Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రముఖ కవి, రచయిత డా. విజయ్ కోగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ఎవరిదీ చూపు’ అనే కవితాసంపుటిని వెలువరించిన డా. విజయ్ కోగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. విజయ్ కోగంటి గారూ.

డా. విజయ్ కోగంటి: నమస్కారం.

~

ప్రశ్న 1: ఎవరిదీ చూపు?’ కవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. 71 కవితలున్న ఈ పుస్తకానికి 43వ కవిత పేరునే శీర్షికగా ఉంచడం వెనుక మీ ఆలోచన వివరిస్తారా?

సమాధానం: 2020 నుంచీ 2025 వరకు వ్రాసిన కవితలు గల ఈ సంపుటికి ‘ఎవరిదీ చూపు’ తో పాటు ‘ఈ లోకంతో జాగ్రత్త చిన్నా’, ‘మనిషి పాట’, ‘వెయ్యి వేషాల్’, ‘ఖుల్జా సిమ్ సిమ్’, ‘బుల్ బుల్ పిట్ట ఒకటి’, అనుకున్నాను. అయితే అనేక కోణాల్లో మనిషి మనస్తత్వాన్ని, సమాజాన్ని విశ్లేషించే కవితలు ఉండడంతో ‘ఎవరిదీ చూపు’ అనే పేరును చివరగా ఎన్నుకోవడం జరిగింది. ముందుమాట నిచ్చిన శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య కూడా దీన్నే బలపరిచారు.

ప్రశ్న 2: మీ మూడవ కవితా సంపుటి విడుదల సందర్భంగా మీ సాహిత్య ప్రస్థానం గురించి వివరించండి.

సమాధానం: 2017 లో ప్రచురించిన నా తొలి సంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’, నేను డిగ్రీ చదివే రోజుల్లోనూ, తరవాతి సంవత్సరాలలోనూ రాసుకున్న కవితల సమాహారం. డిగ్రీ , పీజీ చదివే కాలంలో తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత్వం రాసేవాడిని. మొదట్లో రేడియోలో వచ్చే లలితగీతాల్లాంటి గేయాలు రాసేవాడిని. పద్య కవిత్వాన్ని ప్రయత్నించాను కానీ రాలేదు. దానికి ప్రాచీన గ్రంథాల పరిచయం నిత్య అభ్యాసం చాలా అవసరం. పైగా ఛందస్సు కోసం భాషని, భావాన్ని కుదించడం, పెంచడం అవసరపడతాయని, అనిపించింది.

క్రమంగా వచన కవిత్వాన్ని అలవాటు చేసుకున్నాను. ఆంగ్ల కవితా శిల్పం, శైలి నాకు వంటబట్టడంతో తెలుగులోనూ అలాగే ప్రయత్నించాను. నేను జాషువాని, శ్రీశ్రీని, దేవులపల్లి కృష్ణశాస్త్రి లను విద్యార్థిగా బాగా ఇష్టపడ్డాను. ఆంగ్లంలో రొమాంటిక్స్, టి ఎస్ ఇలియట్, బ్రెహ్ట్, అఖ్మతోవా వంటి అనేక మోడర్న్, పోస్ట్ మోడరన్ కవులు, టాగూర్, హరీంద్రనాథ్ వంటి భారతీయ కవులు నన్ను ప్రభావితం చేశారు. వీరు తప్ప తెలుగులో 2004 వరకూ నాకెవరూ వచన కవులు తెలియదంటే మీరు వింతగా చూస్తారేమో.

1998 నుంచీ 2006 వరకు పెద్దపల్లిలో పనిచేసేపుడు మిత్రుడు గుడిహాళం రఘునాథంతో నిత్యం కవిత్వాన్ని చర్చించేవాడిని. తన ప్రోత్సాహంతో కవిత్వాన్ని పత్రికల్లో ప్రచురణకు పంపడం మొదలుపెట్టాను. 2011లో శ్రీ కొప్పర్తి వెంకట రమణమూర్తి, నన్ను కవిత్వ సంపుటి ప్రచురణకు ప్రోత్సహించారు. పిహెడి పూర్తిచేయడం, ఉద్యోగ సంబంధిత బాధ్యతలతో కొంత వాయిదా వేస్తూ వచ్చినా మిత్రుల ప్రోత్సాహంతో మొదటి సంపుటిని 2017 లో తెచ్చాను. దాన్ని ప్రముఖ కవులు గుర్తించి నన్నొక కవిగా గుర్తించడంతో మరికొంత ప్రోత్సాహం లభించింది. దానికి నాగభైరవ కోటేశ్వరరావు గారి పురస్కారం రావడంతో పాటు శ్రీరామ కవచం సాగర్, ఏటూరి నాగేంద్ర రావులు ‘మీ కవిత్వంలో నూతనత్వం, స్వచ్ఛత, కొత్తదనం, ఉన్నాయి. వ్రాయండి’ అని ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఉత్తేజ పరిచింది. డా.పాపినేని శివశంకర్ గారితో పరిచయం అప్పుడే కలిగింది.

