Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథకుడు, సంపాదకుడు అఫ్సర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘యుద్ధం మధ్యలో నువ్వు’ అనే కవితా సంపుటి వెలువరించిన అఫ్సర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం అఫ్సర్ గారూ.

అఫ్సర్: నమస్కారం.

~

ప్రశ్న1: ‘యుద్ధం మధ్యలో నువ్వు’ కవితా సంపుటి వెలువరించినందుకు అభినందనలు. ఇది మీ ఎన్నో కవితా సంపుటి?

జవాబు: థాంక్ యు! ‘యుద్ధం మధ్యలో నువ్వు’ ఆరో కవిత్వ సంపుటి.

ప్రశ్న 2: “దీనికి ముందటి కవిత్వ సంపుటి ‘ఇంటివైపు’లో ఇంటికి వెళ్ళే తీరాలన్న కాంక్ష బలంగా కనిపిస్తే, యిందులో ఎక్కడికీ వెళ్ళలేని అశక్తతని చెప్పాలని ప్రయత్నం” అని అన్నారు. మరింత వివరిస్తారా?

జవాబు: ‘ఇంటివైపు’లో తాత్విక ఛాయలు ఎక్కువగా వుంటాయి. ఇల్లు అనేది ఒక ప్రతీక మాత్రమే. ఇంటికి మళ్లాలన్న ఆలోచనలో పునాదులవైపు వెళ్లాలన్న తీవ్రత వుంది. అయితే, ఆ తాత్వికతలో ఉద్వేగమే ఎక్కువ. ‘యుద్ధం మధ్యలో నువ్వు’ గత అయిదారేళ్ళ సామాజిక – వ్యక్తిగత సంఘర్షణలకి ప్రతిబింబం. ఈ స్థితిలో మనిషికి వెసులుబాటు లేదు. వున్నచోటే వుండిపోయే స్థితిలోనో, ఎక్కడికీ వెళ్లలేని స్థితిలోనో కూరుకుపోయాడు. తాత్విక ఛాయల కంటే ఎక్కువగా ఈ సంఘర్షణల్ని భిన్న కోణాల నుంచి చెప్పే ప్రయత్నం ‘యుద్ధం మధ్యలో నువ్వు’. ఈ రెండు పుస్తకాల శీర్షికలోనే మనకి ఈ వ్యత్యాసం కనిపిస్తుంది.

ప్రశ్న 3: ఈ సంపుటిలోని కవితలని/వచనాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించడం వెనుక ఆలోచనని వివరిస్తారా? ఇది మీరు చేశారా? ప్రచురణకర్తల ఆలోచనా? ఆయా కవితలని ఆయా విభాగాలలోకి ఎంచుకోడంలో ఏదైనా ప్రత్యేకమైన రీజనింగ్ ఉందా?

జవాబు: ఈ వర్గీకరణ ఒక ప్రయాణ సంకేతం. మూడు భిన్న దశలకి మార్కర్. మొదటి భాగం: ‘కత్తి అంచు మీద నిలబడి’- కేవలం ప్రస్తుత స్థితిని ప్రతిబింబించే కవితలు. రెండో భాగం: ‘ఆరు కాలాలూ మాయమైన చోట’, కోవిడ్ సమయంలోని మనోసంచలనాలు, మూడో భాగం: ‘పంజరాల్ని వోడించినప్పుడు’, ఆ మొదటి రెండు భాగాల్లో వర్ణించిన దశల్ని దాటుకొని వెళ్ళే పరిష్కార మార్గం. అయితే, ఇవేమీ కచ్చితమైన వర్గీకరణలు కావు, ఈ మూడు భిన్నమైన దశల్లో overlap వుంటుంది. అలాగే, కవిత్వ వ్యక్తీకరణలు కూడా కలగలిసే వుంటాయి. కానీ, వాటి భిన్నత్వాన్ని చెప్పుకోడానికి ఈ వర్గీకరణ అవసరం అనుకున్నా.

