[‘ది స్కాటిష్ గర్ల్’ అనే నవల వెలువరించిన శ్యామ్ మైల్స్టోన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం శ్యామ్ మైల్స్టోన్ గారూ.
శ్యామ్ మైల్స్టోన్: నమస్కారం.
~
ప్రశ్న 1. ‘ది స్కాటిష్ గర్ల్’ అనే నవల వెలువరించినందుకు అభినందనలు. ఓ విభిన్నమైన ప్రేమకథని నవలగా అందించాలన్న ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చింది?
జ: సంచిక కుటుంబానికి ధన్యవాదాలు సర్. నేను చెన్నైలో D.F.Tech (డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ) కోర్స్ చేశాను. ఆ తరువాత ముంబైకి వెళ్ళాను. అక్కడ హిందీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కొన్ని నెలలు వర్క్ చేసాక హైదరాబాద్ వచ్చాను. 2010లో సినిమా డైరెక్షన్ ట్రయల్ స్టార్ట్ చేశాను. 2011లో సినిమా డైరెక్ట్ చేశాను, మధ్యలో ఆగిపోయింది. 2015లో ఒక ముల్టీస్టార్టర్ మూవీని ప్లాన్ చేశాను. ఒక హీరో వలన ఆగిపోయింది. ఆ తరువాత చిన్న కథలు రాసుకున్నాను.
చాలా పెద్ద పెద్ద కథలు రాసుకున్నాను హాలీవుడ్ కోసం అని. 2018 జులై లో నేను సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని చూసాను. అప్పుడే అనిపించింది నాకు పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి, జీవితం అంటూ పంచుకుంటే ఈ అమ్మాయి తోనే అని. ఆ అమ్మాయి స్కాట్లాండ్కి చెందిన అమ్మాయి. పరిచయం పెంచుకుని నా ప్రేమను తనకు చెప్పాను. “తెల్ల అమ్మాయి అంటే ఐ లవ్ యూ అనగానే ప్రేమిస్తారనుకున్నావా! నిన్ను ఎలా నమ్మాలి?” అని అడిగింది. తనని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు తనకోసం ఇదొక్కటి చేయాలనిపించింది కానీ, ఎలా?
అన్నపుడు ఓ నవల రాస్తే పోలా అనుకున్నాను. 2019 డిసెంబర్ లో మొదలైన ఆలోచన 2020 జనవరి తన బర్త్ డే రోజు నవలను అనౌన్స్ చేశాను. స్కాటిష్ గర్ల్ అని. కానీ అప్పటికి నా దగ్గర స్టోరీ ఐడియా కూడా లేదు. 2020 జులై నాకు Covid రావడం. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండటం. అక్టోబర్‌లో దుబాయ్ వెళ్లడంతో ఈ కథ మొదలయ్యింది. కానీ, ఈ కథలో మొదటి చాప్టర్లో వచ్చే ‘Saksun Lake Faroe Islands’ కథ మొదలు అవ్వడానికి కారణం.
ప్రశ్న 2. ‘ది స్కాటిష్ గర్ల్’ నవల వ్రాయడానికి మీరు ఏడు నెలలు అనేక దేశాలు, మూడు నెలలు దక్షిణ భారత రాష్ట్రాలు పర్యటించారన్నారు. ఎందుకని? ఆయా ప్రాంతాలను భౌతికంగా సందర్శించి నవలలో పొందుపరిచారా?
జ: అవును!.. బేసిక్‌గా నేను ఫ్రీక్వెంట్ ట్రావెల్లర్ని. నేను ఈ నవల రాయాలనుకున్నప్పుడు స్కాట్లాండ్ మాత్రమే అనుకున్నాను. దుబాయ్‌లో ఉన్నప్పుడే అర్ధం అయ్యింది ఏంటంటే ఈ నవలను పెద్ద స్కేల్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో చూపించాలి అని. ఒక తెలుగువాడు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నవల రాయగలడు అని నిరూపించాలనుకున్నాను. ముందు ఏ ఏ దేశాల్లో ఉండాలో ఒక రఫ్ ఐడియా వేసుకున్నాను, దుబాయ్‌లో మెర్క్యూరీ లౌంజ్‌లో డైలీ రాత్రి 9-1 వరకు దేశాలు అందులో ఎక్కడ ఏ లొకేషన్స్ లలో ఈ స్టోరీ జరగాలి అని. ఆలా కొన్ని కొన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తూ రాసుకుంటూ. నేను ట్రావెల్లర్గా దేశాల అందాలను ఆస్వాదిస్తూ రాసుకున్న నవల ఇది. దక్షిణ భారతదేశం అప్పటికే ఎన్నో సార్లు తిరిగినా కూడా మళ్లీ ఈ నవల ఎక్కడెక్కడో జరుగుతుందో వాటి వివరాలను సేకరించుకుంటూ ఒక గొప్ప అనుభూతి ఇవ్వాలి నా నవల చదివే పాఠకుడికి అని. అలా అని ఏదో ట్రావెల్లెర్ వ్లాగ్ లాగా ఉండదు. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక హాలీవుడ్‌గా ఉంటాయి కొన్ని సీన్స్. ఏ ఇండియన్ రైటర్ కూడా చూడని ఎన్నో అద్భుతమైన లొకేషన్స్‌లో మన స్కాటిష్ గర్ల్ నవల ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి.
