Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథా నవలా రచయిత డా. ఎ.ఎస్. రామశాస్త్రి (అనామకుడు) ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘సాక్షాత్కారము’ అనే పుస్తకం వెలువరించిన డా. ఎ.ఎస్. రామశాస్త్రి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. ఎ.ఎస్. రామశాస్త్రి గారూ.

డా. ఎ.ఎస్. రామశాస్త్రి: నమస్కారం.

~

ప్రశ్న: మీ 70వ జన్మదినం సందర్భంగా 70 పద్యాలతో ‘సాక్షాత్కారము’ అనే పుస్తకం వెలువరించడంలోని నేపథ్యం తెలియజేస్తారా?

జ: 1980-2015 కాలంలో నేను అరవై దాకా కథలు రాసాను. అన్నింటిలోనూ కొంత తాత్వికతా భావం అంతర్లీనంగా తొంగి చూస్త్తూ ఉంటుంది. అలాగే గణిత భౌతిక జీవ శాస్త్రాలు నాకు ఈ విశ్వం మీద కలిగించే అవగాహన కూడా కనిపిస్తూ ఉంటుంది. అది విశ్వ వైశాల్యం వైరుధ్యం వైచిత్రాల ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆనందాన్ని ఇస్తోంది. ఒక రకంగా విశ్వ సాక్షాత్కారాన్ని చూపిస్తోంది. దాన్ని అందించిన శాస్త్రవేత్తలని స్మరించుకుని ధన్యవాదాలు తెలుపుకోవడమే ‘సాక్షాత్కారము’ పుస్తక నేపథ్యం.

ప్రశ్న: మీరు తెలుగులో కథలూ, నవలికలూ, శ్రావ్యనాటకాలూ, పద్యాలు రచించారు. ఆంగ్లంలో ఆర్థిక శాస్త్రంలో గ్రంథాలు ప్రచురించారు. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైందో చెప్తారా?

జ: భాష మనిషిని తక్కిన జంతువులనుండి దూరంగా తీసుకుని వెళ్ళింది. భాష ద్వారానే మనం మన ఆలోచనల్ని ఇతరులతో పంచుకుంటాం. అలానే అనుభవాల్నీ అనుభూతుల్నీ కూడా. పంచుకోవడం ఒకరితో ఐతే అది సంభాషణ అవుతుంది. నలుగురితో పంచుకునే  ప్రయత్నం రచన అవుతుంది. అది కథైనా నవలైనా నాటకమైనా పద్యమైనా. పంచుకునే విషయం ఉన్నప్పుడు రచయిత పుడతాడు, అది పంచుకోగలిగిన  భాష కూడా తోడైతే రచన పుడుతుంది.

నాకు భాష మీద మమకారం ఉంది. చెప్పేందుకు విషయం పుస్తకాలూ, అంతకుమించి చుట్టూ ఉన్న ప్రపంచమూ ఇచ్చాయి. నాకు పదమూడు పధ్నాలుగు సంవత్సరాల వయస్సులోనే నా రచనా వ్యాసంగం మొదలైంది. ఐతే చదువూ పరీక్షలు దాన్ని పక్కన పెట్టాయి. ఉద్యోగంలో చేరాక 1982లో నా మొదటి కథ ‘అంతరాంతరాళం’ రాసాను. అది రెండు జంటల మూడు రోజుల విహార యాత్రలో రాసుకున్న డైరీల లోని పేజీలు.

నేను ఫైనాన్స్ మీద పుస్తకాలు రాయడానికి కారణం పబ్లిషర్స్. వారి కోరిక మీద రాసినవే అవి.

ప్రశ్న: “ఈ పద్యాలన్నిటా అంతస్సూత్రాలుగా ఒక తత్త్వచింతనా, విశ్వరూప సాక్షాత్కారం గోచరిస్తాయి” అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు. ఈ మహనీయులు, మేధావుల జ్ఞాన సంపద మానవాళికి దక్కించడమనే దైవకృప మనపై ప్రసరించినందుకు మీరు వ్యక్తపరిచిన కృతజ్ఞతా భావాన్నే తాత్త్విక చింతనగా, సాక్షాత్కారంగా భావించవచ్చా?

జ: అదే దాని పరమార్థం. కృతజ్ఞతా ధన్యవాదాలు భక్తి భావనా – ఏ పేరు పెట్టినా అదే. మనం ఏ ఉద్దేశంతో రాసామో అది అందరికీ చెప్పడమే ముందుమాట ఉద్దేశం. సామవేదం వారు నా మనస్సులో మాటని పుస్తకం ముందు మాటగా అందరి ముందు పెట్టారు.

