[‘కల్లోల భారతం’ అనే పుస్తకాన్ని వెలువరించిన శ్రీ కోవెల సంతోష్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం కోవెల సంతోష్ కుమార్ గారూ.
కోవెల సంతోష్ కుమార్: నమస్కారం.
~
ప్రశ్న 1. ముందుగా, ‘కల్లోల భారతం’ లాంటి ఆవశ్యకమైన, ఉపయుక్తమైన పుస్తకాన్ని రచించినందుకు అభినందనలు. ఈ అంశం ఆధారంగా పుస్తకం రచించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తారా?
జ: సంచిక సంపాదకులకు ధన్యవాదాలు. నా రచనలను ప్రోత్సహిస్తూ.. నన్ను ఒక రచయితగా నిలబెట్టిన మీకు నమస్సులు. ‘రామం భజే శ్యామలం’ గ్రంథం అచ్చయిన తరువాత అదే స్థాయిలో మరో అంశాన్ని ఎంచుకోవడం పై మీమాంసలో ఉన్నప్పుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 14 తేదీని దేశ విభజన తాలూకు భయానక జ్ఞాపకాల దినంగా ప్రకటించారు. ఈ క్రమంలో దేశ విభజనకు దారి తీసిన పరిస్థితులను ఆధారం చేసుకొని ఒక సమగ్రమైన సాధికారిక ధారావాహికకు శ్రీకారం చుట్టాలని భావించడం జరిగింది. అయితే.. దేశ విభజన అనగానే 1946, 47, 48 సంవత్సరాల మధ్యన జరిగిన పరిణామాలను గురించి మాత్రమే అత్యధికులు ఆలోచిస్తారు. కానీ.. దేశ విభజన అప్పటికప్పుడు జరిగిందా? దీని వెనుక మూలాలు ఏమిటి? అని ఆలోచిస్తూ పరిశోధించినప్పుడు ఈ విభజన తాలూకు విషవృక్షానికి బీజం పడింది ఎక్కడో 622 ఏడిలో అని తేలింది. 622లో థానే ఓడరేవుపై అరబ్బులు దాడి చేయడంతో భారత్‌ను ‘గజ్వా ఏ హింద్’గా మార్చే ప్రయత్నం జరిగింది. దీంతో కాస్త లోతుగా చర్చిస్తూ.. సమగ్రంగా రచించాలని 622 ఏడీ నుంచి 1947 వరకు జరిగిన పరిణామాలను ప్రధానంగా చర్చించడం జరిగింది.
ప్రశ్న 2. సంచికలో సీరియల్ గా ప్రచురితమయినప్పుడు ఈ వ్యాస పరంపర శీర్షిక ‘దేశ విభజన విషవృక్షం’. ఆ పేరును ‘కల్లోల భారతం’గా ఎందుకు మార్చారు? సిరీస్ పేరు మరింత ఆకర్షణీయంగా వుండేది కదా?
జ: నిజమే.. సంచికలో ధారావాహికంగా వచ్చినప్పుడు శీర్షిక పేరు ‘దేశ విభజన విషవృక్షం’. కానీ.. ఈ రచన పూర్తిగా ఈ దేశంలోకి ఇస్లాం మతవాదులు, రాజులు చొచ్చుకొని రావడం.. ఆక్రమించడం.. భారతీయులను బలవంతంగా తమ మతంలోకి మార్చేయడం, తద్వారా ఈ దేశంలో కొన్ని భాగాలను ఇస్లామీకరించడం జరిగింది. ఈ కారణంగానే దేశంలో ద్విజాతి సిద్ధాంతం ఏర్పడి దేశ విభజనకు కారణమైంది. దేశ విభజనకు ప్రధాన కారణం ఇస్లామీకరణ ప్రభావమే అయినప్పటికీ.. అందులో ఇతర శక్తుల ప్రమేయం కూడా ఉన్నది. ఈ రచనలో ప్రధాన వస్తువు ఇస్లాం చొరబాట్లు.. ఆక్రమణలు, రాజకీయ సమీకరణలు మాత్రమే. ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. ఇతర అంశాలను మరో ప్రాజెక్టుగా స్వీకరించాలని భావించాను. అందువల్ల ప్రచురణ సందర్భంలో దీని శీర్షికను ‘కల్లోల భారతం’గా మార్చాల్సి వచ్చింది.
ప్రశ్న 3. ఈ పుస్తక రచనకోసం ఎలాంటి పరిశోధన చేశారు? రిఫరెన్స్ పుస్తకాలను సేకరించటంలో పడిన శ్రమను వివరిస్తారా?
జ: నిజంగా ఇది చాలా కఠినమైన శ్రమతో కూడుకున్న పని. ముందుగా నేను ఉత్సాహంగా రాయడం మొదలు పెట్టినప్పటికీ.. రెండో వ్యాసం దగ్గరకు వచ్చేసరికే సమస్య మొదలైంది. ఈ ధారావాహిక కోసం అనేక గ్రంథాలను పరిశోధించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇస్లాం వికాసం.. విస్తరణను అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు అందుకు సంబంధించిన అనేక గ్రంథాలను ఒరిజినల్స్‌ను సంపాదించాల్సి వచ్చింది. వీటిలో చాలా వరకు పర్షియన్లో, ఉర్దూలో రచించినవీ ఉన్నాయి. వీటి ఇంగ్లీష్ నిజ అనువాదాలను సేకరించాల్సి వచ్చింది. ఫరిస్తా రాసిన ‘కింగ్స్ ఆఫ్ గజ్నీ’ కానీ, క్వాజా నిజాముద్దీన్ రచించిన ‘తబఖత్ అక్బరీ’ కానీ, అల్ బిరూనీ రాసిన ‘కితాబ్ ఉల్ హింద్’ లాంటి రచనలతో పాటు, ‘చాచ్‌నామా’, ‘బాబర్నామా’, ‘మసీర్ ఎ ఆలంగిరి’, ‘రుకాత్ ఏ ఆలంగిరీ’, ‘బాద్షానామా’ లాంటి మొఘలుల ఆత్మకథలు, గురుగోబింద్ సింగ్ జఫర్‌నామా, ఇస్లాం చరిత్రకారులు మహమ్మద్ హబీబ్, ఇర్ఫాన్ హబీబ్‌ల రచనలు, మార్క్సిస్టు చరిత్రకారులు రోమిలా థాపర్ లాంటి వారి రచనలు, భారతీయ చరిత్రకారులు ఆర్.సి. మజుందార్, పీఎన్ ఓక్ రచనలను కూలంకషంగా పరిశీలించాల్సి వచ్చింది. ముఖ్యంగా 1960లలో మదరిండియాలో పీఎన్ ఓక్ రచించిన ధారావాహిక ద్వారా అనేక అంశాలకు సంబంధించి ప్రాథమిక సమాచారం లభించింది. జాతీయోద్యమ కాలంలో, వందేమాతర ఉద్యమ కాలంలో ఆనాటి పత్రికల్లో వార్తలతో పాటు.. మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్కైవ్స్‌లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి నిఘా నివేదికలు లభ్యమయ్యాయి. ఈ నివేదికల ద్వారానే ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధించి కానీ, మోఫ్లా తిరుగుబాటుకు సంబంధించిన అంశాలు కానీ వెలుగు చూశాయి. బెంగాల్ పత్రికల ద్వారా వందేమాతర ఉద్యమం తాలూకు వివరాలు స్పష్టంగా లభించాయి. గురుగోవింద్ సింగ్ జఫర్‌నామా ద్వారా ఔరంగజేబ్‌తో సిక్కుల పోరాట పటిమను తెలుసుకోగలిగాను. ఈ పుస్తక రచనలో నేను పరిశోధించి పరిశీలించిన గ్రంథాలు వందకు పైగానే ఉంటాయి. అవి కాకుండా అంతర్జాలం ద్వారా నాకు లభించిన డాక్యుమెంట్లు, వీడియో ఫుటేజీలు, వీడియో ప్రసంగాలు, ఫొటోలు ఎన్నో లెక్క లేవు.
