Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘కొప్పర్తి కవిత్వం’ అనే కవితాసంపుటి వెలువరించిన కొప్పర్తి వెంకటరమణమూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కొప్పర్తి వెంకటరమణమూర్తి గారూ.

కొప్పర్తి వెంకటరమణమూర్తి: నమస్కారం.

~

ప్రశ్న 1: కొప్పర్తి కవిత్వంపుస్తకం వెలువరించినందుకు అభినందనలు. గతంలో ప్రచురించిన మూడు సంపుటాలను ఇప్పుడు ఒకే పుస్తకంగా తీసుకురావడం వెనుక మీ ఆలోచనని వివరిస్తారా?

జ: అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి – నేను నా ‘పిట్టపాడే పాటకోసం’ కవితాసంపుటిని 1991 లో, ‘విషాదమోహనం’ సంపుటిని 2003 లో, ‘యాభై ఏళ్ళ వాన’ ను 2015 లో వేశాను. 2010 తర్వాత తెలుగు కవిత్వంలోకి ఒక కొత్త తరం ప్రవేశించింది. అది ఆలోచనల్లో అభివ్యక్తిలో కొత్త పుంతలు తొక్కుతున్న భిన్నమైన తరం. వాళ్ళలో కొందరు నా ‘యాభై ఏళ్ల వాన’ను చదివారు. అందులోని కవితలు కొన్ని వాళ్ల మధ్య చర్చనీయాంశాలయ్యాయి. వాళ్ళు నా ముందరి కవితాసంపుటాలు చదవాలనుకుని నన్నడుగుతూ వచ్చారు. అవి నా దగ్గర కూడా లేవు. నాలుగైదేళ్ళుగా వాయిదా వేస్తూ వచ్చిన నేను అన్నీ కలిపివేస్తే ఇప్పటివరకూ వచ్చిన నా కవిత్వం మీద ఎవరికైనా ఒక అవగాహన ఏర్పడుతుంది కదా అని అంతా కలిపి ఒక సంపుటంగా వేశాను. ఇక రెండవ కారణం దాదాపు పన్నెండేళ్ళుగా నేను కవిత్వం రాయలేదు. రాస్తానన్న నమ్మకం కూడా లేదు. అలాంటప్పుడు కవిత్వమంతా ఒక రాశిగా పోద్దామనిపించింది.

ప్రశ్న 2: ఈ మాటనే ముందుమాటలో “దాదాపు పన్నెండేళ్ళుగా నేను కవిత్వం రాయలేదు. కవిత్వ చెలిమె ఏదో ఎండిపోయినట్లుగా ఉంది. కవిత్వానికి అవసరమైన బాల్యపు చిహ్నాలు తుడిచిపెట్టుకుపోయాయనిపిస్తోంది ఇప్పటికిదే ముగింపు అనిపిస్తోంది” అని చెప్పారు. ఇలా ఏ కవి/రచయిత బహుశా బహిరంగంగా ప్రకటించరేమో. కవిత్వం రాసేందుకు స్పందన కోల్పోవడానికి కారణాలేమిటి?

