Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత, సంపాదకులు డా. శ్రీ దహగాం సాంబమూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూ

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ కు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన డా. దహగాం సాంబమూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]

~

సంచిక టీమ్: నమస్కారం డా. దహగాం సాంబమూర్తి గారూ.

డా. దహగాం సాంబమూర్తి: నమస్కారం.

శ్లో॥
నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే।
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరించి నారాయణ శంకరాత్మనే॥

జగదేక చక్షువు సూర్యునకు నమస్కార సహస్రములు. సర్వజగత్తుల స్థితిలయములకు కారణభూతుడు, వేదస్వరూపుడు త్రిగుణాత్మకుడు, బ్రహ్మావిష్ణుమహేశ్వర రూపుడు.. భావసాక్షికి ప్రణామశతములు.

శ్లో॥
వర్ణానాం అర్థసంఘానాం రసానాం ఛందసామపి।
మంగళానాం చ కర్త్తారౌ వందే వాణీ వినాయకౌ॥

సాహిత్యపోషకులైన జ్ఞానవృద్ధులు, సంచిక అంతర్జాల పత్రిక సంపాదక మండలికి నమశ్శతములతో..

~

ప్రశ్న 1: మీ సంపాదకత్వంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ వెలువరించినందుకు అభినందనలు. ఓ బృహత్కార్యాన్ని భుజాన వేసుకుని సక్రమంగా పూర్తి చేయడంలోని అనుభూతి అనుభవేకవేద్యం. ఈ అవకాశం మీకెలా వచ్చిందో మా పాఠకులకు వివరిస్తారా?

జ: ఆచార్య బన్న అయిలయ్య, శ్రీయుతులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, పొట్లపల్లి శ్రీనివాసరావు, కుందావఝల కృష్ణమూర్తి గారలు.. జనవరి 2026 చివరివారంలో ఓ సాయంత్రం స్థానిక దీప్తి ప్రింటింగ్ ప్రెస్‌లో సమావేశమయ్యారు. కోవెల వారి నవత్యుత్సవముల సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వారు మాట్లాడుకుంటూ.. శ్రీ గన్నమరాజు గిరిజామనోహరబాబు గారి పోను నుండి నాతో మొదట పొట్లపల్లి శ్రీనివాసరావు, ఆపై కుందావఝల వారు, ఆచార్య అయిలయ్యగారు.. తర్వాత శ్రీ మనోహరబాబు గారు మాట్లాడుతూ “మన గురువుగారైన ఆచార్యుల జన్మదిన వేడుకంలో భాగంగా హన్మకొండలో ఓ విశేష కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించాం.. అందులో భాగంగా వారి నవత్యుత్సవ అభినందన సంచికను ముద్రించాలన్న ఆలోచన ఉంది. ఆ సంచికకు మీరే (నేను, సాంబమూర్తి) ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించాలి” అని ఆదేశించారు. సాహితీమూర్తులు సంపాదకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించు మీవంటి వారుండగా నేను ఈ బాధ్యత తీసుకొనుట అంత సబబు దని విన్నవించుకొన్నాను.. నా విన్నపాన్ని కాదంటూనే, మరుసటి సాయంత్రం ఇతర వివరాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఓ విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.. తప్పకుండా మీరు (నేను) రండి.. సంపాదకులుగా మీరే వ్యవహరించాలంటూ ఆత్మీయంగా మరోమారు ఆదేశించారు. నాకీ సంపాదకత్వ  బాధ్యత అప్పగించటానికి గతం లోని,  అద్యతనం లోని కొన్ని సందర్భాలు కూడా కారణం కావచ్చునని భావిస్తున్నాను.

పై మూడు సందర్భాలు నేను ప్రస్తుత సంచికకు సంపాదకత్వం వహించడానికి కారణాలై యుండవచ్చని భావిస్తున్నాను.

ప్రశ్న 2: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారితో మీ పరిచయం ఎప్పటిది? వారి నుంచి మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏం నేర్చుకున్నారు?

