Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి రఘు శేషభట్టర్ గారి ‘సౌరభం’, ‘అనల్పం’ రెండు పుస్తకాల సమీక్షణము

[ఇటీవల ఖమ్మంలో జరిగిన రఘు శేషభట్టర్ సాహిత్య సమాలోచన సదస్సులో శ్రీ తుమ్మూరి రామ్మోహనరావు గారు చేసిన ప్రసంగ పాఠ్యాన్ని అందిస్తున్నాము. వాధూలస వారి కలం పేరు.]

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

సభలోని ఖమ్మం సాహితీ ప్రియులందరికీ వందనం. చుట్టం చూపుగా ఒకటి రెండు సార్లు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం మంచి సాహితీ క్షేత్రమని తెలుసు. అనేక మంది కవులు రచయితలు లబ్ధప్రతిష్ఠుల గురించి విన్నాను. ఈ రోజు మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం కల్పించిన రఘు శేషభట్టర్ గారికి కృతజ్ఞతలు.

నేను ఆరవతరగతిలో ఉండగా మా పాఠశాల వార్షిక తొలిసంచిక వాసంతికి సంపాదకులలో ఒకరైన మా బాపు పద్మనాభ శర్మగారు ఒక పద్యం రాసారు

కం.

వాసంతియనెడు పేరుతొ
భాసిల్లగ బాలకవుల భావపు లతలన్
బూసిన పూవుల కమ్మని
వాసనలతొ ఛాత్రగణము వాసిన్ గాంచన్.

భావపు లతలకు పూసిన పూవుల పరిమళం మన రఘుగారి వ్యాసకదంబం సౌరభానికి చెందింది. అఆ లకంటే ముందే నాలుగేళ్ల వయసులోనే ‘అలవైకుంఠపురంబులో నగరులో ఆమూల సౌధంబు దాపల’ అన్న పోతన్న పద్యంతో నాకు అక్షరాభ్యాసం చేసిన అక్షర గాయత్రీ గురువు బాపును స్మరించుకుని ముందుకు కదులుతాను.

గతంలో ‘సౌరభం’ పుస్తకాన్ని సమీక్షిస్తూ రాసిన వ్యాసం ఈ మాట అంతర్జాల పత్రికలో రావటం నాకు ఈ ప్రసంగం చేయడానికి కొంత బలం. నిజానికి ‘సౌరభం’ వ్యాస కదంబాన్ని సమగ్రంగా సమీక్షించాలంటే నావంటి అరకొర పండితుడు సరిపోడు. ఆంధ్ర గీర్వాణ పంచకావ్యాలు ఔపోసన పట్టిన వారు కావాలి. తెలుగు సాహిత్యపు తీరు తెన్నులు తెలిసిన వారు కావాలి.

మందః కవియశః ప్రార్థీ
గమిష్యామపహాస్యతి
ప్రాణము లభ్యే ఫలేలోభా
దుద్బాహు రివ వామనః

అన్న కాళిదాసు శ్లోకం నేను కవిత్వం రాస్తున్నానని మా తెలుగు పండితులు మధు రాంమూర్తి గారితో అంటే నా నోట్ బుక్ లో రాసారు. ఈ శ్లోకం భట్టర్ గారి పుస్తకంలో ఉన్నది. సాహిత్య ప్రాంగణంలో నేను మరుగుజ్జుననే విషయం నాకు తెలుసు.శ్రుత పాండిత్యమే కాని విశ్రుత పాండిత్యం కాదు. అయినా ఆత్మీయంగా ఆహ్వానించిన మిత్రులు రఘు శేషభట్టర్ గారి మాట కాదనలేక వచ్చాను.

