[‘తెలంగాణ చరిత్ర మూలాలు’ అనే పుస్తకం వెలువరించిన కట్టా శేఖర్ రెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము. సంచిక టీమ్ తరఫున శ్రీ కోవెల సంతోష్ కుమార్ ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.]
సంచిక టీమ్: కట్టా శేఖర్ రెడ్డి గారూ.
కట్టా శేఖర్ రెడ్డి: నమస్కారం.
~
ప్రశ్న 1: తెలంగాణ అస్తిత్వ మూలాల అన్వేషణ పరిశోధనలో ఒక జర్నలిస్టుగా ఒక సాధికారిక రిసోర్స్ గ్రంథంగా మీరు ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ అన్న గ్రంథాన్ని వెలువరించినందుకు మీకు అభినందనలు. ఈ శీర్షిక వెనుక మీ లక్ష్యం ఏమిటి? మీ దృష్టిలో తెలంగాణ, ఆంధ్ర రెండూ వేర్వేరు అస్తిత్వాలు కలిగి ఉన్నాయని భావిస్తున్నారా?
ప్రశ్న 2: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల సమయంలో ఆవేశకావేశాలకు లోనై వేర్వేరు భావనలు రావచ్చేమో.. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇరు రాష్ట్రాల ప్రజలు ఎవరికి వారు అభివృద్ధి చెందుతూ కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మీరు ఈరోజు ఈ గ్రంథం తీసుకొని రావడం వల్ల మళ్లీ కొత్తగా వివాదం సృష్టించినట్టు కాదా? ఈ గ్రంథం లక్ష్యం ఏమిటి?
జ: వివాదం సృష్టించడం, ఎవరో ఒకరిని తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కాదు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం జరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది సరే. తెలంగాణ అన్న పదం ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చింది? దానికి మూలధాతువు ఏమిటి? తెలుగు పదం ఎప్పటి నుంచి ఉంది? తెలింగ లేక తెలుంగు అన్న పదాల పుట్టుక ఎప్పడు? వంటి ప్రశ్నలు నన్ను వెంటాడాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఒక తమిళుడు చెన్నయి హైకోర్టులో కేసువేసినప్పుడు మరింత పట్టుదల పెరిగింది. ఆవేశకావేశాలతో కాకుండా ఇష్టంతో ఈ శోధన చేశాను. మునుపెన్నడూ నేను చదవని అనేక కొత్త కోణాలు, ఆధారాలు లభించాయి. రెండు ప్రాంతాల భాష తెలుగు. జాతి తెలుగు. తెలుగు, తెలంగాణ మూలాలను తరచి చూడడం మంచిదే కదా.
ప్రశ్న 3: తెలుగు, తెలుంగు, త్రిలింగ, ఆంధ్ర శబ్దాలపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి.. మీరు ఈ గ్రంథంలో వినూత్నంగా చెప్పింది ఏమిటి?
జ: తెలుగు, తెలంగాణ పదాల మూలధాతువు ఏది? ఎప్పటి నుంచి ఈ పదాలు ఉన్నాయి? జాతి, దేశ, భాషా వాచకాలుగా అవి ఎలా పరిణమించాయి? ఇప్పటిదాకా మనం చదువుకున్న భాషా చరిత్రలో తెనుగు అన్న పదమే తొలుతదని, ఆ పదాన్ని తొలుత నన్నయ మహాభారత రచనలో ప్రయోగించారని, కాలక్రమంలో న కారం ల కారంగా రూపాంతరం చెంది తెనుగు తెలుగు అయిందని సూత్రీకరిస్తూ వచ్చారు. అది సరికాదని, నన్నయకు ముందు నుంచి తెలుగు పూర్వ రూపాలు తెలుంగు, తెలింగ, తిలింగ, తలైంగ అన్న పదాలు జాతి, భాష, దేశ వాచకాలుగా ఉపయోగంలో ఉన్నాయని, తెలుగు భాషకు ప్రాచీన చరిత్ర ఉందని చెప్పడమే నా ఉద్దేశం. ఆంధ్ర అన్న పదానికి ఉన్న పూర్వ చరిత్ర తెలుగుకు కూడా ఉన్నదని లభించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
ప్రశ్న 4: తెలంగాణ మూలాల అన్వేషణ ప్రారంభించినప్పుడు ఆంధ్ర శబ్ద విచారణ ఎందుకు చేయాలి?
