Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యాత్రికుడు, కథా, యాత్రాగాథా రచయిత, అనువాదకుడు శ్రీ దాసరి అమరేంద్ర ప్రత్యేక ఇంటర్వ్యూ

సంచిక టీమ్: నమస్కారం దాసరి అమరేంద్ర గారు.

దాసరి అమరేంద్ర: నమస్కారమండీ.

~

ప్రశ్న: రస్కిన్ బాండ్ ఆత్మకథ ‘Lone Fox Dancing’ ను ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’ పేరిట అనువదించినందుకు అభినందనలు. రస్కిన్ బాండ్ రచనల్లో కనిపించే సరళత నిజానికి చాలా లోతైనది. ఆ సరళతను తెలుగులోకి అనువదించేటప్పుడు, పదాలను మాత్రమే కాకుండా ఆ లోతును కూడా ఎలా అందుకోగలిగారు?

జ: సరళత, అండర్‌టోన్ నెరేటివ్ అన్నవి రస్కిన్ బాండ్ రచనల సహజ లక్షణాలు. మీరన్నట్లు ఆ సరళత ఎంతో లోతయినది. ఎన్నో పొరలు కలది. పదాల ప్రాతిపదిక మీద ఆ లోతును, పొరలను అందుకోవడం దాదాపు అసాధ్యం. నిజానికి పదాలు, భాష అన్నవి మనిషి అనుభవాలను ఆలోచనలను అనుభూతులను వ్యక్తీకరించడానికి పనికొచ్చే ఉపకరణాలు మాత్రమే. వాటి పరిమితి వాటికి ఉంటుంది. అనుభూతి దగ్గరకు వస్తే దానికి భాష లేదు. పరిమితి లేదు. మూల రచయిత కూడా తన అనుభూతిని తన మాతృభాషలోకి ‘అనువదించి’  చెపుతాడు. ఈ విషయం గ్రహించాక నేను అనువాదాల విషయంలో పదాల పరిమితిని దాటి మూల రచయితల అనుభూతి సీమలోకి వెళ్లడం అతి ముఖ్యం అని తెలుసుకున్నాను. రస్కిన్ బాండ్ ఆత్మకథ అనువాదం కన్నా ముందే నిమ్మగడ్డ శేషగిరి యాత్రాగాథల విషయంలో ఈ ఎరుకను ఆచరణలో పెట్టి మూల రచయితకూ, నాకూ, పాఠకులకూ – అందరికీ సంతృప్తి కలిగేలా ఆ యాత్రాగాథలను అనువదించగలిగాను. ఆ అనుభవం వల్ల రస్కిన్ బాండ్ అనుభూతి సీమ లోకి వెళ్లడం, సరళత – లోతులను సమన్వయపరుస్తూ అనువదించడం సులభమయ్యింది.

ప్రశ్న: ఆత్మకథను అనువదించడం అంటే రచయిత జీవితాన్ని మరో భాషలోకి తీసుకురావడం మాత్రమే కాదు; ఆయన వ్యక్తిత్వాన్ని కూడా లక్ష్య భాషలో పునఃసృష్టించడం. ఈ విషయంలో మీకు ఎదురైన అతిపెద్ద సవాలు ఏమిటి?

జ: మంచిమాట అన్నారు. చాలా నిజం. అసలు అనువాదం అంటే వ్యక్తిత్వ పునఃసృష్టి అన్న ఎరుక కలగడమే అతి పెద్ద కనువిప్పు.  ఆ ఎరుక కలిగినా పదాల పరిమితులను దాటి వెళ్ళగలగాలి అని తెలియడం మరో పెద్ద ముందడుగు. ఈ రెండు పరిమితులూ పెట్టుకోకపోవడం అన్నది నాకు నేను కలిగించుకున్న వెసులుబాటు. రస్కిన్ బాండ్ ఆంగ్ల ఆత్మకథను అనువదించే ప్రక్రియలో నేను ఆరునెలల పాటు ఆయన జీవితాన్ని జీవించాను.. అంచేత వ్యక్తిత్వ పునఃసృష్టి అలవోకగా – దాదాపు అసంకల్పితంగా జరిగిపోయి ఉంటుందని నేను అనుకొంటున్నాను.

