[‘డోరేదార్’ అనే కథాసంపుటి వెలువరించిన మధు పెమ్మరాజు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం మధు పెమ్మరాజు గారూ.
మధు పెమ్మరాజు: నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన సంచిక సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారికి, కొల్లూరి సోమశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
~
జ: ‘డోరేదార్’ అంటే చాలా ప్రత్యేకమైన గాలిపటం. అది ఆకాశంలో ఎగిరేటప్పుడు గాలి ఒత్తిడికి చిరగకుండా ఉండేందుకు దాని అంచుల చుట్టూ దారం చుట్టి పటిష్టంగా తయారు చేస్తారు. ఈ కథ చదువుతుంటే బాల్యం, అప్పట్లో అందనంత ఎత్తులో ఎగిరే ఆ ‘డోరేదార్’ కోసం పడిన ఆరాటం మళ్ళీ కళ్ళకు కట్టినట్లు గుర్తుకొస్తాయి.
నిజానికి గాలిపటం అంటేనే స్వేచ్ఛకు ప్రతీక. ఈ సంపుటిలోని కథలన్నింటిలోనూ ‘స్వేచ్ఛ’ అనే అంశం ఒక అంతస్సూత్రంలా కనిపిస్తుంది. అందుకే, కథా సంపుటికి ‘డోరేదార్’ అనే శీర్షికే సరిగ్గా సరిపోతుందని అనిపించింది.
ప్రశ్న 2: కథా రచయితగా, మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? ఎప్పుడు, ఎలా మొదలుపెట్టారు?
జ: మా పేరెంట్స్ పుస్తకప్రియులు కావడంతో ఇంట్లో ఎప్పుడూ చదివే వాతావరణం ఉండేది. మా కాలనీలో లైబ్రరీతో పాటు పుస్తకాలు అద్దెకిచ్చే దుకాణం కూడా ఉండేది. ఆ రోజుల్లో మా మిత్రుల మధ్య ఎవరు ఎక్కువ పుస్తకాలు చదివారనే చిన్నపాటి పోటీ నడిచేది.
తర్వాత చదువు, కెరీర్ కారణంగా కొంత విరామం వచ్చినా, 2012 ప్రాంతంలో సెటైర్ బ్లాగులు రాయడం ప్రారంభించాను. ‘కౌముది’ పత్రికలో నా మొదటి కథ ప్రచురితమైంది. ఆ తర్వాత ‘ఎత్తరుగుల ఇల్లు’ కథకు వంగూరి ఫౌండేషన్ బహుమతి రావడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
2014–2018 మధ్య విరివిగా రచనలు చేశాను. ఆ తర్వాత వృత్తిపరమైన బాధ్యతల వల్ల రచన కొంత తగ్గినా, మంచి పుస్తకం కనిపిస్తే ఇప్పటికీ చదవకుండా ఉండలేను.
ప్రశ్న 3: “ఏ అనుభవం రచయితకి వస్తువు అవుతుంది? దేని గురించి రాయాలనిపిస్తుంది?” అని తమ ముందుమాటలో తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి గారు అడిగారు. కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని చాలా లోతుగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: ఆకాశంలో ఎన్నో తెగిన గాలిపటాలు కనిపిస్తాయి. కానీ కొన్ని మాత్రమే కొమ్మలకు చిక్కుకుని మన దృష్టిని ఆకర్షిస్తాయి. మన ఆలోచనలు కూడా అంతే – అన్నీ కథలుగా మారవు, కానీ కొన్ని మాత్రం మనల్ని వదలవు.
అలాంటి ఆలోచనలోని Core Emotion ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అది ఒక సంఘటన కావచ్చు, నోస్టాల్జియా కావచ్చు, ఒక వ్యక్తి స్వభావం కావచ్చు. ఉదాహరణకు, ‘ఇనుపతెర’ కథకి మూలం ఒక కొలీగ్‌తో జరిగిన కేవలం ఐదు నిమిషాల చిన్న సంభాషణే.
