[ఇటీవల కర్ణాటక దక్షిణ తీరంలోని ఆలయాలను సందర్శించి, ఆ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటున్నారు కొల్లూరి సోమ శంకర్. ఇది మొదటి భాగం.]
ఒకవైపు ఉవ్వెత్తున ఎగసిపడే అరేబియా సముద్ర అలలు, మరోవైపు పచ్చని తివాచీ పరిచినట్లుండే పశ్చిమ కనుమలు.. వీటి మధ్య ప్రకృతి ఒడిలో కొలువైన ఆధ్యాత్మిక నిలయమే కర్ణాటక దక్షిణ తీర ప్రాంతం. చారిత్రకంగా ‘సౌత్ కెనరా’ లేదా ‘తుళునాడు’ అని పిలువబడే ఈ ప్రాంతం (నేటి దక్షిణ కన్నడ మరియు ఉడుపి జిల్లాలు) కేవలం ప్రకృతి రమణీయతకే కాదు, శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుత దేవాలయాలకు పెట్టింది పేరు.
ఇక్కడి ఆలయాల నిర్మాణ శైలి మన తెలుగు రాష్ట్రాల్లోని గోపురాలకంటే భిన్నంగా ఉంటుంది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలను తట్టుకునేలా వాలు పైకప్పులతో, కలప మరియు రాతి కట్టడాలతో కూడిన ప్రత్యేక ‘తుళునాడు-కేరళ’ వాస్తుశిల్పం ఈ ఆలయాల సొంతం. ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతతను కోరుకునే భక్తులకు ఈ తీర ప్రాంత యాత్ర ఒక మధురానుభూతిని ఇస్తుంది.
మనిషి నిత్య జీవితంలో ‘నేను’, ‘నాది’ అనే అహంకారపు పొరల మధ్య బందీగా మారిపోతున్నాడు. హోదా, సంపద, జ్ఞానం అనే ఆభరణాలను ధరించి, తనను తాను గొప్పవాడిగా భావించే మనిషికి – తానెంత అల్పుడో, అనంతమైన ఈ విశ్వశక్తి ముందు తన ఉనికి ఎంతటిదో గుర్తు చేసే పవిత్ర వేదిక ఆలయం. ఇటీవల మా కుటుంబం దక్షిణ కర్ణాటక తీర ప్రాంతంలోని 11 ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంది. పచ్చని పశ్చిమ కనుమలు, జలపాతాలు, అనంతమైన అరేబియా సముద్ర తీరం మధ్య కొలువై ఉన్న ఈ ఆలయాల యాత్ర మాకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.
~
ఒక కుటుంబంలోని ఇరవై రెండు మంది సభ్యులందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించడం అంటేనే అది మాటల్లో చెప్పలేని ఒక మినీ పండుగ! రోజువారీ ఉరుకులు పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి, చిన్నా పెద్దా అంతా ఒక్కటై దక్షిణ కన్నడ (South Canara) ఆలయ యాత్రకు బయలుదేరిన ఆ ప్రయాణం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
***
8 ఆదివారం 2026 నాడు ఉదయం సుమారు పది గంటలకి, ముందుగా బుక్ చేసుకున్న 30 సీటర్ బస్‍లో మేం 22 మంది కుటుంబ సభ్యులం బెంగుళూరు నుంచి ప్రయాణానికి సిద్ధమయ్యాం. చివరి సీట్లలో ఫుడ్ ఐటమ్స్, కొన్ని అత్యవసరమైన వస్తువులున్న లగేజీలు పెట్టాం, మిగతావి బస్ వెనుక ఉన్న లగేజ్ ర్యాక్‌లో సర్దాము. ప్రయాణం చేయని పెద్దవాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పి, వీడ్కోలు పలికారు.
