Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథ, నవలా రచయిత శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘కాశీ మజిలీ కథలు’ అనే 3 భాగాల పుస్తకం రచించిన శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం నేతి సూర్యనారాయణ శర్మ గారూ.

నేతి సూర్యనారాయణ శర్మ: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. ‘కాశీమజిలీ కథలు’ను తిరిగి పాఠకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?

జ: అందరిలాగే నాకు కూడా చిన్నతనం నుంచే కాశీమజిలీ కథలంటే ఇష్టం. ప్రత్యేకించి మా చిన్నతనంలో దినపత్రికలో బొమ్మల కథలుగా కాశీమజిలీలు వచ్చేవి. వాటి కటింగులను మా అమ్మమ్మ భద్రపరచగా వేసవి సెలవుల్లో పదేపదే చదువుతూ ఉండేవాడిని. కొంచెం పెరిగి పెద్దయ్యాక మూలాన్ని చదివాను. ఆ తరువాత కాలంలో కాశీమజిలీ కథలకు సరళానువాదాలు వచ్చాయి. అయితే మూలంలోని సొగసు వీటిలో లేదనే చెప్పాలి. అందుకే ఈ తరంలో చదవాలనుకునేవారికి ఇంపు పుట్టేలా కాశీమజిలీ కథలను తిరగ రాయాలని నాకనిపించింది.

ప్రశ్న 2. ఈ కథల్లో మిమ్మల్ని మొదటగా ఆకర్షించిన అంశం ఏమిటి?

జ: కల్పనాశక్తి. కాశీ మజిలీల్లో కల్పనలు ఆకాశమే హద్దుగా సాగిపోతుంటాయి. ముఖ్యంగా వరప్రసాదుల కథ, అదృష్టదీపుని కథ, కామగ్రీవుని విద్యల కథ, సప్తమిత్ర చరిత్రల్లో దీక్షిత కవి ప్రతిభ రెట్టింపై కనిపిస్తుంది.

ప్రశ్న 3. మూల రచనలోని విశాలమైన కథా ప్రపంచం నుంచి ఈ గ్రంథానికి కథలను ఎంపిక చేసేటప్పుడు మీరు అనుసరించిన ప్రమాణాలేమిటి?

జ: కాశీమజిలీ కథలు ప్రధానంగా నాలుగు విభాగాలుగా ఉంటాయి. 1. జానపద కథలు, 2. చారిత్రక కథలు, 3. పౌరాణిక కథలు, 4. కావ్య కథలు. వీటిలో జానపద కథలను సృజించడం కోసం మధిర సుబ్బన్న దీక్షిత కవి,  కథా సరిత్సాగరంపైనా, అనేక ప్రాచీన కావ్యాలపైనా ఆధారపడ్డారు. అవి పసందుగా ఉంటాయి. ఒక్కటి మినహాగా వాటన్నింటినీ నేను తిరగరాశాను. ఇక శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, జగన్నాథ పండితరాయలు వంటి చారిత్రక వ్యక్తులను ప్రధాన పాత్రలుగా నడిపిన కథల్లో దేవరాయల కథను మాత్రమే స్వీకరించాను. పండితరాయల కథ, తెనాలి రామకృష్ణుని కథలను స్వీకరించలేదు. అలాగే పౌరాణిక గాథలను కూడా విడిచిపెట్టాను. ఒక రకంగా అవన్నీ నేటి తరానికి నేలవిడిచిన సాములా అనిపిస్తాయని నా అభిప్రాయం. ఇక కావ్యకథల్లో ‘శంకరవిజయం’ అంతకు ముందే నేను ప్రత్యేకంగా రచించాను. కాదంబరి కథ ఇందులో కంటే విడిగా చదువుకుంటేనే బాగుంటుంది.

ప్రశ్న 4. ‘కాశీమజిలీ కథలు’ను కేవలం పాత కథల సంకలనంగా కాకుండా, నేటి పాఠకుడికి సజీవంగా అనిపించేలా చేయడానికి మీరు చేసిన ముఖ్యమైన ప్రయత్నం ఏమిటి?

