Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకులు జోశ్యుల సూర్యప్రకాశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా’ అనే పుస్తకాన్ని ప్రచురించిన శ్రీ జోశ్యుల సూర్య ప్రకాశ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం జోశ్యుల సూర్యప్రకాశ్ గారూ.

జోశ్యుల సూర్యప్రకాశ్: నమస్కారమండీ.

~

ప్రశ్న: ‘హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా’ అని మీ మూడు వాల్యూముల సినిమాల విశ్లేషణ పుస్తకానికి పేరు పెట్టారు. హిచ్‌కాక్ కన్నా ముందరి సినిమాలను, నోలన్ తరువాత సినిమాలను ఎందుకని వదిలేశారు?

జ: నాకు ఇష్టమైన డైరక్టర్స్ వాళ్లిద్దరు.. అందుకే ఆ పేర్లు వచ్చేలా పెట్టాను.. నిజానికి ప్రపంచ సినిమా సముద్రం.. ఎన్ని విశ్లేషణలు రాసినా అది చిన్న నీటి బిందువు సాటి కూడా కాదు.. కాబట్టి ముందు, వెనక వదిలేయటం అనేది ఏమీ లేదండీ.

ప్ర: ఇలా సినిమాల విశ్లేషణాత్మకమయిన వ్యాసాలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: నాకు మాలతీ చందూర్ గారి పాత కెరటాలు (నవలలుపై విశ్లేషణాత్మక వ్యాసాలు) చాలా చాలా చాలా ఇష్టం.. అలా ఎవరైనా సినిమాలు గురించి విశ్లేషణాత్మకంగా రాస్తే బాగుండును అనుకునేవాడిని.. ఈలోగా మిత్రులు చైతన్య (రైటర్ విజయేంద్రప్రసాద్ గారి అసోసియేట్), గురువు సమానులు జగన్నాథ శర్మ గారితో మాట్లాడుతూంటే.. ఈ ప్రపోజల్ పెట్టారు.. ఆంధ్రజ్యోతి నవ్యకు రాయచ్చు కదా అన్నారు. నేను బద్దకిస్టుని, కంటిన్యూగా రాయాలంటే నా వల్ల అవుతుందా అనుకున్నాను.. కానీ శర్మగారు ఇచ్చిన ధైర్యంతో, ప్రోత్సాహంతో ఆపకుండా రాసేసాను..

ప్ర: వారం వారం ఒక సినిమా గురించి రాయటం కష్టం అనిపించలేదా?

జ: దాదాపు రోజుకో సినిమా చూడటానికి సంవత్సరాల తరబడి అలవాటు పడినవాడిని. దాంతో మళ్లీ ఆ సినిమాలు ఎంజాయ్ చేస్తూ చూసేవాడ్ని. కానీ రాసేటప్పడే అసలు కథ మొదలయ్యింది. ఒక సినిమా గురించి రాయాలంటే ఆ దర్శకుల ఇంటర్వూలు చదివాలి, యూట్యూబ్‌లో వెతికి వినాలి. ఆ సినిమా గురించి సమగ్రంగా సమాచారం సేకరించాలి. అది కష్టమే. ఒక్కో ఆర్టికల్‌కు మూడు రోజులు కేటాయించాల్సి వచ్చేది. కానీ ఎవరైనా ఫోన్ చేసి మీ ఆర్టికల్ బాగుంది అనగానే ఆ కష్టం మాయమైపోయేది.

ప్ర: ఈ సినిమాలన్నీ మీరు చూశారా? గతంలో చూసినవేనా, లేక, వారం వారం చూస్తూ రాశారా?

జ: ఏవో కొన్ని తప్పించి.. దాదాపు అన్ని సినిమాలు చూసానండీ.. అయితే అవి ఎంజాయ్ చేస్తూ చూసాను. కానీ ఆర్టికల్ రాసేటప్పుడు విశ్లేషణాత్మకంగా చూడాల్సి వచ్చేది. కొన్ని సార్లు ఆ సినిమాలు దొరికేవి కావు.. సినిమా సర్కిల్స్‌లో చాలా కష్టపడాల్సి వచ్చేది.

ప్ర: ఒక సినిమా గురించి రాసేందుకు మీరు ఏర్పరచుకున్న ప్రామాణికాలేమిటి?