నా మొదటి సంపుటి ప్రచురించే వరకూ వరకూ నేను తెలుగులో కూడా తక్కువ కవిత్వాన్నే చదివానని చెప్పాలి. కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వ్రాసిన ‘వెలుతురు పిట్టలు’, రఘునాథం వ్రాసిన ‘ఒక జననం ఒక మరణం’, కొప్పర్తి ‘యాభై ఏళ్ళ వాన’, డా. పాపినేని శివశంకర్ ‘రజనీ గంధ’ – నేను తెలుగు కవిత్వాన్ని బాగా విశ్లేషణతో చూసే శక్తినిచ్చాయి. 2020 లో ఒక ‘ఆదివారం సాయంత్రం – ఇతర కవితలు’ అనే రెండవ సంపుటి తర్వాత నన్ను నేను కవిగా మరింత పదిలపరచుకునే ప్రయత్నం చేసాను.

డా. పాపినేని శివశంకర్ దేవిప్రియను పరిచయం చేసారు. ఆయన ‘ఇంకొకప్పుడు’ సంపుటిని పరిచయం చేయమని చెప్పడంతో దేవిప్రియను చదువుతూ బాగా ఇష్టపడ్డాను. డా. పాపినేని, దేవిప్రియల లోని సరళత, గాఢత చాలా ఆలోచింపచేసాయి. శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, దర్భశయనం, శిఖామణి, హెచ్చార్కె, బి.వి.వి ప్రసాద్, అఫ్సర్, కోడూరి విజయ కుమార్, – ఇలాటి వారి కవిత్వం వస్తువు ఎంపిక, శైలి, ఎత్తుగడ, ముగింపు వంటి విషయాలలో నాకు సహకరించాయి. పరిశీలనను విస్తృత పరిచాయి.

చాలా మంది పాఠకులు ఇష్టపడే సంచలనాత్మక కొటేషన్ వాక్యాలను కవిత్వమనడానికి ఎందుకో ఇష్టపడను. కవిత్వమంటే మనసుని ఆకట్టుకుని మేధని రగిలించి ఆలోచనాత్మక అనుభూతినిచ్చే అందమైన భాష. దాన్ని భావానికి తగిన మాటల్లో ఒదిగేలా చేయడమే కవి నైపుణ్యం. కవి అలాటి పద చిత్రాలు సృష్టిస్తాడు కాబట్టే స్రష్ట. ఆ శక్తిని పొందగలగడం కవికి ధన్యత. మంచి కవిత తయారు కావడం ఒక ‘ఆర్గానిక్ కెమిస్ట్రీ’. ఒక్కో కవితలో వస్తువు కొత్తగా ఉండచ్చు. శైలి కొత్తగా ఉండచ్చు. కవి కవితని మొదలుపెట్టి, ఆవిష్కరిస్తూ, వ్యక్తీకరించే తీరు కొత్తగా ఉండొచ్చు. ఒక్కోసారి సాధారణంగా అనిపించినా ఆ శైలిలో అందరూ వ్యక్తీకరించలేని ఒక మెరుపుండచ్చు. కవిత్వం ఒక మెరుపులా వెచ్చని ఉద్విగ్నతని మనసంతా పరచగలగాలి. అందుకే ప్రయత్నపూర్వకంగా కవిత్వం రాయాలని అనుకోను. అందుకే అలా ప్రకటించిన విషయాలపైనో శీర్షికల గురించో రాయలేను.

నేను మొదట్నించీ తెలుగు నుంచీ ఇంగ్లీషుకు, ఇంగ్లీషు నుంచీ తెలుగుకు అనువాదాలు చేస్తుండటంతో సందర్భోచితమైన పదాల కూర్పుకు, ఎంపికలో నాణ్యతకు, క్లుప్తతకు బాగా సహకరించాయి. వస్తువు ఎంపికలో విస్తృతికి, శైలికి మెరుగు దిద్దుకోడానికి ఉపయోగపడ్డాయి. ‘ఒక క్రియేటివ్ బ్లాక్’ వచ్చినపుడు కవిగా నిలబడటానికి అనువాదాలు చాలా సహకరిస్తున్నాయి. ఈ అనువాద శైలి పరిశీలించాకే శ్రీ దేవిప్రియ, ఆయనే అనువాదకుడైనప్పటికీ తన ప్రేమ కవితలని (‘స్లీపింగ్ విత్ ద రెయిన్‌బో’) గా, ‘గాలిరంగు’ ను అనువదించమని అడిగారు.

