[‘బూడిద రంగు ఆకాశం’ అనే కథాసంపుటి, ‘ఊదారంగు సముద్రం’ ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలికలు రచించిన శ్రీ సయ్యద్ సలీం గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం సలీం గారూ.
సలీం: నమస్కారమండీ.
~
‘బూడిద రంగు ఆకాశం’ కథాసంపుటి:
ప్రశ్న 1. మీరు రచించిన 15 కథల సంపుటికి శీర్షికగా 5వ కథ ‘బూడిద రంగు ఆకాశం‘ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ఈ మధ్య రంగుల మీదికి మనసు మళ్ళుతోందనుకుంటా. ఓ సై ఫై నవలికకు ‘వూదారంగు సముద్రం’ అని పేరు పెట్టాను. మరో కథల సంపుటికి ‘గులాబీ రంగు రోడ్డు’ అనే శీర్షికను ఎంచుకున్నాను.
ప్రశ్న 2. ఇది మీ 13వ కథాసంపుటి. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: పదో తరగతి చదువుతున్న రోజుల్లో కవిత్వం రాయడం మొదలెట్టాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్సీ(టెక్) చేస్తున్న సమయంలో 1980లో మొదటి కథ రాశాను. కథలు రాయడం మొదలెట్టిన ఇరవై యేళ్ళ తర్వాత మొదటి నవల రాశాను. విభిన్నమైన కథాంశాలతో, ఎక్కువమంది స్పృశించని సమస్యల్ని తీసుకుని కథలు రాయడానికి ఇష్టపడతాను. ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఏటా ఎన్ని టన్నుల ధాన్యాన్ని నష్టపోతున్నామో తెలియచేసే కథ ‘ఫంగస్’, అబ్రకం గనుల్లో పని చేసే బాల కార్మికుల గురించి రాసిన ‘పడగనీడ‘, అవిభక్త కవలల గురించి రాసిన ‘అవిభక్త’, డ్రైనేజీ కార్మికుల వెతల్ని తెలిపే ‘నరకకూపం’, కింగ్ కోబ్రాల నేపథ్యంతో రాసిన ‘సర్పలిపి’, యాంటీ వెనం తయారుచేసే ఇన్స్టిట్యూట్ నేపథ్యంతో రాసిన ‘మృత్యోర్మా అమృతంగమయ’.. అటువంటి కథలే.
ప్రశ్న 3. ‘మృత్యోర్మా అమృతంగమయ‘ కథలో పాముల గురించి, వాటి విషాల గురించి, విరుగుడు గురించి సందర్భానుసారంగా చక్కగా వివరించారు. ఈ వివరాలకై ఎటువంటి పరిశోధన చేశారు?
జ: తమిళనాడులోని ఇరుల తెగ గురించి చదివినప్పుడు ఈ కథ రాయాలన్న ఆలోచన వచ్చింది. ఇంటర్నెట్లో వెతికి యాంటీ వెనం సిరం ఎలా తయారుచేస్తారో తెల్సుకున్నాను. విషంతో నిండిన పాములు, ప్రాణాలు కాపాడే యాంటీవెనం తయారుచేయడంలో ప్రముఖ భూమిక నిర్వహించడం అనే అంశం చుట్టూ కథను అల్లుకున్నాను.
ప్రశ్న 4. ‘బూడిద రంగు ఆకాశం‘ కథలో ఆకాశం స్వేచ్ఛకి ప్రతీక అనీ; ల్యాబ్ ప్రయోగాల వల్ల కోతుల సహజమైన జీవితం మారిపోయి వాటి మెదడు నిస్తేజంగా మారిపోవడానికి బూడిద రంగు ప్రతీక అనీ కథా శీర్షిక ద్వారా సూచనప్రాయంగా తెలుస్తోంది. లేదా శీర్షిక కథలోని సైన్స్‌కి మానవత్వానికి మధ్య ఉన్న ఒక నైతిక సందిగ్ధతని సూచిస్తుందా? ఈ టైటిల్ వెనుక ఉన్న మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జ: ఆకాశంలో కన్పించే కోటానుకోట్ల నక్షత్రాల్లా, మెదళ్లో ఉన్న గ్రే మేటర్‌లో కోటానుకోట్ల న్యూరాన్లు అల్లుకుని ఉంటాయి. విశ్వాంతరాళంలో ఉన్న మనకర్థంకాని అనేకానేక రహస్యాల్లానే మెదళ్లోని సంక్లిష్టతలు మానవ మేధకు పూర్తిగా అంతుబట్టటం లేదు. బూడిదరంగు ఆకాశం అనే శీర్షికను మెదడులోని గ్రేమేటర్కు ప్రతీకగా పెట్టాను.