జ: నిజమే. మీరన్నట్టు తెలుగులో ఇట్లా బహిరంగంగా ప్రకటించిన కవి ఎవరూ లేరు. కవిత్వం రాసేందుకు స్పందన కోల్పోవడానికి కారణాలేమిటనే మీ ప్రశ్నకు నా దగ్గర సరైన సమాధానం లేదు. ఎవరి దగ్గరైనా ఉంటుందని కూడా నేననుకోను. కాకపోతే ఒకటి రెండు అంశాలు తోస్తున్నాయి. నా మొదటి కవిత్వ సంపుటి వేసే నాటికి నా కవిత్వం మీద కవి కె.శివారెడ్డి ప్రభావం ఉండేది. దాని నుంచి బయటపడదలుచుకుని ఆ ప్రాసెస్‌లో నన్ను నేను రిపీట్ చేసుకోకుండా ఉండడానికి చాలా కవితలు రాయడం మానేశాను. మొదటి సంపుటి వెయ్యడంతో ఆ దశ ముగిసి నాకు స్వేచ్ఛ లభించినట్లయింది. కొత్త వస్తువుతో, కొత్త అభివ్యక్తితో మాత్రమే రాయాలని అది నాదై ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని, రాయాలని అనిపించినప్పుడే రాశాను. ఒక్కో కవిత ఐదారుసార్లు తిరగరాస్తూ, పాతిక ముప్పై పేజీలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఫలితం రెండవ సంపుటికి స్వంత శైలి అలవడింది. ప్రతి కొత్త సంకలనం వస్తురూపాల్లో ఏదో కొత్తదనం సంతరించుకోవాలని గట్టిగా అనుకోవడంతో మూడవ సంపుటికి వచ్చేసరికి వస్తువు గురించి అటుంచి రూపంలో మరింత సారళ్యం సాధించడానికి ప్రయత్నం చేశాను. (వస్తువు గురించి తర్వాత మాట్లాడుతాను). భావసాంద్రత తగ్గకుండా వచనంలో కొడవటిగంటి కుటుంబరావు సాధించిన తేటదనమేదో కవిత్వంలో తీసుకురావాలని అనుకున్నాను. కత్తి మీద చేసిన ఈ సాములో కొన్నిసార్లు బయటపడినా, కొన్నిసార్లు మాత్రం గాయపడ్డాను. ఈ దశలో నాల్గవ సంపుటి కోసం పడవలసిన అడుగులకు అవసరమైన కొత్తదనానికి కావలసిన వ్యవధానం దొరకలేదు. ఉద్యోగంలో కుటుంబంలో బాధ్యతలు పెరిగాయి. పాతధోరణిలో అయితే మరికొంత కవిత్వం రాసి ఉండేవాణ్ణి. ఆ ఇష్టం లేకపోయింది. కొత్త కోసం చూసిన ఎదురు చూపులో కాలం గడచిపోయింది. కవిత్వం కరిగిపోయింది.

ప్రశ్న 3: కవిత్వం రాయాలన్న కోరిక మీలో తగ్గిపోవడానికి చందమామ రావెకవితలో చెప్పిన పరిస్థితుల లాంటివే కారణమా? లేక ఇతరేతర కారణాలేవైనా ఉన్నాయా?

జ: ఒకటి రెండు సంవత్సరాలపాటు కవిత్వం రాయని సందర్భాలెన్నో నా జీవితంలో ఉన్నాయి. అట్లాంటి స్థితి నుంచి బయటపడి మళ్లీ కవిత్వంలోకి ‘పునరాగమనం’, ‘చందమామ రావే’ లాంటి కవితలతో ప్రవేశించాను. ‘చందమామ రావే’లో చెప్పినవన్నీ బాహిరమైన కారణాలు. కవిత్వ సృజనకు కావలసిన పరిస్థితులు బయటి ప్రపంచంలో ఎప్పుడూ ఉంటాయి. కవిత్వం లేని చోటు ఎక్కడా ఉండదు. వేలాది సంవత్సరాల మానవ ప్రయాణంలో, వందలాది భాషల్లో, లక్షలాదిమంది కవులు కవిత్వం చెప్పినా, చెబుతూనే ఉన్నా ఇంకా ఎంతో కవిత్వం చుట్టూరా మిగిలే ఉంది. ఎప్పటికీ మిగిలిపోతూనే ఉంటుంది. కవిత్వం చెప్పటం అయిపోవడం ఉండదు. దానికి కారణం కవిత్వ జననస్థానం మానవ ఇంద్రియం కావడమే. దానికి ఉపకరించేది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలోని భౌతిక కారణాలు కవిత్వాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. అయితే ప్రేరణను పొందగలిగే సున్నితత్వమూ, కవిత్వ తత్వమూ మనకు ఉండాలి. కాబట్టి కవిత్వం చెప్పలేకపోవడానికి అంతశ్చేతన కొరవడడమే కారణం.

ప్రశ్న 4: మీ కవిత్వపు రెండవ దశ – మీ కవిత్వంలో ఏముందో మీకు తెలిసి వచ్చిన ఆ స్పృహ మిమ్మల్ని ‘conscious poet’ ని చేస్తుందేమోనని భయపడ్డానన్నారు ముందుమాటలో. అయితే, కవికైనా, కథకుడికైనా తొలి రోజుల్లోనైనా, అనుభవం సంపాదించిన తరువాత అయినా; రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నామనే స్పృహ ఉంటుంది కదా? ‘conscious poet’ అనే పదబంధానికి అర్థం “The ‘conscious poet’ is one who uses their mind to its full capacity, connecting deeply with their creativity.” అని తెలుస్తోంది. ఇందులో భయపడాల్సినది ఏముందని మీరు భావిస్తున్నారు?