అలాగే సమీక్ష, వ్యాస రచనను కూడా ఇష్టపడతాను. నాకు నచ్చిన కవిత్వ సంపుటుల మీద విమర్శనాత్మక సమీక్షలు వ్రాస్తుంటాను. డా. కలపాల పద్మజతో కలిసి రచించిన పాశ్చాత్య రచయితల పరిచయ సంపుటి ‘పడమటి రాగం’ చాలా ప్రాచుర్యాన్ని పొందింది. ఇది హెచ్చార్కె గారి ‘రస్తా’లో అనేక మాసాలు ధారావాహికగా ప్రచురితమైంది. అలాగే డా. అఫ్సర్ పత్రిక ‘సారంగ’ లో కూడా ఆంగ్ల భాషలో అన్ని రాష్ట్రాల నుంచి వెలువడుతున్న భారతీయ సాహిత్యం గురించి కొన్ని వ్యాసాలూ ఇప్పటికే ప్రచురింపబడ్డాయి. మిగిలినవీ పూర్తిచేయాలి.

తర్వాత కథల పట్ల ముఖ్యంగా మైక్రో ఫిక్షన్ పట్ల ఆసక్తితో చిన్నకథలను ‘పైనాపిల్ జామ్’గా తీసుకొచ్చాను. 2020 నుంచీ 2025 వరకు వ్రాసిన ప్రచురితమైన, ప్రచురితం కాని కవితలను ‘ఎవరిదీ చూపు’ గా తెచ్చాను.

ప్రస్తుతం అనువాద రచనలను మెరుగు పెట్టి ప్రచురించడం కోసం ప్రయత్నిస్తున్నాను.

ప్రశ్న 3: “అచ్చంగా మనిషి లాగా జీవించే మనిషి కోసం ఈ కవి వెతుకుతున్నాడు. ఇన్ని అవిశ్వాసాల నడుమ, ఇన్ని అసహనాల నడుమ మనిషి పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోడం లేదు.” అని వ్యాఖ్యానించారు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య తమ ముందుమాటలో. మానవతావాదాన్ని కవితల్లో ప్రతిబింబించడం మీ కవనపు శైలిగా భావించవచ్చా?

సమాధానం: ఆంగ్ల సాహిత్యాన్ని చదివి బోధించి విద్యార్థులకు మానవతా విలువలు బోధించి ఆచరణలో ప్రతిఫలించాలని విశ్వసించే నాకు మనిషిపట్ల నమ్మకముంది. కొన్ని సంఘటనలు హృదయాన్ని క్షోభింపచేసి మనిషి పట్ల నమ్మకం సన్నగిల్లినట్లుచేసినా మనిషి ద్వారానే సంఘంలో ఏ మార్పైనా సాధ్యపడుతుందని నా నమ్మకం.

నా కవిత్వం నిరాశపూరిత కవిత్వం కాదు. వాస్తవిక దృక్పథాన్ని విశ్లేషించేటప్పుడు కొంత నిరాశ ద్యోతకమవడం సహజం. కానీ ఆశ మాత్రమే చిరు మొలకల్ని గుర్తించే శక్తిని, ఊరటని, బలాన్ని ఇస్తుంది. ఒక్కొకసారి కొందరు మనుషుల మాటలు, పనులు, వారు సాధించే అసాధారణ మార్పులను చూస్తే మంచి మనసున్న ‘కొత్త ఉదయాల్లాటి మనుషులు’ జీవితానికి ఎప్పుడూ వెలుగునివ్వగలుతారని నమ్ముతాను. అలాగే శ్రీ దర్భశయనం కూడా చాలా నిశితమైన పరిశీలనను అందించారు.

ప్రశ్న 4: తొలి కవితా సంపుటి ఇలా రువ్వుదామా రంగులు’ (2017) నుంచి తాజా కవితాసంపుటి వరకు – సుమారు ఎనిమిదేళ్ళ కాలంలో ఒక కవిగా మీలో ఏయే మార్పులు వచ్చాయి? మీ మౌలికమైన రచనా పద్ధతికి దూరం కాకుండా – వస్తువు ఎంపిక, క్లుప్తత, గాఢత, ఆర్ద్రత తదితర అంశాలలో ఏ రకంగా మెరుగయ్యారని అనుకుంటున్నారు?