జ: ఆచార్యుల వారితో నాకు 1966లోనే కాస్త పరిచయముంది. నేను స్థానిక బిఇడి కళాశాలలో బి.ఇడి శిక్షణ పొందుతున్నప్పుడు మిత్రమండలి సమావేశాలకు వెళ్ళేవాడికి. ఆ రోజుల్లోనే వారి చేతానవర్తం కవితా సంపుటి వెలువడినది. అంతేగాక 1970 లలో అత్యంత సమీపస్థ పరిచయం.. నా మిత్రుడు శ్రీ మాధవరావు గారి ద్వారా జరిగింది. 1970 లో నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిజేస్తూనే ప్రయివేటుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఎం.ఏ. తెలుగు ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాసేందుకై సెలవు తీసుకుని హన్మకొండకు వచ్చాను. పరీక్షలు దాదాపు మూడు నెలలు వాయిదా పడ్డాయి. కారణం తెలంగాణా ఉద్యమం. మిత్రుడు మాధవరావు ఎం.ఎ. తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతూండేవాడు – తనతో బాటు నన్ను తీసుకొని వెళ్ళి పిజి సెంటర్ (ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ) ఆచార్య బిరుదు రామరాజు గారు, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు, ఆచార్య కేతవరపు రామకోటేశ్వరరావుగారు, ఆచార్య మాదిరాజు రంగారావు గార్లకు నా గురించి చెప్పాడు నా పరిస్థితి, పరీక్షల సన్నద్ధతను.. మొదటి సంవత్సరం పరీక్షలో వచ్చిన మార్కులు (73%) మున్నగునవి వారికి నివేదించి ప్రతి రోజూ తరగతులకు హాజరుకావడానికి వారి అనుమతిని అభ్యర్థించాను. వారు నల్వురూ దయతో అందుకు అంగీకరించారు – దాదాపు రెండు నెలల కాలం తరగతులకు (ఉచితంగా) హాజరై రెండో సంవత్సరం పరీక్షలలో 70% మార్కులు సాధించాను. తరగతులకు హాజరయ్యే కాలంలోనే ఆచార్యుల వారితో అత్యంత సమీప పరిచయం కల్గింది. వారు వసుచరిత్ర ద్వితీయాశ్వాసం చెబుతుండేవారు. నేను వారి నుండి పలు సందేహాలు తీర్చుకొంటూ.. రెగ్యులర్ విద్యార్థులతో బాటు అత్యంత విధేయుడుగా ఉండేవాడిని. వారు పలు విషయాల్లో నాకు సూచనలు చేసేవారు. ఇలా మొదలైన పరియం.. 1979లో నేను M.Ed. కూడా పూర్తి చేసుకొని హన్మకొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలకు తెలుగు బోధన పద్ధతులలో అధ్యాపకుడుగా పదోన్నతిపై చేరిపోయాను. ఆ కాలంలో ఆచార్యులవారు కాకతీయ విశ్వర్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులు.. అలా ఆనాటి నుండి పలు సందర్భాల్లో వారితో మాట్లాడటం, ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో నా కృషిని వారు ప్రోత్సహించి ఆశీర్వదించడం జరుగుతూ వస్తోంది.. ఆనాటి నుండి వారి నుండి ఎన్నో సాహిత్యశిల్ప రహస్యాలను వినుటకు, తద్వారా లబ్ధి పొందుటకు నాకా దైవం తోడ్పడ్డాడు. ఈ పరిచయమే ఆచార్యుల వారి ఋణం తీర్చుకోవటానికి సంచిక తయారీలో ప్రధాన సంపాదకత్వ బాధ్యత తీసుకున్నాను. ఐతే ఈ బాధ్యతను నేను ఏ మేరకు సమర్థంగా నిర్వహించానో పాఠక మిత్రులు నిర్ణయించాలి.

ప్రశ్న 3: ‘ప్రతిభాసుప్రసన్నము’ ప్రచురించాలన్న ఆలోచన నుంచి పుస్తకం ఆవిష్కరణ వరకూ – ఎంత కాలం పట్టింది? సమితి సభ్యులలో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించారు?

జ: ఈ నేపథ్యంతో పండిత మిత్రుల ఆదేశాన్ని కాదనకుండా మరునాటి సమావేశమునకు వెళ్ళాను. ఆ సమావేశానికి మరికొందరు మిత్రులు వచ్చారు, అందరం కల్సి మాటామంతీ తరువాత ఆచార్య బన్న అయిలయ్య (ప్రసన్నగారి ప్రత్యక్ష శిష్యలు) గారు అధ్యక్షులుగా, శ్రీ గన్నమరాజు మనోహరబాబు గారు ప్రధాన కార్యదర్శిగా, నేను అభినందన సంచికకు సంపాదకుడుగా.. మరికొందరు ఉపాధ్యక్షులు, సలహాదారులు, ఆర్థిక కార్యదర్శి, సహాయ కార్యదర్శులు, గౌరవ సలహాదారులతో ఒక అభినందన సమితి ఏర్పాటైంది.

