Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథా నవలా రచయిత శ్రీ భీమరాజు వెంకటరమణ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘నా కలం నా ఇష్టం’ అనే కథాసంపుటి, ‘ఉదయరాగం’ అనే నవల వెలువరించిన భీమరాజు వెంకటరమణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం భీమరాజు వెంకటరమణ గారూ.

భీమరాజు వెంకటరమణ: నమస్కారమండీ.

~

ప్రశ్న: మీ ఐదవ కథా సంపుటికి శీర్షికగా మొదటి కథ నా కలం నా ఇష్టంపేరునే ఎంచుకోడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: ప్రత్యేక కారణం ఏమి లేదండి. ‘నా కలం నా ఇష్టం’ అన్న మాటలో నిజానికి తప్పేమి లేదు. అంటే నేను రాయదలుచుకున్నదే రాస్తాను అని. నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. రాసినతను అది తన ఇంట్లోనే పెట్టుకొని తనే చదువుకుంటూ ఉంటే కాదన్నదెవరు? కానీ ఆ రచనని సమాజం మీదకి వదులుతున్నపుడు అది చదువరులకు హితవు కలిగించకపోయినా ఫరవాలేదు హాని కలిగించకూడదు. అంటే పెడత్రోవ పట్టించకూడదు. ఇది పెద్దలు చెప్పిన మాటే. అలాంటి రచయితను ఒకర్ని సృజించి అది ఒక సరదా కథగా రాసి నెమరు వేశాను. అదే సంపుటికి శీర్షికగా పెట్టాను.

ప్రశ్న: మీ తొలి కథ నుంచి తాజా కథ వరకూ, సమాజంలోనూ సాహిత్యంలోనూ ఏయే మార్పులను గమనించారు? వాటికి తగ్గట్టుగా వస్తువు ఎంపికలో లేదా రచనాశైలిలో ఏవైనా మార్పులు చేసుకున్నారా?

జ: నేడు సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏమిటంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరినీ ఆవరించింది ఉంది. రచయితతో పాటు ప్రతి ఒక్కరికి సమాచార సేకరణ సులువైయింది. ఒక రచయిత మారుమూల పల్లెలో కూర్చొని వ్రాసిన రచన ‘సంచిక’ లాంటి అంతర్జాల పత్రికల ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకునే సౌలభ్యమూ ఏర్పడింది.

మరోవైపు ప్రజల అలవాట్లు ఆలోచనా ధోరణులు వేగంగా మారిపోతున్నాయి. చెప్పేవాడేగాని వినేవాడు లేడన్నట్లుంది పరిస్థితి. రచయిత ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలను, మార్పులను గమనిస్తూ తన రచనలను మలుచుకోవలసిన ఆవశ్యకత ఎప్పుడూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మారుతూ పరుగెడుతున్న సమాజం వెనుక రచయిత కాగితం కలం పట్టుకొని అదే వేగంతో పరిగెత్తాల్సిందే. చెప్పదలుచుకున్న మంచి మాట చెబుతూ ఉండాల్సిందే.

చాలా మంది కథకుల రచనల్లాగే నా రచనలు కూడా మానవ సంబంధాలు చుట్టూ తిరుగుతుంటాయి. ఇకపై కూడా. ఎందుకంటే అక్కడ వస్తువులు విలువైనవి.

ప్రశ్న: “మనిషి భిన్న పార్శ్వాలను సరళ సుందరంగా అలవోకగా, వ్యంగ్య హాస్య ధోరణిలో తనదైన శైలిలో రచించే రచయితల్లో భీమరాజు వెంకటరమణగారుంటారు” అని వ్యాఖ్యానించారు డా. సి. భవానీదేవి గారు తమ ముందుమాటలో. మీ కథన శైలి గురించి మరింత వివరిస్తారా?

జ: రోజువారీ జీవితంలో బాగా పరిచయం ఉన్న వారితో అలవోకగా నేను ఎలా మాట్లాడుతానో అదే రీతిలో కథల్లోని సంభాషణల్ని వ్రాస్తుంటాను. నేను కథలు వ్రాస్తున్న తోలి రోజుల్లో నేటి పాలపిట్ట పత్రిక సంపాదకులు శ్రీ గుడిపాటి గారు, అప్పటి నవ్య సబ్ ఎడిటర్ శ్రీ. జి. ఆర్. మహర్షి గారు, ప్రముఖ రచయిత నా మిత్రుడు సలీమ్ నా శైలిని ప్రశంసించి అలాగే కొనసాగించమని ప్రోత్సహించారు. కథ శైలిలో నేను కదను త్రొక్కాలని ప్రయత్నం చెయ్యను. ప్రస్తుతము సగటు మనిషి రకరకాల చికాకులతో సతమతమౌతున్నాడు. పాఠకుడూ మనిషేగా, నా కథలతో అతని మెదడును ఇంకా మెలి త్రిప్పలేను. కథలో మరీ తప్పనిసరైతే తగిన గంభీర పదాలను సమకూర్చుకుంటాను. ప్రస్తుతం నా కథల్లో ఉన్న శైలిని మార్చాలని నాకు అనిపించడం లేదు.