జ: కాశీమజిలీల్లో ప్రతి కథ అనేక ఉపకథలతో నిండి ఉంటుంది. కొన్నిచోట్ల ఆ ఉపకథలను విడదీసి, వేరే కథగా చెప్పే ప్రయత్నం చేశాను. దానివల్ల పఠనవేగం పెరుగుతుందని అంచనా వేశాను. అలాగే మణిసిద్ధుడు, గోపాలుని వృత్తాంతాన్ని తగ్గించాను. దానివల్ల పాఠకుడు నేరుగా కథలోకి వెళ్లిపోతాడు. ఇందులోని ప్రతి అధ్యాయానికి పేరు పెట్టేటప్పుడు పాత్రల పేర్లు పెట్టి, దానికి కథ అని తగిలించడం దీక్షితులుగారి శైలి. నేను అలా కాకుండా కథలోని ముఖ్యాంశాన్ని తెలియచేసే ఆకర్షణీయమైన శీర్షికను ఉంచాను. దీనివల్ల కూడా నా రచన మరింత ఆకర్షణీయంగా మారుతుందని విశ్వసించాను.

ప్రశ్న 5. ఈ కథల్లోని కల్పన, అద్భుతాలు, సాహసం వంటి అంశాల వెనుక ఆనాటి సమాజపు వాస్తవికతను మీరు ఎలా గుర్తించారు?

జ: మధిర సుబ్బన్న దీక్షిత కవిని ప్రశంసిస్తూ ముందుమాటలు రాసినవారిలో శ్రీమాన్ యమ్. కృష్ణమాచారి ఇలా వ్రాశారు.. ‘మత విషయమునను ఆధ్యాత్మిక విషయమునను విశ్వాసము లేక శంకా కళంకితమగు నేటికాలమున స్వభాషలో సులభశైలి వ్రాయఁబడిన యీ కథలు హిందూదేశమున నాదియగు వేదశాస్త్ర పురాణాది విద్యాప్రపంచమున నేదియేది శ్రేష్ఠమో శాశ్వత స్మరణీయమో దానినెల్ల దప్పక బునరుజ్జీవనము చేయుచున్నవి. ఇవి యవనయామినీ వినోద కథలలోని చమత్కృతి ప్రభావము చూపుచున్ననను శబ్దరచనయందును, భావముల యందును అశ్లీల ధర్మసాంకర్యాది దోషములు లేక భాసిల్లుచున్నవి. కథలకిచ్చిన పేరును, సంవిధాన ధోరణియు సమస్త విషయ సంగ్రాహకమగుటచే యట్లే కొనసాగుచుండిన యెడల నిది తప్పక హిందూపురాణ గాథాకోశమై సర్వవాఙ్మయమున కాదర్శమై యొప్పుననుట యసాధ్యము గాదు..’. ఇదే నా అభిప్రాయం కూడా.

ప్రశ్న 6. మూల కథలలోని జానపద స్వభావాన్ని కాపాడుతూ, ఆధునిక పాఠకుడికి అర్థమయ్యే భాషను ఎంచుకోవడంలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?

జ: మధిర సుబ్బన్న దీక్షిత కవి వర్ణనా చాతుర్యం చాలా గొప్పది. ఇంతకుముందు వీటిని సరళానువాదం చేసిన పెద్దలకు ఆ వర్ణనలన్నీ అడ్డంకులుగా తోచాయి. వాటిని విడిచిపెట్టి, కథకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి నడిపించారు. కానీ నేను వర్ణనలను విడిచిపెట్టలేదు. గహనమైనవాటిని కూడా ఏదో ఒక తీరులో నా అనుసృజనలో ఉంచాను. ఒక ఉదాహరణ చెబుతాను. కీలుగుర్రం కథలో వచ్చే ఈ శృంగార సన్నివేశం సరదాగా చూడండి. దీనిని సరళానువాదకులు విడిచిపెట్టారు. నేను వీలైనంత సరళమైన రీతిలో ఇలా వ్రాశాను. ఇది చదవండి..