జ: నేను రైటింగ్ పాయింటాఫ్ వ్యూలో ఆ సినిమాలను విశ్లేషించేవాడిని.. అందుకు తగ్గ సినిమాలనే ఎక్కువ ఎంచుకునేవాడిని. అలాగే నా లక్ష్యం.. కృష్ణానగర్ కు వచ్చి సినిమా ట్రైల్స్ వేసేవారికి ప్రపంచ సినిమాపై ఎంతో కొంత అవగాహన కలిగాలి అని. అదే ఆలోచన మైండ్‌లో పెట్టుకుని సినిమాల ఎంచుకునేవాడిని.

ప్ర: ఈ శీర్శిక రచించేందుకు మీరు ఏవైనా రిఫరెన్స్ పుస్తకాలు వాడేరా? వాడితే ఏమిటవి?

జ: రిఫరెన్స్ పుస్తకాలు వాడానా అంటే పెద్దగా లేవనే చెప్పాలి. నేను ఎక్కువ దర్శకుల ఇంటర్వూలు చదివేవాడిని, వినేవాడిని. అయితే కస్తూరి మురళీకృష్ణ రాసిన ‘నవల నుంచి సినిమాకు’ అనే పుస్తకం మాత్రం చదివాను.. జురాసిక్ పార్క్ గురించి రాసేటప్పుడు అందులో ఆర్టికల్ ఒకటికి రెండు సార్లు చదివాను.. సచ్ ఏ గ్రేట్ బుక్. తెలుగులో మరిన్ని పుస్తకాలు అలాంటివి రావాల్సిన అవసరం ఉంది.

ప్ర: మీరు ఈ వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురిస్తున్నప్పుడు వాటిని వర్గీకరించలేదు. ఏ క్రమంలో రాశారో ఆ క్రమంలో ప్రచురించినట్టున్నారు. ఇది పాఠకుడికి ఇబ్బంది కలిగిస్తుంది. ఒక సినిమా గురించి వుందో లేదో తెలుసుకోవాలంటే మొత్తం మూడు భాగాల విషయ సూచిక చూడాల్సివస్తుంది. ఇంత అందంగా పుస్తకం రూపొందించినప్పుడు విషయ సూచిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పుస్తకం మరింత ఆకర్షణీయంగా వుండేది కదా?

జ: రైటేనండి.. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం.కానీ బద్దకస్తుడనని ముందే చెప్పాను.. దాంతో వర్గీకరణ చేయలేదు. అసలు పుస్తకాలు వేయాలనే ఆలోచన మొదట లేదు. కానీ తర్వాత హఠాత్తుగా ఆలోచన  పుట్టిన తర్వాత ఉన్నదున్నట్లు వేసుకుంటూ పోయాను. మీరు అన్నట్లు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

ప్ర: ఈ మూడు భాగాలలో వున్న సినిమాలలో ఏ సినిమా గురించి రాసేందుకు చాలా కష్టపడ్డారు? ఎందుకు?

జ: క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన ‘డన్‌కిర్క్’ సినిమా గురించి అర్దమయ్యేలా చెప్పటానికి నా వల్ల కాలేదు. ఓ పది వెర్షన్స్ పైగా రాసాను.. మా ఇంట్లో మా మిసెస్‌ని చదవమనేవాడిని.. మరో ఇద్దరు సినిమా స్నేహితులను చదవమన్నాను.. వాళ్లు అర్థం కాలేదు అనేవారు. కానీ ఆ సినిమాని పరిచయం చేయాలి ఎలాగైనా అనే పట్టుదల. అలా రాసాకుంటూ వచ్చాను. దాదాపు సక్సెస్ అయ్యాను. అలాగే ‘ఏ క్లాక్ వ‌ర్క్ ఆరెంజ్’ సినిమా కూడా అర్థం చేసుకోవాటనికి.. దాన్ని అర్థమయ్యేలా రాయటానికి చాలా కష్టపడ్డాను. అయితే ఓ పెద్ద దర్శకుడు ఆ ఆర్టికల్ చదివి పోన్ చేసి మెచ్చుకున్నారు. అలాగే ఈ మధ్య ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీకు వెళ్తే అక్కడ నిర్మాత.. ఈ ఆర్టికల్ గురించి మాట్లాడారు.. నాకు చాలా ఆనందం వేసింది.. మన ఇష్టానికి, కష్టానికి ఖచ్చితంగా మంచి రీచ్ ఉంటుందనిపించింది.

ప్ర: ఈ మూడు భాగాలలో మొత్తం 109 సినిమాలను పరిచయం చేశారు? వీటిల్లో మీ మనసుకు నచ్చిన టాప్ టెన్ సినిమాల పేర్లు చెప్పండి. ఎందుకని మీకు అంతగా నచ్చాయో చెప్పండి.