ఈ పుస్తకంలో నాకిష్టమైన పద్యం ఒకటున్నది

“అటజనికాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరఝ్ఝరీ
పటల ముహుముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుటనటనానుకూల పరిఫుల్ల కలాపకలాపిజాలమున్
కటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్”

ఆంధ్రకవితా పితామహుడుగా ఎంచబడిన అల్లసాని పెద్దన పద్యమిది మీ అందరికీ తెలిసిందే. నాకిష్టమవడానికి కారణం నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా 1964లో దివంగత నెహ్రూగారి స్మృత్యంకంగా జిల్లాస్థాయి పద్యపఠనం పోటీలో ప్రథమ బహుమతి నాటి మా కరీంనగర్ మంత్రివర్యులు బహుభాషాకోవిదులు, తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు గారి చేతులమీదుగా గైకొనే అదృష్టాన్ని కలిగించింది. అది నా జీవితంలో తొలి పురస్కారం. బాపు తెలుగు పండితులు కావడంవల్ల చిన్నతనంలోనే పెద్ద తరగతుల పద్యాలు గజేంద్రమోక్షణం, విదురనీతులు, విజయశ్రీ, ఉదయశ్రీ కరుణశ్రీ జంధ్యాల పద్యాలు కంఠోపాఠాలు తప్ప ఏ కావ్యాలు పెద్దగా చదువలేదు.

నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పుర విడెము సేవిస్తూ తూగుటుయ్యెలలో తూగే పెద్దన కాలంలో ఏ విమానాలున్నాయి, ఏ రైళ్లున్నాయి హిమగిరులను సందర్శించి రాయడానికి. కాళిదాసు మేఘదూతం కరతలామలకం కనుక కమనీయంగా హిమాలయ వర్ణన చేయగలిగాడు. వాక్యం రసాత్మకం కావాలంటే వలసినంత పఠనపటుత్వం కావాలె. ఈ పుస్తకం నిండా మిత్రుని వేదన ఆవేదన సెగలతో పొగలు చిమ్ముతుంది. అకవిత్వాన్ని, కుకవిత్వాన్ని నిర్ద్వందంగా నిరసించే శేషభట్టర్ గారు, తన మనసులోని మాటకు దీటుగా ఈ వ్యాసకదంబం వెలువరించారు. ఇది చెడ్డ కవిత్వం అని ఎత్తి చూపకుండా మంచికవిత్వమంటే ఇలా ఉంటుందని రుచి చూపించారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది ప్రసిద్ధ నానుడి. వీరి గురువు జ్ఞానపీఠ పురస్కారానికి అర్హత నూరుపాళ్లు గలిగిన శ్రీమాన్ గుంటూరు శేషేంద్ర శర్మగారు. వారి ప్రథమ దర్శనానికి ముందు శేషభట్టర్ గారు ఎలాంటి స్థితిలో ఉన్నారో ప్రణుతి అనే శీర్షికతో రాసిన వ్యాసంలో ఉటంకించారు. జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ వెళ్లడానికి ముందు రఘు గారు వేరు, వెళ్లిన తరువాత తన కోసం వేరేచోటికి వెళ్ల వలసిన పనిని వాయిదా వేసుకుని మనసారా మాటలైన తరువాత తనను ఇంటి దాకా దింపేంత ప్రేమచూరగొన్న శేషభట్టర్ వేరు.

90వ దశకం ప్రారంభంలో కవి సమ్మేళనాల్లో రాళ్లు విసరాలనుకున్న 20 ఏళ్ల కుర్రవాడు, కవిత్వ పుస్తకాల్ని చిత్తుకాగితాల గుట్టలా చూసే అలవాటున్న ఓ దుడుకు గుంటడు, పత్రికల్లో వచ్చే జండా మార్కు కవిత్వాన్ని చదివి చిర్రెత్తి ఉన్న ఒక కసి పిపాసి కంట్లో

“ధరిత్రిని హలం దున్నితే అవుతుందది దేశం
ధరిత్రిని కలం దున్నితే అవుతుందొక ఇతిహాసం”

“నన్ను పొడిస్తే రక్తం కాదు, కవిత్వం కారుతుంది”

వంటి పంక్తుల గల పెద్దమనిషి శేషేంద్ర కవిత్వం కంటపడగానే, ఆయనను వెతుక్కుంటూ వెళ్లిన శేషభట్టర్ మనసులో అనుకున్న మాట

“న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్”

రత్నం ఎవరినీ వెతుక్కోదు. మనమే రత్నాన్ని వెదుక్కోవాలనే కాళిదాసు రత్నోపమ సూక్తి.

