[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘స్పర్శ’. రచన శ్రీ సింగీతం ఘటికాచల రావు.]
‘సాయంత్రం ఐదు గంటలు. మరో అరగంటలో పని గంటలు ముగుస్తాయి. ఫైలు కట్టేసి ఇంటికెళ్ళిపోవచ్చు. బాస్ ఈరోజు రాలేదు కాబట్టి త్వరగా వెళ్లినా అడిగేవాళ్ళు లేరు’ అలా ఆలోచిస్తూనే కంప్యూటర్ ముందు కూర్చుని లెటర్ టైప్ చేస్తూ ఉన్నాడు గిరిధర్. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగింది, గోమతి మాట్లాడుతూ ఉంది.
“హలో గోమతీ. మరొక అరగంటలో బయలుదేరుతాను.”
“అది కాదండి, మన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. మూడు గంటలకే స్కూల్ వదిలేస్తారు. ఇప్పటిదాకా రాలేదంటే నాకేదో భయంగా ఉందండి”
ఫోన్లో మాటలు విని ఉలిక్కిపడ్డాడు గిరిధర్. చేతులు తడబడి అందిన అక్షరాలన్నీ టైప్ చేసేసాయి. లెటరంతా గందరగోళంగా తయారైంది. పని మీద ఏకాగ్రత కుదరలేదు. ఠక్కున కంప్యూటర్ షట్ డౌన్ చేసేసి సీట్లోనుంచి లేచాడు. పక్కనే ఉన్న మదన్ ‘ఏమైందిరా?’ అన్నట్టు చూశాడు.
“స్కూల్ వదిలి రెండు గంటలైనా పాప ఇంటికి రాలేదట” అన్నాడు ఆందోళనగా.
‘అలాగా’ అన్నట్టు తలాడించాడు మదన్, ఏ విధమైన ప్రతిక్రియ లేకుండా. గిరిధర్ అతన్ని గమనించే స్థితిలో లేడు. వెంటనే బ్యాగ్ చేత పట్టుకుని బయలుదేరాడు. సరిగ్గా అరగంటలో ఇల్లు చేరుకున్నాడు. భర్తను చూడగానే గోమతి దుఃఖం కట్టలు తెంచుకుంది.
“నువ్వలా అధైర్య పడకు. ఒకవేళ ఎక్స్ట్రా క్లాసులేమన్నా ఉన్నాయేమో కనుక్కున్నావా?”
“మొన్ననే కదా పరీక్షలు ముగిసాయి. ఇప్పుడు అలాంటివి ఉండవు”
“అలా నువ్వనుకుంటే సరిపోతుందా. స్కూల్లో కనుక్కోవాలి. ఫోన్ చెయ్”
వెంటనే స్కూల్ కి ఫోన్ చేసింది గోమతి. అయితే స్కూల్లో ఎవరూ లేరని, అందరు వెళ్ళిపోయారని జవాబు వచ్చింది. అంతలో పక్క ఫ్లాట్ శంకర్ అక్కడికి వచ్చాడు. వాళ్ళ ముఖాల్లో ఆందోళన చూసి “ఏంటి బాస్ ఏమైంది? ఎందుకలా ఉన్నారు?” అని అడిగాడు. మెల్లగా విషయం చెప్పింది గోమతి.
అప్పుడే టీవీలో వార్తలు వస్తున్నాయి “ఇప్పుడే అందిన వార్త. పేరుపొందిన ఫైనాన్స్ కంపెనీ ఛీఫ్ మేనేజర్ దారుణ హత్య” అంటూ వార్తలు ప్రసారం అవుతున్నాయి టీవీలో.
దాన్ని చూసిన గిరిధర్ ఉలిక్కిపడి “హేయ్” అంటూ పెద్దగా అరిచాడు. అది తాను పనిచేస్తున్న కంపెనీ! ఆ కంపెనీ మేనేజర్ అంటే దేవేంద్ర కుమార్. ‘సాధువు లాంటి మనిషి ఇలా హత్యకు గురి కావడం ఏంటి?’ అయోమయంలో పడ్డాడు గిరిధర్.
“ఏమైందండీ ఎందుకలా అరిచారు?” ఆందోళనగా అడిగింది గోమతి.
మెల్లగా జవాబు చెప్పాడు “అది నేను పనిచేస్తున్న కంపెనీయే. ఈరోజు అతను ఆఫీస్ కు రాకపోవడానికి కారణం ఇదా” ఈసారి శంకర్ గోమతి ఇద్దరు అదిరిపడ్డారు.