జ: తెలుగు, తెలంగాణ భావనలను ఆంధ్ర భావన వివిధ రూపాల్లో ఆవరించింది. ఆంధ్ర ఛత్రచ్ఛాయలో తెలుగు, తెలంగాణ భావనలు అడుగున పడిపోయాయి. తెలుగు భాష, సాహిత్యం అన్న మకుటాలు మరుగునపడి ఆంధ్ర భాష, ఆంధ్ర సాహిత్యం అన్నవి పీఠాలను ఆక్రమించాయి. ఆంధ్ర అన్నది జాతి, దేశ్య వాచకంగా వాస్తవమే. చరిత్ర, సంస్కృతీ గొప్పవే. కానీ అది భాషా వాచకం కాదు. తెలుగుకు ఆంధ్ర పర్యాయపదం కూడా కాదు. మారుపేరు. ఆ పొరలన్నీ విప్పకుండా, ఆ మబ్బులను పక్కకు జరుపకుండా తెలుగును, తెలంగాణను తేటపర్చడం ఎలా?
ప్రశ్న 5: ఆంధ్ర శబ్దం ప్రాచీన ఇతిహాసాల నుంచి వినిపిస్తున్నది. తెలుగు శబ్దం పదో శతాబ్దం కంటే ముందు వినిపించటం లేదన్న వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా?
జ: పేచీ అంతా ఈ భావనలోనే ఉంది. ఆంధ్ర అన్న పదం ఐత్తరేయ బ్రాహ్మణంలో, భారత, రామాయణాల్లో ఉన్నమాట వాస్తవమే. తెలుగు, తెలింగ, తిలింగ అన్న పదాలు పదవ శతాబ్దానికి ముందులేవన్నదే అసత్యం. మహాభారతంలో తలవానులని ఒక జాతి ప్రస్తావన ప్రతిసందర్భంలో ఆంధ్ర, విదర్భ, కళింగలతో కలిసి కనిపిస్తుంది. తలవానులెవరన్న పరీక్ష ఎవరూ చేయలేదు. షేఫర్ అన్న ఒక పాశ్చాత్య పండితుడు ఇది తెలుగు వారి ప్రస్తావనే అని రాశారు. బౌద్ధ జాతక కథల్లో గోదావరిని తెలివాహ నదిగా ప్రస్తావించారు. తెలివాహ ప్రాంతవాసులే తలవానులా అన్న మీమాంస చేయలేదు. అస్మక జనపదం ప్రస్తావన బ్రాహ్మణాలు, ఇతిహాసాలు, పురాణాలు అన్నింటిలో కనిపిస్తుంది. ఆ జనపదం తెలంగాణ నుంచే పరిపాలన సాగించింది. అది తెలుగు ప్రజల మూల చరిత్ర కాకుండా పోయింది. అంతదూరం వద్దను కుంటే, పాశ్చాత్య పర్యాటకుల ట్రిలింగాన్ ప్రస్తావననయినా పట్టించుకోవలసింది. ఆంధ్ర జాతి గురించి అవే గ్రంథాలు చెప్పిన అంశాలను గొప్పగా స్వీకరించి, తెలుగు ప్రాశస్త్యాన్ని ఎందుకు విస్మరించినట్టు. ఆ తర్వాత పురాణాధారాలు. ఆంధ్ర జాతి గురించి చెప్పిన పురాణాలన్నీ తెలుగు జాతి మూలాలను గురించి కూడా చెప్పాయి. స్కంద, మార్కండేయ, వాయు, బ్రహ్మాండ, పద్మ పురాణాలు తిలింగ, తైలంగ, త్రిలింగాస్య జాతి, దేశ్య ప్రస్తావనలు చేశాయి. వాటిని ఎందుకు విస్మరించారు? పదవ శతాబ్దానికి ముందు, అంటే నన్నయకు ముందు నుంచే తెలుగు భాష ఉంది. పద్య శాసనాలు ఉన్నాయి. వేములవాడ కేంద్రంగా గొప్ప సాహితీ సృజన జరిగింది. తెలుంగుకు సంబంధించిన శాసనాధారాలు, గ్రంథాధారాలూ ఉన్నాయి.
