[‘మెరీనా.. ఓ మెరీనా’ అనే కథాసంపుటి వెలువరించిన ఫణిహారం వల్లభాచార్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం ఫణిహారం వల్లభాచార్య గారూ.
ఫణిహారం వల్లభాచార్య: నమస్కారం.
~
ప్రశ్న 1: మీరు రచించిన 15 కథలసంపుటికి శీర్షికగా మొదటి కథ ‘మెరీనా.. ఓ మెరీనా’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం వుందా?
ప్రశ్న 2: కవిగా, కథారచయితగా, అనువాదకునిగా, కాలమిస్ట్‌గా, సంపాదకుడిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రక్రియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జవాబు: మీరన్నవన్నీ నేను అవునో, కాదో నేను చెప్పలేను కానీ మీ ప్రశ్నకు జవాబు మాత్రం దాదాపు అయిదు దశాబ్దాల నా గమనం. నేను మొదటగా వ్రాసినది పద్యమే.. అదీ కందపద్యం. అప్పటికి నాకున్నది హైస్కూలులో బోధించిన ఛందస్సు మాత్రమే. మా చిన్నాన్నగారి మామగారు శ్రీమాన్ సేనాధిపత్యం హయగ్రీవాచార్యులుగారు ఆకాశవాణిలో ‘సరస వినోదిని’ సమస్యాపూరణ కార్యక్రమానికి పూరణలు పంపిస్తూ వుండేవారు. చాలాసార్లు ఆయన పద్యాలు ఆ కార్యక్రమంలో వినవచ్చేవి. ఒకసారి ఎందుకు అన్నానో తెలియదు కానీ, “ఈ సారి నేనూ వ్రాస్తాను” అన్నాను. “నువ్వు వ్రాసిన పద్యం రేడియోలో చదివితే నీకు అయిదు రూపాయలిస్తాను” అన్నారాయన. “నా పద్యం చదవకపోతే మీకే నేను యాభైరూపాయలిస్తాను” అన్నాను. గోదారినీటిపొగరు కదా! సరే అంటే సరే అనుకున్నాం. అలాగే వ్రాశాను. పూరణ గుర్తు లేదు కానీ ఆనాటి సమస్య మాత్రం “మునికిన్ నేర్పంగనేల మెహపు సుద్దుల్?” దీనిని “కా, మునికిన్ నేర్పంగ నేల మోహపు సుద్దుల్?” అని పూరించి పంపాను. ఆ పద్యం ఆ కార్యక్రమంలో చదివారు. అప్పటికి నాకు పందొమ్మిదేళ్లు. ఆ వయసులో రేడియోలో నా పేరు, పద్యం వినవచ్చే సరికి ఇంక ఆగేదేముంది? వరుసగా వ్రాయటం.. నాలుగైదు నెలలు కరిగే సరికి మన దగ్గరున్న పద సంపద ఎంతో అర్థమై పోయింది. అప్పుడు కావ్యపఠనం మొదలైంది. బోధించేవాళ్లు లేరు. అందుకని వ్యాఖ్యానాలతో వున్న ప్రాచీన కావ్యాలు సంపాదించి చదువుకోవటం మొదలు. అలా అయిదేళ్లు గడిచేసరికి నాకు గురువు లభించారు. ఆయనే శ్రీమల్లంపల్లి శరభయ్య గారు. అప్పటి నుంచీ ఆయన కావ్యజ్ఞశిక్షలో నా సాహిత్యాధ్యయనం సాగింది. నేను మొదటి నుంచీ.. ఇప్పటికీ పద్య పక్షపాతినే.
కథారచన అనేది యాదృచ్ఛికంగా జరిగింది. ప్రాచీన కావ్యాలలోని రసజ్ఞ లక్షణం మా గురువుగారి భిక్షగా ఒంట బట్టడం వల్ల “మెరీనా” కథలోని చివరి దృశ్యం కంటబడి కదిలించి కథగా మారింది. ఆ తరువాత అనువాదాలు కాదు కానీ ఆంధ్రప్రభ వీక్లీలోనే ఆనాటి సంపాదకులు వాకాటి వారు, ఇంద్రగంటివారు చెప్పినందున నాలుగు ఆంగ్ల నవలలను అనుసరణలుగా వ్రాశాను. ‘కాలమ్స్’ రచన కూడా వాకాటి వారి ఆదేశమే. ఆనాటి రాజకీయ నాయకుల తీరుతెన్నుల గురించి వ్రాసిన ‘జయహే’ ఒక్కటే నా స్వీయ ఆలోచన. ‘పర్యావరణం బహుపరాక్’, ‘భాగ్యనగర్ బాతాఖానీ’ రెండు వాకాటి వారి ఆలోచనలు. అనువాదాల విషయానికి వస్తే నేను చేసిన అనువాదాలు అత్యధిక భాగం మా పరమపూజ్య గురుదేవులు స్వామీ నిఖిలేశ్వరానందగా సాధకలోకంలో ప్రఖ్యాతులైన డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ హిందీలో వ్రాసిన మంత్రసాధన సంబంధమైన గ్రంథాలే. మరొక రెండు అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలకు కొన్ని ఆంగ్ల గ్రంథాలు తెలుగు చేశాను కానీ, అనువాదం చేశాక “మీరు మా సంస్థకి క్రొత్తవారు కదా! మావాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా? అందువల్ల ఈ పుస్తకాల ప్రచురణలో మీ పేరు వేయటం లేదు!” అని నాకు ఒక సందేశం పంపారు. ఆ అనువాదాలు ‘అనామకం’గా పోయాయి.
సంపాదకుడుగా అంటే ఆంధ్రప్రభ వీక్లీలో ఉద్యోగం మానివేశాక నేనూ, నా మిత్రడు వై.వి. వివేకానందం కలిసి ‘ప్రవాహవాణి’ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించాం. నేను హైదరాబాద్‌కు ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరడానికి 1985 మే లో వచ్చాను. 1991 వరకూ అక్కడ పని చేశాను. ఆంధ్రపత్రిక మూత పడటానికి ముందే ఆనాటి సంపాదకులతో విభేదాల వల్ల మానేశాను. ఆంధ్రప్రభ వీక్లీలో కూడా అంతే. ఆనాటి సంపాదకులతో విభేదమే. నేను చేసిన ఉద్యోగాలన్నిటిలో పైవాళ్లతో విభేదం వల్లనే స్వస్తి. నేను ఆంధ్రపత్రికలో పని చేస్తున్న రోజులలోనే వారు ప్రచురించే ‘భారతి’ సాహిత్య మాసపత్రిక ఆగిపోయింది. మాది భారతి చదువుకుంటూ పెరిగిన తరం. అది మూతపడటం చాలా బాధ కలిగించింది. అలాంటి పత్రిక ఒకటి తీసుకురావాలని నేనూ, మిత్రుడు వివేకానందం పూనుకుని ‘ప్రవాహవాణి’ సాహిత్య మాసపత్రికను ప్రారంభించాం. మొత్తం మేమిద్దరమే. రెండేళ్ల కాలంలో పదిహేడు సంచికలు తీసుకురాగలిగాం. సాహిత్యం మీద అపారాభిమానం తప్ప మాకు ‘మార్కెటింగ్ స్కిల్స్’ ఏవీ? లేవు. ఆ పత్రిక అలా కనుమరుగై పోయింది. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఆ పత్రిక సంచికలన్నీ నా దగ్గర లేకపోవటం!
నా సాహిత్య ప్రయాణంలో “ఈ రంగంలో వీడూ ఒకడున్నాడు” అని కాస్తో కూస్తో గుర్తింపు వచ్చినది నా సాహిత్య విమర్శ వ్యాసాల వల్ల, ‘ప్రవాహవాణి’ సాహిత్య మాసపత్రిక నిర్వహణ వల్ల.
ప్రశ్న3: కవిత/కథ వీటిలో ఏది వ్రాయటం సులువని అనుకంటారు? ఎందువల్ల?