ప్రశ్న 5. ‘మృత్యోర్మా అమృతంగమయ‘ కథలో వినీలకి, ‘సర్పలిపి‘ కథలో సింగికి వ్యక్తిగత పగ ఉంది. ఇద్దరు తమని వేధించిన వారిని చంపాలనుకుంటారు. వినీల అవకాశం వచ్చినా, అతడిని వదిలేస్తుంది. సింగి కాటు వేస్తుంది. ఈ రెండు పాత్రల ఆలోచనలలో ఈ తేడా ఎందుకు? వినీలకి పగ కన్నా లక్ష్యం ముఖ్యమా? సింగికి పగే లక్ష్యమా? లేక వేరే ఇతర కారణాలున్నాయా?
జ: పాముకాటు వల్ల ఎవరూ చనిపోకూడదన్న ఆశయంతో టాక్సికాలజీ చేసిన వినీల తనలో రగులుతున్న పగను విషంలా మార్చి చంపకుండా, దాన్ని అమృతంలా మార్చి ప్రాణాల్ని కాపాడింది. సింగి చదువాపేసి గూడేనికి వచ్చిందే తన అక్క చావుకి కారణమైన వాడ్ని చంపేసి, ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో. మీరు చాలా గొప్పగా ఆ ఇద్దరి స్వభావాల్ని విశ్లేషించినట్టుగానే సింగికి పగే లక్ష్యం. వినీలకు పగకన్నా తన ఆశయం ముఖ్యం.
ప్రశ్న 6. ‘గీతాబాయి‘ కథలోని గీతాబాయి జీవితంలో అనేక దుఃఖకారక ఘటనల తర్వాత జీవన సత్యాలను తెలుసుకుంటుంది. అది అప్రయత్నంగా జరిగినట్టే అనిపిస్తుంది. భగవద్గీతాసారం నేపథ్యంగా అల్లిన ఈ కథకి ఈ పాత్రకి ప్రేరణ ఎవరు? ఇది కల్పిత పాత్రా లేక నిజ జీవితంలో మీకు తారసపడిన వ్యక్తా?
జ: నేను నాగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా ఇన్‌కంటాక్స్ క్వార్టర్స్‌లో నేనుండే ఫ్లాట్‌కి పక్కనే విశాలమైన గార్డెన్ ఉండేది. పిల్లలు ఆడుకోడానికి అవసరమైన జారుడు బండ, ఉయ్యాలలు, స్పిన్నర్స్, సీ-సాలు ఉండేవి. వాటితో పాటు పెద్ద వాళ్ళు కూచోడానికి కుర్చీలు, బల్లల్తో పాటు మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ చేయడం కోసం గార్డెన్ చుట్టూతా వాక్‌వే ఉండేది. రోజూ సాయంత్రాలు ఆఫీస్ నుంచి యింటికొచ్చాక, నా బెడ్రూం కిటికీ దగ్గర కూచుని, గార్డెన్లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కొంత సమయం గడిపేవాడిని. ఓరోజు పిల్లల్తో పోటీ పడుతూ ఉయ్యాల వూగుతున్న, జారుడు బండ మీద జారుతూ సంబరపడుతున్న అరవై యేళ్ళు దాటిన స్త్రీని గమనించాను. ఆ తర్వాత రోజూ ఆమెను గమనించసాగాను. జీవితంలో ఏ రకమైన సమస్యలు లేని, నిశ్చింత జీవితం గడుపుతున్స స్త్రీ అనుకున్నాను. మా కార్ డ్రైవర్ ద్వారా ఆమె పడిన కష్టాల గురించి తెల్సుకున్నాక భగవద్గీతను చదవకున్నా కొంతమందికి దాని సారం పట్టుపడ్తుందని అర్థమైంది. గీతాబాయి కథకు ఆమె జీవితమే ప్రేరణ.
ప్రశ్న 7. సాధారణంగా ఆండ్రాయిడ్ హ్యూమనాయిడ్లకు ప్రోగ్రామ్ చేయబడిన గుణాలు తప్ప ఇతర ఎమోషన్స్ ఉండవని అంటారు. ‘లెఫి బొ‘ కథలోని ఆద్విక/భువి సొంతంగా ఆలోచించగలగుతుంది. మానవులకి, ఫీమేల్ ఆండ్రాయిడ్లు భార్యలుగా రావడం, ఆ ఫిమేల్ రోబోలను కిడ్నాప్ చేయడం – ఇదంతా భవిష్యత్తులో జరగవచ్చునని ఊహిస్తున్నారా? సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, వివిధ కారణాల వల్ల ఎక్కువమంది మగపిల్లలకి పెళ్ళి సంబంధాలు కుదరకపోవడం వంటివి – భవిష్యత్తులో ఇలా రోబోలను భాగస్వామిగా ఎంచుకోడానికి ప్రేరేపిస్తారని భావిస్తున్నారా?
