Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత, ప్రచురణకర్త, సినీ విశ్లేషకులు శ్రీ జోశ్యుల సూర్యప్రకాశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘భాగ్యరాజా Decoded’ అనే పుస్తకాన్ని ప్రచురించిన శ్రీ జోశ్యుల సూర్య ప్రకాశ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం జోశ్యుల సూర్యప్రకాశ్ గారూ.

జోశ్యుల సూర్యప్రకాశ్: నమస్కారమండీ.

~

1: మీకు ఒక ప్రత్యేక ప్రచురణ సంస్థను స్థాపించాలని ఎందుకనిపించింది?

జ: నా పుస్తకాలు నేనే వేసుకోవటానికి, నా సరదా తీర్చుకోవటం కోసం వేరే వాళ్లని ఇబ్బంది పెట్టకూడదని నేను ప్రచురణ రంగంలోకి దిగాను. దిగాక లోతు అర్దమైంది. లోటుపాట్లు తెలిసాయి. అయితే వెనక్కి వెళ్లిపోకుండా కొనసాగటానికి ఏకైక కారణం.. సినిమా లిటరేచర్ పుస్తకాలు బాగా తక్కువ ఉండటమే. సినిమా లిటరేచర్ బాగుంటే ఖచ్చితంగా సినిమాలు మంచివి వస్తాయి. ఏతావాతా నాకు సినిమాపై ప్రేమే ఈ ‘జోశ్యుల పబ్లికేషన్స్’ ప్రారంభానికి కారణం. సినిమా పుస్తకాలతో పాటు మధ్య మధ్యలో నాకు నచ్చిన సాహిత్యం (కథలు, నవలలు) కూడా తెస్తాను.

2: తెలుగులో ఉన్న ప్రచురణ సంస్థలే అమ్మకాలు లేవు అంటున్నారు. ఉన్న సంస్థలు అయిదు కాపీలు ముద్రించి అవి అమ్ముడవగానే రెండో ఎడిషన్‌కు వెళ్తున్నట్టు డప్పు కొట్టుకుంటున్న తరుణంలో మీరు ప్రచురణ రంగంలోకి దిగటం అభిలషణీయమా?

జ: అమ్మకాలు లేవు అనేది నాకెందుకో నమ్మబుద్ది కాదు.. నేను పది పుస్తకాలు దాకా వేసాను.. దాదాపు అన్ని పుస్తకాలు రెండో, మూడో ప్రచురణకు వెళ్లాయి. అలాగని మరీ యాభై కాపీలే వేసి.. రెండు, మూడు, నాలుగు అని చెప్పటం లేదు. ట్రిప్‌కు ఐదు వందల నుంచి వెయ్యి కాపీలు వేస్తూ వస్తున్నాయి. కంటెంట్ ఉన్న పుస్తకాలు జనం కొంటున్నారు. అందులో తిరుగులేదు. అయినా ఈ సంవత్సరం పుస్తకాలు చదివేవాళ్లు పెరిగారు. ఈ విషయం మొన్న ఎమెస్కోకి వెళితే సాహితి లక్ష్మి గారు కన్ఫర్మ్ చేసి మరీ చెప్పారు. కాబట్టి జనాలు కొని పుస్తకం చదువుతున్నంత కాలం నేను అమ్ముతూనే ఉంటాను. ప్రచురణ సంస్థను నడుపుతాను.

3: భాగ్యరాజా రాసిన వ్యాసాల పుస్తకాన్ని తెలుగులో అందించాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది?

జ: భాగ్యరాజా గారు మామూలు వ్యాసాలు రాస్తే నేను పట్టించుకోకపోదును. ఆయన రాసింది సినిమా స్క్రీన్ ప్లే గురించి. ఇండియా స్క్రీన్ ప్లే గురు అని ఆయన్ని చెప్తారు. అలాంటి గొప్ప వ్యక్తి చెప్పిన స్క్రీన్ ప్లే టిప్స్, ట్రిక్స్ ఈ తరానికి చాలా అవసరం అనిపించింది. అందుకే నా కోసం అనువాదం చేయించుకున్న పుస్తకాన్ని అందరి కోసం ప్రింట్ వేసి మరీ అందించాలని చదివాక అనిపించింది. అందించాను. ఆదరించారు.