ప్రశ్న 4: కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఈ సంపుటిలో వస్తువే ప్రధానమైనట్టు అనిపిస్తోంది. వివరిస్తారా?

జవాబు: ప్రతి కవితలో మీరు చెప్పిన మూడు అంశాలూ కలిసే వుంటాయి. వీటిల్లో ఏ వొక్కటి లోపించినా కవిత అసంపూర్ణంగా అనిపిస్తుంది. నా మటుకు నాకు ఏ కవితయినా వస్తువు నుంచి మొదలవుతుంది. అంటే, ఒక మనఃస్థితి గురించి చెప్పడం. ఎలా చెప్పడం, దానికి ఎలాంటి లయ అన్నదీ తరవాత వచ్చే విషయాలు. అవి ఒకదాన్ని ఒకటి follow అవుతాయి. వాటికి కొన్నిసార్లు ఒక క్రమం వుండకపోవచ్చు. కానీ, వస్తువు కేంద్రంగా మసులుకోవడం మాత్రం సాధారణ లక్షణం అనుకుంటా.

ప్రశ్న 5: సాధారణంగా కవితలకుండే నిర్మాణశైలిని (స్ట్రక్చర్) కొన్ని కవితల్లో ఉపేక్షించి పూర్తి వచనంలానే వ్రాశారు. ఎందుకని? మనసులోని వేదనలనీ, భావతీవ్రతని విప్పి చెప్పే క్రమంలో ప్రతీక లాంటి పదం కన్నా సరళ వచనం మరింత ప్రభావం చూపుతుందని అనుకున్నారా?

జవాబు: చాలా మంచి పరిశీలన చేశారు. కవిత్వ నిర్మాణానికి ముందే నిర్దేశితమైన ఒక చట్రం వుంది. అది పాద విభజన కావచ్చు. కవిత్వానికి మాత్రమే ప్రత్యేకించిన ప్రతీకలూ, పదచిత్రాలూ కావచ్చు. ఒక భావతీవ్రత మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు అవి అంతగా తృప్తినివ్వవు. ఆ చట్రాన్ని బ్రేక్ చేయాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు వచనం ఒక రకమైన శిల్ప యుద్ధ ప్రకటన. మొదట్లో దీన్ని నేను paragraphics అనే పేరుతో రాశాను. అంటే, పేరాలుగా రాయడం – వాటికి ఒక కొనసాగింపుని వెతుక్కోవడం – ఈ రూప ప్రక్రియలో ముఖ్యం. ఈ వచనం సరళం కావచ్చు, సంక్లిష్టం కావచ్చు. అది కవిత్వానికి భిన్నమైన రూప స్థితి. పైగా, నేను వచనం నుంచి వచ్చిన వాణ్ని కాబట్టి ఆ వచన ప్రేమ ఎలాగూ వుంటుంది కదా!

ప్రశ్న 6: ‘మబ్బు లోంచి చినుకులోకి..’ కవిత చదివినప్పుడు ఓ అద్భుతమైన ప్రాకృతిక దృశ్యం కళ్ళకు కడుతుంది. ఈ కవిత రాయడానికి నేపథ్యమేమిటో వివరిస్తారా?

జవాబు: ప్రకృతి ఎప్పుడూ నాకు ఒక నేపథ్యమే. మబ్బులూ, చినుకులూ, చెట్లూ, చేమలూ, కొండలూ- వాటి సహజత్వంలోకి వెళ్ళడం నాకు ఇష్టం. అయితే, అక్కడితోనే అవి ఆగవు. జీవితానికి సంబంధించిన ఏదో తాత్విక ఛాయని అవి చూపిస్తాయి. ఇది Objective correlative అనే నిర్మాణ పద్ధతి. అయితే ప్రకృతిని కేవలం object గా చూడలేను. మీరు ఉదహరించిన కవితలో మబ్బు నుంచి చినుకులోకి మళ్లడం ఒక మార్పుని సూచిస్తుంది. ఆ మార్పు కోసమే మన వెతుకులాట. మబ్బులతో మనిషి సంభాషణ అనాది కాలం నాటిది, అనంతం కూడా! ఆ భావనని చెప్పే ప్రయత్నమే ఈ కవిత.