ప్రశ్న 3. మీరు సినీరంగానికి చెందినవారు. సాహిత్యం మీద అభిరుచి ఎప్పుడు ఎలా కలిగింది? మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: ముందుగానే నేను చెప్పిననట్టు చెన్నైలో ఫిలిం కోర్స్ చేసాక అక్కడ ఒక ఫ్రెండ్‌తో బాంబే వెళ్ళాను. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి, హైదరాబాద్ వచ్చాను. కొన్ని రోజులు KB తిలక్ గారి దగ్గర ఉన్నాను. ఆ తరువాత కృష్ణానగర్ వచ్చాను. చిన్న ఏజ్‌లో సినిమా డైరెక్టర్ చెయ్యడం, అది ఆగిపోవడం, అప్పుడు నా దగ్గర ఇతర కథలు లేకపోవడం, మళ్లీ సినిమా కష్టాలు మొదలవ్వడం, 2014లో మళ్లీ OMG మూవీ డైరెక్టర్ దగ్గరకు వెళ్లడం స్క్రిప్ట్ వర్క్ కోసం, అక్కడి నుండి 2015లో నేను మళ్లీ సినిమా ప్లాన్ చెయ్యడం, అది ముందుకెళ్లకపోవడం, అంతకు ముందే నేను స్టార్ట్ చేసిన అడ్వర్టయిజింగ్ కంపెనీని చూసుకోవడం, అందులో యాడ్ ఫిలిమ్స్ తియ్యడం చేశాను. సినిమా రచన చెయ్యడం వేరు. నవల రాయడం వేరు. ఈ రెండింటికి ఎంతో తేడా ఉంది. నేనే ఊహించలేదు, ఈ నవల 2020లో మొదలుపెట్టి 2023 డిసెంబర్ లో కంప్లీట్ చేస్తానని. ఈ నవల రాయడం నా జీవితంలో ఒక మైలురాయి లాంటిది. ఎంతో నేర్పించింది. ఎందరినో ఇచ్చింది. నా జీవితంలో అద్భుతమంటే స్కాటిష్ గర్ల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నవల తరువాత ఇంకా మూడు ఇంటర్నేషనల్ నవలలు రాస్తున్నాను. ఈ సంవత్సరం నా డ్రీమ్ అయినా సినిమా కూడా డైరెక్ట్ చేయబోతున్నాను.
ప్రశ్న 4. మీ పేరు చివర మైల్స్టోన్ అని చేర్చుకోడం వెనుక ఉన్న కథ ఏమిటి? మీ అసలు పేరేమిటో మా పాఠకులకు వివరిస్తారా?