జ: ఇప్పటికే చైనాలో ‘ఎమోషనల్ కంప్యానియన్ రోబోట్స్’ని అమ్ముతున్నారు. ఇవి మనుషుల ముఖ కవళికలు, మాట తీరుని బట్టి విభిన్న భావోద్వేగాలను గుర్తిస్తాయి. మాట్లాడేటప్పుడు, గతంలో జరిగిన సంభాషణలను గుర్తుంచుకుని, వ్యక్తిగతంగా స్పందిస్తాయి. ఇవి ఒంటరిగా ఉన్న వారికి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం రూపొందించబడిన రోబోలు. జూన్ 2026 లో చైనాలోని ప్రసిద్ధ రోబోటిక్ సంస్థ UB Tech హైపర్ రియలిస్టిక్ హ్యూమనాయిడ్ రోబోట్స్‌ని అమ్మకానికి పెట్టింది. నేను కథలో రాసినట్టు భవిష్యత్తులో సహచరిలా తోడుండే హ్యూమనాయిడ్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఎటొచ్చీ వాటికుండే అత్యధిక ధరల దృష్ట్యా అత్యంత ధనవంతులు మాత్రమే వాటిని స్వంతం చేసుకోగలరు.
ప్రశ్న 8. ఈ సంపుటిలోని పలు కథల (మృత్యోర్మా అమృతంగమయ, బూడిద రంగు ఆకాశం, చీకటి చివర్న వెల్తురు, హోమో అల్టిమో) ఇతివృత్తాలకు ప్రయోగాలు, వాటి వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలు నేపథ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి మనిషిలోని అన్వేషణా స్వభావాన్ని, జిజ్ఞాసని ప్రతిఫలిస్తాయని భావిస్తున్నారా?
జ: ప్రయోగాల వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నా వాటికోసం మూగజీవాల్ని ఎలా హింస పెడ్తారో తెల్సుకునే కొద్దీ వొళ్ళు గగుర్పొడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు మస్కరా, లిప్‌స్టిక్ తయారుచేసే సంస్థలు కూడా వాటిని కోతుల మీద, కుందేళ్ళ మీద ప్రయోగించి ఫలితాలు రాబట్టేవారు. డ్రెయిజ్ టెష్ట్లో కుందేళ్ళ కళ్ళల్లో నేరుగా కెమికల్ని వేసి, రియాక్షన్‌ని గమనిస్తారు. వాటి కళ్ళు ఎర్రగా మారి, అవి బాధతో విలవిల్లాడుతున్నా దయ చూపరు. ప్రస్తుతం యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ మీద నిషేధం ఉన్నా కొన్ని సంస్థలు అనధికారికంగా వాటిని నిర్వహిస్తూనే ఉన్నాయి. యాంటీ వెనం తయారీలో కూడా పాము కోరల నుంచి విషం పిండటం, గుర్రాలకు ఆ విషాన్ని ఎక్కించి సిరం తయారుచేయడంలో పాములు, గుర్రాలు హింసకు లోనౌతుంటాయి. మానవాళి ప్రయోజనాల కోసం మూగజీవాలు పడ్తున్న హింస పాఠకులకు తెలియచేయడం అవసరమనిపించి, ఆ నేపథ్యాలతో కథల్ని అల్లుకున్నాను.
ప్రశ్న 9. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ఈ సంపుటిలోని ‘బూడిదరంగు ఆకాశం’ కథ చాలా ఇష్టమైన కథ. యాభై యేళ్ళక్రితం ఆటిజం లక్షణాలు పదివేల మంది పిల్లల్లో ఒక్కరు లేదా ఇద్దరిలో కన్పించేవి. కానీ ఇప్పుడు వందమందిలో ఐదారుగురు ఆటిజం బారిన పడ్తున్నారు. ADHD బారిన పడ్తున్న వాళ్ళ సంఖ్య పదకొండు నుంచి పదిహేను శాతం వరకు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ రెండు డిజార్డర్లు ఎందుకు తీవ్రమౌతున్నాయో తెల్సుకోవడంతో పాటు వాటికి సరైన చికిత్సల్ని అన్వేషించడం కూడా ఇప్పుడు మనముందున్న ప్రధాన సమస్య.
ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఆటిజంతో బాధపడ్తున్న తన కొడుకుని దాన్నుంచి బైటికి తీసుకురావడానికి ఓ తల్లి పడిన వేదన, చేసిన పోరాటమే ‘చీకటి చివర్న వెల్తురు’ అనే కథ. ADHD కి మందు కనుక్కోవడం కోసం కోతుల మీద చేస్తున్న ప్రయోగాల నేపథ్యంతో రాసిన కథ ‘బూడిద రంగు ఆకాశం.’ ఈ రెండు కథలు రాయడానికి ముందు ఆటిజం గురించి, ఏడిహెచ్‌డి గురించి చాలా సమాచారం సేకరించాల్సి వచ్చింది. అలానే కోతుల మెదళ్ళ మీద చేసే ప్రయోగాల గురించి, అటువంటి ప్రయోగశాలల్లో ఉండే వాతావరణం గురించి తెల్సుకున్నాకే ఈ కథలు రాయడం మొదలెట్టాను.