ఆకాశంలో సుందరాకారుడొకడు ఎగురుతూ పోవడం ఏమిటి? తన దగ్గర వాలడం ఏమిటని మొదట మణిమంజరి విస్తుపోయింది. తటాలున లేచి నిలబడింది. తనను సమీపించిన అతడితో, ‘‘సుందరుడా! నీవు మన్మథునివా? జయంతునివా? వసంతునివా? వారిలో ఏ ఒక్కరూ కాకపోతే మగవారిలో ఇంత సుందరాకారులుంటారంటే నేను నమ్మలేను’’ అని సాభిప్రాయంగా పలికింది.

అందుకు సింహదమనుడు నవ్వుతూ, ‘‘తరుణీమణీ! నేను వారిలో ఎవరినీ కాను. కేవలం బాటసారిని. నాకు బాగా దాహంగా ఉంది. ఏదైనా తియ్యని పానకం తెప్పించగలవా!’’ అని ప్రార్థించాడు.

‘‘రాజపుత్రా! నీకు పానకమేమి? అమృతం దొరికే తావు కూడా చెప్పగలను. విను. శ్రీకూర్మం మీదుగా వెళితే మకరాలయం కనిపిస్తుంది. దానిని దాటితే కదళీవనం కనిపిస్తుంది. దానిని దాటివెళితే కాంచీస్థానం.. అటుపైన పెద్దచెరువున్నది. ఆ చెరువుకు ఆవలిగట్టున పైడిమెట్ల వెంబడి పైకి ఎక్కితే రెండు బంగారు కొండలు కనిపిస్తాయి. వాటిమీద కొంచెముసేపు విశ్రమించి, పైకి వెళితే శంఖచూడుని ఇల్లు కనిపిస్తుంది. దానిని దాటితే చంద్రలోకం వస్తుంది. అందులో వెతికితే అమృతపు బావి ఉంది. నీకు సమర్థత ఉంటే ఆ బావిలో అమృతం తాగి దప్పిక తీర్చుకోవచ్చు’’ అన్నది.

నిగూఢమైన శృంగార సంకేతాలతో సాగుతున్న ఆ సంభాషణలు విన్న మణిమంజరి చెలికత్తెలు అక్కడినుంచి పక్కకు తప్పుకున్నారు.

‘‘వన్నెలాడీ! నీవు చెప్పిన బావి వద్దకు మేము స్వతంత్రంగా పోవచ్చునా?’’ అని సింహదమనుడు నవ్వుతూ ప్రశ్నించాడు.

‘‘మానసాన్ని గెలిచిన వారికే గానీ, ఇతరులకు అట్టి స్వాతంత్ర్యం లేదు’’ అని జవాబిచ్చింది మణిమంజరి.

అప్పుడా పురుషపుంగవుడు.. ఆమెను అక్కడే ఉన్న హంసతూలికా తల్పంపైకి చేర్చి, పెదవులను చుంబించాడు.

ప్రశ్న 7. మీ అనుసృజనలో కథ యొక్క ఆత్మను కాపాడటం, కథనాన్ని సరళీకరించడం – ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధించారు?

జ: కథనాన్ని సరళీకరించడం నా శైలిలో సహజాతంగా అబ్బిన విషయమే. దానిని కథ యొక్క ఆత్మను కాపాడుతూ నిర్వహించడానికే అసలు నేనీ రచనకు పూనుకున్నానని చెబితే మీరు స్వాతిశయంగా భావించకూడదు.

ప్రశ్న 8. ఈ కథల్లోని హాస్యం, వ్యంగ్యం వెనుక ఉన్న సామాజిక వ్యాఖ్యానాన్ని మీరు ఏ దృష్టితో చూశారు?

జ: ముఖ్యంగా సామాజిక వర్గాల మధ్య అలవోకగా హాస్యం పండిస్తారు దీక్షిత కవి. అది కొన్నిచోట్ల ఇప్పుడున్న పాఠకులకు మోటుతనం అనిపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీలైనంతవరకూ సామాజిక వర్గాల పేర్లు పేర్కొనలేదు. కొన్నిచోట్ల వీలైనంత మృదువుగా చెప్పడానికి ప్రయత్నించాను.