ఈ సమావేశంలో అభినందన సంచిక రూపురేఖలు.. రచనలు .. మున్నగు విషయాలపై భావ వినిమయం జరిగింది. ఆచార్యుల వారి ‘అశీతి’ సంచిక వారి రచనలన్నిటిపై సమగ్ర విష్లేషణతో కూడిన వ్యాసాలతో సుసంపన్నమైనందున.. ప్రస్తుత నవతి సంచికలో వారి జీవనరేఖలు, అశీతి తర్వాత వారు చేసిన రచనలు, వారిపై కందుకూరి శివానందమూర్తి, అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి, విశ్వనాథ ప్రభృతుల ప్రభావాలు.. వారికి అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాలపై గల సాధికారత, ఉపనిషత్తులు, సూక్త సాహిత్యం, ఆర్ష సాహిత్యం, వేదములు.. మున్నగు వాటిపై గల అవగాహనలతో బాటు వారి వ్యక్తిత్వ చిత్రణతో.. సంచికను రూపొందించాలని నిర్ణయించాం. సంచిక కూడా మూడు వందల పేజీలకు మించకుండా.. ఫిబ్రవరి నెలాఖరు లోగా ప్రచురణకి సిద్ధం చేసి అచ్చొత్తించి, మార్చి 26న నిర్వహించే సన్మాన సభలో ఆవిష్కరణ జరిపించాలని నిర్ణయించాం. ఆచార్యుల వద్ద పరిశోధన చేసిన మిత్రులు, శిష్యులు.. వారి ఆప్త బృందంలోని వారిని  రచయితలుగా ఎంపిక చేయాలని – నేనొక వైపు గన్నమరాజు గారు  మరొక వైపు దాదాపు 25మంది పండిత మిత్రులకు ఫోను చేసి అభినందన నంచికకు వారినుండి.. నియత శీర్షికలపై  వ్యాసాలను అభ్యర్థించాము. అభ్యర్థించటంతో పాటు ఫిబ్రవరి 15వ తేదీ లోగా వ్యాసాలను అందించాలని కూడా కోరాము. శీర్షికలు అప్పగిస్తున్నప్పుడే వీలైనంత వరకూ పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డాము. చి. కోవెల సంతోష్ కుమార్‌ను ఆచార్యుల జీవన యానం విపులంగా వ్రాయమని కోరాము. అంతేకాదు, సంచికకు ‘ప్రతిభాసుప్రసన్నము’ అనే పేరును నేను సూచించాను. అభినందన సమితి సభ్యులకు శీర్షిక యొక్క ప్రత్యేకతను చెప్పాను. భగవద్రామానుజులు అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్య జనులకు ప్రసాదించారు. భగవద్రామానుజుల సంప్రదాయి యైన ఆచార్యుల వారి ప్రతిభానవనవోన్మేషణశాలిని అవడం వల్ల ఎనిమిది అక్షరాలతో ‘ప్రతిభాసుప్రసన్నము’ అని చేసిన సంచిక నామకరణము సార్థకమని అందరూ అంగీకరించారు.

ఇలా ఫిబ్రవరి నెలాఖరు నాటికి సంచిక తొంబదిపాళ్ళు సిద్ధమైంది.

ప్రశ్న 4: ‘ప్రతిభాసుప్రసన్నము’ పుస్తకం కోసం రచనలని ఆహ్వానించేటప్పుడు వ్యాసకర్తలకి ఏవైనా నిర్దిష్ట సూచనలు చేశారా? వ్యాసాంశాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: జనవరి చివరి వారంలో జరిగిన మొదటి సమావేశంలోనే రచయితలను సంప్రదించి వారు రాయాల్సిన శీర్షికను కూడా సూచించడమైనది. రచించిన వ్యాసం రాతప్రతి లేదా డిటిపి రూపంలో పంపమని.. ఇందుకు గడువు 15 ఫిబ్రవరిగా చెప్పడం జరిగింది. మరునాడు గౌరవ్యులైన అందరు రచయితలకు వారు వ్రాయాల్సిన వ్యాసం.. శీర్షిక.. నిడివి.. వ్యాసం మాకు చేరాల్సిన కాలాన్ని సూచిస్తూ వాట్సప్ సందేశాలు పంపడమైంది.. ప్రతి వారంలో రెండు పర్యాయాలు వీలైతే స్వయంగా ఫోను ద్వారానూ, వాట్సప్ సందేశాల రూపంలోనూ వ్యాసరచననను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పంపమని అభ్యర్థించాము. ఇందుకు శ్రీ గిరిజామనోహరబాబు గారు – వారికి గల విస్త్రృత పరిచయాల వల్ల.. బహుధా సహకరించారు. అభ్యర్ధించిన విధంగా డా. యల్.యన్.ఆర్. ప్రసాద్ గారు ఆచార్యుల వారిని ఆంగ్ల కవి మిల్టన్‌తో పోలుస్తూ ఆంగ్లంలో వ్రాసి పంపిన వ్యాసం ఫిబ్రవరి, ఒకటో తేదీన చేరింది. ఇలా దాదాపు 70% వ్యాసాలు ఫిబ్రవరి 15 కల్లా,  ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారానికి 90% వ్యాసాలు చేరాయి. చి. కోవెల సంతోష్ కుమార్, ఆచార్యుల వారి జీయన యానం ‘తపస్వీవాగ్విదాం వరః’ అను శీర్షికతో వ్రాసిన చిత్తుప్రతిలో కొన్ని చేర్పులు సూచించాము. కొందరి రచనలలో ఒకింత సారూప్యత కనబడినా.. ఆయా విషయాల సమగ్ర విశ్లేషణము.. రచనాశైలి భిన్నంగా ఉన్నందుకు.. ప్రచురణకు అంగీకరించాము.