ప్రశ్న: మీ దృష్టిలో కథకి ఏది ప్రధానం? వస్తువా? శైలా? శిల్పమా? లేక వీటన్నిటి మేలు కలయికా?

జ: మూడింటి మేలుకలయికే సరైంది కదా, కాకపోతే మీరు చెప్పిన క్రమంలో వస్తువు, శైలి, శిల్పము లకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రశ్న: “మనిషి డబ్బు సంపాదనతో పాటు చాలా విషయాల కోసం తాపత్రయాలు పడుతుంటాడు సహజమే. కానీ తప్పనిసరిగా పడాల్సిన తాపత్రయాల్లో మొదటిది తల్లిదండ్రుల కోసం, రెండవది తన కోసం, మూడవది ఇతరుల కోసం. రెండవది అందరూ చేస్తారు. మూడవది కుదిరినప్పుడు చేస్తారు. కానీ మొదటిది విస్మరిస్తే మిగతావి ఏవి చేసినా వారి జన్మ వృథా” అన్నది చక్కటి ఆలోచన! తాపత్రయంకథలో వెంకటరెడ్డి లేదా చలపతి పాత్రలు పూర్తిగా కల్పితమా లేక మీకు పరిచయస్థులైన వ్యక్తులా? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: : వేదాంత పరిభాషలో తాపత్రయం అంటే మూడురకాల బాధలు, దుఃఖాలు, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. అయితే వాడుకలో ఆ పదాన్ని ఆరాటం, ప్రాకులాట అర్థంలో కొందరు వాడటం చూస్తుంటాము. నేను అలా తీసుకున్నాను.

కథలోని ఆ ఇద్దరు సినిమా హాలు యజమాని అందులో పనిచేసిన వ్యక్తి చాలా కాలం క్రితం ఉండేవారు. నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా తరచు చూస్తుండేవాడిని. అలాంటి మరో ఇద్దరు కూడా నాకు వేరొక ఊర్లో బాగా తెలుసు. ఆ సంస్థ యజమాని నష్టాలొచ్చి ఆర్థికంగా బాగా దెబ్బతిని గుమస్తా స్థాయికి దిగజారిపోతే అతని దగ్గర గతంలో ఎప్పుడో పనిచేసి వెళ్లిన గుమస్తా కాలక్రమేణా స్థితిమంతుడై తిరిగివచ్చి తన మాజీ యజమానిని చేరదీయడం, ఇద్దరు ఆ సంస్థలో స్నేహంగా పనిచేసుకుంటూ ఉండటం నేను చాలా కాలం గమనించాను. ‘తాపత్రయం’ కథకు ఈ రెండు అనుభవాలు నేపధ్యంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న: రెండుకు బదులు ఒకటికథ శీర్షిక లానే, విభిన్నంగా ఉంది. వివాహ బంధం గురించి మీరు రాసిన వాక్యాలు అక్షర సత్యాలు. కథ చివరలోని ట్విస్ట్ ఇంకా బాగుంది. ఈ ఆలోచన తట్టాకా కథ వ్రాశారా? లేక, వ్రాస్తున్నప్పుడు తట్టిన ఆలోచనతో అలా మార్చారా?

జ: కథలో ఫోన్ సంభాషణలో ఆ రచయిత కాకుండా అసలు ఆ కథకు సంబంధమే లేని వ్యక్తి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఫోన్ నంబరులో ఒక్క అంకె అయినా తప్పుంటేనే వేరొకరు మాట్లాడటం జరుగుతుంది. ఇది కావాలని వేసిన ఎత్తుగడే. ఈ సన్నివేశం వ్రాస్తున్నప్పుడే శీర్షిక ఎలా పెట్టాలో తోచింది.