ప్రశ్న 4. మీరు రాయాలనుకున్నది వివాదాస్పదమైన అంశం. మిమ్మల్ని ఎందరో విమర్శించి వుంటారు. భయపెట్టి వుంటారు.. వాటికి మీ స్పందన ఏమిటి?
జ: మీరన్నది అక్షరాలా వాస్తవం. సంచికలో ధారావాహికంగా వస్తున్నప్పుడే కొన్ని వ్యాసాలు చదివిన తరువాత నాకు చాలా కావాల్సిన వారు, మంచి స్నేహితులు కూడా నేను చేస్తున్న ఈ పనిని విమర్శించారు. దేశంలో మతసామరస్యం ఉన్న సమయంలో మీరు ఇలాంటి వ్యాసాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. కానీ ఇది మత సామరస్యానికి కానీ, మత కల్లోలానికి కానీ సంబంధించిన విషయం కానే కాదు. రెండు వందల ఏండ్లుగా మసిపూసి రచించిన చరిత్రపై నుంచి మసిని తొలగించే ప్రయత్నం మాత్రమే అని జవాబిచ్చాను. చాలా మంది నా జవాబుతో సంతృప్తి చెందలేదు. తరువాత నా దగ్గర ప్రస్తావించలేదు.
ప్రశ్న 5. ఈ రచనపై మీరు ఎదురుకున్న విమర్శలేమిటి? ప్రశంసలేమిటి?
జ: ఈ రచనకు సంబంధించి విభిన్నమైన స్పందనలు ఎదుర్కొన్నాను. నేను ప్రసంగం చేసిన ఒక చోట ఒక పెద్దాయన.. ‘కల్లోల భారతం’పై తీవ్రంగా స్పందించారు. “ఎప్పుడో గుడులు కూలగొట్టారని, మసీదులు కట్టారని ఎంతకాలం రాస్తారు..? ఇదంతా నాన్సెన్స్.. ఇది ఎవరికి కావాలి? నాకు దేవుడిమీద నమ్మకం లేదు. ఒక్క శ్లోకం కూడా చదువను. నా పిల్లలను కూడా నేను అలాగే పెంచాను. నేను యూదుల చరిత్రను లోతుగా చదువుకున్నాను. మా అమ్మాయికి జుదా అని పేరు పెడదామనుకున్నాను. కానీ.. చివరకు మా అమ్మ పేరు పెట్టుకున్నాను” అని విమర్శించారు. నాకు అప్పుడనిపించింది అమ్మ కూడా చరిత్రే కదా.. అమ్మ అనేది మన మూలం. మన జ్ఞాపకం, అది మన చరిత్ర. దాన్ని ఎలా మర్చిపోగలం.. ఈ దేశ చరిత్ర కూడా మనకు అమ్మలాంటి జ్ఞాపకం కాదా అనిపించింది. అమ్మకు జరిగిన అన్యాయాన్ని ఎట్లా వదిలేస్తాం. వక్రీకరణలను ఎంతకాలం భరిస్తాం? ఇక మరో ఘటన ఏమిటంటే.. ప్రకాశం జిల్లా నుంచి సైదావలీ అనే ఒక ముస్లిం పాఠకుడు ఒక ఉదయాన్నే నాకు ఫోన్ చేసి.. విశాలాంధ్రలో ఈ పుస్తకాన్ని కొని చదివానని.. చాలా ఆనందంగా ఉన్నదని ప్రశంసించారు. ఈ గ్రంథంపై ఒక సమీక్ష కూడా రాసి పంపించారు. అది గొప్ప ప్రశంస. ప్రజ్ఞాభారతి చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి కల్లోల భారతాన్ని బహిరంగ వేదికపై ప్రశంసించడమే కాకుండా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు.
ప్రశ్న 6. సమకాలీన సమాజంలో ఈ పుస్తక ప్రాసంగిత ఏమిటి?
జ: వాస్తవానికి ఈ పుస్తకం ఇప్పుడే, ఈనాటి యువతరానికే అత్యంత అవసరం. దేశ విభజన కారణంగా మనం ఏం పోగొట్టుకున్నాం.. ఏం నిలబెట్టుకున్నాం అన్నవిషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు.. ఇవాళ కూడా ఆ విష బీజాలు ఎలా పెరుగుతున్నాయన్నది అవగాహన చేసుకోవడానికి కూడా ఈ గ్రంథం చాలా ఉపయుక్తమైంది. ఎందుకంటే.. దేశ విభజనను మనం భౌగోళికంగా మాత్రమే చూస్తే.. దాని ప్రాసంగికత 1947 తోనే ముగిసిపోవాలి. కానీ.. అది భౌగోళికం కాదు.. వారి లక్ష్యం అత్యంత ప్రమాదకరమైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు కానీ, అంతకు ముందు పహల్గామ్లో జరిగిన మారణకాండ కానీ.. భారతదేశంలో వారి బావజాలాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నది. ఈ ధోరణి కేవలం ఇస్లాంకు మాత్రమే పరిమితం అయిందని అనుకుంటే పొరపాటు. దేశంలో ఒక క్యాన్సర్‌లా ప్రవేశించిన కమ్యూనిజం లక్ష్యం కూడా భారతదేశంలో వేల సంవత్సరాలుగా అవిచ్ఛిన్న ధారగా కొనసాగుతూ వస్తున్న భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని నాశనం చేసి, తమ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జెఎన్యూలో ‘ఛీన్ కే లేంగే ఆజాదీ’ అన్నా.. ‘భారత్ తేరే టుక్ డే కర్ దేంగే’ అన్నా.. ‘అఫ్జల్ తేరా కాతిల్ జిందాహై’ అన్నా, ‘ఘర్ ఘర్ మె అఫ్జల్ పైదా కర్ లేంగే’ అన్నా.. భారత్‌లో అంతర్గతంగా పెట్రేగుతున్న ట్రోజన్ల విపరీత ధోరణి. ఇది ఈ దేశంలో శతాబ్దాల నాడే వేళ్లూనుకున్నది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే దేశంలో హిందూ ముస్లింల మధ్య ఎప్పటికీ పూడని అగాధాన్ని సృష్టించారు. దాన్ని కొనసాగిస్తున్నారు. దీని కోసమే హిందువులను బూచీగా చూపించి.. వాళ్లను, వాళ్ల ధర్మాన్ని కించపరుస్తూ.. ముస్లింల విషయంలో మాత్రం ఎక్కడలేని సంతుష్టీకరణను ప్రదర్శిస్తుంటారు. అందుకే ఈ పుస్తకం చదవటం ద్వారా.. గతంలో జరిగిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అప్పుడు జరిగిన నష్టం ఏమిటి? ఇప్పుడు జరుగబోయే పరిణామాలు ఏమిటన్న దానిపై ఒక అవగాహన వస్తుందనటంలో సందేహం లేదు.