కూతురు కనబడకుండా పోయినందుకు చింతించాలా, బాస్ అకాల మరణానికి బాధపడాలా అర్థం కాక జుట్టు పీక్కున్నాడు గిరిధర్. ఆ రాత్రంతా భారంగా గడిచింది.
మర్నాడు ఉదయం ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఆఫీసు మొత్తం పోలీసులతో నిండిపోయి ఉంది. సుమారుగా డజన్ మందికి పైగా పోలీసులు అక్కడ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్యోగిని పేరుపేరునా విచారిస్తున్నారు.
తన పక్కన కూర్చునే మదన్ సీటు ఖాళీగా ఉంది అతనింకా వచ్చినట్లు లేదు. అప్పుడతనికి గుర్తొచ్చింది అతను మూడు రోజులు సెలవు మీద వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పాడు.
ఎసిపి అసిస్టెంట్ మేనేజర్ తో కాస్త సీరియస్ గానే మాట్లాడుతున్నాడు “నథింగ్ డూయింగ్ మిస్టర్. సెలవులో ఉన్న వాళ్లందర్నీ వెంటనే పిలిపించండి”
“సార్ పండుగకోసం సెలవు తీసుకుని చాలామంది ఊరు వెళ్లారు. బహుశా పండగ అయ్యేదాకా రారేమో. ఒక్క రెండు రోజులు ఆగండి సార్ దయచేసి” అంటూ అసిస్టెంట్ మేనేజర్ చంద్రకాంత్ బతిమాలుతున్నాడు.
“చెప్పాను కదా నో అంటే నో. రేపు ఉదయానికల్లా అందరూ ఇక్కడ ఉండి తీరాల్సిందే” అంటూ హుకుం జారీ చేశాడు ఎసిపి ప్రద్యుమ్న.
గిరిధర్ మెదడు తీవ్రమైన ఆలోచనలో పడింది. ‘అజాత శత్రువుగా పేరుగాంచిన మేనేజర్ కు ఈ గతి ఏమిటి? ఈ లెక్కన చూస్తే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేమనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి రెండో జీవితం తప్పకుండా ఉండే ఉంటుంది. ఇలాంటి సమస్య ఏదైనా వచ్చిందంటే అందుకు రెండో జీవితమే కారణం అని నమ్మక తప్పదు’
“హలో మిస్టర్. మీరీ కంపెనీలో ఎంతకాలంగా పనిచేస్తున్నారని మాత్రమే అడిగాను. నా మాటలు వినబడలేదా?” అంటూ గద్దించాడు ఎసిపి.
“సారీ సార్ మనసేమీ బాగాలేదు”
“తెలుసండి. అందరికీ అలానే ఉంటుంది. సిచువేషన్ అలాంటిది. అయినా మా డ్యూటీ మేము చేసి తీరాలి కదా. సమాచారం లేకుండా కేసు సాల్వ్ చేయడం ఎలా? మీరిచ్చే జవాబు మీదే కేసు పురోగతి ఆధారపడి ఉంటుంది. సో ఉన్నది ఉన్నట్టు చెప్పండి” అంటూ గర్జించాడు.
అమ్మాయి కనబడకుండా పోయిన విషయం పోలీసులకు ఎలా చెప్పాలన్నది క్రితం రోజు సాయంత్రం నుంచి అతని మనసులో కొట్టుమిట్టాడుతున్న సందేహం. ఇక్కడ ఎసిపి ప్రద్యుమ్నని చూడగానే మళ్ళీ ఒక్కసారిగా ఆలోచనలకు ఊపిరి వచ్చింది. గిరిధర్ హావభావాలు గమనించిన ఎసిపి “మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేక పోతున్నారు. సమస్య దాచడంవల్ల ఎక్కువవుతుంది కానీ తగ్గదు. కాబట్టి ధైర్యంగా చెప్పండి”
కొద్దిసేపు తటపటాయించి కూతురు కనబడకుండా పోయిన విషయం క్లుప్తంగా చెప్పాడు గిరిధర్. ఎసిపి ముఖ కవళికలు తీవ్రంగా మారాయి.
“ఇంత తీవ్రమైన విషయాన్ని పన్నెండు గంటలైనా ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచారు? ఈలోగా అమ్మాయికి ఏదైనా జరిగుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్ యు నాట్ ద రియల్ పేరెంట్?” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు ఎసిపి.
