Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత, చిత్రకారుడు శ్రీ బ్నిం ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘సెల్ఫీ రామాయణం’ అనే పుస్తకం వెలువరించిన శ్రీ బ్నిం గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం బ్నిం గారూ.

బ్నిం: నమస్కారం.

~

ప్ర: మీరు బాల్యంలోనే రామాయణ రచన పద్య రూపంలో రాసి, ఆపేశారని అన్నారు. ఆ వయసులో మీ రామాయణ రచన అనుభవం ఏమిటి?

  జ: అప్పుడప్పుడే పద్యాలు నేర్చుకుంటున్న రోజులు. చందస్సు మా అమ్మమ్మ నేర్పించింది.. తేటగీతి.. ఆట వెలదీ.. ఉత్పలమాల, కందపద్యం..

కందం నాకు భలే ఇష్టం. మొదటి పద్యం గనక నాకు ఇప్పటికీ గుర్తుంది.

“కం॥
అడిగితినే అమ్మను మును
కడుమోదము కూర్చునట్టి
కథ ఏదైనా నుడువుము అమ్మా యనగను
కడుసంత సమంది ఇట్లు కథ మొదలిడియన్..”

అని అమ్మ చెప్తున్నట్టు

అలా తర్వాత అయోధ్య నగరం వలన

సీస పద్యంలో రాసిన జ్ఞాపకం.

తాతయ్య దానికే తప్పులు తిట్టారు.

అమ్మమ్మ ఎందుకు దిద్దలేదు అంటే.. ‘అమ్మో దిద్దడం మొదలెడితే తప్పులు వస్తున్నాయని సిగ్గుపడి మానేస్తా’ నేమోనని.. అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది..

నిజంగా.. మా ఇళ్ళల్లో ఎంకరేజ్మెంట్ చాలా ఉండేది. వాళ్లంతా మహా పండితులు.. ఆయన తప్పులు పట్టుకుంటే డిస్కరేజ్ అయిపోతాం కదా.. అలా ఎప్పుడు చేయకూడదు.. మనమేనా సరే అది ఈసారి ప్రత్యేకంగా నేను పెడతాను. సంచికలోనే చూపెడుతా.

మా తాతగారు జటావల్లభుల పురుషోత్తం గారి కాగితాలు కూడా చూపెడతాను.

అసలు నేను నా రచనలు గురించి చెప్తాను.. ఓసారి తీరిగ్గా.

ప్ర: సెల్ఫీ రామాయణం అన్న పేరు, ఆలోచన కొత్తగా అనిపిస్తుంది. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఆలోచనను అచరణలో ఎలా పెట్టారు?

జ: ఇలా పద్యాల పుస్తకం రాస్తున్నాను అని.. మా ‘లే అవుట్’ ఆర్టిస్ట్ మధు గారికి చెబుతూ .. ఇలా సెల్ఫీ తీసుకున్నట్టు రామాయణంలో పాత్రలన్నీ తేటగీతి పద్యాలలా ఉంటాయి అని చెప్పాను.. లేఅవుట్ చెక్కుబుక్కులా ఉంటుంది అని పద్యాలు ఈ వరుసలో రాస్తాను అని వన్ టూ త్రీ నెంబర్ వేసుకుంటూ దశరథుడు.. ముగ్గురు భార్యలు.. ఇలాగ వరస చెప్పేసాను. అలా లేఔట్ తయారయిపోయింది. ఇప్పుడు 18 నెంబర్ చెప్తున్నాను.. తర్వాత నాలుగో నెంబరు.. తర్వాత 27వది.. ఇలా ఎప్పుడు ఎవరిమీద మంచి పద్యం వస్తే అప్పుడు పంపించేవాడిని. ఆయన పేజీలు తయారవుతూ ఉండేవి.

“పేరు ఏం పెడదాము, పద్యాలలో రామ పరివారం అందామా..?”  అన్నాను ఒకసారి దాదాపు పూర్తి కావస్తూన్నప్పుడు.

“ అదేంటి.. సెల్ఫీ రామాయణం అన్నారు కదా.. ఎప్పుడో నెల క్రితం..”

నాకు గుర్తులేదు.

ఆ పేరు వింటే బాగానే ఉన్నట్టు అనిపించింది.

