[‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ అనే కథా సంపుటి రచించిన శ్రీ మారుతి పౌరోహితం గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా మారుతి పౌరోహితం గారూ.
మారుతి పౌరోహితం: నమస్కారం.
~
ప్రశ్న 1: మీ రెండవ కథా సంపుటి ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు‘ వెలువరించినందుకు అభినందనలు. కథా, నవలా రచయితగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా?
ప్రశ్న 2: బోధన మీ వృత్తి. ప్రవృత్తి సాహిత్యం. అధ్యాపకుడిగా, నిత్యం విద్యార్థులను గమనించడం ఈ సంపుటిలోని కథల ఇతివృత్తాలను ఎంచుకోడంలో ఎంతవరకు దోహదపడింది?
జ: నా కథా రచనలో బోధనా వృత్తి ప్రభావం కంటే మా స్వంత ఊరు గువ్వలదొడ్డి గ్రామ జీవిత ప్రభావం ఎక్కువ. నా మెజార్టీ కథలు అన్నీ కూడా మావూరి జీవితాన్ని తెలిపేవే! మా ఊరే కాదు, భారతదేశంలోని ప్రతి గ్రామం కూడా భారతదేశానికి ఒక సూక్ష్మరూపమని నా అభిప్రాయం. దేశంలో ఎలాగైతే మంచి, చెడు రెండూ ఉన్నాయో, గ్రామాల్లోనూ అవి ఎంతోకొంత స్థాయిలో ఉన్నాయి. మా ఊరి తరువాత కథలపై మీరన్నట్లు ఉపాధ్యాయ వృత్తి ప్రభావం ఉంది. ‘పిల్లోళ్ళు వొస్తారు’, ‘కన్నీటి మేఘం’, ‘విప్రతీసారం’ మొదలైన కథల నేపథ్యం ఉపాధ్యాయ వృత్తియే.
ప్రశ్న 3: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జవాబు: కథారచనలో వస్తువు, శిల్పం, శైలీ అన్నీ ముఖ్యమే. ఏది లోపించినా ఆ కథ సంపూర్ణం కాదు. ఈ మూడింటిలో ఏ ఒక్క అంశం మాత్రమే కథను సుసంపన్నం చేయలేదు. అయితే సామాన్య పాఠకుడు వీటన్నింటినీ విడివిడిగా పట్టించుకోకపోవచ్చు. హృదయాన్ని తాకే విధంగా ఉంటే ఆ కథను అతడు ఎప్పటికీ మరచిపోడు.
ప్రశ్న 4: “ఇవన్నీకూడా రచయిత అత్యంత సమీపంగా చూసిన వ్యక్తుల వాస్తవ జీవిత కథలు. ఈ రచయిత జీవిత చిత్రణతో ఆగిపోకుండా, ఆయా వ్యక్తుల జీవితాల్లో, వాళ్లెదుర్కొన్న సమస్యల్లో కలగజేసుకొని, తన వంతు సహాయ సహకారాలను అందజేసిన క్షేత్రస్థాయి కార్యకర్త కూడా కావడం విశేషం.” అని వెనుక అట్ట మీద శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా మీ అనుభవాలు కొన్ని వివరిస్తారా?
