Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథారచయిత శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘నక్షత్రాల పందిరి’ అనే పుస్తకం వెలువరించిన దర్భముళ్ళ చంద్రశేఖర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

~

సంచిక టీమ్: నమస్కారం దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు.

దర్భముళ్ళ చంద్రశేఖర్: నమస్కారమండీ.

~

ప్రశ్న 1: నౌకాదళంలో సుదీర్ఘ కాలం సీనియర్ అధికారిగా సేవలు అందించిన మీరు, ఒక వైపు క్రమశిక్షణతో కూడిన రక్షణ రంగ జీవితాన్ని గడుపుతూనే.. కవిత్వం, కథల వైపు ఎలా ఆకర్షితులయ్యారు? మీ సాహితీ వ్యాసంగం గురించి వివరించండి?

జ: ముందుగా నన్ను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్న సంచిక టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా తొలి కథ 9వ తరగతి పూర్తయిన వేసవి సెలవుల తర్వాత ప్రచురితమైంది. పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ హడావిడి వదిలేసిన తర్వాత, ఇంటర్మీడియట్ లోనూ చాలా కథలు, కవితలు ఛందస్సుతో పద్యాలు రాయటం జరుగుతూనే ఉండేది. బస్టాండ్‌లో, సినిమా హాల్లో కూడా తెల్ల కాయితాలు, పెన్ను పట్టుకొని వెళ్లేవాడిని. ఆ ఉధృతి నన్నలా కదిపి, కుదిపి వేసేది. డిగ్రీ చదివే రోజుల్లో మా ఉస్మానియా కాలేజ్ లైబ్రరీలో కావలసిన తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకుంటూ అడపాదడపా కవితలు పత్రికలకు పంపిస్తూ నా సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూ ఉండే వాడిని. ఎంఎస్సీ రోజుల చదువు ఒత్తిడి ఉన్నా, తొలిప్రేమ హార్మోనుల జోరులో పుంఖానుపుంఖాలుగా కవిత్వం ఉబికి వచ్చేది. అవన్నీ నా తొలి సంపుటిలో ఉంటాయి. సరే, ఆ తర్వాత భారతీయ నౌకాదళంలో చేరాక, వృత్తిపరమైన కట్టుబాట్ల వల్ల, అంటే మీడియాలో వచ్చే ప్రతి దానికీ ఒక కఠినమైన ఇంటిలిజెన్స్ స్క్రీనింగ్ ఉంటుంది. చాలా తతంగం అదంతా! బోలెడన్ని హామీపత్రాలు ఇస్తే గాని, ఏదీ బయట మీడియాలో ప్రచురించడానికి అవదు. దానివల్ల అడపాదడపా రాసుకుంటున్న కవితల్ని ఎక్కడా ప్రచురించక అలాగే పెట్టి ఉంచాను. కాకపోతే విస్తృతంగా మా ఫీల్డ్‌కు సంబంధించిన టెక్నికల్ పేపర్స్ సెమినార్లలో ప్రచురించడం జరిగింది. హిందీలో కూడా నాకు తోచిన కవిత్వాన్ని మా నేవెల్ మేగజైన్స్‌కి పంపడం, అవి ప్రచురితం అవడం జరిగింది. కరోనా మొట్టమొదటి హౌస్ అరెస్ట్ అయిన కాలంలో మా అమ్మాయి, “వాటిని ప్రచురించవచ్చు కదా?” అని ఒక సలహా ఇస్తే, నా మొట్టమొదటి సంపుటి ‘నేను’ వెలువడింది. దానికి డిపార్ట్మెంట్ నుంచి ఇంటిలిజెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి సంవత్సరం బట్టింది. అదే సమయంలో ప్రేరేపితమై కొత్తగా నేను రాస్తున్న కవితల్ని యుఎస్‌లో ఉన్న మా మిత్రుడికి పంపించేవాడిని. అతడు డాక్టర్ గారైన రాజు గారికి నా కవితల్ని పంపుతుండేవాడు. ఆయన నన్ను, ‘సిరికోనలో చేరుతారా?’ అని అడిగినప్పుడు అంగీకారం తెలిపాను. వారి దయతో సోషల్ మీడియాలో ఆ ఒక్క గ్రూపులో మాత్రమే బహుశా జూలై 2021న చేరడం జరిగింది. ఇక అక్కడి నుంచి శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి సిరికోన నన్ను తల్లిలా అక్కున చేర్చుకుంది. ఒక సంస్థ లేక విశ్వవిద్యాలయం చేయవలసిన పనిని, ఒక వాట్సాప్ గ్రూప్‌తో అందరినీ కలిపి, ఎంతో మందిని ప్రోత్సహించి అకాడమీ లెవెల్‌లో సాహిత్య చర్చల్ని ప్రతిరోజు కొనసాగించి ఆ చర్చల సారాన్ని రెండు పుస్తకాలుగా ప్రచురించిన ఘనత శ్రీ గంగిశెట్టి గారిది. వారు మాకందరికీ స్ఫూర్తి ప్రదాత, మరియు ప్రాతఃస్మరణీయులు. అందుకే నా శిఖరానికి త్రోవ కవితా సంపుటి వెనకాతల, కరోనా పుణ్యం, కోన తల్లి చేరతీత, రాజుకున్న తీరని తృష్ణ అని ముద్రించుకున్నాను. వృత్తిపరమైన ఇబ్బందుల వల్ల నా కవితలు పత్రికలలో బయట వేసుకునే సౌలభ్యం లేదు. బహుశా pseudonym తో వేసుకోవచ్చునేమో గానీ ఎప్పుడైనా అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని ఆ ప్రయత్నమూ చేయలేదు. జాయిన్ అయిన 2021 సంవత్సరమే (రాసిన అన్ని కవితలు ఇంకెక్కడా ప్రచురితం కావు గనుక) పోటీకి అర్హమైనవిగా పరిగణించి, ‘నా శిఖరానికి త్రోవ’ సంపుటికి ప్రత్యేక బహుమతి ప్రకటించారు సిరికోన వారు. అందుకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. ఇక అక్కడి నుంచీ అంతకాలమూ బహుశా అణగదొక్కబడి ఉన్న సాహితీ పిపాస వరదలా నన్ను ముంచెత్తటం ప్రారంభించింది. కూర్చుంటే కవిత, నిలుచుంటే కవిత, కారులో వెళ్తుంటే కవిత.. అన్న పరిస్థితిలా అయిపోయి, ప్రతీ ప్రక్రియలో పెద్దల సహకారంతో నన్ను నేను సానబెట్టుకునే ప్రయత్నం చేశాను. ఈ రకంగా నేటికీ 9 కవితా సంపుటాలు, రెండు గల్పికా సంపుటాలు ప్రచురణకు నోచుకోవడం జరిగింది.

