[‘పొలంగట్లవెంట’ అనే కవితాసంపుటి వెలువరించిన బండ్ల మాధవరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం బండ్ల మాధవరావు గారూ.
బండ్ల మాధవరావు: నమస్కారమండి
ప్రశ్న 1. ‘పొలంగట్లవెంట’ కవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. ఈ సంపుటి శీర్షిక నేపథ్యం వివరిస్తారా?
ప్రశ్న 2. మీ ఏడవ కవితా సంపుటి విడుదల సందర్భంగా మీ సాహిత్య ప్రస్థానం గురించి వివరించండి.
జ: ఇంటర్ చదివే రోజుల్లో కథల పట్ల ఆసక్తి ఉండేది. అప్పట్లో నాలుగైదు కథలు రాసి పత్రికాలకు పంపితే ఏ మాత్రం వ్యవధి లేకుండా తిరిగి వెనక్కి వచ్చాయి. ఆ తర్వాత సాహిత్యం పట్ల అవగాహన పెంచుకొని కొంత అధ్యయనం తర్వాత 1990 నుంచి కవిత్వం రాయడం మొదలుపెట్టాను. 98లో ‘చెమట చిత్తడి నేల’, 2005లో ‘స్పర్శ’, 2014లో ‘అనుపమ’, 2017లో ‘ఊరి కల’ దీర్ఘ కవిత, 2017లోనే ‘మా ఊరు మాయిల్లు’ కథ కవితా సంపుటి, 2022లో ‘దృశ్య రహస్యాల వెనుక’, ఇప్పుడు ఈ ‘పొలంగట్ల వెంట’ కవితా సంపుటులు వచ్చాయి. ‘కవితా!’ మాస పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నాను. విజయవాడ సాహితీమిత్రులు వెలువరిస్తున్న ‘కవిత’ వార్షిక సంచికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రైతు కవిత, పాపినేని అభినందన సంచిక, దేవిప్రియ అభినందన సంచిక, గుంటూరు అరసం వారి యువతరం కోసం దేవిప్రియ కవిత తదితర పుస్తకాలకు కూడా సంపాదకత్వం వహించాను.
ప్రశ్న 3. “మాధవరావు కవిత వస్తునిష్టంగా ఉంటూనే భావ ప్రధానంగా సాగుతుంది. కథనాత్మకత అధికం.” అని వ్యాఖ్యానించారు సీతారామ్ తమ ముందుమాటలో. కథలలో కొన్ని వాక్యాలు కవితాత్మకంగా ఉన్నాయని అంటుండం కద్దు. కవితకి కథనాత్మకత ఆపాదించడం ఎలా?
జ: మనసు లోలోపల సుళ్లు తిరిగే భావ సంచయంతోపాటు, నా కవిత్వం వస్తుసంబంధంగా కూడా ఉంటుంది. కొన్ని వస్తువుల్ని కవిత్వం చేసేటప్పుడు కథనాత్మకతను జోడిస్తే పాఠకులకు ఇంకా ఎక్కువ దగ్గరవుతుందని కవిత రాస్తున్న ప్రతిసారి అనుకుంటాను. అందువల్లనే ఏడాదికొకసారైనా, నది – నేను, జైలు ద్విపమైనచోట లాంటి కవితల్లో కథనాత్మకత కనిపిస్తుంది.
జ: అవును నా కవిత్వం లోని అంతస్సూత్రాన్ని చక్కగా వివరించాడు సీతారామ్. వర్తమాన సమాజం రేపటిపట్ల ఆశాజనకంగా లేదు. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని నన్నయ్య అన్నాడు కదా అని గతంలోకి తిరిగి ప్రయాణించలేము. ఈ సంఘర్షణ నిరంతరం నాలో కొనసాగుతూనే ఉంది. అదే నా కవిత్వంలో కూడా ప్రతిబింబిస్తుంది.
ప్రశ్న 5. మీ దృష్టిలో కవితకి సంబంధించి లయ, వస్తువు, భాష వీటిలో భావ వ్యక్తీకరణలో ఏది ముఖ్యం? ఎందువలన?
జ: భావ వ్యక్తికరణకు వస్తువు, భాష, లయ మూడు ఉన్నప్పుడే కవి తాను అనుకున్న భావప్రసరణ జరుగుతుంది.