ఆ తర్వాత ఆ భావన చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటాను. పాత్రలు, వారి లక్ష్యాలు, వారి మధ్య ఉండే సంఘర్షణ – ఇవన్నీ సహజంగా అనిపించే వరకు ఆలోచిస్తాను. మొదట ఒక రఫ్ డ్రాఫ్ట్ రాస్తాను. ఆ దశలో ప్రవాహం ముఖ్యం. తర్వాత మళ్లీ చదివి, అనవసరమైన భాగాలను తొలగిస్తూ, పదాలను మెరుగుపరుస్తాను. నా వరకూ అయితే, ఒకే డ్రాఫ్ట్‌లో కథ పూర్తయిన సందర్భం లేదు. ఈ దశలోనే కథ తన అసలు రూపాన్ని సంతరించుకుంటుంది.
ఒక చిన్న ఆలోచన పూర్తి కథగా మారడం నిజంగా ఒక అద్భుతమైన అడ్వెంచర్. కథ పూర్తయ్యేసరికి కలిగే తృప్తి, రిలీఫ్ మాటల్లో చెప్పలేనిది.
కథలకై ప్రత్యేకంగా మనుషుల్ని పరిశీలించడం కాదండి, మన దైనందిన జీవితంలో జరిగే విషయాలే మనల్ని స్పందించేలా చేస్తాయి. మామూలు విషయాలలో కనిపించే ఏదో ఒక అసాధారణతే మనల్ని వాటి గురించి ఆలోచించేలా చేస్తుంది. కథ రాయడమంటే ఒక కమిట్మెంట్. ఆ బాధ్యత తీసుకోవాలంటే ఏదో బలంగా అనిపించాలి.
ప్రశ్న 4: “ఇవేవి ప్రణాళికాబద్ధంగా పుట్టిన కథలు కావు. కథకు కావల్సిన శిల్పం కుదిరేదాకా కసరత్తులు చేసిన కథలూ ఉన్నాయీ, సులువుగా అమరిన కథలూ ఉన్నాయి” అన్నారు మీ మాటలో. కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: వస్తువు, శిల్పం, శైలి ఇవి విడిగా ఉండే అంశాలు కావు కాబట్టి, నేను ఈ మూడింటిలో దేనికో ఒకదానికే ప్రాముఖ్యతనివ్వడం కంటే, కథా వస్తువుకు తగ్గ శిల్పం, ఆ శిల్పానికి నప్పే శైలి కుదిరేలా చూసుకోవడానికే ప్రయత్నిస్తాను.
ఎంచుకున్న వస్తువు ఎంత గొప్పదైనా, దాన్ని మలిచే శిల్పం బలంగా లేకపోతే ఆ కథ తేలిపోతుంది. అలాగే, శైలి అద్భుతంగా ఉన్నా, కథ ముగిసిన తర్వాత పాఠకుడికి ఏదో వెలితిగా, ఖాళీగా అనిపిస్తే దానికి కారణం వస్తువులోని లోపమే అని చెప్పాలి.
తెలుగు సాహిత్యంలో మనకు చిరకాలం గుర్తుండిపోయే ‘పడవ ప్రయాణం’, ‘వడ్లచిలుకలు’, ‘చీకటి’, ‘నల్లజర్ల రోడ్డు’.. వంటి ఎన్నో గొప్ప కథలన్నీ పాఠకుల మనసుల్లో ముద్ర వేసుకోవడానికి కారణం, ఈ మూడు అంశాల మధ్య కుదిరిన అద్భుతమైన సమన్వయమే!
ప్రశ్న 5: “మాటల కంటే మౌనంగా సాగే సంభాషణల విస్తృతి ఎక్కువ. వాటికి పరిధులు లేవు.” అనేది గొప్ప అబ్జర్వేషన్. ‘ఆఖరి మజిలీ’ కథలో జేమీ గాని డేవిడ్ గాని మీకు నిజజీవితంలో తారసపడిన వ్యక్తులా లేక కల్పిత పాత్రలా? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: న్యూయార్క్‌లో ఒక టాక్సీ డ్రైవర్, తన కారులో పర్సు మర్చిపోయిన ఒక ముసలావిడకి దాన్ని తిరిగి ఇచ్చాడనే చిన్న టీవీ వార్త. అది సాధారణంగా కనిపించినా, కథగా మారేంత లోతు ఉందనిపించింది.
