[‘ప్రవాహం’ అనే వ్యాస సంపుటి వెలువరించిన నూర శ్రీనివాస్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం నూర శ్రీనివాస్ గారూ.
నూర శ్రీనివాస్: నమస్కారం సార్.
~
ప్రశ్న 1: మీరు రచించిన 35 వ్యాసాల సంపుటికి ‘ప్రవాహం’ అనే శీర్షికని ఎంచుకోవడంలోని కారణం వివరిస్తారా?
ప్రశ్న 2: జర్నలిస్టు కాక ముందు మీరు కవిత్వం, వ్యాసాలు వ్రాశారు. రచయితగా, మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు?
జ: జర్నలిస్టు కాకముందే ఆ మాటకు వస్తే ఇప్పుడు కూడా కవిత్వం నిత్యం రాయటం లేదు. సంకలానికి సరిపడా కవితలు రాసినా వాటిని పుస్తకంగా ఇప్పటి వరకు తీసుకురాలేదు. రాసిగల్ల కవిత్వం, వాసిగల్ల కవిత్వం కూడా రాశానని అనిపిస్తుంది. ‘జనధర్మ’ (తొలితరం నిఖార్సయిన పాత్రికేయ దిగ్గజం ఎంఎస్ ఆచార్య గారు వరంగల్ కేంద్రంగా నడిపిన పత్రిక. వారి సారధ్యంలోనే ‘వరంగల్‌వాణి’) పత్రిక వెలువడేది. మా వరంగల్ ప్రాంతానికి చెందిన సోదర సమానులు పడాల రవీందర్ (జానపద కళాకారుడు, విద్యావంతుడు) అకాలమరణం చెందారు. రవన్న అని అనేవాళ్లం. ఆయనతో ఉన్న చనువు. ఆయన ద్వారా తెలుసుకున్న లోకజ్ఞానం. ఈలోకం నుంచి ఆయన వెళ్లిపోయాక కొంత ఖాళీ అనిపించింది. ఆయన జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ ‘రవన్న అస్తమయం’ అనే కవిత రాసిన. అదే నేను రాసిన తొలి కవిత అని చెప్పాలి. ఆ కవితను పట్టుకొని వరంగల్‌లోని జనధర్మ పత్రికా కార్యాలయానికి వెళ్లి ఓ పెద్ద మనిషికి ఇచ్చిన. ఆ కాగితాన్ని ఆసాంతం చూసి ‘ఎవరాసిందిది..?’ అని ఆ పెద్దమనిషి అడిగారు. ‘నేనే సార్’ అని చెప్పి వచ్చిన. సీన్ కట్ చేస్తే నేను రాసిన ఆ కవితను రాసినట్టు పబ్లిష్ అయింది. అలా ‘జనధర్మ’ పత్రిక నన్ను కవిని చేసింది. ఆ పెద్ద మనిషే ఆ పత్రికా సంపాదకులు ఎంఎస్ ఆచార్యగారు. అలా అప్పుడప్పుడూ కవితలు రాయటం, జనధర్మకు వెళ్లి ఇచ్చి రావటం, అవి పబ్లిష్ కావటం జరిగిపోయింది. ఆ తరువాత ఆంధ్రభూమి వారపత్రికలో ‘కోయిలా.. కోయిలా..’ శీర్షికతో వారం వారం కవితలు వేసేది. అట్లా ఆంధ్రభూమిలో, జనధర్మలో కవితలు ప్రచురితం అయ్యేవి. రాసింది అచ్చులో చూసుకొని మురిసిపోవటం మొదలైంది. ఇంటర్ పూర్తయి. డిగ్రీకి రావటం, పఠనాసక్తి పెంచుకోవటాన్నే అభిరుచిగా మలచుకున్నాను. అట్లా వార్తలే కాకుండా దాదాపు అన్ని తెలుగు పత్రికలు ప్రచురించే ఎడిటోరియల్ ఆర్టికల్స్, ఆయా పత్రికల్లోని ‘కాలమ్స్’ విడిచిపెట్టకుండా లైబ్రరీకి వెళ్లి చదవటం రోజువారి పనిలో భాగమైపోయింది. అయితే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో వరంగల్ జిల్లాలో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు ఎక్కడపెట్టినా సరే పాల్గొనాల్సిందే. వక్తృత్వంలో ఫస్ట్, సెకండ్ ప్రైజులు వస్తే వ్యాసరచనలో థర్డ్ ప్రైజ్, కన్సోలేషన్ ప్రైజులు వచ్చేవి. ఎందుకిలా అవుతుంది? బాగా రాసినా కన్సోలేషన్ ప్రైజ్ వస్తుందేమిటీ? అనుకునేది. అట్లా సమాధానం వెతికే ఆలోచనలో పడినప్పుడు బుర్ర గిర్రున తిరిగింది. ‘ఒక వ్యాసం రాసి దాన్ని పత్రికలకు పంపిస్త. అది పబ్లిష్ అయిందంటే మనలో స్టఫ్ ఉన్నట్టు లేదంటే లేదు’ అని సెల్ఫ్-టెస్ట్ పెట్టుకున్న. ఈ టెస్ట్‌లో పాసయిన. అలా ఇంటర్లో ఉన్నప్పుడు కవితలు పబ్లిష్ కావటం, డిగ్రీకి వచ్చాక వ్యాసాలు పబ్లిష్ కావటం, అదీ పేరుతో పబ్లిష్ కావటం అనే కిక్ మొదలైంది. అయితే, అప్పటికే నేను మా ప్రాంతంలో ఒక ప్రయివేట్ స్కూల్లో పార్ట్-టైమ్ టీచర్‌గా పనిచేస్తున్న. లెర్నింగ్ బై ఎర్నింగ్ అన్నమాట.
2018లో నాటి సీఎం కేసీఆర్ పుస్తకావిష్కరిస్తున్న ప్రవాహం
ప్రశ్న 3: పూర్వరంగంలో ఉపాధ్యాయుడిగా ఉండడం మీలోని రచయితకు దోహదం చేసిందా? వివరించండి.
