[శ్రీమతి ఎన్. లహరి గారి ‘స్పర్శలేని శిల’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి చంద్రకళ దీకొండ.]
తన నిశితదృష్టి గల అక్షర నేత్రాలు తెరచి విశాలమైన ఆలోచనల నానీల తీరాన విహరిస్తూ స్పర్శలేని శిలను తాకిన అంతరంగపు భావలహరి ఈ కవితా సంపుటి!
60 కవితలున్న ఈ కవితాసంపుటిలో స్త్రీ గురించిన కవితలు సింహభాగం ఆక్రమించటం సహజమే! ఓ స్త్రీగా తన భావాలను, అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను స్త్రీ జాతికి అన్వయిస్తూ, ఊరడిస్తూ, చైతన్యపరుస్తూ వ్రాసిన కవితలలో మచ్చుకు కొన్ని..
ఈ కవితలలో ప్రముఖ మహిళా పత్రికలైన భూమిక, నెచ్చెలి వంటి పత్రికలలో ప్రచురితమైన కవితలున్నాయి.
“ఒకప్పుడు నాలుగు గోడలకు పరిమితమైన ఆమె/అంతులేని ఆకాశంలో రేయింబవళ్లు వెలుగుదివ్వై ప్రకాశిస్తోంది!”
“కాలికింద మట్టిలా నలిగిన కాలం నుండి /కాళికళా, కనకదుర్గలా/వివక్షపై కదం తొక్కి కత్తుల్ని దూసింది.
విభిన్న రంగాల్లోనూ ధీరగా/సకల కళల్లో సాటిలేని మేటిగా/నిరాదరించిన చేతులతోనే ఘనంగా సత్కరించబడుతోంది!”
“నీ స్ఫూర్తికి..,నీ కీర్తికి../ నీ ధైర్యానికి.., నీ స్థైర్యానికి../ ఓ మహిళామణీ! వందనం! అభివందనం!!/ నీ తెగువ భావి తరాల భవితకు వెలుగు దివ్వె!” అంటూ మొదటి కవితలో మహిళ పరిణామక్రమాన్ని వివరిస్తూ,ఆమె విశిష్ట గుణాలకు నీరాజనం పట్టారు.
~
“చెట్టుకు చీర చుట్టినా చొంగ కార్చే కామాంధులకు ఇక్కడ కొదువ లేదు./హార్దికాలన్నీ ఆర్థికాలై పరిహసిస్తున్నై/బలికాకముందే నిద్ర లేవాలి/చైతన్యమే సాహసంగా ముందడుగు వెయ్యాలి” అంటూ స్త్రీలను చైతన్యపరుస్తూ వ్రాసారు ‘మది తడిపిన వేదన’ కవితలో.
~
“తరాలు మారినయ్
ఆమె తలరాత మాత్రం మారలే!”
“మదమెక్కిన మగజాతి అహానికి
సమిధలా మారి ఆరిపోతోంది.”
“వస్తువుగా మారి తనను తాను
అమ్మకానికి ఉంచి, కొనేవారిపై
పెత్తనం చెలాయిస్తున్న పురుష పుంగవుడు!”
“కొడుకైతే ప్లస్సు, కూతురైతే మైనస్సు
ఇదే కదా బాల్యం నుండి పసి మెదళ్ళలో
మనం నాటిన విషబీజం
అది పెరిగి పెద్దయ్యాక
తియ్యని ఫలాలనిస్తుందా?
పురుగు పట్టిన కాయలే కాస్తుంది!”
అంటూ వరకట్నపు విషబీజానికి కారణం మనమే (సమాజం)నంటూ తేల్చి చెప్పారు.