సమాధానం: ఇది నా మూడవ కవితా సంపుటి. 2017లో ‘ఇలా రువ్వుదామా రంగులు’, 2020లో ‘ఒక ఆదివారం సాయంత్రం – ఇతర కవితలు’ తర్వాత 2020 నుంచీ 2025 వరకు వ్రాసిన కవితలతో ఈ మూడవ సంపుటి – ‘ఎవరిదీ చూపు’. మొదట్లో ప్రింట్ మీడియా పత్రికలలో ప్రచురణకు పంపేవాడిని. చాలా సమయం తీసుకుంటూ ప్రచురింపబడేవి. ఒకోసారి ఏ విషయమూ తెలిపేవి కావు. కానీ ఆన్‌లైన్ పత్రికలు కొన్ని – వాకిలి, ఈమాట, సారంగ, సంచిక వంటివి ఎక్కువ సమయం తీసుకోకపోవడం, ప్రచురణకు సంబంధించి విషయాలను చర్చించడంతో రచనా ప్రక్రియ ఊపందుకుంది.

మొదటి సంపుటి తర్వాత ఉత్సాహం పెరిగి మూడేళ్ళ లోనే రెండవ సంపుటి ప్రచురించాను. అయితే డా. పాపినేని వంటి వారు వస్తువు ఎంపిక పట్ల, శైలి పట్ల ఎదగాల్సిన అవసరాన్ని సూచించారు. తర్వాత దేవిప్రియ, పాపినేని, కొప్పర్తి, వాడ్రేవు చిన వీరభద్రుడు, దర్భశయనం, శిఖామణి, హెచ్చార్కె, బి.వి.వి ప్రసాద్, అఫ్సర్, కోడూరి విజయ కుమార్, లాటి ప్రముఖ కవుల కవిత్వాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరిలో ఒక్కొక నూతనత్వం. వస్తువు ఎంపిక, శైలి, కవితా నిర్మాణం, భాష – ఇలాటి వాటి మీద మనసుపెట్టి వ్రాయడం మొదలు పెట్టాను. ఇలాటి పఠనం – పరిశీలన చాలా ఉపయోగించాయి.

ఇలా కవితలను విశ్లేషిస్తూ, వాడిన మాటలు సరిగా ఉన్నాయా అనే మానసిక చర్చ జరుపుకునే శక్తి ముందునుంచీ వున్నా, ‘ఈమాట’లో ప్రచురణ ప్రారంభమయ్యాక ఈ విశ్లేషణ మరింత అలవడింది. ప్రతి కవితనీ ప్రచురించే ముందు మొదట్లో సంపాదకులు శ్రీ మాధవ్ చాలా చర్చించేవారు. నేను కూడా వాటిని మళ్ళీ సంతృప్తిగా వచ్చిందనుకునే దాకా చిత్రిక పట్టి పంపేవాడిని. అలా ప్రతి కవితా రచనా ఒక వర్క్ షాప్ ఎక్స్‌పెరిమెంట్‌లా వచ్చేది. ఆంగ్ల కవిత్వ పద్ధతిలో ఎక్కువ క్లుప్తతకు ప్రాధాన్యమివ్వడం అలవాటైంది.

రాసిన ప్రతి కవితను అనేకసార్లు రీ-విజిట్ చేయడం మొదలు పెట్టాను. ఎపుడైనా సరే కవితా విషయం మనసును కదిలించి అలోచింప చేయగలగాలి. అది ఏ సంబంధమైనా కావచ్చు. అప్పుడే వ్రాయగలం. కొన్ని 4-5 నిముషాలలో రాసిన కవితలున్నాయి. కొన్ని రోజులపాటు రాస్తూ వచ్చిన కవితలూ ఉన్నాయి. నా నోట్ బుక్, డైరీలు చూస్తే అనేక సార్లు తిరగరాసిన కవితలు కూడా కనిపిస్తాయి. అయితే అనువాద రచన కూడా నాకు చాలా సహకరించింది.

కవిత వీలున్నంత తక్కువ నిడివిలో తక్కువ పదాలతో పూర్తి చేయాలనుకుంటాను. ఒకోసారి వస్తువును బట్టి నిడివి పెరుగుతుంది. ఎంచుకున్న మూర్త/అమూర్త శిల్పాలు, క్లుప్తత, సరళత తోనే భావం గాఢపడుతుందని నా అభిప్రాయం.

రసావిష్కరణకు మనల్ని స్పందింపచేసే విషయాన్ని బట్టి, ఎంచుకున్న శైలిని బట్టి, ఆర్ద్రత స్థానం ఏర్పరచుకుంటుందని నా ఆలోచన.

ఇలా వస్తువు ఎంపిక, క్లుప్తత, గాఢత, ఆర్ద్రత విషయాలన్నిటిలో పరిణతికై యత్నిస్తూనే ఉన్నాను. ఈ సంపుటిలో ఆ ప్రయత్నం చాలా స్పష్టంగా ఉందని సమీక్షకులు సైతం వివరించారు. ఇది ఎపుడూ ఒక నిరంతర ప్రయత్నం అనుకుంటాను.

ప్రశ్న 5: మీ దృష్టిలో కవితకి సంబంధించి లయ, వస్తువు, భావ వ్యక్తీకరణలో ఏది ముఖ్యం? ఎందువలన?

