[‘ఊళ్లు. నీళ్లు.. కన్నీళ్లు…’ అనే వ్యాస సంపుటి వెలువరించిన శ్రీ రేమిల్ల అవధాని గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం రేమిల్ల అవధాని గారూ.
రేమిల్ల అవధాని: నమస్కారం.
~
ప్రశ్న 1. మీరు జర్నలిస్టు. వృత్తిపరంగా పలు అంశాలపై వ్యాసాలు రాస్తారు. కానీ, ఈ మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆధారంగా వ్రాసిన వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించవచ్చన్న ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఆచరణలో పెట్టటంలో ఎదుర్కున్న సాధక బాధకాలేమిటి?
అందుకని వారి బాధలను ఒక పుస్తక రూపంగా తీసుకొస్తే భవిష్యత్తులో పాలకులకు గానీ, ఇటువంటి ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్లకు కానీ, వారికి పరిహారం ఇవ్వవలసిన అధికారులకు కానీ ఇది ఒక రిఫరెన్స్‌గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకొచ్చాను.
ఇందుకు నాకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు ది హిందూ పత్రికలో సీనియర్ ఇంటర్ గా పనిచేస్తున్న శిరీష్ నేనిశెట్టి. మరొకరు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు. పుస్తకం ప్రచురించడం చాలా ఖరీదైన అంశము అన్న భావనతో నేను పుస్తకం రాయడానికి సంశయిస్తున్నప్పుడు ‘పుస్తకం రాయడానికి ఖర్చు ఏమిటి’ అన్ని నన్ను నిలదీసి ఆ వైపు ప్రోత్సహించిన వ్యక్తి శిరీష్. ఎలాగైనా సరే మల్లన్న సాగర్ వ్యథలు పుస్తక రూపంలో రావాలని నాకు అండదండలు అందించి, పుస్తకం ఎలా ఉండాలో చెప్పి ప్రోత్సహించిన వ్యక్తి తిరుమల రావు గారు. అందుకని వీరిద్దరి కారణంగానే ఈ పుస్తకం వచ్చిందని చెప్తా.
ప్రశ్న 2: ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన అంశం. వ్యాసాలు రాస్తున్నప్పుడు కానీ, తరువాత పుస్తకంగా ప్రచురిస్తున్నప్పుడు కానీ, మీరు ఏ రకమైన వ్యతిరేకతనయినా ఎదుర్కున్నారా? ఎలా తట్టుకుని నిలబడ్డారు?
జ: ది హిందు పత్రికలో సంగారెడ్డి రిపోర్టర్‌గా మల్లన్న సాగర్‌పై అనేక దృక్కోణాలలో వ్యాసాలు రాసినప్పుడు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకత్వం నుంచి, కొందరు అధికారుల నుంచి కొంత ఒత్తిడి వచ్చిన మాట వాస్తవమే. అయితే ఒక ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వం చెప్పిన పని చేసినప్పుడు, దానిని ఎవరైనా విలేఖరులు విమర్శించినప్పుడు సహజంగానే అధికారులు కొంత ప్రతికూలంగా స్పందిస్తారు. దానిని వారి ఉద్యోగ బాధ్యతలో భాగంగానే చూడాలి కానీ వేరే రకంగా అర్థం చేసుకోనవసరం లేదు.
అలాగే భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఒక ప్రాజెక్టు మీద పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చినప్పుడు వాటిని ఆపడానికి వారు సహజంగానే ప్రయత్నిస్తారు, దానిని అలాగే చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వానికి మచ్చ వస్తే వారికి కూడా ఇబ్బంది. ‘మీరు మాత్రమే మల్లన్న సాగర్ వ్యతిరేకంగా ఎందుకు వార్తలు రాస్తున్నారు’ అని ఒక నాయకుడు నన్ను అడిగారు. నేను చెప్పింది ఏమిటంటే ‘అక్కడ జరగని అంశం నేను ఒక్కటి రాసినా మీరు మా కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. వారు 24 గంటల్లో మా మీద తప్పు ఉంటే చర్య తీసుకుంటారు,’ అని చాలా స్పష్టంగా చెప్పగలిగాను. అలాగే ఒక రిపోర్టర్ ఇదే విషయం అడిగినప్పుడు ‘ఎక్కడో 500 కిలోమీటర్ల నుండి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన నేను స్థానికుల సమస్యల మీద రాస్తుంటే నన్ను అడుగుతున్నారు కదా! ఇవి మీరే రాస్తే, రాయగలిగితే ‘ది హిందు’ లాంటి పత్రికకు ఇంతగా రాసే అవకాశం ఉండదు కదా’ అని బదులిచ్చాను.