బస్సు ఎక్కగానే “నాకు కిటికీ సీటు కావాలంటే నాకు కావాలి” అంటూ పిల్లలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
బస్సు సిటీ దాటి, నేషనల్ హైవే 75 ఎక్కాక కాసేపు ఎవరికి వాళ్ళు మొబైల్స్‌తో కాలక్షేపం చేశారు. ఆ తర్వాత పాటలు మొదలయ్యాయి. పాత, కొత్త పాటల అంత్యాక్షరితో బస్సంతా సందడి నెలకొంది. పెద్దవాళ్ల పాత మెలోడీలకు, కుర్రకారు ఫాస్ట్ బీట్ పాటలు తోడై.. కదులుతున్న బస్సులోనే బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలు వేసిన డ్యాన్స్ స్టెప్పులు, కేరింతలతో మా బస్సంతా ఒక వేడుకలా మారిపోయింది.
భోజనాలు ఇంటినుంచే ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాం. ఎవరికి ఆకలి వేసినప్పుడు వాళ్ళు తినేశారు. ఇక ప్రయాణంలో చిరుతిండి ముచ్చట్ల గురించి చెప్పాలంటే అదొక ప్రత్యేక అధ్యాయం! స్నాక్స్, స్వీట్స్ కారప్పూస డబ్బాలు బస్సులో చేతులు మారుతుంటే.. “ఈ స్వీట్ బావుంది”, “ఆ కారప్పూస ఎవరు తెచ్చారు?” అంటూ పదార్థాలను మెచ్చుకుంటూ పంచుకుని ఆప్యాయంగా తిన్నారు.
ఒకవైపు సరదా ఆటపట్టింపులు, నవ్వులు, మరోవైపు పెద్దవాళ్లందరూ కలిసి తమ చిన్నప్పటి విశేషాలను, తమ గత ప్రయాణాల సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ వేసిన జోకులతో ప్రయాణపు అలసట అనేదే తెలియలేదు.
బెంగళూరు నుండి హాసన్ మీదుగా సాగిన మా 220 కిలోమీటర్ల సాఫీ హైవే ప్రయాణం సకలేశ్‌పూర్ చేరుకోగానే ఒక కొత్త మలుపు తిరిగింది. సకలేశ్‌పూర్ దాటిన 10 కిలోమీటర్లకే, మారనహళ్లి వద్ద అసలైన శిరాడి ఘాట్ మొదలైంది; అక్కడి నుండి గుండ్యా వరకు సుమారు 26 కిలోమీటర్ల పాటు సాగే కొండ మార్గం కర్ణాటక మైదాన ప్రాంతాలను తీరప్రాంత పుణ్యక్షేత్రాలతో కలిపే జీవనాడి.
ఒకవైపు ఎత్తైన పచ్చని పశ్చిమ కనుమలు, మరోవైపు కెంపుహోళె నది లోయతో ఎంతో రమణీయంగా ఉన్న ఈ దారి, భారీ వర్షాలను సైతం తట్టుకునే దృఢమైన కాంక్రీట్ రోడ్డు కావడంతో మా 30-సీటర్ బస్సు పెద్ద మలుపులు తిరుగుతున్నా ప్రయాణం ఎంతో సాఫీగా, థ్రిల్లింగ్‌గా సాగింది.
సుమారు గంటన్నర పాటు పొగమంచు, జలపాతాల నడుమ సాగిన ఘాట్ ప్రయాణం గుండ్యా వద్ద ముగియగానే, అక్కడి నుండి దట్టమైన అడవి మార్గంలో మరో 22 కిలోమీటర్లు (సుమారు 35 నిమిషాలు) ప్రయాణించి మేము కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి చేరుకున్నాము.
మధ్యమధ్యలో అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపించినప్పుడల్లా బస్సు ఆపి, ఇరవై రెండు మంది ఒకే ఫ్రేమ్‌లో పట్టడానికి నానా తంటాలు పడుతూ తీసుకున్న గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు మా ప్రయాణానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి.
