Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవయిత్రి, కథా, నవలా రచయిత్రి డా. మజ్జి భారతి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘జీవనగానం’ అనే కథాసంపుటి వెలువరించిన డా. మజ్జి భారతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. మజ్జి భారతి గారూ.

డా. మజ్జి భారతి: నమస్కారమండీ. ముందుగా, ఈ ఇంటర్వ్యూ కోసం సమయం వెచ్చించిన మీకు, సంచిక అంతర్జాలపత్రిక సంపాదకవర్గానికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.

~

మీ మూడవ కథా సంపుటి జీవనగానంవెలువరించినందుకు అభినందనలు. 25 కథలున్న ఈ సంపుటికి 12వ కథ పేరునే, శీర్షికగా ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: పుట్టిన ప్రతి మనిషికి అంతర్లీనంగా జీవనగానం వినిపిస్తూనే ఉంటుంది. అలా తన ఎదలో మెదిలే ఆలోచనా తరంగాలను మాటల ద్వారా లోకానికి విన్నవించుకుంటున్న ఒక సామాన్య స్త్రీ మనోవేదనను జీవనగానంగా మలిచాను. మనుషుల ఆరోగ్యాలను పణంగా పెట్టి వ్యాపారం చేసుకుంటున్న వారిపై ఆక్రోశం, తెలిసీ ఏమీ చెయ్యలేక పోతున్నందుకు, తమ జీవితాలు తమ చేతుల్లో లేకపోతున్నందువలన కలిగిన ఉక్రోషం – తన మనసులో ఉన్నది నిర్భీతిగా, ఆమె లోకానికి వెల్లడించుకుంటుంటే, తమ మనసులోని మాటను బయటకు చెప్పుకోలేకపోయినా.. మంచో, చెడో, ఆనందమో, దుఃఖమో.. ప్రతి వారి మనసులో నిత్యం సాగే ఘర్షణే జీవనగానం అనిపించి, ఆ పేరు పెట్టాను.

కవయిత్రిగా, కథా, నవలా, వ్యాస రచయిత్రిగా, కాలమిస్టుగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? ఎప్పుడు, ఎలా మొదలైంది? తొలి రోజుల్లో మీకు మార్గదర్శకులు ఎవరు?

జ: సాహితీ ప్రస్థానం అనవచ్చో, లేదో తెలియదు గాని, నా 11 ఏళ్ళ వయసులో ‘తెలుగు వీర లేవరా’ అంటూ ఒక కవిత రాశాను. అప్పటినుండి, కవితలు రాసేదాన్ని. కాని, అవన్నీ నా డైరీలకే పరిమితం. ఆ సమయంలో, వాటికి పాఠకురాలు మా పెద్ద చెల్లి ఒక్కతే. నేను ఎంబిబిఎస్ చదివేటప్పుడు, అప్పటి ఆలోచనలను కవితలుగా మలిచేదాన్ని. వాటికి పాఠకురాలు నా ఫ్రెండ్ మాత్రమే. నేను వ్రాస్తానని మిగిలిన వాళ్ళకి తెలియను కూడా తెలియదు. కథలు కూడా వ్రాసేదాన్ని. అలా నా ఆలోచనలతో, నా డైరీ నిండిపోయేది.

నేను ఎవరికీ చూపించేదానిని కాదు కాబట్టి, నాకు మార్గదర్శకులు అంటూ ఎవరూ లేరు.

కాని, నా మొదటి కథా సంపుటికి ముందుమాట వ్రాసేటప్పుడు, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు, అన్నీ కుటుంబ నేపథ్య కథలే గాని, సమాజంలో మూల స్తంభాలైన పాలిటిక్స్, పోలీస్, ప్రెస్.. గురించి ఎందుకనో రచయిత్రి వ్రాయలేదన్న, మాటను పట్టుకుని తర్వాత రాసే కథలలో ఆ నేపథ్యం ఉన్న కథలను రాయడం జరిగింది.

తర్వాత ఒక సభలో కలిసిన ఇంకొక ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు గారు, ‘మా ఆశమ్మా నీవు’ అనడంతో, నా బాధ్యత మరింత పెరిగినట్టు అనిపించి, కళింగాంధ్ర మాండలికంలో, అక్కడి జీవితాలను చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాను.