“ఎవరైనా కిడ్నాప్ చేసిఉంటే ఈ విషయం మీకు తెలిపినందువల్ల వాడు అమ్మాయికి ఏదైనా హాని తలపెడితే అప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అంటూ అంతే తీవ్రంగా అడిగాడు గిరిధర్.
“ఊహలోకంలో ఉండొద్దు మిస్టర్. అలా జరిగేందుకు ఇది సినిమా కాదు. ఇలాంటి కేసులు ఎలా హ్యాండిల్ చేయాలో మాకు బాగా తెలుసు. అమ్మాయి పేరేంటి?”
“చేతన” అన్నాడు గిరిధర్. అంతలోనే తాను వచ్చిన పనేమిటి చేస్తున్నదేమిటి అన్న ఆలోచన వచ్చింది. అక్కడినుంచి బయటపడ్డ ఎసిపి ప్రద్యుమ్న నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళాడు. దేవేంద్ర కుమార్ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది.
అది చూసిన ఎసిపి తికమక పడ్డాడు. అతని శరీరం మీద రెండు మూడు రకాల వేలి ముద్రలు ఉన్నాయి. అందులో రెండు చిన్నపిల్లల చేతి వేలిముద్రలు. ఒకటి మెడ మీద ఉంది. మెడమీద కమిలిన గుర్తు ఉన్నట్టు కూడా రాసి ఉంది. ఒక క్షణం తను చూసినదేమిటో అర్థం చేసుకోలేకపోయాడు ఎసిపి.
‘క్రైమ్ స్పాట్ లో పిల్లల చేతి వేలి ముద్రలు ఎలా సాధ్యం? ఏం జరుగుతోంది? ఆ పిల్లలెవరు?’ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అతను క్రైమ్ స్పాట్ కి వెళ్ళాడు మరోసారి.
అది దేవేంద్ర కుమార్ ఇంటిలోని కార్ షెడ్. అక్కడ పరిసరాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు. అతని కారు షెడ్డు లోపల ఉంది. పరిసరాలన్నీ మరోమారు పరిశీలించి అక్కడినుంచి స్టేషన్ కు బయలుదేరాడు. అప్పుడు సమయం ఉదయం పదకొండు గంటలు. ‘ఆ పిల్లలెవరు? వాళ్ల వేలి ముద్రలు అతని శరీరం మీద ఎలా వచ్చాయి?’ అన్నదే చిక్కు వీడని ప్రశ్నగా మిగిలింది.
వెంటనే స్టేషన్ కు ఫోన్ చేసి వేలిముద్ర నిపుణులను పిలిపించి క్రైమ్ స్పాట్ లోని వేలిముద్రలన్నీ సేకరించమన్నాడు. గ్యారేజ్ గోడమీద ఒకటి రెండుచోట్ల, కారు కిటికీ గ్లాసులపై కూడా చిన్న పిల్లల వేలిముద్రలు కనిపించాయి. వాచ్ మెన్ దగ్గర సేకరించిన సమాచారాన్ని బట్టి దేవేంద్ర కుమార్ కు ఒక కూతురు ఉంది. వెంటనే బయలుదేరి మళ్ళీ దేవేంద్ర కుమార్ ఇంటికి వెళ్ళాడు.
గేట్లోని వాచ్ మెన్ తో “వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది?” అని అడిగాడు.
“రెండు రోజుల క్రితమే అమ్మగారు పాపను తీసుకుని ఊరెళ్ళారు. విషయం చెప్పానండీ. బయలుదేరినట్టు చెప్పారండి. ఇంకాస్సేపటికి వస్తారేమో” అన్నాడు.
తల అడ్డంగా ఊపాడు ఎసిపి. సమస్య మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపించింది.
“అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుంది?” అడిగాడు. స్కూల్ పేరు చెప్పాడు వాచ్మెన్. ఎసిపి వెంటనే ఆ స్కూల్ కి వెళ్ళాడు. అమ్మాయి పేరు చందన. ఆ అమ్మాయి ఏ క్లాస్ లో చదువుతోంది తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు.
హాజరు పట్టిలో ఉన్న పేర్లన్నీ ఒకసారి చూశాడు. చందన తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆ పేరు కిందనే చేతన అని ఉంది. ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించింది.
