[‘సమ్మోహన రాగ రవళి’, ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ అనే పుస్తకాలను వెలువరించిన డా. సి. ఉమాప్రసాద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. సి. ఉమాప్రసాద్ గారు.
డా. సి. ఉమాప్రసాద్: నమస్కారం.
~
ప్రశ్న: ఇటీవల మీరు ‘సమ్మోహన రాగ రవళి’, ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ అనే పుస్తకాలను వెలువరించినందుకు అభినందనలు. మీ రచనా ప్రస్థానం గురించి వివరించండి.
జ: స్వతహాగా చక్కటి సాహిత్య పుస్తకాలు.. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మా తల్లి తండ్రుల ద్వారా నాకు అబ్బినది అని చెప్పవచ్చు. చదువు – సంగీతం- సాహిత్యం అనేవి సమాంతరంగా సాగుతూ వచ్చాయి. మనసులో మెదిలో భావాలను కాగితంపై పెట్టి రచన చేయాలని ఉద్దేశంతో నాకు తోచిన కొన్ని అంశాలను ఎంచుకొని – వివిధ దేవతా – దేవీ మూర్తులపై రచనలు చేస్తూ వస్తున్నాను. దైవాన్ని ఊహించుకుని భక్తితో గీత పుష్పాలను దైవపాదముల చెంత వుంచాలన్ని కోరిక నా ఈ రచనలకు కారణభూతం అయిందని చెప్పచ్చు.
ప్రశ్న: సంగీతం పట్ల ఆసక్తి మీకెప్పుడు కలిగింది? మీ తొలి గురువులు, తీర్చిదిద్దిన గురువులు ఎవరు?
జ: నేను పుట్టింది రాజమండ్రిలో. చదువు – సంగీతాలు – అన్నీ విజయవాడలో. సంగీత కళాశాలలో జాయిన్ అయి డిప్లోమా ఇన్ మ్యూజిక్ కంప్లీట్ చేశాను. తొలి గురువులు తల్లిదండ్రులు. తరువాత దివంగత రేవతి రత్నస్వామిగారు. తదుపరి అనేక విద్వాంసులు. ప్రముఖ విద్వాంసులు అన్నవరం రామస్వామి గారు, పెమ్మరాజు సూర్యారావుగారు, రమణమూర్తి గారు, కిష్టప్పగారు. M.A. Music లో దివంగత డా. నూకల చిన సత్యన్నారాయణ గారు. వీరందరి సంగీత బాణీలు నేర్చుకునే అదృష్టం కలిగింది. మా నాన్నగారు స్వర్గీయ ఎం.వి. రంగాచార్యులు (వేణువు), అమ్మ స్వర్గీయ ఎం. ప్రమీలాదేవి (గాత్రం) నాకు సంగీతంపై ఆసక్తి కలగడానికి కారకులు. ఇంట్లో నిరంతరం సంగీత నాదం వినిపిస్తూ వుండడం వల్లే నాలో నేర్చుకోవాలని, ఏదైనా సాధించాలని కోరిక కలిగింది.
ప్రశ్న: ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చేసిన మీకు, పి.హెచ్.డి. ఆ రంగంలో కాకుండా, సంగీతంలో చేయాలని ఎందుకు అనిపించింది?
జ: చదువు లక్ష్యం ఉద్యోగ సముపార్జన అయితే – కళలు మానసికానందాన్ని ఇచ్చేవి అనిపించింది. మనిషి అన్నీ నేర్చుకుని, దేనిలో ఎక్కువగా ఆత్మతృప్తి పొందుతాడో, ఏది ఆనందాన్నిస్తుందో, దాని వైపే మొగ్గు చూపుతాడు. నా విషయంలో సంగీతంలో PhD చేసి, సంగీత పరమైన పరిశోధనలు, సమాజానికి ఉపయోగించే ప్రక్రియలు చేపట్టాలనిపించింది. నాదము ద్వారా రుగ్నతలను హరించవచ్చు అన్న ఆలోచన కూడా కారణం కావచ్చు.
ప్రశ్న: పి.హెచ్.డి.లో మీ గైడ్ ఎవరు? మీ థీసిస్‌ని ముద్రించారా?
జ: తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో ‘A Study of Ghanaraga Keerthanas of Sri Tyagaraja Swami – Musical and Literary Content’ అన్న అంశంపై చేసాను (2014). మా గైడ్ డా. కె. సరస్వతి వాసుదేవు. డీన్ ద్వారం లక్ష్మి గారు. సలహా సూచనలతో ఎంతో సహకరించిన గురుతుల్యులు. Thesis ని ముద్రించాను.