వైద్యం/వైద్య బోధన మీ వృత్తి. ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యంపై ఆసక్తి, ఎప్పుడు ఎలా కలిగింది? తీరిక దొరకని ఉద్యోగ బాధ్యతల్లో సైతం సాహిత్యం పట్ల అభిరుచిని ఎలా నిలుపుకున్నారు?

జ: సాహిత్యం పై ఆసక్తి ప్రత్యేకంగా, ఒక సంఘటన నుండి కలిగిందని చెప్పలేను. చిన్నప్పటినుండి నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. ఆంధ్రప్రభ వీక్లీ తెప్పించేవారు. న్యూస్ పేపర్ తెప్పించేవారు. వాటిని మొదటి నుండి చివరి వరకు అడ్వర్టైజ్మెంట్లతో సహా చదివేసేదాన్ని. అందులోని సంభాషణలు గాని, ముగింపు గాని నాకు నచ్చకపోతే, నాకు నచ్చిన విధంగా నా మనసులో ఊహించుకునేదాన్ని.

న్యూస్ పేపర్ చదివాక, అందులో మనసుకు పట్టి – కలచివేసే సంఘటనలు అవ్వచ్చు, మనల్ని ఇన్‌స్పైర్ చేసే సంఘటనలవ్వవచ్చు – వాటి గురించి కవితలు రాసుకునే దాన్ని. బహుశా అలా మొదలైందేమో నా సాహిత్య అభిలాష.

ఎంబిబిఎస్ చదవడం వేరు. హౌస్ సర్జన్ పీరియడ్ వేరు. హౌస్ సర్జన్సీ చేసినప్పుడు, పేషెంట్లు, వాళ్ళ బాధలు.. అవన్నీ డైరెక్టుగా వినడం, చూడడం జరిగేది. అప్పుడు మనసుకు హత్తుకున్న భావాలను కవితలుగా మలిచేదాన్ని.

తర్వాత పెళ్లి, వైద్యాధికారిగా బాధ్యతలు.. బాధ్యతలతో అప్పుడప్పుడు తప్పించి వ్రాయడం తగ్గింది. తర్వాత పిల్లలు.. నా సమయం పూర్తిగా, బాధ్యతలకే కేటాయించబడడంతో, పుస్తకాలు చదవడం, వ్రాయడం దాదాపుగా మూల పడ్డాయని చెప్పవచ్చు. అపుడో, ఇపుడో, ఎపుడో అన్నట్టు ఓ కవిత అంతే..

తర్వాత నేను ఎండి మైక్రోబయాలజీ చేస్తున్నప్పుడు, నేను కవితలు రాస్తాననే విషయం మిగిలిన వారికి తెలియడం.. అప్పటినుండి కాలేజ్ మ్యాగజైన్లకు నా కవితలను అడగడం.. వాటిల్లో పబ్లిష్ కావడం జరిగింది.

నేను కడప రిమ్స్ మెడికల్ కాలేజ్‌కు అసోసియేట్ ప్రొఫెసరుగా వెళ్లిన సమయంలో, ఫ్యామిలీకి దూరంగా ఉండడం, సమయం దొరకడంతో మరలా నా కలం నుండి కవితలు, కథలు జాలువారేవి. అప్పుడే వాట్స్అప్ గ్రూపులు రావడం, అమెరికాలో ఉన్న మా క్లాస్మేట్లు ఏవో పెడితే, నిద్రపోని నేను అప్పటికప్పుడే ఆ విషయం మీద కవితలను అల్లడం, అలా నా క్లాస్మేట్స్‌కు నేను వ్రాస్తాననే విషయం తెలిసింది. ఒకసారి అందరికీ తెలిశాక, దాని పరిధి పెరుగుతుంది.

పిల్లలు పెద్ద వాళ్ళవడం, సమయం నా చేతిలో ఉండడంతో.. వైద్యం, వైద్య బోధనకు ఎంత సమయం వెచ్చించినా.. ప్రభాత సమయం పూర్తిగా నాదే. విశాఖ సాగరతీర ఉదయ వాహ్యాళిలో, రోజుకొక విధంగా దర్శనమిచ్చే సూర్యుడిని ఫోటో తీయడం, దానిమీద ఒక కవిత రాయడం దానిని క్లాస్మేట్సుకు పంపించడం.. నాకిష్టమైన వ్యాపకం. అప్పుడే నేటి భారతీయం పేరుతో రోజుకొక చిన్న కవితను వ్రాసి పంపించేదాన్ని.