జవాబు: రెండు సులువు కాదు. రెండూ సులువే కూడా. ఏదైనా రచన చేసేముందు ఆ ప్రక్రియకు సంబంధించిన పునాది బలంగా వుండాలి. కవిత అయినా, కథ అయినా ఏదైనా సరే దానికి మూలం ‘మనిషి’ అనుకుంటాను నేను. ఎవరి సిద్ధాంతాలు, కారణాలు వారికి వుండగా ఇది అందరూ ఒప్పుకొనే మాటే. మనిషి గురించి తెలియాలంటే “లోకంలో తిరుగు, రైల్వేస్టేషన్, బస్టాండ్, గవర్మమెంట్ హాస్పిటల్ జనరల్ వార్డ్‌లలో తిరుగు. కథలు దొరుకుతాయి” అనేవారు వాకాటి వారు. ఈ మాట శతాబ్దాలక్రితం “కవి కంఠాభరణం”లో క్షేమేంద్రుడు చెప్పినదే. అలాగే “మనకి తెలిసిన విషయాన్నే తిరగేసి చూస్తే కథ పుడుతుంది” అనే వారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు. ఇక్కడ “మనిషి” దొరుకుతాడు. ఒక్కసారి ‘మనిషి’ అంటూ దొరికితే సమస్త భావాలూ ప్రతిఫలిస్తాయి. వ్రాతకు దిగవచ్చు.
కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అది కవిత అయినా, కథ అయినా! ఎలా చెప్పాలి? ఎంతవరకూ చెప్పాలి? మనం చెప్పేది సమాజానికి హితకరమా, కాదా? సమాజంలో ఉద్వేగాలు రెచ్చగొట్టి కవి, కథకుడు అనిపించుకోవాలా? ఈ నిర్ణయం ఎవడికి వాడు తీసుకోవాలి. చాలా సులువుగా కవితో, కథో వ్రాసేసే మార్గం అప్పటి ‘ట్రెండ్’ ఫాలో అయిపోవడం. దానివల్ల పేరు వస్తుంది, అతగాడి చుట్టూ ఒక బృందమూ ఏర్పడుతుంది. అతగాడికి అంత ‘సీన్’ లేకపోతే ఇతగాడిని ఏదో ఒక బృందం తనలో కలిపేసుకొని “ఇదుగో ఇతగాడు మావాడు.. కవి.. కథకుడు” అంటూ ముద్రవేసి సమాజంలోకి వదులుతారు. కనుక అలాటి కథ లేదా కవిత వ్రాయటం చాలా సులువు.
కాదూ.. ‘కథ’ వ్రాస్తాను, ‘కవిత’ వ్రాస్తాను అంటే.. ఆ మాటకొస్తే సాహిత్యంలోని ఏ ప్రక్రియలోనైనా అడుగుపెట్టాలంటే దానికి తగిన శిక్షణ వుండాలి. తనకు ముందున్న సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వుండాలి. ఆ అధ్యయనం పునాది మీద తన స్వీయమైన కల్పన చేయగలగాలి. కవిత విషయమే తీసుకోండి.. ఇప్పటికీ మనం స్మరించుకొనే ఆధునిక వచన, గేయ కవులందరూ ఆ పునాది మీద నిలబడ్డవారే.
ఇక నా విషయానికి వస్తే.. నాకు రెండు ప్రక్రియలలో ఏదీ కష్టమనిపించలేదు ఎప్పుడూను. కథాప్రపంచంలో నేను చదివిన కథలూ, కావ్యప్రపంచంలో నేను అధ్యయనం చేసిన సంస్కృతాంధ్ర కావ్యాలు నా పునాది. వాటన్నిటినీ మించి మా మాష్టారు శ్రీ మల్లంపల్లి శరభయ్యగారు తమ శ్రీవేణుగోపాల శతకంలో వ్రాసిన ఒక పద్యం నా కథా – కవితా రచనలోని మూలసూత్రం. ఆ పద్యం ఇదీ..
“తలపుం జొంపము సందుసందుల బడిన్ దా నొక్క శబ్దంబు వె
న్నెలయై నీ కృప దోచినంతనె పురానిర్ణీత సందర్భమై
వలయం బేర్పడినట్టు లెన్నటిదియో పద్యంబె నా సంస్మృతిన్
జెలగం బోలును నీవె సంస్ఫురణవై శ్రీవేణుగోపాలకా!”
తలపుల గుబురులలో నుంచి ఏదో ఒక శబ్దం వెన్నెల కిరణంలా మనసులో మెదులుతుంది. అలా ఆ శబ్దం తోచగానే దాని చుట్టూ ఎప్పుడో నిర్ణయమైపోయిన ఒకానొక సందర్భం అల్లుకుపోయి పద్యవలయం పూర్తయి పోయి ఎప్పటదో పద్యం గుర్తుకు వచ్చినట్టు కాగితం మీదకి వచ్చేస్తుంది.. దానికి కారణం శ్రీవేణుగోపాలుని కృప అన్నారు మా మాష్టారు. ఆ కృప సంగతి ప్రక్కన పెడితే ఇదే నా పద్య లేదా ఇతర కవితా రచనలో కూడా వర్తిస్తుంది. అదే కథ విషయానికి వచ్చేసరికి ఎదురుపడిన సంఘటన లేదా జీవితంలో ఎదురైన ఒకానొక అనుభవం, చిరకాలంగా వేధిస్తున్న ఒక ఆలోచన ‘ట్రిగ్గర్’ అయినప్పుడే కథ వచ్చింది నాకు. అందుకే ఇటీవల వెలువరించిన ‘మెరీనా.. ఓ మెరీనా’ కథాసంపుటిలో చాలా కథలకు ‘కథ వెనుక కథ’ అంటూ నేపథ్యాన్ని కూడా వివరించాను. కనుక కవిత లేదా కథ రెండూ నాకు సులువే అయాయి.
ప్రశ్న 4: ఇది మీ తొలి కథాసంపుటి కదా?మీ తొలి కథ నుంచి తాజాకథ వరకూ` పాఠకులను చదివించేందుకు` మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్‌డేట్ అయ్యారు?
జవాబు: ఇది కొంత ఇబ్బందికరమైన ప్రశ్న నాకు. ఎందుకంటే తొలి కథ నుంచి తాజా కథ వరకూ పాఠకులను చదివించేందుకు అంటూ నన్ను నేను ఏమీ మార్చుకోలేదు. ఆంధ్రప్రభ వీక్లీలో వున్నప్పుడు వ్రాసిన కథలు ఆ పత్రిక పాఠకులకు బాగానే చేరాయి. తరువాత వ్రాసినవన్నీ.. ప్రవాహవాణిలో వ్రాసినది పత్రిక నింపటానికి తగినన్ని రచనలు రాక వ్రాసినది. ఆ తరువాతివి అముద్రితాలు కనుక ఇప్పుడు చూడాలి పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది!
మరొక విషయం ఏమిటంటే పాఠకులను చదివించేందుకు తనను తాను మార్చుకోవటం రచయిత వ్యక్తిత్వాన్ని మార్చుకోవటంగా భావిస్తాను నేను. కనుక నాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక విషయం మాత్రం నిజం.. ఒక రచయిత వ్రాసినది పాఠకులకు చేరాలి, వారు చదవాలి అన్నప్పుడు ఆ రచన పాఠకుల స్థాయిలో వుండాలి, వారికి అర్థం కావాలి అనే వాదం లేకపోలేదు. అది అవసరమే కూడాను. అందులో సందేహమున్నూ లేదు. ముఖ్యంగా రచనలో వినియోగించే భాష విషయంలో ఇప్పుడు ఈ మార్పు అవసరం అని అంగీకరిస్తున్నాను. గతంలో వున్న పాఠకులు కొంతలో కొంత అయినా భాషాపరిజ్ఞానం వున్నవారు. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల, మన బోధనా వ్యవస్థల నిర్లక్ష్యం వల్ల పాఠకులలో భాషాస్థాయి గతంలో వున్నట్టు లేదన్నది కూడా నిజం. ఈ సంపుటిలోని ముద్రితకథలు భాషను అర్థం చేసుకొనే పాఠకులకే చేరాయి కాబట్టి నన్ను నేను మార్చుకోవలసిన అవసరం రాలేదు.
