[‘మంటల స్నానం’, ‘చలన కాంక్ష’ అనే కవితాసంపుటులు వెలువరించిన మౌనశ్రీ మల్లిక్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం మౌనశ్రీ మల్లిక్ గారూ.
మౌనశ్రీ మల్లిక్: నమస్కారం.
~
జ: 2009లో నా మొదటి కవితా సంపుటి దిగంబర, 2013లో గరళం, 2015లో తప్తస్పృహ కవితా సంపుటులు వెలువరించాను. తర్వాత వృత్తిరీత్య పాటలు రాసే పనిలో పడి, పుస్తకాలు ప్రచురించలేకపోయాను. పాటలు రాస్తూ కూడా కవిత్వం రాయడం మరిచిపోలేదు. అయినప్పటికీ పుస్తకాలు ప్రచురించలేకపోయాను. చాలామంది కవి మిత్రులు పుస్తకాలు ఎందుకు తేవడం లేదని అడిగేసరికి, సరిగ్గా పది సంవత్సరాల తర్వాత 2025 జనవరిలో ‘మంటల స్నానం’ కవితా సంపుటిని ప్రచురించాను. మార్చి 22న ఎన్. గోపి ఆవిష్కరించారు. ఈ కవితా సంపుటికి పల్లా జాతీయ కవితా పురస్కారం లభించింది.
ఆ తర్వాత నెల రోజులకు ముంబైలో ఉన్న సాహితీ మిత్రుడు దేవానంద్ నాగెల్ల ఫోన్ చేసి, జూన్ 22న తన పుట్టినరోజు సందర్భంగా నా పుస్తకాన్ని ప్రచురించాలనే కోరికను నాతో పంచుకున్నాడు. మిగిలిన కవితలతో పాటు మరికొన్ని కొత్త కవితలను తీసుకొని ‘చలనకాంక్ష’ పేరుతో ప్రచురించాను. ఈ పుస్తకాన్ని సుద్దాల అశోక్ తేజ అధ్యక్షతన దివంగత కవి అందెశ్రీ ఆవిష్కరించారు. దేవానంద్ నాగెల్ల కృతిని అంకితం తీసుకున్నారు. వెంటవెంటనే కవితా సంపుటాలు రావడానికి కారణం అదన్నమాట.
ప్రశ్న 2: మీరు కవి, వ్యాసకర్త. సినీ గేయ రచయిత. మీ సాహితీ ప్రస్థానం గురించి మా పాఠకులు చెప్తారా?
జ: నేను ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నప్పుడే రేడియోలో పాటలు వింటూ గీత రచయిత కావాలనుకున్నాను. విస్తృతమైన కవిత్వ అధ్యయనం వలన, నాలో ఊహాశక్తి పెరిగింది. అలా టీవీ సీరియళ్లలో, సినిమాలలో వందలాది పాటలు రాయగలిగాను. నేను వ్యాసం బాగా రాయగలుగుతాను. అలా అని ఎక్కువ వ్యాసాలు రాయలేదు. 30 ఏళ్ల సాహిత్య ప్రయాణంలో సుమారు 500 పైచిలుకు పుస్తకాలకు పీఠికలను రాశాను. సుమారు 200 సాహిత్య గ్రంథాలను పత్రికా ముఖంగా సమీక్షించాను. వీటన్నిటికంటే నా సాహిత్య ప్రసంగాలు చాలా సంతృప్తినిచ్చాయి. పలు సాహిత్య సభల్లో వచన కవిత్వం మీద ప్రసంగించాను. సీరియల్, సినిమా పాటలతో పాటు ఆధ్యాత్మిక భక్తి గీతాలను, ఉద్యమ గీతాలను కూడా రాశాను. దేశంలోనే టీవీ సీరియల్స్‌లో ఎక్కువ పాటలు రాసిన రచయితగా గుర్తింపు వచ్చింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన కోయిలమ్మ సీరియల్‌లో 550, కృష్ణ తులసి సీరియల్‌లో 250 పాటలు రాశాను.
మౌనరాగం (స్టార్ మా), కేరాఫ్ అనసూయ (స్టార్ మా), అగ్నిసాక్షి (స్టార్ మా), ఎద లోయల్లో ఇంద్రధనుస్సు (స్టార్ మా), అగ్నిసాక్షి-2 (హాట్ స్టార్), కలిసుందాం రా (ఈటీవీ), అనుపల్లవి (ఈటీవీ), ఝాన్సీ వంటి సూపర్ హిట్ సీరియళ్లతో పాటు బొమ్మరిల్లు (ఈటీవీ) సీరియల్స్‌లో సుమారు 40 పాటలు రాశాను. అందుకే నేను చెబుతుంటాను కవిత నా తల్లి, పాట నా ప్రేయసి అని.