నిద్రపట్టని రాత్రిళ్లు, ప్రభాత సమయాలు, సెలవు దినాలు నా సాహిత్య పిపాసను నిలబెడుతున్నాయి.

కవిత్వం/కథలు/వ్యాసాలు/యాత్రా కథనాలు/నవలలు.. వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?

జ: కవిత్వం, కథ, వ్యాసం, యాత్రా కథనాలు, నవలలు. వీటిలో కవితలు, కథ, యాత్రా కథనాలు.. నా అనుభూతులలో నుండి పుట్టుకొస్తాయి కనుక, వ్రాయడం చాలా సులువు. ఒక్కోసారి పావుగంటలోనే కవిత, రెండు మూడు గంటలలో కథలు వ్రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వ్యాసం.. భారతీయం అని కొన్ని వ్యాసాలు, తరుణి అంతర్జాల పత్రికలో రాశాను. అవి మన నిత్యజీవితంలో నుండి పుట్టుకొస్తాయి కనుక, వాటికీ ఎక్కువ సమయం పట్టదు.

కాని, వైద్య సంబంధమైన వ్యాసాలు వ్రాసినప్పుడు మాత్రం, పాఠకులకు ఏ విధంగా దానిని ప్రజెంట్ చెయ్యాలి, పాఠకులకు అర్థమయ్యే సరళమైన భాషలో వ్రాస్తూ, ఈ వ్యాసం వారికి ఏ రకంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ, ఏదో ఒకటి వ్రాసేయాలని కాకుండా, నా వ్యాసం అప్ టు డేట్‌గా ఉండాలనే తపనతో, ఎక్కువ సమయమే తీసుకుంటాను.

నవలలు రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే విభిన్న పాత్రలు, భిన్న ప్రాంతాలు, కాలాలు, వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మిగిలిన వాటితో పోలిస్తే వ్రాయడం కష్టమని అనిపిస్తుంది. రాయడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడం వలన నవల వ్రాయడం కష్టమంటాను.

కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?

జ: వస్తువు, శిల్పం, శైలి – ఈ మూడింటి అల్లికే ఒక మంచి కథనో, చక్కని కవితనో, ఇంకొక ప్రక్రియనో మనకు అందిస్తాయి. అయితే వస్తువు బలంగా లేనప్పుడు, శిల్పం, శైలి ఎంత బాగున్నా నిండుదనం రాదన్నది నా అభిప్రాయం. అలాగే వస్తువు బలంగా ఉన్నా, శిల్పం, శైలి బాగా లేకపోతే అది ఆదరణ పొందలేదని నమ్ముతాను నేను. అందుకని మూడింటికీ సమాన ప్రాధాన్యం ఉండాలనే భావిస్తాను నేను. ఇంకా కచ్చితంగా చెప్పాల్సి వస్తే, వస్తువుకి మొదటి ప్రాధాన్యం, తరువాతి ప్రాధాన్యం శిల్పం, శైలిలకు అని చెప్పవచ్చు.

“అవసరం లేనిదేదీ రవ్వంతైనా లేకుండా, చెప్పాల్సిన అంశం సూటిగా అందించడం లోనే ఉంది శిల్ప రహస్యం” అని అంటూ ఆ రహస్యం మీకు తెలుసని వ్యాఖ్యానించారు గంటేడ గౌరునాయుడు గారు తమ ముందుమాటలో. మీ కథానిర్మాణంలో శిల్పం గురించి చెప్పండి.

జ: ఆ మాట గంటేడ గౌరునాయుడు గారు తమ ముందుమాటలో చెప్పడం, నాలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యాలనే వారి సహృదయతను చాటుతుందని అనుకుంటున్నాను.

నా కథలో శిల్పం గురించి అడిగారు మీరు. నేనేది వ్రాసినా, పాఠకులు చదువుతున్నప్పుడు – ఒక ప్రవాహంలా ఉండి, వారి హృదయానికి హత్తుకొని, వారికది తమ కథలా అనిపించి, వారి మనసులను ఉద్వేగభరితం చేసినప్పుడే శిల్పం కుదిరిందని అనుకుంటాను. అందుకని నా కథలకు మొదటి పాఠకురాలిని నేనే. కథను చదివాక, మనసుకు ఆహ్లాదకరంగా అనిపించినప్పుడు, లేదా గుండె బరువుగా అనిపించి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లినప్పుడు.. అవి ఆనందంతో కావచ్చు, బాధతో కావచ్చు.. నా మనసు అలా స్పందించినప్పుడు, మాత్రమే, మంచి కథ వ్రాశానని అనుకుంటాను. నా తర్వాత పాఠకురాళ్లు నా చెల్లెళ్లు. వాళ్లు, ముఖ్యంగా చిన్న చెల్లి, కథను చదివాక, దాని గురించి విమర్శనాత్మక దృష్టితో చూసి చెబుతుంది.