అప్రస్తుతం అనిపించవచ్చు కానీ ఈ ప్రశ్న నాకు ఇద్దరి మాటలను గుర్తు చేసింది. ఒకరు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. వాకాటి పాండుంగరావుగారు ఆంధ్రప్రభ వీక్లీ సంపాదకత్వం వహిస్తున్న రోజులలో ఒకసారి వారిని రాజమహేంద్రవరంలో కలిసినప్పుడు ఆయన “ఈ మధ్య వీక్లీ బాగుంటోంది” అన్నారు. వెంటనే నేను “అయితే మా సర్క్యులేషన్ పడిపోతుంది” అన్నాను. “అదేమిటీ?” అన్నారాయన. “మీవంటి వారు బాగుందన్నారంటే సాధారణ వీక్లీ పాఠకుడి స్థాయిని దాటేసినట్లే. అందుకని..” అన్నాను. మార్పు అవసరం అన్న ‘తెలివిడి’ అప్పుడే నాకు వుంది. అలాగే ఆంధ్రప్రభ వీక్లీకి సంపాదకులుగా వచ్చిన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఒక మాట అన్నారు.. “పొత్తూరివారు వీక్లీని పట్టుచీర కట్టుకొని పేరంటానికి వెళ్లే ముత్తైదువలా తీర్చిదిదిద్దారు. వాకాటివారు వీక్లీని షిఫాన్ చీర కట్టుకొని ఆఫీస్‌కి వెళ్లే యువతిలా మార్చారు. ఇప్పుడు నేను వీక్లీని బికినీ వేసుకొని బీచ్‌లో తిరిగే యువతిలా తయారుచేస్తున్నాను. నా తరువాత వచ్చేవారు ఆ బికినీ కూడా వుంచరేమో?!” అన్నారు. ఇంద్రగంటి వారి మాట నిజమే అయింది కూడా! మార్పు అవసరం. నిజమే! ఇక మీద వ్రాసే వాటిలో ఖచ్చితంగా మార్చుకోవలసిన అవసరం వుందన్నది నిజం. ఎంతవరకూ అన్నదే నిర్ణయించుకోవలసి వుంది.
ఇక పాఠకుల పఠనాసక్తిలో ఏయే మార్పులు వచ్చాయంటే ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నది చదవటం పెరిగింది. అయితే తెలుగులో కాకుండా ఇంగ్లీషులో చదవడం పెరిగింది. పెద్దలు పిల్లల కోసం పుస్తకాలు కొనటం మనం పుస్తక ప్రదర్శనల్లో చూస్తున్నాం. అదీ పిల్లలకు అర్థమయే విధంగా ఇంగ్లీషులో వ్రాసిన మన ఇతిహాస – పౌరాణిక కథలను, మన దేశ చరిత్రను, మన వీరుల గాథలను ఎక్కువగా కొంటున్నారు. పిల్లల చేత చదివిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇంతవరకూ దాచిపెట్టిన మన దేశపు అసలైన చరిత్రను వివిధ మాధ్యమాలలో చదువుతున్నారు. ఈ ధోరణి యువతరంలో కనిపించటం శుభ పరిణామంగా భావిస్తున్నాను. అయితే ఇక్కడే తెలుగు రచయిత కొంత వెనుకబడినట్టు అనిపిస్తుంది. ఇది మొదటి నుంచీ వున్న వెనుకబాటుతనమే. మన రచనలేవీ ప్రధానంగా ఇంగ్లీషు, హిందీలలోకి, ఇతర భాషలలోకి తర్జుమా కాకపోవటం ఒక లోపం. కొందరి రచనలు ఇతర భాషలలోకి తర్జుమా అవుతున్నమాట నిజం. అలాగే ఇతర భాషా రచనలూ తెలుగులోకి స్తున్నాయి. కానీ ఆ రచనల ధోరణి, భావజాలం ఏమిటనేది ప్రశ్న. లభించేవి అవే కాబట్టి పాఠకులు వాటినే చదువుతారు. ఆ భావజాలానికి ప్రభావితులవుతారు. ఇక్కడే ‘మన’ రచయితలు ఒక ‘నెట్‌వర్క్’ రూపొందించుకోవాలి. ‘మన’ రచనలు ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీలలోకి పంపాలి. అప్పుడు నేటి తరం ఆ ఇంగ్లీషు అనువాదం ఆధారంగా చదివే వీలుంటుంది. పాఠకులలో మార్పు అని అడిగితే రచయతలలో రావలసిన మార్పు గురించి మాట్లాడానుకోకండి. మంచి రచనలు చదవటానికి పాఠకులు సిద్ధంగా వున్నారు. ‘దేశీయత’ను అక్కున చేర్చుకోవటానికీ సిద్ధంగా వున్నారు. ఒక రకంగా ఇది పునరుజ్జీవన కాలం. దీనిని వినియోగించుకొని చదవటానికి సిద్ధంగా వున్న ఈనాటి తరానికి అందించవలసిన బాధ్యత ఈనాటి ‘మన’ రచయితల మీద ఖచ్చితంగా వుంది!
ప్రశ్న 5: కథకి సంబంధించి వస్తువు, శిల్పం, శైలిలలో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ఎందువల్ల?
జవాబు: వస్తువు, శిల్పం, శైలి మూడూ సరైన పాళ్లలో కలిస్తేనే కథ అయినా, కవిత అయినా పాఠకుడికి చిరకాలం గుర్తుంటుందన్నది నిర్వివాదం. నా విషయానికి వస్తే నాకొక నిశ్చితమైన అభిప్రాయం వుంది. కధలో అయినా, కవితలో అయినా ఎంచుకొన్న వస్తువే దానికి అనురూపమైన శిల్పాన్ని, శైలిని కూడా ఎంచుకుంటుంది. నేను దానిని ‘ఫాలో’ అయిపోతానంతే! చాలామంది అంటూ వుంటారు.. ఈ మధ్య కూడా ఒకరిద్దరు అన్నారు.. “మీ కథలలో భాషస్థాయి కొంచెం ఎక్కువగా వుంది” అని. ‘మెరీనా’ కథలో భాషాశైలి వేరు, ‘వందే జగద్గురుమ’ లో వేరు, ‘నాకేమిటట!?’లో వేరు. వస్తువే భాషను, దాని శైలిని నిర్ణయిస్తుంది. అప్రస్తుతమైనా ఒక మాట చెబుతాను. ఒకసారి నేను ‘సతీ సావిత్రి’ అనే టెలిఫిల్మ్‌కి సంభాషణలు వ్రాశాను. రెండవ యూనిట్ దర్శకుడు, పౌరాణిక గాథలు చిత్రీకరించటంలో ‘గొప్ప’ పేరు ‘సంపాదించిన’వాడు.. “అబ్బే! ఇలా రాయకూడదండీ! మాయాబజార్ సినిమా చూశారు కదా? పౌరాణికాల భాష అలా వుండాలి” అన్నారు నాతో! పాత్రల స్థలకాలాలకు సంబంధించి భాషాశైలి మారుతుందన్న సాధారణ విషయం కూడా రచయితలలోనే లేకపోతే ఎలా? ఆ మనిషే బిల్వపత్రాలు అని వ్రాస్తే ఎండిపోయిన రావి ఆకులు పట్టుకొచ్చాడు! సాలగ్రామ శిల అంటే స్టూడియోలో ప్రక్కన పడి వున్న ఒక చిన్న రాయిని పట్టుకొచ్చాడు. ఆ మనిషే తానొక టెలిఫిల్మ్‌కి కథ, సంభాషణలు వ్రాస్తూ “లక్ష్మణుడు వాసుకి అవతారం” అని వ్రాశాడు. మీ ప్రశ్నకు అప్రస్తుతమైనా ఇది ఎందుకు చెప్పానంటే సామాజిక మాధ్యమాలలో పేరు పొందిన వారి పరిస్థితే ఇలా వుంటే ఇంక సాధారణ పాఠకుల సంగతి చెప్పేదేముంది? శాఖాచంక్రమణాన్ని వదలి మాట్లాడితే నాకు మూడు ముఖ్యమే. అయితే ఈ మూడిటిలో వస్తువు నా చేతిలో లేదు. దానిని నేను ఎంపిక చేసుకోను. నా జీవితంలో ఎదురైన అనుభవాలు లేదా సంఘటనలు ఏదో ఒకటి మనసుని అతలకుతలం చేస్తుంది. దానిని కాగితం మీద పెట్టే వరకూ నిద్ర పోనివ్వదు. అంటే వస్తువే నన్ను ఎంచుకుంటుంది! మిగిలిన శిల్పం, శైలి రెండూ దానిని అనుసరిస్తాయి. నేను కేవలం ఆ వస్తువు లోకంలోకి రావడానికి ఒక ‘మాధ్యమా’న్ని మాత్రమే. నేను వ్రాసిన దేనికీ నేను ‘కర్త’ను కాను. ఆ వస్తువే ‘కర్త, కర్మ,క్రియ’ అన్నీను.