మంటల స్నానం కవితా సంపుటి ఆవిష్కరణ
ప్రశ్న 3: 81 కవితలున్న మీ నాల్గవ కవితాసంపుటికి 62వ కవిత ‘మంటల స్నానం’ పేరునే పుస్తకం శీర్షికగా ఎంచుకోడంలో మీ ఉద్దేశం ఏమిటి?
మౌనశ్రీ మల్లిక్: మంటల స్నానం కవిత విశ్వజనీన తత్వాన్ని కలిగి ఉంది. మనిషి ఎప్పుడూ కూడా స్తబ్ధంగా ఉండకూడదని చెబుతుంది.
‘‘అప్పుడప్పుడు
మంటల్లోకి దూకి బయటికి రావాలి
కాలిన గాయాలను
ఓపిక లేపనాలతో మాన్పుకోవాలి’’
అంటే మనిషి చలనశీలత్వాన్ని కలిగి ఉండాలని, సోమరితనంతో జీవితాన్ని వృథా చేసుకోవద్దని భావం. అలాగే జీవితంలో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, దేనికి భయపడకుండా ధైర్యంగా అడుగు వేయాలని ఈ కవిత ఉద్బోధిస్తుంది. స్వతహాగా మనిషి చైతన్యంతో ఉండాలని కోరుకుంటాను. అందుకే ‘మంటల స్నానం’ శీర్షికను నిర్ణయించాను. రాబోయే కవితా సంపుటి ఏదైనా నేను ముందుగానే పేరును నిర్ణయించుకుంటాను. శీర్షిక అనేది నాకు చాలా చాలా ముఖ్యమైన విషయం.
ప్రశ్న 4: మీ ఐదవ కవితాసంపుటికి ‘చలన కాంక్ష’ అనే శీర్షిక పెట్టారు. కానీ ఆ పేరుతో ఆ పుస్తకంలో కవిత లేదు. పుస్తకానికి ఆ పేరు పెట్టడంలో మీ ఆలోచన ఏమిటి?
జ: పుస్తకంలోని కవితలన్నీ చైతన్యధారతో నిండి ఉన్నాయి. ప్రాణం ఉన్న మనిషి కదలిక లేకుండా ఉండడం నేను భరించలేను. సెక్యూరిటీ జోన్‌లో ఉండి కొందరు, చేతగానితనంతో కొందరు, చెడు వ్యసనాలతో కొందరు కదలిక లేకుండా ఉండిపోతారు. వాళ్ల పని తినడం పడుకోవడం. అది కాదు కదా జీవితం. భూమ్మీద పుట్టిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించి పోవాలి. లేదా ఏదైనా ఈ సమాజానికి అందించుకోవాలి. అంతేగాని పుట్టి చావడంలో మజా ఏముంటుంది? ఇందులోని ప్రతి కవితా ఉత్తేజ పూర్వకంగా ఉంటుంది. కవిత చదువుతున్నప్పుడు పాఠకుడి పిడికిలి తెలియకుండానే బిగిసుకుంటుంది. అందుకే చలనకాంక్ష శీర్షికను ఎంచుకున్నాను.
చలన కాంక్ష కవితా సంపుటి ఆవిష్కరణ
ప్రశ్న 5: కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: ఈ జగత్తులో ప్రతి దానిలో లయ ఉంది. సాగే నదిలో, కడలి అలలో, వీచే గాలిలో, మనిషి నడకలో, జీవులలోని ప్రతి అరుపులో లయ ఉంది. కవిత్వానికి లయ అవసరం. చెప్పదలచుకున్న కవితను శిల్పశోభితంగా అభివ్యక్తం చేసినప్పుడే పాఠకుడు అనుభూతి పొందుతాడు. అనుభవజ్ఞుడైన కవి ఆకస్మిక లయ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అందువలన, వస్తువు లయాత్మకమైన కవితగా దానంతట అదే రూపొందుతుంది.
ప్రశ్న 6: ‘జీవలక్షణం’ కవితలో “అదేంటో నాన్నలకి ఆత్మాభిమానం ఎక్కువ/బిడ్డలు సంపాదనాపరులు కాగానే/మహారాజుల్లా మహాప్రస్థానానికి పయనమవుతారు” అనే పాదాలు చదువరుల హృదిలో ఆర్ద్రతని నింపుతాయి. తానా వారి కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఈ కవిత నేపథ్యం వివరిస్తారా?