ప్రశ్న 7. మీరు ఈ పుస్తకాన్ని పూర్తిగా పక్షపాత ధోరణిలో ఒక హిందూ ఫానటిక్గా చరిత్రను విశ్లేషించారని అంటారు. దానికి మీ సమాధానం ఏమిటి?
జ: చరిత్రకు హిందూ, ముస్లిం, మార్క్స్ అనే దృక్పథం అంటూ ఏమీ ఉండదు. చరిత్ర అన్నది చరిత్ర మాత్రమే. దీనికి ఒక దృక్పథాన్ని అంటగట్టింది మన దేశంలో మార్క్సిస్టులు మాత్రమే. భారతదేశంలో చరిత్రకారులు తమను తాము మార్క్సిస్టు చరిత్రకారులం అని చెప్పుకున్న మహానుభావులు.ఇంకొందరు అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రను రచిస్తున్నామని చెప్పుకుంటూ తమ మురికి మకిలి దృష్టిలో చరిత్రను విశ్లేషిస్తూ ఆ మురికి అంబేద్కర్ పై రుద్దుతున్నారు. చరిత్రను చరిత్రగానే చెప్పాలి. గతంలో జరిగిన అనేక ఘటనల సమాహారం చరిత్ర. దాన్ని సృజనాత్మకం చేసినప్పుడు అంటే గతంలో జరిగిన ఒకానొక ఘటన నవలగానో కథగానో సృజించినప్పుడు అందులో కల్పనలు, సమకాలీన అంశాల జోడింపు ఉండవచ్చు. కానీ.. చరిత్రను చరిత్రగా రాస్తున్నప్పుడు ఒక దృక్పథం అంటూ తమదైన కోణంలో వక్రీకరించే ప్రయత్నాలు చేయడం సరి కాదు. అమెరికాలో రెడ్ ఇండియన్ల ఊచకోత దగ్గరి నుంచి, యూరప్‌లో గ్రీకు, రోమన్ చరిత్రల నాశనం గురించి, జర్మనీలో హిట్లర్ చేసిన యూదుల ఊచకోత గురించి కానీ చెప్పడానికి ప్రపంచంలో ఏ చరిత్రకారుడూ సంకోచించడు. కానీ, మన దేశంలో మాత్రమే ఈ విచిత్రమైన వికృతమైన ధోరణి కనిపిస్తుంది. అత్యంత క్రూరమైన పైశాచికమైన చర్యలకు పాల్పడిన రాజులను మహానుభావులుగా, గొప్ప రాజులుగా ‘ది గ్రేట్’గా వర్ణిస్తూ.. చరిత్రగా రచించి దశాబ్దాలుగా మెదళ్లలోకి ఎక్కించారు. చరిత్రను చరిత్రగానే చెప్పాలి. అందులో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు.. అందులోంచి ఏం స్వీకరించాలో పాఠకుడు నిర్ణయించుకుంటారు. ‘కల్లోల భారతం’ అన్న రచన కేవలం చరిత్రను చరిత్రగానే చెప్పటం జరిగింది. అంతకు మించి దృక్పథాలు, దృక్కోణాలు అంటూ ఏమీ లేవు.
ప్రశ్న 8. అసలిప్పుడు, ఈ ప్రపంచీకరణ, సాంకేతిక, ఐటీ యుగంలో ఇంకా, పాత కాలంనాటి యుద్ధాలు, మందిరాలు, సుల్తానుల గురించి ఇంతగా చర్చించాల్సిన అవసరం వుందా?
జ: ఈ ప్రశ్న నేను ఈ వ్యాస పరంపర రచిస్తున్నప్పుడే, సంచికలో ధారావాహికంగా వస్తున్నప్పుడే తలెత్తింది. ఇంత ప్రపంచీకరణ, సాంకేతిక ఐటీ యుగంలో కూడా ఇంకా పాతకాలం నాటి ఎన్నడూ కనపడని ‘మనువాదం’, ‘బ్రాహ్మణవాదం’ ప్రతి రోజూ ప్రస్తావనకు వస్తుంటాయి. లౌకిక విలువల పేరుతో ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర, రాముడు దుర్మార్గుడంటూ పెద్ద పెద్ద సదస్సులు, సభలు జరుగుతుంటాయి. అప్పుడెప్పుడో అంటరానితనం అమల్లో ఉన్నదని, కులోన్మాదం ఉన్నదని, ఎక్కడో ఏదో మూల ఏదో జరిగితే, మొత్తం హిందూ సమాజానికి వాటిని వర్తింపజేస్తూ మేధావులం అని ట్యాగ్‌లైన్ అల్లల్లాడిస్తుంటారు. దాన్ని మతోన్మాదం అని వాదిస్తుంటారు. ఇటువైపు నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడగానే.. ఇప్పుడు ఇవన్నీ దేనికి? అని అడుగుతుంటారు? ఇప్పుడు ఐటీ యుగంలో, కంప్యూటర్ల కాలంలో ఇలాంటివి దేనికని ప్రశ్నించేవారు.. మొన్న ఢిల్లీలో జరిగిన పేలుడు.. అంతకు ముందు వారం రోజుల పాటు నిఘావర్గాలు పట్టుకున్న అమ్మోనియం నైట్రేట్ గురించి ఒకసారి అధ్యయనం చేయాలి. కాస్టర్ సీడ్స్ ద్వారా రిసిన్ అనే భయంకరమైన విషాన్ని తయారుచేసి దేవాలయాల్లో ప్రసాదాల్లో కలపాలనే కుట్ర జరిగింది. ఈ కుట్ర చేసిన వాళ్లందరూ డాక్టర్లు, ఇంజినీర్లు.. జరిగిన కుట్ర మొత్తం రెండు వైద్య కళాశాలల్లో.. ఈ ఘటనను లోతుగా ఆలోచిస్తే.. విద్య వల్లనో.. పెద్దగా చదువుకోవడం వల్లనో విద్వేషపూరితమైన భావజాలంలో మారలేదు. ఈ భావజాలాన్ని నిర్మూలించాలి. ఇందుకోసం మూలాలను అధ్యయనం చేయాలి.. మొదలంటా నరికేయాలి.