శేషేంద్ర గారి అనేక కవితలు శేషభట్టరుకు కంఠోపాఠాలు. శేషేంద్ర రాసిన కవిసేన మ్యానిఫెస్టో ఉత్త పొడి వచనం రాసి కవిత్వం అని దబాయించే లాబీ మీద తిరుగుబాటు. శేషేంద్రను గాఢమైన అభిమానంతో ఇష్టపడే రఘు ఆయన వేసిన బాటలోనే అఢుగులు వేస్తూ, వస్తువు కంటే శిల్పం గొప్పదనే ఆశ్వాసన తో తనలోని భావాల్ని పరిమళించే కవిత్వ కుసుమాలుగా, కమనీయ శిల్పాలుగా సృజించడం అభ్యాసం చేసారు. అందుకే కవిసేన మ్యానిఫెస్టో లోని ‘కవిత్వం ఒక ఆత్మ కళ’ అనే అధ్యాయం కవిత్వం రాసే వాళ్లు తప్పక చదవాలి అంటారు.

అలా ఒక యుగకవిని ఆదర్శంగా తీసుకుని శేషేన్ ప్రభావితుడైన శేషభట్టర్ గారి ‘సౌరభం’ అష్టవింశతి అనుభూతా ర్థస్మృతుల వ్యాస కదంబం. సౌరభానికి సువాసన అనే కాకుండా అనుభూతార్థ స్మృతి అని కూడా నైఘంటికార్థం.

మధువును గ్రోలే ఏ కీటకమైనా మధుపమే. అయితే మధుపమనగానే తుమ్మెదనో, తేనెటీగనో భావించటం కద్దు. కవితాంతరంగుడైన రఘు శేషభట్టర్ గారు ఈ పొత్తానికి పూవుపై వాలిన చిత్రపక్ష విశేషమైన సీతాకోకచిలుకను ముఖచిత్రంగా వేసుకున్నారు.

నల్లని కురులను పోల్చడానికి ఉదహరించే తుమ్మెద మకరందం గ్రోలగానే ఝంకారం చేస్తుంది. భ్రమరనాదానికి మధురభక్తి భావానికి ముడి ఉన్నది. మరొక మధుపాయి తేనెటీగ పూలనుండి తేనె సంగ్రహించి పంచిపెడుతుంది ‘తేనెజుంటీగలీయ వా తెరవరులకు’ అన్నది అందరికీ తెలిసినదే. ఇక, ఈ సీతాకోక చిలుక ఉన్నదే ఇది పూలనుండి తేనె తాగి కడుపు నింపుకోవడమే కాదు పూల రంగుల్ని ఒంటినిండా పులుముకొని తానే పువ్వైపోతుంది. ఇది రసజ్ఞతను సూచించే లక్షణం.

‘చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకం’ అన్నాడు భాస్కర శతక కర్త మారవి వెంకయ్య కవి.

శేషభట్టర్ రఘు గారి వ్యాస కదంబం లోని వ్యాస శకలాలన్నీ(చిరు వ్యాసాలు) ఉత్తమ సాహిత్యాధ్యయ నోద్దిష్టమైనవి. అనేక సంస్కృత కావ్యలలోని ఉత్తమ కవిత్వ లక్షణాలు గలిగిన శ్లోకాలనుదహరిస్తూ వాటిని పోలిన తెలుగు కవిత్వ రస గుళికలను ఎత్తి చూపి, కవిత్వమర్మాలను వివరించటమే ఈ వ్యాసాల ప్రధానోద్దేశము.