‘వూదారంగు సముద్రం’ నవలిక:
ప్రశ్న 11. అధీర చిన్నప్పటి నుంచే “సముద్రంలో ఇంకా ఏముంది?” అనే ప్రశ్నతో పెరుగుతుంది. ఆమెకు సముద్రం కేవలం పరిశోధనా ప్రదేశం కాదు – మనిషికి తెలియని ఒక విశాలమైన రహస్య ప్రపంచం. మరోవైపు కథలో ఆకాశం, నక్షత్రాలు, పాలపుంతలతో సముద్రాన్ని మీరు పదేపదే సమాంతరంగా చూపించారు. మీ దృష్టిలో సముద్రగర్భం, అంతరిక్షం – ఈ రెండింటిలో మనిషికి ఇంకా ఎక్కువగా తెలియని ‘విశ్వం’ ఏది? ఈ కథకు సముద్రాన్నే ఎంచుకోవడం వెనుక మీ ఆలోచన ఏమిటి?
జ: హబుల్ టెలిస్కోప్ సహాయంతో విశ్వాంతరాళంలో దాగున్న అనేక రహస్యాల్ని ఖగోళ శా స్తవేత్తలు తెల్సుకోగలిగారు. విశ్వం కొన్ని వందల బిలియన్ల గెలాక్సీలతో నిండి ఉందని నిర్థారించ గలిగారు. హబుల్ ఆప్టికల్ టెలిస్కోప్. దాని చూపు చేరుకోలేని దూరాల్ని శోధించడానికి నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని రూపొందించింది. ఇది ఇన్ఫ్రా రెడ్ టెలిస్కోప్. దీని సహాయంతో 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన, అత్యంత దూరంలో ఉన్న గెలాక్సీలను కూడా శాస్త్రవేత్తలు చూడగలుగుతున్నారు. కానీ సముద్రగర్భంలోని రహస్యాల్ని వెలికి తీయడంలో అధిగమించలేని అనేక అవరోధాలు అడ్డుగా నిలుస్తున్నాయి. సముద్రంలోపలికి వెళ్ళే కొద్దీ ఏర్పడే అధిక పీడనం ఓ సమస్య. అత్యంత లోతైన ప్రదేశాల్లో చిక్కబడే చీకటి మరో సమస్య. అందుకే ఇప్పటికీ సముద్రం లోపల మానవాళికి తెలియని అనేక రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. నేను ఈ నవలిక కోసం సముద్రాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదే.
ప్రశ్న 12. గోల్డెన్ ఎగ్‌లోని ప్రత్యేకమైన మెమరీ కణాలు కోట్ల సంవత్సరాల పరిణామాన్ని, నాగరికతల ఉత్థానపతనాలను భద్రపరచుకున్నాయని కథ చెబుతుంది. అంటే ఒక జీవి తన శరీరంలోనే ఒక గ్రహం యొక్క చరిత్రను మోస్తోంది. ఈ ఆలోచనను మీరు కేవలం సైన్స్‌ఫిక్షన్ ఊహగా చూశారా? లేక “జ్ఞాపకాన్ని కోల్పోయిన జీవి తన చరిత్రను కోల్పోతుంది” అనే తాత్విక భావనను కూడా ఇందులో ఉద్దేశపూర్వకంగా ఇమిడ్చారా?
జ: తాత్విక భావన ఏమీ లేదు. కేవలం ఫ్యాంటసీ.. కల్పన..
ప్రశ్న 13. గోల్డెన్ ఎగ్ తనను రక్షించమని మానవులకు సంకేతం పంపుతుంది. అధీర దాన్ని ప్రపంచ శాస్త్రవేత్తలకు పరిచయం చేస్తే ఆమెకు పేరు, ప్రతిష్ఠ వస్తాయని తెలిసినా, ఆ జీవిని ప్రయోగాల పేరుతో మనుషులు నాశనం చేసే ప్రమాదాన్ని గుర్తించి దాని ఉనికిని రహస్యంగా ఉంచాలని నిర్ణయిస్తుంది. ఇక్కడ మీరు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు: “శాస్త్రవేత్తకు ఒక అద్భుతమైన ఆవిష్కరణను ప్రపంచానికి తెలియజేసే హక్కు ఎక్కువా, ఆ ఆవిష్కరణకు జీవించే హక్కు ఎక్కువా?” మీ వ్యక్తిగత సమాధానం ఏమిటి?