జ: పూర్వరంగంలో ఉపాధ్యాయుడిగా పనిచేయటం వల్ల విషయాల పట్ల ప్రాథమిక అవగాహనకు తోడ్పాటును అందించింది. ఆసక్తి పెరిగేందుకు పూరకమైంది. ఒక అంశం పట్ల అధ్యయనం చేయాలనే ఉత్సుకతను రేకెత్తించింది. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసాన ప్రభావాలపై రేఖామాత్రపు అంచనాకు రావటానికి ఉపయోగపడింది. అట్లా.. రాస్తున్న క్రమంలోనే మిత్రులు ‘నువు జర్నలిజం కోర్సు చేస్తే బావుంటుంది’ అని సూచించారు. అట్లా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీలో బీసీజే, ఎంసీజే. మా జర్నలిజం డిపార్ట్మెంట్ నా అధ్యయన పరిధిని విస్తృతం చేసింది. ప్రొఫెసర్లు పీఎల్వీ, అబ్దుల్ రహమాన్, నాగేశ్వర్, స్టీవెన్సన్, పద్మజా షా, శ్రీనాథ్ రెడ్డి, నరేందర్, శ్యాం సుందర్, అజయ్ కుమార్ ఇలా అందరూ ఆయా అంశాల్లో విషయాన్ని అన్ని కోణాల్లో అధ్యయనం చేసేందుకు కావలసిన అవగాహనను కల్పించారు. ఎంసీజే సెకండ్ సెమిస్టర్లో ఉండగానే ఆంధ్రజ్యోతి రీ-లాంచ్. ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మళ్లీ అక్కడ జర్నలిజం స్కూల్. ఓయూలో చదివిన జర్నలిజం అకాడమిక్ అంశాలతోపాటు కొంత ప్రాక్టికాలిటీ పట్ల అవగాహన కల్పిస్తే ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజ్ సంపూర్ణ ప్రాక్టికల్స్‌కు దోహదం చేసింది. అక్కడ జర్నలిజం కాలేజ్ ప్రిన్సిపల్ కట్టా శేఖర్ రెడ్డి, సంపాదకులు కే. రామచంద్రమూర్తి, కే. శ్రీనివాస్, అల్లం నారాయణ, వర్ధెల్లి మురళీ, అప్పుడప్పుడూ గెస్ట్ లెక్చర్స్ చేసే జీఎస్ వరదాచారి, ఘంటా చక్రపాణి ఇలా ఎంతోమంది పెద్దలు జర్నలిజం పట్ల అవగాహన పెంచుకొని ఆచరించేందుకు మార్గం వేశారు.
పుస్తక పరిచయ సభలో ప్రసంగిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, సాహితీవేత్త కే. శ్రీనివాస్
ప్రశ్న 4: ఒక ఘటనని వార్తా కథనంగా మలచడంలో విలేఖరికి ఎటువంటి నైపుణ్యాలు ఉండాలని మీరు భావిస్తారు?
జ: అది సందర్భ స్వరూపాలను బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఘటన చిన్నదే కావచ్చు. కానీ తీవ్రత పెద్దదిగా ఉంటుంది. ఒక్కోసారి ఎంత పెద్ద ఘటన జరిగినా అది దాని పరిధిని బట్టి కాకుండా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఇటీవలి కాలంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి చాలా మంది కార్మికులు చనిపోయారు. మన దగ్గర చాలా మంది, ఆ మాటకు వస్తే దాదాపు పత్రికలన్నీ ఘటన జరిగిన తీరును, తీవ్రతను ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం కోణంలోనే వార్తలు ప్రచురితం అయ్యాయి. కానీ, మనుషుల ప్రాణాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఫోకస్ కాలేదు. ఆ కుటుంబాల స్థితిదుస్థితులను ఫోకస్ చేయలేదు. కారణం ఆ మరణించిన కార్మికులు మన ప్రాంతానికి చెందినవారు కాకపోవటం వల్ల వారి కుటుంబ, బంధుగణం కోణం నుంచి ఫోకస్ కాలేదు. అదే స్థానికులు అయితే, ఆ వార్తలు లేదా కథనాల తీవ్రత మరోలా ఉండేది. ఇక మీరన్నట్టు ఒక ఘటనను కథనంగా మలిచే ముందు విలేఖరికి కావలసిన ప్రాథమిక అవగాహన ముఖ్యం. ఆ అవగాహన ఉండాలని ఏమీలేదు. ఆ మాటకు వస్తే అన్ని అంశాల పట్ల అందరి విలేఖరులకు అవగాహన ఉండాలని ఏమీలేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ప్రాథమిక అవగాహన, విషయ పరిజ్ఞానం, సంబంధిత అంశంపై అవగాహన ఉన్నవాళ్లను సంప్రదించటం, సేకరించిన సమాచారాన్ని క్రోఢీకరించుకొని పాఠకుడికి ఎంత ఎఫెక్టివ్‌గా, ఎంత బ్రివిటీగా, ఎంత స్పష్టంగా తెలియజెప్పాలి, ఆ చెప్పే క్రమంలో పాఠకుడి ఆసక్తి తగ్గిపోకుండా చెప్పగలిగే నేర్పరితనం ఉంటే చాలు.
వరంగల్‌లో జరిగిన పుస్తక పరిచయ సభలో నాటి తెలంగాణ అకాడమీ మీడియా చైర్మన్ అల్లం నారాయణ గారు
ప్రశ్న 5: ఒక చిన్న వార్తని రెండు మూడు పేజీల కథనంగా మార్చడానికి పరిశీలన, పరిశోధన, అధ్యయనంతో పాటు ఇంకా ఏవేవి అవసరం?
జ: న్యూస్ స్మెల్ ఉంటే చాలు, ఇక మీరు అన్నట్టు వార్తలకు పేజీల సంఖ్య ముఖ్యం కాదు. అయితే, వార్త సందర్భం, తీవ్రత, పర్యవసానం లేదా ప్రభావం అన్నవాటిపై ఆధారపడి ఉంటుందనేది నా అభిప్రాయం. ఒక్కోసారి చిన్న వార్తలు అనుకున్నవే సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందాక మనం చర్చించుకున్నట్టు ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు కూడా స్థానిక సామాజికంగా అసలు ఏ ప్రభావం చూపనివీ ఉంటాయి. కాకపోతే ప్రభుత్వాలు, పాలన పరంగా పెద్ద ప్రభావాన్నే చూపిస్తాయి.