~
నువ్వు ఎదిగే క్రమంలో/గుంటనక్కలు ఈలలేస్తూ ఎంటవడతై/చిత్తకార్తె కుక్కలు చొంగ కార్చుతూ అదునుకై వేచి చూస్తై/ఇగో.. ఎదురుతిరిగే స్ఫూర్తిని నూరి పోస్తున్నా!/ధైర్యమనే రాయిని చేతికిస్తున్నా/ రక్షక భటురాలివై మగువలను భక్షించగ జూసిన దుష్టులను శిక్షించు!” అంటూ నమ్ముకున్న పెనిమిటి నడిబజార్ల ఇడిశిపోతే తన కూతురికి ఈ సమాజంలో చరించే క్రమంలో జాగ్రత్తలను చెపుతూ,ధైర్యం నూరిపోసే స్ఫూర్తివంతమైన తల్లి పాత్రను చూపారు ‘తంగేడు పూలు’ కవితలో.
~
“పొద్దున్నే సూర్యుడిని చీపురుతో నిద్రలేపుతుంది/గడియారంతో పరిగెడుతూ/పరివారం కోసం పరితపిస్తుంటుంది
అంతుచిక్కని రహస్యాలెన్నో మదిని తొలుస్తున్నా/మనసులో నక్షత్రాల్లా/ మమ్మల్ని పొదవుకునే అంతరిక్షం
ఆమె నవ్వితే/మా ఇంట్లో పూలతోటలు విరబూస్తాయి/ఆమె అలిగితే/ఇల్లంతా అంధకారం అలుముకుంటుంది ఇంటిల్లిపాదికీ పట్టుగొమ్మ అమ్మ”
అంటూ కుటుంబంలో అమ్మ పాత్రను ఆమె మమ్మల్నందరినీ పిల్ల కాలువల్లా కలిపేసుకుంటూ/కుటుంబ ప్రవాహమై ఉరకలెత్తే మహానది గా అభివర్ణిస్తూ కళ్ళకు కట్టారు ‘ఆమె ఓ జీవనది’ కవితలో.
~
“తోడుకి ఆడది కావాలి కానీ,/నీ మూలాలతో జన్మించే ఆడపిల్ల వద్దా?/ కడుపులోనే పిండాన్ని చిదిమేస్తే/ మానవ సృష్టికి మూలమెక్కడ?/ ఈ అవనిలో అభివృద్దెక్కడ?” అంటూ భ్రూణహత్యల పట్ల ఆవేదనతో, ఆక్రోశంతో ప్రశ్నిస్తూ, “మనిషికి జన్మనిచ్చే/ఆడజాతి మనుగడకే/జన్మ లేకుండా చేస్తే/ఈ భూమిపై మానవజాతికి/నూకలు చెల్లిపోవూ!” అంటూ తదనంతర పరిణామాలను చాటారు ‘ఆమె లేనిదే అవని లేదు’ అనే కవితలో.
~
“కామాంధులు కారణాలు వెతుక్కుని/ఘోరాలకు చేతులు చాస్తుంటారు/ఏకాంతంలోనూ తలచుకోలేని/అసభ్యకర మాటలు హృదయాన్ని తూటాల్లా చీలుస్తాయి” అంటూ ఆధునిక ‘దుశ్శాసస పర్వం’లో అబలలు పడే అగచాట్లను ఏకరువు పెడుతూ.. “స్వప్నలోకంలో విహరిస్తూ/కన్నీటికి అర్థం వెతుకుతూ ఉండాలి/చివరికి నీకు నువ్వేమవుతావనే ప్రశ్న చితి మంటలా జ్వలిస్తుంది” అంటూ వారి నిస్సహాయ స్థితిని తేల్చి చూపారు.
~
“ఒక అమ్మనై ఆలినై/అక్కనై బిడ్డనై స్త్రీమూర్తినై/పంచభూతాలు మిళితమైన/మగువనై నిగ్గదీస్తున్నా” అని స్త్రీలందరి పక్షాన నిలబడి పురుషుల నైజాన్ని నిలదీసారు ‘నిజం చెప్పగలవా!’ కవితలో.