సమాధానం: నా మటుకు నాకు ఇవి మూడూ ముఖ్యమైనవే. శుద్ధ వచనమై సాగితే కవిత్వ మనిపించకపోవచ్చు. వస్తువును బట్టే భావ వ్యక్తీకరణ, శైలి, లయ ఉంటుందని నా అభిప్రాయం. వచనమైనా కవితాత్మకమైతే లయ తనంత తానే ఒదిగిపోతుంది. భావ వ్యక్తీకరణ అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది. మూడూ ఏ కవి కూడా విడివిడిగా ప్రయత్నపూర్వకంగా రావాలని ప్రయత్నించడు. పరిణతి చెందిన కవులలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 6: కొన్ని కవితలు దుస్సహన పరిస్థితుల పట్ల వేదనని వెల్లడించినా, అది విద్వేష ప్రదర్శనలా అనిపించదు. (ఉదాహరణ: ఇదే నిజం కవిత). పదాల ఎంపిక, భావోద్వేగాలను అదుపు చేసే పరిణతి ఎలా సాధ్యమైంది?

సమాధానం: చదువుకునే రోజుల్లో విప్లవ కవిత్వాన్ని ఇష్టపడేవాణ్ణి. దిగంబర కవుల్ని కూడా. అది వయోరీత్యా సాధారణమే. ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన విషయాలు ఈ సమాజంలో చాలానే ఉన్నాయి. ఉంటాయి. కానీ ఆగ్రహ ఆవేశాలు క్షణికంగా ఉంటాయి. వాటిని వ్యక్తపరిచినప్పుడు ఆవేశమే మాట్లాడుతుంది. ఆవేశానికి జీవిత కాలం తక్కువ. ఆలోచనని రగిలించని ఆవేశం ప్రయోజనకారి కాదు. ఆ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఆలోచనా ప్రవాహంగామార్చడానికి చాలా సమయం పట్టింది. నా నోట్ బుక్స్, డైరీల్లో ఈ డ్రాఫ్ట్స్ చాలా కనిపిస్తాయి. అఖ్మతోవా, బ్రెహ్ట్ లాటి కవులు రచయితలు ఆవేశాన్ని చాలా సృజనాత్మకంగా ఆలోచనాత్మకంగా ప్రతీతాత్మకంగా చెప్పడం గమనించాను. టీ.యస్.ఇలియట్ కూడా ‘వేస్ట్ ల్యాండ్’లో బాధాకరమైన విషయాలను చాలా సింబాలిక్‌గా చెప్తాడు. కవి అనే వాడు సమాజంలో దుశ్చర్యలను రుగ్మతలను భ్రష్టత్వాన్ని చూసి ఆవేశాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేయవలసిందే, ఎందుకంటే కవి కూడా సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడు కాబట్టి. ఇలా కవిత ద్వారా మనలోని ఆవేశాన్ని తెలియజేయడం నాకు నేను ఒక ట్రీట్మెంట్ చేసుకోడంలా ఉంటుంది. అయితే మన ట్రీట్మెంట్ మనను నొప్పించకుండా కూడా ఉండాలి గదా. అందుకే సాత్త్విక ఆగ్రహ వ్యక్తీకరణకై రచనలో ప్రయత్నిస్తాను. శ్రీ కొప్పర్తి వ్రాసిన బ్లర్బ్‌లో ఈ విషయాన్ని బాగా వ్యక్తీకరించారు. మొక్కజొన్న పొత్తు సన్నని సెగ మీద కాచినపుడే ప్రతి గింజా ఉడికి రుచి పెరుగుతుంది. పెద్ద మంటలో పెడితే కాలి మసిగా మారుతుంది. కవితలో ఆవేశ వ్యక్తీకరణ కూడా ఇలాటి ప్రక్రియే!

ప్రశ్న 7: బతకడమెలాగో సూచించే అవును, ఇప్పుడైనా..కవిత ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అద్భుతంగా చెప్పింది. ఆ కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?

సమాధానం: 🙂 అది పూర్తిగా వ్యంగ్య కవిత. ఒక నేపథ్యమని కాదు. మనం చిన్నప్పటినుంచీ విని చదివి నేర్చుకున్న మాటలు, పాఠాలు జీవితంలో పనికిరానపుడు ఏం చేయాలి. అందరూ అనుకునే ‘లౌక్యం’ నేర్చుకోవాలి. ఎన్నో అనుభవాల తర్వాత మనలా మనం ఉండలేని స్థితిని గుర్తించి నిరాశ పడుతూ ఉంటాం. కానీ ఇన్ని అనుభవాల సారాన్ని యువతకి ఎలా చెప్పాలి నలుగురితో ఎలా పంచుకోవాలి – అని చేసిన ప్రయత్నమిది. చాలా బాధ, ఆగ్రహం కలబోసుకున్న కవిత ఇది. నా ఉద్దేశం చెప్పిన విషయాలన్నీ యథాతథంగా ఆచరణీయమని కాదు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు నిరాశ పడకుండా ఎలా బతకగలం – అనే ప్రశ్నకు ఇలాటి సమాధానాలు పాఠాలై నిలుస్తాయి. ఇవన్నీ మనకు ఎదురయే అనుభావాలే కదా.