ప్రశ్న: ఈ ‘సాక్షాత్కారము’ పుస్తకంలో “సృష్టి యొక్క సూత్రాలను వెలికి తీస్తున్న మహనీయులను భక్తితో స్మరిస్తున్నాను” అని మీ ముందుమాటలో వ్యాఖ్యానించారు. ఈ మహనీయులను ఎంచుకోడంలో మీరే పద్ధతిని పాటించారు? యాదృచ్ఛిక ఎంపికా లేక నియతమైన ఎంపికా?

జ: అది యాదృచ్ఛికమూ కాదు. నియమితమూ కాదు. ఆ పద్యాలు రాస్తున్నప్పుడు నాలో మెదలిన మహానుభావులు వారు. ఇంకెందరో ఉన్నారు – మరి వీరే ఎందుకు అన్న ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. మనిషి జీవితాన్నీ ఆలోచనల్నీ మార్చిన వారిలో వీరు ప్రముఖులు. ఇది కొంతవరకూ నా వ్యక్తిగత ఎంపిక. నా విశ్వ సాక్షాత్కారానికి వీరు కారకులు. నాకే కాదు మానవ జాతి అందరికీ. అందుకే కృతజ్ఞత అజ్ఞాత ఆదిమ మానవులతో మొదలవుతుంది. నిప్పూ చక్రం వ్యవసాయం వంటా భాషా కనుగొన్న వారు తొలి శాస్త్రవేత్తలు. వారే లేకుంటే మనం ఇక్కడకి చేరేవారం కాదు. అలానే ఐన్‌స్టీన్, గోడల్ హైసెంబెర్గ్ వంటి ఆధునిక శాస్త్రవేత్తల ఆలోచనలే మనకి ఇంత విశ్వపు విశేషాలని అర్థం చేసుకునేలా చేస్తున్నాయి.

ప్రశ్న: మీ గత పుస్తకం ‘అక్షరాంజలి’కి ఇది ఏ రకంగానైనా కొనసాగింపా? లేక కాన్సెప్ట్ మాత్రమే కామనా?

జ: ‘అక్షరాంజలి’ మనకి ఇంత విశాల విశ్వము ఇచ్చిన అజ్ఞాత అనామక సృష్టికర్తకు అంజలి. ఐతే ఇంత విశ్వము ఉందనీ, దాని స్థల కాల పరిధులు ఇవి అయి ఉండవచ్చనీ మనకి తెలియచేస్తూ ఉన్నది శాస్త్రవేత్తలు. కానీ వారు సృష్టిలో భాగాలే. వారిని సృష్టించింది సృష్టికర్తే. ‘అక్షరాంజలి’ నన్ను సృష్టించిన కర్తకి అంజలి. ‘సాక్షాత్కారము’ శాస్త్రవేత్తలను సృష్టించిన కర్తకు అంజలి. అది కొనసాగింపే.

ప్రశ్న: ఏ మహనీయుడికి ఏ ఛందస్సులో పద్యం వ్రాయాలని ఎలా నిర్ణయించుకున్నారు? మొదట అనుకున్న ఛందస్సు కాకుండా మరో ఛందస్సులో పద్యం రాసిన ఉదాహరణలేవైనా ఉన్నాయా?

జ: ముందు చెప్పినట్లు ఏ మహనీయుడి మీద పద్యం రాయాలని ఎంచుకోడం ముఖ్యం. కష్టం. ఎంచుకోడం ఆ మహనీయుడు అందించిన విషయాన్ని బట్టి చేసాను. ఆ విషయం చిన్న పద్యంలో ఇమిడిపోయేంత చిన్నది కాదు. అది లోతుగా విశాలంగా ఉంటుంది. అంత విషయ సారాన్ని చిన్నచిన్న పదాలతో ఛందోబద్దంగా రాయడమే సాహసం. ఒక రకంగా అది క్షీరసాగర మథనం. అమృతం వచ్చేవరకూ చిలకాలి. ఆ చిలుకుతున్నప్పుడు ఛందస్సు ఏది సరిగ్గా ఉంటుందో స్ఫురించేది.

ఛందస్సులో వృత్తాల గమనానికి ఒక వేగం ఉంటుంది. కొన్ని పద్యాలకి వృత్తాలే అనువుగా ఉంటాయి. అందులోనూ శార్దూల మత్తేభాల నడకలో ఇంకొంత వేగం ఉంటుంది. ఉపనిషద్ద్రష్టలూ శంకరాచార్యులు మీద పద్యాలకి శార్దూలం వాడాను. వాటికి గాంభీర్యం వచ్చింది.