జ: సృష్టిలో నాన్న పాత్ర గంభీరమైనది. అమ్మ ఎంత గొప్పదో, నాన్న కూడా అంతే గొప్పవాడు. కొంచెం కూడా తగ్గించడానికి వీల్లేదు. దురదృష్టవశాత్తు సాహిత్యంలో అమ్మకు లభించినంత గౌరవం నాన్నకు దక్కలేదనే చెప్పాలి. నేను నాన్న మీద ఇప్పటివరకు చాలా కవితలు రాశాను. ఆ పాత్ర నాకు చాలా ఇష్టమైంది. తానా అంతర్జాతీయ కవితల పోటీలలో ఈ కవిత ప్రథమ బహుమతిని పొందింది. కిరణ్ ప్రభ, కె. గీత న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. అంతేకాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణి కూడా ఈ కవితను ప్రశంసించారు.
ఇక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే బిడ్డలను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత, అంటే పిల్లలు ఎదిగి సంపాదనపరులుగా మారేసరికే, చాలామంది నాన్నలు మరణిస్తారు. అంటే కనీసం కొడుకుల సంపాదనతో కొన్ని రోజులు సంతోషంగా బ్రతకాల్సిన వారు మనతో ఉండరు. ఇది సృష్టిలో దురదృష్టకరమైన సంఘటన. తల్లి కంటే తండ్రి వయసు పెద్దగా ఉంటుంది కాబట్టి అతను తొందరగా మరణించే అవకాశం ఉంది. తల్లితో కొన్ని రోజులు ఉండే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి పిల్లల సంపాదనతో బతికే అవకాశాన్ని, మరణంలోనూ ఆత్మాభిమానాన్ని చాటుకునేవాడు నాన్న. ఆ మహనీయ పాత్ర నాకెప్పటికీ ఇష్టం. అందుకే సుమారు మూడు రోజులపాటు రాశాను. అనుకోకుండా అది ప్రథమ బహుమతి పొందింది.
ప్రశ్న 7: ‘ఇల్లాలి పాదాలు’, ‘కరణేషు మంత్రి’ కవితలలో భార్య విలువని గొప్పగా చెప్పారు. అదే, ‘కవి భార్యకి విన్నపం’ కవితలో కవి భార్యని గయ్యాళిలా మారి సూటిపోటి మాటలతో వేధించద్దని అన్నారు ‘చలికాలం గొడవ’ కవితలో “శీతవేళ శ్రీమతితో గొడవ పడద్దు” అన్నారు. వేర్వేరు సందర్భాల కవితలైనా, శ్రీమతి విషయంలో పొంతన లేకపోవడాన్ని ఎలా జస్టిఫై చేస్తారు?
జ: ‘ఇల్లాలి పాదాలు’ కవితలో భార్యపై ఆరాధన భావం కనిపిస్తుంది. ‘కరణేషు మంత్రి’ కవితలో భర్తను ఆరాధించే భార్య పాత్ర కనిపిస్తుంది. ‘కవి భార్యకు విన్నపం’ కవితలో కవులైన సగటు భర్తల సవినయ విన్నపం ఉంటుంది. ‘చలికాలం గొడవ’ కవిత కాస్త చిలిపితనం మేళవించి శృంగార భావనలను తట్టి లేపేట్టుగా ఉంటుంది. ఇక్కడ రాసిన కవి ఒక్కడే కావచ్చు. తర్వాత ఇవన్నీ నా వైయక్తిక అనుభవాలు కావు. చాలా మటుకు ఊహాత్మకమైన భావనలే. రాసేది భార్య మీదనే కావచ్చు. అందరూ మగాళ్లు ఒకే తీరుగా ఎలా ఉండరో, అందరూ భార్యలు కూడా ఒకే రకంగా ఉండరు కదా! కొందరు అమృతమూర్తులు ఉంటారు. మరికొందరు గయ్యాళి భార్యలు కూడా ఉంటారు. చలికాలం గయ్యాళి భార్యతో గొడవ పడితే నష్టం ఎవరికి? మొగుడికే కదా భర్తకే కదా! కాబట్టి పాత్రలను ఊహించి వాటి ఔచిత్యాన్ని గ్రహించి కొన్ని కవితలను రూపొందించాను. అవి పాఠకులను గిలిగింతలు పెడతాయి.
