Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథకుడు, అనువాదకుడు శ్రీ భాగవతుల కృష్ణారావు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘కిష్టప్ప కథలు’ అనే కథాసంపుటి వెలువరించిన భాగవతుల కృష్ణారావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం భాగవతుల కృష్ణారావు గారూ.

భాగవతుల కృష్ణారావు: నమస్కారం.

~

ప్రశ్న 1: ప్రశ్న 1: మీరు రచించిన కథలు, మినీ కథలతో ‘కిష్టప్ప కథలు’ అనే సంపుటి ప్రచురించినందుకు అభినందనలు. ఇది మీ తొలి కథాసంపుటి కదా, ఇప్పటి వరకు మీ రచనలను పుస్తక రూపంలోకి తేకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: ప్రింట్ మీడియా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో పుస్తకం అచ్చువేయటం రచయితకి తలకు మించిన భారమే. చాలాకాలం వరకు అసలు అచ్చొత్తించాలనుకోలేదు. కానీ కొందరు సన్నిహిత సాహితీ మిత్రుల ప్రోద్బలంతో అంతవరకు చెల్లాచెదురుగా పడి వున్న రచనలన్నీ ఒకే సంపుటిగా ముద్రించాలని తలంపు కలిగింది.

ప్రశ్న 2: కవిగా, కథా రచయితగా, మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జ: చిన్నప్పటి నుండీ పుస్తక పఠనాసక్తి ఉండేది. హైస్కూల్ విద్య సోంపేటలో, తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ.

పకోడీ పొట్లం నుండీ ప్రబంధాల దాకా చదివాను. ఆంగ్ల సాహిత్యం కూడా కొంతవరకు చదివాను.

డిగ్రీ పూర్తయ్యాక నిరుద్యోగ పర్వంలో కథలు, అనువాదాలు కొన్ని చేసాను. పురాణం వారు ఆ సమయంలో నా రచనలు, అనువాదాలు ప్రచురించి నాలో రచయితని ప్రోత్సహించారు.

నాకు అన్ని సాహితీ ప్రక్రియలలో కథలంటేనే మక్కువ.

నా కథలు చూసిన మా పెదనాన్నగారి అబ్బాయి కీ.శే.రామవరపు వేణుగోపాల రావు నన్ను హైదరాబాదు రమ్మని ఈనాడులో ఉద్యోగ ప్రయత్నం చేద్దామనడంతో సరదాగా వచ్చి మేగజైన్ సెక్షన్‌లో చలసాని గారి సహాయకుడిగా సంవత్సరం పనిచేసాను.

కారణాంతరాల వలన మళ్లీ ఖరగ్‌పూర్ మా వాళ్ల దగ్గరకు వచ్చి రైల్వేలో ప్రవేశించాను. కొద్దిపాటి కథలు వ్రాసినా ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు ప్రవృత్తికి ఆటంకం కలిగించాయి.

మళ్లీ రిటైరయ్యాక సమయం దొరికి బాధ్యతలు తీరడంతో రచనా రంగంలో ప్రవేశించడం జరిగింది.

ప్రశ్న 3: కవిత/కథ వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?

జ: నా మట్టుకు కథ వ్రాయడమే సులువనుకుంటాను. కవితలు ‌కూడా వ్రాసినప్పటికీ కథ నాకిష్టమైన ప్రక్రియ.

ప్రశ్న 4: “వైయక్తిక అనుభవాలను సంప్రదాయ సాహితీ ప్రక్రియకు అన్వయిస్తూ మానవీయ విలువలకు అన్యాపదేశంగా భాష్యం చెప్తూ చక్కని కథనాలు అల్లడంలో దిట్ట ఈ రచయిత” అని వ్యాఖ్యానించారు ఎమ్మెస్వీ గంగరాజు గారు తమ ముందుమాటలో. కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత సన్నిహితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా రూపొందించాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?

జ: మనసుకి నచ్చిన దేదైనా సామాజికాంశం వస్తువుగా తీసుకుని వీలైతే సందేశాత్మక ముగింపుతో పూర్తి చేస్తాను.

ప్రశ్న 5: మీ తొలి కథ నాటి నుంచి తాజా కథ వరకూ – పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్‍డేట్ అయ్యారు?

జ: తొలి కథ వ్రాసిన సమయంలో అంటే 1978 నుండీ ఈనాటికి సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. అప్పుడు చేతివ్రాతే. పత్రికలు కూడా చాలా ఉండేవి. ఇప్పుడు ఈ వయసులో మనల్ని మనమే అప్డేట్ చేసుకుంటూ ముందుకి సాగడమే.