ఆటవెలది తేటగీతి సుతిమెత్తగా ఉంటాయి. కొన్ని పద్యాలకి అవి చక్కగా సరిపోతాయి. మృదుత్వం వస్తుంది.

విషయ విస్తారం వైవిధ్యం సీసపద్య ఎన్నికకు కారణాలు. ధన్యవాదాలూ, అజ్ఞాత శాస్త్రవేత్తల మీద పద్యాలూ సీసాలు. పోతన గారి సీస పద్యాలు గొప్ప మార్గదర్శకాలు.

మానిని అంటే స్త్రీ. అందుకే మహిళా శాస్త్రవేత్తలకు కావాలని ఆ ఛందస్సు ఎన్నుకున్నాను. మానిని నడకలో ఒక ఒయ్యారం ఉంటుంది.

అలానే మత్తకోకిల నడక కూడా. ఇంకా కందం రాసినవాడే కవి అని నానుడి ఉంది.

ఏ ఛందస్సు ఎన్నికా యాదృచ్ఛికం కాదు. అది ఆ మహనీయుని మహత్త్వానికి అద్దం పట్టేదే. అందుకే అనుకున్నది కాకుండా మరో ఛందస్సు వాడాల్సిన అవసరం రాలేదు.

ప్రశ్న: 69వ పద్యంలో మరణమంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఆధాత్మికతనీ, భౌతికశాస్త్రాన్ని మేళవించారు. చివరి పాదంలో “ప్రాణమును మానిసి వీడిన కాని నేర్వడా?” అని అన్నారు. ప్రాణం లేని జీవికి ఆ రహస్యం తెలిసేదెలా?

జ: ఈ విశాల విశ్వమే తెలియని రహస్యం. అది ఎందుకు ఉందో తెలియదు. ఈ విశ్వములో మారుమూలాన ఉన్న ఒక చిన్న గ్రహం మీద ప్రాణులు ఎందుకు ఉన్నారో అంతే చిక్కని ప్రశ్న. అసలు ప్రాణం ఏమిటి, ప్రాణం ఉందని చెప్తున్న చైతన్యం ఏమిటి, అన్న ప్రశ్నలు మనిషిని వేధిస్తూనే ఉన్నాయి.

ఆ చైతన్యమే ఆత్మా? అది శరీరం లేకపోయినా ఉంటుందా? మనకి తెలియదు. చైతన్యం గురించి జీవ తత్త్వ భౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. క్వాంటంథీరీతో, న్యూరల్ రీసెర్చ్, ఎన్నో కొత్త విషయాలు వెలికి వస్తున్నాయి.

ఎంత తెలిసినా మనిషికి మనం భూమి మీద ఎందుకు ఉన్నామో తెలియడం లేదు. స్టీఫెన్ హాకింగ్ అన్నట్లు అది తెలియదేమో కూడా.

అందుకే మనిషి మరణిస్తే కానీ తెలియదా అన్న ప్రశ్న. మరణించాక కూడా ఎవరికి తెలుస్తుంది? అసలు తెలిసిందో లేదో ఎలా తెలుస్తుంది?

అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఉన్నాయో లేవో – ఉన్నా మనకి తెలుస్తాయో లేవో. ఆ వాక్యంలో ఇంత ఉంది. ఇదంతా ఉంది.

అసలు సృష్టికర్త మనకోసం ఇన్ని లోకాలు ఎందుకు సృష్టించి ఉండచ్చు? ఎలా తెలుస్తుంది?

అనంతంలో మనం కలిసి పోవడమే మరణం అన్న ఆశావాహకంతో పుస్తకం ముగించాను.

ప్రశ్న: ఈ మొత్తం 70 పద్యాలు వ్రాయడానికి మీకెంత కాలం పట్టింది? రచన అనుకున్న రీతిలోనే సాగిందా లేక ఏవైనా అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయా?

జ: పద్యాలు రాయడం నాకు ఒక తపస్సు. అవీ అనంతమైన సృష్టి గురించి. రాస్తున్నంత కాలం అదో లోకం. అదే లోకం. తాదాత్మ్య లోకం. అందమైన అనుభవం. ఒక ఆరు నెలలు పట్టి ఉండవచ్చు, ఆటంకాలు ఏవీ లేవు. మనస్సుకి నచ్చిన పని. మహదానందంగా చేసుకుపోవడమే.