ప్రశ్న: వాళ్ళ ఫ్యామిలీ సెల్ఫీలో నేనుకథలో వ్రాసిన “ఈ రోజుల్లో మనుషులు మనసు విప్పి మాట్లాడుకోడం మర్చిపోయారు. అదే చాలా సమస్యలు ఏర్పడడానికి కారణం” అన్న వాక్యాలు నూటికి నూరుపాళ్ళు నిజం. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: ఉత్తమ పురుషలో కథ చెప్పిన వ్యక్తిని నేనే. ఈ కథకు నేపథ్యం నా స్వంత అనుభవమే. ఒకసారి ఏదో పనిమీద ఒక ఊరెళితే అక్కడ నాకు తెలిసిన స్నేహితుని కొడుకు నన్ను రైల్వే స్టేషన్ నుంచి బైక్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళుతున్నాడు. మధ్యలో బైకు ఆపి ఈ అబ్బాయి బావమరిది “నా చెల్లెలు నిన్నటి నుండి తిండి తిప్పలు లేకుండా మేడమీద గదిలో పడి ఏడుస్తుంటే పట్టించుకోకుండా తిరుగుతున్నావా?” అంటూ రోద్దు మీదే పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆ స్థితిలో అతన్ని ఇంటికి రమ్మని మేమూ వెళ్ళాము. అక్కడ నేను ఘర్షణతో కూడిన పరిస్థితిని చూశాక మధ్యవర్తి పాత్ర పోషించవలసిన అగత్యం ఏర్పడింది. తరువాత జరిగిందంతా కథలో ఉంది. ఊర్ల, వ్యక్తుల పేర్లు మార్పు, కొద్దిపాటి కల్పనతో కథ రూపుదిద్దుకుంది.

ప్రశ్న: “సమాజంలో వస్తున్న మార్పులను అనుసరించడం అనివార్యం కావచ్చు. కానీ విచక్షణ అవసరం. పిల్లలు చదువులో వెనుకబడకూడదు. సంస్కారంలో హీనపడకూడదు. మనోధైర్యం కోల్పోకూడదు” అన్నారు వికాస విహార్కథలో. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న పెడధోరణలకు చెక్ పెట్టే దిశగా ఆచరణాత్మక పరిష్కారం సూచించారు. ఓ పోటీలో ఈ కథకి లభించిన బహుమతి గురించి చెప్పండి?

జ: ఇక్కడ కూడా రవి పాత్రలో నేనే ఉన్నానని చెప్పొచ్చు. నేను తప్ప మిగిలిన మిత్రులందరూ నిజంగానే ఉపాధ్యాయ వృత్తి చేపట్టి పదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. మాస్టారుగారు ఇప్పుడు లేరు. నా మిత్రులు ఇప్పటికి విద్యార్థులకు వీలైనంత సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా కొద్దిపాటి కల్పన ఉంది. సాహితి కిరణం మాసపత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి వచ్చింది.

ప్రశ్న: సాధారణంగా రచయితలకు తామే రాసేవన్నీ నచ్చుతాయి. కానీ ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందువల్ల?

జ: నా పదహారు మంది పిల్లలూ నాకు నచ్చుతారండి. ఎందువల్ల అంటే కని పెంచాము కదా!

ప్రశ్న: చిత్రా అపార్టుమెంట్స్కథ కప్పలా గెంతితే గాని కదలని లిఫ్ట్‌తో మొదలు పెట్టారు. మరీ విడ్దూరంగా ఉంది. నిజంగా నిజమేనా? కథ వెనుక కథ చెప్పరూ?

జ: అక్షరాలా నిజమండి! ఈ కథ వ్రాసే కొన్ని నెలల ముందు మా అపార్టుమెంట్ లిఫ్టే ఆ తమాషా స్థితిలో కొన్ని రోజులు పనిచేసింది. ఒకసారి నేనే లిఫ్ట్ లోకి వెళ్లాను. నాతో మా వాచ్‌మాన్ కూడా వచ్చాడు. నేను మా ఫ్లోర్ నంబర్ పై నొక్కాను. లిఫ్ట్ కదల్లేదు. వాచ్‌మాన్ కబడ్డీలో కూతకెళ్లిన ఆటగాడిలా అటు ఇటు ఉదృతంగా ఊగాడు. లిఫ్ట్ కదిలింది. ఆ సన్నివేశమే ఈ కథకు పునాది.

మా అపార్టుమెంట్ విశేషాలే వ్రాశాను. కొన్ని జోడించాను. స్వాతి పత్రికవారు కథల పోటీలో పదివేల రూపాయలు బహుమతి ఇచ్చారు.