జ: చాలా మంచి ప్రశ్న వేశారు. ఏమి రాస్తున్నామో, ఎందుకు రాస్తున్నామో తెలుస్తుంది గానీ ఎలా రాస్తున్నామో తెలియదు. ఎలా రాస్తున్నామన్నదే ఒక రచన కవిత్వం అవుతున్నదా కావడంలేదా అనేది నిర్ణయిస్తుంది. Conscious poet ని అవుతానేమో ననే భయం నా వరకు ఒక వస్తువును కవిత్వం చెయ్యగలుగుతున్నానా లేదా అనే అంశానికి సంబంధించింది. రెండవ సంపుటాన్ని ప్రచురణకు సిద్ధం చేసిన తర్వాత కూడా నేను రాసింది కవిత్వం కాదేమో, దాన్ని పుస్తకంగా ప్రచురించనవసరం లేదేమో అని కొంత కాలం విరమించుకున్నాను. చివరికి దానికదే నిర్ణయమౌతుందనుకుని ప్రకటించినపుడు దానికి సానుకూల స్పందన వచ్చింది. అందువల్ల అప్పటివరకు నేను రాసింది ఏమిటో నాకు తెలియనిదాన్ని కవిత్వం అంటున్నారు కాబట్టి నేనేం రాసినా అది కవిత్వం అవుతుందనే భ్రమలోకి నెట్టబడకుండా నన్ను నేను భయపెట్టుకున్నాను.

ప్రశ్న 5: మీ మూడవ దశలో liberate అయ్యానని అన్నారు. conscious poet కి, liberated poet కి మీ ఉద్దేశంలో తేడా ఏమిటి? కవిత్వం మౌలిక లక్షణాలలో లేదా ఉద్దేశాలలో ఏవైనా మార్పులు ఉంటాయా? వివరించండి.

జ: మూడవ దశలో లిబరేట్ అయ్యానని చెప్పలేదు నేను. మొదటి నుంచి నన్ను నేను liberated గా ఉంచుకోవడం వల్ల నాలో అనేక మార్పులు సంభవించాయన్నాను. ఇది ప్రధానంగా వస్తువుకు సంబంధించిన లిబరేషన్. అందువల్లనే ప్రతి దశలోనూ వస్తువు మారుతూ వచ్చింది. మొదటి సంపుటి కవిత్వంమీద వామపక్ష భావజాలం ఉంది. సాధారణంగా దాని పట్ల ఆకర్షితులైన వాళ్లు ఆ సిద్ధాంతంలో ఉన్న determinism ను కవిత్వంలోకి ప్రవేశపెడతారు. నేనాపని చెయ్యలేదు. కానీ వామపక్ష సిద్ధాంతసారమైన బలహీనుల పక్షం వహించడం, అది ఏ వాదమైనా ధోరణి అయినా, విడిచిపెట్టలేదు. అదే నా కవిత్వ మౌలికలక్షణం. అందులో మార్పు లేదు. రెండవ దశలోమానవ సంబంధాల ముఖ్యంగా కుటుంబ సంబంధాల విచ్ఛిన్నం, అస్తిత్వ ఉద్యమాలలోని విపరీత దోరణుల్ని ఖండించడం, మూడవ దశలో నన్ను నేను declassify చేసుకోవడం వంటివి లిబరేటెడ్ గా ఉండడంవల్లే సాధ్యపడింది.

ప్రశ్న 6: “నిజ జీవితంలో సాహిత్యానికి ధాతువులైన కళాత్మకతను, మార్దవాన్ని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నించాను” అన్నారు. మార్దవం నిలుపుకోడమంటే, హృదయంలోని తడిని కాపాడుకోడమే కదా. అలాంటప్పుడు “కవిత్వ చెలిమె ఏదో ఎండిపోయినట్లుగా” ఎందుకు అనిపించిందో వివరిస్తారా?