“ ఇంకేం మార్చొద్దు.. సెల్ఫీ రామాయణం పేరుకి ఫిక్స్ అయిపోండి..”  అన్నాడు మధుగారు

కానీ తర్వాత అంటూ ఉంటే బాగానే ఉంది..

రామాయణంలో పాత్రలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటాయన్నమాట.. అని వివరణ ఇచ్చుకుంటూ వచ్చాను.

కానీ ఆ తర్వాత 63 పాత్రలు అయిపోయాక “ కనీసం వంద పద్యాలు లేకపోతే బాగోదండి”  అన్నారు మా అక్షజ్ఞా వెంకట్ గారు.

అప్పుడు వాల్మీకి.. తులసీదాసు.. గోన బుద్ధారెడ్డి.. ఇంకా అలాగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా.. వెళ్తూ వెళ్తూ రామానంద సాగరు, ఎన్టీ రామారావు.. మా బాపు రమణలు.. చివరాఖరికి నేను కూడా సెల్ఫీలు ఇచ్చేసాం.

అయితే.. రామాయణంలో పాత్ర ముఖ్యమైనది.. త్రిజట పాత్ర ఎందుకు మరిచిపోయానో..

అలాగే నా ప్రియమైన రేడియో.. ఉషశ్రీ గారు.. ఇంకొంతమంది.. రెండో ఎడిషన్‌లో వెయ్యాలని అనుకుంటున్నాను.

రాస్తున్న కొద్ది ప్రేమ పెరుగుతూ.. రాన్రానూ.. ఇంకా ప్రేమ పెరుగుతూ మొత్తానికి పుస్తకం పూర్తి చేశాను.

ఇక్కడ చిన్న జ్ఞాపకం.. ఈ పుస్తకంలో బొమ్మలు వేసి పెట్టమని ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారిని.. ఈనాడు శ్రీధర్ గారిని కూడా అడిగాను..

ఇద్దరు నన్నే వేసుకోమన్నట్టు టైం కుదరదంటు నన్ను ఎంకరేజ్ చేశారు!

ప్ర: మీరు రామాయణం ఎన్ని రూపాల్లో, ఎన్ని మార్లు రాసినా కొత్తగానే ఆవిష్కృతమవుతుందన్నారు. ఈ సెల్ఫీ రామాయణ రచనకూ, మీరు ఇంతవరకూ చేసిన రామాయణ ఆధారిత రచనలకూ ప్రధానమైన తేడా ఏమిటి? ఈ రచనద్వారా మీ గురించి మీరు కనుగొన్న కొత్త విషయం ఏమిటి?

జ: నేను కూచిపూడి నృత్య రూపకాలుగా చాలామందికి రామాయణం చాలా రకాలుగా రాశాను.. రాసిన ప్రతిసారి.. ఓపెనింగు మారచ్చు.. యాంగిల్ మారచ్చు.

అంటే రామావతారానికి దశరథుడు బిడ్డలు లేరని బాధపడుతున్నప్పుడు కావచ్చు..

రావణాసురుడు లోకాన్ని అల్లకల్లోలం చేయడం. దేవతలు ఋషులు వైకుంఠం వెళ్లడం..

సరే నేను వస్తున్నాను

ఫలానా వాళ్ళని యజ్ఞం చేయమని చెప్పడం..

ఇలా ఎలాగైనా మొదలు పెట్టొచ్చు.

లేదా వాల్మీకి నుంచి మొదలు పెట్టొచ్చు. మొన్న ఆ మధ్య అశోకవనంలో సీతమ్మ వారితో మొదలు పెట్టాం.

కొందరు సంపూర్తి రామాయణం.. కొందరు సీతా కళ్యాణం వరకు.. ఇంకొందరు ‘సీతాపహరణం’ వరకు.. మరి కొందరు ‘పాదుకాపట్టాభిషేకం’ వరకు. కొందరు ఓన్లీ.. ‘లవకుశ’.. ఇంకొందరు ‘వాల్మీకి’..

ఒకామె.. ‘మంధర’, మరొక గురువు హనుమంతుడు హీరో అయిన ‘సుందరకాండ’ వారి శిష్యుడు ఒక్కరు ‘వాలి’ గురించే అడిగారు!

ఇలా ఒక్కొక్కటి చాలాసార్లు రామాయణ గీతాలు రాశాను.