మీ కథాశైలిని షేక్‌స్పియర్ నాటక శైలితో పోల్చారు డా. గుజ్జు చెన్నారెడ్డిగారు తమ ముందుమాటలో. మీ కథనశైలి గురించి మీరేమంటారు?

జ: మూడు దశాబ్దాలుగా ఆంగ్ల సాహిత్య బోధకునిగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుజ్జు చెన్నారెడ్డి గారు నా కథాశైలిని షేక్‌స్పియర్ నాటక శైలితో పోల్చడం నాకు ఆనందాన్నిచ్చే విషయం. చదువుకునే సమయంలో చాలా ఇంగ్లీషు నవలలు చదివినా, ప్రత్యేకించి షేక్‌స్పియర్ సాహిత్యంతో పరిచయం లేకపోవడం వలన నా కథనశైలి ఎలా ఉందో నేను చెప్పలేను. ఆ విషయం నా కథలను చదివిన వాళ్లు చెప్పవలసినదే.

కథలకై మీరు సమాజంలోని మనుషులని, వారి సమస్యలని అత్యంత సమీపంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?

జ: వృత్తిపరంగాను, వ్యక్తిపరంగాను రకరకాల వ్యక్తులతో మాట్లాడడం, సమస్యలను వినడం జరుగుతుంటుంది. అవన్నీ కథాంశాలే. కాకపోతే ఎప్పుడో సడన్‌గా స్ట్రైక్ అవుతుంది ఒక పాయింట్. అందులోని పాత్రలు డైలాగులతో సహా సినిమా రీలులా కళ్ళ ముందు కదులుతాయి. వెంటనే కలాన్ని కాగితం మీద పెడితే కథ వచ్చేస్తుంది. ఆ క్షణం దాటితే, సాధారణంగా ఆ కథ కూడా మనసు నుండి జారిపోతుంది. సమయం లేనప్పుడు రికార్డు చేసుకుంటాను.

సానుకూల దృక్పథంతో ఉండే పాత్రలను, సుఖాంతమైన కథలను సృష్టించటానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాను.

ఆర్థిక సంబంధమైన సమస్యలను ప్రక్కన పెడితే, మిగిలిన చాలా సమస్యలు ఎదుటివారిని అర్థం చేసుకోకపోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, అవగాహనా రాహిత్యం వల్లనే అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి అంశాలనే, కథాంశంగా ఎంచుకుంటాను నేను. నా కథను చదివాక ఒకరిద్దరు మారినా, రచయిత్రిగా విజయం సాధించాననే అనుకుంటాను.

కలకథలో, కొండని కాపాడడానికి చిట్టినాయుడు గొప్ప లౌక్యం, విజ్ఞత ప్రదర్శిస్తాడు. ఈ కథ కల్పితమా లేక నిజ జీవిత ఘటనల ఆధారంగా వ్రాశారా?

జ: కథ కల్పితమే గాని, నిజ సంఘటనల ఆధారంగానే – ఉదాహరణకు, అకస్మాత్తుగా వరదలు రావడం, మేఘ విస్ఫోటనం చెంది ఊర్లు కొట్టుకుపోవడం, లేదా బురదతో ఊర్లు కప్పబడిపోవడం, భూకంపాలు.. ఇటువంటివన్నీ, మనం ప్రకృతిని సరిగ్గా సంరక్షించుకోక పోవడం వలన ఎక్కువగా జరుగుతున్నాయి. పారిశ్రామిక, పట్టణాభివృద్ధి పేరున చెట్లు కొట్టివేయడం, చెరువులను పూడ్చివేయడం, నదీ గర్భాలను ఆక్రమించుకోవడం – ఇవన్నీ అప్పుడప్పుడు పెను విషాదాలకు దారితీస్తున్నా మనం ఏ మాత్రం జాగ్రత్త పడటం లేదు. మనిషికి స్వార్థం ఎక్కువై, ప్రకృతిని కబళించాలనుకుంటే ఏమి జరుగుతుందో.. చూస్తూనే ఉన్నాం. జరిగిపోయాక అయ్యో అని విచారించడం కన్నా, ఏమి చేస్తే బాగుంటుందో ఇందులో చెప్పడం జరిగింది.