ఇలా అంతులేని ఆనందం, ఆప్యాయతల విందుగా సాగిన మా బస్సు ప్రయాణం, దక్షిణ కన్నడలోని పచ్చని ప్రకృతి ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక దర్శనంతో కలిసి మాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఉదయం పది గంటలకి బయల్దేరితే, సాయంత్రం ఐదున్నరకి దక్షిణ కన్నడ జిల్లాలోని సుబ్రహ్మణ్య అనే ఊరు చేరాం.
***
కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో, పశ్చిమ కనుమల ఒడిలో కొలువై ఉన్న కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నాగారాధన మరియు సర్పదోష నివారణ క్షేత్రం. పూర్వం ఈ ప్రాంతాన్ని ‘కుక్కె పట్టణం’ అని పిలిచేవారట.
గరుత్మంతుడి బారి నుండి తప్పించుకోవడానికి నాగరాజు వాసుకి పూర్వం ఇక్కడి గుహలలో తలదాచుకుని శివుని కోసం తపస్సు చేశాడు. తారకాసుర, శూరపద్మ సంహారం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రానికి విచ్చేసి, వాసుకికి అభయమిచ్చాడు. ఆనాటి నుండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పాటు వాసుకి కూడా నిత్య పూజలు అందుకుంటున్నాడు.
గర్భగుడిలోని మూడు అంతస్తుల పీఠంపై పైన సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో వాసుకి, క్రింద ఆదిశేషుడు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడికి, ప్రధాన ద్వారానికి మధ్య వెండి రేకులతో తాపడం చేసిన గరుడ స్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వాసుకి శ్వాస నుండి వెలువడే విషపూరిత వాయువుల ప్రభావం భక్తులపై పడకుండా ఈ స్తంభం రక్షణ కవచంలా పనిచేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇక స్థలపురాణం విషయానికొస్తే, దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన సమయంలో సకల పుణ్యతీర్థాల జలాలు ఇక్కడకు ప్రవహించి ‘కుమారధార నది’గా మారాయి. అందుకే భక్తులు ముందుగా ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, ఆ తర్వాతే స్వామిని దర్శించుకుంటారు.
సర్ప దోషం, కాలసర్ప దోషం, సంతాన లేమి వంటి సమస్యల పరిష్కారం కోసం భక్తులు ఇక్కడ సర్ప సంస్కార పూజ, ఆశ్లేష బలి, నాగ ప్రతిష్ఠ వంటి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఇచ్చే పుట్టమన్ను (మృత్తిక) ప్రసాదాన్ని ధరించడం వల్ల చర్మవ్యాధులు, ఇతర అనారోగ్యాలు నయమవుతాయని నమ్ముతారు.
ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే శ్రీ మధ్వాచార్యులు స్థాపించిన మఠం, వేదవ్యాస సంపుట నరసింహ స్వామి ఆలయం ఉన్నాయి. వేదవ్యాసుల వారు అనుగ్రహించిన అత్యంత శక్తివంతమైన నరసింహ సాలగ్రామం (సంపుట నరసింహ) ఇక్కడ పూజలందుకుంటోంది. ఈ ప్రాంగణంలోనే ఉమా మహేశ్వర ఆలయంతో పాటు, క్షేత్ర పాలకురాలిగా కొలువైన హోసలింగమ్మ ఆలయం కూడా దర్శనమిస్తాయి.
~
దర్శనం కోసం మేము నిల్చున్న క్యూ చెదిరిపోవడం, వెనుకా ముందు అయ్యాం. మాలో కొందరి దర్శనం ముందు పూర్తయ్యింది. మేము ఒక మంటపం దగ్గర కూర్చున్నాం. అప్పుడొక భక్తుడు గట్టిగా, శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పైకే చదవసాగాడు.
“కుమారం వరేణ్యం శరణ్యం సుపుణ్యం
సులావణ్యపణ్యం సురేశానువర్ణ్యం
లసత్పూర్ణకారుణ్యలక్ష్మీశగణ్యం
సుకారుణ్యమార్యాగ్రగణ్యం నమామి”
అన్నది నాకు బాగా గుర్తుండిపోయింది.