ప్రశ్న 6. వర్తమాన పరిస్థితుల పట్ల మీలోని ఆవేదన ఉద్వేగమై కవితా రూపం ధరించినా, అది ఆగ్రహ ప్రకటనలా ఉంటుంది కానీ విద్వేష ప్రదర్శనలా అనిపించదు. భావతీవ్రతని పదునైన పదాలలో ఒదిగించడం ఎలా సాధ్యమైంది?
జ: ఆలోచనాపరుడైన కవి తార్కిక దృష్టితో ఉన్నప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం సరైంది కాదని, ఒక ఆగ్రహంతో సమాజంలో మార్పులు కోసం ప్రయత్నించాలని అనుకుంటాను. అలా ఆలోచించేటప్పుడు విద్వేషాన్ని అదుపులో ఉంచుకోడానికి, భావతీవ్రతనూ ప్రకటించాడానికి అవసరమైన భాష కోసం కొంత అంతర్మథనం సాగుతుంది. అందులోంచే కవిత పుడుతుంది.
ప్రశ్న 7. చాలా కవితల్లో నది, మట్టి, అన్నం, ఆకలి – మనిషి వేదనలకి ప్రతీకలుగా నిలిచాయి. “అన్నం లేకపోవడం మాట్లాడలేకపోవడం ఒకటే కదా!” అని ‘ఎదురుపడని మాట’ కవితలో వ్రాసిన వాక్యం మనసుని మెలిపెడుతుంది. ఈ కవిత వ్రాసిన సందర్భం గురించి చెప్తారా?
జ: మాటల్లేనితనం, మాట్లాడలేనితనం, మాటలు బందీ అయినా సందర్భం లోంచి ఈ కవిత పుట్టింది. ఆకలైనప్పుడు అన్నం లేకపోవడం, మాట్లాడాలనుకొన్నప్పుడు మాట్లాడలేకపోవడం రెండూ ఒకటే నా దృష్టిలో. అటువంటి మాట్లాడనివ్వనితనమే ఈ కవితకు ప్రేరణ.
ప్రశ్న 8. “బహిర్గతమవుతున్న ముఖాల మధ్య/ముడుచుకు కూర్చున్న నాకు/రేపటిలోకి ఎలా నడవాలన్నదే/నిలువెత్తు ప్రశ్న” అన్నారు ‘లోపలి ముఖం’ కవితలో. ఇది 2022లో వ్రాసుకున్నది. ఈ నాలుగేళ్ళ కాలంలో ఆ ప్రశ్నకు జవాబు దొరికిందా? ఈ కవిత నేపథ్యం చెప్పండి.
జ: దొరకలేదు. ఇకముందు కూడా దొరకదు. అబద్ధాలు రాజ్యమేలుతున్న కాలంలో పైకి కనబడుతున్న ముఖాల మధ్య నా ప్రశ్న కొనసాగుతూనే ఉంది.
ప్రశ్న 9. ‘మట్టిని అన్నం చేసే ఋతువు’ భావుకత నిండిన వాక్యం. మనిషి చేతులారా చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని గొప్పగా ప్రదర్శిస్తుంది ‘ఏడాదికొకసారైనా’ కవిత. ఈ కవిత రాయడానికి ఏది ప్రేరణైంది?
జ: మాఊరు కృష్ణానదికి 4 కి. మీ ల దూరంలో ఉంటుంది. అయినా మా వ్యవసాయం వర్షాధారమే. రాయలసీమలోనో, తెలంగాణాలోనో మాత్రమే కరువు ప్రాంతాలున్నాయనుకుంటారు. భౌగోళికంగా కృష్ణ ఒడ్డున ఉన్న మా ఊళ్ళు కూడా వాటికేమి తీసిపోవు. మాకు కూడా నీరు అపురూపంగానే ఉండేది. ఆ నేపథ్యంలోనే ఈ కవిత వచ్చింది.
ప్రశ్న 10. ‘వాన రాదారుల్లో’ కవితలో “నీరింకి పోవాల్సిన చోట/మనిషింకి పోవడమే విషాదం” అని అన్నారు. మరి ఈ విషాదానికి ముగింపు పలకడమెలా?
జ: అయితే అతివృష్టి కాకుంటే అనావృష్టి పరిస్థితి మాది. నీటికి అడ్డుకట్టలేసి లొంగదీసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ అప్పుడప్పుడు నీరు తన విశృంఖలతను చూపుతూనే ఉంది. ప్రకృతి పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోనంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది.