అరసికులైన కవులను హెచ్చరించటమే శేషభట్టరు గారి పుస్తక లక్ష్యం అని నాకనిపించింది.

తుమ్మెదలవంటి కాళిదాసాదులు తమ కవితా ఝంకారంతో పలువురు రసజ్ఞులను కవులుగా మారిస్తే, తేనెటీగల వంటి పండితులు మనకోసం మకరందాన్ని నిక్షిప్తం చేస్తే సుకవులు సీతాకోకచిలుకల వలె కవితాత్మకైక జీవనులై కవితలు వెలువరిస్తారని అన్యాపదేశ సూచన కనిపిస్తుంది వ్యాసాల నిండా.

తరువు పరాకాష్ట పుష్పవికాసం. పుష్పం సత్యశివ సుందర ప్రతీక. ‘వాసనలేని పువ్వు కొరగానిద’ని పెమ్మయ సింగధీమణి నుడివినట్లు సౌరభం లేని పువ్వు వంటిదే కుకవిత్వం. కనుక మంచి కవిత్వాన్ని అనుభూతించినపుడే మంచి కవిత్వం వెలువడగలదనేది విశేషార్థం. అధ్యయనం మకరంద రసాస్వాదన వంటిది. ఏ అధ్యయనం లేకుండా తాము రాసిందే కవిత్వమని ఎగిరిపడే వారికి ఈ పుస్తకమొక నిప్పుచురక.

‘పూతమెరుంగులున్ పసరుపూప బెడంగులు చూపునట్టివా కైతలు’ అన్నాడు అలనాడు అల్లసాని.

‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నాడు విశ్వనాథ పండితుడు. ఇన్ని విషయాలను స్ఫురించే విధంగా వ్యాసాలను అందించారు ఉత్తమ సాహిత్య సృజ నాభిలాషియైన రఘు శేషభట్టర్ గారు.

ముందుమాటలోనే

“కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతాం
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా”

(ధీమతులు కావ్యశాస్త్ర పఠనంలో వినోదాన్ని వెదుక్కుంటే, మూర్ఖులైన వారు వ్యసనం, నిద్ర, కలహాల వంటి వాటితో బతుకుతారు)

అని తన అంతర్లోకాలలో తారసపడ్డ కవుల కవిత్వాన్ని అవలోడనం చేసుకుని రాసిన వ్యాసాలుగా తన కవిత్వ ప్రేమనుచెప్పుతారు ఈ కవి.

తెలుగు సాహిత్యానికి ఆధారభూతమైన సంస్కృత సాహిత్య పరిమళాలను ప్రసరింపజేయటమే ఈ వ్యాసకదంబం ధ్యేయం.

ఔషధం అన్న శీర్షికలో భవభూతి ఉత్తరామచరిత్రలో విరహాన్ని ఉట్టంకించే శ్లోకాలను ఉదహరిస్తూ యక్షుడి విరహాన్ని వర్ణించిన కాళిదాసే కాదు సారస్వతలోకం ఎందరో మహాకవులన్నారని, మనిషిలోని చిత్తప్రకోపాలకు దివ్యౌషధం సారస్వతమని తేల్చి చెప్పుతారు వీరు.

“తవ స్పర్శే స్పర్శే మమహి పరిమూఢేంద్రి య గణో
వికారశ్చైతన్యం భ్రమయతి చ సమ్మీల యతి చ”

అనే శ్లోకానికి తమ స్వేచ్ఛానువాదాన్ని “నీ స్పర్శతో అవయవ సమూహం నిశ్చేష్టమౌతుంది. భ్రమ వంటి పరవశమేదో కలుగుతుంది” – జోడిస్తూ కావ్యానందాన్ని ప్రకటిస్తారు.