4: మీరు భాగ్యరాజా అభిమానా? మీకు ఆయన సినిమాల్లో ఏం నచ్చుతుంది?

జ: మా జనరేషన్‌లో చాలా మందికి భాగ్యరాజా బాగా నచ్చుతారు. ఆయన డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. దాదాపు అన్ని సినిమాలు నచ్చుతాయి. అది ఇది అని లేదు. దేనికదే ప్రత్యేకం. ఫన్, ఎమోషన్‌ని సామాన్యుడి కథలో కలిపి సరైన స్క్రీన్ ప్లేలో కలిపి చెప్పగల సమర్థుడు ఆయన.

5: మీరు స్వయంగా రచయిత. అయినా భాగ్యరాజా డీకోడెడ్ పుస్తకానికి అనువాదకుడిగా మరో రచయితను ఎంచుకున్నారు? కారణం ఏమిటి?

జ: నేను రచయితనే కానీ అనువాదకుడిని కాదు. శ్రీనివాస్ తెప్పల అద్భుతమైన అనువాదకుడు. నాకే తమిళం వచ్చి చేసినా అంత బాగా చేయలేను.

6: భాగ్యరాజా డీకోడెడ్ పుస్తకం రూపొందటంలో మీ పాత్ర ఏమిటి?

జ: శ్రీనివాస్ గారు అనువాదం చేసాక పెద్దగా నాకు చేయటానికి ఏమీ మిగలలేదు. అయితే ఆ పుస్తకం తమిళంలో చాలా కాలం క్రితం వచ్చింది. దాంతో ఇప్పటి తరానికి కనెక్ట్ కానివి తీసేయాల్సిన అవసరం అనిపించింది. వాటిని ఎడిట్ చేసాను. అలాగే నాకు తెలిసిన అవసర పోలీస్ సినిమా స్క్రిప్టు విషయంతో మొదటి ఆర్టికల్ రాసాను. వీటితో పాటు ఇప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా, ప్రతీ ఆర్టికల్ చదివి సారాంశం మొత్తం వచ్చేలా ఇంగ్లీష్ హెడ్డింగ్‌లు కలిపాను, ఇంటర్వూలు, టిట్ బిట్స్ యాడ్ చేసాను. ఎంత చేసినా అది శ్రీనివాస్ గారి అనువాద పుస్తకమే. నా పని నామమాత్రమే.

7: భాగ్యరాజా డీకోడెడ్ పుస్తకంలో కొట్టొచ్చినట్టు కనబడేది విషయసూచిక లేకపోవటం! ఇలా రూపొందించటం వెనుక ఆలోచన ఏమిటి?

జ: ఈ పుస్తకం ప్రత్యేకత.. ఒక ఆర్టికల్‌కు మరొక దానికి లింక్ లేకపోవటం, దేనికదే ఎక్కడ నుంచి ఎక్కడైనా చదువుకోవచ్చు. అలాంటప్పుడు విషయసూచిక ఎందుకు అనిపించింది. అయినా విషయసూచిక వేస్తే అది నేను పెట్టిన ఇంగ్లీష్ హెడ్డింగ్ లతో వేయాలి. అప్పుడు అది ఇంగ్లీష్ పుస్తకం అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే డీకోడెడ్ అనగానే చాలా మంది ఇంగ్లీష్ పుస్తకమా అని అడుగుతున్నారు. కాబట్టి యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని సినిమా స్క్రిప్టు పరిభాషలోనే విభజించాను.

8: భాగ్యరాజా డీకోడెడ్ పుస్తకంలో ప్రధానంగా కనబడేది, అధిక సంఖ్యలో ఆంగ్లపదాలు వాడటం. తెలుగులో సమానార్థకాలు వాడుకలో వున్న పదాలకు కూడా ఆంగ్ల పదాలను విరివిగా వాడారు? ఎందుకని?

జ: కావాలనే ఇంగ్లీష్ పదాలు వాడటం జరిగింది. అది తెలుగు సాహిత్య పుస్తకం కాదు. ఇప్పటి యూత్ టింగ్లిష్‌లో రాస్తున్నారు. అలాంటివారికి ఈ పుస్తకం రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం ఇంగ్లీష్ వాడాలనే వాడాను.. అదే సక్సెస్ అయ్యింది కూడాను.