ప్రశ్న: ఈ పుస్తకంలోని చాలా కథలకు శీర్షికలు వెరైటీగా ఉన్నాయి. శీర్షిక అనుకుని కథలు వ్రాశారా లేక కథ వ్రాస్తున్నప్పుడు శీర్షికలు తట్టాయా?

జ: బుల్లెమ్మ, వైరస్ వెళ్ళిపోయింది కథలకు మాత్రం శ్రీర్షికలు ముందే అనుకున్నాను. మిగిలినవన్నీ వ్రాస్తున్నప్పుడు లేదా వ్రాశాక నిర్ణయించినవే.

ప్రశ్న: ఉదయరాగంనవల వ్రాయడానికి ప్రేరణ ఏమిటి? ఇది మీరు రచించిన ఎన్నో నవల?

జ: ఇది నా మొదటి నవలేనండి. నేను నవల వ్రాయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈ నవల వ్రాయడానికి వెనుక ప్రేరణ అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు. యథార్థ సంఘటనలను ఆధారం చేసుకొని పరస్పరం విరుద్ధమైన ఆర్థిక స్థితిగతులున్న ఇద్దరి ప్రేమ కథ వ్రాయాలని ప్రారంభించాను. కానీ అది కథ నిడివి దాటి కొనసాగుతూనే ఉంది. ముగింపు ఇవ్వాలని అనిపించలేదు. వ్రాస్తూపోయాను. ముగింపు తోచింది. ముగించాను. నవలయింది.

స్ప్రెడింగ్ లైట్, తార్నాక వారి జూమ్ మీటింగ్‍లో భీమరాజు వెంకటరమణ గారి కథాసంపుటి ‘నా కలం నా ఇష్టం’ కథాసంపుటి, ‘ఉదయరాగం’ నవల పరిచయం.

ప్రశ్న: ఈ నవల నేపథ్యానికి గ్రానైట్ క్వారీలు ఎంచుకోడంలో మీ ఉద్దేశం ఏమిటి? సమాచార సేకరణకు ఎటువంటి పరిశోధన చేశారు?

జ: పరిశోధన అవసరం లేకపోయింది. గ్రానైట్, మార్బుల్ రంగాల్లో నేను మూడేళ్లు పనిచేసాను.

ప్రశ్న: మీ స్వస్థలం ఒంగోలుకు సమీపంలోని చిమకుర్తి గ్రానైట్ గనుల గురించి మీకున్న అవగాహన ఈ నవలా రచనలో ఏ మేరకు తోడ్పడింది?

జ: మీకు ఇందాక చెప్పినట్లు ఒంగోలు గెలాక్సీ, ఖమ్మం బ్లాక్ గ్రానైట్ విషయమై ట్రేడింగ్‌లో నాకున్న అనుభవంతో కూడిన అవగాహన ఈ నవల వ్రాయడంలో పూర్తిగా తోడ్పడింది.

ప్రశ్న: “పైన కరెంట్ పోయినట్టు లేదూ ఆకాశంలో? గజదొంగలు భుజాన మూటలేసుకుని పారిపోతున్నట్టు లేదూ? వారిపై పోలీసులు కాల్పులు జరుపుతున్నట్టు లేదూ? ఆఁ.. మనిషన్నాకా కాస్త కళాపోషణ ఉండాల. తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది?” అంటూ ముళ్ళపూడి వారి శైలిలో – నవల ప్రారంభంలోనే మొదటి పేరాతోనే పాఠకులకు ఆసక్తి కలిగించేటటువంటి వాక్యాలతో సన్నివేశాన్ని సృజించటం చక్కని టెక్నిక్. ఈ సందర్భంగా – మీరు నవలలు వ్రాసే పద్ధతి ఎలా ఉంటుందో (ప్లాట్, సినాప్సిస్, ఛాప్టర్/సెక్షన్ డివిజన్ – తదితర అంశాలు) పాఠకులకు వివరిస్తారా?

జ: ఇది నా మొదటి నవలే కాబట్టి నవల వ్రాసే పధ్ధతి గురించి నేను ఏదైనా చెప్పడం సబబు కాదు. నా వరకు నేను కథే వ్రాశాను. అది వ్యాకోచం చెందింది. అంతే.

ప్రశ్న: నాయికది మెడికల్ కాలేజీ నేపథ్యం, నాయకుడిది వ్యాపార/పారిశ్రామిక నేపథ్యం. రెండు భిన్న ప్రపంచాలను ఒక కథలో జొప్పించడం సులువుగానే సాధ్యమైందా?