ప్రశ్న 8. ఈ సంపుటిలో – బతుకు పోరులో మనిషి కష్టాలను ఇబ్బందులను ప్రస్తావించే కవితలతో పాటు చదువరులను భావుకత్వపు లోకంలో విహరింప చేసే ప్రకృతికి సంబంధించిన కవితలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంలో మీకు బాగా నచ్చిన, ప్రకృతికి సంబంధించిన కవిత ఏది? ఎందుకు?

సమాధానం: ప్రకృతి అంటే కేవలం చెట్లు చేమలే కాకుండా – అంటే సహజమైన మనుషులతో కలుపుకుని సకల సహజ జీవ జంతుజాలమని కదా! ‘ఉదయానే ఓ రంగుల పిట్ట’ మొదలుకుని ‘పండగతో ఒక మాట’, ‘నువ్వు – నేను – నీలిసంద్రం’, ‘చలిత’ , ‘ఎవరు గొప్ప’, ‘తొలి’, ‘ఆషాఢస్య ప్రథమ దివసే’, ‘కామెంగ్’ , ‘కొత్త రంగు’, ‘నిర్మోహం’, ‘కొత్తగా’, ‘ఏకం సత్’, ‘కొన్ని అప్రకటిత సందర్భాలు’, ‘కొత్త చిగురు’, ‘కొత్త దారిలో’ వంటివన్నీ ప్రకృతికి సంబంధించిన కవితలే. అయితే బయట కనిపించే ప్రకృతిని, లోని మానవ ప్రకృతిని చాలా చోట్ల అంతర-బహిరంగలక్షణాల్ని పోలుస్తూ తులనాత్మకతను విశ్లేషిస్తూ సాగిన కవితలే. అన్నీ ఇష్టమైనవే! మనిషి విసిగిపోయినపుడు ప్రకృతి వైపే కదా చూసేది! వేల సంవత్సరాల నాగరికత కలిగి ఉన్నా స్వార్థంతో వెలితి పడే మనిషి అల్పత్వాన్ని చూపే ‘ఎవరు గొప్ప’ ఒక రకంగా ఇష్టమైతే, ప్రకృతి తొలి పండుగ ఉగాది రంగును అనేక కోణాల్లో చూపే ‘కొత్త రంగు’ ఇంకోలా ఇష్టం. ప్రశాంతంగా సాగిపోయే కాల ప్రవాహానికి గురుతుగా నిలిచే నదిపై వ్రాసిన ‘కామెంగ్’ కవిత, నిర్మాణ పరంగా ద్వంద్వ లక్షణాలను పోల్చిన కవిత ‘కొన్ని అప్రకటిత సందర్భాలు’ – ఇలా అన్నీ నాకిష్టమైనవే!

ప్రశ్న 9. మనుషుల్లోని ద్వంద్వ వైఖరిని ప్రస్ఫుటం చేసిన నీ లోపలి నిజంకవిత వ్రాయడానికి దారి తీసిన సందర్భమేమిటి ? 2020 లో వ్రాసిన ఈ కవితకు కారణమైన ఘటన గురించి చెప్తారా?

సమాధానం: అద్దంలోకి చూసుకోడం మనమందరం చేసే పనే. అయితే మనలో చాలామటుకు పై వరకే ఆగిపోతాం. అందంగా ఉన్నామా లేదా ఎలా మెరుగులు దిద్దుకోవాలి అనే వరకే అద్దాన్ని వాడతాం. ఇంకొంత లోతుగా చూస్తే, అద్దాన్ని మనను అంచనా వేసే మనిషినో మనసునో చేస్తే మన లోపలి నిజం మనకు తెలుస్తుంది. మనమేం చేస్తుంటామో – శారీరకంగా కానీ, మానసికంగా కానీ, దేన్ని దాచి పెట్టాలని చూస్తామో, దాచి పెడుతుంటామో మనకు తెలుసు. ఆ దాచి పెట్టిన క్షణం గురించి, ఆ మన ప్రయత్నాల గురించి ఈ కవిత మాట్లాడుతుంది. దానికి దారి తీసిన ఘటనలు అనేకం – మన చుట్టూ ఉన్న మనుషుల్లాగే , వారి మనసుల్లాగే, మనలాగే!