ఈసారి ఆ రాముడు నాతో రాయిస్తున్నది.. రామ పరివారం. ఇందులో రామాయణంలో పాత్రల స్వగతాలు.. తేటగీతి పద్యాలుగా రాసే ప్రయత్నం చేశాను.

ప్ర: మీ పద్యాలు చాలా సరళంగా ఉంటాయి.. మాట్లాడుతున్నట్టే ఉంటాయి.. ఈ పద్యాల ఛoదస్సు తేటగీతి లోనే రాయటానికి కారణం?

జ: ఒక కథని కూడా చెప్పవలసి వస్తుంది.. పాత్రను గతంగా అది మాత్రా చందస్సు కనుగుణంగా ఉంటుంది. వృత్తాల లాగా.. గణాలు ఇవే ఉండాలి అనేది లేదు.

ఇంద్రగణాలు సూర్యగణాలు చూసుకోమంటారు. నాకు అవి ఈజీగానే దొర్లిపోతాయి. అలాగే కొందరికి తెలిసే తప్పులు బాగానే ఉంటాయి. ముఖ్యంగా ప్రాసయతి విషయంలో రెండు మూడు తప్పులు దొర్లి ఉండొచ్చు.

మరీ ఎక్కువ తప్పులు పట్టద్దని ఇద్దరు పండితులకు పంపించాను.

ప్రశ్న:  మీ సెల్ఫీ రామాయణానికి సలహాలిచ్చిన  పండితులు ఎవరు?

జ: పట్వర్ధన్ గారని ఒక అష్టావధాని.. నటులు, పద్య కవి గాయకుడు స్నేహితులు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు చూశారు.

అయ్యా రాసింది నేను మీరు కాదుగా వదిలేయండి అనేసాను, మరీ భూతద్దం పెట్టి చూడొద్దన్నట్టు.

నడక బాగుంటే .. ప్రాసయతిలో రెండు మూడు పద్యాలు చిన్న సవరణలు అవసరమే అనిపించింది నాకు.

కానీ నవ్వుతో వారి కన్ను కప్పేసాను.

ప్ర: రామాయణంలో పలు విభిన్నమైన పాత్రలున్నాయి. కొన్ని అందరికీ తెలిసినవి. కొన్ని కొందరికే తెలిసినవి. ఏయే పాత్రల గురించి రాయాలి, ఏయే పాత్రలను వదలాలి.. అనేది ఎలా నిర్ణయించుకున్నారు?

జ: ఏ పాత్రని వదలొద్దని అనుకుని బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు అన్ని పాత్రలని తీసుకుంటేనే నాకు పేరువున్న 63 క్యారెక్టర్లు దొరికాయి. అందరి మీద రాశాను.

వస్తువుల మీద కూడా రాశాను అంటే శివ ధనస్సు.. ఇలాంటి వాటి మీద.. అయితే ఒక్క క్యారెక్టర్ ఎలా మర్చిపోయాను? గిల్టీగా ఉంది అదే.. త్రిజట.. బంగారు తల్లి. సీతమ్మ వారినీ ఓదార్చిన బెస్ట్ ఫ్రెండ్. ఆవిడ మిస్ అయింది ఎందుకో.

ప్ర: మీరు రామభక్తులుగా రాసిన జాబితా పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, మీ జాబితాలో అసలయిన రామ భక్తుడు కనబడకపోవటం లోటుగా ఉంది. హనుమంతుడు రామాయణంలో ఒక పాత్రగా పరిచయం చేసినా, ఆయనను మించిన రామభక్తుడేవరు? మీరేమంటారు?

జ: రామ! రామ! హనుమంతుని ఎలా మర్చిపోతానండీ!

ఒకప్పుడు; ఒక మంచి పాట రాసాను.. రాముడు గొప్పవాడా ఆంజనేయులు గొప్పవాడా అంటే ఒకరి వల్ల ఒకడు గొప్పవాడు అయ్యాడు.

హనుమంతుడు ధన్యుడు.

శ్రీరాముడు మాన్యుడు.

అది ఆ ప్రశ్నకి నేను ఇచ్చుకున్న రిప్లై!

హనుమంతుడు పద్యం ఏంటంటే దీంట్లో..