జ: వాస్తవానికి నచ్చని సినిమా ఒక్కటి కూడా పరిచయం చేయలేదు. అయినా అడిగారు కాబట్టి.. టాప్ టెన్ సినిమాల విషయానికి వస్తే..

1. చిల్డ్రన్ ఆఫ్ హెవన్

టైటిల్‍కు తగ్గట్లే అది స్వర్గం లాంటి నా బాల్యంలోకి తీసుకువెళ్లే సినిమా. అందులో సంఘటనలు నా జీవితంలో జరిగాయనిపిస్తుంది. అంత గొప్ప నెరేషన్ స్టైల్ నాకు ఇరాన్ సినిమాల్లో కూడా మళ్లీ కనిపించలేదు. ది బెస్ట్ వన్.

2. బరాన్

ఇదీ ఇరాన్ సినిమానే. లవ్ స్టోరీ అంటే ఇది కదా అనిపిస్తుంది. చూసి ఇన్నేళ్లు అయినా వర్షంలో పాదాల అడుగుల్లో నీళ్లు నిండే సీన్ కళ్లల్లో నిలిచిపోయింది. అది కదా డైరక్టర్ టచ్ అంటే.. వాట్ ఏ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.. మళ్లీ ఇది రాస్తుంటే ఇంకోసారి చూడాలనిపిస్తోంది.

3. రింగు జపాన్ ఫిల్మ్

నాకు ఈ సినిమా చాలా ఇష్టం.. కారణం సినిమాలో ఓ పజిల్.. దాన్ని రిజాల్వ్ చేయటమే సినిమా క్లైమాక్స్ కావటం. ఇలాంటి పజిల్ ట్విస్ట్.. మన మెదుడుకు పదును పెట్టేవి హారర్ ఫిల్మ్ లలో నేను ఎప్పుడూ చూడలేదు..ఆ జానర్‌లో ఇదే టాప్ అనిపిస్తుంది.

4. లూపర్

టైమ్ ట్రావెలింగ్ మీద వచ్చిన ఈ సినిమా ఓ అద్బుతమే. సినిమా ఈ జానర్ ఫిల్మ్‌లకు తల్లిలాంటిదనే చెప్పాలి. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ మంచి డ్రామాతో మొదలుపెడితే చివరి దాకా చూడాల్సిందే. ఆలోచనలో పడాల్సిందే.

5. ‘హరిశ్చంవూదాచి ఫ్యాక్టరీ’

ఇదో మరాఠి సినిమా. దాదా ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాని తీసే క్రమంలో ఎదురైన సంఘటనల సమాహారమే! బేసిక్‌గా నాటకాల నుంచి వచ్చిన దర్శకుడు పరేష్ మొకాషీ.. సినిమా డైరక్ట్ చేద్దామని ఓ కథ పట్టుకుని తిరుగుతూంటే నాటకాల వాడని, మరాఠి వాడు, సినిమా అనుభవం లేని వాడని చిన్న చూపుతో కథ వినటానికి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదట. దాంతో ఓ సమయంలో నిరాశలో.. ‘సినిమా అనేది ఇంత డెవలప్ అయి, అందరికీ సినిమా అంటే తెలిసిన ఈ రోజుల్లోనే ఓ స్క్రిప్టు ఓకే చేయించుకుని సినిమా తీయటం ఇంత కష్టంగా ఉంది – అలాంటిది మహానుభావుడు దాదా ఫాల్కె సినిమా అంటే ఎవరికీ ఎమీ తెలియని రోజుల్లో అన్ని సినిమాలు ఎలా తీసాడు, తొలి సినిమా ఎలా చేసాడో’ అనిపించిందిట. అక్కడ నుంచి అదే విషయమై రీసెర్చ్ చేసి, స్క్రిప్టు రాసారట. ఇది వినటానికే ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది.

6. ‘1917’

ఇదో వార్ బయోపిక్ లాంటిది. యుద్ధంలో, మనుష్యులు.. జీవన సంక్షోభాన్ని దగ్గర నుంచి చూస్తారు. కలలో కూడా ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేయటం ఏమిటో అర్థం చేసుకుంటారు . ఇవన్నీ చూపటం కేవలం యుద్ధ చిత్రాల్లోనే సాధ్యం, ఈ సినిమాలో ఆ అంశాలు అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అందుకే ఈ సినిమా నచ్చింది.