9: ఒక అధ్యాయం అన్నట్టు కాకుండా భాగ్యరాజా చెప్పిన ఒకో అంశాన్ని చిన్న వ్యాసంలా శీర్షికతో అందించారు. ఆ శీర్షికలు చెప్పే అంశం కాక, శీర్షికను ఆంగ్లంలో పెట్టారు. ఎందుకని?

జ: తేలికగా సరళంగా ఉండేందుకు, అలాగే స్క్రీన్ ప్లే రిఫరెన్స్ కావాలనుకునే వాళ్ళు.. ఆ ఇంగ్లీష్ హెడ్డింగ్ చూసి, అందులో కంటెంట్ అర్థం చేసుకుని చదువుకుంటారని, కేవలం అవసరమైనప్పుడు రిఫర్ చేసుకునేందుకు వీలుగా అలా ఇవ్వటం జరిగింది. పెద్ద పెద్ద పాఠాలుగా ఇస్తే చదవటానికి ఇబ్బంది, గుర్తుపెట్టుకోవటానికి మరీ ఇబ్బంది. ఏదో డెప్త్ ఉంటుందని కంటెంట్‌ని కాంప్లికేట్ చేయదలుచుకోలేదు.

10: ఒక ఆసక్తికరమయిన సినిమాను ఎలా రూపొందించాలో, ఒక మామూలు సన్నివేశాన్ని, అసాధారణ సన్నివేశంగా ఎలా మలచవచ్చో ఈ పుస్తకంలో అనేక సూచనలున్నాయి. సినిమా స్క్రిప్ట్ రచయితగా, మీరు ఈ పుస్తకం నుంచి ఏమి గ్రహించారు?

జ: మీ ప్రశ్నలోనే జవాబు ఉంది.. మీరు అన్న విషయాలే నేను గ్రహించాను.. అందుకే నాకు పుస్తకం నచ్చింది. మంచి సక్సెస్ అయ్యింది.

11: భాగ్యరాజా సినిమాల్లో మీకు మరపురానిదిగా అనిపించే ఒక్క సన్నివేశం చెప్పండి. అంటే, అది చూడగానే ఇది భాగ్యరాజా మార్క్ అని గుర్తించగలిగే సన్నివేశం.

జ: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. చాలా సీన్స్ వరసపెట్టి మైండ్ లోకి వచ్చేస్తున్నాయి. అయితే వాటిల్లో భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అంధ 7 నాట్కల్ (1981)కి రీమేక్ ‘రాధా కళ్యాణం’ (1981 చిత్రం). అలాగే ఆయన ‘వద్దంటే పెళ్లి’ (తమిళంలో Munthanai Mudichu) (1983) లలో సీన్స్ నాకు ఇంకాస్త బాగా ఇష్టం.

12: ఇటీవలి కాలంలో తెలుగులో సినిమాల గురించి పలు పుస్తకాలు వస్తున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ప్రచురించే పుస్తకాలు ఏ రకంగా వాటికన్నా భిన్నమైనవిగా రూపొందిస్తున్నారు?

జ: తెలుగులో సినిమా లిటరేచర్ ఎవరు తీసుకొచ్చినా నాకు సంతోషమే. అయితే ఇది లిమెటెడ్ మార్కెట్. సినిమా వాళ్లకు తప్పించి బయిటవాళ్లకు పెద్దగా ఆసక్తి కలిగించవు. అలాంటప్పుడు అంత ధైర్యం చేసి ఎవరు సినిమా పుస్తకాలు వేసినా గొప్ప ప్రయత్నమే. అయితే ఇవి చాలవు. ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. నేను నాకున్న సినిమా అనుభవం, ఆసక్తితో వేయటమే విభిన్నత అనుకుంటున్నాను. మిగతా వాళ్లు అదే అనుకుంటారనుకోండి.

13: భాగ్యరాజా తెలుగువారికి పరిచయమైన వాడైనా తమిళ కళాకారుడు. తెలుగులో మీకు నచ్చిన కళాకారుడెవరు? వీలుంటే ఎవరిపై పుస్తకం తీసుకువస్తారు?