జ: ఆ ఆవిష్కరణ అప్పటివరకు మానవాళికి తెలియని ఓ కొత్త జీవికి సంబంధించనదైనప్పుడు, ఆ స్పీషీస్లో బతికున్న జీవి అదొక్కటే అయినప్పుడు, దాన్ని కాపాడటమే ప్రాధాన్యతను సంతరించు కుంటుంది.
ప్రశ్న 14. గోల్డెన్ ఎగ్ తన మెమరీ కణాల ద్వారా కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన నాగరికతల వినాశనాన్ని అధీరకు కలల రూపంలో చూపిస్తుంది. మనిషి చరిత్రను చదువుతాడు; కానీ ఈ జీవి చరిత్రను జీవిస్తుంది. చరిత్రను పుస్తకాల ద్వారా తెలుసుకోవడం, ఒక జీవి జ్ఞాపకాల ద్వారా ప్రత్యక్షంగా అనుభవించడం – ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చూపించడం ద్వారా మనిషి తన నాగరికత ఎంత తాత్కాలికమో చెప్పాలనుకున్నారా?
జ: విశ్వాంతరాళంలో మనకన్నా బుద్ధిజీవులైన ఏలియన్స్ ఉండొచ్చని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకన్నా ఎన్నో రెట్లు అభివృద్ధి సాధించి ఉంటారని వూహిస్తూ చాలా సైఫై కథలు, నవలలు వచ్చాయి. అటువంటి బుద్ధిజీవులు సముద్రగర్భంలో కూడా ఉండొచ్చనే వూహతో రాసిన నవలిక ఇది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని కూడా తన మెమరీ కణాల్లో దాచుకోవడం, వూదా రంగు చిత్రాల మాధ్యమం ద్వారా మనుషుల్తో కమ్యూనికేట్ చేయడం.. ఇదంతా అత్యంత తెలివి గల సముద్ర జీవిని వూహించి రాసిందే. కేవలం ఫ్యాంటసీ తప్ప మీరు మీ ప్రశ్నలో వెలిబుచ్చిన ఉద్దేశం ఏమీ లేదు. ఇక్కడో విషయం చెప్పాలి. నా నవలిక కన్నా మీరు సంధించిన కొన్ని ప్రశ్నలు, నా నవలిక మీద మీ అభిప్రాయాలు అద్భుతంగా ఉన్నాయి.
ప్రశ్న 15. గోల్డెన్ ఎగ్‌కు పరాన్నజీవి సోకినప్పుడు దాన్ని కాపాడటానికి అధీర దాన్ని కోసి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. కానీ దాన్ని కాపాడే ప్రయత్నమే దానికి ప్రమాదంగా మారవచ్చనే భయం కూడా ఉంటుంది. ఈ ఘట్టంలో కనిపించేది ఒక పెద్ద ప్రతీక: ప్రకృతిని ‘రక్షించడానికి’ మనిషి జోక్యం చేసుకున్నప్పుడు, ఆ రక్షణే మరో విధమైన హానిగా మారే ప్రమాదం. మీరు ఈ విరోధాభాసాన్ని ఉద్దేశపూర్వకంగా కల్పించారా?
జ: లేదు.
‘చంద్రునికో నూలుపోగు’ నవలిక:
ప్రశ్న 16. అయాన్ష్‌కి చంద్రుడు శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన ఖగోళ వస్తువు మాత్రమే కాదు. భూమికి వచ్చి వెన్నెలలో కూర్చోవడం కోసం అతను చంద్రుని నుంచి లక్షల మైళ్లు ప్రయాణిస్తాడు; “నా ప్రేయసి వెన్నెల” అంటాడు. చివర్లో చంద్రుడిని కాపాడిన విజయాన్ని ‘నూలుపోగు‘తో పోలుస్తాడు. ‘నూలుపోగు’ మీకు ఇక్కడ బలహీనతకు ప్రతీకా, అనుబంధానికి ప్రతీకా, లేక మనిషి – చంద్రుడి మధ్య ఉన్న వేల సంవత్సరాల సాంస్కృతిక బంధానికి ప్రతీకా? ఈ శీర్షికను ఎప్పుడు నిర్ణయించారు – నవల రాసేటప్పుడా, లేక నవల పూర్తయిన తర్వాతా?
జ: నవల పూర్తయ్యాకే ఈ శీర్షిక పెట్టాను. చంద్రునితో, వెన్నెలతో ముడిపడి ఎన్ని భావోద్వేగాలో.. చంద్రునికీ మనిషికి మధ్య యుగయుగాల అనుబంధం.. చంద్రుడిని వేరే గ్రహవాసులు సంగ్రహించ కుండా కాపాడుకోవడం మానవాళి ప్రయోజనం కోసమే తప్ప చంద్రుని మేలు కోసం ఏమీ కాదు. ఎంతో కష్టపడి చంద్రుడిని కాపాడుకున్నా దాన్ని నూలుపోగుతో పోల్చడానికి కారణం చంద్రుని యెడ మనిషికున్న వినమ్రత.