ప్రశ్న 6: “వీటిని వ్రాసే నాటికి ఉన్న సామాజిక, సాహిత్య స్థితిగతులకు ఈ కథలు కొంచెం ఎడంగా ఉన్న మాట నిజం” అని వ్యాఖ్యానించారు మీ ముందు మాటలో దీని గురించి వివరిస్తారా?
జవాబు: నా మొదటి కథ వచ్చినది 90వ దశకంలో. అప్పటికే మనిషి చాలా ముక్కలైపోయి వున్నాడు లేదా మనిషిని ముక్కలు ముక్కలుగా చేసేశాయి సామాజిక, సాహిత్య సిద్ధాంతాలు, ధోరణులు. ‘సాహిత్యం’ అనే మాటకు ముందు కులం, ఉపకులం, మతం, స్త్రీ పురుష విభజన, సైద్ధాంతిక విశేషణాలు.. ఇలా రకరకాల వికారాలంకారాలు వచ్చి చేరాయి. నేను వ్రాసినవేవీ వీటిలో ఏ చట్రంలోనూ ఇమిడేవి కావు. కేవలం ‘మనిషి’, ఆ ‘మనిషి’లో వుండే నైసర్గికమైన ఆరాటపోరాటాలు మాత్రమే. వీటికి ఇందాక నేను చెప్పిన ఏ విశేషణాలూ లేవు. కనుకనే అలా అన్నాను. మీకు ఈ సంపుటిలోని కథలలో ఆ విషయం స్పష్టంగానే తెలుస్తుంది. అలాగే కొన్ని పౌరాణిక విషయాలను ‘మనిషి’ కోణంలో అన్వయించటానికి ప్రయత్నించాను. నా రచన ఏదైనా సరే ఏ తొడుగులూ, తోకలూ లేని ‘మనిషి’ గురించి మాత్రమే కనుక, ఇది ఆనాటి ధోరణులకు కట్టుబడి వుండేది కాదు కనుక ఆ మాట అన్నాను. అలాగే నేను ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఏ ‘గుంపు’లోని మనిషిని కాదు కనుక, నేను ఆలోచించే విధానంలో కేవలం ఈ జాతి మౌలిక భావనలు, మానవత మాత్రమే వున్నాయి, వుంటాయి కనుక ఆ మాట అన్నాను.
ప్రశ్న 7: కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత సన్నిహితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. (“హృదయగత కల్లోలాన్ని, విషాదాన్ని మాటల్లో పట్టుకునే ప్రయత్నంలో వచ్చిన వ్రాతలివి” అని అన్నారు.) ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా వుంటుంది?
జవాబు: “ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు”.. అంటే నేను ఇప్పటి వరకూ ఒక అంశాన్ని కథగా మలచాలి అని ప్రయత్నించలేదు. ఒక అంశం లేదా పరిస్థితి లేదా సంఘటన నా మనసుకి పట్టేది. విశ్వనాథ వారు “నీ దెస నిత్యచింత నా ఎముకలలో గూళ్లు పడెనే రమణీయ కళా తపస్వినీ!” అన్నట్టు అది వేధిస్తుంది, మనసులో మాగుతుంది, ఇందాకా మా మాష్టారి పద్యంలో చెప్పినట్టు చివరికి “పురానిర్ణీత సందర్భమై ఎన్నటిదియో” కథ గుర్తుకు వచ్చినట్టు కాగితం మీదకి వస్తుంది. నా కథ లేదా కవితలకు బాహిరాకరాలు ఏవీ అవసరం లేదు కాబట్టి ఒక ‘స్కీమ్’ అవసరం లేకపోయింది, ఒక ‘నిర్మాణ ప్రణాళిక’ అవసరమూ లేకపోయింది. ‘మెరీనా’ కథ వ్రాయటానికి నాకున్న ఆధారం ఆ కథలోని చివరి దృశ్యం.. ఆమెలోని నిరాశ, ఆమె మనసులో ఏర్పడిన నిస్పృహ. అవి చాలాకాలం మనసుని పీడించాయి. ఆమె హృదయగత కల్లోలాన్ని నేను అనుభవించాను. కారణం ఏమై వుంటుందని అతలకుతలమైపోయిన మనసు నుంచి ఆ కథ వచ్చింది. “వందే జగద్గురుమ” చూస్తే ఆమెది ఎంత విషాదం? తన భర్త చనిపోతే లోకం పండగ చేసుకోవటం చూస్తే ఏ భార్యకైనా ఎంత అవమానం? ఆ విషాదం ఆమెలో నుంచి తొలగిపోవాలి. అంతేకాదు నరకాసురుని సమర్థిస్తూ వాదించే వాళ్లకీ ఒక సమాధానం ఇవ్వాలి. అప్పటికే నేను చదివిన జిడ్డు కృష్ణమూర్తిలో సమాధానం దొరికి ఆ కథ బయటపడింది. చివరికి మీ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే నేను కథను వ్రాయటానికి ‘కథాసిద్ధాంతులు’ చెప్పే, నిర్వచించే ఏ పద్ధతినీ పాటించను. ‘సెట్ పాటర్న్స్ ఆఫ్ స్టోరీ కన్‌స్ట్రక్షన్’ అనేది నా దగ్గర లేదు. నాకు తెలియదు కూడా!
ప్రశ్న 8: అర్థ శతాబ్దికి పైగా దాంపత్య జీవితం గడిపిన వారి మధ్య వుండే అనుబంధం గురించి ‘స్నేహసారే స్థితమ్’ కథ గొప్పగా చెప్పింది. కథకి తగ్గ శీర్షికే అయినా, ఈ కాలపు వాళ్లకి కాస్త ప్రౌఢంగా ఉండే అవకాశం ఉంది కదా, ఏమంటారు? భవభూతి ఉత్తర రామచరితంలో రాసిన ఈ శ్లోకంలో కొన్ని వెర్షన్స్ లో ‘స్నేహ’ స్థానంలో ‘ప్రేమ’ అని వుంది. దీని గురించి మీ అభిప్రాయం?