7. ‘వాట్‌ హాపెన్డ్ టు మండే‌’

ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా మామూలుగా చూస్తే ఓ మామూలు సినిమా. కానీ కాన్సెప్టు పరంగా హై ఎండ్ ఫిల్మ్.. ఈ సినిమా ఆర్టికల్ చదివి భీమవరం నుంచి ఓ డాక్టర్ గారు సినిమా చేద్దామా ఈ కాన్సెప్టుని అని ఫోన్ చేసి అడిగారు. అంతలా చాలా మందికి నచ్చేసింది ఈ సినిమా. నాకు నచ్చింది. అంతమందికి నచ్చిందంటే ఆనందమే కదా. భవిష్యత్తులో సాగే కథనం, చాల ఆశ్చర్యకరమైన అంశాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కొంత విజ్ఞానాన్ని, మరికొంత వినోదాన్ని అందిస్తూ సాగిపోయే ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

8. ‘సస్పెక్ట్ X’

ఇది కదూ థ్రిల్లర్ సినిమా అంటే.. సినిమా మొదలెట్టామంటే చివరిదాకా చూడాల్సిందే. ఆ తర్వాత కొద్ది గంటలు ఆ డైరక్టర్, కథ గురించి ఆలోచనలలో పడిపోవాల్సిందే. క్రైమ్‍కు ప్రభావితం అయ్యే పాత్రల సైకాలజీ, సోషల్ డైనిమిక్స్ తెగ నచ్చేస్తాయి. నవలను ఎంత బాగా ఎడాప్ట్ చేయచ్చు.. ఓ సస్పెన్స్ సినిమాను ఎంత బాగా తెరకెక్కించవచ్చు అనే విషయంలో ఇది నాలాంటి వాళ్లకు పాఠం.

9. Notorious (1946)

మాస్టర్ సస్పెన్స్ ఫిల్మ్ మేకర్ హిచ్‌కాక్ చేసిన ఈ సినిమా మీద ఆర్టికల్ చదివి.. యండమూరి ఫోన్ చేయటం నాకు గుర్తుండిపోయింది. ఆయన ఓ నవల ఇంట్రో రాసినట్లు రాసావు అంటూ మెచ్చుకున్నారు. మన అభిమాన దర్శకుడు సినిమా గురించి ఆర్టికల్ రాస్తే మన అభిమాన రచయిత మెచ్చుకోవటం ఆనందమే. ఈ సినిమా ఎంత గొప్పది అంటే ఈ చిత్రం తర్వాత హిచ్‌కాక్ డైరక్షన్ స్టైల్ మారిపోయింది. ఆయన కెమెరా వర్క్ మరింత ఎక్సప్రెసివ్ గానూ, ఎమోషన్స్ సంక్లిష్టంగానూ, క్యారక్టర్స్ నిబద్దతతోనూ ఉండేలా డిజైన్ చేయటం మొదలెట్టారు. ఒకటి మాట్లాడితే వేరొక అర్థం వచ్చేలా డైలాగులు, పాత్రల మధ్య నిశ్శబ్దంతోనే సంభాషణ జరగటం వంటివి కూడా ఈ సినిమాతోనే ఆయన అంకురార్పణ చేసారు. మామూలుగా ఉండదు మరి.

10. ది ఫస్ట్ గ్రేడర్ (2010)

84 సంవత్సరాల వయో వృద్ధుడు తన జీవిత చరమాంకంలో అక్షరాలు దిద్దటానికి ఎలిమెంటరీ స్కూల్‌కు వెళ్లడం, అక్కడొచ్చే సమస్యలే ఈ సినిమా కథ. ఇది నిజ జీవితంలో జరిగినదే. ఎంతో అద్బుతమైన నేరేషన్‌తో ఈ బయోపిక్‌ని మనకు అందించారు. నా సినీ ఆర్టికల్స్ అన్ని ఒకెత్తు.. ఈ సినిమా ఆర్టికల్ ఒకెత్తు అనిపిస్తుంది. ఎమోషనల్‌గా డైరక్ట్‌గా మన గుండెలను తాకే ఇలాంటి సినిమా ఎందుకు నచ్చింది అంటే కారణం ప్రత్యేకంగా చెప్పాలా అయినా?

ప్ర: ప్రసిధ్ధి పొందిన పలు చిత్రాలను పరిచయం చేసిన మీరు, స్టాన్లీ కుబ్రిక్ సినిమా 2001 ఎ స్పేస్ ఒడిస్సీ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాను వదలివేయటం సమంజసమా? బెన్ హర్, సిటిజెన్ కేన్, పల్ప్ ఫిక్షన్, గాన్ విత్ ద విండ్, మౌలిన్ రోజ్ వంటి సినిమాలను వదిలి, హాలీవుడ్ సినిమాల నడుమ బ్లాక్, అరువి, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాలను చేర్చటం అనౌచిత్యం కాదా? ఇందుకేదయినా ప్రత్యేక కారణం వుందా?