ఈ కథను నేను 2015లో రాశాను. అప్పటికి ఇంకా ఊబర్ లాంటి యాప్స్ రాలేదు, టాక్సీ మీటర్ వ్యవస్థే ప్రధానంగా ఉండేది. ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఒక మిత్రుడు, ఊబర్లో కూర్చున్నాక మనకు నచ్చిన దారిలో వెళ్లమని అడిగే వీలుండదు కదా, మరి మీ కథలో ఆమె అలా ఎలా అడిగిందనే సందేహం వ్యక్తం చేశారు 🙂.
కథ నేపథ్యానికి వస్తే – మిసెస్ జేమీ ఆండర్సన్ జీవిత చరమాంకంలో ఒంటరిగా తన ఇంట్లో మిగిలిపోయింది. ఆఖరి మజిలీగా ఒక అడల్ట్‌ర్ హోమ్‌కి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటుంది. వెళ్లవలసిన అడ్రస్‌ను కాగితం మీద రాసి డ్రైవర్‌కు ఇస్తూ, తాను సూచించిన మార్గంలో తీసుకెళ్లమని కోరుతుంది. ఆ మార్గం దూరమని, ఆలస్యమవుతుందని డ్రైవర్ చెప్పినప్పుడు, “నేను వెళ్లే చోట నా కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు” అని ఆమె ప్రశాంతంగా సమాధానం ఇస్తుంది.
ఆ దారి పొడవునా ఆమె చదివిన స్కూలు. డాన్స్ నేర్చుకున్న హాలు, పని చేసిన స్మిత్ కంపెనీ భవనం, భర్తతో కలిసి ముప్పై ఏళ్లు గడిపిన ఇల్లు.. ప్రతి చోట ఆగుతూ, చూస్తూ, తలుచుకుంటూ ముందుకు సాగుతుంది. బావిలో చంద్రబింబంలా మెరిసే జ్ఞాపకాలను తనివితీరా మళ్లీ మళ్లీ దర్శించుకుంటూ సాగిపోతుంది జేమీ.
కాస్త దూరం వెళ్ళేసరికి, ఆ టాక్సీ డ్రైవర్‌కి మరియు మిసెస్ జేమీకి మధ్య ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఏర్పడుతుంది.
ప్రశ్న 6: ‘డోరేదార్’ కథలోనూ, ‘బౌండరీ దాటిన బాలు’ కథలోనూ తెలంగాణ యాస బాగా కుదిరింది. ఈ యాస మీకెలా పట్టుబడిందో చెప్తారా?
జ: నేను పెరిగింది హైదరాబాద్ లోని ఒక మధ్యతరగతి కాలనీ. ఆ కథలన్నీ మా కాలనీ నేపథ్యంగా రాసినవే. నేను పెరిగిన వాతావరణంలో మనుషులు మాట్లాడుకునే సహజమైన భాషే నా కథల్లో కనిపించింది తప్ప, యాస కోసం నేను ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కథకు అనివార్యమైతే తప్ప, కావాలని యాసను వాడటం సరైంది కాదని నా భావన.
సమయం, సందర్భం కలిసొస్తే, అప్పటి మధ్యతరగతి కాలనీ జీవితంలోని వైవిధ్యాన్ని, అక్కడి ఆత్మీయ అనుభవాలను మరిన్ని కథల రూపంలో పంచుకోవాలనే కోరిక ఉంది.
ప్రశ్న 7: ‘చీకటి నీడ’ కథలో హోస్మన్ కవితని తెలుగులో రాశారు, ‘దిగంతాల అంచుల్లో’ కథలోనూ మధ్యలో కవితలు వ్రాశారు. వాటిని చదువుతుంటే మీకు కవిత్వంలోనూ ప్రావీణ్యం ఉందని అనిపిస్తుంది. కవితలు వ్రాశారా/వ్రాస్తున్నారా?
జ: ప్రావీణ్యం లేదండి, ఇష్టం మాత్రం ఉంది. మొదట్లో కొన్ని కవితలు రాసాను, తర్వాత కథలకే పరిమితమయ్యాను. కానీ కొన్ని సందర్భాల్లో చెప్పాలనిపించే భావం సరిగ్గా వ్యక్తం కాకపోతే, కొన్ని పంక్తులు ప్రయత్నిస్తుంటాను.