ప్రశ్న: రస్కిన్ బాండ్ రచనల్లో ప్రకృతి ఒక నేపథ్యం మాత్రమే కాదు, ఒక పాత్రలా అనిపిస్తుంది. ఆ ప్రకృతి అనుభూతిని తెలుగు పాఠకుడికి అందించడానికి అనువాదం విషయంలో మీరు ఎలాంటి వెసులుబాట్లు కల్పించుకున్నారు?

జ: రస్కిన్ బాండ్‌కే కాదు, నా జీవితంలోనూ ప్రకృతి ఒక నిరంతర నేపథ్య గీతం. అనుక్షణం నేను అనుభూతించే ప్రధాన అంశం. ఈ సారూప్యం వల్ల ఆయన ప్రకృతి గురించి రాసిన ప్రతి విషయం తోనూ నేను తాదాత్మ్యం చెందగలిగాను. అంచేత వెసులుబాట్లు కల్పించుకోవలసిన అవసరం లేకుండానే ఆ ప్రకృతిని తెలుగులో ‘అందించగలిగాను’ .

ప్రశ్న: ఇంగ్లీష్‌లోని రస్కిన్ బాండ్ స్వరం (tone), తెలుగులోని ఆయన స్వరం మధ్య ఎక్కడైనా తేడా చూపాల్సి వచ్చిందా? అలా అయితే, ఆ మార్పును మీరు ఎలా సమర్థించుకుంటారు?

జ: ఈ ‘స్వరం’ లోని తేడా గురించి నేను చెప్పలేను. పాఠకులు చెప్పాలి. విశ్లేషకులూ విమర్శకులూ చెప్పాలి. అయినా ఆయన స్వరంతో పాటు నా స్వరం కూడా అక్కడక్కడ వినిపించిందన్న అనుమానం ఉంది. అదే నిజమయితే అది నాలోని లోపమే – దాన్ని నా లిమిటేషన్‌గానే భావిస్తాను.

ప్రశ్న: రచయిత ఉద్దేశాన్ని కాపాడటం, మూలభాషలోని పదబంధాలను యథాతథంగా ఉంచటం – ఈ రెండింటిలో ఏది ముఖ్యమని మీరు భావిస్తారు? ఈ పుస్తకంలో అలాంటి సంఘర్షణ ఎదురైన సందర్భం ఉందా?

జ: ఈ విషయం కొంతవరకు ఇంతకు ముందే చర్చించాం. రచనకు రచయిత ఉద్దేశం ప్రాణం. పదబంధాలు అందుకు వాహికలు. ఈ విషయంలో నాకు స్పష్టత ఉంది. అంచేత వాటి మధ్య ‘ఘర్షణ’ అన్న మాటకు తావు లేదు. ఇహ పదబంధాలను అనువదించడం ఇబ్బందిగా ఉండి కప్పదాట్లు వెయ్యడమంటారా – ఆ అలవాటు నాకు ఎప్పుడూ లేదు.