జ: మీకు తెలియనది ఏముంది.. కొన్ని సినిమాలు.. మన కోసం కాకపోయినా.. ఫలానా సినిమా గురించి రాయండి అని అడిగిన వారి గురించి రాయాల్సి వస్తుంది. వాటిని పుస్తకంలో వేసినప్పుడు తీసివేయటం జరిగింది. అలాగే మీరు చెప్పిన సినిమాల గురించి రాసేలోగా పత్రిక ఆగిపోయింది.. నేనే నాలుగో పార్ట్‌లో ఇలాంటి మరిన్ని గొప్ప సినిమాలు గురించి రాయాలి. ఆ విషయం ప్రముఖ రచయిత సత్యానంద్ గారు కూడా ప్రస్తావించారు.. ఆయన సూచనే అది.. పత్రిక ఆగిపోతేనేం.. సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని రాయటం ఆపద్దు అని.. కాబట్టి నెక్ట్ పార్ట్‌లో మీరు చెప్పిన సినిమాలు గురించి ఖచ్చితంగా ఆర్టికల్స్ ఉంటాయి.

ప్ర: సినిమాల గురించి ఇన్ని రకాల విషయాలు రాశారు, మీకు సినీ రంగంతో పరిచయం వుందా? సినీ రంగంలో మీ అనుభవాలేమిటి?

జ: సినిమా రంగంతో పదిహేనేళ్ల ప్రత్యక్ష అనుబంధం ఉంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర ఐదేళ్లు పనిచేయటం జరిగింది. ఆయన దగ్గర ఉండగానే ఆయన ‘నా ఇష్టం’ పుస్తకం ఎడిటింగ్ కూడా చేసాను. ఆ తర్వాత స్రవంతి బ్యానర్‌లో హీరో రామ్‌కు కథ ఓకే చేయించుకుని కొంతకాలం స్క్రిప్టు వర్క్ చేసాను (అది వేర్వేరు కారణాలతో మెటీరియలైజ్ కాలేదు). సుడిగాడు వంటి చాలా సినిమాలు ఘోస్ట్ రైటర్‌గా వెర్షన్స్ రాస్తూ వచ్చాను. డైరక్షన్ ట్రైల్స్ వేసాను.. మధ్యమధ్యలో సహ రచయితగా ఆడు మగాడ్రా బుజ్జీ, మిస్టర్ కింగ్, జాతిరత్నాలు, ప్రిన్స్, దిల్ రాజు గారి బ్యానర్‌లో ఒకటి చేసాను.. చేస్తున్నాను.. సినిమా రంగంలో ఎదిగిపోలేదు కానీ కొంత ఆర్థిక సాయం అయితే అందుకున్నా స్క్రిప్టు వర్క్‌ల వల్ల, స్క్రిప్టు కన్సల్టెంట్‌గా.

ప్ర: భవిష్యత్తులో మీ రచనా ప్రణాళికలేమిటి?

జ: జోశ్యుల పబ్లికేషన్స్‌లో ఇప్పటికే హిచ్‌కాక్ నోలన్ మూడు పుస్తకాలు తెచ్చాను.. మరిన్ని భాగాలు తీసుకువస్తాను. అలాగే ‘వీడే బాలా’ అనువాదం తెచ్చాను. ఇప్పుడు భాగ్యరాజా గారు స్క్రీన్ ప్లే మీద రాసిన ఓ తమిళ పుస్తకం తెలుగులోకి తెస్తున్నా.. ఎప్పటిలాగే సినిమా రివ్యూలు రాసుకుంటున్నాను. సినిమాలకు రచన చేస్తాను.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే పెద్ద హీరోతోనే సినిమా ఉండే అవకాశం ఉంది.

~

సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని కేటాయించి సంచికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారూ.

జోశ్యుల సూర్యప్రకాశ్: ధన్యవాదాలు మీకు, బహు కృతజ్ఞతలు!

***

హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా (మూడు భాగాలు)
రచన: జోశ్యుల సూర్య ప్రకాశ్
ప్రచురణ: జోశ్యుల పబ్లికేషన్స్
పుటలు: (232+184+184)
వెల: ఒక్కో భాగం ₹ 250. సెట్ ₹ 750
ప్రతులకు:
రచయిత: 9704683520
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Hitchcock-Nolan-Books-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2/dp/B0BW4BYNB4

 

Exit mobile version