జ: ఈ రెండు మాటలు వేర్వేరు సందర్భాలలో అన్నవి. చరిత్ర అధ్యాపకుడిగా తరగతి గదిలో సాహిత్యకారుడిగా కన్నా శాస్త్రవేత్తగా ఉండడానికే ఇష్టపడిన నేను నిజజీవితంలో సాహిత్యానికి ధాతువులైనవాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను అన్నాను. కవిత్వ చెలిమె ఎండిపోవడం దీనికి సంబంధించింది కాదు.

ప్రశ్న 7: “నాలో ఉన్న బహుళత్వాన్ని కనుగొనే క్రమంలోనే తిలక్ లోనూ బహుళత్వం ఉందని తెలుసుకున్నట్టున్నాను” అన్నారు. ఈ బహుళత్వం గురించి మరింత వివరిస్తారా? అది వైయక్తికమా? లేక కవులందరిలోనూ ఉంటుందా?

జ: బహుళత్వం అందరిలోనూ ఉండదు. ఏ ఒక్క సిద్ధాంతమో అన్ని సమస్యలకు సంపూర్ణ పరిష్కారం చూపనప్పుడు వేర్వేరు సిద్ధాంతాలను సమ్మిళితం చేయవలసి వస్తుంది. మార్క్సిజమ్ చెప్పే ఆర్ధిక సమానత్వం కావాలనిపిస్తుంది కానీ అందుకు జరిగే రక్తపాతం ఇష్టం ఉండదు. అప్పుడు గాంధీ అవసరమౌతాడు. దళితసమస్య పరిష్కారానికి గాంధీ సరిపోనప్పుడు అంబేద్కర్ అవసరమౌతాడు. మార్క్స్‌ను అస్తిత్వ ఉద్యమాలన్నిటినీ కలపడానికి గ్రాంసీ కావాల్సి వస్తాడు. ప్రాంతీయవాదంతో సహా అస్తిత్వ భావనల్ని పోస్ట్ మోడర్న్ దృక్పథంలో చూసినపుడు వాటిమీద కొత్త వెలుగులు పడతాయి. ఇట్లా అనేక సిద్ధాంతాల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. బహుళత్వంలో అనేక కోణాలు ఉంటాయి. అవి ఒక్కొకసారి పరస్పర విరుద్ధాలైనట్లు కనిపిస్తాయి. కానీ కాదు. ఉదాహరణకు నేను నాస్తికుణ్ణి. కానీ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు దేవుణ్ణి నమ్ముతున్నారన్న వాస్తవాన్ని విస్మరించను. నా సహచరి ఆస్తికురాలు. ఆమె పూజాకార్యక్రమాల్లో నా అవసరం వచ్చినపుడు సహకరిస్తాను. విప్లవ గీతాలు విన్నంత ఇష్టంగా భక్తి గీతాలు కూడా వింటాను. నా ఇష్టకవుల్లో అన్నమయ్యతో పాటు మధ్య యుగాల భక్తికవులుంటారు. ఇది అటుంచి కవిత్వతత్వానికి వస్తే శుద్ధకవిత్వంపట్ల కూడా నాకు ఆసక్తి ఉంది. శ్రీశ్రీ అంటే ఎంత ఇష్టమో ఇస్మాయిల్ అంటేకూడా అంతే ఇష్టం. మో లాంటి కవుల సంక్లిష్టతను ఛేదించడానికి ఇష్టపడతాను. చరిత్ర విద్యార్థిగా ప్రాచీన భారతీయ మతం, దాని పరిణామం పట్ల నాకు ఆసక్తి, గౌరవం ఉన్నాయి. “ఏ దేశ సంస్కృతీ ఏనాడూ కాదొక స్థిర బిందువు- నైక నదీ నదాలు అదృశ్యంగా కలసిన అంతస్సింధువు” అన్న తిలక్ మాటల్ని భారతదేశ చరిత్రకు అన్వయిస్తాను. ఈ దేశచరిత్రలో భాగస్వాములైన అనేక జాతుల, మతాల సమ్మేళనంలోంచే భారతీయ సంస్కృతి పుట్టిందని నమ్ముతాను. ఈ సంస్కృతి ఏకశిలాసదృశం కావడాన్ని అంగీకరించను. బహుళత్వమే భారతీయ సంస్కృతికి ఆయువుపట్టు. విభిన్నమైన సంస్కృతుల మధ్య జీవించడం, బహుళత్వం కలిగి ఉండడమే ఆధునికయుగ లక్షణం.