ప్రశ్న 17. నవలలో శాస్త్రీయ సమస్య చాలా పెద్దది: చంద్రుడితో సమాన ద్రవ్యరాశి ఉన్న ‘బిగ్‌మాస్’ చంద్రుడిని తనవైపు లాగుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ బ్లాక్‌హోల్ వంటి అత్యంత తీవ్రమైన ప్రయోగాల వరకు వెళ్తారు. ఇంతటి శాస్త్రీయ ఊహను కథలోకి తీసుకొచ్చేటప్పుడు, “ఇది శాస్త్రీయంగా ఎంతవరకు సాధ్యం?” అనే ప్రశ్నకు మీరు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? లేక శాస్త్రీయంగా అసాధ్యంగా కనిపించినా, కథ యొక్క అంతర్గత తర్కం బలంగా ఉంటే సరిపోతుందని భావిస్తారా?
జ: ఇంగ్లీష్‌లో చంద్రుడ్ని దొంగిలించడం అనే కథాంశంతో కొన్ని సైఫై నవలలు వచ్చాయి. ‘Steal the f..king moon’ అనే నవలలో చంద్రుని కక్ష్యని మార్చి దాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తారు. Stolen Moon అనే నవలలో అంతు చిక్కని ఏదో ఓ గెలాక్టిక్ ఫోర్స్ వల్ల చంద్రుడు భూమి నుంచి వేరుచేయబడతాడు. Wolfbane అనే నవలలో ఏకంగా Earth నే Solar system నుంచి దూరంగా లాక్కెళ్ళిపోతారు. భూమికి సూర్య రశ్మి అవసరం కాబట్టి చంద్రుడ్ని తమ టెక్నాలజీ ఉపయోగించి, miniature Sun లా మార్చేస్తారు. నేనీ నవలలేవీ చదవలేదు. చంద్రుడ్ని కానీ భూమిని కానీ లాక్కెళ్ళి పోవడానికి ఎటువంటి టెక్నిక్స్‌ని నవలల్లో పొందుపరిచారో నాకు తెలియదు. Miniature black hole ని తయారు చేయడం, బిగ్‌మాస్ రూపకల్పన.. చంద్రుడ్ని తన కక్ష్య నుంచి మళ్ళించి తమ గ్రహం వైపుకు లాక్కెళ్ళడానికి అవసరమైన టెక్నిక్‌గా నేనీ నవలలో వాడుకున్నాను. శాస్త్రీయంగా అసాధ్యం అనుకున్నవెన్నో భవిష్యత్కాలంలో సుసాధ్యాలుగా మారిన తార్కాణాలెన్నో ఉన్నాయి. నేను రాసింది కేవలం ఫ్యాంటసీనే అయినా రాబోయే రోజుల్లో అటువంటి ప్రయోగాలు విజయవంతం కావచ్చేమో.
ప్రశ్న 18. ఈ నవలలో ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే – మనుషుల చంద్రుడిని అపహరించాలనుకునే మరో గ్రహవాసులు, మనుషుల దృష్టిలో ‘ఏలియన్స్’. కానీ చివరికి భూగ్రహవాసులనే గాజుగదిలో బంధించి అక్కడి ప్రజలకు ప్రదర్శనగా ఉంచుతారు. మనల్ని మనమే “విశ్వంలో అత్యున్నత జీవరాశి”గా భావించుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ఈ సంఘటన ద్వారా తలకిందులు చేయాలనుకున్నారా? ఏలియన్స్‌ను రాక్షసులుగా కాకుండా, మనుషులపై మరో జాతి చూపును పెట్టడానికి ప్రయత్నించారా?
జ: మనకు వేరే గ్రహవాసులు ఏలియన్స్ అయితే వాళ్ళకు మనం ఏలియన్స్ లా కన్పిస్తాము కదా.
ప్రశ్న 19. నవలలో నిక్స్ గ్రహం చంద్రుడిని కోరుకోవడానికి వెనుక ఉన్న కారణం ఒక విధంగా ఆశ, అవసరం, అధికార దాహం, ఆక్రమణ – అన్నింటి మిశ్రమంలా కనిపిస్తుంది. ఒక మంత్రి మాత్రం యుద్ధానికి బదులుగా భూమి చంద్రుడిని లాక్కోవాలని సూచిస్తాడు. ఇక్కడి ‘చంద్రుడిని అపహరించడం’ అనే ఆలోచనను మీరు కేవలం సైన్స్‌ఫిక్షన్ సంఘటనగా మాత్రమే చూశారా, లేక మనుషుల చరిత్రలోని వలసవాదం, వనరుల దోపిడీ, “నాకు కావాలి కాబట్టి తీసుకుంటాను” అనే అధికార మనస్తత్వానికి ప్రతీకగా కూడా నిర్మించారా?