ప్రశ్న 6: “ఒక ప్రభావం కలుగజేసి మార్పులకు కారణమై, ప్రేరణయై, సామాజిక అంశాల్లోకుదుపు కలుగజేసే కథలు అరుదు. ఈ అరుదైన కథనాల పుస్తకమే నూర పుస్తకం” అని వ్యాఖ్యానించారు అల్లం నారాయణ గారు తమ ముందుమాటలో. వార్తలకై, వార్తా వ్యాసాలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత సన్నిహితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని వార్తాకథనంగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది? ఇతర జర్నలిస్టుల పద్ధతులకీ మీ పద్ధతులకీ ఏదైనా మౌలికమైనా తేడా ఉందా?
జ: నా జర్నలిజం ప్రయాణం ఆంధ్రజ్యోతితో మొదలైనప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయం, నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమైనప్పటి నుంచీ వారు నన్నూ, నా కథనాల ప్రత్యక్షంగా చూశారు వారు. బహుశా అందులోంచే అరుదైన కథనాల పుస్తకమని అల్లం నారాయణ సార్ అభివర్ణించారు. నాకు అది నాకు గొప్ప ప్రశంస. ఇక ఒక అంశాన్ని వార్తాకథనంగా మలిచేందుకు నా కంటూ ప్రత్యేక పద్ధతి అంటూ ఏమీ ఉండదు. ఇందాక చెప్పుకున్నట్టే వార్త స్వభావం, సంబంధిత అంశానికి సంబంధించిన సందర్భం, సమాజంపై దాని ప్రభావమే గీటురాయి తప్ప ప్రత్యేకించి నా కంటూ ఒక ప్రత్యేకత ఏమీలేదు. కాకపోతే, ఎత్తుగడకు సంబంధించి జర్నలిజం పరిభాషలో చెప్పాల్నంటే శీర్షిక, సూపర్ లీడ్, లీడ్ తక్కిన వాళ్లకన్నా కొంచెం భిన్నంగా ఉండాలని తాపత్రయం ఉంటుంది. అందుకోసం కొన్ని ప్రత్యేక వార్తాకథనాల విషయంలో లోలోపల తర్జనభర్జన పడిన సందర్భాలున్నాయి.
ఇక ఇతర జర్నలిస్టుల పద్ధతికీ నా పద్ధతికీ మౌలిక తేడా ఉందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పటం సరికాదామో అని నా మట్టుకు నాకు అనిపిస్తుంది. అందుకు కారణాలూ లేకపోలేదు. అదొక ఇప్పటి అసహజసిద్ధమైన చర్చకు దారితీస్తుందేమో అనిపిస్తుంది. అయినా సరే, నాకు తోచిన లేదా నాకు తెలిసిన అంశాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మా కన్నా ముందుతరం సృజనాత్మకత, మానవీయత అంతిమంగా సమాజహితం ప్రాతిపదికగా, వాటిని విలువగా పాటించింది. ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే దాదాపు లేదనే అనిపిస్తుంది. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే సమాజ ఉద్ధారకులు. ఇప్పుడు ఆ అర్థం మారిపోయింది.
పత్రికల్లో పైనున్నవారి ఆలోచనల విలువనే అనివార్యంగా అనుసరించాల్సించిన పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. ఇదొక పత్రికకో, అందులో పనిచేసేవారికో సంబంధించినది కాకుండా మొత్తంగా జర్నలిజం ప్రామాణికంగా చెలామణి అవుతున్నది.
ఇవ్వాళ సమాజ డబ్బాను కొట్టుడు అరుదైన అంశమే కాదు అదొక అపురూపంగా మారిపోయిన సందర్భంగా చూస్తున్నాం. ఈ ప్రొఫెషన్ లోకి నేనొచ్చి 24 ఏండ్లు పూర్తి అయింది. విలువలు, ఆదర్శాల వంటి పడికట్టు మాటలు ఎన్ని చెప్పినా ఇప్పుడు జర్నలిజం కెరీరిజంగా కూడా మారలేకపోయింది. అదొక విషాదం. జర్నలిజం ప్రొఫెషన్లో ఒక జర్నలిస్టును సాధారణంగా ‘జాక్ ఆఫ్ ఆల్.. మాస్టర్ ఆఫ్ నన్’ అని పిలుస్తారు. దురదృష్టవశాత్తు ఇవ్వాళ అది చాలా వరకు ‘జాక్ ఆఫ్ జీరో మాస్టర్ నన్’ అనేలా మారిపోయిందనిపిస్తుంది. ఈ క్రమంలో చూసినప్పుడు ఇతర జర్నలిస్టుల పద్ధతిని గురించి కామెంట్ చేయటం సాహసమే కాదు, అనైతికం కూడానేమో.
ప్రశ్న 7: “ఈ పుస్తకంలో ఎంపిక చేసిన కథనాల్లో కొన్ని ఐటమ్లనబడే వార్తలు సమాజంలో ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో, సామాజిక, ఆర్థిక రంగాలలో పెనుమార్పులు తేవడానికి ఉపకరించాయి” అని మీ ముందుమాటలో అన్నారు. ఒకటి రెండు ఉదాహరణలతో పాఠకులకి వివరిస్తారా?