“కేవలము వానరుండను – దైవము కడ
అంత చేరువగానుంటి, – నందు వలన
పూజలాలయ విభవముల్ భువిని దొరికె,
భక్తులకు రాముడిచ్చిన పరపతియది!”

ఒక భక్తుడు ఇంత దేవుడైపోవడం.. ఎంత వింత.. అదే రామానుగ్రహ దత్తమైన ప్రెస్టేజ్.. అవును అంటారు కదా!

రామ భక్తులు వాల్మీకి, విశ్వనాథ సత్యనారాయణ, తులసీదాసు, రామానంద్ సాగరు, బాపు రమణ, రాజా రవి వర్మ – వీళ్ళ అందరితోనూ రామరూపం

ప్ర: సీత పాత్ర గురించి మీరు రాసిన పద్యం సీతారామావతార పరమార్థాన్ని అతి సరళంగా వివరిస్తుంది. సీత పాత్ర వ్యక్తిత్వం నుంచి ఆధునిక మహిళ ఎం నేర్చుకోవచ్చంటారు?

జ: ఆధునిక మహిళ గురించి పక్కన పెడతాం. మా సీత ఎంత గర్వంగా చెప్పుకుంది అంటే.. పర్పస్ ఆఫ్ ది బర్త్ ఆవిడ మర్చిపోలేదు..

‘దానవపీడను తొలగించ మానవులయి..’

కష్టాలు పడ్డాం అనలేదు.

ఎంత అందంగా ఉందంటే చూడండి.. అనుభవించితి మేము ‘నవరసములు’!

అది.. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్!

అందుకే వాళ్ళని ఆదర్శ దంపతులు అన్నారు..!

ఇంకా ఆధునిక మహిళ అంటారు.. రామాయణం చదివితేగా.. క్యారెక్టర్ కష్టాలు పడిందనే చూస్తారు. ఇష్టపడి బ్రతికిందని చూడరు.

ఎన్ని కష్టాలు వచ్చినా పుట్టింటికి వెళ్ళలేదు..

“అగ్ని రగిలించు..”  అని హనుమంతుని కోరింది.

రాముడు ధర్మ స్వరూపుడు అయితే.. ఆ ధర్మం అర్ధాంగే!

అందుకే రాముడు ఏకపత్ని వ్రతుడుగా నిలిచిపోయాడు!

ఇక్కడ సరదాగా ఒక జోక్ ..

రాముడు అశ్వమేధ యాగానికి బంగారు సీతని చేయించుకున్నాడు. ఇంకో అమ్మాయిని కట్టుకోవచ్చు కదా.

అయ్యో తండ్రిగారు ఏకపత్నీవ్రతుడు కాకపోవడం వల్లే ఇబ్బందులు పడ్డాడు.. చూస్తూ చూస్తూ కష్టాలు కొన్ని తెచ్చుకుంటాడా.

అందుకే సీతారాములు ఒకటే! ఒక్కరికి ఒకరే..!

ప్ర: మీరు రమణగారి గురించి రాసిన పద్యం హృద్యంగా ఉంది. రామ గాథను పలుమార్లు రమ్యమలర చలనచిత్రాలకై రాస్తి జనులు మెచ్చ.. అన్నది అక్షరాల సత్యం. కానీ, బాపు గురించి కేవలం రామభక్తుండని వాసిగాంచె’  అని మాత్రం అన్నారు. ఈ తేడా ఎందుకు?

జ: బాపుగారు రామభక్తుణ్ణి.. అని చాలా గర్వంగా చెప్పుకునేవారు. మీకు రాముడంటే ఎందుకండీ అంత ఇష్టం అంటే.. సీతమ్మవారికి ఎందుకు ఇష్టం? త్యాగరాయ స్వామికి ఎందుకు ఇష్టం? అనేవారు.

పెన్సిలో.. పెన్నో చేత్తో పట్టుకోగానే.. శ్రీరామ అని రాయనిదే అక్షరం పడేది కాదు.

ఇక్కడ జోకు.. బాపు గారు చెక్కు మీద సంతకం పెడితే కూడా శ్రీరామ రాస్తారు.

చెక్ మీద కాదనుకోండి పక్కన ఒక కాగితం పెట్టుకుని.. దానిమీద శ్రీరామ చుట్టి!

ఆయన ‘కొంటె బొమ్మల బాపు’ అనే కార్టూన్ పుస్తకం మీద హనుమంతుని లాగ తన క్యారికేచర్ వేసుకున్నారు.