జ: నా కథల్లోని పాత్రలతో ఇప్పటికీ నాకు సజీవమైన సంబంధాలు ఉన్నాయి. ‘అస్మిత’ కథను రాస్తున్న సందర్భంలో మిత్రులతో కలసి నిరుపేదలైన బసివినులు ఉండే గ్రామాలను సందర్శించాను. వారితో మాట్లాడాను. వారిలో ఒక మహిళ ఊరు వదిలి వెళ్లిపోయిందనే కారణంతో ఆమె పెన్షన్‌ను నిలిపివేసినట్లు తెలిసింది. నిజంగా వారితో మాట్లాడిన తరువాత వృద్ధాప్య పెన్షన్ వారి జీవితాలకు ఎంత ఆలంబనగా ఉందో అర్థం అయ్యింది. పెన్షన్ నిలిపివేయబడిన ఆమె వివరాలు తీసుకొని DRDA లో PD గా పనిచేస్తున్న మూర్తి అనే మిత్రుడి సహాయంతో ఆమెకు పెన్షన్ పునరుద్ధరణ చేయించాము. ‘84 నంబరోడు’ కథలో మట్కా బీటర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడిని గ్రూప్స్ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్‌కు పంపించాము. ఊరిమర్లు కథలోని తంబళి వెంకటేశ్వర్లు మనవరాల్లను ఇద్దరినీ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాము. ‘నీళ్ళింకనినేల’ కథలోని కురువ గిడ్డయ్య మనవడిని నెల్లూరులో ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలో చేర్పించాము. ‘కన్నీటి మేఘం’ కథ చదివిన శ్రీనివాస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మా గ్రామంలోని రైతులకు పంటల విషయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇలా చాలా జరుగుతున్నాయి. సమాజంలో హృదయం ఉన్నవారు చాలామందే ఉన్నారు సార్. నిజంగా మనిషిలో మనిషితనం ఇంకా చాలానే ఉంది అని నాకు అనిపిస్తోంది.
ప్రశ్న 5: ఈ పుస్తకంలోని కథలని చదివినప్పుడు రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరం అవుతున్న, లేదా దూరం చేయబడుతున్న విద్యార్థుల ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది; అసలు ఏ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వారిని విద్యకు దూరం చేస్తున్నాయో వివిధ సామాజిక కోణాల నుండి విశ్లేషించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
జ: రాయలసీమ ప్రాంతంలో ముఖ్య సమస్య సాగునీరు, తాగునీరు. కృష్ణా నది నుండి 110 TMC నీటికేటాయింపులు ఉన్నా గత యాభై సంవత్సరాలుగా 70 TMC నీరు తీసుకోలేని పరిస్థితి ఉంది. కారణం నీటిని నిల్వుంచుకొనే రిజర్వాయర్లు తగినంతగా లేకపోవడం. నిర్మాణంలో ఉన్న నీటిప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. దానితో ఇక్కడి రైతు వర్షం మీద ఆధారపడే పరిస్థితి. వర్షాలు రాకపోతే వలసలు తప్పనిసరి. ఈ సంవత్సరం ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఎంత దుర్భర పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ మా రాయలసీమలో ప్రతి సంవత్సరం కరువే. ఇక్కడి జనాభాలో సుమారు 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. వ్యవసాయం వర్షాధారంగా ఉండటంతో రైతుల పరిస్థితి జూదాన్ని తలపిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం శప్తభూమిగా మారిపోయింది.
ప్రశ్న 6: విద్యా వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ ‘కన్నీటి మేఘం’ కథలో తెలివైన విద్యార్థి ఈరేశ్ చదువుకోవాలనుకున్నా, కుటుంబం కోసం ‘సుగ్గి’కి వలసపోక తప్పని పరిస్థితిని చూపించారు, ఇలాంటి వలసల వల్ల పల్లెల్లో ఎందరో పిల్లల కలలు కల్లలవడం మిమ్మల్ని ఎంతగా కలచివేసింది?
జ: మొత్తం మన రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉన్న పల్లెలు రాయలసీమ ప్రాంతానివే. ముఖ్యంగా ఈ ప్రాంతం అమ్మాయిలకు చదువు ఒక తీరని కోరిక. భారతదేశంలో మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కూడా ఒకటి. స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి వ్యత్యాసం దేశంలోనే అధికంగా ఉన్న ప్రాతం కూడా ఇదే.
వలసల నివారణకు, పిల్లలను వలసల ప్రభావం నుండి కాపాడే చిత్తశుద్ధితో కూడిన చర్యలు శూన్యం. ప్రతి మండలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలి. అది జరగడం లేదు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు 40 శాతానికి పడిపోతుండటం వాస్తవం. ఉపాధ్యాయులుగా పిల్లల వలసను నిరోధించడానికి చేస్తున్న కృషి సరిపోవడం లేదు.