జవాబు: ఆ కథ నా కళ్ల ఎదుట జరిగినది. ఆ కథలోని వారు నన్ను పెంచిన మా చిన్నతాత ఫణిహారం వేంకట వల్లభాచార్యులుగారు, చిన్న మామ్మ కనకవల్లి తాయారు గారు. ఆ ఇల్లు దాదాపుగా నేను పాతికేళ్లు పెరిగిన ఇల్లు. ఆ కథలో నేనూ ఒక పాత్రనే. నిజానికి అది కథ కాదు. వాస్తవ సంఘటన. అలా అని వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఆయన నాతో ఒక మాటన్నారు.. “మీ మామ్మ ఇలా అనుకుంటోంది. ఆ మాటను నేను ఒప్పుకోను. కానీ ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కాదనను” అని. ఇలా పరస్పర గౌరవం అనేదే వారి దాంపత్యానికి మూలసూత్రం. అది నాకు నా జీవితంలో దాంపత్యవిషయంలో ‘పితామహగీత!’ ఇక ఈ కథ శీర్షిక ఈనాటి వారికి ప్రౌఢంగా వుంటుందన్నది నిజం. ఏం చేస్తాం? దానికి అంతకన్నా మంచి శీర్షిక నాకు తోచలేదు మరి!
సరే.. ఇక ఆ శ్లోకం సంగతి.. ఆ శ్లోకం నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే అందరూ వివాహాహ్వాన పత్రికలలో “జానక్యాః కమలామలాంజలి పుటేయాః” అనే శ్లోకం వేసుకుంటారు. నేను దాని బదులు ఈ శ్లోకాన్ని వేసుకున్నాను. ఆ శ్లోకం “అద్వైతం..” అని మొదలు కావటం వల్ల మా శ్రీవైష్ణవ బంధువులు కొందరికి ఆగ్రహం రావడం వేరే విషయం!
ఆ శ్లోకంలో కొన్ని ప్రతులలో ‘ప్రేమ’ అని వుంది నిజమే. కానీ నాకు ‘స్నేహ’ అనే ప్రయోగమే ఇష్టం. వివాహ మంత్రాలలో వరుడు వధువును ‘సఖీ భవ’ అంటాడు, ‘సమ్రాజ్ఞీ భవ’ అంటాడు. ‘శుభికే శిర ఆరోహ’ అంటాడు, దానిలో ‘సఖీభవ’ స్నేహమే అని నేను భావిస్తాను. నా మాటకు ఒక ఆధారమూ లేకపోలేదు. మనకి పింగళి-కాటూరి కవులు వ్రాసిన ‘సౌందర నందం’ కావ్యం గురించి తెలుసు. దానిలో బుద్ధుడు నందునికి సన్యాస దీక్ష ఇచ్చాడు. అనంతర కాలంలో సుందరి కూడా సన్యాసిని అయింది. ఈ కావ్యాన్ని కొన్ని ఖండాలుగా విభజించిన పింగళి-కాటూరి ప్రతి ఖండానికీ ముందు దానికి ఉపోద్ఘాతప్రాయంగా ఒక పద్యాన్ని కూర్చారు. కానీ చివరి ఖండానికి వారు స్వీయపద్యాన్ని కూర్చకుండా ఈ భవభూతి శ్లోకాన్నే ఉపోద్ఘాతంగా పెట్టారు. ఎందుకు? అన్ని పద్యాలు వ్రాసినవారు మరొక్క పద్యం వ్రాయలేరా? ఆ ఖండంలో సుందరీ నందులు ఒకరికొకరు ఎదురుపడతారు. సన్యాస దీక్షకు ముందు వారిద్దరూ ప్రేమైకమూర్తులు. ఒకరికొకరు ప్రాణం. ఒకరినొకరు విడిచి వుండలేరు. ఇప్పుడు ఇద్దరూ సన్యాసులు. కానీ ఒకరికొకరు ఎదురుపడగానే ఒకరినొకరు “నా ప్రాణమా!” అని పలుకరించుకోబోయి “ప్రా మాత్ర పర్యవసన్నులైరి” అంటారు పింగళి` కాటూరి. “ప్రా” అని మాత్రమే పలికి ఆగిపోయారు. బుద్ధస్మరణ చేశారు. కానీ దీనజన సేవలో ఒకరికొకరు తోడుగ నిలిచి జీవనయాత్ర సాగించారు. ఇక్కడ వారిద్దరి మధ్యా మిగిలినది ‘భౌతికమైన ప్రేమ’ కాదు. ‘అనుగతం సర్వాస్వస్వస్థాసు’ అయిన ‘స్నేహ’మే! వారి అనుబంధం ‘స్నేహసారే స్థితమ్’ మాత్రమే! అందుకే నాకు ‘స్నేహసారే స్థితమ్’ అన్న పాఠమే ఇష్టం. ప్రేమ, స్నేహం రెండూ గొప్పవే. కానీ లౌకికంగా చూసినప్పుడు కాలం గడుస్తున్నకొద్దీ దాంపత్యం ‘స్నేహసారం’గా మిగలటంలో వున్న ఔన్నత్యాన్ని నేను సంభావిస్తాను. అది ఆ కథలోని నాయికానాయకులు మా చిన్నతాత, చిన్న మామ్మ వారి ఆచరణ ద్వారా పరోక్షంగా నాకు బోధించిన ‘పితామహ గీత!’
ప్రశ్న 9: జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు రేణుకాదేవి తల నరకటానికి సంబంధించి జనశ్రుతిలో వున్నవాటికీ, మీ ‘ఛిన్నమస్త’ కథకీ చాలా తేడా వుంది. ఈ కథ కల్పితమా లేక ఏదైనా ఆధారం వుందా? ఈ కథ నేపథ్యం వివరించండి.
జవాబు: అవును.. మీరన్నది నిజమే. జనశ్రుతిలో వున్న దానికీ ఈ కథకీ చాలా తేడా వుంది. జనశ్రుతిలో వున్నది పౌరాణిక గాథ. నేను వ్రాసినది తంత్రగ్రంథాలలో లభించే కథ. దశమహావిద్యలలో ఒకటైన ‘ఛిన్నమస్త’ ఆవిర్భావానికి సంబంధించిన తాంత్రికగాథ ఇది. మనకి సమీప భూతకాలంలో జీవించి, జీవితుడై వుండగానే కపాలభేదన సిద్ధి పొందినవాడూ, తిరువణ్నామలైలో వున్న బ్రహ్మచారికి ‘భగవాన్ రమణమహర్షి’ అని నామకరణం చేసినవాడూ నవద్వీప పండితసభలో ‘కావ్యకంఠ’ బిరుదాన్ని పొందినవాడు గణపతిముని. ఆయన కపాలభేదన సిద్ధి ఈ ఛిన్నమస్తా సాధన వల్లనే జరిగింది. ఆయన వ్రాసిన ‘రేణుకాగీతం’, ‘ప్రచండచండీ త్రిశతి’ స్తుతి కావ్యాలలో ఈ గాథను ప్రస్తావించారు. కనుక ఇది నా స్వకపోల కల్పితం కాదు. ఆధారం కావ్యకంఠ గణపతిముని రచనలు. స్త్రీని నిర్లక్ష్యం చేసినవాడికి, అవమానించిన వాడికి, హింసించిన వాడికీ దశ మహవిద్యలలో ఏ ఒక్కటీ సిద్ధించదని తంత్రశాస్త్రం చెబుతోంది.
ఇక ఈ కథ నేపథ్యం అంటారా.. అద్దంకిలో వుండే చెన్నూరు కృష్ణమూర్తిగారనే బాలామంత్ర సిద్ధుడు ఒకసారి ఆంధ్రప్రభ వీక్లీ ఆఫీసుకి వచ్చారు. ఆయనతో నాకు చిరకాలంగా పరిచయం వుంది. ఆయన నా మంత్రశాస్త్ర గురువులలో ఒకరు కూడా. హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఇంటి దగ్గరో, ఆఫీసులోనో నన్ను కలిసేవారు. అలా వచ్చిన ఆయనను వాకాటి వారికి పరిచయం చేశాను. అక్కడ వారి సంభాషణలో పరశురాముని ప్రసక్తి వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఆయన వాకాటి వారికి చెప్పారు. “మీకు ఈ కథ తెలుసా?” అని నన్ను అడిగారు వాకాటి వారు. “తెలుసు” అన్నాను. “రాయండి. వేద్దాం” అన్నారు. అదీ ఈ కథ నేపథ్యం.
