[‘అమ్మతోడు అరుణా, వచ్చే జన్మల ఈ తప్పులు చేయను!’ అనే కవితాసంపుటిని వెలువరించిన శ్రీ లాల లింగమూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం లాల లింగమూర్తి గారూ.
లాల లింగమూర్తి: నమస్కారం.
~
ప్రశ్న 1: ఇటీవల ‘అమ్మతోడు అరుణా, వచ్చే జన్మల ఈ తప్పులు చేయను!’ అనే కవితాసంపుటి వెలువరించారు. మీ శ్రీమతి అరుణ గారి స్మృతిలో ఎలిజీలు వ్రాసి ప్రచురించాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా వచ్చింది?
సమాధానం: ఆమె ఎప్పుడూ జ్ఞాపకం వస్తూ ఉంటుంది.. ‘ఆమె ఆత్మాభిమానం విషయంలో నేను ఎక్కడైనా తప్పు చేశానా?’ అని తరచూ ప్రశ్నించుకుంటున్నపుడు నాకు కొన్ని అంశాలు దొరికాయి. వాటిని కవితా రూపంలో అప్పుడప్పుడు చదువుకోవడానికి నా కోసం నేను పేపర్ మీద రాసుకున్నాను. గద్వాల స్నేహితుడు నాయుడు గారి జయన్న, నా యువ న్యాయవాద స్నేహితుడు వంగల కర్ణ ప్రేరణతో పుస్తక రూపంలో రాగలిగింది.
ప్రశ్న 2: మీ శ్రీమతి స్వర్గీయ అరుణగారిని తలుచుకోడంతో పాటుగా, కొత్త దంపతులు కలతలు లేని వైవాహిక జీవితం ఎలా గడపాలో తెలిపేందుకు ఈ సంపుటిని ప్రచురించారని అనిపిస్తోంది. ఈ పుస్తకం ప్రచురణ నేపథ్యం తెలియజేయండి.
సమాధానం: నిజమే, అదే ఉద్దేశంతో రాశాను. అందరూ అనలేము కానీ కొంతమంది ఏ విషయంలోనైనా తమ వయసుకు తగ్గ అవగాహన లేమితో ఉంటారు. పుట్టి పెరిగిన వాతావరణం జగడాలమారిగా ఉండి, ప్రేమమయమై ఉండకపోవచ్చు.. భవిష్యత్తు సంఘటనలను సరిగా అంచనా వేయలేరు.. దానికి తోడు ఆవేశము, ఇంపల్సివ్ పనులు చేస్తుంటారు. మంచివారే కాని తమ తప్పులు తెలిసేనాటికి కాలం దాటిపోతుంది. యువత మరియు పెళ్లయిన యువతకు కొంతనైనా అవగాహన కలిగించాలని ఈ పుస్తకం ప్రచురించాను.
ప్రశ్న 3: మీరు న్యాయవాది. సాహిత్యం మీద అభిరుచి ఎప్పుడు ఎలా కలిగింది? మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
సమాధానం: పదవ ఏటనే అందరూ ఆటలాడుకోవడానికి వెళ్తుంటే నేను కరీంనగర్ మెయిన్ బస్టాండ్ ముందర ఉన్న ‘బాల భవన్’ వెళ్లేవాడిని. ముందరి హాలులో పేపర్లు, పుస్తకాలు ఉండేవి. గానం సంగీతం సాహిత్యం వీటి మీద అభిరుచి కొంత పుట్టుకతోనే వస్తుంది కదా! డిగ్రీ కాలేజ్ మేగజైన్ కి స్టోరీ కావాలని అడిగితే ఒక వ్యవసాయ బావిలోకి దిగి ఏకబిగిన 13 పేజీల కథ రాసి కాలేజీలో ఇచ్చాను. దాన్ని యథాతధంగా ప్రచురించారు. ఇక్కడ ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే పలానా కాన్సెప్ట్‌తో కథ రాయాలి అని మొదలు పెట్టలేదు.. రాయడం మొదలుపెట్టినాక కథ వచ్చింది. ప్రైవేటు స్కూలులో పిల్లల స్వాతంత్రం మీద ‘స్వాతంత్రం’ అనే పేరుతో వచ్చిన కథ అది. ఇప్పటి సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ గారు దాన్ని ఆనాడు కాలేజీలో ప్రశంసించారు.