ప్రశ్న 7: ‘కన్నీటి మేఘం’ కథలో వానలు పడటానికి గ్రామీణులు ఆశ్రయించే నమ్మకాల తంతులను, సంస్కృతిని చాలా విపులంగా నమోదు చేశారు, కథా గమనంతో పాటు కాలక్రమేణా అంతరించిపోతున్న ఇలాంటి ప్రాచీన గ్రామీణ సంస్కృతిని, ఆచారాలను అక్షరబద్ధం చేయడం వెనుక ఒక రచయితగా మీకున్న సామాజిక బాధ్యత ఎలాంటిది?
జ: గ్రామీణ ప్రాంతాలలో అంతరించిపోతున్న ఈ సంస్కృతిని రికార్డు చేయవలసిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతాను. అది మన మూల సంస్కృతి. మనలో సామూహికతను సజీవంగా ఉంచే ఒక ఆచరణ. నేను రాసే ప్రతి కథలోనూ సందర్భానుసారంగా ఆ సంస్కృతి, నమ్మకాలు, విశ్వాసాలు, ఆచరణలకు సంబంధించిన అంశాలను అంతర్భాగంగా చేర్చుతుంటాను. మనిషి రోజురోజుకు ఒంటరి అయిపోతున్న ఈ రోజుల్లో ఈ సంస్కృతుల ఉనికి సమాజ మనుగడకు ఆవశ్యకం అని నేను బలంగా నమ్ముతున్నాను.
ప్రశ్న 8: ఒకవైపు వలసల వల్ల చదువుకు దూరమయ్యే ఈరేశ్ లాంటి వాళ్ళు ఉంటే, మరోవైపు ‘విప్రతీసారము’ కథలో తల్లిదండ్రుల, కార్పొరేట్ సంస్థల ఒత్తిడి భరించలేక ఇష్టం లేని చదువులతో కుటుంబానికి దూరమయ్యే పిల్లలను చూపించారు, ఈ రెండు విభిన్న పార్శ్వాల సమస్యలకు విద్యావ్యవస్థే కారణమా లేక సమాజపు ఆలోచనా విధానమా?
జ: ఒకప్పుడు విద్య ముఖ్య ఉద్దేశం విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి అని మనం భావించేవాళ్లం. అయితే ఈ రోజు విద్య ముఖ్య ఉద్దేశం మారిపోయింది. మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలను అందించడం విద్య ముఖ్య ఉద్దేశమైపోయింది. అంటే ఈ రోజు విద్య ఒక మార్కెట్ వస్తువు అయిపోయింది. ఈ పరిస్థితి సహజంగా అటు తల్లిదండ్రులు, ఇటు కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యను మార్కెట్ వస్తువుగా భావించడం ప్రారంభించాయి. ఈ రోజు చదువు అంటే గణితం, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే! ఈ పరిస్థితి మొత్తం సమాజ స్వరూపమే మారడానికి కారణం అవుతోంది. ఈ పరిస్థితికి అందరూ బాధ్యులే.
ప్రశ్న 9: పిల్లల చదువుల వెనుక ఉండే సామాజిక వివక్షను ‘అస్మిత’ కథలో ప్రతిబింబించారు. సెంట్రల్ యూనివర్సిటీలో మల్లికార్జున ఎదుర్కొన్న అన్యాయం వేముల రోహిత్ ఉదంతాన్ని గుర్తుచేస్తుంది, ఉన్నత విద్యాసంస్థల్లో నేటికీ కొనసాగుతున్న ఇటువంటి కుల, సామాజిక అణచివేతను ఒక కథగా మలచడంలో మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జ: కుల వివక్షత, సామాజిక అణచివేత ఈ నాటికీ అమలు అవుతోంది. కాకపోతే అవి తమ స్వరూపాలను మార్చుకొని వేరే రూపాలలో అమలవుతున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో బసివిని వ్యవస్థ ఈనాటికీ సజీవంగా ఉంది. వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజం దృష్టికి తీసుకరావాలన్నది నా ప్రధాన ఉద్దేశం. వీళ్ళ పిల్లలు చదువుకొని, ఒక స్థాయికి వచ్చిన తరువాత సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించినప్పుడు వాళ్ళ కులానికి సంబందించిన ఎదురుదాడులు ప్రారంభం అవుతున్నాయి. మా ప్రాంతంలోని బసివినులు అత్యధికులు మాదిగా సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. వీళ్ళకు ఒక భర్త అంటూ ఉండరు. మల్లయ్య స్వామికి వీరితో వివాహం జరిపిస్తారు అనుకోండి, వీళ్ళ పిల్లలకు తండ్రి పేరు రాయించేప్పుడు మల్లయ్య అని రాయిస్తారు. వీరి పిల్లలకు సంబంధించి వీళ్ళ తండ్రి BC కాబట్టి వీళ్ళు మాదిగ సామాజిక వర్గం కాదనేది వారి ప్రధాన ఆరోపణ. అయితే తల్లిదండ్రులు రెండు వేరువేరు కులాలకు సంబంధించిన వారు అయినపుడు ఆ పిల్లలు ఏ సంస్కృతిలో పెరుగుతారో ఆ కులమే వర్తిస్తుంది సుప్రీమ్ కోర్ట్ తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ సమాజం దృష్టిలోకి తీసుకరావడానికి ఈ కథను రాశాను.