ప్రశ్న 6: ఆంధ్ర చరిత్రకారులు తెలంగాణ మీద చూపించింది విస్మరణ మాత్రమే తప్ప వ్యతిరేకత కాదని, వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తమ సాంస్కృతిక చారిత్రక అస్తిత్వంపై దృష్టి పెట్టారే తప్ప తెలంగాణ అవసరం ఆనాడు లేకపోయిందని ముందుమాటలో కే శ్రీనివాస్ రాసిన మాటలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: వ్యతిరేకతతో జరిగిందని నేను కూడా అనుకోవడం లేదు. ముందుగా తమను తాము చాటుకునే ప్రయత్నమే జరిగింది. తమ అస్తిత్వ పతాకను ఎగురవేసే ప్రయత్నంలోనే మూలాల వెదుకులాట జరిగింది. స్వరాష్ట్ర నినాదాన్ని తొలుత ఎత్తుకున్నది ఆంధ్ర ప్రాంతమే. ఆంధ్ర మహాసభ ఏర్పడింది అక్కడే. ఆ తర్వాత తెలంగాణ గడ్డపైన కూడా అదే స్ఫూర్తితో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది కూడా ఆంధ్ర మహాసభ వేదిక నుంచే. కానీ ఆ తర్వాత చరిత్ర రచన, అస్తిత్వ ప్రతీకల వ్యవస్థాపన, ఆ క్రమంలో కొన్ని అస్తిత్వాలకు పట్టాభిషేకం, మరికొన్ని అస్తిత్వాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అది ఒకరిని ఒకరు అవమానించుకునే దాకా వెళ్లింది. క్రమంగా చరిత్ర రచనతో పాటు ప్రాంతీయ అస్తిత్వాలను గుర్తించడం వరకు అన్ని రంగాలలో విస్మరణగానీ, వివక్షగానీ తోడైంది. అది చివరకు తెలుగును పక్కకు జరిపి ఆంధ్ర అన్న భావనకు ప్రధాన పీఠం వేసే దాకా వెళ్లింది. ఆంధ్ర పద మూలాల అన్వేషణ కోసం జరిగిన ప్రయత్నాలేవీ తెలుగు పద మూలాలకోసం జరుగలేదు. జరిగినా లభించిన మూలాలను అంగీకరించలేదు.
ప్రశ్న 7: ఈ గ్రంథంలో మీరు ఒక చోట అన్నట్టు ఆంధ్ర ప్రాంత మేధావులు తమ అస్తిత్వ మూలాల అన్వేషణ దాదాపు 80 ఏండ్ల క్రితం నుంచే తీవ్రంగా చేసినట్టు చెప్పారు. మరి తెలంగాణ మేధావులు ఇంతవరకూ ఏమీ చేయలేదంటారా? కనీసం రాష్ట్రం వచ్చిన తరువాతైనా ఎందుకు ఏమీ జరుగలేదు?
జ: నిజమే. తమ మూలాల అన్వేషణ ఆంధ్ర ప్రాంత మేధావులు ముందుగా ప్రారంభించారు. మద్రాసు రాష్ట్రంలో ఉండడం వల్ల ఆంగ్ల విద్యకు, మాతృభాషలో చదువుకోవడానికి ముందుగా వారికి అవకాశం వచ్చింది. పరిశోధనకు, ప్రపంచంతో సంభాషించడానికి వారికి అవకాశాలు ఎక్కువగా లభించాయి. మెకెంజీలు, సీపీ బ్రౌన్లు అక్కడే తమ శోధన చేపట్టారు. చరిత్ర పరిశోధన, రచన కూడా ముందుగా అక్కడే జరిగింది. తెలంగాణలో ఈ క్రమం అంతా ఆలస్యంగా మొదలయింది. తెలంగాణ 1940ల నుంచి 1970ల దాకా పోరాట రంగంలోనే ఉండిపోయింది. తొలి మలి తెలంగాణ ఉద్యమాలే మన మూలాలను వెదక్కునే చైతన్యాన్ని ఆరాటాన్ని పెంపొందించాయి. 1980ల నుంచి ఇప్పటి దాకా చాలా మంది తెలంగాణ సాహితీ, సాంస్కృతిక, చారిత్రక పేగుబంధాలను దొరకబట్టుకోవడానికి కృషి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక సైన్యమే ఆ పనిమీద ఉన్నది. ఇంకా చేయవలసింది చాలా ఉంది. సేకరించాల్సింది, చెప్పుకోవాల్సింది, చాటుకోవాల్సింది చాలా ఉంది.