ప్రశ్న 7: “పొద్దుటి కాఫీ కప్పు నించి చీకట్లో వాలే కన్ను దాకా ఎన్ని పులకరింతలు మిగిలాయా అని ప్రశాంతమైన నిద్రలోకి బాణం దూసుకెళ్తుంది” అని ‘ఇప్పుడు కనిపించేదే..’ కవితలో రాశారు. జీవితంలో ఒత్తిడుల వల్లో లేక అందుకోలేని వాటిని అందుకునే ప్రయత్నంలో బహుశా – క్షణకాలపు చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం కరువువతోందని అంటున్నారని అర్థమయింది. “నిద్రలోకి బాణం దూసుకెళ్తుంది” అన్న దాంట్లో ‘బాణం’ ప్రశ్నకి ప్రతీకా? సాధారణంగా పాఠకులు ప్రతీకాత్మక పదాలకి తమకి తోచిన భావాన్ని అన్వయించుకుంటారు! కవి అనుకున్న భావమే పాఠకుడికీ చేరితే ఆ కవిత మరిన్ని హృదయాలను చేరుతుందన్నది అనుభవమే కదా! ఏమంటారు?

జవాబు: అవును, మీరన్నది నిజం. బాణం ప్రశ్నకి ప్రతీకే! ప్రశాంతమైన నిద్రని అందరూ కోరుకుంటారు. కానీ, అదీ దుర్లభం చేస్తుంది జీవితం. ఈ సంపుటిలో అనేక కవితల్లో ఇదే ప్రతీక పునరుక్తి అవుతుంది. సందర్భాన్ని బట్టి తలెత్తే ప్రశ్నలకు అది ప్రతీక. ప్రతీ బాణం మన ప్రశాంతమైన నిద్రకి గురిపెట్టిన అశాంతితో కూడిన ప్రశ్నే.

ప్రశ్న 8: చాలా కవితలలో అంతర్లీనంగా ఒక వేదన.. చిన్న పెయిన్ క్యారీ అయింది. భావుకత నిండిన కవితల్లో కూడా ప్రకృతినో, ఒక ఘటనలో ఆర్ద్రంగా చెబుతున్నా.. లోతుగా చూస్తే దేన్నో కోల్పోతున్న వ్యథ గోచరిస్తుంది. స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, బంధాలలో ఒదగని ఆత్మీయత కావచ్చు. ఆయా అనుభవాల సాంద్రతను పలచన చేయకుండా సరళమైన పదాలలో అనుభూతిని చదువరులలో కలిగించడంలో కవిగా మీ అనుభవం స్పష్టం అవుతుంది. దీని పట్ల మీ స్పందన?

జవాబు: అందరం ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే వున్న జీవితం ఇది. ప్రతి కవీ ఏదో ఒక సందర్భంలో ఆ చేదు వాస్తవికతనే చెప్తాడు. దానికి భిన్నంగా, పోగొట్టుకున్నది మళ్ళీ దక్కించుకోవడం ఎలాగో చెప్పడం ఈ సంపుటిలో కనిపిస్తుంది. అది వ్యక్తిగత ఆత్మీయతలు కావచ్చు, లేదా సామాజిక అశాంతి కావచ్చు. ఈ కవిత్వాన్ని ఉపరితలంగా చూసినా అది తెలుస్తూనే వుంటుంది.

ప్రశ్న 9: చాలా కవితల్లో ఆకాశాన్ని కాన్వాసుగా వాడుకున్నారు. ఆకాశమంటే మీకెందుకంత ఇష్టం? మీ దృష్టిలో ఆకాశమంటే ఏమిటి? ఎలా నిర్వచిస్తారు?

