Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్పందిద్దాం!

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘స్పందిద్దాం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నిశ్చల జలాశయంలో
తొలి వాన చుక్క పడి
సృష్టింపబడ్డ తరంగాల్లా
హృదయాంతరాళాల నడి
ఊరే పలు భావనల సవ్వడి ప్రవహించు..
స్పందనల జలాశయంలా!

స్పందనల నాడి పట్టి సాగే
రచన.. వచనమో, గేయమో..
ప్రక్రియ ఏదైనా కాని..
కవి హృదయ భారం అక్షరం పాలై
కురిసే మేఘంలా భారరహితమవుతుంది!

అనుభూతులు ఎన్నో..
తనువంతా పాకిన నాడీ వ్యవస్థలా
స్పందించగలుగు హృదయాలు కొన్నే..
అవే కదా ఈ సంఘానికి స్నేహితులు!

ఇతరుల గురించి
తపించని హృదయాలు..
సానుభూతితో
చెమర్చని నయనాలు..
సమాజ హితులెలా అవుతాయి?
వాటి సహవాసం సంఘానికి
అవసరమా అనే ప్రశ్నా ఉదయిస్తుంది!

Exit mobile version