ప్రశ్న: రస్కిన్ బాండ్ జ్ఞాపకాల్లో బ్రిటిష్ వలసకాలపు భారతదేశం, కొండప్రాంతాల జీవితం, స్థానిక సంస్కృతి వంటి అంశాలు ఉన్నాయి. వీటిని నేటి తెలుగు పాఠకుడికి చేరువ చేయడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: పెద్దగా జాగ్రత్తలేం తీసుకోలేదు. వలస కాలపు జీవితం – ఏదో ఒక విధంగా వార్తలూ రచనల ద్వారా మన తెలుగు వారందరికీ సుపరిచితమే. స్థూలంగా ఆ జీవితవు వివరాలకు, వాటి గురించి స్పందనలకు పాన్ ఇండియన్ సారూప్యాలు ఉన్నాయని నేననుకుంటాను. భారతదేశమంతటా వర్తించే అనుభవ సామీప్యత ఉంది. సూక్ష్మ వివరాల్లోకి వెళితే అది అయా ప్రాంతాల మౌలిక అవసరాలు అవగాహనల మీద కొంతవరకు ఆధారపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రస్కిన్ బాండ్ రాసిన వలస కాలవు జీవితాన్ని తెలుగువారికి అందజెయ్యడం విషయంలో నేను పెద్దగా ఆలోచనలూ జాగ్రత్తల జోలికి వెళ్లలేదు.

ఇక స్థానిక సంస్కృతి, కొండప్రాంతపు జీవితం – వీటితో నాకు సగటు తెలుగు మనిషికి మించిన పరిచయం ఉంది. అయినా నా ఆ పరిచయాన్ని సగటు తెలుగు మనిషికి ఆపాదించి ఊరుకోలేదు. తెలుగు పాఠకుడిని దృష్టిలో పెట్టుకుని ఆ భాగాలను అనువదించాను. అత్యంత అవసరం అనుకొన్నప్పుడు టెక్ట్స్‌లో సహజంగా ఇమిడిపోయేలా కొన్ని కొన్ని వివరణలు జోడించాను. దాని వల్ల ఈ అనువాదం తెలుగు పాఠకుడికి కూడా ఆ యా జీవితాలనూ సంస్కృతులనూ సంతృప్తికరంగా అందచేయగలుగుతోందని నేను భావిస్తున్నాను.

ప్రశ్న: కొన్ని సందర్భాల్లో అనువాదకుడు ‘అదృశ్యంగా’ ఉండాలని కొందరు అంటారు. మరికొందరు అనువాదకుడి సృజనాత్మక జోక్యం తప్పనిసరి అంటారు. ఈ పుస్తకంలో మీరు మీ పాత్రను ఎలా నిర్వచించుకున్నారు?

జ: మంచి ప్రశ్న. జోక్యం తప్పనిసరి అన్న మాటతో నేను పూర్తిగా విబేధిస్తాను. అనువాదం మూల రచయిత సృజనాత్మకతకు పట్టం కట్టాలి. అలా అని అనువాదకునిలో సృజనాత్మకత ఉండనవసరం లేదా అంటే, ఉండాలి. కానీ అది ‘అదృశ్యంగా’ ఉండాలి. ఎంతో అరుదుగా తప్ప నేను నా సో కాల్డ్ సృజనాత్మకతను ప్రదర్శించను. మూలభాష లోని పదబంధాలకు ఒక్కోసారి వాటికి సరితూగే తెలుగు పదబంధాలను సృష్టించే సమయంలో ఒక్కోసారి నా సృజనాత్మకతను వినియోగించినా, స్థూలంగా అనువాదకుని సృజనాత్మకత మూల రచయిత సృజనాత్మకతకు విధేయంగా ఉండాలి అని నేను గట్టిగా నమ్ముతాను.

ఈ ఆత్మకథ దగ్గర వస్తే రస్కిన్ బాండ్ తన జీవితాన్ని ఎలా చూసాడు, ఏమి రాసాడు అన్నవి పాఠకుడికి ముఖ్యం. రస్కిన్ బాండ్ జీవితాన్ని అమరేంద్ర ఎలా చూసాడు అన్న ధోరణిలోకి పొరపాటున ప్రవేశిస్తే ఆ అనువాదం విఫలమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనువాదకుడు తన సృజనాత్మకతకు కళ్లెం వేసి ఉంచాలి అన్నది నా భావన.