ప్రశ్న 4: ఈ పుస్తకంలో మీరు జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’ లోని బిగ్ బ్రదర్ ముఠా గురించి ప్రతి కవితలోనూ ప్రస్తావించారు. బిగ్ బ్రదర్ ముఠా గురించి సంక్షిప్తంగా ఒకటి రెండు వాక్యాలలో చెప్పారు. మరింత వివరంగా చెప్పండి?
సమాధానం: జార్జ్ ఆర్వెల్ ‘1984’నవలలోని అంశం ఏంటంటే ఒక ఇంట్లోకి కొంతమందిని పంపి వాళ్లలో వాళ్లని రెచ్చగొడుతూ వాళ్ల దైనందిన గోలను, స్పందనను గమనిస్తూ సంతోషపడుతుంటారు. జాలి దయా వీళ్ళకి ఉండదు. సాడిస్టిక్ ప్లెజర్.
ప్రశ్న 5: ఈ సంపుటిలోని చాలా కవితలలో మానసిక శాస్త్రపు పదాలు దొర్లాయి. ప్రత్యేకించి కవితల కోసమే ఎంచుకున్న పదాల వలె కాకుండా, authoritative గా ఉపయోగించారు. మీకు మానసిక శాస్త్రంలోనూ ప్రవేశం ఉందా?
సమాధానం: కొంతవరకు ఉంది. ప్రతి వ్యక్తికి సోషల్ అండ్ హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన అవగాహన ఉండాలి. ఇందుకోసం పుస్తకాలు చదివినా చదవకపోయినా కొంచెం ఆసక్తి ఉంటే చాలు. ఒక ఉదాహరణ చెప్తాను. పెళ్లి సమయంలో కట్న కానుకలు తీసుకోవడం ఒక భయంకర నేరం. ‘కట్నం తీసుకోవద్దు’ అని ఉద్యమించిన యువకుల్లో నేనొక్కడిని. సంపన్నురాలైన ఏకైక సంతానమైన అమ్మాయిని వద్దని, పెద్దలు కుదించిన పెళ్లి అయినప్పటికీ కట్నం లాంటిది ఏది తీసుకోకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్డ్ మ్యారేజ్‌తో అరుణ జీవితంలోకి వెళ్లాను. ఆమె చాలా సంతోషించింది. ఇంతకన్నా ముఖ్యమైనది మహిళకు ఏంటంటే దైనందిన జీవితంలో మరియు చిన్నచిన్న విషయాల దగ్గర తన భర్త (సహచరుడు) తన ఆత్మ గౌరవాన్ని కాపాడడం. ఈ హ్యూమన్ సైకాలజీ పెళ్లి చేసుకోబోయే మగవాడికి తెలిసి ఉండాలి.
ప్రశ్న 6: “ఇద్దరి మధ్య సూదిని తీయడానికి క్రేన్లను తెచ్చాం! మనుషుల తీరు నీకూ తెలియదు నాకూ తెలియదు” అన్నారు తొమ్మిదో పేజీలో. దంపతుల మధ్య ఇతరులు తంపులు పెడుతున్నారన్నది ఎందుకు గ్రహించలేకపోయారు?
సమాధానం: దాన్నే బుద్ధి మాంద్యం అంటున్నారు. మూర్ఖత్వం అని కూడా అంటాం. ఇతరుల దుష్ట ఆలోచనలను అర్థం చేసుకోకపోవడాన్ని మన మామూలు భాషలో చెప్పాలంటే ‘అమాయక చక్రవర్తులు’ అంటారు కదా! ఇది తేలికైన సంబోధన అయినా ఈ అమాయక చక్రవర్తుల స్వభావం మరియు మంచితనంతో పాటు వాళ్లకి మరియు వాళ్లతో ఉన్నవాళ్లకి, కోలుకోలేనంతగా ఇబ్బంది పెడుతుంది.
ప్రశ్న 7: చాలా కవితల్లో సంస్కృత పదాలు విరివిగా ఉపయోగించారు? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
సమాధానం: ప్రపంచంలోనే పురాతన భాషైన సంస్కృతానికి నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర ఉంది. దేవభాష, అమృత భాష అనే విషయాలు ఎలా ఉన్నా, కొద్ది పదాలతోనే ఇంగ్లీష్ కన్నా సంస్కృతమే లోతైన భావాలను, సమాజ స్థితిగతులను, మానవ స్వభావాలను వెల్లడిస్తుంది. రాష్ట్రాలలో లేదా దేశంలో నిర్వహించబడుతున్న అన్ని పోటీ పరీక్షలకు ‘సంస్కృతం’ పేపర్ ఉండాలని నా బలమైన నమ్మకం!