ప్రశ్న 2: విహారి గారు మీ 44 గల్పికలను చదివిన తర్వాత, వీటిని కేవలం కథలు అనడం కంటే ‘కథా కథనాలు’ అని పిలవడమే సరైనదని నిర్ణయించుకున్నారు. అసలు మీ దృష్టిలో కథకు, కథానికకు మరియు గల్పికకు ఉన్న సరిహద్దు రేఖ ఏమిటి? ఈ పుస్తకంలో మీరు ఎంచుకున్న ప్రక్రియ ప్రత్యేకత ఏమిటి?

జ: మాన్యులు విహారి గారి వంటి సాహితీ దిగ్గజం నా గల్పికలను సమీక్షించడానికి అంగీకరించడం, ఒక అద్భుతమైన సమీక్షను రాయడం నా అదృష్టం. వారు వెలిబుచ్చిన ‘కథాకథనాలు’ అన్న మాటకు నేను పూర్తిగా అంగీకరించలేకపోయినా ఒప్పుకు తీరుతాను. కథ, కథానిక, గల్పికల వ్యత్యాసాల గురించి ఎందరో పెద్దలు వ్యాసాలు రాసి ఉన్నారు. నేను అర్థం చేసుకున్నంతవరకు, కథ కొంచెం విస్తృతమైనది. కథానిక దాని కంటే చిన్నది. ఇక గల్పిక విషయానికి వచ్చినప్పుడు అది ఒక్క పుట, రెండు పుటలు దాటకుండా ఒక అద్భుతమైన సందేశాన్ని, చమక్కుమని పాఠకుడికి అందించగలగడమే దాని సార్థకత. అందుచేత, ఈ మూడింటికి ఉన్న సరిహద్దు రేఖ అతి సున్నితమైనది. నా మటుకు నేను, నక్షత్రాల పందిరిలో గల్పికా ప్రక్రియకే పెద్దపీట వేశాను. ఇవన్నీ పోటీ నిమిత్తమై రాసి ఉండటం వల్ల పుస్తకంగా వచ్చినప్పుడు అదనంగా కూడా కొన్ని చేర్చుకోవచ్చనే వెసులుబాటు ఉండటం వల్ల, కొన్ని కథానికలు మంచు విడిన పువ్వు, ఎర్ర ప్లాస్టిక్ మూత లాంటి వాటిని కూడా పొందుపరచడం జరిగింది.

ప్రశ్న 3: “ఒక అనుభూతి, ఒక కాన్సెప్ట్ నిర్ద్వంద్వంగా పాత్రలతో చెప్పించి పాఠకుడు ‘అబ్బ ఏం చెప్పాడు!’ అని అనుకుంటే చాలనుకున్నాను” అని మీరు మీ మరో పుస్తకంలో పేర్కొన్నారు. ఈ లక్ష్యం ‘నక్షత్రాల పందిరి’లో ఏ మేరకు నెరవేరిందని అనుకుంటున్నారు?

జ: ‘నక్షత్రాల పందిరి’లో ఈ లక్ష్యం పరిపూర్ణంగా నెరవేరిందని నేను విశ్వసిస్తున్నాను.

ప్రశ్న 4: భార్యాభర్తల అనుబంధం గాఢమైనది. జంటలోని ఒకరు ఎడబాసాకా, రెండవవారిలో కలిగే దుఃఖం లేదా వేదనని అక్షరీకరించటం అంత సులువు కాదు. కానీ దాన్ని ఆవిష్కరించడానికి ‘పాలపిట్ట రంగు’ అనే ప్రతీకను ఎంచుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?