జ: అవును. రెండు భిన్న ప్రపంచాలను ఒక కథలో చొప్పించడం కాస్త కష్టం కావచ్చు. కానీ నాయికానాయకులు ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎంతటి భిన్నప్రపంచాలైనా ఏకమైపోతాయి. వివాహమైన తరువాత కదా, కథ వ్రాసే వాడికి అందులో పాత్రలకి కూడా తల బొప్పి కట్టేది.

ప్రశ్న: నవలలో బలహీనతలు ఉన్న మనుషులు తప్ప, విలన్లంటూ ప్రత్యేకంగా లేరు. రక్తపాతం, హింస లేకుండా నవలని రక్తి కట్టించడం కష్టమేమో అన్న సంశయం ఎప్పుడైనా కలిగిందా?

జ: అలాంటి సంశయాలు ఏమీ కలగలేదు. కథ ఇంకా కొనసాగి ఉంటే విలన్లు తయారయ్యే అవకాశం ఉందనుకుంటాను.

ప్రశ్న: ఈ నవలలో చాలా సందర్భాలలో సినిమా పాటలను ఉపయోగించారు. పాటలపై ఇష్టం మీకు ఎప్పటి నుంచి కలిగింది? మీరు పాడతారా?

జ: పాటలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమేనండి. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోని మెలోడీస్, క్లాసికల్ కీర్తనలు దాదాపు రోజూ వింటుంటాను. మీరు పాడతారా? అని నన్ను అడుగుతున్నారు. నేనెప్పుడూ జీవహింసకి పూనుకోలేదండి. మా అమ్మాయి గాత్రంలో డిప్లొమా చేసింది. నా భార్య సంగీతం నేర్చుకుంది. మావాడు కూడా ఎంతోకొంత నేర్చుకున్నాడు. ముగ్గురూ పాడతారు. నేను వాళ్లకి వంత పాడతాను.

ప్రశ్న: ఈ నవలలో ఏ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది? ఎందుకని?

జ: ఎవరి రచనలు వాళ్లకి బాగుంటాయి. ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి ఒక ఎపిసోడ్ అని కాకుండా ఉదయ్ మిగిలిన పాత్రలతో మాట్లాడే మాటలు నచ్చుతాయి. సత్యం అనే కుర్రాడితో చేసిన సంభాషణలతో సహా.

ప్రశ్న: మీకు సీక్వెల్స్ వ్రాసిన అనుభవం ఉంది. కాబట్టి ఈ నవలకు రెండవ భాగం వ్రాయవలసినదిగా నవలకు ముందుమాట వ్రాసిన విజయమోహన్ రావు గారు అడిగారు. మేమూ అదే అడుగుతున్నాము. ఏమంటారు?

జ: ‘నా కలం నా ఇష్టం కాదు మీ ఇష్టం’ అనాల్సిన పరిస్థితిలోకి వెళుతున్నాననిపిస్తోంది. ప్రయత్నిస్తాను.

ప్రశ్న: సాహిత్యానికి సంబంధించి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏవి? కొత్త పుస్తకాలు ఏవైనా రాబోతున్నాయా?

జ: ప్రణాళికలంటూ ఎప్పుడు వెయ్యలేదండి. ఈ మధ్య కాలంలో వేరే విషయాల్లో నిమగ్నమైనందువల్ల తక్కువ కథలే వ్రాశాను. ఇకపై వీలు చేసుకొని మరిన్ని కథలు వ్రాసే ప్రయత్నం చేస్తాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు భీమరాజు వెంకటరమణ గారూ.

భీమరాజు వెంకటరమణ: ధన్యవాదాలు.

***

నా కలం నా ఇష్టం (కథలు)
రచన: భీమరాజు వెంకటరమణ
ప్రచురణ:
అనుపమ ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 108
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
భీమరాజు వెంకటరమణ
ఫోన్: 9849239945


ఉదయరాగం (నవల)
రచన: భీమరాజు వెంకటరమణ
ప్రచురణ: పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 128
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
భీమరాజు వెంకటరమణ
ఫోన్: 9849239945
పాలపిట్ట బుక్స్
ఫోన్: 9848787284

~
‘నా కలం నా ఇష్టం’ కథాసంపుటి, ‘ఉదయరాగం’ నవల సమీక్ష
https://sanchika.com/naa-kalam-naa-ishtam-udayaraagam-books-review-kss/

Exit mobile version