ప్రశ్న 10: ఇదే ‘అస్మిత’ కథలో దళితుల కుటుంబాలలోంచే ఆడపిల్లలను బసివినులుగా మారడం వల్ల వారి జీవితాలు ఎలా నలిగిపోతాయో చూపిస్తూనే, ఆ తల్లి తన పిల్లల చదువు కోసం తపించడం చూపించారు, ఈ నాటికీ సమాజంలో మూఢనమ్మకాల వల్ల నలిగిపోతూనే, విద్య ద్వారానే తమ పిల్లల జీవితాలు మారతాయని నమ్మే వారి ఆకాంక్షలను మీరు క్షేత్రస్థాయిలో ఎలా గమనించారు?
జ: అయితే క్షేత్రస్థాయిలో నేను వాళ్ళను కలిసినపుడు దాదాపు ప్రస్తుతం ఉన్న తరమే చివరితరంగా ఉండడం కొంత సంతోషాన్ని ఇచ్చింది. వీళ్ళకు తమ పిల్లల విషయంలో నిర్ణయం తీసుకొనే విషయంలో స్వతంత్రత ఉండడం మూలానా ప్రస్తుతం ఎవ్వరూ కూడా తమ పిల్లలను ఈ దురాచారానికి బలిచేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. వీళ్ళను నేను కలిసినప్పుడు ఒక మనిషి అనేవాడు మీ జీవితం ఏమిటి అని మాజీవితంలో మొట్టమొదటిసారిగా అడిగినది మీరే సార్ అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. వాళ్ళను నా అక్కలుగా భావించి అందరకూ పండుగకు బట్టలు కొనుక్కొనే ఏర్పాటు చేసి వచ్చాను. ఇప్పటికీ వాళ్ళు నాతో ఎలా ఉన్నావు సారూ అని మాట్లాడుతూ ఉంటారు. మా పిల్లల చదువుల గురించి అడుగుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా తమ పిల్లలను చదివించుకోవడంలో శ్రద్ధ చూపుతూ ఉండడం ఒక మంచి పరిణామం.
ప్రశ్న 11: దారిద్ర్యం, అజ్ఞానం మధ్య పల్లెటూరి జనాలను పట్టి పీడించే ‘మట్కా’ జూదం గురించి మీ ‘84.. వనవాసం నంబరోడు’ కథలో అద్భుతంగా చర్చించారు, ఒకే ఇంట్లో మట్కా అంకెల్లో అదృష్టాన్ని వెతికే తండ్రి, పుస్తకాల్లో భవిష్యత్తును వెతికే కొడుకు.. ఈ ఇద్దరి మధ్య నడిచే మానసిక సంఘర్షణను ఎలా సృష్టించగలిగారు? ఇవి కల్పిత పాత్రలా? లేక మీకు తారసపడిన నిజ జీవిత వ్యక్తులా?