జ: చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి 1.5 అంగుళాలు దూరంగా జరుగుతున్నాడని చదివినప్పుడు మొదట నా ఆసక్తి చంద్రుడు పూర్తిగా దూరమైపోతే కలిగే పరిణామాలేమిటనే దాని మీద కేంద్రీకృతమైంది. అలా పూర్తిగా దూరమయ్యే అవకాశమే లేదట. 50 బిలియన్ సంవత్సరాల తర్వాత భూ భ్రమణ వేగం నెమ్మదించడం వల్ల ఆ రెండింటి మధ్య రొటేషనల్ లాకింగ్ ఏర్పడి, చంద్రుడు దూరంగా జరగడం పూర్తిగా ఆగిపోతుందట. కానీ దానికంటే ముందే, మరో 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు రెడ్ జయంట్లా మారి భూమిని, చంద్రుడ్ని మింగేయడం జరుగుతుందని కూడా చదివాను. అప్పుడే ఈ నవలిక రాయాలన్న ఆలోచన వచ్చింది. చంద్రుడ్ని వేరే గ్రహవాసులు తరలించుకుపోవాలని ప్రయత్నిస్తే, దాన్నెలా ఎదుర్కోవాలనే కథాంశంతో నవలికను అల్లుకున్నాను. దీన్ని కేవలం సైన్స్ ఫిక్షన్ సంఘటనగా మాత్రమే తీసుకున్నాను.
ప్రశ్న 20. చివర్లో చంద్రుడిని కాపాడిన తర్వాత అయాన్ష్‌కి కలిగే భావన చాలా ముఖ్యమైనది: మానవాళికి చంద్రుడు ఇచ్చినదానితో పోలిస్తే, తాము చేసిన పని కూడా “చంద్రుడిపై ఇష్టంతో, గౌరవంతో సమర్పించిన ఓ నూలుపోగు” మాత్రమేనని అతను భావిస్తాడు. నవల చివర్లో విజయం సాధించిన హీరోగా అయాన్ష్‌ను నిలబెట్టకుండా, చంద్రుడి ముందు మనిషి చేసిన పని చిన్నదే అన్న వినయపూర్వక భావనతో ముగించారు. ఇది మీ సైన్స్ ఫిక్షన్లో అంతర్లీనంగా ఉన్న మానవతావాద దృష్టికోణానికి ఉదాహరణగా భావించవచ్చా?
జ: అవును.
ప్రశ్న 21. ఇటీవలి కాలంలో మీరు ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ రచనలపై దృష్టి సారించినట్టు అనిపిస్తోంది. దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: నేను సైన్స్ స్టూడెంట్‌ని. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్. అందులోనూ మరింత ఇష్టమైనది ఖగోళ శాస్త్రం. కాలేజీ రోజుల నుంచే సైన్స్ ఫిక్షన్ మీద ఆసక్తి ఏర్పడింది. కానీ నేను సైన్స్ ఫిక్షన్ రచనల వైపుకు మళ్ళటం చాలా ఆలస్యంగా జరిగింది. డాక్టర్ చిత్తర్వు మధు గారు, శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు సైన్స్ ఫిక్షన్ సాహిత్య సృజనలో చేస్తున్న కృషితో స్పూర్తిని పొంది, నేనూ సైన్స్ ఫిక్షన్ రచనలు చేయడం మొదలెట్టాను. సైన్స్ ఫిక్షన్ రచనలకు పాఠకాదరణతో పాటు పత్రికల ఆదరణ కూడా తక్కువ. సైన్స్ ఫిక్షన్ రచనల్ని ప్రచురించుకోడానికి పత్రికలు కరువైపోయిన తరుణంలో సంచిక వెబ్ పత్రిక ఆ లోటును భర్తీ చేయడం సంతోషించదగిన విషయం. తను సైన్స్ ఫిక్షన్ రచనల్ని చేయడంతో పాటు సైన్స్ ఫిక్షన్ రాసే రచయితల్ని ప్రోత్సహిస్తున్న శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి అనేకానేక ధన్యవాదాలు. నా సైన్స్ ఫిక్షన్ నవలికలు ‘వూదారంగు సముద్రం’, ‘చంద్రునికో నూలుపోగు’, ‘గ్రహాంతర అన్వేషణ’ లతో పాటు చాలా కథలు సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురించబడినవే.