ప్రశ్న 9. మీ రచన చదువుతూంటే మీకు సుల్తానులపై ఏదో కసి, ఏదో చులకన భావం, ద్వేషం ఉన్నట్టనిపిస్తుంది. ఎందుకని?
జ: భారతదేశంపై, భారతీయతపై, భారత ప్రజలపై అమానుషంగా విరుచుకుపడిన వారందరిపైనా నాకు సదభిప్రాయం లేదు. ఉండదు. నా ఇంటి మీదకు వచ్చి.. నా ఇంట్లోకి చొరబడి.. నా కుటుంబంపై దాడి చేసి, నరకం చూపించి, నా ఇంటినే ఆక్రమించాలని చూస్తే ఎవరైనా మాత్రం ఎలా గౌరవించగలరు?
ప్రశ్న 10. ముఫ్ఫై అయిదవ పేజీలో మీరు “తొలినాళ్ళలో భారతదేశంలో ఇస్లామీకరణ సంపదను దోచుకోవటమే లక్ష్యంగా సాగింది. ఆ తరువాత ఉన్మాదంగా రూపు దాల్చింది” అని రాశారు. ఇస్లామీకరణ సంపదదోచుకోవటం ఏమిటి? అది ఉన్మాదంగా రూపు దాల్చటం ఏమిటి? కొంచెం వివరిస్తారా?
జ: అవును. అరేబియా ప్రాంతానికి ఆర్థిక స్వావలంబన లేదు. తరువాతి కాలంలో చమురు నిక్షేపాలు వచ్చాయి. 610 ఏడీలో మక్కాను స్వాధీనం చేసుకున్న తరువాత ఆర్థికంగా బలపడటానికి మతం అన్నది ఇస్లామీయులకు ఆలంబనగా నిలిచింది. ‘ముస్లిం హై హమ్, సారా జహా హమారా’ అని మతతత్వవాదిగా మారిన తరువాత మహమ్మద్ ఇక్బాల్ రాశాడు. ముస్లిం మత ప్రవక్తకులందరిదీ ఇదే బాట. ముందుగా వారు యూదు వ్యాపారులను ఊచకోత కోశారు. ఆ తరువాత పర్షియాను స్వాధీనం చేసుకున్నారు. తరువాత బంగారు గనిగా భారతదేశం కనిపించింది. అద్భుతమైన నౌకా వ్యాపారం కొనసాగిస్తున్న ఓడరేవులు కనిపించాయి. దాంతో భారత్‌ను దోచుకోవడం లక్ష్యంగా ప్రారంభమైంది. అయితే ఇస్లామీకరణ జరిగితే.. మొత్తం దేశమంతా తమ ఆధీనంలో ఉంటుందన్న ఎత్తుగడతో మత ఉన్మాదం మొదలైంది. ఇందుకు ఉదాహరణ మనం గమనిస్తే.. మహమ్మద్ బిన్ ఖాసిం రాజా దాహిర్ సేన్ తల నరికిన తరువాత ముందుగా చేసిన పని అపారమైన సంపదను ఖలీఫాకు పంపించడం. తరువాత దాహిర్ తలను, కూతుళ్లను బహుమతిగా పంపడం. ఇస్లాం చొరబాటుదారులు మొదట్నుంచీ ఒకే విధానాన్ని అనుసరించారు. ప్రజల్లో భయం పుట్టించాలి. అందుకు మతాన్ని వాడుకోవాలి. బలవంతంగా మతం మార్పించాలి. ఒకడు మతం మారాడంటే చాలు.. అతడు ఇక తమకు బానిస కాక తప్పదు. ఎక్కడో ఉన్న ఖలీఫాకు గులాం కాక తప్పదు. అప్పుడు దేశం మనది. సంపద మనది. మనుషులు మనవాళ్లు.. ఇదీ ప్రపంచ ఇస్లామీకరణ వెనుక ఉన్న ఉద్దేశం. మొఘలుల అంతం తరువాత కూడా తిరిగి ఇస్లాం రాజ్యస్థాపన కోసం ప్రయత్నం జరిగింది. ఈ భావజాలం ఇప్పటికీ కొనసాగుతున్నది. కాకపోతే.. ఈ భావజాలానికి ఇప్పుడు సెక్యులర్ అనే ముసుగు తొడిగారు అంతే.
ప్రశ్న11. మీ రచనలో అవకాశం దొరికినప్పుడల్లా చరిత్ర రచయితలను, లిబరల్, రేషనల్, కమ్యూనిస్ట్, మేధావులను విమర్శించారు. వారంటే మీకు ఎందుకంత అసహనం, ద్వేషం, క్రోధం? మీకు వ్యతిరేక దృక్కోణం ఉన్నవారిని మీరు సహించలేరా?