ఈ స్తోత్రంలో స్వామివారిని కుక్కే క్షేత్రాధిపతిగా, క్రౌంచ పర్వత భేదిగా, భుజంగేశ్వరుడిగా కీర్తిస్తారని ఆయన చెప్పారు.
కాసేపటి మా బృందంలోని మిగతావారి దర్శనం కూడా పూర్తయింది. అందరం కలిసాం.
ఆది సుబ్రహ్మణ్య ఆలయం:
ప్రధాన ఆలయానికి అతి సమీపంలోనే ప్రాచీన ‘ఆది సుబ్రహ్మణ్య ఆలయం’ ఉంది. ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా, ఒక భారీ పుట్ట (వాల్మీకం) రూపంలో పూజలందుకోవడం విశేషం. వాసుకి, ఆదిశేషుడు ప్రత్యక్షంగా ఇక్కడే నివసిస్తారని భక్తులు విశ్వసిస్తారు.
ఆది సుబ్రహ్మణ్య ఆలయంలో దర్శనం పూర్తయ్యాక, పరిసరాలను గమనిస్తుంటే, కొందరు భక్తులు, నీరు తక్కువగా ఉన్న కుమారధార నదిలో దిగి మధ్యస్థంగా ఉన్న రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం గమనించాను. దీనికి ప్రధాన కారణం సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుందనే బలమైన నమ్మకమట. నదిలోని నునుపైన గులకరాళ్లను సేకరించి, చిన్న ఇంటి ఆకారంలో లేదా ఒకదానిపై ఒకటి గోపురంలా పేర్చి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే త్వరలోనే సొంత గృహ నిర్మాణం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా తాము ఎన్ని అంతస్తుల ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటారో అన్ని రాళ్లను పడిపోకుండా ఎంతో ఓర్పు, ఏకాగ్రతతో ఒకదానిపై ఒకటి పేర్చుతారు. ఇది ఆలయ శాస్త్రోక్తమైన పూజా విధానం కానప్పటికీ, తరతరాలుగా భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఒక సంప్రదాయమట. ఇటువంటిదే నేను 2016లో తిరుమల యాత్ర చేసినప్పుడు గమనించాను. కాలినడకన తిరుమలకి వెళ్తున్నప్పుడు ఒక చోట భక్తులు ఇలాగే రాళ్ళు పేరుస్తారు. మా ఆవిడ కోరికపై నేను అప్పుడు అక్కడ రాళ్ళు పేర్చాను.
బిలద్వార గుహ:
గరుత్మంతుడి బారి నుండి తప్పించుకోవడానికి నాగరాజు వాసుకి ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉన్న గుహలో దాక్కుని శివుడి గురించి తపస్సు చేశాడని ప్రతీతి. ఆలయానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రసిద్ధ గుహ పేరు బిలద్వార. ఈ గుహ లోపలి భాగానికి భద్రతా కారణాల వల్ల ప్రవేశం పరిమితం చేయబడినప్పటికీ, బయట నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ఈ గుహ ప్రతిరోజూ ఉదయం 6:00 లేదా 8:00 గంటల నుండి మధ్యాహ్నం వరకు, మళ్లీ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30 – 6:00 గంటల వరకు తెరిచి ఉంటుందట. ప్రధాన, ఉపాలయాలలో దర్శనాలు పూర్తయ్యేసరికే ఏడు గంటలు దాటడంతో, ఈ గుహని చూడలేకపోయాము.
అప్పటికే బాగా చీకటిపడడం వల్ల, సుదీర్ఘ సమయం ప్రయాణం వల్ల అందరం అలసిపోయాం. గుడికి దగ్గరగా ఉన్న హోటల్లో భోం చేసి ముందుగా బుక్ చేసుకున్న హోటల్‍లో మా మా గదుల్లో విశ్రమించాం.
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

