[‘ఎ‘ఫైర్’’ అనే కథాసంపుటి వెలువరించిన దేశరాజు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం దేశరాజు గారూ.
దేశరాజు: నమస్కారం.
~
ప్రశ్న 1: మీరు రచించిన 15 కథల సంపుటికి శీర్షికగా 12వ కథ –ఎ‘ఫైర్’ – పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ముఖ్యమైన కథ కావడమే ప్రత్యేకత. శీర్షిక కూడా క్యాచీగా వుండటంతో ఆ నిర్ణయం తీసుకున్నా.
ప్రశ్న 2: కవిగా, కథా రచయితగా, మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: నేను మొదటి నుంచీ కవిత్వమే రాసేవాడిని. ఆ క్రమంలో సాహితీ మిత్రులు పరిచయం కావడం, పలు సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లడం ద్వారా కథల మీద ఆసక్తి పెరిగింది. కానీ, మొదటిసారిగా అచ్చయిన నా రచన శ్రీకాకుళసాహితి వారు ప్రచురించిన ‘యానగాలి’ అనే కవితా సంకలనంపై. అది అరుణతారలో ప్రచురితమైంది. ఆ తర్వాత కొన్ని కవితలు ప్రచురితమయ్యాయి. అయితే, అప్పట్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కథకే ఎక్కువ ప్రాధాన్యత వుండేది. సాహితీ మిత్రులు ఎక్కువగా కథల గురించే చర్చించుకునేవారు. దాంతో కథలు విస్తృతంగా చదివి, రాయటంపై దృష్టి పెట్టా. అప్పట్లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో వచ్చే ‘ఈవారం కథ’కు ప్రాముఖ్యత వుండేది. అందులో నా కథలు రెండు ప్రచురితమయ్యాయి. ఈలోగా ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడం, ఇక్కడ కవుల ప్రాబల్యం ఎక్కువ కావడంతో పూర్తిస్థాయిలో కవిత్వానికి అంకితమయ్యా.
ప్రశ్న 3: కవిత/కథ వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: రెండూ అంత సులువేమీ కాదు. నిడివి రీత్యా చూస్తూ కవిత చిన్నగా వుంటుంది. కానీ, లోతు ఎక్కువ. కష్టం విషయానికి వస్తే కవిత రాయడానికి కష్టపడినప్పుడు ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అన్నట్టు అనిపిస్తే; కథ రాసేప్పుడు కష్టం కొంచెం విసుగ్గా అనిపిస్తుంది.
ప్రశ్న 4: ఇది మీ ఐదవ కథాసంపుటి. ఈ పుస్తకానికి ఎవరి చేత ముందుమాట వ్రాయించలేదెందుకు? మీరు కూడా మీ మాటగా ఏమీ వ్రాయలేదెందుకు?
జ: సాధారణంగా నా పుస్తకాలకు ముందు మాటలు వద్దు అనుకుంటాను. నా తొలి కవితా సంపుటి ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’కు ఎటువంటి ముందుమాటలు లేవు. అయితే, ఆ తరువాత కవితా సంపుటి వెలువరించడానికి ఇరవైయ్యేళ్లు పట్టింది. దాంతో ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ప్రముఖ కవులు నగ్నముని, శివారెడ్డిలతో ముందుమాటలు రాయించా. కథా సంపుటాల విషయానికి వస్తే – మొదటి కథా సంపుటి ‘బ్రేకింగ్ న్యూస్’ తీసుకువస్తున్నప్పుడు ముందుమాట కోసం చాలా పేర్లు అనుకున్నా. కానీ, కుదరలేదు. కరోనా సమయంలో చనిపోయిన మా మామగారు కృష్ణశర్మ మిట్నాల గారికి ఆ సంపుటి అంకితమిచ్చా. ఆయన గురించి ఎవరికీ తెలియదు కాబట్టి నేనే రాశా. రెండో కథా సంపుటి ‘షేమ్.. షేమ్.. పప్పీ షేమ్’కు ప్రముఖ రచయిత్రి సత్యవతిగారు ముందు మాట రాశారు. మూడో కథా సంపుటి ‘ఆలీబాబా అనేక దొంగలు’ వెలువరించేప్పుడు ప్రఖ్యాత కథా రచయిత కాళీపట్నం రామారావుగారి శతజయంతి సంవత్సరం కావడంతో ఆయనకు అంకితం ఇస్తూ, ఆయనతో నా పరిచయాన్ని రాశా. నాలుగో కథా సంపుటి ‘రొమాంటిక్ డాగ్’ ప్రచురించేప్పుడు తొలినాళ్లలో నాకు దన్నుగా నిలిచిన మిత్రులు పడాల జోగారావు గారికి అంకితం ఇచ్చా. అందుకని ఆయనతో నా స్నేహాన్ని నేనే వివరించా. ఐదో కథా సంపుటి ‘ఎఫైర్’ వెలువరించేప్పుడు అలా ప్రత్యేక సందర్భమేమీ కనిపించలేదు. దానికితోడు చివరి నిమిషంలో ప్రెస్‌కు వెళుతుండటంతో ఎవరినైనా అడిగి, రాయించుకునే సమయం లేకపోయింది. నాకూ రాయడానికి సమయం చిక్కలేదు.