ప్రశ్న: రస్కిన్ బాండ్ రచనల్లోని హాస్యం, విషాదం, నాస్టాల్జియా – ఈ భావాలను పదాల కంటే ఎక్కువగా అనుభూతుల ద్వారా వ్యక్తం చేయాలి. వీటిలో తెలుగులోకి తీసుకురావడం మీకు అత్యంత కష్టమైనది ఏది? ఎందుకు?

జ: మీరన్నది నిజం. వీటిని పదాల రూపంలో కన్నా అనుభూతుల ద్వారానే వ్యక్తం చెయ్యాలి. నేను స్వతహాగా హాస్యప్రియుడ్ని. అంచేత రస్కిన్ బాండ్ హాస్యం నాకు సులభంగా అందింది. అలాగే నేను నాస్టాల్జియా పక్షిని. దానిని పట్టుకోవడమూ సులభమయింది. విషాదాన్ని పట్టుకోవడం సామాన్య అర్థంలో చాలా కష్టం. అందులోనూ మూల రచయిత ఆ విషాదాన్ని హాస్యం వ్యంగ్యం కలిసిన సాధారణ భాషలో చెప్పినపుడు పట్టుకోవడం ఇంకా కష్టం. ముందే చెప్పినట్లు రస్కిన్ బాండ్‌తో నేను తాదాత్మ్యం చెందగలగడం వల్ల ఆ పదాల వెనుక ఉన్న విషాదాన్ని పట్టుకోవడం, అనుభవించడం, అనుభూతించడం నాకు సాధ్యమయింది. అంచేత కష్టమైనది ఏది? అన్న ప్రశ్నకు నా సమాధానం: ఏదీ కష్టమవలేదు.

ప్రశ్న: ఒక రచయిత తన జీవితాన్ని తానే చెప్పుకున్నప్పుడు, ఆయన జ్ఞాపకాల్లోని వ్యక్తిగత సత్యాన్ని అనువాదకుడు ఎంతవరకు ప్రశ్నించవచ్చు? లేక అనువాదకుడి బాధ్యత కేవలం ఆ సత్యాన్ని నిజాయితీగా పునఃసృష్టించడమేనా?

జ: మూల రచయిత వ్యక్తిగత సత్యాన్ని అనువాదకుడు ప్రశ్నించడం అన్న భావనే ప్రమాదకరమైనది. అనువాదపు పరిధులు దాటిపోయినది. ప్రశ్నించడం కూడనే కూడదు. ఒకవేళ ఆయా వ్యక్తిగత సత్యాల మీద అనువాదకునికి స్పష్టమైన సాక్ష్యాధార భరితమైన అభ్యంతరాలు ఉంటే, మూల రచయితతో కలసి కూర్చొని పరిష్కరించుకోవాలేగానీ వాటిల్ని అనువాదంలో ప్రశ్నించడం కూడని పని. ‘నిజాయితీగా పునఃసృష్టించడమే’ అనువాదకుని పని. బాధ్యత.

ప్రశ్న: రస్కిన్ బాండ్‌కు ప్రత్యేకమైన ‘కొండల మనిషి’ అనుభూతిని తెలుగు భాషలోకి తీసుకురావడానికి కేవలం పదజాలం సరిపోదు. ఆ వాతావరణాన్ని నిర్మించడంలో మీ అనువాద వ్యూహం ఏమిటి?

జ: దీనికి కొంతవరకూ ముందే సమాధానం చెప్పాను. అనువాద ప్రక్రియను పదజాలం పరిధినుంచి తప్పించి అనుభూతి సీమ లోకి తీసుకు వెళ్లినపుడు ఈ వాతావరణం సహజంగానే అనువాదంలో కనిపించిపోతుంది. పాఠకుడు ఆ కొత్త వాతావరణాన్ని తనదిగా స్వీకరించగలిగే భూమిక ఏర్పడుతుంది.

ప్రశ్న: ఈ అనువాదం పూర్తయ్యాక, మీరు రస్కిన్ బాండ్‌ను ముందుకంటే భిన్నంగా అర్థం చేసుకున్న అంశం ఏదైనా ఉందా?