ఠక్కున గుర్తొచ్చింది. గిరిధర్ తన కూతురు పేరు చేతన అని చెప్పినట్టు గుర్తు. వెంటనే చేతన పేరెంట్స్ ఎవరు అన్నది ఆరా తీశాడు. చేతన డాటర్ ఆఫ్ గిరిధర్ అని ఉన్నది.
తల అడ్డంగా ఊపుతూ ఆ అమ్మాయి పూర్తి వివరాలు తీయమని చెప్పాడు. ఇంటి అడ్రస్ తో సహా ఆధార్ కార్డు వివరాలు కూడా ఇమ్మని అడిగాడు.
అలాగే చందన వివరాలు కూడా తీసుకున్నాడు. ‘చేతన ఇంటి అడ్రస్, గిరిధర్ ఇంటి అడ్రస్ తో సరితూగింది. కాబట్టి కిడ్నాప్ గురైందనుకుంటున్న అమ్మాయి ఈ చేతనే అన్నది నిస్సందేహంగా ఋజువైంది. అంటే చందన, చేతన స్నేహితులై ఉండొచ్చన్నమాట’ అనుకున్నాడు.
వెంటనే అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ చేరుకున్నాడు ఎసిపి. కానిస్టేబుల్ ని పిలిచి ఆ రెండు ఆధార్ నంబర్లు ఇచ్చి వాటి బయోమెట్రిక్ వివరాలు సేకరించమని చెప్పాడు.
వివరాలు రాగానే పోస్టుమార్టం రిపోర్ట్ లో ఉన్న చిన్నపిల్లల వేలి ముద్రల వివరాలతో బయోమెట్రిక్ వేలి ముద్రలు సరిపోల్చాడు. రెండు సరిగ్గా సరిపోయాయి. పోస్టుమార్టం రిపోర్ట్ మరొకమారు చదివాడు. మెడ పైన ఏదో గట్టిగా నులిమిన గుర్తు కూడా ఉన్నట్టు రిపోర్టులో ఉంది. అయితే అది ఏ వస్తువు తెలియ రాలేదు.
బహుశా ఏదైనా కేబుల్ వైర్ ఉండొచ్చు అనిపించింది. ఆ గ్యారేజ్ పరిసరాల్లో పరిశీలించినప్పుడు ఆ ప్రాంతాల్లో ఎక్కడా కేబుల్ వైర్ కనిపించలేదు. మరైతే ఆ గుర్తు ఏమిటో అర్థం కాలేదు.
మార్చురీకి వెళ్ళి బాడీని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించాడు ఎసిపి. ముఖ్యంగా మెడ భాగాన్ని బాగా పరిశీలించి చూడగా ఏదో అర్థమైనట్టు అనిపించి తలపంకించాడు.
***
సాయంత్రం ఐదు గంటలకు దేవేంద్ర కుమార్ ఇంటికి వెళ్ళాడు ఎసిపి. ఆ సమయంలో దేవేంద్ర కుమార్ భార్య మైత్రి ఇంట్లోనే ఉంది. “మేడమ్. మీ అమ్మాయి గురించిన వివరాలు కావాలి” అన్నాడు.
“అమ్మాయి ఇక్కడ లేదు. వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళింది” అన్నది.
“మీ భర్త కేసు విషయంలో మీకెవరిపైనైనా అనుమానం ఉందా?”
తల అడ్డంగా ఊపింది మైత్రి. ఎసిపి కొద్దిసేపు చలనం లేకుండా కూర్చున్నాడు.
తరువాత “ఆల్ రైట్. నాకు మరో ముఖ్యమైన కేసు కూడా ఉంది. నిజానికి నేను ఆ కేసు గురించే మీ ఇంటికి వచ్చాను, ఒక్కసారి మీ అమ్మాయికి ఫోన్ చెయ్యండి” అన్నాడు.
“ఆ కేసుకు మా అమ్మాయికి సంబంధమేమిటి?”
“స్కూల్లో ఒకమ్మాయి నిన్నట్నుంచీ కనబడ్డం లేదని కంప్లెయింట్ వచ్చింది. తను మీ అమ్మాయి క్లాస్ మేట్. అందువల్ల మీ అమ్మాయినడిగితే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనన్న ఒక చిన్న ఆలోచన. అంతే”
మైత్రి సందేహాస్పదంగానే తన కూతురు చందనకు ఫోన్ చేసింది.