ప్రశ్న 9. కాశీమజిలీ కథల్లోని పాత్రలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని, నమ్మకాలను ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయని మీరు భావిస్తున్నారు?

జ: కాశీ మజిలీ కథలు మొదటి కూర్పు 1926-28 మధ్య వెలువడింది. రెండో కూర్పు 1934లో రచయిత కుమారుని ద్వారా విడుదలైంది. ఇందులో ప్రస్తావించిన అంశాలన్నీ ఆ కాలంనాటి ప్రజల జీవన విధానాన్ని, నమ్మకాలను నూటికి నూరుశాతం ప్రతిబింబిస్తాయని భావించలేం. ఇవి ప్రధానంగా జానపద, పౌరాణిక శైలికి చెందిన రచనలు. రచయిత విన్నవీ కన్నవీ చదివినవీ ఇందులో చోటు చేసుకున్నాయి. ఉపనిషత్తులను, కావ్యేతిహాసాలను బాగా మథించిన విద్వత్కవి కనుక, మనం ఆ కోణంలోనే ఈ రచనను చదవాలి.

ప్రశ్న 10. తాడేపల్లి పతంజలిగారు మీ ప్రత్యేకతను ‘మూలాన్ని చెడగొట్టకుండా, ఆధునిక పాఠకుడి దృష్టితో అవసరమైనదాన్ని ఎంపిక చేసుకుని పునస్సృష్టించడం’గా గుర్తించారు. ఈ అనుసృజనలో మీ స్వంత రచయిత స్వరాన్ని, మూల రచయిత స్వరాన్ని ఎలా సమతుల్యం చేశారు?

జ: చాలాసార్లు మూలరచయిత ప్రభావానికి లోనయ్యాను. ఆయన స్వరాన్నే ఆధునిక భాషలో వినిపించే ప్రయత్నం చేశాను. నా ప్రత్యేకతను నిలబెట్టుకోవడం కంటే ఈ కథలను ముందు తరాలకు అందించడమే గొప్పదని భావించాను. కథనంలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి, వాటిని సరిచేసి పఠన వేగాన్ని పెంచడం వరకే నా బాధ్యత అయింది.

ప్రశ్న 11. మూలంలో ఉన్నదాన్ని కేవలం సరళీకరించడం కాకుండా, ‘ఇది నేటి పాఠకుడికి అవసరం – ఇది అవసరం లేదు’ అని నిర్ణయించి కొన్ని భాగాలను వదిలారు. ఆ ఎంపికలో మీ రచయితగా ఉన్న బాధ్యత, వ్యక్తిగత అభిరుచి – ఈ రెండింటిలో ఏది ఎక్కువగా పనిచేసింది?

జ: వ్యక్తిగత అభిరుచి ఉన్నచోట్ల కథను విస్తారంగా చెప్పిన మాట నిజమే కానీ, నూటికి నూరుశాతం బాధ్యతను దృష్టిలో ఉంచుకునే ఈ అనుసృజన చేశాను.

ప్రశ్న 12. ఒక పాత కథను పునఃసృష్టించేటప్పుడు రచయితకు ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలి అని మీరు భావిస్తారు?