ఇక వ్యాసాలు అందినవి అందినట్లుగా డిటిపి చేయించి.. లేదా ప్రింటు తీసుకొని వాటిని ఒకటికి రెండు మార్లు చదివి.. అక్షర దోషాలు.. వాక్యనిర్మాణ పునరుక్తులు మున్నగునవి (వ్యాసకర్తల అనుమతితో సవరించి) శుద్ధ ప్రతులను సిద్ధం చేయుట జరిగింది. ఇందుకు శ్రీ గన్నమరాజు వారితో బాటు శ్రీ కుందావఝలవారు కూడా తమ సమయాన్ని వెచ్చించారు.

ఇదే కాలంలో నేనున్నూ సంపాదకీయం వ్రాసి మిత్రుల ముందుంచి మార్పులు చేర్పులను ఆహ్వానించాను. గౌరవ్యులు అయిలయ్య, కృష్ణముర్తి, గిరిజామనోహరబాబు, చి. సంతోష్ ప్రభృతులు మార్పులు చేర్పులు సూచించగా ఫిబ్రవరి 25 నాటికి సంపాదకీయం శుద్ధ ప్రతిని కూడా సిద్ధం చేశాము.

ప్రశ్న 5: ‘ప్రతిభాసుప్రసన్నము’ పుస్తకం కోసం రచనలు అందించిన వారంతా ఉద్ధండులే, దాదాపు మీ సమకాలికులే. వారి రచనలకు సంపాదకుడిగా వ్యవహరించడం ఎలా అనిపించింది?

జ: ఔను, ‘ప్రతిభాసుప్రనన్నము’ నకు తమ అమూల్యమైన రచనలు ఇచ్చిన వారిలో విశ్వవిద్యాలయాల విశ్రాంత ఆచార్యాలు, ఉద్యోగిస్తున్న ఆచార్యులు, వైద్యశిఖామణులు, పండితులు, విమర్శకులు, కవులు, పారమార్థికచింతనాపరులు ఉన్నారు. వారి రచనల్లో ఉపనిషత్తులు, వేద సూక్తాలు, శాక్తేయ, అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయ రచనల ప్రస్తావనలున్నాయి. ప్రధానంగా శ్రీవిద్యా సంప్రదాయం, స్త్రీసూక్తం, తైత్తరేయాది ఉపనిషత్తుల ప్రస్తావనలు గల వ్యాసాలు వ్రాసిన వారున్నారు. అంతేకాక, వచన కవిత్వంలో ఖండాంతర కవిగా వాసికెక్కిన వారున్నారు. వీటితో బాటు అరవిందులు, కందుకూరి శివానందమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి బోధనలు, తాత్త్వికతలపై సాధికారికంగా అభివ్యక్తీకరించ గలవారున్నారు. అంతేగాక ఆచార్యుల వారి వద్ద పరిశోధన మార్గదర్శనం పొంది.. వారి దార్శనికతను, తాత్త్వికతను అవగాహన చేసుకొన్న మిత్రులున్నారు. పద్యపుష్పోపహారంతో ఆచార్యులను సమ్మానించిన వారిలో డిగ్రీ కళాశాలల ప్రాచార్యులు.. ఒక ఔషధశాస్త్రవేత్త ఉన్నారు. ఈ వ్యాసాలలో ఒక పద్యవ్యాసం కూడా సుప్రసన్నోదాహరణముంది. అంతేగాదు విశ్వనాథను బాగా అధ్యయనం చేసినవారు, ఆధునిక విమర్శను ఆపోశన పట్టినవారు, సంప్రదాయ సాహిత్యంపై పట్టు ఉన్నవారూ ఉన్నారు. వ్యాస రచయితలు ఆచార్య సాగి కమలాకర శర్మ, ఆచార్య తాడేపల్లి పతంజలి, ఆచార్య యల్లంభట్ల సుదర్శనరావు (భారతీయ చరిత్ర సంస్థాధ్యక్షులు – విశ్రాంత).. కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జన్ డా. లంకా శివరామప్రసాద్, ఖండాంతర కవి వి.ఆర్. విద్యార్థి, డా. గుంజి వేంకటరత్నం, డా. కాత్యాయని విద్మహే, డా. వద్దిరాజు వేంకట రామారావు, డా. హైమవతి, డా. గండ్ర లక్ష్మణరావు, శ్రీ వరిగొండ కాంతారావు, శ్రీ వావిళ్ళ రామశాస్త్రి, శ్రీ ఆరుట్ల భాష్యాచార్య, డా. దేవరాజు రాంభావు, డా. ఏల్చూరి మురళీధరరావు (ప్రసన్నశారద పురస్కార గ్రహీత), డా. అంపశయ్య నవీన్, శ్రీ రామా చంద్రమౌళి, ఆచార్య బన్న అయిలయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావు, శ్రీ గన్నమరాజు గిరిజామనోహరబాబు, డా. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి ,  డా. పాతూరి రఘురామయ్య, డా. యల్లంభట్ల నాగయ్య, డా. వఝల రంగాచార్యులు, శ్రీ చేవూరి శ్రీరామారావు, ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన శ్రీ అనిల్, డా. వఝల శరత్ బాబు గారలు ఉన్నారు.