ప్రశ్న 8: మీరు ఒక జర్నలిస్టు. మీరు చరిత్రలో పట్టభద్రులు కారు. కానీ మీరు వృత్తి రీత్యా చరిత్రకారులకు ఉన్న స్థాయిలో ఈ పరిశోధన చేశారు. ఎట్లా సాధ్యం?
జ: నేను చరిత్ర విద్యార్థిని కాదు. భాషా శాస్త్రమూ చదవలేదు. జర్నలిస్టుగా అన్నీ తెలిసుండాలన్న స్పృహ ఉన్నవాడిని. జర్నలిస్టుగా చదవడం, శోధించడం, సేకరించడం, విశ్లేషించడం, తిరిగి రాయడం అలవాటు. రెండు సందర్భాలు నాకు ఈ రచన చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. ఒకటి తెలుగు పదానికి మూల పదం తెనుగు అని, ఆదికవి నన్నయ తొలుత తెనుగు పదమే ఉపయోగించారని, తెనుగులో న కారం లుప్తమై ల కారం ప్రవేశించి తెలుగు అయిందన్నది చాలాకాలంగా చదువుకుంటున్న సూత్రీకరణ. రెండవది తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇచ్చినప్పుడు దానిని సవాలు చేస్తూ ఒక తమిళ మేధావి చెన్నయి హైకోర్టులో వేసిన దావా. తెలుగు అంత ప్రాచీన భాష ఏమీ కాదని, దాని చరిత్ర వెయ్యేళ్లేనని, తమిళంతో సమానంగా తెలుగుకు హోదా ఇవ్వడం ఏమిటన్నది ఆయన వాదన. ఈ రెండు అంశాలు తెలుగు ఎప్పటి నుంచి ఉందన్న ప్రశ్నను రేకెత్తించాయి. నన్నయకు ముందు తెలుగు లేదా? తెలుగు చరిత్ర వెయ్యి సంవత్సరాలేనా? ఈ ప్రశ్నలు ములుకుల్లా పొడుస్తూ వచ్చాయి. తెలుగు పూర్వ పదాల ప్రస్తావన ఏయే కాలాల్లో ఏయే రూపాల్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఈ దారిలో తెలంగాణ మేధావులు కొందరు ఇప్పటికే కృషి చేశారు. ఆచార్య ఎస్వీ రామారావు, డాక్టర్ కె. శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగనభట్ల నర్సయ్య, ఇంకా పలువురు తమ రచనలు వెలువరించారు. ఆ రచనలు నాకు మార్గదర్శకాలయ్యాయి. మరింత వెనుక కాలానికి వెళ్లడానికి, మరిన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నించాను. జర్నలిస్టుగా వుండే ఆసక్తే నన్నీ ప్రయత్నంలో ముందుకు నడిపించింది. నా రచన ఇప్పటికీ ఒక ముసాయిదా(డ్రాఫ్ట్) అనే నేను భావిస్తాను.
ప్రశ్న 9: మీ దృష్టిలో తిలింగ లేదా త్రిలింగ, త్రికలింగ శబ్దాలు భాషా వాచకమా? లేక జాతి, ప్రాంత వాచకమా?
జ: తెలంగలు, తెలింగులు, తెలుంగులు, తిలింగులు, తలైంగులు అనే ఒక జాతి ప్రజలు ఇక్కడ నివసించారు. వారు మాట్లాడిన భాష తెలుంగు, తెనుగు, తెలింగ భాష అయింది. వారు ఏలిన ప్రాంతం తిలింగ భూమి, త్రిలింగభూమి, తెలుగు దేశం అయింది. ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు త్రిలింగ దేశాధీశ్వరులు, త్రిలింగ స్థితిపతులు అని ప్రశస్తినొందారు.
ప్రశ్న 10: మీ రచనలో దాదాపు 8వ శతాబ్దం నుంచి తెలుగు పద వ్యుత్పత్తికి సంబంధించి అనేక ఆధారాలను చూపించారు. మీ పరిశోధన ప్రకారం తెలుగు వ్యుత్పత్తి ఎంత ప్రాచీనమైనదని అనుకుంటున్నారు?