జ: తగినంత స్వేచ్ఛ తప్పకుండా ఉండాలి. ఉదాహరణకు కీలుగుర్రం కథలోని సింహదమనుడు పాత్ర నిజానికి కథానాయకుడు. కానీ ఆ కథ సింహదమనుని కొడుకు పాత్ర తండ్రికి బుద్ధి చెప్పడంతో ముగుస్తుంది. అంటే కథ మూడు తరాలసేపు సాగుతుంది. అప్పటివరకూ సింహదమనుని తల్లులను రాజ్యం నుంచి వెళ్లగొట్టిన రాక్షసి బతికే ఉంటుంది. ఇది నాకు బాగా అనిపించలేదు. అందువల్ల సింహదమనుని కొడుకు పాత్రను రద్దు చేసి, కథను అతడితోనే ముగించాను. అలాగే మరో కథలో కూడా భార్యను విడిచిపెట్టిన భర్తకు వార్ధక్యంలో బుద్ధి వచ్చినట్లుగా ఉంటుంది. ఆ కథాగమనాన్ని కూడా ముందుకి జరిపాను. మరో ఉదాహరణ చెప్పాలంటే, అదృష్టదీపుని కథలోని భువనేశ్వరీ దేవి మందిరానికి వెళ్లే రహస్య మార్గాన్ని గురించి నేను చేసిన కల్పన మూలంతో సంబంధం లేకుండా సరికొత్త రీతిలో సాగుతుంది. దానిని పోల్చి చూడండి. అలాగే కొన్ని కథలను నేను స్వేచ్ఛ తీసుకుని వదిలిపెట్టాను. నిజానికి కాశీమజిలీల్లోని కథలు గొప్పవే. కానీ అన్ని కథలూ ఒకే మోస్తరు కాదు.

ప్రశ్న 13. మీ రచనలో సరళమైన భాషకు, కథన వేగానికి మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి?

జ: సరళమైన భాషను ప్రయోగించడం అనగా మూలంలోని అసలు విషయాలను కూడా దాటవేయడం కారాదు. మూలంలో విషయమంటూ ఉంటే ఏనాటి భాషకైనా అది లొంగకపోదు. ఇక చెప్పవలసిందంతా చెబుతూనే కథన వేగాన్ని పెంచవచ్చని నా నమ్మకం. సింపుల్‌గా చెప్పడం కోసమని కట్టె కొట్టె తెచ్చె అన్నట్లు పాత కథలను చెప్పనక్కరలేదు. మూలకర్త నిర్వహించిన రసం ఏదో దానిని చెడిపోకుండా అనుసృజనలోనూ కొనసాగించడమే నాకు నచ్చిన మార్గం.

ప్రశ్న 14. కథలకు మీరు పెట్టిన శీర్షికల్లో మీ సృజనాత్మకత ప్రత్యేకంగా కనిపిస్తుందని ముందుమాటలు సూచిస్తున్నాయి. శీర్షికను నిర్ణయించే సమయంలో మీరు ఏ అంశాన్ని ప్రధానంగా పరిగణిస్తారు?

జ: కాశీ మజిలీలను మధిర సుబ్బన్న దీక్షిత కవి 359 మజిలీలుగా నిర్మించారు. అంటే 359 సార్లు ఆయా పాత్రల పేర్లతో ‘కథ’ అని వస్తుంటుంది. అన్నీ కలిపి వీటిలో ఉన్నది దాదాపు 40 కథలు మాత్రమే. వాటిలో 32 కథలను నేను తిరగరాశాను. చాలా కొద్దిశాతం మాత్రమే విడిచిపెట్టాను. కథలను అధ్యాయాలుగా విభజించాను. ఆయా అధ్యాయాలకు వీలైనంత వరకు ఆసక్తికరమైన పేర్లు ఉంచడానికి ఇష్టపడ్డాను. ఉదాహరణకి పితృదత్త కథ అనడం కంటే ‘కొడుకును కన్న కన్యక’ అంటే ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుమార దత్తుని కథ అనకుండా.. ‘విగ్రహంలో విద్యాధర’ అన్నాను. ఇలా కథలోని ముఖ్య సన్నివేశాన్ని సూచిస్తూ.. కథలోని ఆసక్తికరమైన అంశాన్ని స్పృశిస్తూ కథల్లోని అధ్యాయాలకు పేర్లు పెట్టాను. ఇవన్నీ దినపత్రికలో వారంవారం ధారావాహికగా ప్రచురించడం వల్ల ప్రతివారం కొత్త శీర్షికతో పాఠకులను అలరించగలిగాను. పుస్తకంగా వచ్చిన తరువాత కూడా పాఠకులకు ఇవి చప్పున పడతాయని ఆశించాను.