వీరందరి పరిచయం.. వారి పాండిత్య ప్రతిభలను రుచి చూసే సౌభాగ్యం నాకీ సంపాదకత్వ బాధ్యత కల్గించింది.

ఆచార్యుల జీవనయానంపై చి. కోవెల సంతోష్ కుమార్ వ్రాసిన దాదాపు ఒక మోనోగ్రాఫ్ నిడివి (70 పుటల) వ్యాసం ద్వారా కూడా ఆచార్యుల వారిని గూర్చి సంపూర్ణంగా తెల్సుకోవడానికి తోడ్పడింది.

ఇందరు ప్రఖ్యాతులు.. తమదేయైన మార్గంలో ప్రతిభావ్యుత్యత్తి సంపన్నులైన వారి రచనలను ఏకత్రితం చేసి వాటిని శుద్ధప్రతులుగా తీర్చిదిద్దే బాధ్యత నాకు లభించటం.. ఓ విధంగా నా స్థాయికి మించిన కార్యమే. ఈ రచయితలలో పలువురితో నాకు ప్రత్యక్ష సంబంధాలు లేకున్నా.. వారందరినీ తొందరపెట్టి ఫోన్ ద్వారా, వాట్సప్ సందేశాల ద్వారా.. నేను ఎంతో నేర్చుకున్నాను. ఇలా వారి వారి అధ్యయన క్షేత్రాల్లో పాఠం ముట్టిన పండితులందరికీ.. త్యాగయ్య మాటల్లో ‘ఎందరో మహానుభావులు – అందరికీ వందనములు..’.

ప్రశ్న 6: ఓ లివింగ్ లెజెండ్ జీవితాన్ని, సాహిత్యాన్ని, జీవన దార్శనికతని ‘ప్రతిభాసుప్రసన్నము’ పుస్తకం ప్రతిఫలించగలిగిందన్న తృప్తి మీకుందా?

జ: వాస్తవానికి సుప్రసన్న గారు ఒక సాహిత్య విజ్ఞాన సర్వస్వము. అట్లే ఒక ఆర్షవిజ్ఞాన సర్వస్వమూనూ. వారు ఏకసంథాగ్రాహులు. వారు ఏ విషయంపై మాట్లాడినా.. ఇతః పూర్వం కన్నా ఆ విషయంలో మరో కొత్త దృక్కోణాన్ని ఆవిష్కరిస్తారు. వారి ఆలోచనా స్రవంతి బహుముఖీనమైనది. ఆ స్రవంతి సూర్యచంద్ర తారకల రోచిస్సుల వంటిది. వారి రచనలపై ఎందరు రచనలు చేసినా అవి చంద్రునికో నూలు పోగు వంటివే గాని సమగ్రాలు కాలేవు. వారి రచనలన్నీ విజ్ఞాన జ్యోతులే. వారిపై తత్త్వవేత్తలు,ద్వైతాద్వైతావిశిష్టాద్వైత, శాక్తేయ సిద్ధాంతాల ప్రభావం ఉంది. వారు లివింగ్ లెజండ్.. అని అశీతి సంచికలో గన్నమరాజుగారు ప్రస్తావించినది వాస్తవం. వారి రచనలలోని అంతరంగాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడానికి వారి స్థాయి పాండిత్యం ఉన్నవారితో మాత్రమే సాధ్యమౌతుంది. ప్రస్తుత సంచిక కూడా వారి ప్రతిభావ్యుత్పత్తులను సంపూర్ణంగా ఆవిష్కరించినదని చెప్పుట సాహసమే అవుతుంది. ప్రధాన సంపాదకుడుగా, సంపాదకవర్గం వారి సాయంతో ఈ సంచికను సంతృప్తికరంగా తీర్చిదిద్దానన్న తృప్తి ఉంది.

ప్రశ్న 7: కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’లో సుప్రసన్న గారి రచన ‘ప్రబంధాతరంగరోచిస్సులు’ చేర్చడంలోని ఆంతర్యమేమిటి?

జ: హన్మకొండ లోని ప్రఖ్యాత సాహితీ సంస్థ ‘సహృదయ సాహిత్య సంస్థ’. ఆ సంస్థ కోసం  ఆచార్య తాడేపల్లి పతంజలిగారు పదేళ్ళ క్రితం (దాదాపు).. ‘ప్రాచీన ప్రబంధం, ఆధునిక సంతకం’ అను పేర ఒక లఘ రచన చేశారు. అ లఘ రచనకు ఆచార్య సుప్రసన్నగారు ముందుమాట వ్రాశారు. ఆ ముందుమాటకే ‘ప్రబంధాతరంగరోచిస్సులు’ అని నేను నామకరణం చేసి నవతి సంచికలో చేర్చాను. ఆచార్యుల వారి పరిశోధన క్షేత్రం ప్రబంధం.. వసుచరిత్ర.  ఆ పరిశోధనా వ్యాసం రాతప్రతి రూపంలోనే ఉంది. ఇంతవరకు అచ్చుకు వెళ్ళలేదు. ఆ వ్యాసం వారికి ప్రబంధములపై గల సాధికార ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తుందిది. అందువల్లే నవతి సంచికలో ఆ వ్యాసం చేర్చాం.