జ: నిజమే. ఒక సంఘటన జరిగినప్పుడు అది చోటుచేసుకున్న ప్రాంతానికి చిన్నదిగానే కనిపిస్తుంది. రోజూ కనిపిస్తున్న అంశమే అని స్థానికులకు అనిపిస్తుంది. కానీ, అది వార్తగా ప్రజల్లోకి వెళ్లిన తరువాత దాని ప్రభావం తీవ్రత అర్థం అవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు, సామాజిక ఆర్థిక రంగాలపై అంతిమంగా సమాజంలో విస్తృతమైన చర్చకు దోహదపడుతుంది. అలాంటి వార్తల్లో ‘కన్నీటి బిందువు’ కథనం ప్రత్యేకమైనది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాల దయనీయస్థితిని చూసి కదిలిపోని ప్రత్యక్షంగా జర్నలిస్టు పరోక్షంగా యావత్ తెలంగాణ సమాజం ఉండదు. అట్లా చూసినప్పుడు కన్నీటిబిందువు. ఆ కథనం తెల్లారి తెలంగాణ సమాజం కన్నీటిపర్యంతం అయింది. మా పత్రిక ఆత్మబలిదానాలు చేసుకుంటున్న కుటుంబాలను ఆదుకోవటానికి ‘నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు దశల్లో రూ. 35వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. నిజానికి దాన్ని సాయంగా కాకుండా బాధ్యతగా నమస్తే తెలంగాణ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆత్మబలిదానం చేసుకున్న ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అని ప్రకటించారు. అన్నట్టుగానే దాదాపు అన్ని కుటుంబాలకూ ఆర్థిక సాయం అందించారు. అర్హులైన వారికి ఉద్యోగాలూ ఇచ్చారు. అయితే, ఇంకా కొంతమందికి ఇవ్వవలసి ఉన్నదీ అనే వాదనా ఉందనుకోండి. మరోకటి ‘తాళిబొట్లు రాలుతున్నై’ అనే కథనం. గుడుంబా (నాటుసారా) తాగి వైధవ్యమే ఆభరణంగా మారిన ధైన్యాన్ని గణాంకాలు, కేస్ స్టడీస్‌తో సహా రాసిన కథనం అది. యువ వితంతువులు పెరుగుతున్న వర్తమాన పరిస్థితి తెలిపే ఈ కథనం తీవ్రతను చూసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చలించిపోయారు. తెలంగాణలో గుడుంబాలను నిషేధించారు. ఇట్లా సమాజ మార్పునకు దోహదపడేలా రాసిన వార్తలు ఎన్నటికీ మరచిపోలేను. నిజానికి, ఆ వార్తలు రాస్తున్నప్పుడు వాటి వల్ల ‘అంత జరుగుతుంది’ అని అనుకోలేదు. అసలట్లా అనుకొని ఏ జర్నలిస్టు రాయడూ. కాకపోతే కథన తీవ్రత గ్రహింపుపై కొంత అవగాహన ఉంటుంది.
2016లో స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు స్వీకరిస్తూ
ప్రశ్న 8: మైక్రో ఫైనాన్స్ బాధితులపై వ్రాసిన ‘తాళి తాకట్టు’, ‘మైక్రోసుర వధ’ వ్యాసాల నేపథ్యం, సూక్ష్మరుణాల చీకటి కోణాలను వెలుగులోకి తేవడంలో మీ కృషి గురించి చెప్తారా?
జ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా అతలాకుతలం చేసిన కథనం ‘తాళితాకట్టు’. మైక్రోఫైనాన్స్ లేదా సూక్ష్మరుణాలు ఇచ్చే సంస్థలు అవి సాధాసీధా సంస్థలు కావు. ఎంఎన్‌సీలు (మల్టీనేషనల్ కంపెనీలు). నిజానికి, ఆ కథనానికి ముందు వేరే కథనం ప్రచురితమైంది. తల్లితీసుకున్న సూక్ష్మరుణం సకాలంలో చెల్లించకపోవటం వల్ల రుణ వసూలుదారులు పెట్టే అమానవీయ పద్ధతుల వల్ల వరంగల్ పట్టణంలో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిని, తల్లితోపాటు ఇంటిల్లిపాదిని సూటిపోటీమాటలతో అగౌరవ పరచటం తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలిసింది. రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఎదురయ్యే పర్యవసానాల మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్న సమయంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణగారు పలివేల్పులో పరిస్థితిఘోరంగా ఉందనే విషయం చేరవేశారు. వార్తకోసం అని కాకుండా వారిని రిక్వెస్ట్ చేసి వెంటబెట్టుకొన ఆ పలివేల్పులకు ఫొటోగ్రాఫర్‌తో కలిసి వెళ్లాను. వెళితే తెలిసింది. అది కేవలం వరంగల్‌కు పరిమితమైన అంశం కాదు.. యావత్ రాష్ట్రాన్ని (ఉమ్మడి రాష్ట్రం) పట్టిపీడిస్తున్నభూతం అని అక్కడే తెలిసింది. స్థానికంగా ఆదివారం చిట్టీ. ఒక్కో సంస్థ ఒక్కోవారం రావటం అప్పులు ఇవ్వటం, ఇచ్చినవారం (అది ఆదివారం అయితే, ఆదివారం, సోమవారం అయితే సోమవారం) వసూలు చేసుకుపోవటం. రుణాలు ఇచ్చే సంస్థలు రుణాలు వసూలు చేయటానికి వారం వారం వడ్డీతో సహా వసూలు చేసే విధానం అన్నమాట. ఒకవారం చెల్లించకపోతే మరోవారం వాయిదాకు ఆ వారంలో కట్టాల్సిన కిస్తీ లేదా వాయిదా అమౌంట్‌తో పాటు క్రితం వారం చెల్లించిన వాయిదాకు వడ్డీతో సహా చెల్లించాల్సిన మొత్తం.. ఇలా అదీ చెల్లించకపోతే వచ్చేవారం ఆ రెండు వాయిదాలు, వాటి వడ్డీలు ఇలా గొలుసుకట్టుగా అప్పు పెరుగుతూపోతుంది. గృహిణీలకు ఆ సంస్థలు అప్పులు ఇస్తాయి. వాటి వసూళ్లకు పెద్ద యంత్రాంగమే ఉంటుంది. సంఘంగా ఏర్పడిన సభ్యులు అందరూ వెళ్లి వసూలు చేస్తారు. అలా ఉమ్మడి భాగస్వామ్యం. వారానికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని సంస్థలు వచ్చి అప్పులు ఇచ్చిపోతాయి. ఒక సంస్థకు తెలియకుండా ఒక సంస్థ ఇలా అన్ని సంస్థలు అందరికీ రుణాలు ఇచ్చిపోతాయి. తమ సంస్థకే కాదు అన్ని సంస్థల దగ్గరా రుణం తీసుకున్నారని వారికి తెలుసు. అయినా వారికి రుణాలు ఇచ్చాం అనే టార్గెట్లను పూర్తి చేయటం కోసం అప్పులు ఇచ్చిపోతుంటారు. అప్పులు తీసుకున్నవారే ఇచ్చినవారికి ఆ రోజు మర్యాదలు (కోడిని కోసి భోజనం పెట్టడం, అవసరమైతే తాగేందుకు మందుపోయటం వంటివి కూడా సాధారణమే) చేయటం సాధారణమైపోయింది.