ప్రశ్న 3: మీరు ఒక జాతీయ స్థాయి దినపత్రికలో పనిచేస్తున్నారు. కానీ, మీరు రాస్తున్న అంశం స్థానికం. హిందూ లాంటి పత్రికలో ఈ వ్యాసాల ప్రచురణ ఎలా సాధ్యమయింది?
జ: ది హిందు పత్రికలో నేను సంగారెడ్డిలో పనిచేసిన కాలంలో ఉన్న సీనియర్ సంపాదకులు ఎవరూ నేను రాసిన రిపోర్ట్‌లపై ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ప్రజల ఆందోళనలకు సంబంధించి ఎటువంటి రిపోర్టు పంపినా యథావిధిగా ప్రచురితమయ్యేది. ఒక స్థానిక అంశానికి వారు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే నేను మొదటి నుంచి ఇచ్చిన రిపోర్ట్‌లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పాను కానీ ‘ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతోంది, ప్రభుత్వం కారణంగా వాళ్ళు నష్టపోతున్నారు’ అనే మాట చెప్పలేదు. విధానపరంగా జరుగుతున్న నష్టంతో ఎన్ని వేల మంది ఎంత కష్టపడుతున్నారో, వారి భవిష్యత్తు ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో రాయగలిగాను గనుక ‘ది హిందు’ పత్రికలో నా వ్యాసాలకు అటువంటి ప్రాధాన్యం వచ్చింది అని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 4: మీరు రాసిన వ్యాసాలవల్ల నిర్వాసితులకు లాభం కలిగిందా? ప్రభుత్వ వ్యవహారంలో ఏమైనా మార్పు వచ్చిందా?
జ: ది హిందు పత్రికలో నేను రాసిన వ్యాసాల వల్ల నిర్వాసితులకు జరిగిన లాభం ఏమిటంటే వారు నేను రాసిన రిపోర్ట్ లను యథావిధిగా తాము కోర్టులో వేసిన కేసు పత్రాలతో అనుసంధించేవారు. అందువల్ల న్యాయమూర్తులకు వారి బాధలను ప్రత్యేకంగా చెప్పనవసరం లేకుండా పత్రికలో ప్రచురితమైన రిపోర్టులో ఏముందో వివరించడానికి వీలయ్యేది. ఒకరకంగా ‘ది హిందు’ పత్రిక వ్యాసాలు నిర్వాసితులకు న్యాయమూర్తులకు మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేయగలిగాయి. వారి బాధలను భాషా పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయమూర్తులు అర్థం చేసుకోగలిగారు. అయితే ప్రభుత్వ వ్యవహార శైలిలో మాత్రం పెద్దగా మార్పు వచ్చిన భావన నాకు కలగలేదు.
ప్రశ్న 5: పుస్తక రూపంలోకి తెస్తున్నప్పుడు ప్రచురితమైన వ్యాసాలలో ఏవైనా మార్పులు చేశారా? ఎలాంటి మార్పులు చేశారు?
జ: పత్రికలో ప్రచురితమైన వ్యాసాలకు పుస్తక రూపంలో వచ్చిన కథనాలకు తేడా ఏమిటంటే పత్రికలో వచ్చిన వ్యాసాలు అప్పటికప్పుడు ఏం జరిగిందో చెప్పడం మీదే ఉంటుంది. పుస్తక రూపంలో వచ్చిన వ్యాసాలు ఆ మొత్తాన్ని సమగ్రంగా జరిగిన సంఘటనగా, చరిత్రలో భాగంగా నమోదు చేశాను. పాఠకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదవడానికి వీలుగా స్వల్ప మార్పులు చేశాను తప్పిస్తే, అంశంలో ఎటువంటి మార్పు లేదు. యథాతథంగా అక్కడ ఏం జరిగిందో అది కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాను.
ప్రశ్న 6: ఆంగ్ల పుస్తకం ‘Reservoirs of Silence’ కి స్పందన ఎలా వుంది?
జ: ఆంగ్ల పుస్తకానికి మంచి స్పందన వచ్చింది కానీ దానిని తీసుకెళ్లవలసిన అంత గొప్పగా ప్రజాబాహుళ్యం లోకి తీసుకెళ్ల లేకపోయాను.