అలాగే ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న వ్యాసంలో శీర్షిక ప్రతిపాదకంగా భర్తృహరి శృంగార శతకంలోని

“లీలావతీనాం సహజా విలాసాఃత ఏవ మూఢస్య హృది స్ఫురంతి
రాగో నళిన్యాహి నిసర్గ సిద్ధస్తత్ర భ్రమత్యేవ వృథా షఢంగ్రి” అనే శ్లోకం,

శేషేంద్ర ‘ప్రేమలేఖలు’ కావ్యంలోని

“నీవు స్త్రీవి కావు అందాల తుఫానువి.. చీరా తారా కలిపి నేసిన రూపానివి” కవితాత్మక వాక్యాన్ని, విశ్వనాథ

“మాకందతరుశాఖికా కోకిలాలాప కౌతూహలాకార కలనచేసి
పాతస్సమాయాత శీతానిలాధూత సాధుపల్లవహస్త సంజ్ఞచేసి
రేఖాభవద్వారి శాఖానదీ వేణికా సంసిత దుకూలకాంతి చేసి
సామోదకల్హార సంపుల్ల నీరేరు హాకేక రాత్త మోహనత చేసి
తరుణశాలీన కోమలాతపవిసారి, హృదయవాంఛాస్రవ
త్రేమరేఖ చేసి శకలితామరాళ రాజహాసంబుగా వసంత
నవశోభ వచ్చె నప్సరసవోలె”

అని విశ్వామిత్రుని తపోభంగం చేయడానికి వచ్చిన మేనక రాకను వసంతంతో పోల్చిన లయాన్విత పద్యంతో పాటు శేషభట్టర్ గారు ‘లిపి తడిపిన తరుణం’ పుస్తకం లోని తమ స్వీయ కవిత

‘పిట్టగోడల మెడల మీద ప్రియురాలి జడల్లా జారిన పూల తీగలు’
‘కాలం విశాలం అని ఎవరన్నారు? అది ఎంత కురచనో నీ
ఎదఒంపు మీద తలవుంచితే తెలిసింది’

అనే చరణాలను ఉదహరిస్తారు.

వ్యాసాలన్నీ ఉత్తమ కవితల ఉదాహరణలే. గీర్వాణ భాషా శోభితాలే.

తెలుగు కవితా మకరంద మాధుర్యాలే. సరస సాహిత్య సౌరభాలే.

ముందే చెప్పినట్లు తనకు తారసపడ్డ ఆంధ్ర గీర్వాణ భాషల అధునాతన ప్రాచీన కవుల కవితా స్మరణే పుస్తకం నిండా.

కాళిదాసు, భవభూతి, భర్తృహరి, పండిత జగన్మాథ రాయలు వంటి సంస్కృత కవులు, నన్నయ, పెద్దన, ఇటీవలి విశ్వనాథ, శేషేంద్ర మొదలైన కవులు, ఆధునికులలో ఎలనాగ, ఎండ్లూరి, నామాడి శ్రీధర్, బివిఎన్ ప్రసాద్, బులుసు వేంకటేశ్వర్లు వంటి వారే గాక సీతారాం అవధాని, వనమాలి, సాత్యకి, రాం నారాయణ్, కవిరాజు వంటి విస్మృత కవుల కవిత్వాన్ని తలచుకుని తమ విశ్లేషణతో వారి కవితా సౌందర్యాలను చూపిస్తారు.

విష్ణు చిత్తులెక్కడ? అన్న వ్యాసంలో రొడ్డకొట్టుడు కవిత్వాన్ని ఈసడించుకుంటూ, తాము రాసిన కవిత్వమే గొప్ప కవిత్వమని మురిసిపోయే నమ్రతలేని కవులను దుయ్యబడతారు. దీనికి భవభూతి రాసిన మాలతీ మాధవీయం లోని “వాక్య ప్రతిష్ఠాణి దేహినాం వ్యవహార తంత్రాణి” అంటే -మానవ లోక వ్యవహారాలన్నీ మాటల కూర్పుతోనే ముడివడి ఉన్నాయి- అనే మాట ఇలాంటి వారి గురించే అయ్యుంటుందని వాపోతారు.