ప్రశ్న 8: ‘ఎత్తరుగుల ఇల్లు’ చక్కని కథ. రామంగారి పాత్రలో చక్కని తాత్త్వికత నింపారు. ఈ నేపథ్యం వివరిస్తారా?
జ: సాధారణంగా పల్లెటూరి నుండి వలస వెళ్ళిన అనేక కుటుంబాల్లో, ఒకప్పుడు మాకు ఎంతో ఆస్తి ఉండేది, కానీ ఇప్పుడు అంతా పోయిందనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ఈ పతనానికి బయటి వ్యక్తుల కుతంత్రాలను సాకుగా చూపుతుంటారు. కానీ, ‘ఎత్తరుగుల ఇల్లు’ కథ ద్వారా ఆ పతనానికి కారణాలు బయట ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయని చెబుదామనుకున్నాను.
ఈ కథలో రామంగారి పాత్రకు నేలతో విడదీయలేని అనుబంధం ఉంది. వ్యవసాయాన్ని కేవలం ఒక జీవనాధారంగా కాకుండా, ఒక ధర్మంగా ఆయన భావించారు. మరోవైపు ఆయన మనవడు రాయుడు చదువుకున్నా, శ్రమ అంటే తెలియదు. అతనిలో ఏదో సాధించాలనే ఆవేశం ఉంది కానీ, చేసే పని పట్ల కనీస శ్రద్ధ లేదు. తెలివైనవాడిననే అహంకారం, చుట్టూ ఉన్నవారందరూ వెర్రి వెధవలనే చులకన భావం అతడిని అజ్ఞానంలోకి నెట్టేస్తాయి. అందుకే, తాత ఇచ్చే సలహాలను కూడా అతను పెడచెవిన పెడతాడు.
రామంగారు మారుతున్న పరిస్థితులను గమనిస్తూ, రాబోయే ప్రమాదాన్ని శంకిస్తూ మనవడికి సూచనలు ఇవ్వగలరే తప్ప, అతని విచ్చలవిడితనాన్ని ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పాత తరానికి ప్రతిరూపం. చివరికి, రాయుడి అజ్ఞానమే గెలుస్తుంది. వారసుల్లో విలువలు, బాధ్యత లోపించినపుడు కుటుంబాలు ఎలా కూలిపోతాయో చెప్పడమే ఈ కథ ఉద్దేశం.
ప్రశ్న 9: “మనుషుల్లో రెండు రకాలు; గతపు మగత వదుల్చుకోలేని మొదటిరకం; ముందుచూపు తప్ప వేరే ధ్యాస లేని రెండోరకం” అన్నది చక్కని పరిశీలన. ‘ఫైండింగ్ డోరీ’ కథ గురించి, ఆ కథలో పాత్రలైన వారి గురించి మరికాస్త వివరిస్తారా?
జ: ఇలాంటి పాత్రలను, సందర్భాలను మన చుట్టూ చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ఏర్పడిన స్నేహాలు చాలా కాలం పాటు నిలిచిపోతాయి. అప్పట్లో మన చుట్టూ ఉండే పరిస్థితులు, పంచుకునే ఆందోళనలు, కలిసి జరుపుకునే చిన్న చిన్న వేడుకలు అన్నీ ఇంచుమించు ఒకేలా ఉండడంతో మనల్ని దగ్గర చేస్తాయి.
కానీ కాలప్రవాహంలో అందరూ ఒకే దిశలో, ఒకే వేగంతో ప్రయాణించలేరు. కొందరు కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదిగి ముందుకు సాగిపోతే, మరికొందరు ఏదో ఒక కారణం చేత వెనుకబడిపోవచ్చు. ఒకరికి గతం మీద గాఢమైన మమకారం ఉండొచ్చు, కానీ మరొకరి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండవచ్చు. అతని వర్తమానం విసిరే సవాళ్లు, అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసే తక్షణ సమస్యలు అవతలి స్నేహితుడికి అర్థం కాకపోవచ్చు.