ఇహ పాఠకులలో పఠనాసక్తి తగ్గింది. టీవీలు, ఒటీటీలు వచ్చాక ఆ మాత్రం చదువు కూడా మూలబడింది.

నేను రిటైరయ్యాక పూర్తి స్థాయిలో చైతన్యవంతుడినయ్యాను.

నాకన్నా చిన్నవారి దగ్గరా, మా పిల్లల దగ్గరా అధునిక పరికరాలు అంటే కంప్యూటర్, మొబైల్ వాడకంలో మెళుకువలు, ఉపయోగం నేర్చుకున్నాను.

ప్రశ్న 6: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల? మామూలు కథల కన్నా మినీ కథలు ఎక్కువగా వ్రాయడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా??

జ: పాఠకులను గమనిస్తే నాకు ఒక విషయం బాగా అర్ధమైంది. ఎంత గొప్ప విషయమున్న వస్తువైనా సూక్ష్మంగా చెప్తేనే చదువుతారు. నిడుపైన అంటే లెంగ్తీ పోస్ట్ చదవడానికి ఇష్టపడరు. దానికి తగ్గట్టుగా మన వస్తువు, శైలి ఉండాలి.

అసలు మొదటి వాక్యమే ఆకట్టుకుని ఉంటే, పాఠకుడి పిలక్కి తాడు కట్టి చివరిదాకా ఊపేస్తూ లాక్కెళ్లిపోతుంది.

అందుకే మినీ లేదా చిన్న కథలు నాకిష్టం. ఈ విషయంలో ఓ.హెన్రీ, చెఖోవ్ నాకిష్టం.

ప్రశ్న 7: మీకు సొంతంగా కథ రాయటం సులువా లేక ఓ కథని అనువదించటం సులువా? అనువాదాలు చేయడం కథకుడిగా రాణించటంలో మీకు ఉపకరించిందా లేక ఆటంకమయిందా?

జ: నేను మొదట్లో అనువాదాలే చేసాను. సత్యజిత్ రే కథ ‘కార్వస్’ నా మొదటి అనువాదం. తర్వాత మహాశ్వేతా దేవి గారి ‘గంగపుత్రులు’, సర్ ఆర్ధర్ కానన్ డాయల్ ‘ఎవరు దోషి’ కథలను అనువదించాను. అన్నీ పురాణం శర్మగారు ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు.

ప్రశ్న 8: మూల భాష, లక్ష్య భాషలో సమాన పట్టు ఉండటమే కాక, ఓ అనువాదకుడికి ఉండాల్సిన ఇతర నైపుణ్యాలు ఏవని మీరు భావిస్తున్నారు?

జ: నేను రాసిన బెంగాలీ కథలు ఆంగ్లం నుండే అనువాదం చేసాను. నా ఉద్దేశంలో అనువాదం సహజంగా ఉండాలి. మక్కీకి మక్కీలా ఉండకూడదు. మూల రచయిత భావాన్ని ఆకళింపు చేసుకుని మనదైన శైలిలో భావం చెడకుండా పాఠకుడికి అందించాలి. అసలు అనువాదమే కష్టం. మూల రచయిత భావాల్ని ఒడిసిపట్టుకునే నేర్పు, భాష మీద సాధికారత ఉంటే గానీ చక్కని అనువాదము కుదరదు.

ప్రశ్న 9: మీరు వ్రాసిన చాలా కథలు open-ended గా ఉంటాయి. చాలాసార్లు చివరకు ఏమవుతుందన్నది చెప్పలేదు. దీన్ని మీ కథనశైలిగా పరిగణించవచ్చా?

జ: కొన్ని ముగింపులు పాఠకులకే వదిలెయ్యాలి. వారి వారి ఊహలను బట్టి ఆనందిస్తారు. మన అభిప్రాయాలు రుద్దకూడదు. అన్నీ విడమరిచి చెప్పకూడదు. అదో టెక్నిక్.

ప్రశ్న 10: ‘బిల్హణీయం’ కథలోని ‘చారు’ కవిత, ‘చెగోడీ’లో చెగోడీ కవిత మీరు వ్రాసినవేనా? మీరు స్వయంగా కవి కావడం ఈ కథలకి ఇలా ఉపయోగపడిందా? కథలో కవితని ఇమడ్చడం గురించి మరికాస్త వివరించండి.