జవాబు: ఆకాశం ఒక సుదూర లక్ష్యం. మనం అందుకోలేని దూరాలకి కొండగుర్తు. చిన్నప్పటి నుంచీ ఆకాశంలోని భిన్నత్వాన్ని చూడడం అంటే మహా ఇష్టం. దీనికి సంబంధించిన వివిధ కోణాలు నా కవిత్వంలోనే కాదు, వచనంలో కూడా విస్తారంగా చూడవచ్చు. కొన్ని కవితల్లో ఆకాశాన్ని నా వైపు నించే కాకుండా, ఇతరుల కోణం నుంచి కూడా చూస్తాను. ఇద్దరికీ అదే ఆకాశం కావాలి కదా!.

పుస్తకానికి ముఖచిత్రం అందించిన శ్రీ తెప్పాల శ్రీనివాస్ గారితో అఫ్సర్

ప్రశ్న 10: ‘అనేక యుద్ధ కాలాల తరువాత’ కవితలో “వొక్క మాట కురిసిందా/మనసంతా విరగ్గాసిన/పంట చేను” అనేవి అద్భుతమైన వ్యక్తీకరణలు. స్నేహమో/ప్రేమో/ఆత్మీయతో వెల్లివిరవాల్సిన చోట మాటలు ఎంత కీలకమో ఈ కవిత చెప్పకనే చెబుతోంది. ఈ కవిత అల్లిన నేపథ్యం వివరిస్తారా?

జవాబు: చాలా సార్లు ఇది కోవిడ్ తరవాతి కవితేమో అనిపిస్తుంది. కానీ, కాదు. అంతకుముందు నించే మాటలు లేని నిస్సహాయ స్థితి గురించి మాట్లాడడం అనేక చోట్ల కనిపిస్తుంది. బహుశా, ‘రక్తస్పర్శ’ (1980)ల కాలం నుంచే ఈ స్థితి ప్రముఖంగా వ్యక్తమవుతూ వచ్చింది. మాటకి అనేక పార్శ్వాలు వుంటాయి కదా, అవన్నీ explore చేయాలనే తపన మొదటి నించీ వుంది. కోవిడ్ తరవాత దీనికొక భౌతికమైన కారణం కూడా దొరికింది. ఈ సంపుటిలో రెండో భాగంలో మీకు కనిపించే కవితలన్నీ ఏదో ఒక విధంగా – మాట – ని ప్రస్తావిస్తాయి. ఇప్పుడు మీరు ప్రస్తావించిన కవిత నేపథ్యం కూడా కచ్చితంగా అదే.

ప్రశ్న 11: ‘An Alphabet of Breathing’ కవితలో వర్ణవివక్షపై నిరసనని వ్యక్తం చేశారు. ఈ కవిత నిర్మాణ శైలి విభిన్నంగా ఉంది. దీనిని ఉద్విగ్నత నిండిన వచనాత్మక కవిత అనవచ్చా లేక అనంగీకారాన్ని ప్రస్ఫుటించే కవితాత్మక వచనం అనచ్చా?

జవాబు: ఈ కవిత తీవ్రమైన భావోద్వేగంలోంచి బయటపడలేక రాశాను. కవిత నిర్మాణంలో మీకు కనిపించే విభిన్నత్వం ఆ ఉద్వేగాన్ని రికార్డు చేయడం వరకే! అమెరికాలోని ఆఫ్రికన్ సంగీతంలో రాప్ దాదాపు mainstream గా మారింది. ఇందులో కవిత్వమూ, వచనమూ కలగల్సి వుంటాయి. ఆ రాప్ లో వుండే ఉద్వేగమే ఈ కవితకి శిల్పంగా మారింది. నిజానికి రాప్‌లో వుండే వేగం అందుకోవడం తెలుగు వాక్యాలకు సాధ్యపడదు. మన భాష అందుకు అనువైంది కాదని చాలా సార్లు అనిపిస్తుంది. ఆ పరిమితిని దాటుకుంటూ భాషా సంకెళ్లని తెగదెంచే ప్రయత్నం వల్ల ఇది మీకు కవితాత్మక వచనంగానో, వచనాత్మక కవిత్వంగానో కనిపించి వుండవచ్చు. ఈ విధమైన నిర్మాణ ప్రయోగాలు ఇంకా కొన్ని జరిగితే తప్ప దాన్ని ఒక లక్షణంగా నిర్వచించే వీలు దొరకదు. అంటే, దానికి కావలసిన గ్రామర్ దొరకదు.