జ: నాకు ఎవరి మీదా అసహనం, ద్వేషం, క్రోధం అనేది లేనే లేదు. మీరు చరిత్ర రచయితలు అని ప్రస్తావించారు. మీరు పేర్కొన్న ఆ ‘చరిత్ర రచయితలు’ అసలైన చరిత్ర రచయితలు కారు. వారు మార్క్సిస్టు చరిత్రకారులు మాత్రమే. మార్క్సిస్టు దృక్పథంలో తమదైన ఇంటర్ ప్రెటెషన్తో చరిత్రను తమదైన భావజాలంతో ప్రెజెంట్ చేసిన వారు మాత్రమే. వారు చరిత్రకారులు అని చెప్పలేము. ఇక ఇస్లాం చరిత్రకారులు ఉన్నారు. వారు ఇస్లాం దృక్పథంలో ఇస్లాంను శాంతికాముక మతంగా, సూఫీలు, మొఘలులు, తుగ్లక్‌లు, ఖిల్జీలు అంతా శాంతికాముకులు, మతసామరస్యవాదులుగా చిత్రించినవారు. ఇక లిబరల్, రేషనల్, కమ్యూనిస్టు వర్గాలు.. ‘భారతీయత’ అనే పదం వింటేనే నొసలు చిట్లించేవారు. మీరన్నారు కాబట్టి చెప్తున్నా.. ఇటీవలే.. కేంద్ర ప్రభుత్వం బస్తర్ అడవుల్లో నిర్వహించిన ఆపరేషన్ కగార్ ప్రతికూలతలను ఎదుర్కోలేక మావోయిస్టు కేంద్ర నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతూ ఒక లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన పేర్కొన్న ముఖ్యమైన మాట ఏమిటంటే.. “ఈ దేశంలో కమ్యూనిజం విఫలం కావడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు మేధావులు ‘భారతీయత’ దృష్టితో కమ్యూనిజాన్ని సాకారం చేసే దిశగా ఆలోచించలేదు” అని. ఇందులోని భారతీయత అన్న పదమే కమ్యూనిస్టులకు అస్సలు నచ్చలేదు. వేణుగోపాల్ ఆరెస్సెస్, బీజేపీ పదజాలాన్ని వాడాడని.. దుర్మార్గుడని, ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు. భారతీయత అన్న పదమే గిట్టని వారు.. ఈ దేశం గురించి, ఇక్కడి సంస్కృతి గురించి, ఇక్కడి ధర్మాన్ని గురించి మంచి కంటితో ఎట్లా చూడగలరు? ఇప్పుడు దేశంలో జరుగుతున్నది అదే కదా.. ఎక్కడో విదేశాల్లో ఎవడో ఏదో వాగితే.. దానికి ఇచ్చే ప్రాధాన్యం.. ఈ దేశంలో పుట్టిన వాడు మాట్లాడితే ఇస్తారా? ఈ దేశంలో జాతీయవాద కమ్యూనిస్టులు లేకపోవడం వల్లనే కమ్యూనిజం అన్నది నూరేండ్లయినా కలగానే మిగిలిపోయింది. నా దృష్టిలో కమ్యూనిస్టులు మొదట్నుంచీ కూడా ఈ దేశంలో కీడు తలంపుతోనే పని చేస్తూ వచ్చారు. 1948 లో పోలీస్ యాక్షన్ తరువాత నిజాం లొంగిపోయిన తరువాత హైదరాబాద్‌ను ఆక్రమించుకొని.. భారతదేశ గర్భంలో కమ్యూనిస్టు రాజ్యాన్ని నెలకొల్పడానికి సొంత దేశ సైన్యంపైనే యుద్ధం చేయడానికి పూనుకున్న వాళ్లు కమ్యూనిస్టులు. బెంగాల్‌ను దేశం నుంచి వేరు చేయడానికి పక్కనే ఉన్న మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను ప్రోత్సహించి నాడు ఢాకా నవాబు ప్రోత్సహించిన రెడ్ పాంఫ్లెట్ సంస్కృతిని పెంచి పోషించారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఎవరైనా నాకు ఒకటే. ప్రతి భారతీయుడూ తన దేశం ముందు అన్న ఆలోచనతో నడిస్తే.. ఈ వ్యతిరేకతలు దూదిపింజల్లా ఎగిరిపోతాయి.
ప్రశ్న12. మీరు అకాడెమిక్గా చరిత్రను ప్రత్యేకంగా చదవలేదు. మీకు డిగ్రీలు లేవు. మీరు చరిత్ర పరిశోధకులు కారు. మీరు రాసినది సరయిన చరిత్ర అనీ, మీ విశ్లేషణ సరైనదని ఎలా విశ్వసించాలి?
జ. డిగ్రీలు చదివి, పీహెచ్‌డీలు చేసి, పద్మశ్రీలు, భూషణ్‌లు, విభూషణ్‌లు కుప్పలు తెప్పలుగా అవార్డులు తీసుకున్నవారు.. తాము సిసలైన చరిత్రకారులం కాము.. మార్క్సిస్టు చరిత్రకారులమని.. తమ పరిధిని తామే కుంచించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నేను చరిత్ర ప్రత్యేకంగా చదువుకోలేదు. ఆ సబ్జెక్టులో నాకు డిగ్రీలు లేవు. కానీ, నాకు నా దేశం మీద ప్రేమ ఉన్నది. నా ధర్మం మీద నాకు ప్రేమ ఉన్నది. అందుకోసమే నేను నా మూలాలు ఏమిటో, నేను ఏం పోగొట్టుకున్నానో.. ఇలాగే ఉంటే ఏం పోగొట్టుకుంటానో అన్న ఆందోళనతో పరిశోధన చేశాను. అనేక డాక్యుమెంట్లను, ప్రైమరీ సోర్సులను పరిశీలించి ఆధార సహితంగా ఈ రచన చేశాను. ఇందులో నేను మార్క్సిస్టు చరిత్రకారుల మాదిరి సొంత వ్యాఖ్యానాలు చేయలేదు. చరిత్రను చరిత్రగా చెప్పాను. మంచి చెడులు పాఠకులు నిర్ణయించుకుంటారు.
ప్రశ్న13. మీ రచన చదివితే చీర కట్టిన సుల్తాన్, చెద పురుగుల విజృంభణ, పిచ్చోడి చేతిలో రాయి, తండ్రికి బహుమతిగా అన్న తల, పిశాచాల విలయతాండవం వంటి పేర్లు సుల్తానులకు సంబంధించిన అధ్యాయాలకు, భారతజాతి సూర్యుడు ఛత్రపతి, మరాఠా సమ్రాట్ శంభాజీ, తలలు తెగినా తలవంచని వీరుడు వంటి పేర్లు హిందూ రాజుల గురించి చెప్పే అధ్యాయాలకీ కనిపిస్తాయి. మీ హిందూ మతతత్వవాద ఆలోచనారీతిని ఇది ప్రతిబింబిస్తుస్తుందా? సుల్తానులు గొప్పవాళ్ళని చరిత్రను రచించేవారిది పక్షపాతం, మీది నిష్పక్షపాతం ఎలా అవుతుంది?