ప్రశ్న 8: “అరవడం అజ్ఞానం, మొరగడం మూర్ఖత్వం/మౌనమే అసలైన మహత్వం/మనిషి తనపు జీవనతత్త్వం” అని ‘మనిషి తనం’ కవితలో రాశారు. సమీప గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా చూస్తే, ఈ పంక్తుల విలువ తెలుస్తుంది. ఈ కవిత ఏ సందర్భంలో వ్రాశారు? నేపథ్యం వివరిస్తారా?
జ: ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపులో దూరిపోయి మరొక గొప్ప మీద మొరగడం మొదలుపెట్టారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరీ తీవ్రమైంది. ఎంతటి వాడినైనా సరే నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఇది సరైన పద్ధతి కాదు. ఎదుటివారు చెప్పే విషయాన్ని కూడా వినకుండా వాదనకు దిగుతారు. దుర్భాషలాడుతారు. కాబట్టి దుర్మార్గులకు దూరంగా ఉండటం మంచిది. అలాంటి మూర్ఖులతో వాదించడం కంటే మౌనంగా ఉండడం రుషిత్వం అనే భావంతో ఆ కవితను రూపొందించాను.
ప్రశ్న 9: ‘బడవ’ కవితలో కవికే తెలిసిన జీవన రహస్యం ఒకటుంది అన్నారు. దాని గురించి మరింతగా వివరిస్తారా?
జ: కవి గొప్ప తాత్వికుడు. అంతేకాదు అతడు క్రాంతదర్శి. భవిష్యత్తును ఊహించగలవాడు. జీవనకళ రహస్యం తెలిసినవాడు. అన్నింటికీ మించి ఔచిత్యం తెలిసినవాడు. అతనితో జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో రాసిన కవిత.
ఖతార్ దేశ రాజధాని దోహాలో జరిగిన 9వ ప్రపంచ సాహితీ సదస్సులో మాన్యులు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విశిష్ట సాహిత్య పుష్కరం అందుకుంటున్న మౌనశ్రీ మల్లిక్
ప్రశ్న 10: ‘పాత అద్దె ఇల్లు’ కవిత దాంపత్యంలోని మధురిమలను గొప్పగా చాటింది. ఈ కవిత గురించి మరికొన్ని విషయాలు చెప్తారా?
జ: ఇది నా వైయక్తిక జీవన ప్రయాణం గురించి రాసిన కవిత. ఈ కవిత చదివినప్పుడు నా గత జీవితం ఎలా ఉందో చదివే పాఠకుడికి తెలుస్తుంది. అది ఒక సినిమా చూసినట్టుగా ఉంటుంది. అయితే చివరి ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. పాఠకుడు షాక్‌కు గురవుతాడు. అందులో మా అమ్మ మరణానికి సంబంధించిన ప్రస్తావన పాఠకుడు ఊహించలేడు. ఆ ముగింపు నాకు కూడా నచ్చింది.
నేను ఎక్కువగా నా జీవన సంఘర్షణలను కవితలుగా మలిచాను. ఎక్కువ కవితల్లో నేనే కథానాయకుడిని. అయితే నాకు భార్య పాత్ర మీద కవితలు రాయడం చాలా ఇష్టం. దాంపత్య జీవితం మీద నేను రాసిన కవితలన్నీ పాఠకులను అలరించాయి.
ప్రశ్న 11: ‘కిందకు’ కవితలో మెట్ల గురించి గొప్పగా చెప్పారు. మెట్లను ప్రతీకగా చేసుకుని, మన ఎదుగుదలకి తోడ్పడేవారిని ప్రస్తావించారు. ఈ కవిత అల్లిన నేపథ్యం వివరిస్తారా?
జ: ప్రతి మనిషి జీవితంలో ఎదగాలనుకుంటాడు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటాడు. అయితే, ఆ శిఖరాలకు చేర్చిన మెట్ల సంగతిని, అంటే నడిచొచ్చిన దారిని మర్చిపోతాడు. అంటే మనల్ని ప్రోత్సహించిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతో రాసిన కవిత. కొందరు ఏమి ఆశించకుండా మనల్ని భుజం తట్టి నడిపిస్తుంటారు. వాళ్లే మనల్ని శిఖరాలకు చేరుస్తున్న మెట్లు. ఆ మెట్ల పట్ల ఎప్పటికీ గ్రాటిట్యూడ్‌తో ఉండాలి.