జ: అనువాదం మొదలెట్టక ముందు నాకు రస్కిన్ బాండ్ అంటే ‘తనకంటూ ఒక ఆధార పీఠం లేకుండా, జీవితాన్ని శాసించే చలన శక్తులను పట్టించుకోకుండా, తాను ఎలా చూసిన జీవితాన్ని అలా రాసేసే రచయిత’ అన్న తేలిక భావం ఉండేది. అనువాదం ముగించాక, ఆ ప్రక్రియలో అతను నమ్మిన జీవిత విధానాన్ని అర్థం చేసుకున్నాక, ఈ రస్కిన్ బాండ్ ఏ ఆడంబరమూ లేకుండానే అర్థవంతమైన జీవన విధానాన్ని గుర్తించి, అనుసరించి, ‘విజయం’ సాధించిన అపురూపమైన వ్యక్తి; వైతాళికుడు – అన్న భావన కలిగింది.

ప్రశ్న: అనువాదకుడిగా ఈ పుస్తకంలో మీరు ‘అనువదించలేనిది’గా భావించిన అంశాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే, వాటిని ఎలా ఎదుర్కొన్నారు?

జ: దాదాపు లేవు. కానీ అనువాదంతో నన్ను నేను అనుసంధించుకోడానికి మొట్టమొదటగా, నాకు బాగా అనువుగా ఉందనిపించిన మూడవ భాగం దగ్గర అనువాదం మొదలెట్టాను. అది ముగిసేసరికి రస్కిన్ బాండ్‌తో అనుకంపించగలిగాను. దానితో మిగిలిన మూడు భాగాలు అలవోకగా అనువదించగలిగాను.

అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలను నేను సవ్యంగా అర్థం చేసుకుంటున్నానా అన్న అనుమానం కలిగింది. ఏ రకమైన అపసవ్య అవగాహనకూ ఆస్కారం లేని విషయాలవి. ఉదాహరణకు మాడవ అధ్యాయంలో మనకు తటస్థపడే బీబీజీకి ఆమె పక్కింటి మిసెస్ సింగ్‌తో ఉన్న సున్నిత అనుబంధాన్ని నేను సవ్యంగా పట్టుకోగలిగానా అన్న సందేహం నన్ను వెంటాడింది. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను మూల రచయితతో చర్చించి ఉండేవాడిని. రస్కిన్ బాండ్ విషయంలో అలా వీలవలేదు. అయినా ఆయన ఆత్మీయులను వెతికి పట్టుకుని వారి అభిప్రాయాలూ సేకరించి నా అవగాహన నిజానికి దగ్గరగానే ఉంది అని నిర్ధారించుకుని, అప్పుడు అనువదించాను. ఇలాంటి ఎంతో అరుదైన విషయాలే తప్ప, ‘అనువదించలేనివి’ అని భావించిన అంశాలు దాదాపు లేవు.

ప్రశ్న: ఒక భాషలోని జ్ఞాపకం మరో భాషలో అదే జ్ఞాపకంగా మిగులుతుందా? లేక అనువాదం ద్వారా అది కొత్త సాంస్కృతిక జ్ఞాపకంగా మారుతుందా?

జ: అది కొత్త సాంస్కృతిక జ్ఞాపకంగా మారుతుందో లేదో అన్న విషయాన్ని కాలమే చెప్పగలుగుతుంది. రస్కిన్ బాండ్ ఆత్మకథ వరకు ఆయా జ్ఞాపకాలు ‘బ్రతుకాట’ రెక్కల బలంతో తెలుగు సాంస్కృతిక జ్ఞాపకాలుగా మారి మిగిలే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న: తెలుగు పాఠకుడు రస్కిన్ బాండ్‌ను చదివేటప్పుడు ‘అనువాదాన్ని’ చదువుతున్నాననే భావన రాకుండా చేయడం ఎంతవరకు సాధ్యమైంది?