ఇట్లా ఒక ఇంట్లో ఒక కుటుంబం అప్పు చేస్తుంది. ఆ అప్పు సకాలంలో చెల్లించకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు, రేషన్ కార్డులు, ఇంటి పత్రాలు ఇలా అన్నీ తాకట్టుకు పోవటమేకాదు ఆమె తాళి తాకట్టుకు పెడుతుంది. తన తాళి మాత్రమే కాకుండా పెండ్లి అయిన తన కూతురు తాళిని కూడా తాకట్టు పెడుతుంది. ఇది తెలిసి తన కూతురును అల్లుడు తీసుకుపోకుండా తల్లిగారి ఇంట్లోనే వదిలేస్తాడు. అంతా విని, రాసుకొని ఆమె ఫొటోలు తీసుకొని ఒకరిద్దరి అభిప్రాయాలు తీసుకొని ఆఫీసుకొచ్చి ఎడిటర్ కే. శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి వివరంగా చెప్పాను. మెయిన్‌కు పంపండీ అని చెప్పారు. నిజానికి ఆ రోజు అయోధ్యపై తీర్పు వచ్చింది. అసలు వార్త వస్తుందో రాదో అనుకున్నా.. అయోధ్య తీర్పు బ్యానర్ ఐటెం అయితే, అక్టోబర్ 1, 2010లో ఆంధ్రజ్యోతి బాటమ్ బ్యానర్ ‘తాళితాకట్టు’ వార్త. ఆ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. సాయంత్రం ఫాలోఅప్ ఇవ్వమన్నారు. అంతేకాదు వరుస కథనాలు రాయాలని ఆదేశం. ఎండీ రాధాకృష్ణ గారు ఫోన్లో అభినందన. అలాంటి స్టోరీలే రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రజ్యోతి సీరిస్. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లు. అన్ని పత్రికలూ మైక్రోఫైనాన్స్‌పై వార్తలు రాయక తప్పని అనివార్య పరిస్థితి. మొత్తానికి కొణిజేటి రోశయ్య ప్రభుత్వం ఫైనాన్స్‌పై నిషేధం దాకా. ఆ వార్త రాసేప్పుడు తెలియలేదు. ఒక పెనుమార్పుకు కారణం అవుతుందని.
2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకానికి సంబంధించిన నిర్వహించిన స్టేట్‌లెవల్ కాంపీటీషన్లో ప్రింట్ మీడియా విభాగంలో మొదటి బహుమతి స్వీకరిస్తూ
ప్రశ్న 9: పారిశుద్ధ్య కార్మికులపై వ్రాసిన కథనానికి ‘ధూళి పూల పరిమళం’ అన్న శీర్షిక పెట్టడంలో మీ ఉద్దేశమేమిటి? దుర్వాసన వెదజల్లే పరిసరాలలో పనిచేసే వారి వద్ద మీరు గమనించిన పరిమళాలేవి? శీర్షికని సెటైరికల్ టైటిల్ అనుకోవచ్చా? మరింత వివరించండి.?
జ: ప్రత్యేక ఉద్దేశం అంటూ ఏదీ లేదు. ధూళిని అంటే దుమ్మును ఊడ్చి పరిసరాలకు పూలపరిమళాలను అద్దే మహనీయులు పారిశుద్ధ్య కార్మికులు అనే ఉన్నతభావనతో పెట్టిన శీర్షిక అది. అంతేకాని అందులో వ్యంగ్యం (సెటైరికల్) ఊహకు మాత్రం కూడా అందదు. పారిశుద్ధ్య కార్మికులుగా వాళ్లెప్పుడు నిద్రపోతారో, వాళ్ల కుటుంబ బాగోగులను ఎప్పుడు చూసుకుంటారో వారికే తెలియదు. చాలిచాలీ వేతనాలతో ఇల్లు గడవటం కోసం, పిల్లల చదువుకోసం తెల్లవారుమునే లేచి, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి దాకా రోడ్లు, పరిసరాలను శుభ్రం చేయటమే జీవితంగా బతుకుబండిని లాగే గొప్ప జీవితాలు వారివి. దుమ్ము, ధూళినే మిత్రులు, కుటుంబ సభ్యులుగా భావించి పనిచేసే ఆ పారిశుద్ధ్యకార్మికుల పిల్లలను ఉన్నత చదువులు చదివించినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి పట్ల సమాజం కొంత ఈసడింపుధోరణినే పాటిస్తుంది. అట్లా కాకుండా వారి కుటుంబాల్లోనూ పిల్లలూ ఉన్నత చదివినవాళ్లు ఉన్నారని, చేసేపనిని బట్టి కాకుండా సాటి మనుషులుగా అందరం ఒక్కటే అన్న భావనన కల్పించాలనే నేపథ్యాన్ని ఆ కథనం ద్వారా చెప్పాలని అనుకున్నా. అందుకే ఆ స్టోరీకి ఆ శీర్షికను పెట్టాను.
ప్రశ్న 10: ‘చెరగని చరిత్రకు సజీవ సాక్ష్యాలు’ వ్యాసం గురించి, తెలంగాణకు, బస్తర్కూ ఉన్న సంబంధాన్ని వెలికి తీసేలా వ్రాసిన ఇతర చరిత్ర సంబంధిత వ్యాసాల గురించి మరింత వివరంగా చెప్తారా?