ప్రశ్న: ఈ రెండు పుస్తకాలలోని గేయాలను భావగీతాలు లేదా లలితగీతాలు అని అనవచ్చునా?
జ: భావగీతాలు: భావన, భావోద్వేగాలు, మధుర భావాలతో ఉద్భవించేవని చెప్పవచ్చు.
శాస్త్రీయ సంగీతం: రాగాల సంగీతమయం. స్వరం కట్టి వ్రాసే రచనలు.
లలిత గీతాలు: ‘లలిత’ అనే సంస్కృత పదానికి (లలతే ఈషతే) అందమైనది, కోరబడినది అని అర్థం. శాస్త్రీయ సంగీతం కాని మనోహర సంగీతం. గాన యోగ్యమై, లాలిత్య పూరితమై, హృదయాలను రంజింప చేయటం దీని లక్షణం.
నేను వ్రాసిన గీతికలు భావమా, లలితమా అనేటప్పుడు సాహిత్యాన్ని బట్టి, సమాజ మార్చును బట్టి, మన అనుభవాలను బట్టి ఊహించుకున్న దాన్ని బట్టి మన హృదయాన్ని తాకే మధుర సుమధుర గీతాలు ఏ కోవకు చెందినవి అంటే, అన్ని కోవలకి ఒక్క శాస్త్రీయ సంగీతము మూలం అని చెప్పవచ్చు. రాగాల సంగీత జగత్తు రకాలు ఎన్నో. చిన్న నదులు మహా సాగరంలో కలిసినట్టు.
ప్రశ్న: ముందు రాగం, తాళం నిర్ణయించుకుని గేయం వ్రాశారా లేక, గేయం వ్రాసిన తరువాతనే వాటికి బాణీ కట్టారా?
జ: మనసులో మెదిలిన భావాలను వ్రాస్తున్నప్పుడు ప్రవాహాం ఆగకుండా సాహిత్య అక్షరాలను పేర్చిన పిదప – సాహిత్య విరుపులలో రాగాన్ని ఆపాదించడం, లయను జోడించడం మామూలుగా జరుగుతుంది. కొన్ని సందర్బాల్లో లయను, రాగాన్ని ముందే నిర్ణయించుకుని చేసే రచనలు కూడా ఉంటాయి. లయ అనే చక్రంలో సాహిత్యాక్షరాలను బిగించటం లాంటిది. రెంటినీ ప్రయోగాలు చేయడం జరిగింది.
ప్రశ్న: రాసిన గీతాలని కూర్చడంలో ఏ రాగంలో ఎక్కువ కష్టం? ఎందువల్ల?
జ: మన శాస్త్రీయ సంగీత రాగాలు అనేకం. జనక, జన్య రాగాలు, భాషాంగ రాగాలు. కొన్ని హిందుస్తాని రాగాలు. ఇవి అన్ని కూడా గీతాలకి వర్తింపజేసుకోవచ్చు. రాగానికి విస్తరణ వున్నా రాగాలతో సమస్య లేదు. రాగవిస్తారం లేదా దాని పరిధి తక్కువ వున్నప్పుడు – కొంచెం కష్టతరం కావచ్చు. ఉదాహరణ 3 స్వరాలు వున్న రాగాలు (లేదా) బాలమురళి గారి రాగ రచన. ఉదా. (గణపతి రాగం) గంగణపతి పాట Theme సేనావతి. మేళ జన్యం.
ప్రశ్న: ఎలాంటి భావగీతాన్నైనా సులువుగా స్వరపరచగల రాగం ఏది? ఎందువల్ల?
జ: ఒక జనకరాగానికి.. ఉదాహరణ శంకరాభరణం రాగంలో జన్యరాగం ఆధారంగా 29 మేళకర్త ధీర లో జన్యాలను తీసుకోవచ్చు. ధీర శంకరాభరణం – శివునికి ప్రియమైన రాగం. హిందుస్తానీ సంగీతంలో బిలవల్ అని; పాశ్చాత్య సంగీతంలో C-Major అనీ అంటారు. C, D, E, F, G, A, B దీని స్థాయిలు. Do, Re, Mi, Fa, Sol, La, Si దీని Western notes.
జ: భక్తి గీతాలకు నాట, మోహన, కాంభోజి, హంసధ్వని, షణ్ముఖప్రియ మొదలగు రాగాలు; ఆధ్యాత్మిక గీతాలకు – సింధుభైరవి, దేశ్, బాగేశ్వరి, మాయామాళవగౌల, బౌళి, చారుకేశి, సావేరి, చక్రవాకం మొదలైనవి.
ప్రశ్న: ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ పుస్తకంలోని మొదటి గీతాన్ని సుపోషిణి రాగంలో కూర్చారు. ఈ రాగం విశేషత ఏమిటి?