ఈ సంచికలో చేర్చిన మరో వ్యాసం కీ.శే. డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు ఆచార్యుల వారి ‘శివాభిసారిక’ పై చేసిన ప్రసంగవ్యాసం (రాసిన ముందుమాట కూడా). పోతన విజ్ఞానపీఠంలో ఆచార్యుల వారి సమక్షంలో కవితాప్రసాద్.. ఆచార్యుల వారిని భారతీయ ఆత్మను సంపూర్ణంగా అర్థం చేసుకున్న విశిష్ట చింతనాశీలి యని అభినందించిన వ్యాసమిది. ఈ వ్యాసంతో నేను వారి ఋణాన్ని తీర్చుకుంటున్నదే ‘శివాభిరణం’ అన్న కవితా ప్రసాద్ వారి మాటలు అక్షరసత్యాలు (కవితా ప్రసాద్ గారు ఈ సమావేశం తర్వాత కొన్ని రోజులకే ఆ పరమశివునిలో లీనమయ్యారు). ఈ వ్యాసం కూడా నవతి పాఠకులకందివ్వాలన్న ఆలోచన సాకారమైంది.

ప్రశ్న 8: ఆలస్యంగా అందడం అన్న కారణంతో కాకుండా, వేరే కారణాల వల్ల ఎవరివైనా రచన తిరస్కరించడం జరిగిందా?

జ: ప్రస్తుత సంచికకు అభ్యర్థనను మన్నించి పండితులందరూ తమ అమూల్యమైన రచనలను సకాలంలో అందించారు. ఎవరి రచననూ తిరస్కరించలేదు. ఒకరిద్దరు మిత్రులు వ్యాసం పంపలేకపోతున్నామని సందేశం పంపారు. ఒకరిద్దరు మిత్రులు.. నవతి సంచికకు మా వ్యాసం పంపుతాము, అనుమతిస్తారా అన్నారు. అలా ముందుగా మేము అభ్యర్థించని మిత్రుల వ్యాసాలను కూడా సంచికలో చివరి దశలో చేర్చుట జరిగినది.

ప్రశ్న 9: సుప్రసన్నాచార్యగారి షష్టిపూర్తి అభినందన సంచిక ‘ప్రసన్న శారద’ లో గాని, అశీతి పూర్తి అభినందన సంచిక ‘సన్నుతి’లో గాని మీరు సంపాదక మండలి సభ్యులుగా ఉన్నారా? లేదా వ్యాసాలు అందించారా?

జ: ఆచార్యుల వారి షష్టిపూర్తి, అశీతి సంచికలు వెలువరించిన కాలంలో నేను గ్రామాంతరం లోనూ, విదేశాల్లోనూ ఉన్నాను. అందువల్ల ఆ సంచికలకు నంపాదక మండలిలో సభ్యుడను కాలేకపోయాను. అశీతి సంచికకై.. ‘భాష వ్యాకరణం’ అను అంశంపై ఒక విపుల వ్యాసం వారికి ఇచ్చాను. కాని అది అచ్చుకు నోచుకోలేదు. ఇందుకు కారణం అశీతి సంచిక కేవలం ఆచార్యుల వారి రచనలు, వారిపై తత్వవేత్తలు ప్రభావాలు.. అను విషయముకే పరిమితం అయింది. అయితే నేను ఇచ్చిన వ్యాసం సహృదయ వారి మరో ప్రచురణలో అచ్చుకు నోచుకుంది.  పోతే నవతి సంచిక వెలువరించే నాటికి ఒక వ్యాస రచయితగా నన్ను పరిమితం చేయకుండా ఏకంగా ప్రధాన సంపాదకునిగా బాధ్యత అప్పగించిన అభినందన సమితి సారథులకు కృతజ్ఞతల నావిష్కరిస్తున్నాను. ఈ విధంగా సంపాదకీయం వ్రాసి ఆచార్యుల వారి ఋణం తీర్చుకోనే అవకాశం లభించింది.

ప్రశ్న 10: పద్యాలు, వ్యాసాల నడుమ ఒక ఇంటర్వ్యూ చేర్చాలన్న ఆలోచన బాగుంది. సుప్రసన్నగారితో పొట్లపల్లి శ్రీనివాసరావు గారి ముఖాముఖి అందించడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి?