ప్రశ్న 12: తనని తాను జయించేలా మనిషిని జీవితంలో విజయం దిశగా సాగేలా ప్రేరణనిచ్చే కవితకు ‘Failure Story’ అని పేరు పెట్టడంలో మీ ఆంతర్యం ఏమిటి? ఆ శీర్షికకి ఏదైనా అంతరార్థం ఉందా? ఎందుకంటే, “వొకే వొక జీవితంరా నీది, దాన్ని గానుగెద్దు చేయద్దురా” అన్నారు కవితలో.

జవాబు: ఈ ‘Failure Story’ కవిత నాకు చాలా ప్రత్యేకం. ఇది చాలా మందికి ప్రత్యేకంగా అనిపించిందని ప్రతిస్పందనల వల్ల అర్థమైంది. ఇది wallets లో పెట్టుకొని, పదేపదే చదువుకుంటూ వుంటామని చెప్పిన వాళ్ళూ వున్నారు. తన కవిత్వం రెడీ రిఫరెన్స్ అవడం కంటే కవికి సంతోషం ఏముంది?! చాలా సందర్భాలు మనం విజయం సాధించామని చెప్తాయి కానీ, వాటి కింద అపజయాల హోరు కూడా వినిపిస్తూనే వుంటుంది. ఎన్నో అపజయాలు కలిస్తే ఒక విజయం. మరీ ముఖ్యంగా, ఎలాంటి privileges లేని బతుకులోంచి వచ్చినప్పుడు failure అనేది నిరంతరం ఉద్విగ్నతకి లోనుచేస్తుంది. ఇదంతా గానుగెద్దు జీవితం మీద గెలుపు ప్రకటన. రొటీన్ నడకని దాటి ఇంకో దారికి మళ్లడం. నిజానికి ఇది కథల్లో ఇంకా బాగా చెప్పవచ్చు.

ప్రశ్న 13: ‘మాపటి దీపం’ కవితలో “వినేటప్పుడు/నీలోపలి శిలలోకి తడి కన్నయి ధ్యానించు/అప్పుడు చీకటి అంచు కూడా/తళుక్కున మెరుస్తుంది నీలో” అన్న పాదాలు చదువుతుంటే అప్రయత్నంగా, అలవోకగా అమరిపోయాయనిపిస్తుంది. కానీ, ఎంతో కొంత తపించనిదే భావాలు అక్షరాలై.. ఇలా కవితలా పెల్లుబుకవు. ఈ కవిత రచించిన నేపథ్యం గురించి వివరిస్తారా?

జవాబు: ఇది ఒక సాయంత్రపు శాస్త్రీయ సంగీత కచేరీ అనుభవం తరవాతి తక్షణ స్పందన. మంచి సంగీతం గొప్ప outlet. మొదటి నించీ ఈ సంగీత నేపథ్యం నా కవిత్వంలో మీకు కనిపిస్తూనే వుంటుంది. ఉదాహరణకు ‘రక్తస్పర్శ’లో సైగల్ పాట. మిగిలిన కవితలు ఆవేశ ప్రధానమైతే, ఈ కవిత ప్రత్యేకించి తాత్విక ప్రధానం. ప్రతి పంక్తీ తాత్విక సారం వైపు తీసుకెళ్తుంది. మరీ ముఖ్యంగా మీరు ప్రస్తావించిన ముక్తాయింపు. సంగీతం వింటున్నప్పుడు మనం కరిగిపోతాం. ఆ కరిగిపోవడం అనే క్రియ వాడుతున్నప్పుడు మనిషి శిల లాంటివాడు అనే భావన కూడా వుంది కదా!! రాగం అనేది తడిగా తాకినప్పుడు కన్ను ద్రవిస్తుంది. ఒక మెరుపు ఒంటి నిండా మెరుస్తుంది. అసలు శరీరమే మెరుపై పోతుంది.