జ: మాకు చిన్నప్పటి నుంచి ప్రయాణాలలో ఎప్పుడు పాలపిట్ట కనిపించినా అది శుభ శకునమని అమ్మ చెబుతూ ఉండేది. అదేమిటో అదలా మెదడులో ముద్రించబడిపోయింది. ఒకసారి రైలు ప్రయాణంలో పాలపిట్ట కనబడింది, అలాగే ఎదురుగుండా ఒక వృద్ధ దంపతులున్నారు. ఈ గల్పికలు రాస్తున్నప్పుడు, ఎందుకో ఆ రెండు సంఘటనలు గుర్తుకు వచ్చి దానిని ఇలా మలచడం జరిగింది. ఈ పాలపిట్ట రంగు నాకు ఎంతో ఇష్టమైన గల్పిక. అది రాసిన తర్వాత నేను కంటతడి పెట్టుకున్నాను.

ప్రశ్న 5: ‘సిరితా వచ్చిన వచ్చును’, ‘పావలా కోడిపెట్ట!’ వంటి కథలలో నేటి కార్పొరేట్, సామాజిక కృత్రిమత్వాన్ని ఎంతో వ్యంగ్యంగా ఎండగట్టారు. అసలు సమాజంలోని ఈ కుళ్ళును నిలదీయడానికి ‘వ్యంగ్యాన్నే’ ఒక శక్తివంతమైన ఆయుధంగా ఎందుకు ఎంచుకున్నారు?

జ: సమాజంలో కుళ్ళును కడగడానికి వ్యంగమే ఒక వజ్రాయుధం. కీలెరిగి వాత పెట్టాలంటే వ్యంగమే మందు కనుక, ఆ గల్పికలను అలా రాయడం జరిగింది.

ప్రశ్న 6: ఉప్పుకయ్యల వెనుక ఉన్న మహిళా కార్మికుల వెట్టిచాకిరీని, సమాజానికి కనబడని వారి కన్నీళ్లను ‘దాహం’ కథలో ఆవిష్కరించారు. ఇంతటి దయనీయ స్థితిని కథా వస్తువుగా మార్చడానికి మీరు చేసిన క్షేత్రస్థాయి పరిశీలన/పరిశోధన గురించి చెప్పండి.

జ: ఈ ప్రశ్నకు కాస్త విపులంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ విషయం గురించిన ఒక వ్యాసాన్ని చాలా రోజుల క్రితం 10/15 years back నేను చదివి ఉన్నాను. తమిళనాడుకు చెందిన ఒక యువతి వారికి మొబైల్ టాయిలెట్స్ అందించడానికి రీసెర్చ్ చేస్తూ రాసినటువంటి, మనసు కదిలించే ఆ వ్యాసం నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. మళ్లీ తమిళనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఉప్పుకయ్యల అంశం వెలుగులోకి వచ్చింది. బాధాకరమైన విషయమేమిటంటే ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా, ఈ మహిళల అమానుషమైన ఈ వెట్టి చాకిరీకి, సమాధానం, ప్రత్యామ్న్యాయం దొరకడం లేదు. మహిళలే తీవ్రమైన exploitationకు గురై మగ్గిపోతున్నారు. ఈ కథ కోసం అపర్ణ కార్తికేయన్ రచించిన Nine Rupees an Hour: Disappearing Livelihoods of Tamil Nadu పుస్తకాన్ని కూడా తెప్పించాను కానీ, దీనికి సంబంధించిన వివరాలు దాంట్లో లేవు. మరికొంత సమాచారం Internet నుండి సేకరించి ఈ గల్పికను మలచడం జరిగింది. నిజం చెప్పాల్సి వస్తే ఈ గల్పిక ఒక అంతర్జాతీయ స్థాయిలో స్త్రీ సమస్యల సంకలనం ఏదైనా వస్తే అందులో పొందుపరచ దగ్గది అని నా భావన, ప్రార్థన. ప్రతీ వాక్యం కూడా చాచి పెట్టి కొట్టినట్టుగా ఉంటుంది. ‘కనుచూపు మేరా స్మశానంగా ఉప్పుకయ్య, శవాలను కాల్చిన బూడిద కుప్పల్లా చిన్న ఉప్పు కుప్పలు, అలాగే, సూర్యతాపంతో కమిలిన దేహాలు తోసుకుంటూ ఇంటికి వెళ్లాక సున్నా కూలితో దయగా దోచే కార్యానికి.. నమిలిన దేహాలు మోసుకుంటూ దాహర్తులై దగ్ధమవుతూ బతుకుతున్నది ఆడవాళ్లే’ లాంటివి మీకు ఎన్నో కనిపిస్తాయి.

ప్రశ్న 7: యాంత్రిక భవిష్యత్తును ఊహిస్తూ రాసిన ‘మనసు’ కథలో, మనసు ఎక్కడుంటుంది అనే తాత్త్విక ప్రశ్నను ఒక మసాజ్ గర్ల్ ‘మైకో’ పాత్ర ద్వారా చెప్పించాలనే ఆలోచన మీకెలా వచ్చింది? విహారి గారు దీన్ని కలికితురాయి అనడంపై మీ స్పందన ఏంటి?

జ: నిస్సందేహంగా ఇది ఒక కలికితురాయి. మనం ఎల్లప్పుడూ కూడా, వి గెట్ క్యారీడ్ అవే బై ది సూపర్ ఫీషియల్ ఔటర్ అట్రాక్షన్స్. ఒక తలా, ఒక మొండెం, అటు ఇటుగా, చిన్నా-పెద్దగా మాంసం ముద్దలు. నిజానికి దేహాన్ని నడిపిస్తున్నటువంటి మనసును మనం ఏనాడు పట్టుకునే ప్రయత్నం చేయలేం. ఈ మాటలు అదే వృత్తిలో ఉన్న ఒక యువతితో చెప్పించడం ద్వారా మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందని అలా సృజించడం జరిగింది.