అలాంటి స్థితిలో, ఒకరు “అతను మారిపోయాడు” అని అపోహపడితే, మరొకరు “నేను మనుగడ కోసం పోరాడుతున్నాను” అనే నిస్సహాయతలో ఉంటారు. ఇక్కడ ఎవరు తప్పు, ఎవరు సరైందన్న దానికంటే, ఇది పూర్తిగా వారి వారి Perspectives సంబంధించిన విషయం.
ప్రశ్న 10: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: నేను గతపు మగత కోవకి చెందినవాడిని. అందుకే నోస్టాల్జియా కథలంటే నాకు ఎంతో ఇష్టం. బాల్యం అంటేనే ఏ బాధ్యతలూ లేకుండా హాయిగా గడిచిన రోజులు. గాలిపటం, కార్కు బాలు.. చదువుతుంటే కాసేపు అన్నీ మర్చిపోయి మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లిపోతాను.
ఈ సంపుటిలో ‘డోరేదార్’, ‘బౌండరీ దాటిన బాలు’ నాకు సన్నిహితమైనవి. అందుకే వీటిని ఎన్నిసార్లు చదివినా తనివితీరదు.
ప్రశ్న 11: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘ఆడ్ జాబ్’ కథ పూర్తిచేయడానికి నాకు దాదాపు ఏడేళ్లు పట్టింది. ఆ కథలోని ఇతివృత్తం కాలంతో పాటు పాతబడకుండా నేటికీ ఉండటం విషాదకరమైన నిజం. ‘వీసా స్టూడెంట్’ అనగానే అనేక కోణాలు, అనుభవాలు, సంఘర్షణలు మన ముందుకొస్తాయి. కానీ ఒక చిన్న కథకు ఉండే పరిమితుల్లో ఏ అంశాన్ని ఎంచుకోవాలి, దాన్ని ఎలా ప్రభావవంతంగా చెప్పాలి అనేది నాకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ఈ కథను అనేకసార్లు తిరగరాశాను.
సాధారణంగా ప్రతి కథను ఇంకా మెరుగుపరచే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఒక దశలో, ఆ సమయానికి మనకున్న శక్తియుక్తులతో దాన్ని అత్యుత్తమంగా మలిచామన్న నమ్మకం కలిగాక, కథను ముగించి పత్రికకు పంపిస్తాం. ఆ తర్వాత పాఠకుల నుండి, మిత్రుల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ తర్వాత కథకి ఉపయోగపడతాయి.
ప్రశ్న 12: ‘డోరేదార్’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ఈ సంపుటికి పాఠకుల నుండి లభిస్తున్న ఆదరణ నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా సాహిత్యం పట్ల మక్కువ ఉన్న సహృదయులు ఈ పుస్తకాన్ని చదివి తమ అభిప్రాయాన్ని తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది.
నేటి పరిస్థితుల్లో అనేక పుస్తకాలు విడుదలవుతున్న తరుణంలో, ఒక పుస్తకం పాఠకుల దృష్టిని ఆకర్షించడం అంత సులభం కాదు. అయితే మంచి పుస్తకం వస్తే దాన్ని నలుగురికీ పరిచయం చేయాలనే ఉదార స్వభావం ఉన్న సమీక్షకులు, సాహితీ వేదికల నిర్వాహకులు యూట్యూబ్ సమీక్షలు, జూమ్ చర్చలు, సాహిత్య పత్రికల ద్వారా ‘డోరేదార్’ పుస్తకాన్ని పాఠకులకు చేరవేయడంలో ఎంతో మద్దతు అందించారు. ఈ వేదిక ద్వారా వారందరికీ ధన్యవాదాలు.
ప్రశ్న 13: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: ఎన్నో అసంపూర్ణ కథలు పూర్తి చేయాల్సి ఉంది. కథలతో పాటు కొంచెం విస్తృతమైన రూపంలో చెప్పాలనిపించే విషయాలు ఉన్నాయి.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మధు పెమ్మరాజు గారూ.
మధు పెమ్మరాజు: ధన్యవాదాలు.
***
రచన: మధు పెమ్మరాజు
పేజీలు: 127
వెల: ₹ 120/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
~
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/doredaar
~
‘డోరేదార్’ కథాసంపుటి సమీక్ష
https://sanchika.com/doredaar-book-review-kss/

