[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘సౌందర్యోదయం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చీకటి తెరలు తొలగు వేళ
వెలుతురు పొడ తాకి మేల్కొన్న వేకువ..
రుజు కిరణపు ఘన స్పర్శ సోకి
పరిణితి చెంది వెలుగుల గని అయ్యింది.!
సాయంత్రపు చలి కౌగిలిలోకి
ఒరిగి నిన్నటి రోజు కరిగిపోవు వేళ
హిమోత్పాతం ఝుళిపించిన మంచు
అనాథగా మిగిలింది ఆరుబయట!
చిగురాకుల కొనలపై మోజు తీరి
నేల జారుతున్న హిమ బింధువులు
గడ్డి పరక తలలపై మురిసె మకుటాలై
పచ్చదనం పైన జారి మెరిసె మరకతాలై!
సుమ బాలలు మత్తు వీడి విరుయువేళ
అల్లరి అలవాటుగ కదిలె గండు తుమ్మెదలు
అడుగడునా అందం ఆనందాల కలబోత..
చీకటి వెలుగుల కేళిలో ప్రభది పై చేయ్యేగా
మరో ఉదయం రసోదయమై వెలిగె జగతి
దేదీప్యమానంగా..!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు, 100 కవితలు రాశాను.