జ: ఈ రాగం అపురూప రాగం. త్యాగయ్య కృతి ‘రమించువారెవరు’ (రూపక) ప్రసిద్ధి. అపురూప రాగాలలో ఒక ప్రయోగం కొసం నా భావగీతికని ఈ రాగంలో రచించాను. 28 మేళ హరికాంభోజి జన్యం ఉభయవక్ర షాడవ రాగం. ఆరోహణ – స రి గ మ ప ని ద స. అవరోహణ – స ద ని ప మ రి మ స. ద్వివక్ర – ఆరోహణ అవరోహణ స, ద. వక్ర ఆరోహణలో. ని, మ – వక్ర అవరోహణ. గ వర్జ్యం. చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కైశికి నిషాధం స్వరస్థానాలు. వాయిద్య పరికరాలకు ఈ రాగం చక్కగా వుంటుంది కూడా.
ప్రశ్న: ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ పుస్తకంలోని గీతాలకు ఎక్కువగా నప్పిన రాగం ఏది?
జ: మోహన, సింధుభైరవి, వరాళి, కానడ రాగాలు.
జ: సాహిత్యం ‘కళ్యాణ రామ – జానకీరామా’ అంటూ రాముని కని, అందం వర్ణించలేనిది – గుణాలు అంతకు మించినవి. అటువంటి మంగళరూపునికి కళ్యాణి రాగం ఆపాదించి శాశ్వత ఆనందం కావాలని వేడుకొనుటయే. అందుకే ఆ రాగం!
ప్రశ్న: ‘సమ్మోహన రాగ రవళి’ పుస్తకం మొత్తంలో ఒకే గీతానికి ఝంఘటి రాగం ఉపయోగించారు? ఈ రాగం ప్రత్యేకత ఏమిటి?
జ: ఝంఘటి రాగం ధైవత్యాంత భాషాంగ రాగము. అంటే ఆరోహణ – ధ స రి గ మ ప ధ ని; అవరోహణ – ని ధ ప మ గ రి స ని ధ. భాషాంగ రాగం – అన్య స్వరం వచ్చేది {సాధారణ గాంధారం (గ) అనే స్వరం.} షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కైశికి నిషాధము పరిమిత రాగ సంచారము.
ప్రశ్న: ఈ పుస్తకాల లోని గీతాలను ఆడియో రికార్డులుగా అందించే ఆలోచన ఏమైనా ఉన్నదా?
జ: ఉంది. తప్పకుండా. నేను కచేరీలలో, అలాగే ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్స్‌లో స్వీయగీతాలనే ఎంచుకుని పాడుతూంటాను. సు-స్వర సంగీత వేదిక, విశ్వసాయి వేదిక, స్వరకల్పనా సమారాధన మొదలగు వాటిలో పాడాను.
ప్రశ్న: సంగీత, సాహిత్య రంగాలలో మీ తదుపరి ప్రాజెక్టు ఏమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా రాబోతున్నాయా?
జ: నిరంతర కృషి చేస్తూ, సంగీత సాహిత్యాలపై విశ్లేషణ, విశేషాలు, క్రొంగొత్త అంశాలు సృజనాత్మకత జోడించి వ్రాస్తూన్నాను. పూర్తి అయిన పిదప ప్రచురణకు పంపిస్తాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. సి. ఉమాప్రసాద్ గారూ.
డా. సి. ఉమాప్రసాద్: ఈ అవకాశం ఇచ్చినందుకు సంచిక టీమ్ వారికి ధన్యవాదాలు. చక్కటి, విశ్లేషణాత్మక కూర్పులతో మీరు వెలువరించే విశేషాలు అద్భుతం. అందరికీ నమస్కారం.
***
సమ్మోహన రాగ రవళి
రచన: డా. సి. ఉమాప్రసాద్
పేజీలు: 266
వెల: ₹ 120/-
~
సుమనోహర ఆణిముత్యాల కూర్పు
రచన: డా. సి. ఉమాప్రసాద్
పేజీలు: 273
వెల: ₹ 120/-
ప్రతులకు:
డా. సి. ఉమాప్రసాద్
10-1-592, బలరామ్ బ్లాక్స్ ఎదురుగా,
వెస్ట్ మారేడ్‌పల్లి, సికిందరాబాద్ – 500 026.
ఫోన్: 7032725616, 9573374947
~
‘సమ్మోహన రాగ రవళి’, ‘సుమనోహర ఆణిముత్యాల కూర్పు’ అనే పుస్తకాల సమీక్ష:
https://sanchika.com/sammohana-raga-ravali-sumanohara-aanimutyaala-koorpu-book-review-kss/