ఏది విమర్శ, ఏది సమీక్ష అనే వ్యాసంలో గుణదోషాలు విడమర్చి చెప్పటం విమర్శ. మరెందుకో గానీ, విమర్శించడానికి భయపడాల్సిన ప్రస్తుత వ్యవస్థలో విమర్శ నిర్జీవమైందంటారు. దానికి కారణం మొహమాటం. స్వకీయ సమీక్షకులు రాసిన సానుకూల సమీక్షలతో సాహిత్యం ఉద్ధరించబడేది లేదంటూ, విమర్శకులు ప్రతిభావంతులైతే కవులు అప్రమత్తులవుతారని ప్రకటిస్తారు. ఒకరకంగా ఇది నిష్కర్షగా రాసిన వ్యాససంకలనమే. తాను చెప్పదలచుకున్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడానికి వెనుకాడ లేదు శేష భట్టర్ గారు.

“ఒక సారస్వత సౌరభం పొత్తూరి సుబ్బారావు” అంటూ పండితకవి ఆంగ్లోపన్యాసకులైన డా. పొత్తూరి సుబ్బారావు గారి గురించిన విశేష వ్యాసం ఉంది ఇందులో. వారికి అమరస్మృత్యంకంగా పుస్తకాన్ని సమర్పించుకున్నారు రచయిత. అక్కడక్కడ రఘుగారి శేషేంద్రపై మొగ్గు, కొన్ని దురుసు వాక్యాలు, కించిత్ ధిషణాధృతి చిరు చివుకు కలిగించవచ్చు కానీ, సాహిత్యోన్నతిని కాంక్షించే సదాశయం కలిగిన పుస్తకం ‘సౌరభం’. అర్థవంతంగా ఆకర్షణీయమైన ముఖచిత్రంతో వెలువరించిన ఈ పుస్తకం సాహితీ ప్రియులు చదివి సాహిత్యపు లోతు పాతులు తెలుసుకోవడానికి ఉపయుక్తమైనది ఇంకా చెప్పాలంటే తెలుగు సాహిత్య విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉండదగిన పుస్తకం కూడా.

మొదట్లోనే కవిత్వం పట్ల అవ్యాజమైన ప్రేమ తప్ప ఇతర ప్రయోజనాలేవీ లేని ఫక్తు సారస్వత పత్రాలివి అని విన్నవించుకున్నారు రఘు శేషభట్టర్ గారు. ఒక మంచి సాహిత్య వ్యాస సంపుటి చదివిన తరువాత నా స్పందన మాత్రమే అని భావిస్తూ సాహిత్యలోకానికి అరుదైన పుస్తకాన్ని అందించిన రఘుశేషభట్టర్ గారికి అభినందనలు చెబుతూ, వీరి మరో పుస్తకం ‘అనల్పం’ కవితా సంపుటి గురించి రెండు మాటలు.

సౌరభంలో చెప్పిన విషయాలకు, తాను నమ్మిన కవిత్వ సిద్ధాంతానికి అద్దం పట్టే పుస్తకం ‘అనల్పం’. అనల్పం అన్న పేరు వినగానే ‘అల్పాక్షరముల ననల్పార్థ రచన’అన్న పాల్కురికి మాట గుర్తుకు వస్తుంది.

‘రససిద్ధాః కవీశ్వరా’ అన్న ఆర్యసూక్తిని అక్షరాలా ఆచరించి తనవైన భావచిత్రాలను కవిత్వీకరించారు శేషభట్టర్ గారు. తమ అనల్పంలో కవిత్వ పాఠ్యాంశాలు అనదగ్గ 52 కవితలను పొందుపరిచారు. వస్తువు కన్నా శిల్పానికే ప్రాధాన్యత కల్పించిన ప్రతి కవితా ప్రతీకల ఉపమానాల రతనాలు నైపుణ్యంగా పొదిగిన కవితాభరణం.