ప్రశ్న 10. ‘ఈ లోకంతో జాగ్రత్త చిన్నా’ కవిత చదువుతున్నప్పుడు – శ్రీశ్రీ గారి ‘నేను ఇంకా పుట్టలేదు – నా ప్రార్థన వినండి’ కవిత స్ఫురించింది. పైకి రెండూ వేర్వేరుగా తోచినా, అంతరార్థం ఒకటేనని అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం?

సమాధానం: ఇంతకు ముందే చెప్పినట్టు నేను పెద్దగా తెలుగు వచన కవిత్వం చదువుకోలేదు. మీరు సూచించిన ఈ కవిత కూడా. అంతరార్థ సూచన యాదృచ్ఛికం కావచ్చు. నేను రాసిన కవిత నాకు జరిగిన అనుభవాల గురించి నా బిడ్డ కైనా, అలాటి వయసున్న పిల్లలకైనా ఏం చెప్పాలి అనే ఉద్దేశ్యమే!

ప్రశ్న 11. ఆధునిక ఉద్యోగ పద్ధతులకు ఎన్నింటినో కోల్పోతున్న మనం ‘ఎవరికీ , ఏమీ కాలేకపోతున్నాం’ అంటూ ‘నిశ్చేతనం’ కవిత వాపోతుంది. ఆప్తుల ఆప్యాయతను కోల్పోకుండానే వ్యక్తిగత జీవితాలను మింగేస్తున్న వృత్తి బాధ్యతలను ఎలా నియంత్రించు కోవచ్చంటారు?

సమాధానం: చాలా వరకు ఈ మధ్య కాలంలో ఉద్యోగాల్లో సైతం పోటీతత్వం ఏర్పడింది. ఎవరి ఉద్యోగం వారు చేసుకుపోవడం కాక పక్క వారి పరిధిలోకి తొంగి చూడడం ఎక్కువైంది. తొంగి చూడడమే కాదు. ప్రశాంతతను కోల్పోయేలా చేయడమూ ఎక్కువైంది. ఎప్పటికప్పుడు మన పని మనం చేసుకుపోవడం కాక మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరమూ పెరిగింది. ఈ కకావికల మధ్య మనమేంటో మనం మరచిపోతున్నాం. ఉదయం లేచింది మొదలు వ్యక్తిగత జీవితము, మనచుట్టూ ఇంట్లో ఉన్న మనుషులు, స్నేహితులు, వారితో మన అనుబంధాలు పోయి రోబోలలా తయారై పోయాం. కృత్రిమత్వపు వాసన. ఎవరిని పలకరించకపోతే ఏమవుతుందో, ఎక్కడ మనం గురిపెట్టబడతామో – ఇలాటి గందరగోళాల మధ్య మనిషి నిశ్చేతనత్వానికి గురౌతున్నాడు. ఈ వేదనను తెలియచేయడం మాత్రమే నా ఉద్దేశం. ఎలా వృత్తి బాధ్యతలను నియంత్రించాలని అడిగిన మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. బహుశా దానికి ‘పంచతంత్రం’ సమాధానం చెప్తుందేమో! 😀

ప్రశ్న 12. ‘స్పందించాల్సిన కొన్ని క్షణాలు/ ఇలా ప్రశ్నలు గానే ఎలా మిగిలిపోతాయి?’ అని అడిగారు ఇలా ప్రశ్నలు గానేఅనే కవితలో. జవాబు దొరికిందా? అసలు సమాధానం ఉంటుందంటారా?

సమాధానం: మనం మనలాగా బతకలేనప్పుడు ఇలా ప్రశ్నలుగానే మిగిలిపోతామని నా కనిపిస్తుంది. మన చుట్టూ కనిపించే సంపదను సూచించే వస్తువులో , కాలక్షేపం కోసం వచ్చిపోయే మనుషులో జీవితం కాదు కదా. మనం నిరంతరం ఎవరో ఒకర్ని సంతోషపెట్టాలని పడే తాపత్రయం తోనే జీవితం వెళ్లదీస్తున్నామనిపిస్తుంది. కనీసం ఒక గంటైనా నీకోసం నీవు గడపాలి కదా, నీ మనసుకు సంతోషాన్నిచ్చే, ఊరట నిచ్చే, అవిద్యని తొలిగించే ప్రవృత్తి కోసం – చదువులోనో, ఒక కళతోనో , ప్రకృతితోనో గడపగలగాలి కదా! ఈ కృత్రిమ జీవితంలో మనం మన సహజత్వాన్ని కోల్పోతూ అలా జీవితాన్ని కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాల పాచ్ వర్క్‌తో గడుపుతున్నామని ఒక కాఫ్కాయెస్క్ వాతావరణం సృష్టించు కుంటున్నామనీ నా కనిపిస్తుంది. అందుకే ఇలా ప్రశ్నలు గానే ఉదయాలు అస్తమయాలూ! ఇది నిరాశ కాదు. ఒక ఫిలోసోఫికల్ ఎంక్వయిరీ. మనిషి తొడుక్కున్న ముసుగులు ఊడిపోతే సమాధానాలు వాటంతట అవే దొరుకుతాయి.