ప్రశ్న 7: ఈ పుస్తకాన్ని తెలుగులో రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆచరణలోకి తెచ్చిన ప్రక్రియ గురించి చెప్పండి?
జ: ఆంగ్ల పుస్తకం విడుదల సమయంలో కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఈ పుస్తకాన్ని తెలుగులో తెస్తే మరింత ఎక్కువమంది చదవగలుగుతారని, దానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అందుకని తెలుగులో కూడా పుస్తకాన్ని తీసుకువచ్చాను.
ప్రశ్న 8: ఆంగ్ల పుస్తకానికీ తెలుగు అనువాదానికీ ఏవైనా తేడాలున్నాయా? తేడాలుంటే, తెలుగు పాథకులకు తగ్గట్టుగా ఎలాంటి మార్పులు చేశారు?
జ: ఆంగ్ల పుస్తకం కన్నా తెలుగు పుస్తకానికి ఎక్కువ ఆదరణ లభించింది. చాలామంది ఈ పుస్తకాన్ని పోస్టులో తెప్పించుకున్నారు. అయితే రెండు పుస్తకాలు మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. తెలుగు పుస్తకంలో అదనంగా మాజీ చీఫ్ ఇంజనీర్, మైనర్ ఇరిగేషన్, స్వర్గీయ హనుమంతరావు గారు చెప్పిన కొన్ని అంశాలను విపులంగా అందించగలిగాను.
ప్రశ్న9: అభివృద్ధి పథకం అమలులో కొందరికి నష్టం కలిగినా సమాజానికి లాభం కలుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే, మల్లన్న సాగర్ నిర్మాణం సమంజసమేనా? ప్రజలు కష్టాలపాలయినా సమాజానికి లాభం కలుగుతున్నట్టేనా?
జ: మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పినట్లు ప్రాజెక్టులు గాలిలో కట్టడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రాజెక్టులు కావాలంటే భూమి కావల్సిందే, అది రైతుకు చెందినది కావచ్చు పట్టణంలో ఒక రోడ్డు వారనున్న ఒక ఇంటి దగ్గర ఉండొచ్చు. కానీ వారికి ఇవ్వవలసిన పరిహారం విషయంలో ప్రభుత్వాలు ఖచ్చితత్వంతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. భూమి ఇచ్చిన కారణంగా కుటుంబాలు నష్టపోతున్న దానికి మార్కెట్ రేటుకి మూడు నాలుగు రెట్ల ఎక్కువ ఇవ్వగలిగితే ఏ ఒక్కరూ నష్టపోరు. సమస్య అంతా ఎక్కడ వస్తోందంటే మార్కెట్ రేటు డిసైడ్ చేయడం విషయంలో. ప్రభుత్వము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రమే ఫైనల్ అంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను అధిగమించి జరిగే చెల్లింపుల విషయంలో కళ్ళు మూసుకుంటుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కళ్లు తెరిచి మార్కెట్ రేటు ప్రకారం లావాదేవీలు ఎలా జరుగుతున్నాయో అలాగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే సమయంలో ప్రాజెక్టు కట్టే సందర్భంగా అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా ఉంటే ప్రాజెక్టు కాస్ట్ పెరిగే అవకాశం తక్కువ.
ప్రశ్న 10: మీరు మీ వ్యాసాలద్వారా చరిత్రను రికార్డ్ చేశారు. ఈ వ్యాసాలు రాస్తున్నప్పుడు మీ మనసులో కలిగిన భావనలేమిటి?
జ: ఈ సాధారణంగా ఎవరైనా ఇంతక ముందు జరిగిన దాన్ని తవ్వి తీసి చరిత్ర రాస్తారు, నమోదు చేస్తారు. నేను కాంటెంపరరీ హిస్టరీ – జరుగుతున్న చరిత్ర- నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే చరిత్రలో తప్పులు రాసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మనం వర్తమానాన్ని రికార్డు చేస్తున్నాము కనుక ఇది తెలిసిన చాలా మంది దీనిలో తప్పులుంటే ప్రశ్నిస్తారన్న భయం ఉంటుంది కనుక వాస్తవాలను ఒకటికి రెండుసార్లు పరీక్షించుకొని మాత్రమే నమోదు చేస్తాము.