ప్రశ్న 8: భార్య చనిపోయిన వేదనను దిగమింగుకుని, పిల్లలను వృద్ధిలోకి తెచ్చి వారి జీవితాలకు బాట చూపడమే భర్త అసలైన కర్తవ్యమని ‘ఎమ్ బేకరీ’ కథ చెబుతుంది. బతుకు అర్థాన్ని విడమరిచే ఇంతటి గొప్ప బాధ్యతను, ఒక ‘బేకరీ’ నేపథ్యంలో చిత్రించాలనే వినూత్న ఆలోచన మీకు ఎలా వచ్చింది?

జ: మనలో చాలామందికి తెలిసిన యూదుడు Logo Therapy ప్రతిపాదించిన డాక్టర్ విక్టర్ ఫ్రాంకల్, ది మాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకంలో, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లోంచి రెండో ప్రపంచ యుద్ధ విరమణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఒక సంఘటనను ఉటంకిస్తాడు. భార్యను కోల్పోయిన ఒక మిత్రుడు “నేనింక బతకలేను” అని, విక్టర్ దగ్గర ఏడుస్తాడు. అప్పుడు విక్టర్, “ఒకవేళ సీను రివర్స్ అయి ఉంటే, నువ్వు ఊహించగలవా?” అని ఆ మిత్రుడ్ని అడుగుతాడు. ఈ కథకు అది ప్రేరణ. దానిని మనసులో ఉంచుకుని, ఒక మరాఠీ యువజంట, బేకరి నేపథ్యాన్ని జొప్పించి ఈ గల్పికను అల్లడం జరిగింది.

ప్రశ్న 9: సమాజంతో సంబంధాలు తెగిపోయి, కేవలం ఒక ‘ప్రేక్షకుడిగా’ మిగిలిపోయే నేటి తరం మనుషుల మానసిక అలజడిని, అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ఈ ‘గాజు పలకల బాల్కనీ’ అనే అద్భుతమైన ప్రతీకను సృష్టించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?

జ: సంక్లిష్టమో, అత్యంత సరళమో తెలియనీయకుండా గుప్తంగా, “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అని మనసు అల్లే మానవ సంబంధాల వైచిత్రి నన్నెప్పుడూ అబ్బుర పరుస్తూ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్.

ప్రశ్న 10: ఒక యథార్థ సామాజిక విషాదాన్ని ‘దయామయుడు’ కథగా మలిచినప్పుడు, సమాజం పట్ల ఒక చింతనాపరుడైన రచయితగా మీరు పడిన వేదన ఎలాంటిది?

జ: ఈ గల్పిక రచించినప్పుడు నేను చాలా సంఘర్షణకు లోనయ్యాను. ఈ దారుణమైన సంఘటన పూర్వాపరాలను ఎన్నో మ్యాగజిన్ల ద్వారా చదివి ఆకళింపు చేసుకున్నాకే ఈ గల్పిక రాయడం జరిగింది. ఇందులో కూడా నన్నడిగితే, గల్పిక గనుక ముగించేశాను! ఒక రచయితగా దీనికి వ్యతిరేకంగా, ‘సమాజం ఏం చేయాలి?’ అని కూడా చెప్పాలి, కనీసం సూచించాలి. నేను ఆ ప్రశ్నను అలా అర్ధాంతరంగా పాఠకుడికే వదిలివేయడం జరిగింది.

ప్రశ్న 11: పుస్తకం టైటిల్ కథ అయిన ‘నక్షత్రాల పందిరి’లో యజమానుల వితరణ శీలతను చూపిస్తూనే, ఆ సన్నజాజి పందిరి కింద కొత్త దంపతుల భావి జీవితం ప్రారంభమయ్యేలా ఒక అద్భుతమైన రొమాంటిక్ సెటప్‌ను ఆవిష్కరించారు. అసలు ఈ కథకు ‘నక్షత్రాల పందిరి’ అని శీర్షిక పెట్టడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? కఠినమైన వాస్తవాల మధ్య సాగే కథా ప్రపంచంలో.. ఇంతటి ఉదాత్తమైన మంచి మనసును, అందమైన భావుకతను మిళితం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?

జ: మనిషి మెదడు ఎప్పుడూ కూడా నెగిటివిటీని ఎక్కువగా అబ్సార్బ్ చేసుకొని పట్టి పెట్టుకొని ఉంటుంది. అది పరిణామ క్రమంలో మనిషి తనను తాను ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. సరే, అది మనకు కాలక్రమేణా అలవాటై పోతుంది. సో, మన ఎదురుగా ఉన్న ఒక మంచి మనసును కూడా మనం కలుషితమైన అద్దం గుండానే చూస్తాం. మంచితనం, మానవత్వం కచ్చితంగా ఇంకా బ్రతికే ఉన్నాయి. మోసం, దగా ఉన్న చోటుల్లోనే మల్లెపువ్వు పరిమళం లాగా అక్కడక్కడ మంచి మనసుల మమత ఉంది. రచయితనే వాడు సమాజంలోని రుగ్మతలను ఎండగట్టడం, ఎత్తిచూపడం, వాటిని అరికట్టడానికి తనకు తోచిన మార్గాలను సూచించడం చేస్తూనే, సమాజంలో అంతర్లీనంగా అల్లుకొని ఉన్న మంచితనాన్ని కూడా అప్పుడప్పుడు ప్రజ్వలింప చేయాలి. లేకపోతే ఆ దీపం కొడిగట్టిపోతుంది. ఇటువంటి ఆలోచనే ఈ గల్పికకు ప్రేరణ. నక్షత్రాల వెల్తురు దాదాపుగా ఆరని జ్యోతుల వెలుతురు కనుక, మానవత్వం, మంచితనం కూడా అలాగే గుబాళించాలని, కాస్త కవితాత్మకంగా కూడా ఉండాలని, ఆ గల్పికకు ఆ శీర్షిక ఉంచడం జరిగింది.