జ: నిజానికి నా పేరు శ్యామ్ దాసరి. ఎందుకు అనిపించిందో తెలియదు. మైల్స్టోన్ అని పెట్టుకున్నాను. మైల్స్టోన్ అంటే అందరికి తెలిసిందే, తెలుగులో మైలురాయి అంటారు. అంటే ఒక గుర్తింపు. ఎవరైనా కష్టమైనది సాధిస్తే వాడు మైల్స్టోన్ చేరుకున్నాడు అంటారు. ఎవరు చేయలేని పనిని మనం చేసి చూపిస్తే ఎలా ఉంటుందో, అలాగా నేను కూడా నేను తీసే సినిమాలు, రాసే కథలు మైల్‌స్టోన్‌లా ఉండాలి. ప్రపంచంలో అంత గుర్తింపు పొందాలి, అంత అత్యద్భుతంగా ఉండాలి అని ఆ బలమైన సంకల్పం. అందుకే నా స్కాటిష్ గర్ల్ నవల కూడా ఆ కోవకే చెందుతుంది. తెలుగులో ఇలాంటి స్టోరీ కానీ, సినిమాటిక్ నర్రెషన్ రైటింగ్ కానీ, ఇలాంటి లొకేషన్స్ కానీ, ఎవరు రాయలేదు. రేపు బుకర్ ప్రైజ్ లాంటిది వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మన తెలుగు పాఠకులకు. మైల్స్టోన్ అనేది నేను 2012లో ఫేస్బుక్లో 2nd నేమ్‌గా పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కథలు కూడా అలాగే చాలా డిఫరెంట్‌గా, ఎవ్వరు ట్రై చెయ్యని విధంగా ఉంటాయి. అందుకే కావచ్చు నాకు ఈ మైల్స్టోన్ పెట్టుకోవాలనే ఐడియా వచ్చి ఉండొచ్చు బహుశా.
ప్రశ్న 5: ఈ నవల డైరక్ట్ నవలా లేక ఏదైనా పత్రిక/వెబ్ సైట్/బ్లాగులో ధారావాహికంగా వచ్చిందా?
జ: లేదండీ, ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ప్రచురించలేదు. ఇది నేను రాసిన ఒరిజినల్ తెలుగు నవల. చాలామంది ఆ కవర్ పేజీని చూసి, టైటిల్ స్కాటిష్ గర్ల్ అని చూసి “ఇది మీరే రాశారా” మన తెలుగు వాళ్లు ఇలాంటి కథలు కూడా రాస్తారా అని నన్ను 38వ బుక్ ఫెయిర్‌లో కూడా అడిగారు.
ప్రశ్న 6. ఈ నవల మీ సొంత కథ అని విన్నాము. నిజమేనా? ఈ నవల వ్రాయడానికి ప్రేరణ ఏమిటి?
జ: అవునండీ! ఇది నేను రాసిన నా సొంత కథే. నేను ఒక స్కాట్లాండ్ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తనకు, తన కుటుంబానికి నా అమోఘమయిన ప్రేమను చాటి చెప్పాలనుకున్నాను. 2018లో తనతో మొదలైన ప్రేమ ఇప్పుడు ఎప్పుడు ఎన్ని యుగాలైనా తనకోసమే నా ప్రేమ. అందుకే ఈ నవలని Faroe Island లో తన ఒడిలో చనిపోయే నుండే మొదలు పెట్టాను. నిజంగా నా ఆశ కూడా అదే. ఎక్కడో స్కాట్లాండ్లో ఉన్న అమ్మాయి నాకు ఈ నవల రాసేంత ప్రేరణ ఇచ్చింది అంటే ఎంత గొప్పది అయ్యి ఉండాలి ఆ అమ్మాయి. అవకాశం దొరికితే వాడుకుందాం అనే నేటి సమాజంలో ఒక అమ్మాయికోసం ఇంతకష్టపడి ఒక కొత్త కథను రాసాను అంటే తనకోసమే ప్రాణంగా బతుకుతున్నాను అంటే కేవలం నా స్కాటిష్ గర్ల్ కారణం.
బుకర్ ప్రైజ్ అందుకున్న రోజు తనను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను.
ప్రశ్న 7. ప్రేమ ఒక యుద్ధంలాంటినే భావంతో నడుస్తూ – కాలమనే హద్దులని దాటుకుసాగే టైం ట్రావెల్ లవ్ స్టోరీ ఇదని అన్నారు. ఈ నవలకి ఇంత విస్తృతమైన కాన్వాస్ ఎందుకు తీసుకున్నారు?
జ: ప్రేమ అనేది ఒక అద్భుతం. ప్రేమ అనేది ఎన్ని యుగాలైనా ఆగిపోనిది. అందుకే ఈ నవల రాయాలనుకున్నప్పుడే ఒక తోకచుక్కతో మొదలు పెట్టాను. ఒక తోకచుక్క పదివేల సంవత్సరాలు ఈ గెలాక్సీ లో ప్రయాణిస్తుంది. నా ప్రేమ కూడా అంతే ఏదో ఒక యుగంలో ఏదో ఒక లోకంలో నా ప్రేమ ఎక్కడో ఒక్క దగ్గర తారసపడుతూనే ఉంటుంది.