ప్రశ్న 13: సాధారణంగా రచయితలకు తామే రాసేవన్నీ నచ్చుతాయి. కానీ ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది? ఎందువల్ల?

సమాధానం: చాలా కష్టమైనా ప్రశ్న. నా మటుకు నాకు అన్నీ నచ్చినవే. అవి నా కవితలని కాదు. వాటి సృజన వెనుక ఉన్న ఇష్టత, సమయం, వాటిని మంచి కవులు , పాఠకులు ఆదరించిన తీరు. ‘కవిత ఒకటి కొత్తది’ ఒక కోణంలో నచ్చితే, ‘వెయ్యి వేషాల్’ ఇంకో కోణంలో నచ్చుతుంది. అమ్మ గురించి, నాన్న గురించి రాసిన కవితలు, ప్రకృతి గురించిన కవితలు, మనిషి ముఖాల గురించి – ఇలా అన్నీ ఏదో విధంగా నచ్చుతై.

ప్రశ్న 14: ఈ సంపుటిలో ఏదైనా కవిత రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే, ఎందుకని?

సమాధానం: ఏ కవితా కష్టమనిపించదు. అయితే కొన్ని ఎక్కువ సేపు, ఎక్కువ కాలం తీసుకుంటాయి. కొన్ని తక్కువ సమయంలో పూర్తవుతాయి. ఆశ్చర్యంగా కొన్ని చిన్నవే అయినా ఎక్కువ సమయం తీసుకుంటాయి. పెద్దవి అయినా తక్కువ సమయంలో పూర్తవుతాయి. ‘అయిపో’ కవిత కొంత ఎక్కువ సమయం తీసుకుంది.

ప్రశ్న 15: ఈ పుస్తకం ముఖచిత్రంపై బొమ్మ ప్రతీకాత్మకంగా ఉంది. ఆ బొమ్మని ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. ముసుగు వేసుకున్న మనిషి, ఒకరినొకరు తొక్కేసే మనుషులు, లేదా జీవితపు పోరులో ఇరుక్కుపోయి, కిక్కిరిసి, ఒకరిపై ఒకరెక్కి ఒత్తిడికి గురువుతున్న జనాలుగా అనుకోవచ్చు. ఈ బొమ్మని ఎవరు డిజైన్ చేశారు? బొమ్మ గురించి మరింత వివరిస్తారా?

సమాధానం: ఈ పుస్తక ముఖ చిత్రాన్ని గీసింది విజయవాడకు చెందిన శ్రీ అరసవిల్లి గిరిధర్. నా కవిత్వ సంపుటులన్నిటికీ ఆయనే చిత్రకారులు. ఈ పుస్తక చిత్రం అందరినీ ఆలోచింప చేస్తోంది. అందరూ అడుగుతున్నారు. మీరన్నట్లు సమాజపు ముసుగును, మనుషుల ముసుగును, ముసుగు వెనుక దాగిన మనుషులను చెప్తూ ముసుగులో కింద తొక్కివేయబడుతూ నిస్సహాయులై ఎటువైపో చూస్తున్న మనుషులది, అలాటి చూపును చాలా ప్రతీకాత్మకంగా చిత్రించారాయన. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు.

ప్రశ్న 15: కవిగా గాని, కథకుడిగా గాని, సంపాదకుడిగా గాని కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధం చేస్తున్నారా?

సమాధానం: చాలా రోజుల నుంచీ చేస్తున్న అనువాదాలను (తెలుగు నుంచీ ఇంగ్లీషుకు, ఇంగ్లీషు నుంచీ తెలుగుకు), దేవిప్రియ ‘గాలిరంగు’ ఇంగ్లీషు అనువాదాన్ని పుస్తకాలుగా తెచ్చేందుకు సిద్ధమౌతున్నాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు విజయ్ గారూ.

డా. విజయ్ కోగంటి: ఆలోచనాత్మకమైన ప్రశ్నలకు ధన్యవాదాలు.

***

ఎవరిదీ చూపు? (కవిత్వం)
రచన: డా. కోగంటి విజయ్
ప్రచురణ: ప్రచ్ఛాయ, హైదరాబాద్
పేజీలు: 164
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/EVARIDEE-CHOOPU-Vijay-Koganti/dp/8199107588/

 

 

~
‘ఎవరిదీ చూపు’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/evaridee-choopu-book-review-kss/

Exit mobile version