~
“నొప్పులతో ఆపసోపాలు పడుతుంటే/నీచమైన మాటలతో/ఆడతనానికి అపవాదు తెచ్చే” నర్సుల వైఖరిని నిరసిస్తూ విద్య, వైద్యంలో తరాలైనా మారని తీరును తల్లిగా, చెల్లిగా, భార్యగా/ ఇప్పుడు ఒక స్త్రీగా కూడా/సమాజం ముందు ఓడిపోతుంటే అంతరాత్మను మనోజ్వాలతో కాల్చుకుంటూ నిత్యం దగ్ధమవుతున్న సగటు స్త్రీ ల ‘మనోజ్వాల’ను చిత్రిక పట్టారు.
~
శ్రమదోపిడీ/చేసినంత సులువు కాదు/చెమటోడ్చి పనిచేయడం/మాంసపుముద్దతో తయారైన/స్త్రీ హృదయాన్ని గెలవడం అంత సులువేమీ కాదు” అంటూ మాటతో మనసుకు ముల్లు గుచ్చే స్నేహితుడికి స్త్రీల పట్ల గల చిన్నచూపును గర్హిస్తూ..
“స్త్రీ అంటే శిల కాదు/నీ గోళ్ళతో చెక్కడానికి/శిరస్సు వొంచి దండం పెడితే/కనీసం మరుజన్మలోనైనా/ఓ అమ్మకు మంచి బిడ్డగా పుడతావేమో” అని స్త్రీ గొప్పతనాన్ని చాటారు ‘శిల కాదు శిరసు వంచు’ కవితలో.
~
“కదిలితే కల్లోలం/హద్దు దాటితే ఉపద్రవం/అయినా నిండుకుండై/గుమ్మనంగా ఉంటుంది/ అచ్చంగా ఆమె సంద్రమే” అంటూ సముద్రం కవితలో ఆమె ను ప్రతీకగా చూపారు.
~
బహుమతి పొందిన ‘రక్కసిమూక రగిల్చిన కాష్టం’ కవితలో “మొన్న నిర్భయ, నిన్న దిశ/నేడు సాక్షి,మౌమితా/ఇలా పేర్లయితే మారుతున్నాయి కానీ/వాళ్ళ తలరాతలు మాత్రం/ఎప్పటికీ మారడం లేదు” అంటూ విద్యాధికులైన మహిళలపై సైతం జరుగుతున్న అత్యాచారాల గురించి వేదన పడుతూ…
“మదమెక్కిన కామంతో/ఘాతుకానికి పాల్పడిన/గాడిద నా కొడుకులను/నడిరోడ్డు మీద గుడ్డలూడదీసి/జననాంగాలను కత్తిరించండి” అంటూ ఆక్రోశంతో, ఆవేదనతో విరుచుకుపడ్డారు.
~
“నీ ఎడబాటులో కలిగిన/శోకం తాలూకు కన్నీళ్లన్నీ ఒలికిపోయి/అమ్మ గుండె బరువైనప్పుడు/పసిముద్దగా నువ్వు/కడుపులో తన్నిన జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది/అమ్మ కోసమైనా ఒకసారి రాలేవా కన్నా నీ తలపు/బాధపెడుతున్నా/మన ఇంటి తలుపులు తెరిచే పడుకుంటున్నాము/ఏనాటి వేకువలోనైనా నువ్వు/మన ఇంటి ముంగిట నవ్వుతూ కనిపిస్తావేమోనని ఆరిపోతున్న మా గుండె తలపుల్లో/ఊపిరికు కాసింత చమురు పోస్తావేమోనని/ఎదురుచూస్తున్న మీ అమ్మానాన్న” అంటూ విమాన ప్రమాదంలో చనిపోయిన పిల్లాడి శవం దొరకక, ఎప్పటికైనా తిరిగి వస్తాడని 38 సంవత్సరాలుగా ఎదురుచూసే తల్లిదండ్రుల గుండె బరువును అద్దంలా చూపారు. అందుకే ‘అంతులేని వేదన’ కవిత ఎక్స్ రే-2024 కవితలపోటీలో ఉత్తమ కవిత గా నిలిచింది.