ఠక్కున ఆమె చేతినుంచి ఫోన్ లాక్కుని, అవతలివైపునుంచి హలో అని వినబడగానే “హలో అమ్మాయ్. నువ్వెక్కడున్నావిప్పుడు?” అనడిగాడు.
“ఐ డోంట్ నో. ఇక్కడంతా చీకటిగా ఉంది. ఎక్కడున్నానో తెలీదు” అన్నది చందన.
ఫోన్ కట్ చేసి మైత్రి వంక తీక్షణంగా చూశాడు ప్రద్యుమ్న.
వెంటనే స్టేషన్ కు ఫోన్ చేసి “నేనొక నంబరిస్తాను. దాని లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే చెప్పండి” అని చందన నంబరిచ్చాడు. సరిగ్గా ఐదు నిముషాల్లో ఆ లొకేషన్ తెలిసింది.
గోదావరి బ్రిడ్జ్ దాటాక మండపేటకు వెళ్ళే దారిలో ఒక రేకుల షెడ్డును చూపిస్తూంది లొకేషన్. గిరిధర్ కు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి దేవేంద్ర కుమార్ ఇంటికి రమ్మన్నాడు. తరువాత ఇద్దరూ కలిసి ఆ ప్రదేశానికి చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయం. షెడ్డు లోపల అంతా చీకటిగా ఉంది. మొబైల్ టార్చ్ సహాయంతో వెలుతురు వేస్తూ ముందుకు నడిచారు.
కొద్ది దూరం వెళ్ళాక ప్రద్యుమ్న చందన నంబర్ కు రింగ్ చేశాడు. ఎక్కడో అతి దగ్గరలోనే ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. అక్కడ పక్కనే ఉన్న గది తలుపు తోశాడు ప్రద్యుమ్న. లోపల చందన, చేతన ఉన్నారు. నలుగురూ నడుచుకుంటూ షెడ్ బయటికి వచ్చారు. కారు వెనుక సీటులో చందన, చేతన కూర్చున్నారు. ముందు సీట్లో గిరిధర్, ప్రద్యుమ్న కూర్చున్నారు. అందరూ కూర్చున్న తర్వాత ఎసిపి కారును మెల్లగా ముందుకు పోనిస్తూ “చేతనా, దేవేంద్ర అంకుల్ ను ఎందుకు చంపావు?” అని అడిగాడు.
ఆ మాటలకు అదిరిపడ్డ గిరిధర్ “ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలే అమ్మాయి కిడ్నాప్ అయి ఉంటే ఈ పని ఎలా చేస్తుంది?” అంటూ కీచుగా అరిచాడు.
గదినుంచి బయటికి వచ్చినప్పటినుంచి ముభావంగానే ఉన్న చేతన మౌనంగా కారు వెళుతున్న రోడ్డు మీదనే దృష్టి సారిస్తూ ఉంది. కాసేపటికి మెల్లగా “బ్యాడ్ టచ్” అని పలికింది. ఠక్కున వెనక్కు తిరిగి చేతనవంక చూసి సడన్ బ్రేక్ వేశాడు ప్రద్యుమ్న. కారు కీచుమని శబ్దం చేస్తూ రోడ్డు పక్కగా ఆగింది.
***
“అమ్మాయిలూ, ఈరోజు మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్చుకుందాం” అంటూ క్లాస్ టీచర్ క్లాస్ లోని అమ్మాయిలందరికీ వివరించ సాగింది.
చెప్పడం ముగించి “సో, బ్యాడ్ టచ్ ఎవరు చేసినా, సొంత అన్నదమ్ములైనాగానీ వెంటనే మీ అమ్మానాన్నలకు చెప్పాలి. ఒకవేళ నాన్నే అలా చేస్తే వెంటనే అమ్మకు చెప్పాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి” అన్నది క్లాస్ టీచర్.
సాయంత్రం ఇంటికి రాగానే చేతన వాళ్ళమ్మ దగ్గర “అమ్మా, బ్యాడ్ టచ్” అన్నది.
“అంటే ఏమిటే?” అంటూ విసుక్కున్నది గోమతి.
“మన బాడీలో కొన్ని ప్లేసెస్ ను టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్ అని టీచర్ చెప్పింది. కొద్ది రోజులుగా ఒక అంకుల్ నన్ను బ్యాడ్ టచ్ చేస్తున్నాడు” అన్నది చేతన.
