[‘పల్లేరుకాయలు’ అనే నవల వెలువరించిన డా. బి.వి.ఎన్. స్వామి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. బి.వి.ఎన్. స్వామి గారూ.
డా. బి.వి.ఎన్. స్వామి: నమస్కారం.
~
జ: అవును. ఇది ఆత్మకథనే. కాస్త వివరంగా చెప్పాలంటే నవల రూపాన్ని ఆశ్రయించవలసిందే.
ప్రశ్న 2: ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో “కొందరి జీవితం నల్లేరు మీద నడక, కొందరి జీవితం పల్లేరుకాయల మీద నడక” అని వ్యాఖ్యానించారు డా. నందిని సిధారెడ్డి గారు. ఈ అభిప్రాయాన్ని మీకు అన్వయించుకుంటూ మీ జీవితం గురించి వివరిస్తారా?
జ: ముందుమాట వ్రాసిన డా. సిధారెడ్డి గారి అభిప్రాయమది. నేనెలా చెప్పగలను?
ప్రశ్న 3: మీ జీవిత కథనే ఆత్మకథాత్మక నవలగా వెలువరించటంలో – సంశయాలు, సంకోచాలు లాంటివి ఏమైనా ఎదురయ్యాయా? వ్యక్తిగత గోప్యతకి భంగం కలగకుండా, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, కీలకమైన వ్యక్తులను ప్రస్తావించుకుంటూ, ‘నొప్పించక తానొప్పక’ అన్న రీతిలో రాయడం కష్టమైందా?
జ: నాకు ఎలాంటి సంశయాలు, సంకోచాలు లేవు. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగానే చెప్పాను.
ప్రశ్న 4: ఆత్మకథాత్మక నవల కాబట్టి, నిజ జీవిత ఘటనల నడుమ కాల్పనిక సన్నివేశాలు జొప్పించలేరు. నవల పఠనం ఆసక్తికరంగా ఉండడానికి ఏమేం చేశారు?
జ: నాకు క్లుప్తత అంటే ఇష్టం. సంఘటనలను, సన్నివేశాలను సూటిగా, అర్థవంతంగా ఉండేటట్లు జాగ్రత్తపడ్డాను. పఠనీయత సాధించడం కోసం పాత్రోచిత భాషను ఎన్నుకున్నాను. చెప్పదలచుకున్న విషయాన్ని ఆధ్యాయాలుగా విభజించాను. ఆధ్యాయాలకు పెట్టిన శీర్షికల ద్వారా రచయిత చెప్పబోయే విషయాన్ని పాఠకుడు తెలుసుకునేలా జాగ్రత్తపడ్డాను. మనిషి జీవన దశలను శీర్షికలుగా పెట్టాను, డైరీ కథనాన్ని ఉపయోగించాను, పద్యంతో నవలను ప్రారంభించాను. ఇలా పఠనీయత సాధించడానికి కృషి చేసాను.
ప్రశ్న 5: ఈ నవలలో ప్రధాన పాత్రకి పేరు లేదు. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలనే పేరు పెట్టలేదా?
జ: కావాలనే పేరు పెట్టలేదు. విద్యారంగంలో బోధన జరువుతున్న ప్రతి ఒక్కరి అనుభవాలవి. నేను రాసినవి తక్కువ, అంతకంటే ఎక్కువ అనుభవాల్ని పొందిన వ్యక్తులున్నారు. ఇందులోని ప్రధాన పాత్ర ఒక సామూహిక నమూనా.
ప్రశ్న 6: నవలలో ప్రధానంగా విద్యారంగంపైన అధికంగా దృష్టి కేంద్రీకరించినట్టు అనిపిస్తుంది. విద్యార్థిగా, అధ్యాపకుడిగా చదువు నేర్చుకోడంలోనూ, నేర్పడంలోనూ మీకెదురైన అనుభవాలు ఎలాంటివి?
జ: విద్యార్థిగా ఐదారేళ్ళ ప్రాతంలో బడిలోకి వెళ్ళిన నేను, గజిటెడ్ హెడ్‌మాస్టర్‌గా 61 ఏళ్ళకు పదవీ విరమణ ద్వారా బడి నుండి బయటకు వచ్చాను. విద్యార్థిగా, నాటి ఉపాద్యాయుల కనుసన్నలలో ఉండి విద్య నేర్చుకున్నాను. నేడు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఆకాంక్షల మేరకు బోధించాను. నాటి విద్యార్థులకు స్వేచ్ఛ తక్కువ, నేటి వారికి స్వేచ్ఛ ఎక్కువ. విద్యార్థుల, అధికారుల, తల్లిదండ్రుల నిర్దేశాల మేరకు జరుగుతున్నది బోధన. ఈ రంగంలో పనిచేస్తున్న వారి అనుభవాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అందుకే ప్రధాన పాత్రకు పేరు పెట్టలేదు. అదొక సామూహిక నమూనా అన్నది కూడా అందుకే.
ప్రశ్న 7: బోధనారంగంలో మీరు ఆశించిన మార్పులు నిజజీవితంలో సంభవించాయా? మీరు అభిలషించిన మార్పు ఏదైనా సంభవించి, బాగా సంతృప్తి కలిగిన సందర్భం ఏదైనా ఉందా?