జ: తెలుగు భాష మూలాలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయి. క్రీస్తు పూర్వం రెండు-నాలుగు శతాబ్దాల కాలంలో రాసిన ప్రాకృత గాథాసప్తశతిలో తెలుగు పదాలు ఉన్నాయి. కలమళ్ల శాసనం ఐదవ శతాబ్దం నాటికే ఉంది. రాజులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషలనే పైశాచి భాష అని పిలిచారు. ప్రజల భాషలు అనాదరణకు గురయ్యాయని చెప్పడానికి గుణాఢ్యుడు రాసిన బృహత్కథకు ఎదురైన అవమానమే ఉదాహరణ. ఆ తర్వాత కాలక్రమంలో ప్రాకృతం, పైశాచి భాషల సమ్మేళంగా భాషలు అభివృద్ధి చెందాయి. తొలి శకాలకు సంబంధించిన లిఖిత, సాహితీ ఆధారాలు లేనంత మాత్రాన భాష లేదని వాదించడం సరికాదు. ఇంకా దొరకాల్సిన ఆధారాలు చాలా ఉన్నాయి. తమిళ వ్యాకరణ గ్రంథం అగత్తియంలోనే తెలుంగం ఒక భాషా వాచకంగా ప్రస్తావన ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అగత్తియం చాలా ప్రాచీన రచన. అయితే అది లిఖిత ఆధారంగా లభించలేదని, ఆ ప్రస్తావన ఒక ఆధారంగా గుర్తించలేమని పూర్వ పరిశోధకులు వాదించారు. బాదామీ చాళుక్యులు మహబూబ్‌నగర్‌లో వేసిన శాసనాలు తెలుగులో లభించాయి. వాటి శాసనకాలం మాత్రం లభించలేదు. మహబూబ్‌నగర్ బీచుపల్లి, నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద లభించిన శాసనాల్లో కూడా తొలినాళ్ల తెలుగు ఉంది. లిపి, భాష, పద సంపద లేకుండా నన్నయ నేరుగా మహాభారత అనువాదానికి పూనుకుని ఉండరు. ఆయనకు ముందు కూడా సాహిత్యం ఉంది. పద్య శాసనాలు లభించాయి. వేములవాడ కేంద్రంగా జరిగిన సాహితీ సృజన గురించి చాలా కొత్త విషయాలు మన రచయితలు బయటికి తీస్తున్నారు.
ప్రశ్న 11: ఇతిహాసాలలో వింధ్య సానువులకు దిగువన అస్మక మహా జనపదం ఉన్నట్టు కూడా ఉన్నది. దానితో పాటుగా తలవానులు ఉన్నారని కూడా మీరు పేర్కొన్నారు. అస్మక మహాజనపదంలోనే తలవానులు ఉండేవారా? తలవానులు తెలంగాణ మూలవాసులని భావించాలా?
జ: ప్రాచీనత అన్నది జాతి గొప్పకు కొలమానంగా భావిస్తున్నారు. వింధ్యకు ఈవల అస్మక జనపదం ఉంది. అది గోదావరి-మంజీరా నదుల మధ్య ఆవృతమై ఉందని, దానికి పోదన లేక బోధన రాజధానిగా ఉండేదని ఇతిహాసాల్లో, బౌద్ధ జాతక కథల్లో ప్రస్తావన ఉంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ప్రాంతాలు అస్మకలో భాగంగా ఉండేవని, బ్రహ్మదత్తుడనే రాజు ఆ ప్రాంతాన్ని పాలించాడని ప్రస్తావనలు ఉన్నాయి. మరి ఆ వృత్తాంతం తెలంగాణ చరిత్రలో భాగం కాకుండా ఎందుకు వదిలేశారు. మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. తెలుగులు లేక తెలింగుల ప్రస్తావన లేదని చెబుతూ వచ్చారు. ఆంధ్ర, విదర్భ, కళింగుల ప్రస్తావన వచ్చిన సందర్భంలో తలవానులు లేక తాలవానుల పేరుతో ఒక జాతిని మహాభారతంలో ప్రస్తావించారు. తలవానులు తెలింగులేనని థామస్ షేఫర్ అనే ఒక పాశ్చాత్య నిపుణుడు రాశారు. ఆ అంశాన్ని ఎందుకు వదిలేశారు. బౌద్ధ వాజ్ఞ్మయంలో తెలివాహ నది పేరు ఉంది. తెలివాహ నది గోదావరికి మరో పేరు అని చరిత్ర పరిశోధకుడు సంగనభట్ల నర్సయ్యగారు ఒక పత్రం సమర్పించారు. తెలివాహ నదీ తీర వాసులు తెలింగులు కావచ్చు కదా. ఆంధ్ర అన్న పదానికి అయినా, తెలుగు అన్న పదానికి అయినా తొలిరూపాలు వేర్వేరుగా ఉన్నాయి. అంధక, అందరే, అంధ్ర వంటి పదాలు క్రీస్తుశకం 15 నాటికి ఆంధ్ర రూపం తీసుకున్నాయని చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ రాశారు. అలాగే తెలుగు రూపానికి తలవాన, తెలివాహ, తలైంగ, తెలింగ వంటి పదాలు పూర్వ రూపాలు కావచ్చు.