జ: ఇటీవలె అజోవిభో కందాళం ఫౌండేషన్ వారి పక్షాన ప్రచురించిన డా.వేంకటరత్నం గారి అభినంధన సంచిక ‘ప్రతిభావైజయంతి’ లో వారితో ముఖాముఖి చేర్చాను. ఆ సంచికను చదివిన పలువురు మిత్రులు ముఖాముఖి చేర్చడం సత్కారం అందుకుంటున్న వారి వాణిని వినే చదివే అవకాశం లభించిందని ప్రశంసించారు. ఈ దృష్ట్యా తెలుగు సాహిత్యంలో చేతనావర్త కవిత ద్వారా ఒక వినూత్న రచనా సంప్రదాయానికి తెరదీసిన నల్వురు మిత్రులలో ఒకరైన ఆచార్యుల వారిని ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలు పాఠకులకు అందిస్తే బాగుటుందని నిర్ణయించాము. ఇందుకు, మా సంపాదక వర్గ మిత్రులు  శ్రీ పొట్లపల్లి శ్రీనివాసరావు, శ్రీ కోవెల సంతోష్ కుమార్ సాయంతో  ఇంటర్యూ చేసి ‘చైతన్యావర్తనం’.. (పేరు నేను సూచించాను) అను పేర ఆచార్యుల వారి ఆలోచనలు అభిప్రాయాలు నమోదు చేశారు. ఈ ముఖాముఖి కూడా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుందన్న విశ్వాసం ఉంది.

ప్రశ్న 11: “ఎవడికి వాడే వెలుగునీడల సంపుటి/ప్రపంచమంతా చైతన్య కల్లోల సంవర్తావృతి/ఎవ్వని వ్యాఖ్యానమూ సంపూర్ణ సత్యం కాదు” అన్న సుప్రసన్నగారి ఆలోచనపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: ఆచార్య సుప్రసన్నలు పుంభావ సరస్వతీమూర్తులు, వారు భారతీయ సంస్కృతికీ, ఆర్షధర్మమునకు ప్రతినిధులు. వారికి వేదములు, ఉపనిషత్తులు, సూక్తములు, దర్శన శాస్త్రములపై గల పట్టు అనితరము. వారు అంతరాంతరాల్లో తేజశ్చక్రాన్ని దర్శించినవారు, పారమార్థిక చింతనాపరులు. విద్యారణ్యులు నడయాడిన నేలలో ప్రభవించిన ఆచార్య సుప్రసన్నులు అనుయాయులకు, మిత్రులకు, శిష్యప్రశిష్యులకు నడుస్తున్న దైవం. కొంగు పసిడి. పలువురకు సందేహ నివృత్తి కల్గించే ఆచార్యులవారి అభిప్రాయాలు, ఆలోచనలు  జాతికి శ్రేయోదాకాలు. మానవజాతి అభ్యున్నతికి మార్గదర్శకాలు. వారి అభిప్రాయాలతో, సాహిత్య శిల్పంపై, ఆలోచనలతో ఏకీభవించని వారు ఉండరు. వారు ఓ విధంగా అజాతశత్రువు. నాలాంటి అంతేవాసులకు, అనుయాయులకు వారు పెట్టిన జ్ఞానభిక్షకు విలువ కట్టలేం. కేవలం నమస్సుల నావిష్కరించుట తప్ప.

ప్రశ్న 12: సుప్రసన్నాచార్యగారి సాహితీకృషి గురించి, వారి తాత్త్వికత గురించి, దార్శనికత గురించి ఇప్పటి తరం వారికి తెలియజెప్పడం ఎలా? తెలుగు భాషకి దూరమౌతున్న పిల్లలకి సుప్రసన్నగారి పాండితీగరిమ సులువుగా అవగతమవ్వాలంటే ఏం చేయాలని మీరు భావిస్తున్నారు?

జ: సుప్రసన్నగారు తొంబదేండ్ల ప్రాయంబులోనూ, ఇటు సమాజంలోనూ – అటు సాహిత్య క్షేత్రం లోనూ ఎన్నో ధోరణులను సంభవంలోకి తెచ్చుకున్నారు. వారు ఏ ధోరణికీ లొంగకుండా తమ రచనలలో భారతీయ సంస్కృతిని, భారతయ ఆత్మను, సనాతన ధర్మమును ఆవిష్కరించారు. ఓ విధంగా రంగరించారు. అద్వైతమూ, విశిష్టాద్వైత సంప్రదాయములను రెంటినీ, వీటితో బాటు శ్రీ వాణీగిరిజలను -శ్రీవిద్యా సంప్రదాయాలను.. లలితా త్రిపుర సుందరి రహస్యాలను  అవగతం చేసుకున్న సమచిత్తులు. సుఖదుఃఖాలు కాలప్రభావాలే తప్ప, క్రుంగిపోవుటలు, పొంగిపోవుట ఎరుగని మహనీయులు. తను అనుయాయులు, శిష్యులు సాహిత్యంలో ఇతర ధోరణులను అవలంభించిననూ.. ఆ మార్గం సరికాదని హెచ్చరించనివారు – కాలమే వారిని సన్మార్గ వర్తనులను. భారతీయ సనాతన ధర్మ మార్గంలో నడిపిస్తుందని విశ్వసించినవారు. ఈ విధమైన వ్యక్తిత్వం ప్రస్తత సమాజంలో.. తరంలో.. మరొకరిలో కనబడదు. నిరాశానిస్పృహలను వదలిన ధనాత్మక దృక్పథం వారిది. ఆనాడు దుష్ట శిష్టణ, శిష్ట రక్షణకు ఆ పరమాత్మ ధరించిన అవతార పరంపరలోని అంతరార్థాన్ని అవగతం చేసుకున్న నాడు లోకంలో చెడు దూరమై ధర్మం మంచితనం సుస్థాపితమవుతుందన్న విశ్వాసం గల సుప్రసన్నుల వారి భావనా సంపద అనన్యము, అపూర్వము.