ప్రశ్న 12: ‘పన్నెండవ మైలురాయి’ కథలో చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడు తన పుట్టిన ఊరు ‘పాడేరు’ వెళ్లాలనుకునే మట్టి మమకారాన్ని, ఆ చివరి కోరిక తీర్చడంలో కూతురు పొందే ఆత్మసంతృప్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. పాఠకులను మాడుగుల-పాడేరు ఘాట్ రోడ్డుపై తిప్పుతుందీ కథ. అసలు మీకు ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఏమిటి? ఆ నేపథ్యం మీకెలా పరిచయమైందో వివరిస్తారా?

జ: కొన్ని కారణాలవల్ల 2/3 సార్లు పాడేరుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ అడవి గుండా ఘాట్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా గొప్పగా ఇది ‘పాడే ఏరు’ అని రెండు కవితలు రాసుకున్నాను. ఈ గల్పికలను పోటీలు కోసం రాస్తున్నప్పుడు నాకు తమ్ముడిలాంటి మా పిఏ ఆ ప్రాంతం వాడే, ఆ ప్రాంతంలో జరిగే జాతరల గురించి ఈ 12 మైలురాయి గురించి చాలా విషయాలు చెప్పేవాడు. మరికొంత నేను పరిశోధన చేసుకొని అలా ఒక గల్పికగా మార్చడం జరిగింది.

ప్రశ్న 13: వ్యవస్థల అవినీతికి వ్యవస్థలు కాదు, మనుషులలోని ‘దుష్టబుద్ధి’యే కారణమని ‘ఇచ్చట అన్నీ అమ్మబడును!’ కథలో కుండబద్దలు కొట్టారు. మరి ఇంతటి వ్యవస్థీకృత దుష్టబుద్ధిని మార్చడానికి సాహిత్యం ఏ మేరకు ఆయుధంగా మారుతుందని మీరు విశ్వసిస్తున్నారు?

జ: కచ్చితంగా వ్యవస్థీకృత దుష్ట బుద్ధిని మార్చడం సాహిత్యం వల్లనే సాధ్యమవుతుంది. మహాకవి చెప్పినట్టు జగన్నాథ రథచక్రాలు వస్తాయి.. మార్పూ వస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలించినా ప్రతి ఒక్క ఉద్యమానికి అండదండగా వెన్నెముకగా సాహిత్య చైతన్యమే నిలిచి ఉద్యమాలను ఫలింప చేసింది. ఈ మధ్యనే నేను కెన్యాకు చెందిన గుగి వా తియాంగ్ ఓ రచించిన ‘ఇన్ ద హౌస్ ఆఫ్ ద ఇంటర్ప్రెటర్’ చదవడం సంభవించింది. సాహిత్యం అతన్ని ఎంతగా ప్రభావితం చేసిందో, అది ఏ రకంగా కెన్యాలో చైతన్యానికి కారణభూతమైందో అవగతం అయ్యింది. సౌదా రచించిన బర్బరీకుడు చదివాక కొందరు కట్టిన అబద్ధపు గోడలు పగిలి, వెల్తురు పారి, ఎన్నో పౌరాణిక ఘట్టాల, పాత్రల నిజ స్వరూపం ఎరుకకు వచ్చింది. సాహిత్యమే సమాజానికి కరదీపిక.

ప్రశ్న 14: మనుషులు తమ చివరి రోజుల్లో బంధాలను సర్దుకునే ‘డెత్ క్లీనింగ్’ అనే అంతర్జాతీయ కథావస్తువును.. తెలుగు పాఠకులకు ‘తేలికపడటం’ కథ ద్వారా మానసిక విశ్లేషణతో అందించాలనే ఆలోచన వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి?

జ: మనందరికీ తెలిసిన జపనీస్ మైండ్‌ఫుల్‌నెస్, (మన జీవితానికి ఏమిటి సార్థకత అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచేటటువంటి) IKIGAI కాన్సెప్ట్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దీనికి సమాంతరమైన ఆలోచనలు ఎన్నో దొరికాయి. ఈ డెత్ క్లీనింగ్ döstädning అనేది స్వీడిష్ కాన్సెప్ట్. ఈ అంశాన్ని మూల బిందువుగా చేసుకుని ‘తేలిక పడటం’ కథ రాయడం జరిగింది. నిజానికి ఇది గొప్పగా చర్చించవలసిన అవసరం ఉన్న కథా వస్తువు. దీనిపై మరిన్ని కథలు రావాలి. మనం ఎప్పుడూ మృత్యువుని ఒక మార్బిడ్ థాట్ morbid thought తోనే భయం భయంగా చూస్తూ ఉంటాం. మహా తాత్వికవేత్త, విశ్వకవి అయిన ఠాగూర్ అన్నట్టు, ఆకలిగా ఉన్న బిడ్డను అమ్మ ఒక స్తన్యం నుంచీ ఇంకొక స్తన్యానికి మరల్చినట్టుగానే.., జీవితంలో జననం – మరణం అనేవి రెండు పార్శ్వాలని అంత ఉదాత్తంగా స్వీకరించలేం. అందుకనే, భౌతికమైన విషయాలను ఒకటొకటిగా వదిలించుకుని మినిమం వస్తువులతో జీవితాన్ని సంతోషంగా ఆ ఘడియ కోసం అట్టహాసాలు లేకుండా పరిపూర్ణం చేయటం ఈ గల్పికకు ఆధారం.