అది విన్న గోమతి అదిరిపడింది. “ఎవరా మనిషి?” అని అడిగింది. చేతన చెప్పలేదు.
“చూడు బ్యాట్ టచ్ అంటే ఏమిటో అర్థమైంది కాబట్టి ఇక మీదట ఎవరైనా అలా చేస్తే వెంటనే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలి. లాగిపెట్టి చెంప ఛెళ్ళుమనిపించాలి” అన్నది గోమతి కోపంగా. అలాగే అన్నట్టు తలూపింది చేతన.
“రెండ్రోజులుగా స్కూలు బస్సులో కాకుండా కారులో వస్తున్నావు. ఎవరా అమ్మాయి?”
“ఆ అమ్మాయి నా ఫ్రెండ్ చందన. కొద్ది రోజులనుంచి బస్సు మానేసి తనతోపాటు కార్లో రమ్మని బలవంత పెడుతూంది. అయినా నేనే వద్దన్నాను. ఎందుకో నిన్న, ఇవాళ ఆ అమ్మాయితో కార్లో రావాలనిపించి” అని చెప్పసాగింది.
మధ్యాహ్నం మూడు గంటలకు స్కూల్ వదలగానే చందన చేతన పరుగెత్తుకుంటూ బయటికి వచ్చారు. కారు సిద్ధంగా ఉంది. చందన తండ్రి దేవేంద్ర కుమార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. చేతన వెనక సీట్లో, చందన తండ్రి పక్కన ముందు సీట్లో కూర్చున్నారు. కారు ఇల్లు చేరుకోగానే “చందు, వెళ్లి అమ్మని పిలుచుకురా మనం షాపింగ్ కు వెళ్దాం” అన్నాడు దేవేంద్ర కుమార్. చందన కారు దికి ఇంట్లోకి వెళ్ళసాగింది.
దేవేంద్ర కుమార్ కారు దిగి వెనుక సీట్లోకి వచ్చి చేతన పక్కనే కూర్చుని చేతనను చూసి సన్నగా నవ్వాడు. తర్వాత మెల్లగా ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి ఆ చేతిని మెల్లగా కిందికి వక్షస్థలం మీదికి జార్చాడు.
తొట్రుపడ్డ చేతన “అంకుల్ వాట్ ఇస్ దిస్” అని అరిచింది సన్నగా. ఐనా చేతిని తీయలేదతను.
చేతనకు వెంటనే తల్లి మాటలు గుర్తుకొచ్చి లాగి అతని చెంపమీద చెళ్ళుమని దెబ్బ వేసింది. ఆ దెబ్బ ఇంట్లోకి వెళ్తున్న చందన చెవినబడి చందన ఠక్కున వెనక్కి తిరిగి చూసింది. ముందు సీట్లో ఉండాల్సిన తండ్రి వెనక సీట్లో చేతన పక్కన కూర్చుని ఉండడం చూసి పరుగున కారు దగ్గరికొచ్చింది.
అప్పటికే దేవేంద్ర కుమార్ చేతనను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
చందన “డాడీ” అంటూ అరిచింది కానీ కారు కిటికీ గ్లాసులు మూసి ఉన్నందువల్ల మాటలు వినపడలేదు. చందన కారు తలుపుమీద దబదబ బాదుతూ అరవసాగింది. ఐతే “కామాతురాణాం నభయం న లజ్జ” అన్న చందాన దేవేంద్ర కుమార్ తన కూతురు అరుపులు వినిపించుకోక ఉన్మాదిలా ప్రవర్తించసాగాడు. పైగా చేతన తనను కొట్టిందన్న కోపం అంతకంతకూ ఎక్కువ కాసాగింది.
చందనకు ఏదో ఆలోచన వచ్చినట్టై తన చేతిలోని మొబైల్ ఆన్ చేసి వీడియో తీయసాగింది.
కారు లోపల అతన్ని ప్రతిఘటిస్తున్న చేతన, బటన్ నొక్కి కిటికీ గ్లాసును కిందికి దించి, వెంటనే తలుపు తీసి బయటకు దొర్లింది. ఆ అమ్మాయి వెనకనే దేవేంద్ర కుమార్ కూడా కారు దిగాడు. వెంటనే చేతన మళ్ళీ కార్ లోకి దూరి కారు తలుపు మూసేసింది. అతను కిటికీలోనుంచి చేతనను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే చేతన వెంటనే బటన్ నొక్కి మళ్ళీ కిటికీ గ్లాసును మూసేసింది. అలా మూయడంలో దేవేంద్ర కుమార్ మెడ కిటికీ గ్లాస్ సందులో చిక్కుకుంది. రెండు మూడు నిముషాలు ఊపిరాడక విలవిలలాడిపోయాడు దేవేంద్ర కుమార్. తరువాత అచేతనంగా నిలిచిపోయాడు.