ఈ దృష్ట్యా ఆచార్యుల వారి రచనలు, ఆ రచనలు సమాజానికి అందించే సందేశాలను మోనోగ్రాఫ్‌లుగా సిద్ధం చేయడానికి ‘సుప్రన్న సాహిత్య పీఠం’ అను పేర.. స్వాధ్యాయ – సంచికల భాగస్వామ్యంతో వెలికి తీసుకొని రావల్సిన అవసరముంది. వారి రచనలను సామాన్య పాఠక లోకానికి కూడా అందుబాటు లోకి తేవాల్సిన బాధ్యత కూడా మనందరికి ఉంది..

ఎన్ని జాగత్రలు తీసుకున్నా ఈ సంచికలో అచటచట స్థూలదృష్టికి కనబడని అక్షర, భావ దోషాలు దొరలి యుండవచ్చు. ఆ దోషాలు నావి మాత్రమే గాని ఆ యా రచయితలవి కావని మనవి చేస్తున్నాను.

కేవలం పి.యు.సి. వరకు నియత పాఠశాలల్లో చదివి ఆ తర్వాత ప్రైవేటుగా పరీక్షలు వ్రాసి.. ఏకోపాధ్యాయ పాఠశాల నుండి ప్రభుత్వ ప్రాధ్యాయ విద్యాకళాశాల ప్రధానాచార్యుల వరకు అంచెలంచలుగా పదోన్నతులు పొంది (ఇరువది నెలల పాటు జిల్లా విద్యాధికారిగా కూడా పనిచేశాను) ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఉత్పత్తి యోగ్యమైన వయస్సులో చాలా కాలం గడిపిన నేను 2008 ప్రాంతం నుండి సాహిత్య అధ్యయనం వైపు దృష్టి మరల్చాను. ఐనా పాఠశాల విద్యాక్షేత్రంలో పాఠ్య పుస్తకాల నిర్మాణం, పరీక్షల మూల్యంకన మార్గదర్శకాలతో బాటు బోధనాశాస్త్రం లోని పలు పాఠ్యాలపై వ్యాసాలు, పుస్తకాలు రాసాను. విద్యార్థుల కొరకు మాత్రమే రాసిన ‘వ్యాస మంజూష’, ‘వ్యాకరణ మంజూష’లు పలువురి ఆదరణకు నోచుకున్నాయి.

ప్రపంచ తెలుగు మహాసభల కోసం మోనోగ్రాఫ్‌లు (తెలుగునాట విద్యావికాసము), వానమామలై వరదాచార్యులు, భాషావిద్య అను మోనోగ్రాపులు తెలుగు అకాడమీ కోసం రాసాను. తెలుగు అకాడమీ బి.యిడి – డి.యిడి పాఠ్యపుస్తకాల రచయితగా, సంపాదకునిగా, ప్రశ్నల నిధుల సంపాదకుడుగా ఉడుతాభక్తితో విద్యారంగానికి సేవలందిస్తున్న నాకు.. నన్ను సాహిత్య క్షేత్రంలోకి ప్రవేశం కల్పించి నాచే – సంపాదకీయాలు వ్రాయిస్తున్న శ్రీ గన్నమరాజు గిరిజామనోహరబాబు గారికి ఏమిచ్చుకోగలను, కేవలం కృతజ్ఞతలు తప్ప,

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. దహగాం సాంబమూర్తి గారూ.

డా. దహగాం సాంబమూర్తి: ఆచార్యుల వారి నవతి సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ నిర్మాణ బాధ్యత తీసుకున్న నాకు మీ అంతర్జాల పత్రిక ‘సంచిక’ ద్వారా.. నవతి సంచిక సంసిద్ధతను, అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించిన ‘సంచిక’ సంపాదక మండలికి నమస్కృతులను సమర్పిస్తూ..

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.

***

ప్రతిభాసుప్రసన్నము (ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సంచిక)
ప్రధాన సంపాదకులు: డా. దహగాం సాంబమూర్తి
ప్రచురణ: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సమితి, వరంగల్
పేజీలు: 270
వెల: ₹ 300/-
ప్రతులకు:
కోవెల సంతోష్ కుమార్,
4-48/12, రోడ్ నెంబర్ 3,
బాబా నగర్, నారపల్లి,
పీర్జాదిగూడా పోస్ట్, ఘట్‌కేసర్ మండల్
హైదరాబాద్ 500088
ఫోన్: 9052116463, 8374804304

 

~
‘ప్రతిభాసుప్రసన్నము’ పుస్తక పరిచయం:
https://sanchika.com/pratibhasuprasannamu-book-intro-kss/

Exit mobile version