జ: తెలుగులో నాకు ఇష్టమైన డైరక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్‌లో సుకుమార్ గారు. రాజమౌళిగారు. వాళ్లు సినిమా టెక్నిక్స్‌పై డీకోడెడ్ సీరిస్‌లో తేవాలని ఉంది. అలాగే ఇంతకు ముందు తరంలో రాఘవేంద్రరావు గారు, బాపు గారు, కె. విశ్వనాథ్ గారు, దాసరి గారు, పూరి జగన్నాథ్ గారు ఇలా వారి కథ, కథన రీతులపై పుస్తకాలు తేవాలనే కోరిక ఉంది. ఇలా లిస్ట్ చాలానే ఉంది. ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలపై పుస్తకం తేవాలనేది నా కోరిక.

14: ఈ పుస్తక ప్రచురణలో మీ అనుభవాలేమిటి?

జ: పుస్తక ప్రచురణలో లాభాలు అయితే ఇప్పటిదాకా నేను చూడలేదు. అలాగని నష్టమూ పోలేదు. సమాంతర సినిమాలాగా ఉంది వ్యవహారం. భవిష్యత్తులో కమర్షియల్ సినిమా అవ్వాలనేది నా ఆశ.

15: అనువాదకుడిని పరిచయం చేస్తారా?

జ: ‘భాగ్యరాజా డీకోడెడ్’ పుస్తకం అనువాదకుడు శ్రీనివాస్ తెప్పలగారు. ఆయన కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడ్డారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను సాహిత్యం మీదున్న ఆసక్తితో మొదట్లో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. ఇప్పుడు బిజీ అనువాదకుడు. తమిళం నుంచి తెలుగుకు, తెలుగు నుంచి తమిళంకు అద్బుతమైన అనువాదం చేయగలరు. నేటి తరం అనువాదకులలో ప్రథమ స్థానానికి పోటీ పడుతున్నారనటంలో సందేహం లేదు.

శ్రీనివాస్ తెప్పల

16: పబ్లిషర్‌గా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: ఈ సంవత్సరం.. త్వరలో నేను రాసిన ‘నోలన్ డీకోడెడ్’ అనే పుస్తకం తేబోతున్నాను. అలాగే స్క్రీన్ ప్లే మాస్టర్స్ సలీం-జావేద్‌లు తమ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ గురించి చెప్పిన పుస్తకం అనువాదం తెస్తున్నాను. వీటితో పాటు Thirteen Months In The Himalayas: Chronicles of a Monk’s Sadhana అని ఓం స్వామి రాసిన ఆధ్యాత్మిక పుస్తకం తెలుగు అనువాదం జరుగుతోంది. బిర్యాని అనే మళయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసి లక్షన్నర కాపీలు అమ్ముడైన కథలు పుస్తకం తెలుగులోకి తేబోతున్నాను. ఇంకా కొన్ని పుస్తకాలు తెలుగు లోకి అనువాదానికి అగ్రిమెంట్స్ జరిగాయి. వాటిని అనువాదం చేయించి తెస్తాను. గొప్ప పుస్తకం.. ముఖ్యంగా అది సినిమా పుస్తకం అయితే ఎక్కడున్నా మన జోశ్యుల పబ్లికేషన్స్ సంస్ద ద్వారా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. మా జనరేషన్‌కు దొరకని సినిమా లిటరేచర్ ఈ కొత్త జనరేషన్ అందించాలనేదేనే నా లక్ష్యం.

~

సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని కేటాయించి సంచికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారూ.

జోశ్యుల సూర్యప్రకాశ్: ధన్యవాదాలు మీకు, బహు కృతజ్ఞతలు!

***

భాగ్యరాజా Decoded
మూలం: భాగ్యరాజా, అనువాదం: తెప్పల శ్రీనివాస్
ప్రచురణ: జోశ్యుల పబ్లికేషన్స్,
పేజీలు: 180
వెల: ₹ 200 (షిప్పింగ్ ఛార్జీలు అదనం)
ప్రతులకు:
జోశ్యుల సూర్య ప్రకాశ్ 9704683520, 6281288424
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Bhagya-Decoded-Vaanga-Cinemavai-Pesalam/dp/B0DP2CC658

 

 

~

‘భాగ్యరాజా Decoded’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/bhagyaraja-decoded-book-review-st/

Exit mobile version