జ: ఇవి నిజపాత్రాలే. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద గ్రామంలో జరిగిన సంఘటనలివి. ఆ ఊర్లో వనవాసం నంబరోడున్నాడు. మట్కా బీటర్‌గా పనిచేసిన ఒక యువకుడు సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం బీటర్‌గా పనిచేస్తున్న అబ్బాయికి అది మాన్పించి గ్రూప్స్ కోచింగ్ పంపేందుకు సాయం చేసాం. కథలోని ప్రతి సంఘటనా వాస్తవంగా జరిగినదే!
ప్రశ్న 12: ‘84.. వనవాసం నంబరోడు’ కథ ముగింపులో మీ పాత్రే స్వయంగా ఆ అబ్బాయిని హైదరాబాద్ కోచింగ్‌కు పంపి డిప్యూటీ తాసిల్దార్‌గా మార్చడం, ఆ విజయం చూసి ఊరి కుర్రాళ్ళు మట్కా వదిలి ఉద్యోగాల కోసం కుస్తీ పడడం చూస్తాం, ఇది కేవలం కథ కోసమే రాసిన ముగింపా లేక అక్షరానికి ఊరిని మార్చే శక్తి ఉందనే మీ నమ్మకమా?
జ: నిజంగా జరిగిన విషయాలే అవి. దాదాపు పదిహేను మంది దాకా సచివాలయ ఉద్యోగాలు సాధించారు. పోలీస్ కానిస్టేబుల్స్ అయ్యారు. DSC ద్వారా టీచర్లుగా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆ ఊరిలో ఉన్న యువకుల వైఖరి మారుతోంది. ఇది చాలా సంతోషాన్ని కలిగించే విషయం. అక్కడ ఉన్న పరిమిత అవకాశాలలో వారికి ప్రభుత్వ ఉద్యోగాలే ప్రస్తుతానికి దిక్కు అయ్యాయి.
ప్రశ్న 13: విద్య వల్ల ఊరు మారడం గురించి మాట్లాడుకుంటే, ‘తాతారావు అలియాస్ రజినీకాంత్’ కథలో చదువే ఈ నేలను పచ్చగా మార్చగలదని నమ్మిన ఆదర్శ ఉపాధ్యాయుడిని చూపించారు, కాలం మారిపోయినా ఎన్నో ఏళ్ల తర్వాత వెతికి పట్టుకుని మరీ సార్‌ను సన్మానించుకున్న ఆనాటి విద్యార్థుల గురుభక్తిని చూస్తుంటే, నేటి సమాజంలో అలాంటి గురు-శిష్యుల బంధం ఇంకా సాధ్యమేనా అనిపిస్తుంది? మీరేమంటారు?
జ: తాతారావు సార్ మాకు సాంఘిక శాస్త్రం బోధించేవారు. కథలోని ప్రతి వాక్యమూ నిజమే. ప్రస్తుతం ఆయన కోనసీమ జిల్లాలోని రాజోలు మండలంలోని పొన్నమండ గ్రామంలో ఉన్నారు. ఆయన తన హృదయాన్ని పిల్లలకే అంకితం చేసిన గొప్ప ఉపాధ్యాయుడు. ఇప్పటికీ ఇలాంటి ఉపాధ్యాయులు సమాజంలో ఉన్నారు. నాకు తెలిసిన చాలామంది ఉపాధ్యాయులు పిల్లల ఫీజులు కడుతున్నారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాసులు అనే నాకు తెలిసిన ఉపాధ్యాయుడు రాత్రిళ్ళు పిల్లల తల్లిదండ్రులను కలిసి పిల్లలు చదువుతున్నారో లేదో విచారణ చేస్తూ ఉన్నారు. కాకపోతే వీరి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం.
ప్రశ్న 14: మీ కథల్లో చదువుతో పాటు కుటుంబ బంధాల ఆర్ద్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ‘పిల్లోళ్ళు వస్తారు’ కథలో తల్లి లేని లోటు తెలియకుండా తొమ్మిదేళ్లు పెంచిన తండ్రి, పిల్లల చదువు కోసం వారిని తల్లి దగ్గరకు పంపి, వారు మళ్లీ వస్తారేమోనని ప్రతిక్షణం అల్లాడిపోయే ఆ తండ్రి వేదనను అంత కరుణా రసాత్మకంగా ఎలా పండించగలిగారు?