ప్రశ్న: ఈ 70 పద్యాలూ మీకు బాగా నచ్చి ఉంటాయి. కానీ అన్నిటికన్నా ఎక్కువగా నచ్చినది ఏదంటే ఏ పద్యం చెప్తారు?

జ: చెప్పడం కష్టం. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. గోడెల్ అసంపూర్ణ సిద్ధాంతం మీద పద్యం. ఆ ఆయన అసంపూర్ణ సిద్ధాంతాన్ని ఎలా చెప్పడమైనా కష్టం. అంత అంతరార్థం ఉన్న సిద్ధాంతం అది. అది గణిత శాస్త్ర సిద్ధాంతమే అయినా – దానికి వేదాంతపరంగా చాలా విశేషం ఉంది. ఒకటి చెడకుండా రెండోది చెప్పాలి. అందులో వాడిన మాటలు రెంటికీ అన్వయిస్తాయి. నిజం రుజువు వంటివి. ఆ పద్యానికి ఎన్నుకున్న ఛందస్సు కందం. మీరు ఆ పద్యం చదివితే కందం ఎంత అందంగా అమిరిందో అర్థం అవుతుంది.

ఇది నాకు బాగా నచ్చిందని అన్నానని తక్కినవి నచ్చలేదని కాదు.

ప్రశ్న: పుస్తకం కవర్ పేజీ చాలా ఆకర్షణీయంగా ఉంది. ముదురు ఎరుపు రంగు శక్తికి, విశ్వచైతన్యానికీ; పసుపు రంగు మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికీ; నీలాన్ని సర్వవ్యాపకత్వానికీ ప్రతీకలుగా ఎంచుకున్నారా?

జ: పుస్తకానికి కవర్ ఆర్ట్ మా అమ్మాయి అపరాజితది. తనకి రంగుల అవగాహన బాగా ఉంది. సాక్షాత్కారం పద్యాల విషయం ఇది అని నేను అనగానే – తన మనస్సులో మెదలిన రంగుల కలయిక ఇది. ఆర్టిస్ట్ ఆలోచన నాకూ నచ్చింది. అందులో ఒక దూరం ఒక లోతూ ఒక కాంతీ అన్నీ ఉన్నట్లు అనిపించింది. నా ముందు పుస్తకం ‘అక్షరాంజలి’కి అపరాజిత తీసిన ఫోటోయే కవర్. ‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకానికి కూడా తన స్కెచ్చే.

ప్రశ్న: ఈ పుస్తకం ఎక్కువ మంది పాఠకులకు చేరేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు?

జ: నేను ఏ పుస్తకానికి ఏమీ చెయ్యలేదు. నాకు చేత కాదు. రాయగలను అంతే. మీ వంటి మీడియా వారు చెయ్యగలరు. మీరు చెయ్యండి. నేను మీకు కృతజ్ఞుణ్ణి.

ప్రశ్న: మీరు ‘అనామకుడు’ అనే కలం పేరును పెట్టుకోడానికి కారణమేమిటో మా పాఠకులకు చెప్తారా?

జ: అనామకంగా ఉండాలనే. సృష్టికర్త అసలైన అనామకుడు, నేను ఆయన ముందు అర్భకుడినైన అనామకుడిని. నిజానికి మనం అందరం అంతే కదా?

నా ‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకం ముందు మాటలో సిరివెన్నెల ఇదే మాట అన్నారు.

ఆ అనంత అనామకుడూ ఈ మర్త్య అనామకుడూ ఒక్కటేనన్న గ్రహింపే అద్వైతం. అదే తత్త్వవేత్తల లక్ష్యం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. ఎ.ఎస్. రామశాస్త్రి గారూ.

డా. ఎ.ఎస్. రామశాస్త్రి: ధన్యవాదాలు.

***

సాక్షాత్కారము
రచన: అనామకుడు (డా. ఎ.ఎస్. రామశాస్త్రి)
ప్రచురణ: అపరాజిత పబ్లికేషన్స్
పేజీలు: 87
వెల: ₹ 500/- (Print copy)
Digital Version: Free
https://asramasastri.com/books/sakshatkaramu.pdf
ప్రతులకు:
For Physical Copies (Limited):
e-mail: ramasastri@hotmail.com
WhatsApp: 9440803803

 

~

‘సాక్షాత్కారము’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/sakshatkaramu-book-review-kss/

Exit mobile version