ప్రశ్న 10: “రామో విగ్రహవాన్ ధర్మః ” అనే శ్లోకపాదానికి అక్షర రూపం ‘ధర్మమూర్తి’ కథ. ఈ కథని ఇలా వ్రాయాలన్న ఆలోచన ఎలా కలిగింది? ఈ కథాసృజన నేపథ్యం చెప్పండి.
జవాబు: నాకు పురాణాలు లేదా సమాజంలో వున్న భక్తుల కథల విషయంలో కొన్ని ఆలోచనలు వున్నాయి. నేను దేనినైనా ప్రశ్నించకుండా యధాతథంగా స్వీకరించను. దానికి తోడు కథ విషయంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు (ఆయనకు తండ్రిగారు హనుమచ్ఛాస్త్రిగారు పెట్టిన పేరు శ్రీకాంత శర్మ కాదు.. ‘శ్రీకంఠశర్మ’. ఇది ఆయనే నాకు చెప్పారు.) “మనకు తెలిసిన విషయాన్నే తిరగేసి చూస్తే కథ పుడుతుంది” అన్నదీ వుంది.
ఈ కథ వ్రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న మహా భక్తుడనటంలో సందేహం లేదు. ఆ భక్తిగానం చేస్తున్న ఆయన ‘భక్తులు’ శ్రీరామచంద్ర మహాప్రభువు ధర్మశీలాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. రామదాసు చరిత్రలో ఆయన భక్తి ఎంత ముఖ్యమో శ్రీరామచంద్ర మహాప్రభువు ధర్మపాలనం అంతకన్నా ముఖ్యం! ఎంతటి భక్తుడైనా తన వ్యక్తిగత భక్తి ప్రకటనలో తన బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు మన్నించడు అని చెప్పటానికే ఈ కథను వ్రాశాను. రామదాసు కథ మనలో ఎంతటి భక్తి భావాన్ని ప్రేరేపిస్తుందో అంతకన్నా ఎక్కువగా భక్తికి, బాధ్యతకూ మధ్య వున్న అంతరాన్ని కూడా బోధిస్తుంది. ఆ అంతరాన్ని విస్మరిస్తున్నామనే ఆలోచనతోనే ఈ కథ అలా వ్రాశాను. భక్తిలో మునిగిపోయి సమాజం నిర్దేశించిన బాధ్యతను పట్టించుకోకుండా ‘భక్తుల’మని చెప్పుకొనే వారందరికీ రామదాసు జీవితం ఒక గుణపాఠం అని నేను భావిస్తాను.
ప్రశ్న 11: ఉద్యోగధర్మంగా పత్రికలోని శీర్షికలకు బ్రేక్ రాకుండా చూసేందుకు ఈ సంపుటిలోని రెండు కథలను ఆంగ్ల రచయితల కథల ఆధారంగా అల్లారు. జేమ్స్ థర్బర్, సి.ఎం.క్లాన్‌బత్‌లు రాసిన ఆ కథలనే ఎంచుకోవటావటానికి ఏదైనా ప్రత్యేక కారణం వుందా? వివరించండి.
జవాబు: మీరు చెప్పిన రెండు కథలలో క్లాన్‌బత్ కథ శీర్షికలకు బ్రేక్ రాకుండా వ్రాసినది కాదు. అది అప్పటి ఆంధ్రప్రభ వీక్లీ సంపాదకులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు వ్రాయమంటే వ్రాసినది. రెండవది జేమ్స్ థర్బర్ కథ మీరన్నట్టు శీర్షికకు బ్రేక్ రాకుండా వుండటానికి వ్రాసినదే. జేమ్స్ థర్బర్ కథ విషయానికి వస్తే ఆయన రచనలను నాచేత వాకాటి పాండురంగరావు గారు చదివించారు. వాటిలో ఈ కథ నాకు బాగా నచ్చింది. ఒకరకంగా ఇది ‘మెరీనా’ కథకు రెండవ వైపు. ఈ రెండు కథలూ బొమ్మా బొరుసు అన్నమాట. దాంపత్య జీవితంలో లేదా స్త్రీపురుష సంబంధాలలో నిశ్శబ్దంగా పరుచుకునే ‘ఏకాంత బీభత్సా’న్ని ఈ రెండు కథలూ పట్టిస్తాయి. మెరీనాలో పురుషుని నిర్లిప్తత ఆమెలో కలిగించిన ఏకాంత బీభత్సం వుంటే ఇందులో స్త్రీపరమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. అయితే నేను ఈ కథ చిరలో చెప్పినట్టు ఇది జేమ్స్ థర్బర్ కథకు అనువాదం కాదు. ఆ కథలోని ఏకాంత బీభత్సాన్ని పట్టుకొని దాని ఆధారంగా అల్లుకున్నది. నేను ఏ కథనీ ఇప్పటి వరకూ అనువదించలేదు. అనుసరించాను లేదా దానిలోని ఏదో ఒక అంశం నా మనసుని పట్టి పీడిస్తే దానిని నా అనుభూతిగా చేసికొని తెలుగులోకి తెచ్చాను. ఈ కథ విషయంలో ‘ధ్వని’ ప్రధానం. మనసు పొరల్లో ఎక్కడో సమాధి అయిపోయిన తొలినాటి వలపు తనకు తెలియకుండానే సెల వేసిన ఒక మనిషి అప్రయత్నంగా తన తొలినాటి ‘ఆశ’ను కలిస్తే.. ఆమె జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని చూస్తే.. అదే శూన్యాన్ని తన మనస నిండా నింపుకొంటే.. ఆ శూన్యాన్ని నింపే అవకాశమే లేకపోతే.. ఆ అవకాశం లేకపోయినా తన బ్రతుకులోని ఏకాంత బీభత్సానికి విడుదలగా భావిస్తే.. అదీ ఈ కథ. జేమ్స్ థర్బర్ స్త్రీపురుష సంబంధాల్లోని ఈ ఏకాంత బీభత్సాన్ని బహుసమర్థంగా చిత్రిస్తాడు. కానీ అతని కథలో నా కథలోని భార్య లేదు. ఒప్పుకోము కానీ మనలో ప్రతి మనిషికీ ‘తొలి మనసు’ అనేది ఒకటి ఉండకపోదు. అది సఫలం కావచ్చు, విఫలమూ కావచ్చు. సఫలమైనా ‘మెరీనా’ వంటి పరిస్థితీ రావచ్చు. విఫలమైనా దాని స్మృతి జీవితంలో ఏర్పడిన శూన్యం నుంచి విడుదల కలిగించవచ్చు. అది ఈ ‘వాన – లో – వాన’.
ప్రశ్న 12: మీ రచనలు చదువుతుంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావం ఉన్నట్టు అనిపిస్తుంది. మీపై విశ్వనాథ ప్రభావం గురించి వివరించండి.