ప్రశ్న 14: “యెవరైనా ఒక మాట అంటే, దాన్ని నేను వింటే.. నేను నేను కాదుగా” అని ‘కొండ కొమ్మున’ కవిత నేపథ్యం గురించి చెప్తూ. కొండ ఎక్కడమంటే మనల్ని మనం తెలుసుకోవడమేనని వినూత్నంగా చెప్పారు. ‘యెంతో కొంత నువ్వు/నీవై నువ్వుగా కలిసే అపరిచిత క్షణం’ అన్నారు. అంతర్లీనంగా గొప్ప సందేశం ఉన్న కవిత. ఒక ఉద్వేగాన్ని అక్షరబద్ధం చేయడానికి కాలపరిమితి ఉండదు, అయినా ఈ కవిత వ్రాయడానికి మీకెంత కాలం పట్టిందో తెలుసుకోవాలని ఉంది. చెప్తారా?

జవాబు: ఇది నాకు బాగా నచ్చిన నా కవిత. మీరు ఇందాక ఆకాశం ప్రతీక గురించి మాట్లాడారు, అలాంటిదే ఈ కొండల అనుభవం కూడా! మా వూళ్ళో అంటే ఖమ్మంలో నరసింహ స్వామి కొండ ఒక వైపూ, ఖిల్లా ఇంకో వైపూ వున్నాయి. నేను పనిచేసిన ప్రతి వూళ్ళోనూ ఏదో ఒక కొండ ఆసరా దొరికింది. కానీ, ఈ కవిత తిరుచ్చిలోని పెద్ద కొండ గురించి – కొన్ని వందల మెట్లు ఎక్కాక, ఆ కొండ మీంచి చూస్తున్నప్పుడు కనిపించిన దృశ్యాల్ని దాచుకోవడమే కాకుండా, వాటికొక విశాలమైన భావన అనే ఫ్రేమ్‌లో కుదించాలన్న ప్రయత్నం ఈ కవిత. ఇది కనీసం ఆరు నెలల ఆలోచనల ఫలం. నా జీవితంలో మామూలైపోయిన అనుభవాన్ని- అంటే కొండ ఎక్కి, దిగే అనుభవాన్ని- ఎలా అర్థం చేసుకోవాలన్న తపన అది. అది కేవలం కొండకే పరిమితం కాలేదని మీకు కవిత చివరలో తెలుస్తుంది. రాయడం ఎంత సేపు పడుతుందని కాదు, ఆ రాయడం అనే దశకి చేరుకోడానికి చాలా కాలమే పడుతుంది.

ప్రశ్న 15: ‘యీవాళే యేరుకున్న ఆకులు కొన్ని’ కవితలో ‘వాన ఒక మిరాకిల్’ అన్నారు. అలాగే చాలా కవితల్లో మబ్బులు, చినుకులు అక్షరాలై, పదాలై, భావాలై పాఠకుల హృదయాల్ని తడిపాయి. వానని ఓ అద్భుతం అని అనడానికి ఏది దోహదం చేసింది?