ప్రశ్న 8. ‘సోదయినా వినాలి’ కవితలోని ఒక చరణంలోని చివరి వాక్యం ‘అప్పుడు తెలియదు నాకు, తెల్సిందిప్పుడు’ – దంపతుల మధ్య నిరంతరం కొనసాగాల్సిన సంభాషణాఝరిని ప్రస్తావిస్తుంది. ఈ కవిత నేపథ్యం గురించి వివరించండి.
సమాధానం: భారతీయ సంస్కృతిలో భార్య ప్రతి విషయాన్ని తన భర్తకు చెప్పాలనుకుంటుంది. అలాగే చెప్తుంది. మన సమాజంలో ఇప్పుడిప్పుడు మార్పులు వస్తున్నా మగనితో పోల్చుకుంటే మహిళకు బయట ప్రపంచంతో చాలా తక్కువ అనుసంధానం ఉంటుంది. కనక తనకు కలిగిన ప్రతి చిన్న అనుభవాన్ని, ఎదురైన విషయాల్ని భర్తకు చెప్పాలనుకుంటుంది. భర్తకు అది చిన్న విషయమే, మామూలే. అయినా ఆమె మానసిక సంతృప్తి కోసం, రిలాక్స్ కోసం తప్పకుండా ఆమె చెప్పేది మొత్తం వినాలి. పెళ్లయిన తర్వాత పదేళ్ల వరకు భార్య చెప్పేది ఏదీ సరిగా వినకుండా మగవాడు ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. ఆ విషయంలో భార్య కుమిలిపోతుంది!
ప్రశ్న 9. ‘ఆయనకు నేనంటే ఇష్టం లేదు’ కవిత అన్యోన్య దాంపత్యానికై చక్కని సూచన చేసింది. “పతి పైత్యం తగ్గించుకుని/ప్రేమ వ్యక్తపరచాలి” అంటూ పురుషాహంకారాన్ని తగ్గించుకోవాలన్న సూచన చేశారు. ఈ కవిత గురించి మరికొంత వివరంగా చెప్తారా?
సమాధానం: స్త్రీ పురుషుల మధ్య ఉండే సహజమైన శారీరక ఆకర్షణ పెళ్లయిన తర్వాత (మానసిక అనుబంధం పెరిగినా) కొన్నాళ్లకు తగ్గుతుంది. ఇది సహజమే. స్వీట్ తింటూ, స్వీట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటే మొహం మొత్తుతుంది. దీన్ని మగవాడు ఖచ్చితంగా తనకు తానుగా అర్థం చేసుకోవాలి. భార్య పట్ల మోజును తనకు తాను ఎప్పుడు కొత్తగా అల్లుకుంటూ గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. దీనికన్నా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే దైనందిన జీవితంలో, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ భార్య పట్ల తనకి ఎంత ప్రేమ ఉందో చెబుతూ ఉండాలి. అది రొటీన్‌గా కాకుండా గుండె కదలికతో ఉండాలి. లేదంటే ‘ఆయనకు నేనంటే ఇష్టం లేదు’ అని ఆమె అనుకోగల అవకాశం ఉంది. ఇది ఆ జంటకు, కుటుంబానికి మంచిది కాదు. భార్యాపట్ల ఇష్టం ఉన్నా, దాన్ని అనేక సందర్భాలలో మగవాళ్ళు వ్యక్తపరచరు. భర్త చేసే మొదటి తప్పు ఇది.
ప్రశ్న 10. ‘అమ్మతోడు అరుణా..’ పుస్తకాన్ని రీ ప్రింట్ ఎప్పుడు చేయిస్తున్నారు?
సమాధానం: రీ ప్రింట్‌తో పాటు పుస్తకం పేరును, కాపీరైట్ పేజీలో తెలియపరుస్తూ, ఎడిట్ చేయాలనుంది. ఇప్పుడున్న పేరు ‘అమ్మతోడు అరుణా, వచ్చే జన్మల ఈ తప్పులు చేయను!’. నిజాయితీని ప్రతిబింబిస్తున్న ఈ పేరులో ఉన్న అసౌకర్యం ఏంటంటే ‘ఇది ఆ వ్యక్తి సొంత గోల, మనకెందుకు?’ అని పాఠకులు అనుకుంటున్నారు.