జ: ఇందులో మతతత్వం ఏమిటి? నేను ముందే చెప్పాను. 622 నుంచి 1947 వరకు జరిగిన అనేక ఘటనల్లో ఢిల్లీ పీఠాన్ని ఏలిన రాజులు ఎలా పాలించారు.. ఎవరి మీద యుద్ధాలు చేశారు.. వాళ్ల వ్యక్తిత్వాలు ఏమిటి? ఎలాంటి వారు అన్న అంశాలనే నేను ప్రస్తావించాను. సుల్తానులకు సంబంధించిన అధ్యాయాలలో నేను రాసిన అంశాలన్నీ కూడా వారి వారి ఆత్మకథల్లో స్వయంగా రాసుకున్నవే.. వ్రాయసకాండ్రను పెట్టుకొని మరీ రాయించుకున్నవే. అందుకే కోట్స్‌తో సహా ప్రస్తావించాను. ఇక్కడ పక్షపాతమా? నిష్పక్షపాతమా అన్న ప్రశ్న ఉదయించదు. వాస్తవమా? కాదా? అన్న ప్రశ్న మాత్రమే ఉదయిస్తంది. హిందూ రాజుల గురించి చెప్పటం అంటే.. ఎవరో విదేశీ మూకలు వచ్చి ఇక్కడ తిష్ట వేసి.. దేశాన్ని కబళించాలని ప్రయత్నం చేసినప్పుడు వారు ఎదురు నిలిచిన తీరును వర్ణించటం జరిగింది. ఇది శివాజీ శంభాజీల విషయంలోనే కాదు.. రాజా దాహిర్ సేన్ నుంచి, హింద్ కుష్ రాజుల నుంచి, సిక్కు గురువుల దాకా వారు అనుభవించిన వేదన, చేసిన పోరాటాన్ని వర్ణించినప్పుడు ఇలాంటి శీర్షికలే సహజంగా వస్తాయి. ఆ మధ్య శంభాజీ సినిమా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఔరంగజేబు చాలా సాధువు, మహా పురుషుడు.. చీమకు కూడా హాని తలపెట్టనివాడిని చెడుగా చూపించి ఒక స్త్రీలోలుడు, చెడు వ్యసనాలకు బానిస అయిన శంభాజీని హీరోగా చూపించారంటూ తీవ్రంగా ఆక్షేపణలు వచ్చాయి. కొందరు పరిశోధనలు చేశారు. కోట్ చేస్తూ వ్యాసాలు రాశారు. వాటికి దీటుగా సమాధానాలూ అంతే తీవ్రంగా వచ్చాయి. ఈ రోజుకు కూడా ఇలాంటి వక్రీకరణలు జరుగుతుంటే.. వాస్తవాలు తెలియజేయటం మన ధర్మం. అందుకే ఈ వ్యాస పరంపర.. ఈ శీర్షికలు.
ప్రశ్న14. మీ రచన హిందువులలో ఇంతకుముందు లేని ద్వేష భావనలను ఇస్లామీయులపై కలిగించి, అనవసర ఉద్విగ్నతలకు దారిస్తుందన్న అభిప్రాయం కొందరు వ్యక్తపరిచారు. దీనికి మీ వివరణ ఏమిటి? అలాగే, ఇప్పుడు గతాన్ని త్రవ్వి తీయాల్సిన అవసరం ఉందా? అనీ కొందరు ఆక్షేపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
జ: హిందువులలో ఎలాంటి ద్వేష భావనలు తలెత్తవు. ముస్లింలో మాత్రం ఇప్పటికే తీవ్రంగా ద్వేషాన్ని నూరిపోశారు. దీనికి తోడు పదే పదే హిందువులలో ఒక న్యూనతా భావాన్ని బలంగా ఇంజెక్ట్ చేశారు. ఆ న్యూనతా భావాన్ని పోగొట్టడం మాత్రమే దీని ఉద్దేశం. ఎవరిపైనా ద్వేష భావనలు పెంచడం ఎంతమాత్రం కాదు. దేశీయమైన జ్ఞానాన్ని అందించటమే దీని ఉద్దేశం. నిజమైన చరిత్రను చెప్పటం ద్వారా భవిష్యత్తులో తమకు తాము తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడం.. భారతీయ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఈ తరాన్ని ఉద్యుక్తులను చేయటమే అవుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ దేశం భారతదేశం. ఇక్కడ పుట్టినవారంతా భారతీయులే. భారతీయ ధర్మం మొదట్నుంచీ కూడా ఏ మతంలో మంచి ఉన్నా.. ఏ వ్యక్తిలో మంచి ఉన్నా.. ఏ వ్యవస్థలో మంచి ఉన్నా వాటిని తనలో తాను సంలీనం చేసుకుంటూ.. చెడును సంస్కరించుకుంటూ అనంత ప్రవాహంగా సాగిపోతున్నది. అంతే తప్ప ఒక ధర్మంపైనో.. ఒక వ్యవస్థపైనో ద్వేషం పెంచుకొని పగబట్టే లక్షణం ఇక్కడ మౌలికంగానే లేదు. ఇస్లాంలో కాఫిర్ అన్న పదానికి భారతీయ ధర్మంలో చార్వాకులు అని నిర్వచనం ఉన్నది. కాకుంటే.. కాఫిర్ అంటే.. అల్లాను నమ్మనివాడు అని అర్థమైతే.. చార్వాకులు అంటే దేవుడిని నమ్మనివాడు అని అర్థం. అలాంటి చార్వాకులకు కూడా తర్పణం వదిలే ధర్మం భారతదేశానిది. కాబట్టి ఒకరిమీద ద్వేషం పెల్లుబుకుతుందని అనుకోవడం భ్రమ మాత్రమే.
ప్రశ్న15. ఖురాన్ నుంచి ఉదహరించినందుకు నూపుర్ శర్మ రాజకీయ జీవితం నాలుగు గోడలకు పరిమితమయింది. సర్ తన్ సే జుదా అంటూ దేశం అల్లకల్లోలమయింది. మీ రచనకు ప్రతిస్పందన ఎలా వుంటుందనుకుంటున్నారు?
జ: నూపుర్ శర్మ డీపీ పెట్టుకున్నందుకు రాజస్థానలో కన్హయ్యలాల్ అనే టైలర్‌ను దారుణంగా హతమార్చారు. నా రచనకు అంత తీవ్రంగా ప్రతిస్పందన ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే.. తెలుగులో ఇలాంటి పుస్తకాలను చదువరు. టైటిల్ చూడగానే.. లేదా.. ఆల్రెడీ తాము వేసిన ముద్ర ప్రకారం రచయిత పేరు చూడగానే పుస్తకాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఈ మధ్యే ఒక కొత్త ట్రెండ్ మొదలైంది.. తమకు నచ్చని వారిని, తమ వర్గం కాని వారిని ‘తెలుగు సాహిత్యం బహిష్కరించింది’ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం.. నేనూ ఆ కోవలోకే వస్తానేమో..
ప్రశ్న16. మీ రచన లక్ష్యం, ఉద్దేశాలు నెరవేరినాయనిపిస్తున్నదా?
జ: నెరవేరడం, నెరవేరకపోవడం మన చేతిలో లేదు. మన కర్తవ్యం మనం నిర్వహించాం. దేశం కోసం మన వంతు బాధ్యత నిర్వహించాం. ఇక అది ఎలా నెరవేరుతుందనేది ఈ దేశం చూసుకుంటుంది.
ప్రశ్న17. ఈ రచనలో ఏ అధ్యాయాన్ని రాయటానికి ఎక్కువ కష్టపడ్డారు?