‘కోతి కొమ్మచ్చి’ కి కూడా తాను హనుమే!

సరదాగా ఒక జోక్.. ఆయనకి రమణ గారు అంటే చాలా ఇష్టం కదా. ఎందుకయ్యా కారణం అంటే RAMANA లో రాముడు ఉన్నాడు కదండీ.. అనే రకం!

ప్ర: ప్రతి పాత్ర గురించి తేటగీతిలో మీరు ఆయా వ్యక్తుల్ని పద్యాలలో సృజిస్తున్నప్పుడు మీ మనస్సులో ఎలాంటి భావాలు కలిగాయి? కొన్ని పద్యాలు సులభంగా వచ్చిఉంటాయి.. కొన్ని పద్యాలకు రాముడి కరుణ అవసరమై ఉంటుంది. మిమ్మల్ని కష్టపెట్టిన పద్యాలగురించి, మీరు పడ్డ కష్టం గురించి వివరిస్తారా?

జ: రాముని కరుణ అనేది కాన్సెప్ట్ పుట్టినప్పుడు వచ్చేసి ఉంటుంది.

ఇంక పద్యం రాసేటప్పుడు.. మాత్రం.. ఆయా పాత్రలని వాల్మీకి మహర్షి మనకి చూపెట్టిన విధానం తెలుసుకుంటుంటే నిజంగా.. ముగ్ధుడినయిపోయాను.. మురిసిపోయాను! నాకు కొన్ని కొన్ని కొత్త కొత్త భావాలు తోచేవి.

శ్రమ పడకుండానే పద్యాలు పలికాయ్!

దీంట్లో నాకు చాలా నచ్చిన పద్యాల్లో కొన్నింటిల్లో ఒకటి చెప్తాను.

అహల్య తనని తాను చెప్పుకుంటూ..

‘తప్పు జరిగెనొ చేసితో దైవ మెరుగు..’ అంటుందండి.

ఆ తప్పు తనంతట తాను చేయలేదు కదా.. నాకు ఇక్కడ ఆమె అనవసరంగా నిందించబడింది.. అని బాధ ఉంది.

‘ఎన్ని యుగములు గడిచాను ఎరుగలేను..

‘ధన్య నైతిని రామ పాదమ్ము సోకి’

వహ్వా ఈ పద్యం నాకు చాలా ఇష్టం!

రచయితతో, అన్నయ్య బీ ఎస్ శర్మ, తమ్ముడు బీ ఎన్ శాస్త్రి, చెల్లెళ్ళు మామిళ్ళపల్లి భద్రకాళి, ఏలేశ్వరం పద్మావతి.

అలాగే..

సముద్రుని పద్యం

“అల్ల రాముడు నా తరి కరుగుదెంచు
అనవిని మనము ఉప్పొంగి అవధి దాట..
కోపగించెను అంతలో చాపమెత్తి..
అలుక సహజము కడలిపై అల్లుడవగ”

అల్లుడు కదా.. అడుగుతాడు లే అని నవ్వుకుంటాడు.. ఇది బాగుంది కదా

ఇంకొక పద్యం నాకు చాలా బాగా నచ్చింది..

అది.. తిప్పడు..

ఇది నిజానికి అవాల్మీకమే!

అయోధ్య ప్రజలు అందరూ.. సీతమ్మ గురించి అలా ఇలా అనుకుంటున్నారు అని అసలు అపవాదు

ఊరందరినీ దుర్మార్గుల్ని చేయడం ఎందుకని.. ఎవరో మహానుభావులు మార్చారు. తిప్పడు పుట్టాడు.

“తాగి నేనేదొ మత్తున వాగినాను
దాన్ని విన్నట్టి ఆ వేగు దాచకుండ
రాము కడకేగి చెప్పుట ఏమి సబబు?
అందుచేతనే సీతమ్మనతను వీడె”  అన్నాడు ..

నాకు వాడి ఆర్గ్యుమెంట్ చాలా నచ్చింది..

ప్ర: పుస్తకం చాలా అందంగా రూపొందింది. రూపొందించిన విధానంతో పాటూ తయారీలో ఎవరెవరు మీకు తోడ్పడ్డారో చెప్పండి.