ప్రశ్న11: మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: ఈ రెండు పుస్తకాలకు కొనసాగింపుగా ‘కాళేశ్వరం ఫియాస్కో – ఏ టెల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ అనే పుస్తకాన్ని ఫిబ్రవరిలో ప్రచురించాను. ఈ పుస్తకంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోవడం దగ్గరనుంచి, పూర్వాపరాలు దానిపై ఎన్ డి ఎస్ ఏ, సిఏజి ఇచ్చిన నివేదికలను చర్చించాను.
ఇటువంటి ఇంకొక రెండు మూడు అంశాలపై పుస్తకాలు తేవాలన్న ఆలోచన ఉంది. ప్రస్తుతం ‘కాళేశ్వరం ఫియాస్కో’ పుస్తకం తెలుగు రాస్తున్నాను. పుస్తక ప్రచురణ ఒకింత ఖరీదైన వ్యవహారంగా మారింది గనక అడుగు అంత ఎక్కువగా ముందుకు పడడం లేదు.
ప్రశ్న12. మీ జర్నలిస్టు జీవితానుభవాలను గ్రంథస్థం చేసే ఆలోచన వుందా?
జ: నా జర్నలిస్టు జీవితాన్ని కూడా పుస్తక రూపంలో తెచ్చే ఆలోచన ఉంది. ఇందులో వ్యక్తిగత అంశాల కన్నా సమాజానికి ఉపయుక్తంగా ఉండే అంశాలని ఎక్కువ ప్రస్తావించాలని భావిస్తున్నాను.
ప్రశ్న13. యువ జర్నలిస్టులకు, జర్నలిజం పట్ల ఆసక్తివున్నవారికి మీరు ఏవైనా సలహాలు, సూచనలిస్తారా?
జ: దాదాపు నాలుగు దిశాబ్దాలు జర్నలిజం వృత్తిలో ఉన్న వ్యక్తిగా ఎవరు ఈ వృత్తిలోకి వస్తానన్న నేను స్వాగతిస్తాను. చాలామంది చెప్పే అంశం ఏమిటంటే ఇక్కడ ఎత్తుపల్లాలు ఎక్కువ ఎప్పుడు పడిపోతామో తెలియదు అని. దీనిని నేను నూరు శాతం అంగీకరిస్తా.
అయితే ఏ ప్రైవేట్ రంగ ఉపాధి అయినా ఇటువంటి ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు తప్పవు. మీరు ఏ ఉద్యోగంలో చేరినా దానికి సిద్ధపడవలసిందే. కానీ జర్నలిజం వృత్తిలో చేరితే సమాజం మొత్తాన్ని ఆకళింపు చేసుకునే అవకాశం వస్తుంది. మిగిలిన కొన్ని వృత్తుల్లో – లాయర్లు, డాక్టర్లు – పోలీసు, రెవెన్యూ అధికారులు – వంటి ఉద్యోగాల్లో కూడా సమాజంలో అన్ని రకాల వారితోటి సంబంధాలు ఉండే అవకాశం ఉంది కానీ ఒక జర్నలిస్టుగా మీరు వారితో కలిసినంత గొప్పగా మిగిలిన రంగాలవారు కలవలేరు. అందుకని ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉన్న రంగమే.
అదే సమయంలో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోకపోతే నైపుణ్యాలు పెంచుకోకపోతే కాలం మిమ్మల్ని వదిలేసి ముందుకి వెళ్ళిపోతుంది. ఏ రంగంలో అయినా ఇది తప్పదు. కాలంతోపాటు మిమ్మల్ని మీరు ఎదుగుదల మార్గంలో పెట్టుకుంటూ పరుగు పెట్టకపోతే మీ వృత్తిని తిట్టి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ లోపం మీదే కాని వృత్తిది కాదు.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు రేమిల్ల అవధాని గారు.
రేమిల్ల అవధాని: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***
రచన: రేమిళ్ల అవధాని
ప్రచురణ: రేమిళ్ల అవధాని
పేజీలు: 148
వెల: ₹ 100/-
ప్రతులకు:
రేమిళ్ల అవధాని, ప్లాట్ నెం. 312,
రోడ్ నెం. 26, జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ 3,
గోపన్నపల్లె,
రంగారెడ్డి జిల్లా 500104
ఫోన్: 9440128377
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/-/hi/Remilla-Avadhani/dp/8190877526
~
‘ఊళ్లు నీళ్లు కన్నీళ్లు’ అనే వ్యాస సంపుటి సమీక్ష:
https://sanchika.com/uullu-neellu-kanneellu-book-review/