ప్రకృతికి మేలు చెయ్యకపోయినా, మనిషి తన స్వార్థాన్ని కొంచెం తగ్గించుకొని కీడు చెయ్యకుండా ఉంటే, ఎన్నో ఉపద్రవాలు జరగకుండా ఉంటాయనే భావంతో ఈ కథ రాశాను.

గురుతర బాధ్యతకథకి ఆ పేరు సముచితంగా ఉంది. చక్కని ఇతివృత్తంతో అల్లిన కథ. ఈ కథని ఇలా చెప్పాలన్న ఆలోచన ఎలా తట్టిందో వివరిస్తారా?

జ: అన్నింటికన్నా నాకు బాగా నచ్చిన కథ గురుతర బాధ్యత. ఎందుకంటే, అతి చిన్న వయసులో, సుమారుగా పది, పదకొండేళ్ళ మధ్య ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఈ సమస్య, శారీరిక ఎదుగుదలలో ఒక భాగమైనప్పటికీ, ఏమీ తెలియని ఆ వయసులో వారికది సమస్యగానే నేను భావిస్తాను. పిల్లల్ని ఆ సిట్యువేషన్‌లో తలుచుకుంటేనే నాకు చాలా బాధనిపిస్తుంది కూడా. దానికి తోడు, తోటి మగపిల్లల కామెంట్స్, చూపులు వారి బాధను మరింత పెంచుతాయనిపిస్తుంది. ఆ వయసులో మగపిల్లలని కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే వాళ్లకు కూడా ఏమీ తెలియదు. ఒక జాతి ఈ విశ్వంలో కొనసాగాలంటే పునరుత్పత్తి వ్యవస్థ ఎంత ముఖ్యమో, స్త్రీలలో జరిగే ఈ ప్రక్రియ అనేది ఎంత అవసరమో, ఆ చిన్నతనంలోనే వాళ్లకి మనం స్పష్టంగా చెప్పగలిగితే, మగపిల్లలు.. పెద్దయ్యాక కూడా ఆడపిల్లల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించగలరని నా నమ్మకం.

అందుకని, ఆడపిల్లలలో జరిగే ఈ సహజ పరిణామక్రమాన్ని, బాధ్యతగా, శాస్త్రీయంగా, సూటిగా, చిన్నప్పుడే పిల్లలకు చెప్పగలిగితే, ఇప్పుడున్న చాలా సమస్యలను నివారించవచ్చని నా ప్రగాఢ విశ్వాసం. హైస్కూల్ పిల్లలకు పునరుత్పత్తి వ్యవస్థ పాఠం ఉంటుంది. ఈ పాఠం యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరించగలిగితే మగ పిల్లల బిహేవియర్‌లో ఖచ్చితంగా తేడా వస్తుంది.

పిల్లల చిన్నప్పుడే మనం వాళ్ళలో ఏ ప్రమాణాలను నెలకొల్పితే అవే ప్రమాణాలతో వాళ్లు పెరుగుతారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనా ఉదాహరణ సహితంగా చెబితే ఎవరికైనా బాగా అర్థమవుతుంది. అందుకే నా కథలలోని పాత్రలు ఆ రకంగానే ప్రయత్నిస్తూ ఫలితాలను సాధిస్తాయి.

ప్రస్తుత కాలానికి సందర్భోచితమైన కథ లావు ఒక్కింతయు కాదు’. ఒబెసిటీ విపరీతంగా పెరిగిపోతున్న మన సమాజానికి ఇటువంటి కథలు అవసరం. ఈ కథ నేపథ్యాన్ని వివరించండి.