జ: ‘తెలుగు పాఠకునికి అనువాదాన్ని చదువుతున్నాను అన్న భావన రాకుండా చెయ్యడం’ అన్నది నేను పెట్టుకోడానికి ఇష్టపడని లక్ష్యం. అనువాద రచన చదువుతున్నప్పుడు పాఠకునికి తాను భిన్న ప్రదేశంలో, భాషా సాంస్కృతిక వాతావరణంలో, ఆచార వ్యవహారాలలో విహరిస్తున్నాను అన్న భావన కలగాలి – అదే సమయంలో ఆ అంశాలు అతని పఠన ప్రక్రియకు అడ్డు రాకూడదు. ఏ అనువాదానికైనా ఈ టైట్ రోప్ వాక్ సమర్థవంతంగా చెయ్యటం అన్నది అసలైన లక్ష్యం అవ్వాలి.

ఒకవేళ నా ‘ఏకాంత జీవి’ అనువాదంలా కాకుండా తెలుగు లోనే రాసినట్టుంది అని పాఠకులకు అనిపిస్తే అది దోషమే తప్ప గుణం కాదు. అది నా పరిమితులను సూచిస్తుందే తప్ప సామర్థ్యాన్ని కాదు.

ప్రశ్న: ఈ పుస్తకాన్ని అనువదించే సమయంలో, ‘ఇక్కడ నేను అనువాదకుడిగా కాదు, రస్కిన్ బాండ్‌గా ఆలోచించాలి’ అనిపించిన సందర్భం ఏదైనా ఉందా?

జ: మొత్తం పుస్తకాన్ని నేను రస్కిన్ బాండ్‌లా ఆలోచించే అనువదించాను. ఆయన ఆలోచనలలో కొన్ని కొన్ని చోట్ల నాకు పూర్ణ అంగీకారం లేకపోయినా ఆయన లాగా ఆలోచించడం అన్న విషయం నుంచి పక్కకు మళ్ళలేదు. మూల రచయిత మనసు ఆలోచన తెలుసుకోకుండా చేసిన అనువాదాలు పండవు.

ప్రశ్న: రస్కిన్ బాండ్ రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు పాఠకుడి పఠనానుభవంలో మీరు ఏ కొత్త వంతెన నిర్మించారని భావిస్తున్నారు?

జ: కొత్త వంతెన అన్నది చాలా పెద్ద మాట. దాని గురించి నేను వ్యాఖ్యానించడం భావ్యం కాదు. అది పాఠకులకు, విశ్లేషకులకు, విమర్శకులకు వదిలేద్దాం.

ప్రశ్న: ఒక మంచి అనువాదం మూల రచనకు ఎంత దగ్గరగా ఉండాలి? అలాగే ఎంత దూరం వెళ్లడానికి అనువాదకుడికి స్వేచ్ఛ ఉండాలి? ఈ పుస్తకం మీకు ఆ సరిహద్దును ఎలా నేర్పింది?

జ: ‘మూల రచనకు విధేయత – అనువాదకుని స్వేచ్ఛ’ అన్నది ఎడతెగని వివాదం.. ఖుష్వంత్ సింగ్ లాంటి వాళ్లు కూడా అనువాదకుడి స్వేచ్ఛ గురించి యథేచ్ఛగా మాట్లాడారు. రాజేంద్ర సింగ్ బేడీ పంజాబీ నవల ‘ఏక్ చాదర్ మైలీ సీ’ను ఇంగ్లీషు లోకి అనువదించడానికి, ‘నేను కొన్ని భాగాలని ఎడిట్ చేసి అనువదిస్తాను’ అన్న నిబంధన పెట్టి బేడీని ఒప్పించాడు ఖుష్వంత్ సింగ్.

నా దృష్టిలో ఇది సరైన పని కాదు..