జ: కాకతీయ సామ్రాజ్యపు చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతమైందని తెలుగునేలపై అందరికీ తెలిసిన చరిత్ర. అయితే, కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ బొబ్బిలిగారు ఎంతోకాలంగా మౌఖికంగా చెప్తూ వచ్చిన విషయమేమంటే ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు గోదావరిని దాటి దండకారణ్యం వైపు వెళ్లిపోయినట్టు మాత్రమే ఇప్పటికీ ఉంది. కానీ, వాళ్లు ఎటువెళ్లారు? వెళితే ఏమైంది? అన్న విషయాలు తెలియవు. మరోవైపు అక్కడ (బస్తర్‌లో) ఉన్నవాళ్లు తాము కాకతీయ వారసులమని క్లెయిమ్ చేసుకుంటున్నారు అని చెప్పేవారు. ఇదే విషయాన్ని ఆచార్య పోలవరపు హైమావతీ ఇతరులు చెప్పేవారు. 2008లో వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో నిట్‌లో జరిగిన ఒక సెమినార్లో ఒక ప్రొఫెసర్ (పేరు గుర్తుకు రావటం లేదు) దాదాపు ఇదే విషయాన్ని చెప్పారు. మౌఖికంగా చెప్తున్నారే కానీ, సాధికారికంగా ఎవరూ దృవీకరించటం లేదు. ఇదెట్లా అనుకుంటున్న సమయంలోనే ఇంటర్నెట్లో వెతికితే కొంత సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా కొంత వరకు తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. ఈ లోగా అంతకుముందు ఖమ్మం జిల్లా మహాటీవీలో పనిచేసిన మిత్రుడు జూలకంటి రాజేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణ పత్రికలో జాయిన్ అయ్యారు. తను ఖమ్మంలో పనిచేస్తున్న క్రమంలోనే బస్తర్‌లో మలికాకతీయులు అనే స్టోరీని ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి సర్ బస్తర్‌లో ఉన్నది కాకతీయులే అన్న కోణంలో ఒక స్టోరీ చేయించారు. రాజేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణలో చేరిన తరువాత బస్తర్ లింకును ఛేదించాలనే ఉబలాటం మరింత పెరిగింది. ఎడిటర్ గారి అనుమతి తీసుకొని వరంగల్ నుంచి నేను, అప్పటి టీ న్యూస్ రిపోర్టర్ నాగరాజు, మా ఫొటోగ్రాఫర్ గొట్టె వెంకన్న, రాజేందర్‌రెడ్డి మూడు రోజులు బస్తర్‌లో పర్యటించాం. అంతకుముందే బస్తర్ రాజుగా అక్కడి ప్రజలచే గౌరవింపబడుతున్న కమల్ చంద్ర భంజ్‌దేవ్ అపాయింట్మెంట్ తీసుకొని వారిని, వారి కుటుంబ సభ్యులను, రాజమహల్‌ను వారి ఇంటర్వ్యూలను వరుస కథనాలు రాశాం. అయితే, దాన్ని సాధారణ చరిత్ర కోణంలో కాకుండా ఒక ట్రావెలాగ్‌లా రాశాను. రాష్ట్రంలో ఆ కథనాలు ఒకవైపు సంచలనాన్ని, మరోవైపు ఆసక్తిని అన్ని వర్గాల్లో కల్పించాయి. ఇవి రాసిన తరువాత ప్రముఖ ట్రావెలర్, రచయిత, నవలాకారుడు పరవస్తు లోకేశ్వర్ స్కూటర్ మీద బస్తర్ యాత్ర చేశారని, దాన్ని పుస్తకంగా వేశారని తెలిసింది. అయితే, అందులో కాకతీయుల లింకు ఉందో లేదో తెలియదు. కానీ, ప్రింట్ మీడియాలో కాకతీయుల బస్తర్ లింకునే ఛేదించినవారిగా నమస్తే తెలంగాణ పత్రికతోపాటు బయటి సమాజం మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించింది. బస్తర్‌లో కాకతీయ రెండో సామ్రాజ్యం ఉన్నదని, వాటికి సంబంధించిన లిఖిత ఆధారాలను మొట్టమొదటిసారిగా వెలికితీసింది మాత్రం మేమే అనే సంతృప్తి సంబురం నా కెరీర్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ తరువాత అనేక మంది బస్తర్ వెళ్లారు. వెళుతున్నారు. ‘ఓరుగల్లును చూడాలని ఉంది’ అని బస్తర్ రాజు కమల్ చంద్ర భంజ్‌దేవ్ మా ఇంటర్వ్యూ సందర్భంగా అభిలషించారు. వారి ఆ కోరిక 2022లో తీరింది. అప్పుడు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో ప్రత్యేకించి నమస్తే తెలంగాణ కథనాలు పెద్ద పెద్ద ప్లెక్సీలుగా వెలిశాయి. ఆ తరువాత మూడు నాలుగు సార్లు వారు రావటం, ఇక్కడి నుంచి అప్పుడు ప్రజాప్రతినిధులుగా దాస్యం వినయభాస్కర్ వారి దగ్గరికి రాకపోకలు చేయటంతోపాటు అరవింద్ పకిడే అనే ఔత్సాహిక చరిత్ర అభిలాషి నిరంతరం వారితో సంపర్కంలో ఉంటూ ఈ మధ్యనే బయ్యారం దగ్గర కాకతీయుల కాలం నాటి గుడి పునరుద్ధరణ కార్యక్రమానికి వచ్చి వెళ్లారు. హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గాలరీలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇలా మొత్తానికి ఓరుగల్లు టు జగదల్పూర్ [జగదల్పూర్ రాజమహల్ (కమల్ చంద్ర భంజ్‌దేవ్ నివాసం)] ఉన్న ప్రాంతంతో తెలంగాణకు మార్గం వేయటానికి ఆ కథనాలు భూమిక వహించాయి అని గర్వంగా చెప్పగలను.