జ: లావు ఒక్కింతయు కాదు అన్న కథకు ప్రత్యేకమైన నేపథ్యమేమీ లేదు. గాని, ఊబకాయం, దాని వలన వచ్చే సమస్యలు ఒక డాక్టరుగా నాకు బాగా తెలిసినందువలన.. ముఖ్యంగా పిల్లలలో.. పెద్దవారిలో ఈ సమస్య ఉన్నా, దానికి కారణాలు, పరిష్కారాలు వాళ్లకు తెలుసు. గాని పిల్లల విషయం అలా కాదు. జంక్ ఫుడ్ నుండి వచ్చే సమస్య, భవిష్యత్తులో వాళ్లనెంత ఇబ్బంది పెడుతుందో వాళ్ళకి తెలియదు కనుక, చాపల్యానికి లోనవుతారు. జంక్ ఫుడ్ నుండి వచ్చే పరిణామాలు పిల్లలకు తెలియనప్పుడు, చెప్పవలసిన బాధ్యత మనమీదే, అంటే తల్లిదండ్రుల మీదే ఉందన్నది కాదనలేని సత్యం. అవి ఎందుకు తినకూడదో తల్లిదండ్రులు సవివరంగా వివరిస్తూ, తాము పాటిస్తుంటే పిల్లలు మాట వింటారు.

అలా కానప్పుడు భవిష్యత్తులో వాళ్ళెన్ని శారీరిక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆలోచన నన్ను నిలవనీయదు. తక్కువమందిలోనే జన్యుపరమైన కారణాలుంటాయి. గాని మిగిలిన అందరిలో వారు తినే జంక్ ఫుడ్డే ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు. దానికి తల్లిదండ్రులదే బాధ్యత అని నేనంటాను. ఆ ఆలోచనతో వ్రాసిన కథ ఇది.

అలాగే నేటి చదువుల వేటలో పిల్లలు ఎక్సర్సైజులకు దూరంగా ఉంటున్నారు. ఫిజికల్ ట్రైనింగ్ అన్న క్లాసు ఉన్నా, ఎన్ని స్కూళ్లలో ప్లేయింగ్ గ్రౌండ్ ఉంటుందన్నది మనందరికీ తెలిసినదే. ఆడుకోవడానికి స్థలమే లేనప్పుడు, సోషల్ మీడియాలో పడి పిల్లలు కొట్టుకుపోతున్నప్పుడు, ఫిజికల్ ఎక్సర్సైజుకు తావే లేదు. పిల్లల ఊబకాయానికి ఇవన్నీ ఎడిషనల్ ఫ్యాక్టర్స్.

సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: నాకు బాగా నచ్చిన కథ, ‘గురుతర బాధ్యత’. పిల్లలను మనమే రకంగా పెంచితే వాళ్లలలాగే పెరుగుతారన్నది మనందరికీ తెలిసిందే. ఈ గురుతర బాధ్యతను ఉపాధ్యాయులే కాదు, తల్లిదండ్రులు, సమాజం కూడా తీసుకున్నప్పుడే పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారు. ఈ కాలం పిల్లలు అప్పటిలా కారు, మన మాట వినరంటారు. వాళ్లు వినేలా మనం చెప్తున్నామా అన్నది నా ప్రశ్న. పిల్లలకు తెలియదు కాబట్టే ఓపికగా, వాళ్లకర్థమయ్యేలా మంచి చెడులను వివరించి చెప్తే, తప్పకుండా అర్థం చేసుకుంటారు

మనమేది నాటితే, అదే మొక్కై వస్తుందనే విషయం మనకు తెలిసిందే కదా! అందుకని చిన్నప్పటి నుండే పిల్లలలో మంచి చెడుల భేదాన్ని, విచక్షణా జ్ఞానాన్ని, వివేకాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని ప్రోది కొలిపినప్పుడే వారికి మంచి భవిష్యత్తును అందించే వాళ్ళమవుతాం. మంచి సమాజాన్ని నెలకొల్పే వాళ్ళమవుతాం. మంచి సమాజం కావాలంటే, మనందరం ఈ గురుతర బాధ్యతను నెరవేర్చక తప్పదు.

అందుకని అన్నింటిలో నాకు నచ్చిన కథ ‘గురుతర బాధ్యత’.

ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ఏ కథను వ్రాసినా, ఆ కథకు మూల ఆలోచన నా మనసుకి హత్తుకున్నప్పుడే కథగా మలచగలను. ఒక్కోసారి మూల ఆలోచన (Main point) తట్టినా, ఆ కథను ముగించే విషయంలో గాని, లేక సమాజానికి ఇది ఎంత అవసరమవుతుందనే విషయంలో గాని నాకేమైనా సందేహాలు వచ్చినప్పుడు ఆ కథను నేను వ్రాయలేను. అలా అసంపూర్తిగా ఉన్న కథలు కొన్ని ఉన్నాయి. కొంతకాలం వరకు చూసి, ఆ కథకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని భావించినప్పుడు గాని, ప్రస్తుత పరిస్థితులలో వాటి అవసరం లేదని అనిపించినప్పుడు గాని.. వాటిని డిలీట్ చేసేస్తాను.