చేతన భయంగా చందన వంక చూస్తూ “చందు మీ నాన్న నన్ను బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్ చేశాడు” అన్నది ఏడుపు గొంతుతో. వెంటనే రెండోవైపు నుంచి కారు దిగేసింది. ఇద్దరూ ఇంట్లోకి పరుగెత్తారు.
“అమ్మా, నాన్న నాన్న” అన్నది లోనికి వెళ్ళగానే చందన తడబడుతూ.
“ఏమైంది నాన్నకు?” అంటూ ఆదుర్దాగా బయటికి వచ్చింది మైత్రి.
కారు దగ్గరకు వచ్చాక కారు వెనకవైపు కిటికీ గ్లాసు మధ్యన దేవేంద్ర కుమార్ తల ఇరుక్కుపోయి ఉండడం చూసి కెవ్వున కేక వేసింది. వెంటనే కార్ లోపలికి వెళ్లి గ్లాసు దించింది. దేవేంద్ర కుమార్ ధబ్బున కింద పడ్డాడు. అప్పటికే అతనిలో చలనం లేదు.
“ఏమైందే ఎవరు చేశారీ పని” అంటూ అరిచింది గట్టిగా.
చందన వణుకుతూ తన మొబైల్ లోని వీడియో తల్లికి చూపించింది. అది చూసిన మైత్రికి నోట మాట రాలేదు. స్థాణువుగా నిలబడింది. కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి. వెంటనే పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్ళింది. పిల్లలను కాపాడాలన్న ఆలోచనతో వాళ్ళను ఇంట్లోకి తీసుకెళ్ళిన మైత్రి ముందుగా తన భర్త శరీరాన్ని అక్కడినుంచి తరలించడం మర్చిపోయింది. ఆమె వెళ్ళగానే బయట షాప్ కు వెళ్లిన వాచ్మెన్ అక్కడికి వచ్చాడు.
అక్కడ అచేతనంగా పడి ఉన్న యజమానిని చూసి కెవ్వును కేక పెట్టి “అమ్మగారూ అమ్మగారూ” అంటూ పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు.
పిల్లలిద్దరిని బయటకు రావద్దని చెప్పి తను మాత్రమే బయటికి వచ్చింది మైత్రి. అప్పటికే వాచ్మెన్ పోలీసులకు ఫోన్ చేసేశాడు. పరిస్థితి అర్థం చేసుకున్న మైత్రి, విషయం బయటకు తెలిస్తే పోయేది తమ పరువేనన్న ఆలోచనతో పోలీసు కంప్లెయింట్ ఇవ్వలేదు.
***
చేతన చెప్పిందంతా విన్న ఎసిపి గిరిధర్ వంక చూశాడు.
“కారు ఎడమవైపు కిటికీ అద్దాలపైన చేతన వేలిముద్రలున్నాయి. అక్కడే దేవేంద్ర బాడీ ఉన్నది. దాంతో నా ఊహ నిజమైంది. ఆత్మరక్షణ కోసం అమ్మాయి అలా చేసిందనుకోవచ్చు. ఆయుధాలేవీ ఉపయోగించ లేదు. సో ఇటీజ్ ఎన్ ఏక్సిడెంట్, లేదా ఆత్మరక్షణ. అంతే. దేవేంద్ర వైఫ్ కంప్లెయింట్ ఇవ్వనంతవరకూ మీ అమ్మాయికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఇది తెలియక చేసిన తప్పైనా ఆత్మరక్షణ కోసం చేసినందని నిరూపించేవరకూ కొన్నాళ్ళు కస్టడీలో ఉంచి రిలీజ్ చేస్తాం. మీ అమ్మాయి గురించి దిగులు పడొద్దు” అన్నాడు ప్రద్యుమ్న. గిరిధర్ స్తబ్దుగా ఉండిపోయాడు.
“ఈ స్పర్శ, ఎ బ్యాడ్ టచ్” అంటూ సన్నగా నవ్వుతూ గొణుక్కున్నాడు ప్రద్యుమ్న.