జ: బానిసలు రాజులుగా మారి ఢిల్లీ గద్దెను పాలించిన అధ్యాయాలు రాయడానికి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆ రాజుల వ్యక్తిత్వాలు పార్లమెంటరీ భాషలో రాయడానికి పదాలు కూడా దొరకని పరిస్థితి. చీరకట్టిన సుల్తాన్ అన్న అధ్యాయంలో అల్తమష్ అనే బానిసరాజు ఎంత కిరాతకంగా తన లైంగిక వాంఛలను తీర్చుకున్నాడో.. అందుకు ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో తలచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది.
ప్రశ్న18. మీ ఈ రచనలో ఏ అధ్యాయం మీకు బాగా నచ్చింది?
జ: తలలు తెగినా తలవంచని వీరుడు.. గురుగోవింద్ సింగ్ చేసిన త్యాగం. తన గురువు తల తెగిపడితే.. తలకు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. తన ఇద్దరు కుమారులను హతమార్చినా తలవంచకుండా నిలబడిన వీరుడు గురుగోవింద్ సింగ్. ఇది అద్భుతమైన అధ్యాయం. భారతదేశం ఒక అరేబియా కాలేదు. ఒక పర్షియా కాలేదు. ఒక మంగోలియా కాలేదు అంటే ఇలాంటి మహానుభావుల త్యాగాల ఫలితమే. ఈ వీరుల త్యాగమే ఈ తరానికి తమ దేశాన్ని, తమ ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రేరణ అవుతుంది.
ప్రశ్న19. ఏ అధ్యాయం ఇంకా బాగా రాయవచ్చు అనిపించింది? ఎందుకు?
జ: చాలా అధ్యాయాలు. ఎందుకంటే.. ఇది ధారావాహికగా రాయటం వల్ల ప్రతి వారం రాయాల్సి రావడం వల్ల కొన్ని అధ్యాయాలు అప్పుడే ముగిసిపోయాయా అనిపిస్తాయి. ఉదాహరణకు శంభాజీ పై రాసిన వ్యాసం ధారావాహికలో చాలా తక్కువగా ఉంటుంది. పుస్తకంలోకి వచ్చేసరికి అది చాలా విస్తరించింది.
ప్రశ్న 20. ఇంతకీ చరిత్ర రచనలో ఎలాంటి దృక్కోణం కావాలంటారు?
జ: చరిత్ర రచనకు ఎలాంటి దృక్కోణం ఉండరాదు. చరిత్రను చరిత్రగానే చెప్పాలి. దానికి మనదైన వ్యాఖ్యానాలు జోడించరాదు. రామాయణం, భారతం, మౌర్యులు, అరబ్బులు, క్రైస్తవులు ఇలా అందరి చరిత్రనూ దృక్కోణం లేదా దృక్పథం పేరుతో సొంత వ్యాఖ్యానాలు చేసి చరిత్రను చరిత్ర కాకుండా చేశారు. అందుకే మంచైనా, చెడైనా చరిత్ర చరిత్రగానే ఉండాలి. నిజం ఎప్పటికీ నిష్ఠురంగానే ఉంటుంది.
ప్రశ్న 21. మీ రచన చివరలో సుప్రసన్నాచార్య గారి కవిత ‘సాంపరాయం’ నుంచి ఉదహరించారు. ఏ రకంగా ఆ కవిత మీ రచనకు జోడింపు అవుతుంది?
జ: ‘కల్లోల భారతం’ గ్రంథ సమగ్రమైన స్వరూపాన్ని ఆ కవిత సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అందుకే దాన్ని చివరలో జోడించాను.
ప్రశ్న 22. అర్ధరాత్రి స్వతంత్రం మనల్ని పరాజితులను చేసింది అన్నారు చివరలో. మనం పరాజితులమెందుకయ్యాం? విజేతలమెప్పుడవుతాం?
జ: ఈ దేశంలో జాతీయ భావన పెల్లుబుకినప్పుడు. సంతుష్టీకరణ రాజకీయాలు అంతమై, దేశాన్ని ఒక ముక్కగా, ప్రజలందరినీ భారతీయులుగా మాత్రమే గుర్తించినప్పుడు.. ప్రతి ఒక్కరూ కూడా ఇది నా దేశం అని మన:స్ఫూర్తిగా భావించినప్పుడు.
ప్రశ్న 23. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం తరువాత బ్రిటీష్ వారు హిందువులకు ఎక్కువ అవకాశాలిచ్చి ఇస్లామీయులను క్రూరంగా హింసించి వారికి అవకాశాలివ్వకుండా వారిని అణగద్రొక్కారంటారు. ఈ విషయం మీ రచనలో అంత లోతుగా ప్రస్తావించలేదు. భారతదేశ చరిత్ర అంటే, హిందూ చరిత్ర మాత్రమేనా? ఈ దేశం కోసం పోరాడిన ఇస్లామీయులు లేరా?
జ: హిందువులకు ఎక్కువ అవకాశాలిచ్చి, ఇస్లామీయులను క్రూరంగా హింసించారన్నది అబద్ధం. మొదట్నుంచీ కూడా వారు ముస్లింలను తమకు అనుకూలంగా వాడుకున్నారు. 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో కూడా ముస్లింలు ఒక సమాజంగా పోరాటానికి మద్దతు ఇవ్వలేదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిష్ వారి గైడెన్స్‌లో భారతదేశంలో హిందువులకు ముస్లింలను దూరం చేసే పనిలో సక్సెస్ అయ్యారు. బెంగాల్ విభజన సమయంలో కూడా ఢాకా నవాబును బ్రిటిష్ వారు పూర్తిగా తమ కోసం వాడుకున్నారు. బెంగాల్లో ఉద్యమం తీవ్రమైనప్పుడు మాత్రమే ముస్లింలపై కొంత వరకు అణచివేత చర్యలు జరిగాయి అంతే తప్ప బ్రిటిష్ వారు ఇస్లామీయులను ఏదో చేశారనడం పొరపాటు. మింటో మార్లే సంస్కరణల కారణంగానే మొట్టమొదటగా దేశంలో మత విభజన జరిగింది. ఈ సంస్కరణలకు కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సూత్రాలనే బ్రిటిష్ వారు ప్రాతిపదికగా తీసుకున్నారు. 1906లో సిమ్లాలో జరిగిన సమావేశంలో ఆగాఖాన్ నేరుగానే బ్రిటిష్ వారికి అండగా ఉండాలని ప్రతిపాదించారు. బ్రిటిష్ వాళ్లను మనం వాడుకోవాలి. వారికి సహాయం చేస్తున్నట్టుగా పనిచేసి.. మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలని స్పష్టంగానే చెప్పారు. ఆ తరువాత లార్డ్ మింటోను కలిసి మేము మీకు అండగా ఉంటాం.. మాకు మా వాల్యూను గుర్తిస్తే చాలు అని ఒప్పందం చేసుకున్నారు. ముస్లింలకు ప్రత్యేక ఓటర్లు అనే సంస్కరణ తెచ్చారు. ఆ తరువాత ముస్లింలీగ్ బ్రిటిష్ వారికి అనుకూల తీర్మానాలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ లోని మితవాదులు మెతకవైఖరి అవలంబించారు. ముస్లింలు అనుకూల వాదన వినిపించారు. కొద్ది సంఖ్యలో ఉన్న అతివాదులు మాత్రమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎక్కడో ఒక చోట వ్యక్తులుగా ముస్లింలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉండవచ్చు. జాతీయోద్యమంలో పాల్గొని ఉండవచ్చు. కానీ, సంస్థాగతంగా ముస్లిం సమాజం బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారానే రెండు దేశాలను సాధించుకోగలిగింది.