ప్రశ్న 15: ‘మంచు విడిన పువ్వు’ కథలో రాత్రంతా ఉద్యోగ విధుల్లో శ్రమించి వచ్చిన భార్యాభర్తలలో.. భార్య పడే ఒత్తిడిని గుర్తించి భర్తే ఆమెకు కాఫీ కలిపి ఇవ్వడం అనే అంశం ద్వారా లింగ సమానత్వాన్ని (Gender equality) చూపించారు. అసలు అత్తగారి పాతకాలపు పట్టింపులనే ‘మంచు’ వీడి, భార్య అనే ‘పువ్వు’ మనసు విచ్చుకుందనే అర్థంలో ఈ శీర్షికను పెట్టారా? ఈ శీర్షిక సార్థకత గురించి చెప్పండి.

జ: ఈ కథ అనుమానం లేకుండా లింగ సమానత్వాన్ని జెండర్ ఈక్వాలిటీని ప్రోపగేట్ చేయడానికి రాసినటువంటిది. అపార్థం తొలగిందనే ఉద్దేశ్యంతో ఆ శీర్షికను అలా ఉంచడం జరిగింది అంతే.

ప్రశ్న 16: ‘ఎర్రమూత’ కథలో ఒక ప్లాస్టిక్ మూతను పాత్రగా మలిచి, దాని ద్వారా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూనే.. ఓ ఒంటరి ముదుసలి ఆవేదనని అద్భుతంగా ఆవిష్కరించారు. తన జడ అస్తిత్వానికి చరమగీతం పాడమని ఆ మూత భగవంతుని వేడుకునే సన్నివేశాన్ని.. సమాజంలోని ఒంటరి, నిస్సహాయ, జీవితేచ్ఛ లేని వ్యక్తుల అంతరంగపు ఆవేదనగా పరిగణించవచ్చా?

జ: నిస్సందేహంగా! ఇది నిజానికి గల్పిక కాకపోయినా నేను ముందే విన్నవించినట్టు మిగతా కథలు కూడా కలుపుకోవచ్చు అనే వెసులుబాటు ఉండటం వల్ల ఈ కథను ఈ సంపుటిలో చేర్చడం జరిగింది. ఇందులో మీరన్నట్టుగానే రెండు పార్లల్ ట్రాక్స్‌లో ఒకే నిర్వేదాన్ని ప్రతిఫలింప చేసే ప్రయత్నం చేశాను. కాకపోతే, ఒకటే తేడా! అది ప్లాస్టిక్ మూత. మన భౌతిక శరీరానికి ఆ ప్లాస్టిసిటీ లేదు. అది జర్జరీభూతమైనది. మనం తొందరగానే డీకే అయిపోతాం. ప్లాస్టిక్ మూత కొన్ని వేల సంవత్సరాలు కూడా అదే దౌర్భాగ్య పరిస్థితిలో ఉండిపోతుంది.. అదొక్కటే ఈ రెండింటి మధ్య తేడా!

ప్రశ్న 17: తెలుగు భాష పట్ల మీకున్న ప్రేమను, దాని భవిష్యత్తు పట్ల మీ సంవేదనను మీ కథల్లో బలంగా ఆవిష్కరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో మన మాతృభాష, కథా సాహిత్యాల భవిష్యత్తును మీరెలా చూస్తున్నారు?

జ: అంత పెద్ద విషయాలు మాట్లాడేటటువంటి అర్హత నాకున్నదని నేను అనుకోను. కానీ, నా మాతృభాష సంరక్షణకు, దాని భవిష్యత్తు సుస్థిరతకు కచ్చితంగా నేను కర్తవ్య బద్ధుడినై ఉన్నాను. అందుకే ఆంగ్లంలో, హిందీలో కొద్దో గొప్పో అభినివేశం ఉన్నప్పటికీ నా ఆలోచన అంతా తెలుగులోనే పుడుతుంది కనుక, నా సాహిత్య ప్రస్థానాన్ని ఎప్పుడూ తెలుగులోనే కొనసాగించాలని నా సంకల్పం. నా మాతృభాషాభివృద్ధికి నా వంతు సహాయం నేను ఎల్లప్పుడూ చేయగలనని ఈ పత్రికా ముఖంగా కూడా సవనియంగా తెలియజేసుకుంటున్నాను.