జవాబు: నేను అమెరికా రావడానికి ముందు అనంతపురంలో పనిచేశాను. అక్కడ వాన చినుకు అపురూపమే. అంతకుముందు నా కవిత్వంలో వాన లేదా అంటే వుంది. కానీ, అదొక మిరకిల్ అనే స్థితి లేదు. ఆ మాటకొస్తే, ప్రకృతినీ, అందులోని shades ని కొత్తగా చూసే అనుభవం రాయలసీమ జీవితంలో సాధ్యమైంది. నిత్యం నీళ్ళ మధ్య బతికే వాళ్ళకి తెలియని రహస్యాలు ఇక్కడ చాలా తెలుస్తాయి. అందుకే, ప్రతి కవీ, రచయితా కనీసం ఆరునెలలు అనంతపురం లాంటి చోట పనిచేయాలి. అప్పుడు తన వరాలేమిటో, శాపాలేమిటో తెలిసిపోతుంది. ఈ కోణం నుంచి చూస్తే, మీరు ప్రస్తావించిన అంశాలు నాకు కేవలం కవిత్వ సరుకు మాత్రమే కాదని అర్థమవుతుంది. అవి జీవితాన్ని నిలదీసే సందర్భాలు. గుండెని తట్టిలేపే అద్భుతాలు.

ప్రశ్న 16: ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రెండు కవితల్లో – వ్యక్తి తనతో తాను చేసే పోరాటం వ్యక్తమైంది. కానీ ‘యుద్ధం’లా మనకు తెలిసిన యుద్ధం ‘Reminder’ కవితలో కనబడుతోంది. ఏది యుద్ధం ఏది కాదో తెలియకుండానే, ప్రమేయంగానో/అప్రమేయంగానో మనమంతా యుద్ధరంగంలోనే ఉన్నామని ఈ కవితలు చెబుతున్నట్టు స్ఫురిస్తోంది. మీ అభిప్రాయం?

జవాబు: మన చుట్టూ యుద్ధ వాతావరణమే వుంది. ఇది మనం అనుక్షణం ఫీల్ అవుతున్నాం. ఫీల్ అవ్వడం లేదంటే మన లోపల ఉద్వేగాలు స్తంభించిపోయాయని అర్థం. వ్యక్తి ఒక కురుక్షేత్రం, ఒక హీరోషిమా. ఇందులో అనుమానమేమీ లేదు. అయితే, ఏ యుద్ధం ఎందుకు చేస్తున్నామో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఈ సంపుటి. ప్రతి కవితా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ యుద్ధానికి ఒక ఉదాహరణ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఈ సంపుటికి రాసిన ముందు మాటలో వరవరరావు అన్నారు: యుద్ధం మధ్యలో నిలబడ్డాడు అఫ్సర్ అని – ఇది కేవలం నేనే కాదు, మీరూ, మనం అందరం అలాంటి యుద్ధం మధ్యలోనే నిలబడ్డాం. నిజానికి ఏ కవిత్వమూ సమగ్రంగా వ్యక్తం చేయలేని యుద్ధ వాతావరణంలో మనం వున్నాం. అది గమనించడం పెద్ద కష్టమేమీ కాదు.

ప్రశ్న 17: “కవిత్వం కూడా ఇప్పుడు వొక వస్తువ్యామోహమే!/క్రయవిక్రయాల చిట్టాపత్రమే” అన్నారు ‘లెక్కబెట్టుకున్న క్షణాలు’ కవితలో. ఈ కవిత కరోనా కాలంలో రాసుకున్న కవిత. ఈ కవిత నేపథ్యం మరింత వివరిస్తారా?

జవాబు: నిజమే, కరోనా కవిత ఇది. కరోనా భిన్న స్థితులని దీర్ఘ కవితగా మలచాలని అనుకున్నా. కానీ, అది సాధ్యపడలేదు. ఎందుకంటే రాసే కొద్దీ painful గా అనిపించింది. అందుకే, కొంత వరకే రాసి, ముగించాను. కవిత మొదటి పంక్తిలోనే చెప్పినట్టు – క్షణాల్ని లెక్కబెట్టుకునే పరిస్తితి అది. ఎవరు ఎప్పుడు కరోనా బారిన పడి, ఏమైపోతారో తెలియని కాలం. మనమంతా అనుభవించిన బాధే అది. కాబట్టి, ఎక్కువ వివరణ కూడా అక్కర్లేదు.