ప్రశ్న 12: ‘కవిత్వం’ కవితలో, “పాలను పిండి కవిత్వం అనకు/చాలా దశలు దాటాలి/ నవనీతాన్ని చూడాలంటే” అన్నారు. ఈ పోలిక ఎలా తట్టింది? ఔత్సాహిక కవులకు గొప్ప సూచన ఈ కవిత. ఈ కవిత వ్రాసిన సందర్భం గురించి చెప్పండి.
జ: చాలామంది ఏదో ఒకటి రాసి, దాన్ని కవిత్వం అనుకుంటున్నారు. కొందరు ఎవరి కవిత్వాన్ని చదవరు. అసలు కవిత్వం అంటే ఏంటో తెలుసుకోరు. వారు రాసిందే కవిత, పాడిందే పాట అనుకుంటారు. కవిత్వం సర్వోన్నతమైన కళ. అది అధ్యయనం వల్ల, అధ్యయనంతో కూడిన అనుభవం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాలలో విరివిగా కవిత్వం వస్తుంది. రాయడం, ఫేస్‌బుక్‌లో పబ్లిష్ చేయడం కానీ, రాసిన దాన్ని ఎవరికైనా చూపించి మెరుగు దిద్దుకుందాం అనే ఆలోచనే ఉండదు. కాబట్టి కవిత్వం రహస్యం మనకు తెలియాలంటే మనకంటే ముందు తరం రాసిన వారి కవిత్వాన్ని చదవాలి. వాళ్లు ఏం రాశారో తెలిస్తే, మనం ఏమి రాయాలో, ఎలా రాయాలో అర్థం అవుతుంది. అందుకే
‘‘పాలను పిండి కవిత్వం అనకు
చాలా దశలు దాటాలి
నవనీతాన్ని చూడాలంటే’’ అన్నాను. అది నిజం కూడా.
ప్రశ్న 13: ‘పక్కింటి మల్లెచెట్టు’, ‘చెట్టు’, ‘పార్కులో..’ కవితలు వృక్షాలంటే మీకున్న ఇష్టాన్ని స్పష్టంగా చెప్పాయి, మీలోని భావుకుడిని పరిచయం చేశాయి. చెట్టు కుటుంబనికి కూరిమి అనడంలో మీ ఉద్దేశాన్ని మరింత వివరిస్తారా?
జ: మనిషి మెరుగైన ప్రాణి కావచ్చు. కానీ ప్రకృతిలో ఒక భాగం. చెట్టు ఆవశ్యకతను మనిషి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కొన్ని ఇండ్లలో చెట్లు లేకపోవడం నేను గమనించాను. స్థలమంతా ఇంటిని నిర్మించి, చెట్లకు కొంచెం కూడా ఖాళీ స్థలం వదలరు. ప్రకృతిని పరిశీలించినప్పుడు మనలో ఉన్న కవి మేలుకుంటాడు. అవన్నీ ఆ సందర్భంగా రాసినవే.
ప్రశ్న 14: “టీ తాగడమంటే.. నాతో నేను మాట్లాడుకునే సజీవ సమయం” అని అన్నారు ‘టీ’ కవితలో. చాయ్ మీకు ప్రేరణ ఎలా అయిందో చెప్పండి.
జ: నేను ఎక్కువగా టీ సేవిస్తాను. ఏదైనా రాసేటప్పుడు అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఎక్కువ సార్లు తాగడం వలన ఆరోగ్యం పాడైపోతుందని భయంతో మా ఆవిడ వద్దని చెబుతుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో టీ తాగాల్సి వస్తుంది. అలా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను కవితగా మలిచాను.
ప్రశ్న 15: కొన్ని కవితల శీర్షికలు విభిన్నంగా ఉన్నాయి.. కందర్ప జ్వరం, కిర్మీర తార వంటివి. ముఖ్యంగా ‘కిర్మీర తార’ కవిత అంతా ఎంతో సరళంగా వ్రాసినా, కిర్మీర అనే పదం కాస్త నిలుపుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా ‘కిర్మీర తార’ అని పదప్రయోగం చేయడంలో మీ ఉద్దేశమేమిటి?