బస్తర్ రాజు కమల్ చంద్రభంజ్దేవ్తో ఇంటర్వ్యూ
ప్రశ్న 11: ఈ పుస్తకం లోని ఏ కథనం మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: మనసుకు అత్యంత దగ్గరి కథనం ‘సరస్వతమ్మ బిడ్డలు.. చదువు జోలికెళ్లరు’ అప్పుడే కాదు ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే నేను రిపోర్టర్‌ను అయ్యాక రాసిన తొలికథనం. ఆంధ్రజ్యోతిలో నా జర్నలిజం జర్నీ స్టార్ట్ అయ్యాక ముందు హైదరాబాద్‌లో, ఆ తరువాత కొద్దినెలలు వరంగల్ డెస్క్‌లో పనిచేశాను. నాకు డెస్క్ కన్నా రిపోర్టింగ్ ఇంట్రస్ట్ అని చెప్పాను. అనూహ్యంగా వరంగల్ డెస్క్ నుంచి నన్ను ఆదిలాబాద్ స్టాఫ్ రిపోర్టర్‌గా పంపారు. ఆదిలాబాద్ వెళ్లాక ఎక్కడి నుంచి మొదలుపెట్టాలా? అసలేం రాయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు ‘ముందు ఆదిలాబాద్ వెళ్లి బాసర సరస్వతిని దర్శించుకొని రండి’ అని నా కన్నా ముందు స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేసిన వెంకట్రావ్ చెప్పారు. సరే, ముందు బాసర అయితే పోదాం అని వెళ్లి తెల్లారి సరస్వతి దర్శనం అయ్యాక రూం ఖాళీ చేసి గోదావరి నదిని చూసి అటు నుంచి అటే ఆదిలాబాద్ వెళ్లేందుకు లోకల్ రిపోర్టర్ సంతోష్‌ను వెంటబెట్టుకొని వెళితే, అక్కడంతా బడిఈడు పిల్లలు గంగలో దూకి (తెలంగాణలో గోదావరిని చాలా మట్టుకు గంగ అనే సంభోదిస్తారు) నదిలో భక్తులు వేసిన చిల్లర పైసలు (నాణేలు) తీస్తూ ఉండటం కండ్లబడింది. స్థానికంగా ఉన్నవాళ్లకు అది పాత విషయమే. కానీ, ‘ఇదేమిటీ? స్కూల్ టైంలో పిల్లలు ఇలా ఇక్కడ ఉన్నారు?’ అని ఆరా తీస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నేరుగా బాసరలో ఉన్న స్కూల్‌కు వెళ్లి స్కూల్ ఎన్రోల్మెంట్, బడికి రాని పిల్లకు కారణాలు తెలుసుకుంటే పిల్లలు వారి కుటుంబాల ఆర్థికస్థితిగతుల నేపథ్యంలో గంగలో పైసలు ఏరుకోవటం ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. చంద్రబాబు పాలనలో ‘అక్షరసంక్రాంతి, చదువుకుందాం రా, మళ్లీ బడికి’ వంటి వినూత్న కార్యక్రమాలన్నీ బాసర నుంచే మొదలయ్యాయి. అయినా, ఆ కార్యక్రమాలు ఇక్కడి పిల్లలను స్కూల్లో చేర్పించలేకపోయాయనే కోణంలో వార్త రాయలని అనుకున్నాను. అయితే, అలా రాయాచ్చా? రాయకూడదా? అనే మీమాంసలో ఉండి వరంగల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న ప్రసేన్ గారిని అడిగితే “మీరు ఏది రాయాలనుకుంటున్నారో రాసి పంపండి.. మిగతా విషయాలు డెస్క్ చూసుకుంటుంది” అన్నారు. మరో మిత్రుడు సలీం “మంచి వార్త పట్టావు.. రాసేయ్” అన్నారు. అంతేరాసి పంపిన. రాత్రి 8 తరువాత “ఏం రాశారు ఇవ్వాళ?” అని హైదరాబాద్ నుంచి కే. శ్రీనివాస్ (అప్పుడు అసిస్టెంట్ ఎడిటర్) గారు అడిగారు. ఫలానా వార్త రాశాను అని చెప్పిన. హైదరాబాద్‌కు పంపండి అని ఫోన్ పెట్టేశారు. కరీంనగర్ ఎడిషన్ ఇన్‌చార్జీగా ఉన్న చందనం శ్రీకాంత్‌కు చెప్పాను. భయం.. భయంగానే శ్రీనివాస్ సర్‌ను అడిగాను.. వార్తలో ఏమైనా తప్పులున్నాయా? అసలా రాయచ్చా లేదా? అని. దానికి వారు ‘చూద్దాం’ అన్నారు. స్టాఫ్ రిపోర్టర్ అయ్యాక రాసిన తొలివార్త అది. సరిగ్గా రాశానో లేదో.. అసలు అలా రాయకూడదా? ఏమిటీ? అని తెల్లవార్లు నిద్రపట్టలేదు. పొద్దున ఆరున్నరకే ఫోన్. అప్పటికీ నేను పేపర్ చూడలేదు. బయటికి వెళ్లి పేపర్ చూస్తే ‘సరస్వతమ్మ బిడ్డలు.. చదువుజోలికెళ్లరు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్. ఆ క్షణాలను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ కండ్లల్లో నీళ్లు. నన్ను నేనే నమ్మలేని సంభ్రమాశ్చర్యం. రిపోర్టింగ్‌కు వచ్చాక రాసిన మొదటి వార్త అదీ బ్యానర్. అట్లా నాకు అప్పుడే కాదు ఇప్పుడూ ఎప్పటికీ అపురూపమే ఆ వార్త.
ప్రశ్న 12: ఈ సంపుటిలోని ఏదైనా కథనం రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనమైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘ఓరుగల్లు టు జగదల్పూర్’ కథనం రాసేప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. చరిత్ర సంబంధిత కథనం అది. ఎంత ట్రావెలాగ్ ఫార్మాట్లో రాసినా ఆసక్తి ఉండాలి. కథా, కథనం ఎంత ఆసక్తిని కలిగించేలా రాసినా అందులో ఉండే అంశాలు కొత్తవి. పైగా ఒక సామ్రాజ్యానికి సంబంధించినది. రాయటం కోసం రాస్తే చరిత్రకారులు ఒప్పుకోరు. దాని ప్రభావం పత్రిక క్రెడిబిలిటీపై పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లల్లో అప్పటిదాకా ఎటువంటి ఆధారాలు అలభ్యంగా ఉన్న సమయంలో రాస్తున్న కథనం కనుక కొంచెం కష్టమనిపించింది. వరుస కథనాలు పబ్లిష్ అయ్యాక వాటి ప్రతిస్పందనలు మనసుకు ఎంతో హాయినిచ్చాయి.