మన జీవితంలోని అంశాలే కథలు. ఒక అంశం నా మనసును నిలబెట్టినప్పుడు మాత్రమే నేను కథగా మలచగలను. అందుకని ఏ కథ రాసినా నాకు కష్టమనిపించదు.

కొన్ని కథలు సమాజంలోని పరిస్థితులను మన కళ్ళ ముందు ప్రతిబింబిస్తాయి గాని, వాటికి పరిష్కారం చూపించవు. ఆ కథలలోని పాత్రలు కూడా పరిష్కారం గురించి ఆలోచించవు. పరిష్కారం చెప్పలేని కథలను ఎందుకో వ్రాయాలనిపించదు.

ఒక కథ వ్రాసి పంపించేశాక దాని గురించి ఆలోచించను. గాని, పంపించకుండా ఉన్న కథలను మరలా చదివినప్పుడు, కొన్నిసార్లు.. శిల్పం, శైలిలో కొన్ని మార్పులు చేస్తానని అంగీకరించక తప్పదు.

జీవనగానంపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: జీవన గానం పుస్తకం ప్రచురణలో ఎదురైన ప్రత్యేక అనుభవమంటే – యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. గుజ్జు చెన్నారెడ్డి గారు, నా కథలను చదివి, బాగున్నాయని, ఇటువంటి కథలను విశాలాంధ్ర పబ్లికేషన్సు వారు ప్రచురిస్తారని, వారికి పంపించమని సూచించడం, వారి ఫోన్ నెంబర్లు నాకివ్వడం, చెన్నారెడ్డిగారే నా గురించి వారికి సజెస్ట్ చెయ్యడం, నేను వారికి పంపించిన నా కథలను, విశాలాంధ్ర వారికి వారు పంపించడం, ఆ కథలను చదివిన విశాలాంధ్ర సభ్యులు కథలు చాలా బాగున్నాయి అని నాకు ఫోన్ చేసి చెప్పడం – నేను మర్చిపోలేని అనుభవం.

పుస్తకం చదివిన వారు కథలు చాలా బాగున్నాయని చెప్పడం జరుగుతుంది.

అన్ని ప్రక్రియల్లోను ఇప్పటి దాకా ఎన్ని పుస్తకాలు ప్రచురించారు? సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?

జ: ‘జీవన గానం’తో సహా మూడు కథల సంపుటాలను, ‘భారతీ వందనం’ అనే పద్య సంకలనాన్ని ప్రచురించడం జరిగింది. నాల్గవ కథా సంపుటి ప్రచురణకు సిద్ధమవుతుంది. వివిధ పత్రికలో ప్రచురింపబడిన కథలు చాలా ఉన్నాయి. వాటిని కూడా కథా సంపుటులుగా తేవాలనే ప్రణాళిక ఉంది.

అలాగే, చదువుకున్న రోజుల నుండి వ్రాసిన కవితలు, ప్రయాణాలపై వ్రాసిన కవితలు, ప్రస్తుత పరిస్థితులపై వ్రాసినవి (పంపించిన కవితలు, పబ్లిష్ కావడం జరిగింది) చాలా ఉన్నాయి. సమయం చిక్కితే కవితా సంపుటిని కూడా తీసుకురావాలి.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. మజ్జి భారతి గారూ.

డా. మజ్జి భారతి: నా ఇంటర్వ్యూ వెయ్యాలని నిర్ణయం తీసుకున్న సంచిక యాజమాన్యానికి, ఇంటర్వ్యూ తీసుకున్న మీకు నా ధన్యవాదములు.

***

జీవనగానం (కథలు)
రచన: డా. మజ్జి భారతి
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ
పేజీలు: 180
వెల: ₹ 150/-
ప్రతులకు:
విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్,
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట,
విజయవాడ 520004
ఫోన్: 0866-24303302
~
విశాలాంధ్ర వారి ఇతర శాఖలు

~
‘జీవనగానం’ కథాసంపుటిని సమీక్ష:
https://sanchika.com/jeevanagaanam-book-review-kss/

Exit mobile version