ప్రశ్న 8: కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఈ మూడు సంపుటాలలో కాలక్రమంలో ఈ మూడింటి విషయంలో మీ ప్రాధాన్యం ఏమైనా మారిందా?

జ: లయ ప్రధానంగా పాటకు, గేయానికి సంబంధించింది. వచనకవితకు కూడా కొండొకచో ఉండొచ్చు. నా మొదటి సంపుటిలో కొన్ని కవితలు కొన్ని చోట్ల లయాన్వితంగా సాగుతాయి. కానీ వచన కవితకు వస్తువు ప్రధానమా, వ్యక్తీకరణ ప్రధానమా అనేది ప్రధానమైన అంశం. శ్రీశ్రీలో మాదిరిగా వస్తుశిల్పాలు సమానంగా పెనవేసుకున్నప్పుడే గొప్ప కవిత్వం పుడుతుంది. కొందరిలో వస్తువును శిల్పం, మరికొందరిలో శిల్పాన్ని వస్తువు అధిగమిస్తుంటాయి. ఈ రెండిటిలో ఒకటి ఎంపిక చేయవలసివస్తే కవిత్వం కళ కాబట్టి వస్తువును శిల్పం అధిగమించడం వైపే మొగ్గుతాను.

ప్రశ్న 9: 1988లో వ్రాసిన ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయికవిత నేటికీ వర్తిస్తుంది. ప్రశ్నలు ఉత్నన్నమయ్యే పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. మరిప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే ఎలా? కవితలు వ్రాయడం ఆపేకాకా, మీ స్వరాన్ని ఎలా వినిపిస్తారు?

జ: మూగవాణ్ణి పట్టుకుని నువ్వు మాట్లాడకపోతే ఎట్లా అని మీరు అడుగుతున్నారు.

ప్రశ్న 10: భయద సౌందర్యంకవిత అద్భుతమైనది. జీవన తాత్త్వికతని గొప్పగా వివరించారు. ఈ కవిత వెనుక ఉన్న నేపథ్యం వివరిస్తారా?

జ: ఆ కవిత స్వీయ అనుభవంలోంచి వచ్చిందే.

ప్రశ్న 11: యుద్ధమూ శత్రువుకవితలో యుద్ధం ప్రపంచానికి పట్టిన జ్వరంఅన్న నిర్వచనం గొప్పగా ఉంది. 1999లో వ్రాసుకున్న ఈ కవిత నాటి పరిస్థితులు ఏమీ మారలేదు. ఇప్పుడు యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పమంటే ఏం చెబుతారు?

జ: ‘యుద్ధం ప్రపంచానికి పట్టిన జ్వరం’ అనే వాక్యం నాకు ఇష్టమైన నా వాక్యాలలో ఒకటి. మీకూ నచ్చినందుకు ధన్యవాదాలు. “యుద్ధమంటూ జరిగాక ఇద్దరూ ఓడిపోక తప్పదు – ఇద్దరూ గెలిచే యుద్ధం ఎప్పటికీ చెయ్యని యుద్ధమే” అని కూడా రాశాను. మనిషి పుట్టినప్పుడే యుద్ధం పుట్టింది. మనిషిలోని కుటిలమైన తెలివితేటలన్నీ యుద్ధంలో ప్రతిఫలించాయి. సాంకేతికత, విజ్ఞానం సాధించిన విజయాలకు యుద్ధం కూడా ఒక గీటురాయి అయింది. యుద్ధం మనిషిమీద విజయం సాధిస్తూనే ఉంది. ఇంత నాగరికత సాధించాక కూడా సమస్యకు యుద్ధమే పరిష్కారం అనుకుంటున్నాడంటే మనిషి పశుస్థాయిని దాటలేదనిపిస్తుంది. కొత్త నిర్వచనం అంటే ఒక్క యుద్ధం సమస్త మానవ వికాస వైఫల్యం అనాలి.

ప్రశ్న 12: ద్విపాత్రాభినయంకవితలో “సాహిత్యం నుంచి నిష్క్రమిస్తే, జీవితం నుంచి వేరుగా నిష్క్రమించనక్కర్లేదు” అని అన్నారు. ఇది 1996లో రాసుకున్న కవిత. అప్పటికీ ఇప్పటికీ మీ ఈ అభిప్రాయంలో ఏమైనా మార్పు వచ్చిందా?