జ: నేను రిటైరయ్యాక ఛందస్సు నేర్చుకున్నాను. శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారికి, బావాజీ యర్రమిల్లి గారికి నా కృతజ్ఞతలు. నాకు కంద పద్యమంటే మక్కువ ఎక్కువ. దాని నడక నచ్చుతుంది. కానీ అందరూ కందం కష్టం అంటారు. నియమాలెక్కువ అంటారు. అయినా నిరుత్సాహ పడక, నేను కూడా కందపద్యం వ్రాయాలనే కోరిక బాగా ఉండేది.

అది కూడా తీర్చుకున్నాను. కథలలో కూడా సమయానుకూలంగా నా కంద పద్యాలే వాడుకున్నాను.

రిటైరయ్యాక అప్పటికే అరకొరగా వస్తున్న ప్రింట్ మీడియా కరోనాతో నేలమట్టమైంది.

ఫేస్‌బుక్‌లో అప్పటికే భావుక సమూహంలో చాలావరకు నా రచనలు వచ్చేవి. కొన్నిటికి బహుమతులు కూడా అందుకున్నాను. అందుకు భావుక నిర్వాహక‌కార్యవర్గానికి నా అశేష కృతజ్ఞతలు.

పదపూరణలు కూడా నన్ను అకర్షించిన మరో గొప్ప ప్రక్రియ. వినూత్నంగా శ్రీ గంగరాజు గారు తదితరులు కూర్చిన గళ్ల నుడికట్లు, పద్యప్రహేళికలు కూడా నాకు మక్కువ కలిగించే ప్రక్రియలు. ఇప్పటికీ పాల్గొంటాను.

ప్రశ్న 11: ‘దరహాసజీవి’ కథలోని బలరామ్ పాత్ర కల్పితమా? లేక మీకు నిజజీవితంలో తారసపడిన వ్యక్తా? వివరించండి.

జ: బలరాం పాత్ర కల్పితమే. అయితే‌ మన చుట్టూ అలాంటి పాత్రలెన్నో ఉన్నాయి. మనం పరిశీలిస్తే చాలామంది కనపడతారు. ఒక్కోసారి మనం వరమనుకున్నది శాపంగా మారవచ్చు. అలాగే శాపం కూడా వరం కావచ్చు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ కథ వ్రాసాను.

“అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని- జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని” అన్నాడు ఆత్రేయ.

ప్రశ్న 12: చక్కని కరుణత్మక మినీ కథకి గొప్పగా అమరిన పేరు ‘నిత్యానపాయని’. ఈ కథ నేపథ్యం గురించి చెప్తారా?

జ: నేను బెంగాల్లో రైల్వేలో పనిచేసే రోజుల్లో ఒక జంటని డెయిలీ లోకల్ ట్రెయిన్‌లో చూసేవాడిని. ఇద్దరూ బెంగాలీ దంపతులు. వాళ్ల లోకంలో వాళ్లుండేవారు. చుట్టుపక్కల వారినసలు పట్టించుకునేవారు కాదు. ఆయన భుజం మీద తల వాల్చి అమె ఏదో మెల్లిగా చెప్పేది. అమె చేతిని నిమురుతూ అయన ఏదో బదులిచ్చేవాడు. పక్క వాళ్లకి కూడా వినపడేది కాదు వారి సంభాషణ. ఒకరోజు అయనొక్కడే కనపడగానే నాలో ఊహ కథలల్లేసింది. అలా వాళ్లమీద అల్లిన కథ అది.

ప్రశ్న 13: మీ ముచ్చట్లలో ‘రోకు పురాణం’ బావుంది. ఈ ముచ్చట్లు ఎప్పుడు ఎలా రాశారు? వాట్సప్ లేదా ఫేస్‌బుక్ వంటి మాధ్యమాలలో వ్రాసినవా లేక అప్పుడప్పుడూ రాసిపెట్టుకున్నవి పుస్తకంలో చేర్చారా?

జ: నా స్కూల్, కాలేజ్ రోజుల్లో జరిగిన అనుభవాలు, జ్ఞాపకాలు ముచ్చట్లుగా భావుక గ్రూప్‌లో రెగ్యులర్‌గా వ్రాసేవాడిని. వాటికే నా సంపుటిలో స్థానం కల్పించాను.

ప్రశ్న 14: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: నాకు’ జ్ఞానోపదేశం’ కథ బాగా నచ్చింది. పసిపిల్లల మనఃప్రవృత్తి, భయాలు, మనోవేదన, అసురక్షితా భావం వారి మాటల్లో తెలియజేయాలనుకున్నాను. కొత్తగా ఎవరో తల్లి కడుపున పుడతారని తెలియగానే మొదటివాళ్లకి అదో పెద్ద అఖాతం. వాళ్లతో పాటు తల్లి ప్రేమ పంచుకునే వారిపై అకారణ ద్వేషం సహజం. తల్లిదండ్రులు వాళ్లలొ గల అభద్రతా భావాన్ని గుర్తించి వీలైనంత కౌన్సెలింగ్ చెయ్యాలి.