జ: కిర్మీర తార అంటే రంగురంగుల కాంతులు వెదజల్లే తార. ఎండ్లూరి సుధాకర్ కవిత్వం చదువుతున్నప్పుడు కిర్మీర తార అనే పదం అందులో కనిపించింది. కొత్త పదాలు ఏవైనా పాఠకులకు పరిచయం చేయాల్సిన అవసరం కవులకు ఉంది. ఇప్పుడు నేను ఆ పదాన్ని వాడాను కాబట్టి దాన్ని మీరు ఇంటర్వ్యూలో ప్రశ్నగా ప్రస్తావించారు. అంటే ఈ పదం మరింత వ్యాప్తి చెందుతుంది. అలా నేను కొత్త పదాలకు నా కవిత్వంలో చోటిస్తాను. వాటి వ్యాప్తికి దోహదపడతాను.
ప్రశ్న 16: ఒక కవిత రాశాకా, దాని తాలూకు ఉద్వేగమో/ఉద్విగ్నతో మీలో ఎంత కాలం ఉంటుంది? అలా ఎక్కువ కాలం పాటు మీ మదిని వెంటాడిన ఉద్వేగం ఏ కవితది?
జ: ఏ ఉద్వేగమైనా మనం స్వీకరించే సాంద్రతను బట్టి ఉంటుంది. ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఆ బాధ చాలా కాలం ఉంటుంది. అలాగే దుస్సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. కవిత్వం రాసే వరకు ఆ బాధ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. రాసిన తర్వాత ఏడ్చి ఏడ్చి ప్రశాంతతను పొందిన భావన కలుగుతుంది. మళ్లీ ఏదో రాయడానికి మనసు సన్నద్ధం అవుతుంది.
ప్రశ్న 17: సాధారణంగా కవులు రాసే కవితలన్నీ వారికి నచ్చుతాయి. కానీ ప్రత్యేకంగా, మీకు బాగా నచ్చిన ఒకటి రెండు కవితలు పేర్కొనమంటే, ఈ సంపుటాల లోని ఏ కవితలని ఎంచుకుంటారు?
జ: ‘మంటల స్నానం’ సంపుటిలో ‘జీవ లక్షణం’, ‘కళ్ళజోడు’, ‘కవి భార్యకు విన్నపం’, ‘పాత అద్దె ఇల్లు’, ‘పైశాచిక వాదమొకటి’ వంటి కవితలు వ్యక్తిగతంగా ఇష్టపడతాను. ‘చలన కాంక్ష’ సంపుటిలో ‘అమూర్తం’, ‘ఈప్సితం’, ‘శూన్య చింతన’, ‘జైలులో’, ‘వధ్య భారతం’, ‘నేత్రపర్వం’, ‘పురుషవాదమో.. పరసవేదమో’ వంటి కొన్ని కవితలు సంతృప్తిని కలిగించాయి.
ప్రశ్న 18: కవిగా, సినీ గేయరచయితగా మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి?
ప్రశ్న 19: ఇంత దూరం ప్రయాణించడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన వారికి గురించి తెలియజేస్తారా?
జ: సాహిత్య రంగంలో నన్ను ప్రోత్సహించిన వారు చాలామంది ఉన్నారు. అందులో సి. నారాయణ రెడ్డి, గోపి, కె.వి. రమణాచారి, అద్దేపల్లి రామమోహనరావు, కె. శివారెడ్డి, దాస్యం సేనాధిపతి, బైస దేవదాస్, రమణ వెలమకన్ని, పెద్దూరి వెంకట దాస్ వంటి వారు చాలామంది ఉన్నారు.
ప్రశ్న 20: మీకు ఇష్టమైన సినీ కవులు ఎవరు?
జ: అప్పట్లో సినారె, ఆత్రేయ, వేటూరి. ఇప్పటి కవుల్లో సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ రచనా శైలి ఇష్టం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మౌనశ్రీ మల్లిక్ గారూ.
మౌనశ్రీ మల్లిక్: ధన్యవాదాలు.
***
మంటల స్నానం (కవిత్వం)
రచన: మౌనశ్రీ మల్లిక్
ప్రచురణ: సృజన స్వప్నం, హైదరాబాద్
పేజీలు: 108
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
మౌనశ్రీ మల్లిక్. ఫోన్: 8919338546
♣
చలన కాంక్ష (కవిత్వం)
రచన: మౌనశ్రీ మల్లిక్
ప్రచురణ: సృజన స్వప్నం, హైదరాబాద్
పేజీలు: 108
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
మౌనశ్రీ మల్లిక్. ఫోన్: 8919338546
‘మంటల స్నానం’, ‘చలన కాంక్ష’ కవితాసంపుటుల సమీక్ష:
https://sanchika.com/mantala-snaanam-chalana-kanksha-book-review-kss/