జ: మార్పేమీ లేదు.

ప్రశ్న 13: ఒక నిరాకరణకవితలో మిమ్మల్ని మీరుఅని అనవద్దని, బహువచనం వద్దని అన్నారు. కానీ మీ విద్యార్థులో లేదా తాజాగా పరిచయమైన మాలాంటి వాళ్ళో ఏకవచనంలో సంబోధించడం కష్టం కదా? దీని గురించి మీ అభిప్రాయం? ఈ కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?

జ: అది నన్ను నేను declassify/decategorise/disown చేసుకునే ప్రయత్నంలో రాసిన కవితలలో ఒకటి. నన్ను ఏకవచనంలో పిలవడం ఎవరెవరికి కష్టమౌతుందన్నది కాదు ప్రశ్న. కవి మనుషుల మధ్య వ్యవస్థీకృతమైన గోడల్ని బద్దలుకొట్టాలి. మన మధ్య మతం గోడలు, కులం గోడలు వంటి అనేక రకాల గోడలతో పాటు బహువచనం గోడలు కూడా ఉన్నాయి. దాన్ని బద్దలు కొట్టాలి, ఎప్పటికైనా!

ప్రశ్న 14: దీర్ఘ కవితా ప్రక్రియని ఎక్కువగా ఇష్టపడటానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: దీర్ఘ కవితలకు వేరే నిర్వచనం ఉంది. నావి దీర్ఘకవితలు కావు. ఒక్కొకసారి నాలుగైదు పేజీలకు విస్తరిస్తాయి, అంతే. దేన్నయినా ఎక్కువసేపు sustain చెయ్యడంమీద ఉండే ఇష్టమే కవిత్వం మీద కూడా ఉంది. మంచి కవిత చదివితే మంచి భోజనం చేసినట్లుండాలి అంటాడు ఆరుద్ర

ప్రశ్న 15: ఒక చరిత్ర అధ్యాపకునిగా సాహిత్యాన్ని ఎలా స్వీకరించగలిగారు? రెండిటికీ సామరస్యాన్ని ఎలా సాధించగలిగారు?

జ: చరిత్ర సాహిత్యాలలో మొదటిది వృత్తి రెండవది ప్రవృత్తి అయినా కొన్నిసార్లు అభేదం, కొన్నిసార్లు భేదం పాటించాను. చరిత్ర మౌలిక సూత్రాల ప్రభావం నా కవిత్వం మీద ఉంది. నా కవిత్వహృదయం చరిత్రలోని విషాదాన్ని పీల్చుకోగలిగింది. కవిత్వంలో జీవితంలో నిరపేక్షం (objective) గా ఉండడం నాకు చరిత్ర అధ్యయనం వల్లే సాధ్యపడింది. చరిత్రలోని బలహీనుల పక్షం వహించడం కవిత్వంలోని subjectivity వల్ల సాధ్యపడింది. చరిత్ర సజీవమైన వ్యక్తుల ఆలోచనల మేరకు నడుస్తుంది కాబట్టి నియతివాదానికి ఆస్కారం లేదని క్రమంగా గుర్తించాను. ఇది వ్యక్తిగా నన్ను, సమాజాన్ని చూసే దృష్టిని విశాల పరిచింది. చరిత్ర శాస్త్రం. సాహిత్యం కళ. సాహిత్యంలోకి చరిత్ర ప్రవేశించవచ్చు గానీ చరిత్రలోకి సాహిత్యం ప్రవేశించకూడదు. తాను సాహిత్యంగా మారడాన్ని చరిత్ర క్షమించదు.

ప్రశ్న 16: సాధారణంగా కవులు రాసే కవితలన్నీ వారికి నచ్చుతాయి. కానీ ప్రత్యేకంగా, ఈ మూడు సంపుటి లోని ఒక్కో సంపుటం నుంచి మీకు బాగా నచ్చిన ఒకటి కవిత పేర్కొనమంటే, ఏ కవితని ఎంచుకుంటారు?