జవాబు: నా మీద విశ్వనాథ వారి ప్రభావం ఉన్నట్టు అనిపించటం కాదు.. ఉంది. అదీ చాలా విచిత్రంగా పడింది. నేను 1974 ప్రాంతంలో హైదరాబాదుకి ఒక ఉద్యోగశిక్షణ నిమిత్తం వచ్చాను. అప్పుడు మా మేనమామ (అనంతరకాలంలో బావగారు) విజయకుమార్ గదిలో వున్నాను. ఆయన యువభారతిలో క్రియాశీల కార్యకర్త. ఆయన దగ్గర యువభాతి వారు ప్రచురించిన ‘విశ్వనాథ కవితా వైభవం’ అనే పుస్తకం శ్రీ జువ్వాడి గౌతమరావుగారు వ్రాసినది చదివాను. దానిలో “నిష్ఠావర్షదమోఘ..” వంటి పద్యాలు చూసి.. ఈ మనిషి మన రకం కాదు.. అని విశ్వనాథ వారిని పక్కన పెట్టేశాను. ఆనాటి యువతరంలాగే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ప్రభావంలో పడిపోయాను. అనంతరకాలంలో మా మాష్టారు శరభయ్యగారి ఇంటిలో ఒక సందర్భంలో అదే గౌతమరావు గారు కల్పవృక్ష పఠనం చేస్తున్నారు రమ్మని మా లెక్చరర్లు అంటే వారి మాట కాదనలేక వెళ్లాను. ఆ రోజు గౌతమరావుగారు కల్పవృక్షంలోని అహల్యాఖండం చదివారు. సాయంత్రం నాలుగైదు గంటల వరకూ సాగిందది. ఆ పఠనం పూర్తి కాగానే మా ఊరు రాజమహేంద్రవరం వీధుల్లో పడ్డాను కల్పవృక్ష కావ్యం కొనేసుకొని చదివేద్దామని! ఎక్కడా దొరకలేదు. అప్పుడు మా నాన్న ప్రక్కనే ఉన్న కొవ్వూరులో మేజిస్ట్రేట్‌గా వున్నారు. ఆయనకు అక్కడి ప్రాచ్యకళాశాలలో పని చేస్తున్న శ్రీమాన్ సముద్రాల రంగరామానుజాచార్యులు గారితో స్నేహం వుంది. తద్వారా వారు నాకూ పరిచితులయ్యారు. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆయన ఇంటి తలుపు తట్టి “కల్పవృక్షం కావాలి” అన్నాను. ఆయన బాలకాండ ఇచ్చారు. ఆ రాత్రి అంతా నిద్ర లేదు.. మరునాడూ లేదు.. ఈ మరునాడూ లేదు.. మూడురోజులలో బాలకాండ పూర్తి చేసి తిరిగి ఇవ్వడానికి వెళ్లాను. అయోధ్యకాండ ఇవ్వబోయారు. “వద్దు” అని తిరిగి వచ్చేసి ఆ మరునాడు విజయవాడ వెళ్లిపోయి పావనిశాస్త్రిని కలిసి శ్రీమద్రామాయ కల్పవృక్షం మెత్తం కొనుక్కొని తెచ్చేసుకొన్నాను. ఆ తరువాత అప్పటికి అందుబాటులో వున్న వారి రచనలన్నీ చదివాను.
శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో అరణ్యకాండ పూర్తి చేసే సరికి అప్పటి వరకూ నా మనసుని ఆక్రమించుకొని కూర్చున్న శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, వగైరాలందరూ “ఇల్లు ఖాళీ చేసి” వెళ్లిపోయారు. దానికి తోడు మా మాష్టారు శ్రీమల్లంపల్లి శరభయ్యగారి కావ్యజ్ఞశిక్ష, దానిలో భాగంగా వారు విశ్వనాథ వారి రచనలపై చేసిన వ్యాఖ్యానం, బోధ కలగలిసి విశ్వనాథ వారు ఇటీవల ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారన్నట్టు “పూనకం దేవత”లా నన్ను పట్టుకున్నారు. పద్యరచనలో, వచన రచనలో వారి విన్యాసాలు నాకు చాలా ఇష్టం. “దేశం పట్టనంత కవి” నన్ను పట్టుకున్నారు. నాపై ఆయన ప్రభావంలో ప్రధానమైనవి జాతీయత, ఈ జాతి సంస్కార వైభవం, ఈ జాతి శాస్త్ర వైదుష్యం, ఈ జాతి నైతికత, ఈ జాతి ధర్మం! నేను ఏమి వ్రాసినా నాకు తెలియకుండానే అంతర్లీనంగా ఈ భావనా ప్రవాహ ప్రభావం ఉంటుంది, ఉంది. అందువల్ల నన్ను కొందరు ‘సనాతనుడు’ అన్నా అది నాకు గర్వకారణమే కానీ, నొచ్చుకొనే విషయం కాదు.
ప్రశ్న 13: ‘సాక్షాత్కారం’, ‘ఛిన్నమస్త’ వంటి కథల్లోనూ, మీ ఇతర రచనలలోనూ మీలోని సాధకుడు కనబడతాడు. ఆధ్యాత్మిక సాధనా పథంలో మీ ప్రయాణం గురించి వివరిస్తారా?
జవాబు: ఒక వ్యక్తి సాధనరంగంలో ప్రవేశించటానికి రెండు రకాల భూమికలుంటాయని నేను భావిస్తాను. జగద్గురువైన శ్రీకృష్ణుడు గీతలో ఒక మాట అన్నారు.. యోగభ్రష్టుడైనవాడు తిరిగి ఆ సాధనను కొనసాగించటానికి అనువైన కుటుంబంలో జన్మిస్తాడు.. అని. ఇది ఒక భూమిక. కాగా రెండవది అటువంటి కుటుంబంలో జన్మించక పోయినా కవికులగురువు చెప్పినట్టు “ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా” అన్నట్టు అయినా ఈ రంగంలోకి వచ్చే అవకాశం వుంది. మనకి సాధనాశాస్త్రం ఏమి చెబుతుందంటే ఈ లోకంలోకి వచ్చిన మనుష్యులందరికీ ఒక గురువు వుంటాడు. ఆ మనిషి ప్రవర్తన, ధర్మాచరణ సరిగా ఉంటే ఆ గురువు సాక్షాత్కరించి, సాధనలోకి ప్రవేశపెడతాడు. లేదా మనిషిలో సాధన పట్ల అత్యంత తీవ్రమైన ‘జీవుని వేదన’ ఉంటే, గురువు కోసం అన్వేషణ సాగిస్తే అప్పుడైనా గురువు లభిస్తాడు. కొందరిని గురువు తన దగ్గరకు రప్పించుకోవటానికి ఆ మనిషికి ఏదో ఒక ప్రాణాంతకమైన కష్టాన్ని కలిగిస్తాడు. అలా ఆ మనిషి ఆ గురువు దగ్గరకు వెళ్లి ఆ కష్టం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. గురుకృపతో బయటపడతాడు కూడా. దానితో సాధన మీద గురి కుదిరి ఆ రంగంలో క్రమంగా ముందుకు సాగుతాడు. ఇది పీఠిక.
నా విషయానికి వస్తే సాధనరంగంలో పరమసిద్ధిని సాధించిన వారి కుటుంబంలో పుట్టుక. మా ముత్తాత ఫణిహారం వేంకటాచార్యులు గారు కృష్ణమంత్రోపాసకుడు. అంత్యదశలో ఆ స్వామి సాక్షాత్కారం పొందినవాడు. ఆయన నలుగురి కుమారులలో పెద్దవాడు ఫణిహారం వేంకట రంగాచార్యులుగారు మా తాత.. మహామృత్యుంజయ మంత్రోపాసకుడు.. దివ్యదృష్టిని సాధించినవాడు. చిన్నతాతలలో ఒకరు ఫణిహారం వేంకట భాష్యకారాచార్యులు గారు శ్రీసుదర్శన నారసింహ మంత్రోపాసకుడు.. మృత్యువును మనిషి నుంచి పశువుకు బదిలీ చేసిన సిద్ధుడు. మరొకరు నన్ను పెంచి పెద్ద చేసిన ఫణిహారం వేంకట వల్లభాచార్యులుగారు వేదాంతి, భక్తుడు. ఆ తరువాతి తరంలోని వారు ఉద్యోగాలలో పడిపోవటం వల్ల ఈ సాధన కనుమరుగైంది. మళ్లీ ఇప్పుడు నాకు అది లభించింది. నా సాధన రంగప్రవేశానికి భూమిక నా పూర్వీకుల సంకల్పం కావచ్చు.