ప్రశ్న 18: ఈ కథలు మొదట ‘సిరికోన’ వాట్సాప్ గ్రూప్‌‌లో వచ్చాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రోజూ పాఠకుల నుండి వచ్చే తక్షణ స్పందన ఒక రచయితగా మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

జ: నిజం చెప్పాలంటే ఆ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ తక్షణమైన సంతృప్తికి నేనూ అతీతుడిని కాదు. నాలానే అనేకులు కూడా తెలియకుండానే ఈ స్లేవరీని పెంచి పోషించుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ లలో లేదా సోషల్ మీడియాలో పాఠకుల నుండి మీకు తక్షణం వాక్యాల రూపంలోనో, ఇమోజీల రూపంలోనో ఏదో ఒక రకంగా స్పందన లభించేస్తుంది. అది ప్రోత్సాహకరమైనా ఒక్కొక్కసారి ప్రమాదకరం.

ప్రశ్న 19: వాట్సాప్ వంటి మాధ్యమాల్లో చదివేటప్పుడు పాఠకుడికి వేగం, ఆసక్తి ముఖ్యం. డిజిటల్ మాధ్యమం నుండి ఒక ప్రింట్ బుక్ రూపంలోకి మారినప్పుడు కథల నిర్మాణంలో ఏవైనా మార్పులు చేశారా?

జ: వాట్సాప్ మాధ్యమంలో డిజిటల్ మాధ్యమం కంటే మీరన్నట్టుగా పాఠకుడు కొంత వేగాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే, పుస్తకం అనేది చేతికి వచ్చినప్పుడు తీరుబాటుగా ఎప్పుడైనా దానిని చదువుకోవచ్చు. కానీ మొబైల్‌లో ఉన్నది మనం ఈరోజు చదవకపోతే పోస్టుల సంఖ్య క్రమంగా పెరిగి పెరిగి అది కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. కనుక పాఠకుడు ఉత్సుకతతో దానిని చదవాలి అని ఒక ప్రయత్నం చేస్తాడు. వాక్య నిర్మాణం, ఆసక్తి కలిగించే శైలీ, కట్టి పడేసే కథా సంవిధానము లేనప్పుడు ఆ పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్‌కి వెళ్ళిపోతాడు. సిరికోనలో వచ్చిన ఈ గల్పికలలో నాడు పంచుకున్న వాటికీ ప్రింట్ మాధ్యమంలో వచ్చిన వాటికి అచ్చు తప్పులు, స్ఖాలిత్యాల సవరణ, ఎక్కడో ఒకటో రెండో పదాల చేర్పు తప్ప యథాతథంగానే ప్రచురించాను.

 

ప్రశ్న 20: రక్షణ రంగానికి చెందిన వ్యక్తులు రాసే సాహిత్యం చాలా అరుదుగా వస్తుంది. ఈ పుస్తకం ద్వారా నేటి యువతకు, ముఖ్యంగా దేశభక్తిని కేవలం నినాదాలుగా చూసే ఈ తరానికి మీ కథలు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి?

జ: అవును ఈ విషయమే మనం ముందుగానే చర్చించుకున్నాం. దేశ రక్షణ అనేది అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం అందులో ఏ రకమైన లొసుగులు ఉండకూడదు. కనుకనే, ఈ రంగంలో పని చేసే వారికి ప్రాథమిక హక్కులు కూడా కొంతవరకు కుదించబడి ఉంటాయి. అది కాదనలేని వృత్తి ధర్మం. దానిని పాటించవలసిందే! నా మటుకు నేను ఒకసారి పునరావలోకనం చేసుకుంటే, ఈ ‘నక్షత్రాల పందిరి’ అనే గల్పికా సంపుటి లోనే కాకుండా నా ఇంతకు ముందటి ‘33’ అనే గల్పికా సంపుటిలో, దాదాపుగా నా అన్ని రచనలలో ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగా అందచేశాను. ఇక దేశభక్తి అన్నారు కనుక కొంచెం స్వేచ్ఛ తీసుకుని ఒక్క మాట మనవి చేస్తాను. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని ప్రగాఢంగా నమ్మేవాడినే నేనూను. రేడియో టాక్స్‌గా పరమవీరచక్ర పొందిన 21 మంది సైనిక వీరుల గాథలను నాతో కలిపి నలుగురు సైనికులు ఆకాశవాణి విశాఖపట్నం రేడియో కేంద్రంలో వెలువరించారు. వాటికి వచ్చిన విశేషమైన స్పందన చూసి నేను నా సొంత ఖర్చులతో వెయ్యి పుస్తకాలు ముద్రించి తెలుగు పాఠశాల విద్యార్థులకు పంచడం జరిగింది. పూజ్య గురుదేవులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు దానికి ఆశీర్వదించి ముందుమాట రాయడం జరిగింది. అలాగే సాహితీ ప్రపంచంలో చిరపరిచితురాలు అయిన ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారు కూడా ఎంతో ప్రోత్సాహకరమైన ముందుమాట రాశారు. దేశభక్తిని నినాదాలకే కాకుండా నా వృత్తిగా స్వీకరించి పాటుపడ్డాను ఇక ముందు కూడా పాటుపడతాను, మనందరం పడాలి. అదే నా సందేశం.

ప్రశ్న 21: ఈ పుస్తకానికి గాను మీకు జింకా చెన్నరాయ కిశోర్ స్మారక 2024 సిరికోన ఉత్తమ గల్పికా రచనా పురస్కారం లభించింది. ఈ పురస్కారం గురించి చెప్పండి.