ఈ స్వేచ్ఛ అన్నది అనువాదకుని అతిశయం నిండిన దుందుడుకుతనంగా పరిణమించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. నిజంగా మార్పులు అవసరం అని భావించినట్లయితే ఆ విషయం మూల రచయితతో చర్చించి నిర్ణయించడం సరైన పని. ఆ అవకాశం లేనపుడు మూల రచనకు విధేయంగా ఉండటం అన్నది ఒకే ఒక్క మార్గం.

ఈ పుస్తకం అనే కాదు – నేను ఇప్పటిదాకా అనువదించిన ఏడు పుస్తకాల విషయంలోనూ, పాతిక ముప్ఫై కథల విషయం లోనూ ఈ సరిహద్దును పెద్దగా ప్రయత్నం లేకుండానే నేను గుర్తించాను – గౌరవించాను.

ప్రశ్న: ఈ అనువాదం తర్వాత రస్కిన్ బాండ్‌ను తెలుగు పాఠకులు కొత్త కోణంలో చూడాలని మీరు కోరుకునే అంశం ఏమిటి?

జ: ‘రస్కిన్ బాండ్ తేలికపాటి రచయిత కాదు. తేలికపాటి మనిషి కాదు. లోతున్న మనిషి. అతనివి లోతైన రచనలు. వాటిన్ని మరింత సీరియస్‌గా తీసుకుని అధ్యయనం చెయ్యవలసి ఉంది. మరింతగా తెలుగు లోకి అనువదించుకోవలసిన అవసరం ఉంది’ అన్న స్పృహ తెలుగు పాఠకులకు కలగాలన్నది నా కోరిక.

ప్రశ్న: సాహిత్యానికి సంబంధించి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? ఏవైనా కొత్త పుస్తకాలు సిద్ధమవుతున్నాయా?

జ: నా ప్రస్తుత సాహితీ వ్యాసంగం మూడు పేటల అల్లిక – యాత్రారచనలు, అనువాదాలు, వ్యాసాలు. రస్కిన్ బాండ్ అనువాదం తర్వాత నిమ్మగడ్డ శేషగిరి హిమాలయ పర్వతాలలో చేసిన యాత్రల గాథలను అనువదించి ఓ వెబ్ పత్రికలో ప్రచురించాను. దాన్ని పుస్తక రూపంలో తీసుకు కావాలి. అలానే నేను గత పదేళ్లుగా రాసిన యాత్రా వ్యాసాలను కూడా పుస్తక రూపంలో తీసుకువచ్చే పనిలో ఉన్నాను. ప్రస్తుతం నేను 2023లో చేసిన నికోబార్ యాత్ర గురించి ఓ పత్రికలో ధారావాహికంగా రాస్తున్నాను.. అది ముగిసాక శేషగిరి గారి పెరూ దేశపు ప్రయాణాలు అనువాదం మొదలెడతాను. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.. చేస్తాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు దాసరి అమరేంద్ర గారూ.

దాసరి అమరేంద్ర: ధన్యవాదాలు. సంచిక పాఠకులకు నా అభినందనలు.

***

ఓ ఏకాంతజీవి బ్రతుకాట (ఆత్మకథ)
మూలం: రస్కిన్ బాండ్,  అనువాదం: దాసరి అమరేంద్ర
ప్రచురణ: కథాప్రపంచం ప్రచురణలు, తిరుపతి
పేజీలు: 376
వెల: ₹ 500/-
ప్రతులకు:
కథాప్రపంచం బుక్స్,
161, వినాయక్ నగర్ క్వార్ట్సర్స్, డి. టైప్,
కె.టి. రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, తిరుపతి – 517501
ఫోన్: +91 9908284105
ఈమెయిల్: kathaaprapanchambooks@gmail.com

 

~

‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/o-ekaantajeevi-bratukaata-book-review-kss/

Exit mobile version