ప్రశ్న 13: ‘ప్రవాహం’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ప్రచురణకు ముందే అనేక సంశయాలు. ప్రవాహం కవిత్వ సంకలనమో, కథల సంకలనమో, వ్యాస సంపుటియో కాదు పూర్తిగా వార్తలు, ఆ వార్తలు కల్పించిన ఇంపాక్ట్. ‘వార్తల వెనుక కథ’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకించి తెలుగు సమాజంపై అత్యంత ప్రభావం చూపిన కథనాలు, ఆ కథనాల పర్యవసానాలు, అవి రాసిన సీనియర్ జర్నలిస్టుల అనుభవాలతో కట్టా శేఖర్ రెడ్డి సర్ సంపాదకత్వంలో ఒక పుస్తకం తెచ్చారు. అది తప్ప మరే పుస్తకం కనిపించలేదు. అంటే ఒక జర్నలిస్టు తనకు తానుగా తాను రాసిన కథనాలతో ఒక పుస్తకంగా వేసుకున్న పుస్తకాలు కనిపించలేదు. ఒకవేళ ఉన్నా వాటిని నేను పరిశీలించకపోవచ్చు. నా మనసులో కలిగిన ఈ ఆలోచనను జర్నలిస్టు పెద్దలతో పంచుకుంటే ‘బాగానే ఉంటుంది వేయండి’ అని వెన్నుతట్టారు. అయితే, ప్రవాహంలో ఉన్న 35 కథనాలన్నీ ఇంపాక్ట్ స్టోరీస్ అనను. అందులో కొన్ని మాత్రమే ఇంపాక్ట్ స్టోరీస్. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక జర్నలిస్టుగా గుర్తుండిపోయే కథనాలు, ప్రభావం చూపిన కథనాలు నా మట్టుకు నచ్చినవి. అందరూ మెచ్చినవాటిని కూర్చి వేయగలిగాను. అయితే, ప్రభావంలో మూడు రకాల కేటగిరీల కింద వేద్దామని ప్లాన్ చేసుకొని ముందు ఇంపాక్ట్ స్టోరీస్, ఫీచరిస్టిక్ వాల్యూస్ ఉన్న కథనాలను ‘తీరొక్కకోణం’ అని సబ్ టైటిల్ కింద, ట్రావెలాగ్‌ను ‘చరిత్ర పిలిచింది’ అనే సబ్ టైటిల్‌గా ఖాయం ఎంపిక చేశాను. పుస్తకానికి ప్రముఖ ఆర్టిస్ట్ లక్ష్మణ్ ఏలె అద్భుతమైన బొమ్మను వేసి ఇచ్చారు. నా జర్నలిజం కేరీర్లో నాకు ప్రత్యక్ష దిశానిర్దేశం చేసిన గురుతుల్యులు కే. రామచంద్రమూర్తి సర్, కే. శ్రీనివాస్ సర్, అల్లం నారాయణ సర్, కట్టా శేఖర్‌రెడ్డి సర్ ఇలా తీసుకున్న వారందరి అభిప్రాయాలు పుస్తకంలో వేశాను. అభిప్రాయం తీసుకొని వేయనిది జర్నలిస్టు సోదరుడు డి. మార్కండేయది మాత్రమే. అయితే, పుస్తకం ప్రచురితం అయ్యేనాటికి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మార్కండేయ అన్న అభిప్రాయాన్ని పుస్తకంలో ప్రచురించకపోయాను. ఈ పుస్తకం విషయంలో వారి అభిప్రాయాన్ని తీసుకొని ప్రచురించలేకపోవటమే గిల్టీ. 2015లో వరంగల్ ఉమ్మడి జిల్లా బెస్ట్ జర్నలిస్టు, 2016లో మిషన్ కాకతీయపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కాంపిటీషన్ బెస్ట్ స్టోరీస్ కేటగిరీలో మొదటి బహుమతి, అదే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బెస్ట్ జర్నలిస్టు అవార్డు కింద వచ్చిన నగదు పారితోషకాలు వచ్చాయి. అందులోంచి దాదాపు సగానికి కన్నా ఎక్కువ ఖర్చుచేసి సొంతంగా పుస్తకం వేయటం, గొప్పగా వరంగల్‌లో పుస్తక పరిచయ సభను నిర్వహించుకోగలిగిన. ఇక పాఠకుల ఆదరణ అంటే వేయి కాపీలు సభ అయిన కొద్దిరోజులకే అయిపోయాయి. నిజానికి మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియక పత్రికలకు రివ్యూలకు పంపలేదు. మా నమస్తే తెలంగాణలో ప్రముఖ నవలా రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ సర్ రివ్యూ రాశారు. ఇప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను మొదటి నుంచి లోప్రొఫైల్. ‘విత్తనంలో బలం ఉంటే నేలను చీల్చుకొని మొక్క వస్తుంది’ అనే నానుడిలా ‘ప్రవాహం’లో ఏ మూలనో కొంత జీవం ఉందని అనిపించేలా మీరు నన్ను కెలికారు అనుకోవచ్చునేమో (నవ్వుతూ).
ప్రశ్న 14: పాత్రికేయ/సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: నిజానికి ఏమీలేవు. ప్రస్తుతమైతే పాత్రికేయంలోనే ఉన్నాను. ఉంటాను. నచ్చిన రచనలు చదువుతాను. కాలం సహకరిస్తే నేను జర్నలిజంలోకి రాకముందు వచ్చిన తరువాత రాసిన వ్యాసాలు, ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూలు, బెస్ట్ ఫీచర్ స్టోరీస్, ఎప్పటి నుంచో రాస్తున్న కవితలను పుస్తకాలుగా తీసుకురావాలని ఆలోచన ఉన్నది.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, ‘సంచిక’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు నూర శ్రీనివాస్ గారు.
నూర శ్రీనివాస్: నిజానికి మీకు, ప్రత్యేకించి సంచిక పెద్దలందరికీ నేనే ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రవాహం 2018లోనే ఎంతోమందికి చేరింది. నేను ఒక సంస్థలో పనిచేస్తున్న కారణంగా మరో సంస్థ వేయకూడదనే కోణంలోనో మరేమిటో తెలియదు కానీ, ఎవరూ ఇలా ఇంత డీటెయిల్డ్‌గా పుస్తకం గురించి నన్ను గురించి ఇంటర్వ్యూ చేయలేదు. మీరే చేశారు. మరోసారి మీకు, మీ టీమ్‌కు ధన్యవాదాలు.
***
రచన: నూర శ్రీనివాస్
ప్రచురణ: ప్రజ్ఞావర్షిత్ ప్రచురణలు, వరంగల్
పేజీలు: 228
వెల: ₹ 275/-
ప్రతులకు:
ప్రజ్ఞావర్షిత్ ప్రచురణలు, వరంగల్
ఫోన్: 8096677011
~
‘ప్రవాహం’ వ్యాస సంపుటి సమీక్ష
https://sanchika.com/pravaaham-book-review-kss/