జ: ఈ పుస్తకం ఇంత అందంగా తీర్చిదిద్దిన అక్షజ్ఞ పబ్లికేషన్స్ వెంకట్ గారే ఈ పాత్రల చరిత్రని చక్కటి తెలుగు నుంచి ఆంగ్లానువాదం.. చేశారు.

అక్షజ్ఞ పబ్లికేషన్స్ స్థాపకులు విద్యా వెంకట్ గార్లతో రచయిత

ప్ర: అసలు ఇంగ్లీష్‌లో అనువదించాలన్న ఐడియా ఎలా వచ్చింది?

జ: మన ఖర్మ.. మన దౌర్భాగ్యం .. తెలుగు తల్లి చేసుకున్న మహా పాపం.. కొత్త జనరేషన్ తెలుగులో నిరక్షర కుక్షిలు. అలా చదువుకోలేని వాళ్ళ కోసం ఇంగ్లీషులో అనువాదం చేయవలసి వచ్చింది.

ఇది  కోపం కాదండి బాధ.

అయినా కోపం కొత్త జనరేషన్ ( పిల్లల) మీద రాకూడదు. ఈ తరం మమ్మీ డాడీ ల మీద రావాలి బోల్డంత కసి!

ప్ర: ఈ సెల్ఫీ రామాయణాన్ని మీరు అంకితం ఇచ్చారు రమణ గారి శ్రీదేవిగారికి.. బాపు రమణలపై మీ భక్తికి ప్రతీకగా ఇచ్చారనుకోవచ్చా?

జ: శ్రీదేవి గారిలో నాకు మరో రూపులో మా అమ్మ కనిపిస్తారు. అమ్మలాగే భారత, భాగవత, రామాయణాలు ఆవిడ పుక్కిట పట్టేశారు.

రామాయణ భాగవతాలు సరళంగా అద్భుతంగా రచించారు. ఆవిడ హృదయం ఒక గ్రంథాలయం.

అందుకే ఆ అమ్మకి ఇవ్వాలనిపించింది ఈ పుస్తకం!

చాలా విషయాలు ఇంకా ఇందులో ప్రతి పద్యం గురించి చెప్పాలని ఉంది

కానీ ఇప్పుడు వద్దు..

ఒక్క చిన్న కోరిక నాది..

నేను ఈ సెల్ఫీ రామాయణంలో మర్చిపోయిన.. పాత్ర త్రిజట.. గురించి ఒక్క పద్యం.. ఇక్కడ చెప్పుకుంటాను ప్రాయశ్చిత్తంగా…

“సీత అక్కకు త్రిజటనే చెల్లి వలెను
ఆమె దుఃఖము తీర్చంగ ఆశ పెంచి
రాము చేతను హతు డౌను రావణుండు
యనుచు కలదీరు తెలిపితి అనునయించి”

ఇలా  త్రిజటకి స్థలం ఇచ్చేసి  ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాను

ప్ర: మీ భవిషత్తు ప్రణాళికలేమిటి?

జ: ఉన్నాయి సార్. చాలా చేయాలి.. వచ్చే ఏడాది ఆత్మ ప్రదక్షిణ అంటే.. నా చుట్టూ నేను చేద్దామనుకుంటున్నా.. ఈ ఏడాది అక్టోబర్ 28 పుట్టిన రోజుకి కొన్ని రోజులు ముందు ఓ పుస్తకం తయారు చేద్దామని ఉంది.. అది కథ!

అన్నట్టన్నట్టన్నట్టు ..

ప్రఖ్యాత సాహితీ విమర్శకురాలు.. ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ ఈ పుస్తకం మీద సమీక్ష తీసుకొచ్చినందుకు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు బ్నిం గారూ.

బ్నిం: ధన్యవాదాలు.

***

సెల్ఫీ రామాయణం (తేటగీతి స్వగతాలు)

రచన, బొమ్మలు: బ్నిం

ప్రచురణ: అక్షజ్ఞ పబ్లికేషన్స్

పేజీలు: 157

వెల: ₹ 200/-

ప్రతులకు:

నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.

ఫోన్: 9000413413

ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/selfie-ramayanam-thetageethi-swagathalu

~
‘సెల్ఫీ రామాయణం’ పుస్తకంపై ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి సమీక్ష
https://sanchika.com/selfie-ramayanam-book-review-prof-chs/

Exit mobile version