ప్రశ్న 15. పాత సాహిత్యాన్ని ఆధునిక పాఠకుడి రుచికి అనుగుణంగా మార్చేటప్పుడు, అసలు సాహిత్య విలువ దెబ్బతినకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

జ: ఏ కాలంనాటి పాఠకుడైనా తన హృదయాన్ని రంజింప చేసే కథా సాహిత్యాన్ని చదవాలనుకుంటాడు. కథలోని ఏవైనా కొన్ని అంశాలు ఇప్పటికాలానికి రుచించకపోవచ్చు. అటువంటి వాటిని పక్కన పెట్టవచ్చు. కానీ మూలకర్త పాటించిన విలువలను యధాతథంగా ఉంచగలగాలి. విలువల కారణంగానే సాహిత్యం కాలపరీక్షకు నిలిచి వెలుగ గలుగుతుంది. అటువంటి సాహిత్యాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు దానిలోని సాహిత్య విలువలను అర్థం చేసుకుని, మరింత హృద్యంగా మలచాలే తప్ప దిగజార్చకూడదు.

ప్రశ్న 16. ఈ కథల్లో స్త్రీ పాత్రలు, వారి ఆలోచనలు, సామాజిక స్థానం మీ దృష్టిలో ఎలాంటి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి?

జ: మధిర సుబ్బన్న దీక్షిత కవి తన కథానాయికలందరినీ మహోన్నతంగానే చిత్రించారు. వారంతా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారే. చాలాచోట్ల ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ ఆదర్శప్రాయంగా కూడా ఉంటారు. ఇక గయ్యాళి గంప, రాక్షసి వంటి పాత్రలను సైతం పాత్రోచితంగా నడిపించారు.

ప్రశ్న 17. మౌఖికంగా లేదా ప్రజలలో ప్రసారమైన కథలను లిఖిత రూపంలోకి తీసుకురావడంలో ఏమి నిలిచిపోతుంది, ఏమి మారే అవకాశం ఉంటుంది?

జ: మౌఖికంగా ఉన్నవీ, బహుళ ప్రజాదరణ పొందినవి అయిన అంశాలను ఎన్నింటినో మధిర సుబ్బన్న దీక్షిత కవి తన కథలలో సందర్భశుద్ధితో ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి భోజ-కాళిదాస కథల్లో మనం వింటాం.. ఒక ఇల్లాలు బాటసారులను ప్రశ్నిస్తుంది ‘‘మీరెవరు?’’ అని. దానికి వారిచ్చిన సమాధానాలన్నింటినీ ఆమె కొట్టివేస్తుంది. ‘‘మేం పరదేశీయులం’’ అంటే ‘‘ఒకే భాష మాట్లాడేవారు పరదేశీయులు కారని’’, బాటసారులంటే సూర్యచంద్రులని.. ఇలా. ఇది మనకు కాశీమజిలీల్లో మొదటి కథలోనే దర్శనమిస్తుంది. దీనిని మనం ఈ కథలో భాగంగా గుర్తుంచుకోం. కానీ ఇది మాత్రమే చదువుకున్నవారు గుర్తుంచుకుంటారు కదా! అలాగే చింతామణి కథలో ‘జాగృత పంచకం’ కూడా గుర్తుండిపోయే రీతిలో పొదిగారు. వాటినన్నింటినీ వీలైనంత సరళంగా నేను నా రచనలోనూ ఉంచాను.

ప్రశ్న 18. మీ రచనలోని సృజనాత్మకతతో పాటు విమర్శనాత్మక దృష్టి కూడా ముఖ్యమని ముందుమాటల్లో ప్రశంసించారు. ఈ రెండు లక్షణాలు మీ రచనా ప్రక్రియలో ఎలా కలిసి పనిచేస్తాయి?