అయితే నేనూ అందరిలాగే ఒకానొక ప్రాణాంతకమైన క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటానికి గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీని ఆశ్రయించాను. ఆయనతో పరిచయం కూడా విచిత్రంగా జరిగింది. నా స్నేహితుడు వివేకానందం ఒకసారి నాకు డాక్టర్ నారాయణ్‌దత్ శ్రీమాలీజీ దగ్గర ఉపదేశం పొంది సాధన చేసి వారి అనుభవాలతో వున్న ‘ది పవర్ ఆఫ్ తంత్ర’ అనే పుస్తకం తెచ్చి ఇచ్చాడు. అది చదివి ఆశ్చర్యపోయాను. వాకాటి వారికి ఇస్తే ఆయనా చదివి శ్రీమాలీజితో ఇంటర్వ్యూకి వివేకానందంను పంపి, ఆ ఇంటర్వ్యూ వీక్లీలో ప్రచురించారు. తరువాత కొన్నాళ్లకి శ్రీమాలీజీ హైదరాబాద్ వచ్చారు. వారిని కలవడం కోసం ఇచ్చిన ఫోన్ నంబర్లలో ఒకటి శ్రీఅనిల్ కుమార్ జోషీజీది. అలా అయనతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఆయనను కలిసేవాళ్లం. శాస్త్ర విషయాలలో కుతూహలంతో వారితో మాట్లాడటమే కానీ సాధనలోకి ప్రవేశించాలనే ఆలోచన లేదు. కానీ అంతకు ముందే గుంటూరు హిందూకాలేజ్ లెక్చరర్ డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారి దగ్గర, ఇంతకు ముందు చెప్పిన అద్దంకి నివాసి శ్రీచెన్నూరు కృష్ణమూర్తిగారి దగ్గర ఉపదేశాలు పొందివున్నాను. అవి కేవలం తాత్కాలిక ప్రయోజన పర్యవసన్నాలే. నేనూ ఉద్యోగపు గోలలో పడిపోయిన వాడినే. కానీ ఎప్పుడైతే గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీని ఆశ్రయించి ఆ ప్రాణాంతకమైన కష్టం నుంచి బయట పడ్డానో.. అప్పుడు నా మనసులో మెదిలిన భావన ఒకటే.. “ఆ కష్టంలో నా చదువు కానీ, నా ఉద్యోగం కానీ, స్నేహితులు కాని ఆ కష్టం నుంచి నన్ను తప్పించలేదు. కేవలం ఒక మనిషి సాధన నన్ను బయట పడేసింది. కనుక ఈ చదువు, ఉద్యోగం, స్నేహితులు కాదు.. సాధన కావాలి”. అలా ఈ రంగంలోకి వచ్చాను. అప్పటి నుంచీ అదే మార్గంలో సాగుతున్నాను. మధ్య మధ్యలో బ్రతుకు పోరాటం ఒకటి వుంటుంది కదా? సాధనలో ‘చ్యుతి’ కూడా వుంటుంది. మళ్లీ కాలూచేతులూ కూడదీసుకొని గోదాలోకి దిగటమే. ఈ ‘చ్యుతి’ అనేదీ గురుదేవులు నిర్దేశించే ఒక పరీక్షగానే భావిస్తాను నేను!
ప్రశ్న 14: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువల్ల?
జవాబు: ఈ సంపుటిలో నా మనసుకు బాగా దగ్గరయిన కథ ‘స్నేహసారే స్థితమ్’. అది నా కథ. నా జీవితానికి ఒక మార్గదర్శనం చేసిన దంపతుల కథ. లౌకిక జీవితంలోఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నా కుటుంబం తట్టుకొని నిలబడి, ప్రశాతంగా వుందంటే ఆ దివ్యదంపతుల జీవన గమనం నుంచి నేర్చుకొన్న పాఠమే కారణం. కనుక అదే నాకు ఇష్టమైన నా కథ!
ప్రశ్న 15: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి వుండవచ్చు అని అనిపించిందా?
జవాబు: ఏదీ కష్టమనిపించలేదు. అయితే మీ ప్రశ్నలోని రెండవభాగం మాత్రం నిజం. ఈ సంపుటిలోని ‘అంతరంగం’ కథని ఇంకా బాగా రాయవచ్చునని అనిపించింది. కారణం ఆ ప్రక్రియలో నేను చేసిన మొదటి ప్రయత్నం అది. రెండవ కారణం ఆ వస్తువు నన్ను ఎంచుకోవటం కాక ఆ వస్తువును నేను ఎంచుకోవటం! ఖచ్చితంగా ఆ కథలో ఇంకా ‘వేగం’ ఉండే అవకాశం ఉంది.
ప్రశ్న 16: ‘మెరీనా! ఓ మెరీనా!’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా వుంది?
జవాబు: ఈ సంపుటి ప్రచురణలో నాకు ప్రత్యేకమైన అనుభవాలు ఏవీ ఎదురు కాలేదు. ఇక పాఠకుల ఆదరణ అంటారా? నెమ్మది నెమ్మదిగా వస్తోంది. ఇవాళ ఒక పుస్తకం పాఠకులకు చేరాలంటే ప్రధాన మార్గం పత్రికలలో సమీక్షలు. అవి చాలా ఆలస్యమవుతాయి. రెండవది సామాజిక మాధ్యమాలలో ప్రచారం. దీనిలో నేను చాలా ‘వీక్’. ఈ సంపుటి ఆవిష్కరణ ఫిబ్రవరి ఒకటిన జరిగింది. ఈ రెండు నెలల్లో పెద్దగా ‘మార్కెటింగ్ ప్రచారం’ లేకుండానే నూటయాభై పుస్తకాలు పాఠకులు కొనుగోలు చేశారు. కనుక ఆ లెక్కన పాఠకుల ఆదరణ బాగుందనే చెప్పాలి మరి!
ప్రశ్న 17: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?
జవాబు: ఒకప్పుడు నేను ‘మధుకశ’ అనే సాహిత్య వ్యాసాల సంకలనం ప్రచురించాను. ఆ తరవాత నేను వ్రాసిన సాహిత్య వ్యాసాలలో నాకు అందుబాటులో వున్న వాటిని కలిపి ఒక పరివర్ధిత ముద్రణగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి రెండు నెలల్లో ఆ పుస్తకం సిద్ధమవుతుంది. అలాగే ‘ప్రవాహవాణి’ సాహిత్య మాసపత్రికలో నేను వ్రాసిన వ్యాసాలలో నాకు అందుబాటులో ఉన్నవన్నీ కలిపి మరొక పుస్తకం తీసుకురావాలని కూడా వుంది. ఇవి కాక సాధనరంగానికి సంబంధించిన మరొక నాలుగు పుస్తకాలు ఈ ఏడాది చివరికి సిద్ధమవుతాయి. మరొక బృహత్తర ప్రయత్నం కవికుల గురువు కాళిదాసు ‘రఘువంశ’ మహాకావ్యం ఒక ధార్మిక వ్యాఖ్యానం అనే ఆలోచనతో మరొక పుస్తకాన్ని ప్రచురించాలనే సంకల్పం వుంది. ప్రస్తుతం ఆ దృష్టితో ఆ కావ్యాన్ని అధ్యయనం చేస్తున్నాను. ఆపైన శ్రీగురుకృప!
~
సంచిక టీమ్: విలువైన మీ సమయాన్ని వెచ్చించి మా ఈ ఇంటర్య్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు ఫణిహారం వల్లభాచార్యగారూ!
ఫణిహారం వల్లభాచార్య: సంచిక టీమ్ అందరికీ నా ధన్యవాదాలండీ!
***
రచన: ఫణిహారం వల్లభాచార్య
పేజీలు: 176
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
ఫణిహారం వల్లభాచార్య,
ప్లాట్ నెంబర్ 32, ఫ్లాట్ 112,
విక్టోరియా మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్ ఎదురుగా,
కొత్తపేట, సరూర్‍నగర్,
హైదరాబాద్ – 500035.
ఫోన్: 9000221269
~
ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/Mareena-Vallabhacharya-Phaniharam/dp/9356355290
~
‘మెరీనా.. ఓ మెరీనా’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/mareena-mareena-book-review-kss/