ప్రశ్న 5: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: ఏ కథకైనా చక్కని వస్తువు, దాన్ని అందంగా మలిచే శిల్పం, చదివించే శైలి అవసరం. నా వరకూ వస్తువుకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. శైలీశిల్పాలపై కూడా శ్రద్ధ పెడతా. అయితే, సులువుగా, చదివించే పద్ధతికే ప్రాధాన్యత ఇస్తున్నా.
ప్రశ్న 6: కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని చాలా లోతుగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: ఒక ముఖ్యమైన అంశాన్ని కథగా మలిచేటప్పుడు ఏయే విషయాలు ప్రస్తావించాలనేది నిర్ణయించుకుంటా. అయితే కథ సాగే క్రమంలో అనుకున్న విషయాలు ఎగిరిపోతాయి. కొత్త విషయాలు జత కలుస్తాయి. అలాగే, ఏ కోణంలోంచి కథ ఎత్తుకోవాలనే అంశాన్ని కూడా ముందే నిర్ణయించుకుంటా.
ప్రశ్న 7: అన్ని కథలకి, కథ ప్రచురితమైన పత్రిక, తేదీ వివరాలతో పాటు (పత్రికలలో పబ్లిష్ అయిన సందర్భాలలో) కథ వ్రాసిన తేదీ కూడా ఇచ్చారు. ఈ ఆలోచన వెనుక ఉన్న కారణం ఏమిటి?
జ: మన వాళ్లు పాత రచనలకు సంబంధించి చర్చలు చేసేటప్పుడు, వ్యాసాలు రాసేటప్పుడు ఇటువంటి తేదీలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా ఒక కథో, కవితో ఎప్పుడు వచ్చిందీ, ఎందులో ప్రచురితమైందనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్లకు వెతుక్కునే శ్రమలేకుండా ఆ వివరాలు నేనే అందిస్తున్నా. కొన్నిసార్లు ఏ చారిత్రక సందర్భాల్లో అటువంటి రచన చేశామో పాఠకులకే కాదు, విమర్శకులకు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
ప్రశ్న 8: ‘మార్పు’ కథని మామూలుగా మొదలుపెట్టి, చివరలో పూర్తి సెటైరిక్‍గా మార్చారు. ఎందుకని?
జ: అది సెటైర్ కాదు, వాస్తవమే. ఆ మధ్య ఇటువంటి సంఘటనలు జరిగాయి. మా ఊర్లో కూడా వైన్ షాపు కావాలని ధర్నా చేసినట్టు పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి. వాటిని చాలామంది ‘లైట్’గా తీసుకున్నారు. నిజానికి వ్యవస్థ పతనానికి ఆ సంఘటనలు నిదర్శనాలు.
ప్రశ్న 9: ‘దేవుడి తావు’ చక్కని కథ. ఈ కథ ఎందుకు వ్రాసారో ఆ నేపథ్యం వివరిస్తారా?
జ: దేవుడి కోసం గుళ్లు, గోపురాలు తిరుగుతారు. తిళ్లు తిప్పలు మానేసి పుణ్యం అనుకుంటారు. మడీ, ఆచారం అనుకుంటూ అంతా అపరిశుభ్రం చేస్తారు. ఏ దేవాలయాల దగ్గర చూసినా ఇదే పరిస్థితి. క్యూలైన్లలో తొక్కిసలాటలు, మరణాలు అందరికీ తెలిసినవే. నీరసాలు వచ్చి స్పృహతప్పి పడిపోతూంటారు. పాల ప్యాకెట్లు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, క్యారీ బ్యాగులు ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. నిజంగా భక్తి అంటూ వుంటే దేవుడి చూడటానికి కావాలసిన ప్రశాంతత, ఆరాధనా వుండాలి కదా? అవి మచ్చుకైనా కనిపించవు.