స్కాటిష్ గర్ల్ ప్రేమ అంత ఈజీగా దొరకలేదు అండీ నాకు. టెహ్రాన్ లాంటి సిటీలో ఆజాది టవర్ ముందు జరిగిన దాడిలో నేను తనకోసం చేసింది ఒక యుద్ధం. Covid లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్ప్పుడు తన ప్రేమను పొందడానికి నేను చేసింది ఒక యుద్ధం. ఎడిన్‌బరా సిటీలో నా గుండెల్లో బుల్లెట్లు దిగినప్పుడు బ్రతకాలి తనకోసం అని నేను చేసింది ఒక ప్రేమ యుద్ధం. ఎన్నో యుగాలుగా తన ప్రేమను పొందుతూనే ఉన్నాను. జపాన్‌లో రెండవ వరల్డ్ వార్ అప్పుడు జరిగిన దాడిలో మేము కలిసి బ్రతకాలని నేను చేసింది ఒక అమర ప్రేమకావ్య యుద్ధం. తన ప్రేమకోసం నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టడం, ఎన్నో అడ్డంకులను దాటుకోవడం, తనతో జీవితాన్ని పంచుకోవడం, Faroe Island లో సంతోషంగా నేను తన ఒడిలో శాశ్వతంగా నా శరీరాన్ని వదిలెయ్యడం, మళ్లీ ఎక్కడో కొత్త శరీరాన్ని వెతుక్కుని తనను తన ప్రేమను పొందడం, ఇలా ఆ తోకచుక్క లాగా నా ప్రేమ ప్రయాణిస్తూనే ఉంది.
ప్రశ్న 8. ఈ నవల విడుదల చేసిన కొత్తల్లో కొందరు ఫేస్బుక్లో అడిగిన ప్రశ్నలకు మీరు – ‘ఇది అనువాద నవల కాదు’ అని చెప్పాల్సి వచ్చింది. కొందరిలో ఆ అభిప్రాయం కలగడానికి కారణమేమిటి? మీరు ఇంతకు ముందు ఏవైనా అనువాద రచనలు చేశారా?
జ: లేదండీ నేను ఇంతకు ముందు ఎప్పుడు నవలలు రాయలేదు, ఎవరి నవలలను అనువాదం చెయ్యలేదు. స్కాటిష్ గర్ల్ అనగానే మన తెలుగోళ్లకు అంత సీన్ ఉందా ఇలాంటి నవలలు రాసేంత అని చాలా మంది వెటకారంగా మాట్లాడారు. అప్పుడు అర్థమయ్యింది ఏంటంటే మనం నవలలు (రచనలు) రాయడంలో చాలా వెనకబడి ఉన్నాము అని. ఇంతకు ముందు రాసిన ఎందరో నవలలు ఈ తెలుగు రాష్ట్రాల్లో తిరిగే క్యారెక్టర్ల కథలు కావడం కావచ్చు. మనవాళ్ళు ఇంతకు మించి రాసేంత దమ్మేవాడికి ఉంది అనే భావన కావచ్చు పాఠకుల్లో. ఆ పాఠకులను కూడా మనమే తయారు చేస్తున్నాము. మనం గొప్ప కథలు చెబితే వాళ్ళు గొప్ప కథలు చదువుతారు. ZPHS లో ఇంగ్లీష్ చదివినవాడు Harvard University కి వెళ్ళి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడమంటే ఎలా మాట్లాడతాడు? ఇది కూడా అంతే. కథలు ఇలాగే ఉంటాయి. మేము ఇలాగే రాస్తాము అని చెప్పలేక. ఇంతకంటే గొప్పగా కథలు ఉండవు అని పాఠకులకు నచ్చచెప్పారు. నేను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అని నమ్మిస్తే నాలాంటి వాడు వచ్చి కాదు నాలుగు అంటే నిజం తెలుసుకోవడానికి టైం పడుతుంది. అందుకే నేను స్కాటిష్ గర్ల్ అని టైటిల్ పెడితే వాళ్లకు తెలుగోళ్లు రాసింది కాదు అన్నట్టు చూస్తున్నారు. కవర్ పేజీ కూడా అంతే కవర్ పేజీ అంటే ఫుల్ గా నిండిపోయి ఉండాలి. ఇలా ఒక అమ్మాయితో ఉంటే ఎలా అంటున్నారు.
పాఠకులకు మనం మన కథల ద్వారా కొత్త ప్రపంచాన్ని చూపించాలి. అది కూడా క్వాలిటీలో. ఒక IMAX లో అవతార్ చూసి ఎలా విస్మయానికి లోనవుతారో, నవల చదివి కూడా అలాగే విస్మయానికి లోనవ్వాలి. ఇది నా ఆలోచన, అది సినిమా అయినా నవల అయినా.