ప్రశ్న 18: ఒక కవిత రాశాకా, దాని తాలూకు ఉద్వేగమో/ఉద్విగ్నతో మీలో ఎంత కాలం ఉంటుంది? అలా ఎక్కువ కాలం పాటు మీ మదిని వెంటాడిన ఉద్వేగం ఏ కవితది?

జవాబు: ఇది చాలా కష్టమైన ప్రశ్న. ప్రతి కవితా చాలా కాలం మనసుని అంటిపెట్టుకునే వుంటుంది. అందుకే, ప్రతి కవితకీ మధ్య నేను చాలా gap తీసుకుంటాను. ఒక్కో కవిత నన్ను పూర్తిగా తెరపిన పడెయ్యడానికి చాలా వ్యవధి తీసుకుంటుంది. కొన్ని కవితలు మరో కవితని చేరుకున్నా వేధిస్తూ ఉంటాయి. First Information Report (పేజీ 128) నన్ను చాలా కాలం కుదురుగా వుండనివ్వలేదు. అది కరోనా సమయంలో వలసల గురించి రాసిన కవిత. మరోసారి చదివితే మీకే అర్థమవుతుంది అందులోని ఉద్వేగం ఏమిటో!

ప్రశ్న 19: సాధారణంగా కవులు రాసే కవితలన్నీ వారికి నచ్చుతాయి. కానీ ప్రత్యేకంగా, మీకు బాగా నచ్చిన ఒకటి రెండు కవితలు పేర్కొనమంటే, ఈ సంపుటి లోని ఏ కవితలని ఎంచుకుంటారు?

జవాబు: ఈ సంపుటిలోని మొదటి కవిత ‘తెరవెనక’. అది క్లాస్‌లో కబీర్ గురించి పాఠం చెప్పాక నా విద్యార్థుల ప్రతిస్పందనలోంచి పెల్లుబికిన కవిత. ఇది నా signature poem అనుకుంటా. యుద్ధం మధ్యలో నువ్వు అనే ఒక శీర్షికతో రెండు మూడు కవితలున్నాయి. అవి నచ్చిన కవితలు అని కాదు కానీ, వాటి మీద నేను పెట్టిన ఊనిక వల్ల అవి నాకు దగ్గిరగా అనిపించాయి.

ప్రశ్న 20: కవిగా, కథకుడిగా, పరిశోధకుడిగా మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి? కొత్త పుస్తకం ఏదైనా తెస్తున్నారా? వివరించండి.

జవాబు: కవిత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి, కథల సంపుటి రెండేళ్ల తరవాత రావచ్చు. అలాగే, ప్రముఖులతో నా పరిచయాలూ, వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలూ ఇప్పుడు కూర్పులో వుంది. పరిశోధకుడిగా తెలుగు సూఫీ కవిత్వ ఇంగ్లీషు అనువాదాలు త్వరలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ద్వారా వచ్చే అవకాశం వుంది.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు అఫ్సర్ గారు.

అఫ్సర్: ధన్యవాదాలు నేనే చెప్పాలి. ఇది మామూలు ముఖాముఖీ కాదు, అంతర్ముఖాముఖి లాగా అనిపించింది.

***

యుద్ధం మధ్యలో నువ్వు (కవిత్వం)
రచన: అఫ్సర్
ప్రచురణ: అజూ పబ్లికేషన్స్, నల్గొండ
పేజీలు: 184
వెల: ₹ 200/-
ప్రతులకు:
అజూ పబ్లికేషన్స్,
1-3-63/2,
మాల్‍బౌలీ స్ట్రీట్,
నల్గొండ. తెలంగాణ. 508001
ఫోన్: 9912460268
~
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Yudham-Madhyalo-Nuvvu-Poetry-Afsar/dp/8197454388

~
‘యుద్ధం మధ్యలో నువ్వు’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/yuddham-madhyalo-nuvvu-book-review-kss/

Photos Courtesy: Poet and Publisher’s respective Facebook pages.

Exit mobile version