జ: నేను గతంలో పనిచేసిన పాఠశాలలో జరిగిన సంఘటనే అది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆ అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి నెలకు ఒకసారి వాళ్ళదగ్గరకు వెళ్లి వస్తున్నారు. ఏదో ఒక రోజున ఆ కుటుంబం ఒక్కటిగా కలిసిపోతుందనే ఆశతో ఉన్నాను.
ప్రశ్న 15: ‘అమ్మ పోస్ట్ చేయలేని ఉత్తరం’ కథలో స్నేహితుడి ప్రాణం కోసం త్యాగం చేసి జీవితానికే దూరమైన కొడుకును కోల్పోయి, గర్భశోకంతో తల్లడిల్లే తల్లి కళ్లముందు కడుతుంది, ఒక కొడుకు త్యాగానికి గర్వపడాలో లేక మరణానికి ఏడవాలో తెలియని ఆ తల్లి మానసిక స్థితిని అక్షరీకరించడం మీకు ఎలా సాధ్యమైంది?
జ: అది మా ఇంట్లో జరిగిన సంఘటనే. ఆ తల్లి నా స్వంత అక్కగారు. ఆమె మానసిక సంఘర్షణను రోజూ గమనించినందువల్లే నేను ఆ కథను రాయగలిగాను. మా అక్కతో నేనే ఒక ఉత్తరం రాయించాను. ఈ కథకు ఆమె రాసిన ఆ ఉత్తరమే ఆధారం. అయితే నాలుగు పేజీల ఉత్తరం రాయడానికి ఆమెకు దాదాపు నెలరోజులు పట్టింది. అంటే ఒక్క వాక్యం కూడా కన్నీరు పెట్టకుండా రాయలేక పోయింది.
ప్రశ్న 16: బంధాల గురించిన చర్చే ‘టైలర్ శ్యామణ్ణ’ కథలో ప్రాణేశ్ ఆచార్‌తో ఉన్న అనుబంధంలో కూడా కనిపిస్తుంది, ఠాగూర్ ‘కాబూలీవాలా’ స్థాయి అనుబంధాన్ని చూపిస్తూనే, కాలంతో పాటు మారలేక వృత్తిని కోల్పోయి, చివరకు ఆత్మాభిమానంతో అందరికీ దూరంగా చనిపోయినా జీవితాన్ని గెలుచుకున్న శ్యామణ్ణ పాత్ర ద్వారా నేటి సమాజంలో వృత్తి కళాకారులు ఎదుర్కొంటున్న ఏకాకితనాన్ని ప్రశ్నించారా?
జ: అంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తరువాత వస్తు ఉత్పత్తిలో యంత్రాల వినియోగం పెరిగింది. దీనికి బలైపోయిన వర్గాలు గ్రామీణ ప్రాంతాలలోని చేతివృత్తుల వాళ్ళు. ప్లాస్టిక్ దువ్వెనలు రావడంతో చెక్క దువ్వెనలు చేసేవారు ఉపాధి కోల్పోయారు. రెడీమేడ్ దుస్తులు వచ్చిన తరువాత టైలర్లు పని కోల్పోయారు. సామాజిక మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకున్నవారు మాత్రమే నిలదొక్కుకోగలిగారు. ఇతరులు టైలర్ శ్యామణ్ణ మాదిరిగా తమ వృత్తిపరమైన అస్తిత్వాన్ని కోల్పోయారు. ఆ టైలర్ శ్యామణ్ణ కూడా మా ఊరివాడే!
ప్రశ్న 17: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ఇప్పటివరకు నేను ఇరవై కథలు రాశాను. ప్రతి కథా నాకు నచ్చినదే! ఆ కథల్లోని పాత్రలన్నీ సజీవమైనవే కాబట్టి అవన్నీ నాకు ఎంతో ప్రియమైనవి.