ప్రశ్న 9. ఈ నవల పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? సాధారణంగా మీరు ఎంత వేగంగా రాస్తారు? రోజుకు ఇన్ని పేజీలు రాయాలని/టైప్ చేయాలని ప్రణాళిక ఉంటుందా? ఉంటే, ఈ నవల రచన మీ ప్రణాళికకి అనుగుణంగానే సాగిందా?
జ: సాధారణంగా నేను ఏ కథ రాసిన కొత్తగా ఉండటానికి ప్రయత్నిస్తాను, అందరి లాగా కాకుండా. నా నవల కావచ్చు, సినిమా కథ కావచ్చు ఒక యూనిక్ స్టోరీ ఉంటుంది. నా కథలు విన్నవాళ్లకు మాత్రమే తెలుసు ఈ విషయం. నేను స్కాటిష్ గర్ల్ నవల రాయాలని 2020లో మొదలుపెట్టినప్పుడు ఒక ఆరు నెలల్లో రాయొచ్చు అనుకున్నాను. అది కాస్త నాలుగు ఏండ్లు పట్టింది. పబ్లిష్ చేయడానికి మరో రెండేళ్లు మొత్తం ఆరు సంవత్సరాలు పట్టింది. రోజుకు ఇన్ని పేజీలు టైప్ చేయాలని అని కానీ, చేసి తీరాలి అని కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే కథకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే గొప్పగా వస్తుంది. లేదు.. ఈ నవల నా ప్రణాళికకి అనుగుణంగా జరగలేదు. ప్రతిరోజు రాత్రి 9-10 మధ్యలో టైపు చేయడం మొదలు పెడితే ఉదయం నమాజ్ అయేది. ఒక్కోసారి పూర్తిగా తెల్లారిపోయేది. ఇలా ఐదు వందల రాత్రులు రాసాను. ఏ కంట్రీ తరువాత ఏ కంట్రీ రావాలి, కనెక్షన్స్ ఎలా కుదుర్చాలి అని ఆలోచనకి కొంచం టైం పట్టేది. ఇది Non-Linear కథ కాబట్టి. 2087లో కథ మొదలయితే ప్రెసెంట్లో ముగుస్తుంది. తిరిగి 1939 లో మొదలవుతుంది. ఇలా ఆ కనెక్షన్స్‌కి పర్ఫెక్ట్గా సెట్ చేయడానికి కొంచం టైం తీసుకున్నాను. నేను ఒక్కసారి కథ రాయడం (టైపు చేయడం) మొదలు పెడితే ఆగేది ఉండదు. కానీ, కథ నాకు బ్రెయిన్లో ప్రాసెస్ అవ్వడానికి కొంచం టైం పడుతుంది.
ప్రశ్న 10. నవల మధ్యలో సన్నివేశాలకి తగ్గ రంగుల చిత్రాలు బాగా అమరాయి. వీటిని చిత్రించిన ఆర్టిస్ట్ గురించి వివరాలు చెప్తారా?
జ: అవునండీ! నా నవలని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళను గుర్తుచేసుకోవాలి. ముందుగా అవిరూప్ అని కలకత్తా అబ్బాయి. 2021 డిసెంబర్లో అనుకుంటా ముందు బుక్ కవర్ పేజీ డిజైన్ చెయ్యాలని ఎంతో మందిని తెలుగులో ఫేమస్ అని చెప్పుకునే వాళ్ళను కలిసాను. ఒక అతను అయితే 7 నెలలు తిప్పించాడు. రేపు చేద్దాం రేపు ఈవెనింగ్ అని, ఒక వారం రోజుల్లో అని. ఇష్టం లేకపోతే నేను చెయ్యను అని కూడా చెప్పలేదు. విసిగిపోయాను. అప్పుడు నా సోషల్ మీడియాలో ఒక 23 ఏళ్ళ అబ్బాయి వర్క్ చూసాను. చాలా అద్భుతంగా అనిపించింది. అప్రోచ్ అయ్యాను. ఎంత అద్భుతంగా కవర్ పేజీ డిజైన్ చేసాడు అంటే.. బుక్ ఫెయిర్‌లో కేవలం బుక్ కవర్ పేజీ చూసే 70% మంది నా నవల కొన్నారు.