కానీ ఈ కవితల్లో ఉన్న మ్యాటర్/కంటెంట్ సార్వజనీనం. అందుకని ఈ పుస్తకం పేరును ‘అమ్మతోడు అరుణా, దగ్గరి వారే నమ్మకద్రోహులు!’అని మారుస్తున్నాము.
ప్రశ్న 11. మీ కవితా సంపుటి ‘అమ్మతోడు అరుణా..’ 13 వ పేజీలోని ‘నా మాట’లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లాగా ప్రి-మ్యారేజ్ కౌన్సెలింగ్ ఉండాలి అన్నారు. అది ఎలా?
సమాధానం: హై స్కూల్ పాఠ్య పుస్తకాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాల లాగా కాలేజీ పాఠ్య అంశాల్లో ‘ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్’ పాఠాలు ఉండాలి. అలాగే పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ ఎలాగైతే ఒక ఆచారంగా ఉందో, స్థానిక పోలీస్ స్టేషన్లలో కాబోయే వధూవరులకు ‘ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్’ తప్పనిసరిగా ఉండాలి. అట్లా స్థానిక పోలీస్ స్టేషన్లలో ‘ఫ్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్’ తీసుకున్నారనె నిర్ధారణ తర్వాతే పెండ్లి పత్రికలు అచ్చు వేయించగల నిబంధన ఉండాలి. ఈ నిబంధన తప్పకుండా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఇందుకు ప్రభుత్వానికి ఖర్చు ఉండదు. ఓట్ల డామేజ్ ఉండదు. ఫై హెచ్చు మైలేజ్ ఉంటుంది. మొదట్లో బెరుకుగా అనిపించినా, క్రమంగా వధూవరులు మరియు సంబంధిత కుటుంబాలు ఆనందంగా అలవాటు పడతాయి. దీనివల్ల సమాజంలో అన్యోన్య కుటుంబాలు వెలుస్తాయి. విడాకులు తగ్గుతాయి. రాబోయే కాలంలో అలాంటి సుందరమైన రోజులు వస్తాయి!
ప్రశ్న 12. “కాలచక్రంలో కల చెదిరింది/అయినా కథ ఇంకా ఉంది” అన్నారు ‘ఫర్నిచర్’ అనే కవితలో. దుస్సాహసమైన ఒంటరితనాన్ని భరించడం, అందునా ఆమె ఉపయోగించిన ఆయా వస్తువులనూ చూస్తూ కాలం గడపడం ఎంత కష్టమో ఈ కవిత చెబుతుంది. అరుణ గారి స్మృతిలో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారా? వివరించండి.
సమాధానం: అందుబాటులో ఉన్నవి చేస్తుంటాను.. ఇంకా చాలా చేయాలని ఉంది. ఆమెకు ఒక గుడి కట్టించాలని ఉంది. ఆమె సంతాన దేవత!! అంత ఆరోగ్యకరమైన శరీరం ఆమెది. భర్తగా ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. మా పెళ్లయింది బుధవారం రోజున. ప్రతి బుధవారం పేదలకు, ఆర్థిక స్థితిని బట్టి కనీస పది మంది పేదలకు అన్న వితరణ చేయాలని ఉంది. ఆమె సంతాన దేవత. ఆమె ప్రేమ దేవత కూడా. నాకున్న 90 గజాల స్థలంలో కరీంనగర్ పట్టణంలో ఆమె కోవెల నిర్మించాలని ఉంది. పోలీస్ శాఖ మరియు న్యాయస్థానం సహకారంతో ఏనాటికైనా, నేను చనిపోవడానికి ముందే అరుణ గుడి కట్టిస్తాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి!!
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు లాల లింగమూర్తి గారూ.
లాల లింగమూర్తి: ధన్యవాదాలు.
***
రచన: లాల లింగమూర్తి
ప్రచురణ: చిట్టి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 116
వెల: ₹ 60/-
ప్రతులకు:
చిట్టి పబ్లికేషన్స్,
హైదరాబాద్
ఫోన్: 9866456009
~
‘అమ్మతోడు అరుణా, వచ్చే జన్మల ఈ తప్పులు చేయను!’ అనే కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/amma-thodu-aruna-vacche-janmala-ee-tappulu-cheyanu-book-review-dr-kp/