జ: నేను రాసిందే తక్కువ. ఇష్టపడినవే రాశాను. కానీ కొన్ని నాకు ఇష్టం లేనివి ఉన్నాయి. మీరు ఆ ప్రశ్న అడగాలి. రెండు మూడు కవితల్ని చూసినపుడు ఎందుకు రాశానా అనిపించేది. వాటి పేర్లు చెప్పను. ఎందుకంటే ఒకరిద్దరు మిత్రులు అవే తమకిష్టమైన కవితలని చెప్పారు. అప్పుడు Every poem has its reader అన్న ఇంగ్లీషు మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంగ్లీషులోనే There’s a poem for every reader అనే మాట కూడా ఉంది. మొదటి వాక్యంలో poem తన reader ని దొరికించుకుంటే, రెండవ వాక్యంలో reader తన poem ను వెదుక్కుంటాడు. బహుశా నాకు నచ్చని నా కవితలకు ఈ రెండవ వాక్యం వర్తిస్తుందనుకుంటాను. వాళ్ళు మంచి చదువరులు కావడంవల్ల అవి వారికి నచ్చి ఉంటాయి.

ప్రశ్న 17: మీ కవిత ‘కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్’ ను డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు కదా. మీకు ఏమనిపిస్తోంది? దాని నేపథ్యం ఏమిటి?

జ: అవును. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాల మొదటి సెమిస్టర్ డిగ్రీ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులకు అది పాఠ్యాంశం కావడం సంతోషం. అందుకు కారకులైన పాఠ్యప్రణాళిక సంఘ సభ్యులకు, ముఖ్యంగా అధ్యక్షుడు సుంకర గోపాల్‌కు కృతజ్ఞతలు.

ఒక ఆత్మీయమిత్రుడి ఆప్తబంధువు నక్సలైట్‌ల మందుపాతర పేలుడులో మరణించినపుడు 1997 లో రాసిన ‘అసలు నక్క’ అనే కవితలో

“తెగిపడ్డప్పుడు బయట పడేది రక్తమేకాని కన్నీళ్లు కావు
శవం కన్నా జీవం గొప్పదైనట్టు
రక్తంకన్నా కన్నీళ్లే గొప్పవి
అతని రక్తం సంగతి సరే
వాళ్ళ కన్నీళ్ళ మాటేమిటి మిత్రమా”

అని రాసిన నేను పదేళ్ల తర్వాత 2007లో “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” కవితలో దాన్నే విస్తృతంచేసి రక్తాన్ని బలప్రయోగానికి, హింసకు, యుద్ధానికి, రాక్షసత్వానికి ప్రతీకగా – కన్నీళ్లను సహజత్వానికి, సున్నితత్వానికి, శాంతికి, సహానుభూతికి చిహ్నంగా రాశాను. ఆ కవిత అవసరం 1997 లోకన్నా, 2007 లో కన్నా ఇప్పుడెక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు చదవడం సంతోషంగా ఉంది.

~

సంచిక టీమ్: కవిత్వం రాయడానికి విరామం మాత్రమే తీసుకున్నారని అనుకుంటున్నాం, ‘ఒక కెథార్సిస్ కోసం’ కవితలో మీరే అన్నట్టు “రాయాలి, రాయాలి. ఎప్పుడో వచ్చే ఒక శాశ్వత వాక్యం కోసం జీవితమంతా రాయాలి” కదా. ‘పునరాగమనం’ కవితలోలా, మీ కొత్త రాతల కోసం ఎదురు చూస్తుంటాము. విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు.

కొప్పర్తి వెంకటరమణమూర్తి: ధన్యవాదాలు.

***

కొప్పర్తి కవిత్వం
రచన: కొప్పర్తి వెంకటరమణ మూర్తి
పేజీలు: 270
వెల: ₹ 250/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, ఫోన్: 9912460268
~
కొప్పర్తి వెంకటరమణ మూర్తి
101, ది పార్క్ వ్యూ అపార్ట్‌మెంట్స్,
రోడ్ నెంబర్ 9, మాధవపురి హిల్స్,
పిజెఆర్ ఎన్‌క్లేవ్, చందానగర్
హైదరాబాద్ 500050. ఫోన్: 9849525765

~
‘కొప్పర్తి కవిత్వం’ కవితాసంపుటి విశ్లేషణ
https://sanchika.com/kopparthy-kavitvam-book-analysis-dr-vk/

Exit mobile version