ప్రశ్న 11. మీ స్వీయ కవితల సంపుటిలో ఒక అనువాద కవితని చేర్చడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ కవిత కాకుండా, వేరే కవితలు అనువదించారా? ఇతర భాషలలో మీకు నచ్చే కవులు ఎవరు?
జ: ఇతర భాషల కవిత్వం చదివేటప్పుడు నాకు బాగా నచ్చిన కవితలను అనువాదం చేస్తుంటాను. ముఖ్యంగా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒడిస్సి భాషల అనువాదాల్ని చదువుతాను. అలాగే లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ కవిత్వం చదువుతుంటాను. కవిత్వం చదవడమే ఇష్టంగా భావిస్తుంటాను. అందువల్ల ఫలానా కవి ఇష్టం అని చెప్పలేను.
ప్రశ్న 12. సాధారణంగా రచయితలకు తామే రాసేవన్నీ నచ్చుతాయి. కానీ ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది? ఎందువల్ల?
జ: రాసిన ప్రతి అక్షరం ఇష్టంగానే ఉంటుంది. నేనేది ఆశించి రాసానో అది ఎక్కువమందికి చేరినప్పుడు ఆ కవితపట్ల ఇష్టం పెరుగుతుంది. అలా చాలా కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
ప్రశ్న 13. ఈ సంపుటిలో ఏదైనా కవిత రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే, ఎందుకని?
జ: అలాంటిదేమి లేదు.
ప్రశ్న 14. మీ తొలి కవితా సంపుటి నాటికీ, ఈ కొత్త కవితా సంపుటి నాటికి కవిగా మీలో ఏం మార్పు వచ్చిందని భావిస్తున్నారు?
జ: మొదటి కవితా సంపుటి నుండి ఇప్పటివరకు ఏ మార్పు లేకుండా రాస్తే ఆ కవి జీవిస్తున్నట్లు లెక్క కాదు. సహజంగానే పరిణామం, పరిణతి కవికి ఉండాలి. అలా చూస్తే ఎప్పుడూ వర్తమానతలో ఉంటాను. నాలో నేను సంఘర్షణ పడుతుంటాను. అవన్నీ ఎప్పటికప్పుడు నా కవిత్వంలో కొత్తగానే కనబడుతుంటాయి.
ప్రశ్న 15. ఈ పుస్తకం ప్రచురణలో ఏవైనా ప్రత్యేక అనుభవాలు చెబుతారా? పుస్తకం సైజు మామూలు పుస్తకాలకు భిన్నంగా ఉంది. కవర్ డిజైన్, ఇన్నర్ లే-అవుట్ బావున్నాయి.
జ: ధన్యవాదాలు. “A book cannot be judged by its cover” అంటుంటారు. కానీ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవాలంటే ఆ మాత్రం అందంగా ఉండాలి కదా. ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలనుకొంటున్నాను. సొంత కవిత్వం అచ్చు వేసుకునేటప్పుడు కూడా సంపాదకుడు ఉండాలనేది నా అభిప్రాయం. అందుకే ‘అనుపమ’కు దేవిప్రియ, ‘దృశ్య రహస్యాల వెనుక’ కు ఏకే ప్రభాకర్, ఈ ‘పొలం గట్ల వెంట’కు సీతారామ్ సంపాదకులుగా ఉన్నారు.
ప్రశ్న 16. కవిగా గాని, సంపాదకుడిగా గాని కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధంగా చేస్తున్నారా?
జ: మే 1 నాటికి ‘కవిత 2025’ సిద్ధమవుతోంది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు బండ్ల మాధవరావు గారూ.
బండ్ల మాధవరావు: ధన్యవాదాలు.
***
రచన: బండ్ల మాధవరావు
ప్రచురణ: సాహితీమిత్రులు, విజయవాడ
పేజీలు: 143
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
డా. కె. ఉమా రాణి,
#305, రెయిన్‍బో ఎన్.ఎం. స్క్వేర్,
జయప్రకాశ్ నగర్,
విజయవాడ 520008
ఫోన్: 8897623332
~
‘పొలంగట్లవెంట’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/polamgatlaventa-book-review-kss/