ప్రశ్న 22. సైన్స్ ఫిక్షన్ రచనలకై ఇతివృత్తాలను మీరెలా ఎంచుకుంటారు? ఎంచుకున్న ఇతివృత్తానికి అవసరమైన సమాచారం ఎలా సేకరిస్తారు? సైన్స్ ఫిక్షన్ రచనలకి మీ సన్నద్ధత ఎలా ఉంటుంది?
ప్రశ్న 23. మీరు అత్యంత ఆధునికాంశాలతో సైన్స్ ఫిక్షన్ రాసినా, రచనలో ‘మానవీయత‘ లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే, సైన్స్ పెరిగినా మనిషిలోని మానవత్వం మరుగవకూడదనే సందేశం ఈ రచనల్లో వ్యక్తమవుతుంది. దీనికి కారణమేమిటి?
జ: సైన్స్ ఫిక్షన్ రచనల్లోనే కాదు. నా మిగత రచనల్లో కూడా మానవత్వానికే పెద్ద పీట. నా మతం మానవత్వం. భారతీయ సంస్కృతి ఎప్పుడూ విశ్వజనీనతకే ప్రాధాన్యమిచ్చింది. ప్రాచీన గ్రంథాలు మనుషుల మధ్య ఏకత్వాన్ని బోధించాయి. కరుణ, ప్రేమ, దయ, అహింస, నిస్వార్థం, సమానత్వం, సహానుభూతి.. వీటన్నిటి కలయికే మానవత్వం కదా.
ప్రశ్న 24. మీ సైన్స్ ఫిక్షన్ రచనల్లో అంతరిక్ష ప్రయాణాల గురించి, గ్రహాంతరవాసుల గురించి రాసినా, వాటిలో ఒక తాత్విక నేపథ్యం గోచరిస్తుంది. సైన్స్‌ని, తత్వశాస్త్రాన్ని ముడిపెడుతూ కథనాన్ని నడపడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
జ: ఉద్దేశపూర్వకంగా తత్వశాస్త్రంతో ముడిపెడుతూ ఏ రచన కూడా చేయలేదు. కొన్ని రచనల్లో యాదృచ్చికంగా తాత్విక నేపథ్యం గోచరించి ఉండొచ్చు
ప్రశ్న 25. భవిష్యత్తులో ఏయే అంశాలను, ఏ ఇతివృత్తాలను నవలలుగా రాయాలనుకుంటున్నారు? వివరించండి.
జ: Psychology based నవలలు రాయాలన్న కోరిక.. ఓ సైకియాట్రిష్ట్ జీవితం, అనుభవాలని కథాంశంగా తీసుకుని ‘మనోజ్ఞ’ అనే నవల రాశాను. నేను ఏం రాసినా, దాన్ని ప్రఖ్యాత విమర్శకులు, సన్మిత్రులు శ్రీ కె.పి. అశోక్‌కుమారి గారికి పంపడం అలవాటు. వారికి తీరిక దొరికినపుడు చదివి, దాని గురించి ఫేస్బుక్లో పరిచయం/సమీక్ష చేయడం వారి సహృదయతకు నిదర్శనం. కానీ ఈ నవల వారికి నచ్చలేదు. శ్రీ కె.పి. అశోక్ కుమార్ గారు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్తారు. నాకది ఇష్టం. వారి అభిప్రాయం విన్నాక సైకాలజీ బేసెడ్ నవలలు రాయడంలో మరింత పరిణతి సంపాదించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటివరకు నేను సైఫై జానర్లో ఆరు నవలికలు మాత్రమే రాశాను. డాక్టర్ చిత్తర్వు మధు గారు రాసినట్టు సైన్స్ ఫిక్షన్లో పూర్తి నవల రాయాలన్న కోరిక కూడా ఉంది.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సలీం గారు.
సలీం: ధన్యవాదాలు.
***
రచన: సలీం
ప్రచురణ: అనుపమ ప్రచురణలు
పేజీలు: 139
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా
హైదరాబాద్ 500027
ఫోన్: 9000 413 413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/boodida-rangu-akasam
~
రచన: సలీం
ప్రచురణ: అనుపమ ప్రచురణలు
పేజీలు: 60
వెల: ₹ 80/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా
హైదరాబాద్ 500027.
ఫోన్: 9000 413 413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/voodaa-rangu-samudram
~
రచన: సలీం
ప్రచురణ: తెలంగాణ పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 66
వెల: ₹ 75/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా
హైదరాబాద్ 500027
ఫోన్: 9000 413 413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/chandruniko-noolupogu
~
‘బూడిద రంగు ఆకాశం’ కథాసంపుటి, ‘వూదారంగు సముద్రం’ ‘చంద్రునికో నూలుపోగు’ నవలికల సమీక్ష:
https://sanchika.com/saleem-three-books-review-kss/