~
“కన్నీటి చుక్కలకు/ఆఖరిగీతం పాడేందుకు/తన సిరా చుక్కలతో/కోటి మెదళ్లను కదిలించిన కౌముది/ ప్రజల గోడును తన గొడవగా/ఎలుగెత్తి నినదించిన/కవన ప్రజా యుద్ధనౌక” అంటూ కాళోజీ పై వ్రాసిన కవితకు కూడా బహుమతిని పొందారు.
~
“రాళ్లు నిండిన రహదారులు/పడేసి పరిగెత్తమనే కాలం/దారికి ఇరువైపులా నిలబడి/పగలబడి నవ్వే స్వార్థాల మధ్య/ జీవితాన్ని సవ్యంగా నడిపించడమే నేర్పు/ చోటేదైనా, స్థితి ఏదైనా/నేర్పుతో నేర్పగలిగితే/లోకం సుభిక్షంగా విలసిల్లుతుంది” అంటూ వ్రాసిన భావాక్షర కూర్పు ‘సృష్టికి మూలం నేర్పు’ కవిత జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతిని సాధించింది.
~
“చిటారు చిగురు కొమ్మలా నువ్విరిగిపోతే/అవిసిపోయిన మా గుండెలు/ఎండమావులుగా మారిపోయాయి” అంటూ అవసాన దశలోనున్న వృద్ధ తల్లిదండ్రుల ‘ఎదురు చూపుల’ను ఆర్ద్రతతో వర్ణించిన కవిత కూడా పోటీలో ఉత్తమంగా నిలిచింది.
~
తెలంగాణ యాస భాషలో “ఒక్కో అక్షరాన్ని అల్కగా/నాల్క మీద పల్కుతుంటే/శెలిమలపొంటి/శెక్కర గారినట్టుండేది/అంచులు అమ్మ పిలుపులా/నోట్లె కమ్మని ఊటలైతే/హల్లులు పూ జల్లులై/తనువును (ఇక్కడ పెయిని అంటే బాగుండేది) తడిపేవి/ అబ్బా.. సెప్పుకుంట పో(వో)తే/మట్టి పలక మీద రుద్దిన/లేత దోసాకు పసరు లెక్క/కమ్మటి పసితనపు వాసనలెన్నో/వర్ణమాల కనపడితే/గుండె సింగిడి రంగులు పులుముకుం టది/తెలుగు పజ్జెం ఇనవడితే/కండ్లు నెమలి కండ్లై ఇచ్చుకుంటై/ వొక్కెక్కం వొక్కటి అప్పజెప్పితే/తనువు తంగెడుపూలు పూసేది/ కాలం కాలనాగయినప్పుడు/కవిత్వమై కండ్లు తుడుస్తోంది/బాల్యం యాదికొచ్చినప్పుడల్లా/బడికి దండం బెట్టబుద్దైతది/పంతుళ్లకు పబ్బతి పట్టి/పానం ముడుపు కట్టాలనిపిస్తది” అంటూ తన బాల్య జ్ఞాపకాలను నెమరువేస్తూనే, భాష గొప్పతనాన్ని వివరించిన అచ్చరదీపం కవిత ఈ సంపుటిలో ప్రత్యేకంగా నిలిచింది.
~
ఇవే కాక సేద్యంతో యుద్ధం, ఆకుపచ్చని వస్త్రం అంటూ రైతుల గురించి.. నిషా పర్వం, ఓటు అమ్ముకోకు (సామాజిక చైతన్యం), ప్రగతిదారిలో, వర్ణాలు మరినప్పుడల్లా, అక్షర దండయాత్ర (రాజకీయాలు) అంతే అంతే (పర్యావరణం), ఎగిరే దివ్వెలు, విగత జీవుల మధ్య (మానవత్వం), మాట మరిచిన అరుగు, ఊరు మారింది, జ్ఞాపకాలను వెదుక్కుంటూ (పల్లెటూరు), కొత్త జ్యోతుల వెలుగు కోసం, నిర్వాసితులు, మిణుగురులు వంటి అనాథలపై, బాలకార్మికులపై వ్రాసిన కవితలున్నాయి.