జ: మూలంలో లేనివి, నేను కొత్తగా కల్పించిన వాటిని గురించి ఇంతకుముందే కొన్ని సందర్భాలను పేర్కొన్నాను. వందేళ్ల కిందటి సమాజంలో చెల్లుబాటయ్యే చాలా అంశాలు నేటి సమాజంలో చెల్లకపోవచ్చు. అంతమాత్రం చేత మూలరచయిత అలా రాసి ఉండకూడదని అనలేం. వాటిని జాగ్రత్తగా మన కాలానికి సరిపోయే విధంగా మార్చుకోవాలి. ఇవి సన్నివేశాలే కానక్కరలేదు.. పాత్రల పేర్లను మార్చడం కూడా చాలావరకు పనిచేస్తుంది. అలా ఒక రజకస్త్రీ పాత్రను నేను మలిచిన తీరును, మూలంతో పోల్చి చూసి తాడేపల్లి పతంజలిగారు మెచ్చుకున్నారు. మూలం చదివినవారికి నా రచనలో పసందు ఏమిటో తేలికగానే తెలుస్తుంది. ఇంతకుముందు చదవని వారికి అద్భుతంగా అనిపిస్తాయి. అది దీక్షిత కవిలోని గొప్పతనం.

ప్రశ్న 19. ఈ కథలను చదివే నేటి యువత, కథలోని వినోదాన్ని దాటి ఏ విలువను లేదా ఆలోచనను గ్రహించాలని మీరు కోరుకుంటున్నారు?

జ: కాశీమజిలీలు కేవల వినోద కథలు కావు. వీటి మాటున మనకు అనేక మర్మాలు బోధించడానికి దీక్షిత కవి పూనుకున్నారు. వాటిని చిట్టా ఆవర్జాలు వేసి వెల్లడి చేయడం కంటే, ఎవరి మట్టుకు వారు అనుభూతిలోకి తెచ్చుకోగలిగితే మంచిది. మొత్తంమీద మన పురాణేతిహాసాలను గాలివాటుగా విని, చదివి వదిలేయడం కాకుండా వాటి అంతరార్థాలను మర్మజ్ఞులను అడిగి, అటువంటి వారి వ్రాతలను చదివి తెలుసుకోవాలని ఈ కథల వల్ల అనుభవంలోకి రావాలి.

ప్రశ్న 20. కాశీమజిలీ కథలకు ఇంతకాలం పాఠకాదరణ కొనసాగడానికి ప్రధాన కారణం కథలలోని ఏ శక్తి అని మీరు భావిస్తున్నారు?

జ: అద్భుతమైన మధిర సుబ్బన్న దీక్షిత కవి కల్పనాశక్తి. కావ్య పురాణేతిహాసాలను ఔపోసన పట్టి, వాటి సారాన్ని జానుతెనుగులో ఆయన కథలుగా మలిచి పామరులకు సైతం అందేలా నిర్వహించిన తీరు.

ప్రశ్న 21. ఈ గ్రంథంపై పనిచేసిన తరువాత, కాశీమజిలీ కథలను చూసే మీ దృష్టిలో ఏదైనా కొత్త అవగాహన ఏర్పడిందా?

జ: అవునండీ. సరదాగా చదివినప్పుడు ఒకలా అనిపించిన ఈ కథలు, అనుసృజనకు కూర్చోగానే మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించడం చాలా కథల విషయంలో అనుభవంలోకి వచ్చింది. బహుశా అది మూలకర్త ఉపయోగించిన భాష, శైలివల్ల వచ్చి ఉండవచ్చు. కాశీమజిలీలు ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించడం వీటి అభిమానులకు అనుభవైక వేద్యమే. ఇక నాకు కొత్తగా ఏర్పడిన అవగాహనను గురించి ఇంతకుముందే చెప్పాను. దీక్షిత కవి ఈ కథల మాటున అనేక ధర్మ మర్మాలను ప్రబోధించారు. వాటిని ఎక్కడికక్కడ శిల్పంలో ఇమిడిపోయేటట్లుగా ఉంచి రూపొందించాను. దీన్ని రాసిన తరువాత రచయితగా నేను పొందిన లాభం ఏమిటంటే.. గతంతో పోల్చితే నా రచనావేగం, మేలిమితనం పెరిగిందని గుర్తించాను.