సాహిత్యం ఆలోచనామృతం అన్న మాట వీరి కవితలు చదివితే సార్థకమ నిపిస్తుంది. అందుకే పుస్తకానికి తాము రాసుకున్న ఆముఖానికి శీర్షిక ‘వస్తువొక నెపం మాత్రమే’ అని పెట్టారు. కవిత లోని ప్రతి వాక్యం ఆపి ఆపి నడిపిస్తుంది.

అంతర్లోకాలను మెరిపిస్తుంది. మునునపెన్నడూ ఎవరూ కనని ఊహల వలయాలకావలి ఉపమలతో ఊరిస్తారు.

లో చూపు చిక్కబడే వరకు ఓపిగ్గా ఉండటం కవికి ఉండాల్సిన మొదటిది లక్షణం అని నిర్ధారించుకున్న కవి శేషభట్టర్ గారు , రాస్తున్నప్పుడు నేను బొమ్మలు చెక్కే వాడిని, లేదా ధ్యానంలో ఉన్న చిత్రకారుడ్ని. ఏకాగ్ర చిత్తంతో రాసుకుంటాను. అది దాచలేని ఉధృతితో వెలువడినప్పుడు వస్తువొక నెపం మాత్రమే.

రాయటం ఒక అలవాటుగా ఉన్నప్పుడు
పలుచటి నీటి అలల కింద ఈదుతున్న
చేపల్ని చూసినట్టు లోకాన్ని చూడాలి

అని ఒక పదచిత్రాన్ని మన ముందుంచుతారు రఘు శేషభట్టర్ గారు.

కవిః కరోతి కావ్యాని లాలయేత్యుత్తమో జనః
తరుః ప్రసూతి పుష్పాణి మరుద్వహతి సౌరభం

ఏ పూలచెట్టూ తన పూల వాసన చూడమని అడగదు. వాసన పసికట్టి మనమే తరువు దగ్గరికి చేరి సౌరభం ఆఘ్రాణించాలి. కనుక ఈ కవికి పాఠకుల సంఖ్యమీద దృష్టి లేదు.

‘తెలుగు కవిత్వంలో కొత్త సౌరభం’ అని ముందుమాట రాసిన ప్రసాదమూర్తి గారి విశ్లేషణ చదివితే శేషభట్టర్ గారి విశిష్టత ఏమిటో తెలుస్తుంది.

రఘు కవిత్వం నిండా కవి మాత్రమే కనిపిస్తుంటాడు. అంత మెత్తని పదాలు, అంత మెత్తని అర్థాలు, అంత మెత్తని భావాలు, అంత మెత్తని స్పందనలు, అంత మెత్తని ఉద్వేగాలు చూస్తే కవిహృదయమే నాకు నింగి నీటిలో కదలుతున్న చందమామలా అనిపిస్తుంది ‘తెమ్మెర’ అనే కవితలో.

వీరి కవిత ఎదీ ఒకదానికొకటి తీసిపోవు. ఏ వాక్యమూ మరో వాక్యానికంటే తూగు తగ్గదు. కనుకనే ఇవి కవిత్వం రాసేవారి వృత్యంతరశిక్షణలో పాఠ్యాంశాల వంటివి. ప్రయోగ నవ్యత, భావ భవ్యత, వస్తు సవ్యత, అక్షర రమ్యత, ధ్వని గమ్యత వీరి కవితల నిండా పరచుకుని ఉంటాయి.