అంతర్మథనం సాక్షిగా, విలోమదృశ్యం, శిశిరదేహం, విరామ సమయం, ఉప్పెనలోంచి ప్రవాహంగా వంటి అంతరంగ లోతుల్లోంచి పెల్లుబికిన లోతైన భావ సాంద్రత కలిగిన కవితలు కూడా ఉన్నాయి.
దేశభక్తిని స్పృశించిన వెలుగు దివిటీలు, దాస్య విముక్తి వంటి కవితలూ ఉన్నాయి. సైబర్ మోసం అంటూ సాంకేతికత పట్ల జాగ్రత్తలనూ తెలిపారు.
ఎగసిపడే కెరటాన్నై, నవ వసంతం కవితల్లో ఆశావాదం తొంగిచూస్తుంది.
“సహనంలో భూదేవికి కూడా/నువ్వొక మార్గదర్శివి/మన ఇంటి సామ్రాజ్యానికి/మకుటం లేని చకర్సవర్తివి/నా పతివి/నాకు ప్రత్యక్ష దైవానివి” అంటూ తన శ్రీవారి పుట్టినరోజు సందర్భంగా ఆయనపై శుభాకాంక్షల అక్షర కుసుమాలను కురిపించారు.
ఇక చివరగా.. కవితా సంపుటికి మకుటాయమానమైన ‘స్పర్శ లేని శిల’ కవితలో “తీరాన్ని చూస్తూ ఊహలు/ఊహల్ని మోస్తూ ఆశలు/ఆశల్ని భరిస్తూ భయాలు/అనేక స్పందనల కూడలిగా/నాలో నేనే ఒంటరిగా శిలా దేహమో.. శిశిర వృక్షమో” అంటూ తన అంతరంగ అలజడిని రవంత తాత్వికతను మేళవించి రచించారు.
మొత్తం మీద సమాజంలోని వివిధ, విభిన్న సమస్యలపై స్పందించే తరుణంలో వెలువడిన పలు భావాల, అభిప్రాయాల, ఆలోచనల, సంఘర్షణల అంతరంగ భావలహరి ఈ కవితా సంపుటి!
***
రచన: ఎన్. లహరి
ప్రచురణ: అవనీష్ అండ్ సాకేత్ ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 120
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
కవయిత్రి:
ఈమెయిల్: nlahari@gmail.com
చరవాణి: 9885535506
చంద్రకళ దీకొండ గారు విశ్రాంత ఉపాధ్యాయిని. రచనా వ్యాసంగం వారి ప్రవృత్తి. కవితలు, వ్యాసాలు, గేయాలు పేరడీ వంటి ప్రక్రియల్లో ముందుకు సాగుతున్నారు. వీరి కవితలు పలు ప్రింట్, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. పలు రేడియో ఎఫ్.ఎమ్. ఛానెల్స్‌లో ప్రసారమయ్యాయి. సున్నిత చంద్రికలు అనే లఘు కవితాసంపుటి, సాహితీచంద్రికలు అనే శత వచనకవితా సంపుటి, కవితా చంద్రికలు అనే వచనకవితల సంపుటి వెలువరించారు. నవభారత్ నిర్మాణ సంఘం వారి సాహితీరత్న పురస్కారం, తపస్వీ మనోహరం వారి రైటర్ ఆఫ్ ది ఇయర్ 2021-2022 పురస్కారం, విశ్వ సాహితీ కళావేదిక వారి కీర్తి పురస్కారం పొందారు. పలు కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. తమ కవితలకు అనేక బహుమతులు పొందారు.