ప్రశ్న 12: గోదావరి నదిని తెలివాహ నది అని మీరు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. దీని గురించి వివరించండి.
జ: తెలివాహ నది గురించి నేను ప్రతిపాదించలేదు. ఆ ప్రస్తావన బౌద్ధవాఙ్మయంలో ఉంది. చరిత్ర పరిశోధకుడు సంగనభట్ల నర్సయ్యగారు అది గోదావరి నదేనని రాశారు. ఈ అంశంపై ఇంకా శోధన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తేలి నది ఒరిస్సాలో ఉంది. ఆ నది తీరంలోనే అంధకాపురం అనే ఒక పట్నం ఉన్నట్టు కూడా జాతక కథల్లో ఉంది. ఈ చిక్కును విడదీయవలసిన అవసరం ఉంది.
ప్రశ్న 13: తెలుగు సాహిత్యంలో కవులు కూడా ఆంధ్ర, త్రిలింగ భావనలను పరస్పర ఆలంబనగా ఉపయోగించారు కదా.. ఈ రెండు భావనల మధ్యన అంతరాన్ని మీరు ఎలా చూస్తారు?
జ: తెలుగు, ఆంధ్ర జాతులది వేల యేళ్ల చరిత్ర. జాతులు, ప్రాంతాలు కలసి ప్రయాణం సాగించాయి. కలిసిపోవడాలు, విడిపోవడాలు చరిత్ర అంతటా జరిగాయి. తెలుగు జాతి, భాష, దేశం అందరిది, విశాలమైనది. ఆంధ్ర దేశానికి పరిమితులు ఉన్నాయి. అయినా ఆధునిక చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర మహాసభ పేరు పెట్టుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించాయి. ఏయే పరిస్థితుల్లో, ఏయే ప్రభావాల్లో ఆధిపత్యాలు ఏర్పడతాయో వర్తమాన అనుభవం నేర్పింది. అదే తెలంగాణ మా అస్తిత్వం వేరు అని కొట్లాడి వేరుపడడం చూశాం.
ప్రశ్న 14: విస్మరణకు గురైన తెలంగాణ చరిత్ర మూలాల అన్వేషణలో భాగంగా ఈ గ్రంథం వచ్చినట్టు అనిపిస్తుంది. తెలంగాణ చరిత్ర మూలాల అన్వేషణకు ఇది ఎంతవరకు ఆధార స్తంభంగా నిలబడుతుందని మీరు భావిస్తున్నారా?
జ: విస్మరణకు గురైంది ఒక్క తెలంగాణ చరిత్రే కాదు. తెలుగు చరిత్ర కూడా. తెలుగు మూలాల నుంచి తెలంగాణ ఏర్పడింది. తెలుగు, తెలంగాణ పద మూలాలకు సంబంధించి వీలైనన్ని పురాణ, గ్రంథ, శాసన ఆధారాలు సేకరించి పొందుపరిచాను. తెలుగు, తెలంగాణ గురించి మరింత శోధన చేయడానికి ఇది ఆధారభూతంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ముందే చెప్పినట్టు ఇది ఒక ముసాయిదా మాత్రమే. శోధించాల్సింది చాలా ఉంది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కట్టా శేఖర్ రెడ్డి గారూ.
కట్టా శేఖర్ రెడ్డి: ధన్యవాదాలు.
***
రచన: కట్టాశేఖర్ రెడ్డి
ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు
ధర: ₹ 300/-
ప్రతులకు:
తెలంగాణ ప్రచురణలు,
1వ అంతస్తు, ఇంటి నంబర్ 1-1-80/15
ఆర్టీసీ క్రాస్ రోడ్స్,
ముషీరాబాద్,
హైదరాబాద్ 500020,
ఫోన్ నం. 8639972150
~
‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/telangana-charitra-moolaalu-book-review-ksk/