జ: జింకా చెన్నరాయ కిశోర్ స్మారక పురస్కారం 2020 లో కీశే శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారిచే ప్రారంభించబడి, వివిధ సాహితీ ప్రక్రియలలో నిష్ణాతులైన వారికి ప్రదానం చేస్తున్నారు. పురస్కారంలో భాగంగా పదివేల రూపాయల బహుమతి, జ్ఞాపిక ఉంటాయి. అది 2024 లో నాకు గల్పిక లకు ఇవ్వడం జరిగింది. సిరికోన అకాడమీ ద్వారా జింకా చెన్నరాయ కిశోర్ స్మారక పురస్కారం నా గల్పికలకు లభించటం, నాకు ఎంతో గర్వకారణం.

ప్రశ్న 22: పుస్తకానికి ముఖచిత్రం అద్భుతంగా నప్పింది. కవర్ పేజీ ఇమేజ్ మీరే డిజైన్ చేసుకున్నారు కదా. చేత్తో గీసి తరువాత కంప్యూటరీకరించారా లేక ఏదైనా సాంకేతికతతో దీన్ని రూపొందించారా? అంటే ఎఐ టూల్స్ వాడి ఉంటే ఏది? దాన్నే ఎంచుకోడానికి కారణమేమిటి?

జ: ముఖచిత్రం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నేను జెమినీని ఉపయోగించి తయారు చేసుకున్నాను. ఇది నిజంగానే మనం ఇంట్లోనే కూర్చుని మన ప్రాంప్ట్ ని మార్చుకుంటూ మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకునేటటువంటి గొప్ప సౌకర్యం. ఇందులోనూ ఒక మలినమైన పార్శ్వముంది. ప్రతీ వాళ్లు నాలా ఇలా ఏఐను ఉపయోగించి కవర్ పేజీలు తయారు చేసుకుంటూ ఉంటే నిజమైన సృజన ఎలా? నా చిగురించిన శిలాజం సంపుటికి అందుకే నేనే ఒక బొమ్మ వేసి ఒక గడ్డిపరకని పీకి తెచ్చి అతికించి, శిలాజంగా రూపు మార్చి దానిని మళ్లీ ఫోటో తీసి కవర్ పేజీ గా వేయడం జరిగింది.

ప్రశ్న 23: సాహిత్యానికి సంబంధించి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? ఏవైనా కొత్త పుస్తకాలు సిద్ధమవుతున్నాయా?

జ: సాహిత్యానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ముందుగా, ఇప్పుడు పదవీ విరమణ పొందాను గనుక బ్యాక్ లాగ్ లో పెండింగ్ లో పెట్టిన ఎన్నో, ఎన్నో పుస్తకాలను ముందు పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఎంతో సాహిత్యాధ్యయనం పూర్తి చేస్తే గాని మన రాతలలో పరిపక్వత రాదు. అయినా లోపల ఉన్న ఆవేశం రాయమంటూనే ఉంటుంది గనుక, ప్రస్తుతానికి నా సమీక్షలన్నింటినీ కలిపి ‘సమీక్షా కదంబం’ అని ఒక పుస్తకంగా తీసుకొస్తున్నాను. అలాగే మరో రెండు కవితా సంపుటాలు ముద్రణకు వచ్చే సంవత్సరం సిద్ధం. నేను ఇంతవరకు సబ్జెక్టును రెడీగా ఉంచుకున్నా నవలా ప్రక్రియను చేపట్టలేదు. సమయం అనుకూలిస్తే ఆ ప్రక్రియను కూడా అధ్యయనం చేయాలని ఉన్నది. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు మనిషి ఒక్కడికే ఉన్న గొప్ప వరం నవ్వడం. అలా కొన్ని హ్యూమరస్ ఖండికలను ‘ఆదివారం కాలక్షేపాలని’ రాశాను. వాటిని కూడా ఒక పుస్తక రూపంలో తేవాలని ప్రయత్నం. నా ఇన్ని ప్రయత్నాలకూ ఎల్లవేళలా మద్దతు నిస్తున్న నా కుటుంబ సభ్యులకూ, నన్ను సదా సానబెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ అధ్యయనానికి పురోగతి కల్పిస్తున్న సిరికోన వాక్స్థలికీ, కీర్తిశేషులు  శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ మాస్టర్ గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు దర్భముళ్ళ చంద్రశేఖర్ గారూ.

దర్భముళ్ళ చంద్రశేఖర్: ధన్యవాదాలు. ఎంతో ఓపికగా ఇంటర్వ్యూ జరుపుతున్న సంచిక టీంకు సభ్యులకు, ఇంటర్వ్యూ ప్రచురిస్తున్న సంచిక యాజమాన్యానికి నా మనపూర్వక కృతజ్ఞతాభివందనాలు. నమస్కారం.

***

నక్షత్రాల పందిరి (గల్పికలు)
రచన: దర్భముళ్ళ చంద్రశేఖర్,
ప్రచురణ: సమత పబ్లిషర్స్, విశాఖపట్టణం
పేజీలు: 158
వెల: ₹ 150/-
ప్రతులకు:
దర్భముళ్ళ చంద్రశేఖర్,
303, ఆర్. ఆర్. టవర్స్,
రైతుబజార్ ఎదురుగా,
గోపాలపట్నం, విశాఖపట్టణం. 530027
ఫోన్: 9491850718

ఆన్‍లైన్‌లో:
https://logilitelugubooks.com/book/nakshatrala-pandiri-darbhamulla-chadrashekar

~
‘నక్షత్రాల పందిరి’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/nakshatrala-pandiri-book-review-kss/

Exit mobile version