ఒక వాక్యం లోనే ఎంత విషయం వివరించగల నేర్పు వీరికుంది

‘పరంపర’లో తండ్రి పాత ఇంటి మీద పెంచుకున్న మమకారం వర్ణిస్తూ, చివరలో ఆయన తదనంతరం

‘గజాలను పెళ్లాల నగల్లో చూసి మురిసిపోయాం’ అంటారు

‘తీరా నేలను చదును చేసాక
పరంపర విలువ తెలిసి పొగిలి పోయాం’

అని ముక్తాయించటం.

అలాగే ‘మేనత్త నవ్వు’ లో

“నెపం మేనత్తయినా ఆమె తెచ్చిన వెండిగ్లాసైనా
తొణికి పడే ప్రేమలతో కాలం కొలవాలి”

అంటారు

‘ఒక కోయిలను పెంచాలని ఉంది’తో మొదలై ‘నూనె చుక్క’తో ముగిసిన కవితా సంపుటి ఆద్యంతం వచనకవితా లక్షణ గ్రంథం అనటంలో సందేహం లేదు

రఘు శేషభట్టర్ గారి కవిత నారికేళ పాకమే కావచ్చు. కాని భూమి అడుగు పొరల నుండి ఆకాశమంత ఎత్తులో భద్రకలశంలో దాచిన ఆ సారజలం గ్రోలటంలో ఉన్న ఆనందం అనుభవైక వేద్యం. వీరి ధిషణ ఆత్మ సంకల్ప దార్ఢ్యతనే తప్ప అహంకారం కాదు.

అధ్యయన శీలత లేక తమను మెచ్చుకునే వారిని చేరదీసి తాము రాసే అస్తవ్యస్త కవిత్వానికి హారతులు పట్టించుకునే వారికి ఈ పుస్తకాలు మింగుడుపడక పోవచ్చు. ముక్తాయింపుగా

సంగీతమపి సాహిత్యం
సరస్వత్యాస్తన ద్వయం
ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం

ఆలకించిన వెంటనే ఆనందం కలిగించేది సంగీతమైతే ఆలోచించిన కొద్దీ అమృతోపమానమయ్యేది సాహిత్యం. నేను సంగీత ప్రాధాన్యమైన గేయ ప్రక్రియతో నా తొలి అడుగులు వేసాను. తరువాత మిగతా ప్రక్రియలను స్పృశించాను. నా తొలి గేయ సంపుటికి నా ముందుమాటగా రాసుకున్న గేయం లోని ఒక చరణం వినిపించి నా ప్రసంగాన్ని సుసంపన్నం చేసుకుంటాను.

అది కూడా శేషభట్టర్ గారి వాదానికి బలకంగా ఉండే పంక్తి గనుక –

“గూడెందుకు గుడిసెందుకు గున్నమావి గుబురుంటే
కూడెందుకు కుమ్మెందుకు లేతమావి చివురుంటే
అందం చందం ఎందుకు అలరించే గళముంటే
పరుగూ పందెం ఎందుకు ప్రతిభపట్టు మనకుంటే
అన్నదీ…….అంటున్నదీ…….అంటాను అన్నదీ…….

ఏమన్నది ఏమన్నది గొంతెత్తిన కోయిలా
అందరిన పాడమంది తనలాగే తీయగా
కాకిమూకతో కాలం వెళ్లబుచ్చుతూ ఉన్నా
బ్రతకవచ్చునన్నదీ తనలాగే హాయిగా”

స్వస్తి.

***

సౌరభం (వ్యాస కదంబం)
రచన: రఘు శేష భట్టర్
ప్రచురణ: అస్త్ర పబ్లిషర్స్
పేజీలు: 104
వెల: ₹ 125/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‌లైన్‌లో:
https://www.analpabooks.com/sourabham

♦
అనల్పం (కవిత్వం)
రచన: రఘు శేష భట్టర్
ప్రచురణ: బోధి ఫౌండేషన్
పేజీలు: 122
వెల: ₹ 150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Analpam-Raghu-Seshabhattar/dp/B0D3564C1H

Exit mobile version