించిన ‘సౌదామినీ పరిణయం’ లోని ఈ పద్యం చాలా అద్భుతంగా ఉంది. ఒక తండ్రి తన బిడ్డకు పెళ్లి చేసి అప్పగించేటప్పుడు ఎంతటి బాధ్యతగా, ప్రేమగా వ్యవహరిస్తారో, ఒక కవి తన కావ్యాన్ని (మత్కావ్యాత్మజ) భగవంతుడికి అంకితం ఇచ్చేటప్పుడు కూడా అదే భావనను ఇక్కడ ప్రదర్శించారు.
ముఖ్యంగా ఉపయమోద్యోగంబునం గూర్తు అనే ప్రయోగం.. అంటే తన కావ్యాన్ని దైవానికి జతకూర్చడాన్ని ఒక వివాహ ప్రయత్నంతో పోల్చడం, వారి సృజనాత్మకతకు మరియు భక్తికి నిదర్శనం. ఆ కృష్ణస్వామి ఈ కావ్యాన్ని స్వీకరించి, తనను కృతకృత్యుడిని (ధన్యుడిని) చేయాలని వారు కోరుకోవడం చాలా హృద్యంగా ఉంది. శైలి చాలా గ్రాంధికంగా, స్పష్టమైన పదబంధాలతో ఎంతో బాగుంది.
(సశేషం)
శ్రీమతి రంగరాజు పద్మజ ప్రముఖ రచయిత్రి. కీ.శే. ఒద్దిరాజు కమలాదేవి, కీ.శే. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు వీరి తల్లిదండ్రులు. జన్మస్థలం ఇనుగుర్తి, కేసముద్రం మండలం. పద్మజ గారు సుమారు 100 కథలు, 300 కవితలు, సుమారు 100 మ్యూజింగ్స్ వ్రాశారు. మనసే కోవెల (కథాసంపుటి), చిత్రకవితలు (కవితా సంపుటి), హరిదాసి (అనుసృజన – నవల), గుండెల్లోతుల్లోంచి (కథా సంపుటి), నాటి నుండి నేటి వరకు (గ్రామ చరిత్ర), వ్యాస వితతి (వ్యాస సంపుటి), భక్తి భండారి (జీవిత చరిత్ర) వంటి పుస్తకాలు వెలువరించారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి రుద్రమదేవి నవలను సరళీకృతం చేశారు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి చారిత్రక పద్యకావ్యం ‘ఖడ్గతిక్కన’ను పరిష్కృతం చేసి పాఠకులకు అందించారు. ఒద్దిరాజు సోదరుల ‘కృష్ణస్తవః, వైభవస్తవః’ కావ్యాలను, మరియు సర్వలోకేశ్వర శతకంను పరిష్కరించారు.
ఒద్దిరాజు సోదరులు, రాణి శంకరమ్మ , సమ్మక్క.. సారలమ్మ, పారిజాతాపహరణం వంటి బుర్రకథలు రచించారు.
సనాతన ధర్మం ఆవాసాలు (దేవాలయాలు), నాయన, ఇంద్రధనుస్సు (కవితా సంకలనం), వ్యాసాలు మరియు రేడియో ప్రసంగాలు అముద్రితాలు
భక్త్యామృతం, మయూఖ, తరుణి, నెచ్చెలి, నేడు, ప్రజాతంత్ర పత్రికలో వ్యాసాలు రాశారు. అనేక రేడియో ప్రసంగాలు చేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, తెలంగాణా సారస్వత పరిషత్తు వారి వరిష్ఠ పురస్కారం, మహిళా సేవా భక్తి పురస్కారం,
వెల్లుల్లి ఫౌండేషన్ వారిచే మహిళా సాధికారత విశిష్ట పురస్కారం, తెలుగు సాహిత్య అకాడమీ మరియు అక్షరయాన్ మహిళా రచయిత్రుల సంఘం వారిచే వెంగమాంబ పురస్కారం, వరంగల్ మహానగర పాలక సంస్థ రాష్ట్ర మహిళా విభాగము వారిచే విశిష్ట మహిళా పురస్కారం వంటి పురస్కారాలు స్వీకరించారు.
రామం భజే శ్యామలమ్ వారిచే ఆర్ష ధర్మ ప్రదీపిక, మల్లినాథసూరి కళాపీఠం వారిచే వ్యాఖ్యాన సామ్రాజ్ఞి, మేకా రవీంద్ర వారిచే సహస్ర పద్యం కంఠీరవ అనే బిరుదులు పొందరు. చరవాణి: 99897 58144