భారతదేశ చరిత్ర అంటే హిందూ దేశ చరిత్ర అని ఎవరన్నారు. నేను రాసిన ‘కల్లోల భారతం’ అంతా ఇస్లామీయుల చరిత్రే కదా..
ప్రశ్న 24. ఈ పుస్తకం ప్రధానంగా ఉత్తరాది చరిత్రకు ప్రాధాన్యం ఇచ్చింది తప్ప దక్షినాది చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. టిప్పుతో సహా అనేక దక్షిణాది పోరాటవీరుల ప్రస్తావన అంతగా లోతుగా లేదు. ఎందుకని?
జ: ఈ పుస్తకం ప్రధానంగా భారతంలోకి ఇస్లాం చొరబాటు.. తద్వారా తూర్పు, ఉత్తర వాయవ్య భారతంలో జరిగిన సంపూర్ణ ఇస్లామీకరణ.. పర్యవసానంగా జరిగిన దేశ విభజన ఇతివృత్తంగా సాగింది. అందుకే దక్షిణాది ప్రస్తావన పెద్దగా లేదు. విజయనగర రాజుల గురించి స్వల్పంగా ఉన్నది. అయితే, ‘కల్లోల భారతం’ కంటే ముందు రాసిన ‘రామం భజే శ్యామలం’లో దక్షిణాది చరిత్ర మరింత విపులంగా ఉంటుంది.
ప్రశ్న 25. సుల్తానులలో మనం గొప్పగా చెప్పుకునేదేమీ లేదంటారా? వారి గురించి మంచి ఏమైనా చెప్తారా?
జ: చెప్పడానికి ఏమీ లేదు. ఎవరూ గొప్పవారు కారు.
ప్రశ్న 26. ఈ పుస్తక ప్రచురణలో మీ అనుభవాలు వివరిస్తారా?
జ: పుస్తకం పూర్తయిన తరువాత అచ్చులోకి రావడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన వారు సాహితి ప్రచురణలు విజయవాడ. ఈ సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మిగారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కాకపోతే ఈ ఆలస్యానికి కారణం పెద్దలైన వారు ముందుమాటలు రాయడంలో కొంత జాప్యం చేశారు. అంతే.
ప్రశ్న 27. ఇటీవలి కాలంలో పుస్తక ప్రచారం కూడా రచయిత బాధ్యత అవుతున్నది. ఈ పుస్తక ప్రచారానికి మీరు ఎలాంటి పథకాలు వేస్తున్నారు?
జ: పుస్తకానికి ప్రచారం చేయడం ఈ రోజుల్లో చిన్న విషయం ఏమీ కాదు. ఈ పుస్తకాన్ని ప్రజ్ఞాభారతి వారు ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ప్రజ్ఞాభారతి చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు దీన్ని ఆవిష్కరించారు. తరువాత ప్రజ్ఞాభారతి సంస్థే.. వివిధ జిల్లాల్లో ఈ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యతను తలెత్తుకున్నది. వారికి శతధా కృతజ్ఞతలు.
ప్రశ్న 28. ఈ పుస్తక రచనలో మీ లక్ష్యం ఏమిటి? అది సాధించినట్టేనా?
జ: నా రచన లక్ష్యం ఈ దేశ నిజమైన చరిత్రను వెలికితీయడం, వక్రభాష్యాలను చక్క చేయడం. చేయగలిగాననే అనుకుంటున్నా.. పాఠకులు చదివి చెప్పాలి.
ప్రశ్న 29. ఈ పుస్తకంతో మీపై ఒక ముద్రవేసి మిమ్మల్ని సాహిత్య పెద్దలు విస్మరిస్తారన్న భయం మీకు కలగలేదా? ఒక సీనియర్ సాహిత్యవేత్త మీపై భౌతికదాడి జరగవచ్చని మిమ్మల్ని హెచ్చరించాడు కూడా.. దానికి మీ ప్రతిస్పందన ఏమిటి?
జ: ఈ పుస్తకంలో ఒక్కో వీరుడి గురించి చదివిన ఏ ఒక్కరికైనా ఎలాంటి భయమూ ఉండదు.
ప్రశ్న 30. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: ప్రస్తుతం ‘రావణ రహస్యం’ అన్న ధారావాహిక సంచికలో వస్తున్నది. ఈ దేశంలో రాక్షసులను, అసురులను, దుర్మార్గులను గొప్పవాళ్లను చేసి.. దేశాన్ని ఆసేతు హిమాచలం ఏకం చేసిన మహానుభావులను విలన్లుగా చిత్రించే ప్రయత్నాలకు చెంపపెట్టుగా ఈ ధారావాహిక కొనసాగుతున్నది. ఇది నా రచనా ప్రయాణంలో ఒక ఫిల్లర్. అంతర్గతంగా భారతీయ ధర్మాన్ని బలహీనం చేస్తున్న కుట్రలను వివరించే పుస్తకం ‘రామం భజే శ్యామలం’ వచ్చింది. దేశంలో ఇస్లాం ప్రవేశం తరువాత చారిత్రకంగా సంభవించిన పరిణామాలను వివరించే పుస్తకం ‘కల్లోల భారతం’ వచ్చింది. దీని తరువాత బ్రిటిష్ వారి అండతో ప్రవేశించిన మిషనరీల వల్ల కలిగిన పరిణామాలను వివరించే మరో పుస్తకం వస్తే.. ఈ మూడూ కలిపి దేశ చరిత్రకు సంబంధించి ట్రిలజీ పూర్తవుతుంది..
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కోవెల సంతోష్ కుమార్ గారూ.
కోవెల సంతోష్ కుమార్: ధన్యవాదాలు.
***
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 368
వెల: ₹ 275/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్ 9000413413
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత: 9052116463, 7396116463
ఆన్లైన్లో:
https://www.amazon.in/dp/B0FRXNJ63V
~
‘కల్లోల భారతం’ పుస్తక విశ్లేషణ:
https://sanchika.com/kallola-bharatam-book-analysis-hk/