ప్రశ్న 18: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘అమ్మ పోస్ట్ చేయలేని ఉత్తరం’ రాయడం నాకు చాలా కష్టం అనిపించిన కథ. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ అబ్బాయి తల్లి నా స్వంత అక్కగారు. ఆ అబ్బాయి నా మేనల్లుడు. మా కుటుంబానికి అత్యంత ఇష్టుడు. మిగిలిన కథలు ఏవీ నాకు కష్టం అనిపించలేదు.
ప్రశ్న 19: చదువు చుట్టూ అల్లుకున్న కుటుంబ, మానవ సంబంధాలను చిత్రించిన మీ ‘ఇల్లిడిచిన తొమ్మిది కథలు’ రాయలసీమ కథా సాహితికి ఎలాంటి కొత్త చేర్పును అందించాయని మీరు భావిస్తున్నారు?
జ: ఇప్పటికీ రాయలసీమ ప్రాంతం పట్ల వివక్షత, హేళన, దుష్ప్రచారాలు ఉన్నాయి. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అనే అభూతకల్పన ఇప్పటికీ రాజ్యమేలుతోంది. రాయలసీమ అంటే మిగిలిన ప్రాంతాలమాదిరే ప్రేమ, అభిమానాలున్న ప్రాంతం. ఇక్కడి ప్రజలకు తోటి వ్యక్తులతో, చెట్లతో, పశువులతో, పొలాలతో, వ్యవసాయ పరికరాలతో అనుబంధం ఉంది. సామూహికత లక్షణంగా గల గొప్ప సంస్కృతి ఉంది. వీటన్నినిటినీ ప్రపంచానికి పరిచయం చేయడమే నా ముఖ్య ఉద్దేశం. ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ అనేక మంది హృదయాలలో స్థానం సంపాదించుకొన్నాయి. అది ఆ కథల గొప్పతనం. ఆ కథల్లోని పాత్రలు నిజజీవితంలో కూడా అదే విలువలతో బతుకుతున్న వ్యక్తుల నుంచి రూపుదిద్దుకున్నాయి. అది వారి గొప్పదనం. నేను కేవలం ఒక మధ్యవర్తిని మాత్రమే!
ప్రశ్న 20: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: ప్రస్తుతం ఒక నవల రాస్తూ ఉన్నాను. నేను ఒక కథను కానీ, నవలను కానీ రాసేముందు చాలా గ్రౌండ్‌వర్క్ చేస్తాను. కన్నీటి మేఘం కథ రాయడానికి ముందు వర్షం ఇతివృత్తంగా వచ్చిన దాదాపు డెబ్బై అయిదు కథలు చదివాను. ఎందుకంటే ఇప్పటికే ఇదే అంశంతో ఎవరైనా కథ రాసి ఉంటే నేను మరలా రాయడం అనవసరం అని నా అభిప్రాయం. ‘ప్రణయ హంపి’ నవల రాయడానికి దాదాపు ఏడాదిన్నర పాటు పరిశోధన చేశాను. పన్నెండు వందల పేజీల నోట్సు రాసుకుని, చివరకు నూట ఇరవై ఏడు పేజీల నవల రాశాను. అందువలన ప్రస్తుతం రాస్తున్న నవలకు కూడా ఒక సంవత్సర కాలం పట్టొచ్చు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మారుతి పౌరోహితం గారూ.
మారుతి పౌరోహితం: ధన్యవాదములు సార్.
***
రచన: మారుతీ పౌరోహితం
ప్రచురణ: ఛాయా పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 126
వెల: ₹ 160/-
ప్రతులకు:
ఛాయా పబ్లికేషన్స్,
201, భ్రమరి నిలయం,
ప్లాట్ నంబర్: H-117, మధురా నగర్,
హైదరాబాద్, తెలంగాణ – 500038
ఫోన్: 70931 65151
~
ఆన్లైన్లో:
https://www.amazon.in/Illidisina-Tommodi-Kathalu-Maruthi-Powrohitham/dp/9347704385
https://chaayabooks.com/book/illidisina-tommidi-kathalu
~
‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ కథా సంపుటి సమీక్ష:
https://sanchika.com/illidisina-tommidi-kathalu-book-review-kpak/