ప్రశ్న 22. తెలుగు సాహిత్యంలో మరుగునపడుతున్న ఇటువంటి పాత కథా సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు రచయితలు, పాఠకులు ఏ బాధ్యత తీసుకోవాలి?

జ: మూలంతో పోటీపడుతూ మరింత రసస్ఫోరకంగా ఉండేలా కొత్త రచనలు ఉండాలి. అంతేకానీ బొత్తిగా సమయం లేని మీకు సమాచారం అందించేందుకు పూనుకున్నాం అని ప్రకటిస్తే ప్రయోజనం లేదు. నేను అనుసృజన వెలువరించినప్పుడు కూడా చాలామంది, ‘మాకు సరళాలు వద్దండీ.. మూలం కావాలి’ అని నన్ను అడిగారు. ఇంతకుముందు వచ్చిన సరళానువాదాల ప్రభావం అది. అలా ఉండకూడదనే నేను వీలైనంత ప్రయత్నం చేశాను. పుస్తకాలు కొనేవారి సంఖ్య పెరిగింది. చదివేవాళ్ల సంఖ్య తగ్గింది.. అని ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కామెంట్ వినిపించింది. దయచేసి నాలుగు పుస్తకాలు కొని చదవండి. అప్పుడు ఏ పుస్తకాలు కొనాలో, ఏవి మానాలో తెలుస్తుంది అని మాత్రమే పాఠకులకు చెప్పదలిచాను.

ప్రశ్న 23. ‘కాశీమజిలీ కథలు’ను మీ అనుసృజనలో చదివిన తర్వాత పాఠకుడు తనలో ఏ ఒక్క ఆలోచనను తప్పకుండా తీసుకెళ్లాలని మీరు కోరుకుంటారు?

జ: ఇంతకుముందు కంటే ఈ కథలు ఇతని రాతలో ఇంకా బాగున్నాయి అని పాతతరం పాఠకులు భావించాలి. కొత్తగా చదువుతున్నవాళ్లు నా రచనను ‘మళ్లీమళ్లీ చదవాలి’ అన్నదే నా ఆలోచన.

ప్రశ్న 24. మీరింతవరకు వెలువరించిన పుస్తకాలను గురించి కొంత చెబుతారా?

జ: 1930ల నాటి ‘మొగలాయీ దర్బార్’ అనుసృజన నా మొదటి పుస్తకం. రెండోదైన ‘శంకర విజయం’ నాకు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఆ పుస్తకంపై సంచికలో సమీక్ష ప్రచురించారు. తదుపరి.. చారిత్రక కల్పనగా ‘కాకర్త్య గుండన’ రచించాను. ‘శ్రీదోసగీత’ అనే పేరుతో హాస్యకథల సంపుటి వెలువరించాను. ఆదిశంకరుల స్తోత్రాలకు నాదైన శైలిలో తాత్పర్యాలు చెబుతూ వ్రాసిన పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి.

ప్రశ్న 25: మీ తదుపరి రచన ఏమిటి?

జ: భక్త రామదాసు జీవిత చరిత్రపై ఒక నవల రాశాను. ఇప్పటివరకు రామదాసుపై తెలుగు నవల లేదు. ఇదే మొదటిది.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు నేతి సూర్యనారాయణ శర్మ గారు.

నేతి సూర్యనారాయణ శర్మ: ధన్యవాదాలు.

***

కాశీ మజిలీ కథలు (3 Books – 12 Parts)
రచన: మధిర సుబ్బన్న దీక్షిత కవి,
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
ప్రచురణ:
మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
పేజీలు: 904
వెల: ₹ 999.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
నేతి సూర్యనారాయణ శర్మ
9951748340
~

ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/Majili-Kathalu-Collection-Children-Illustrated/dp/B0G5Q7X3Y9
https://devullu.com/books/kasi-majili-kathalu-neti/

~
‘కాశీ మజిలీ కథలు’ అనే 3 భాగాల పుస్తకం సమీక్ష:
https://sanchika.com/kasi-majili-kathalu-three-books-review-kss/

Exit mobile version