ప్రశ్న 10: “వ్యవసాయం అంటే చేతగానివాడు చేసే పని కాదురా, చేవ ఉన్నవాడు చేసే పని అని నిరూపించాలి. వ్యవసాయం ఒక పండుగలా సాగాలి” అంటాడో పాత్ర ‘ప్రకృతి-వికృతి’ కథలో. కానీ ఈ కథలో ఆ ఇద్దరు మిత్రులు చేసిన ప్రయత్నం కార్పోరెట్ ఉద్యోగులకి స్ట్రెస్ బస్టర్‌గానూ, వాళ్ళకి కాస్త ప్రచారం, ఆదాయం వచ్చే ప్రక్రియగా మారింది. తమకు వచ్చే ఆదాయంతో నిజమైన రైతులకి సాయపడదాం అని అనుకోడం తప్ప నిజంగా రైతులకి ఉపయోగపడినట్లు అనిపించదు. కథలో ఏదైనా మిస్ అయ్యారా లేక పాఠకుల ఊహకి వదిలేశారా?
జ: ఏమీ మిస్ కాలేదు. కాకాపోతే రైతులకు మేలు జరిగినట్టు చెప్పలేదు. కానీ, జరుగుతుందని ఆ స్నేహితుల నమ్మకం. రైతుల క్షేమం కోసమే వారి శ్రమ. అయితే, మామూలు రొటీన్ కథల్లోలా కథ ముగిసే సరికి అనుకున్న లక్ష్యాలు సాధించేసినట్టు చెప్పి, శుభం కార్డు వేయడం ఇష్టం లేదు. అలాగే, కార్పొరేట్ కల్చరల్ వంటబట్టించుకుని డబ్బులో మునిగి తేలిన స్నేహితుడు ఇందులో కూడా డబ్బును సృష్టించే ప్రయత్నం చేస్తాడు. అంతిమంగా అదంతా వ్యవసాయంపట్ల చాలామందిలో స్థిరపడిపోయిన వ్యతిరేక భావాలు తొలగించడానికే ఉపయోగపడుతుంది.
ప్రశ్న 11: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ఈ సంపుటికి సంబంధించిన వరకూ అయితే, నాకూ బాగా నచ్చిన కథ ‘ఎఫైర్’. ఈ అంశం మీద ఇంతవరకు కథలు రాలేదు. మారుతున్న కాలానికి సంబంధించిన కథ ఇది. సోషల్ మీడియా రోజుల్లో ఎవరు ఎలాగైనా ప్రవర్తించే అవకాశం వుంది. అందుకు ఎవరి కారణాలు వారికి వుండొచ్చు కూడా. మారుతున్న కాలానికీ, విలువలకీ, స్వేచ్ఛకీ ఈ కథ అద్దం పడుతుంది. మంచి-చెడు అనేవి ఇదివరకటిలా అంత సులువుగా నిర్ణయించలేం.
ప్రశ్న 12: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: లేదు. ‘అపరిచితుడు’ కథను ఇంకా బాగా రాయొచ్చు. కథ చివర్లో వాచ్యం చేయకుండా, సజెక్టివ్‌గా వదిలిపెడితే బావుండేది. కానీ, అలా కుదరలేదు.
జ: ప్రత్యేక అనుభవాలంటూ ఏమీ లేవు. కాకపోతే, ఆలస్యంగా ప్రెస్‌కు పంపించా. సాధారణంగా నా కథా సంపుటాలు బుక్ ఫెయిర్ తొలి రోజు నుంచీ అమ్మకానికి సిద్ధంగా వుండేవి. ఆలస్యంగా పంపడం వల్ల ప్రచురణ ఆలస్యమై బుక్ ఫెయిర్ ప్రారంభమైన అయిదు రోజుల తరువాత అమ్మకానికి వుంచగలిగా. నా కథా సంపుటాలన్నిటికీ లభించినట్టే దీనికీ పాఠకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రశ్న 14: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: పెద్దగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. కానీ, కథా సంపుటి తీసుకువస్తున్నట్టే ప్రతీ ఏడాది ఒక కవిత సంపుటి కూడా తీసుకువస్తే బావుంటుందని అనుకుంటున్నా. అందుకోసం ఈసారి కథా సంపుటితోపాటు, కవితా సంపుటి కూడా సిద్ధం చేస్తున్నా.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, ‘సంచిక’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు దేశరాజు గారు.
దేశరాజు: ధన్యవాదాలు.
***
రచన: దేశరాజు
ప్రచురణ: దారా మీడియా, హైదరాబాద్
పేజీలు: 107
వెల: ₹ 200/-
ప్రతులకు:
దారా మీడియా హైదరాబాద్
ఫోన్: 9110569542
~
దేశరాజు
ఫోన్: 9948680009
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా క్రాస్‌రోడ్, హైదరాబాద్.
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Affair-Telugu-Stories-Desaraju/dp/B0GD76G1MJ
~
‘ఎ‘ఫైర్’’ అనే కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/affair-book-review-kss/