1970 ప్రాంతాలలో నిజంగా జరిగిన సంఘటన ఒకటి నా మనసు కలచి వేసింది. ఇప్పటికీ మరువలేని విషాద సంఘటన. బెంగాల్లో మేముండే లొకాలిటీలో చాల బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారిలో ఒక కుటుంబంలో ఐదుగురు ఆడపిల్లలు, ఒక‌‌ మగ పిల్లాడు ఉండేవారు. వారిలో ఒక పిల్ల కొద్దిగా ఛాయ తక్కువ. దురదృష్టవశాత్తు తొమ్మిది, పదీ క్లాసులు చదువుతుండగా ఒక సాయిబుల కుర్రాడితో పారిపోయింది. మోజు తీర్చుకుని వాడొదిలేసాక దిక్కుతోచక ఇంటికి తిరిగి వచ్చింది.

అయితే తండ్రి కర్కోటకంగా అమెను అనుమతించలేదు. నోరు లేని తల్లి, నోరున్నా కొడుకు మీద ఆధారపడ్డ బామ్మా ఆ పిల్లను ఇంటిలోకి ఆహ్వానించలేక పోయారు.

ఫలితం.. ఆ పిల్ల ఏడుస్తూ అనంత అంధకార లోకాల్లోకి అదృశ్యమైంది. అమె ఆచూకీ ఇప్పటికీ తెలియదు.

నాలో ఈ సంఘటన చాలా కలకలం రేపింది. ఎన్నాళ్లో వెంటాడింది.

చివరికి ముగింపు సుఖాంతం చేస్తూ నేను ‘రామబాణం’ అనే కథను వ్రాసాను. కథామంజరిలో ఆ కథ మూడేళ్ల కిందట ప్రచురితమైంది.

యవ్వన ఆకర్షణలో అభంశుభం తెలియని మన సంతానం పొరపాటు చేసినా కఠినత్వం చూపకుండా వారిని చేరదీసి సంస్కరించాలని నా ఉద్దేశం.

వారికి మనం తప్ప ఎవరు దిక్కు? ఈ తోడేళ్ల లోకంలో అలా పసికూనల్ని వదిలెయ్యడం సమంజసమా?

ఇది కూడా నాకు నచ్చిన నా కథ.

ప్రశ్న 15: ఈ సంపుటిలోని ఏదైనా కథ/కవిత రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా/కవితనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: అలా ఏమీ అనిపించలేదు. ఒకే సిటింగ్‌లో వ్రాసాక‌ మళ్లీ తప్పులు, అక్షరదోషాలు చూసి ఫైనల్‌గా పోస్ట్ చేస్తాను. నాకు నచ్చిన కవితలు ఏవైనా అనువదిస్తూ ఉంటాను. ఖలీల్ జిబ్రాన్, ఎడ్మండ్ బర్క్ కవితలు అనువదించాను. అలాగే మిత్రులు శ్రీ గంగరాజు గారి ఆంగ్ల కవితలు అనువదించాను.

ప్రశ్న 16: ‘కిష్టప్ప కథలు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: తొలి ప్రయత్నం కాబట్టి భయపడుతూ వంద కాపీలు మాత్రమే అచ్చు వేసాను. నా బంధువు శ్రీరాజ్ సహకారంతో ఎక్కువ శ్రమ లేకుండా అచ్చు వేయగలిగాను. పాఠకులు కూడా స్పందించి బాగా ఆదరించారు.

ప్రశ్న 17: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?

జ: కథలు వ్రాయడం నాకు సత్కాలక్షేపం. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తాను. అన్నట్టు ప్రహేళికా పూరణలు కూడా హాబీనేనండోయ్.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు భాగవతుల కృష్ణారావు గారూ.

భాగవతుల కృష్ణారావు: నన్ను పరిచయం చేసిన మన సంచిక పత్రికకు, సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారికి, ముఖాముఖి నిర్వహించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏.

***

కిష్టప్ప కథలు (కథా సంపుటి)
రచన: భాగవతుల కృష్ణారావు
ప్రచురణ: శ్రీరాజ్ పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 208
వెల: ₹ 150/-
ప్రతులకు:
భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
ఫోన్: 7702552305

~
‘కిష్టప్ప కథలు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/kishtappa-kathalu-book-review-kss/

Exit mobile version