జ: చాలా కాలంగా బోధనా రంగం ఒక ప్రయోగశాలగా మారింది. నేను చదువు చెప్పిన చాలామంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత స్థానాలలో ఉన్నారు. వారిని చూసినప్పుడు తృప్తి కలుగుతుంది. నన్ను గుర్తుపట్టి వారు పలకరించిన సందర్భాలెన్నో ఉన్నవి. ఆయా సందర్భాల్లో పొందిన సంతోషం చెప్పలేము. ఇలాంటి స్ధితి ప్రతి ఉపాధ్యాయుడికీ కలుగుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఇందుకు ఉదాహారణలుగా నిలుస్తాయి.
జ: తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ప్రత్యేక తెలంగాణ కోసం కలలు కన్న వాళ్ళలో నేను ఒకడిని. భ్రష్టు పట్టిన ఓటు రాజకీయాల వల్ల ఏర్పడిన ప్రభుత్వ విధానాలు వ్యక్తులను తీవ్ర నిరాశకు గురిచేసాయి. సామాజికంగా నెలకొన్న అసమానతలు రచయితలను నిద్రకు దూరం చేస్తాయి. అసమానతల ప్రభావ తీవ్రత రచయితలపై ఏ మేరకు ఉంటుందో రచయితలు ఆ మేరకు స్పందిస్తూ రాస్తుంటారు, రచయితగా నాపై కూడా వీటి ప్రభావం ఉంది.
ప్రశ్న 9: ఈ నవల రాయడానికి ఎంత కాలం పట్టింది? ఏదైనా సందర్భంలో చెప్పవచ్చా చెప్పకూడదా అని ఊగిసలాడి, చివరికి రాసేసిన అంశాలేవయినా నవలలో ఉన్నాయా?
జ: సుమారు ఐదు దశాబ్దాల విద్యారంగ పరిణామాన్ని ఈ నవలలో రాసాను. అందులో భాగంగానే నా జీవితాన్ని కొంత చిత్రించాను. బాల్య, కౌమార దశల్లో కుటుంబ ప్రభావం విద్యార్థిపై తీవ్రంగా ఉంటుంది. అది చెప్పడం కోసం నా కుటుంబ నేపథ్యాన్ని చెప్పాను. అందువల్ల నేను ఏ సందర్భం లోను ఊగిసలాటకు గురికాలేదు. రచనకు సుమారు ఆరునెలల కాలం పట్టింది. పదవీవిరమణ వరకు విడుదల చేయాలనుకొని చేసాను.
ప్రశ్న 10: సంచికలో ధారావాహికగా ప్రచురితమైన ఈ నవలని పుస్తక రూపంలో తీసుకురావడంలో ఏవైనా ప్రత్యేక అనుభవాలున్నాయా? ఉంటే వివరించండి.
జ: నవల ‘సంచిక’లో ధారావాహికంగా వచ్చినపుడు కొంతమంది స్పందించారు. ఆ స్పందనల వల్ల కూడా నవల పుస్తకరూపం దాల్చింది. ధారావాహికగా వేసినందుకు సంచిక టీమ్‌కు కృతజ్ఞతలు.
ప్రశ్న 11: మీరు కవిత్వం రాశారు, కథలు వ్రాశారు, బాలసాహిత్యం వ్రాశారు. కొత్తగా ‘కశప’ ప్రక్రియ చేపట్టారు. వీటన్నిటిలో మీకు రచయితగా సంతృప్తినిచ్చిన ప్రక్రియ ఏది? ఎందుకు?
జ: నాకు ప్రధానంగా తృప్తినిచ్చిన రచన ‘కశప’. ‘కశప-2’ కూడా వెలువరించాను. రెండు కలిపి 225 కథలున్నవి. ‘కశప-2’ ద్వారా నేను పద్యకవిగా తలెత్తుకున్నాను. ‘కశప-2’ లో నా కథకు నేనే ‘కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము’ అనే మకుటంతో 108 తేటగీతి పద్యాలు రాసాను. ఇలాంటి పద్యాలు రాస్తానని అనుకోలేదు. కథ కోసమే పనిచేస్తానని మడికట్టుకున్న నన్ను పద్య మార్గం పట్టించిన ఘనత ‘కశప’ (కథా శతక పద్యం)దే. ‘కశప’ రెండు సంపుటాలుగా విస్తరించింది. వీటిపై సాహిత్య లోకపు స్పందనల్ని ఆహ్వానిస్తున్నాను.
ప్రశ్న 12: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: మరొక నవలతో పాఠకుల ముందుకు రావాలనుకుంటున్నాను. ప్రధానంగా కథా ప్రక్రియపై మరింత లోతుగా పనిచేయాలనుకుంటున్నాను.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, ‘సంచిక’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు డా. బి.వి.ఎన్. స్వామి గారు.
డా. బి.వి.ఎన్. స్వామి: ‘సంచిక’కు ధన్యవాదాలు. కృతజ్ఞతలు.
***
రచన: డా. బి.వి.ఎన్. స్వామి
పేజీలు: 126
వెల: ₹ 120/-
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్
16-11-20/6/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీమ్ నగర్, మలక్ పేట,
హైదరాబాద్ – 500036
ఫోన్: 98487 87284
~
డా॥ బి.వి.ఎన్.స్వామి
9247817732
~
పల్లేరుకాయలు నవల సమీక్ష:
https://sanchika.com/pallerukaayalu-book-review-kss/