అలాగే ఇందులో ప్రతి ఐడియా నాదే. నాకు ఎలా కావాలో ముందే తెలుసు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి అని చెప్పేవాడిని. అది అంత ఈజీ కాదులెండి. అలాగే బ్యాక్ కవర్ పేజీ కూడా అతనే చేసాడు. జపాన్ నాగసాకిలో ఆటంబాంబ్ జరిగే సీన్ కూడా అతనే వేసాడు. పారిస్ 1939లో అమ్మాయికి లవ్ ప్రొపోస్ చేసే ఇమేజ్ కూడా అతనే వేసాడు. నేను చూసిన బ్రిలియంట్ క్రియేటివ్ పర్సన్ ఇతను. నేను తియ్యబోయే ఎన్నో సినిమా పోస్టర్లు కూడా చేసి ఇచ్చాడు.
ఆ తరువాత చెప్పాల్సింది రాజారామ్ వడ్లమూడి అని నా ఫ్రెండ్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్. అతను పదేళ్లుగా నా సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. ఎన్నో వందల స్టోరీబోర్డ్ వేసాడు నాకు, యాడ్ ఫిలిమ్స్ నుండి మూవీ వరకు. కంటెంట్ రాసిచ్చేవాడిని. అతను స్టోరీబోర్డ్ వేసేవాడు. ఆ తరువాత నందు ఆర్ట్స్ అని ఫేస్బుక్ ఫ్రెండ్. అతను ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాడు నా నవలను. నిజానికి వీళ్లందరి వర్క్ నా నవలలో లేనిదే నేను పబ్లిష్ అవ్వను అని అలిగినట్టున్నాయి. ముఖ్యంగా లతీఫ్ అని ఇంకో ఫ్రెండ్ అతని మేలు మర్చిపోలేను. లతీఫ్ కూడా బ్యాక్ వెనక కంటెంట్‌తో పాటు ఎన్నో వర్క్స్ చేసిచ్చాడు.
ప్రశ్న 11. ఏదైనా సన్నివేశం రాశాకా, బాగా లేదని అనిపించో, లేక అనుకున్నంత గ్రిప్పింగ్‌గా రాలేదనో – తిరగరాసిన సందర్భాలున్నాయా?
జ: అస్సలు అలాంటివేమీ జరగలేదండి. ఒక్కసారి రాయడం మొదలుపెట్టాను అంటే ఎక్కడ ఎలా మొదలుతుందో, ఎలా ఎండ్ అవుతుందో నాకు పర్ఫెక్ట్ ఐడియా ఉంది. నేను సినిమా కూడా అలాగే రాస్తాను. తీస్తాను కూడా. ఒక్కసారి స్టోరీ ఐడియా నాకు వచ్చింది అంటే రాకెట్ లాగా పరుగెడుతూనే ఉంటుంది టైపు చేయడం. అది భగవంతుడు నా తల్లితండ్రులు పంచిన వరం అనుకుంటాను ఇది. కాకపోతే ముందు ఎన్ని చాఫ్టర్లు రాయాలి ఆలోచన వచ్చింది. లీనియర్ రాయాలా లేక నాన్ లీనియర్ రాయాలా, కథను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనేవాటిని ముందుగానే టైం తీసుకుని ప్లాన్ చేసుకుంటాను. ముందుగానే చాఫ్టర్లు వాటి పేర్లు కూడా రాసుకున్నా. ఒక్కో చాప్టర్‌కి లింక్ చేసుకుంటూ పోయాను.
ప్రశ్న 12. ఈ నవల వ్రాయడం కోసం ఎన్నో దేశాలు తిరిగారు, మనదేశంలోని వివిధ రాష్ట్రాలు తిరిగారు. ఈ ప్రయాణంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న వారెవరు? వారు మీపై చూపిన ప్రభావం ఎలాంటిది?
జ: నాకు ఈ ప్రపంచ ప్రయాణంలో బాగా ఆకట్టుకున్నది ముందుగా స్కాట్లాండ్ లోని ఎడిన్‌బరా సిటీ. అందులో The Meadows Park గొప్పగా ఉందొ మాటల్లో చెప్పలేను.
ఇరాన్ లోని షిరాజ్ సిటీ నన్ను మంత్రముగ్ధున్ని చేసింది. షిరాజ్ లోని పింక్ లేక్ ఒక అద్భుతం. షిరాజ్‌లో ఆతిథ్యం కూడా చాలా గొప్పగా అనిపించింది. టెహ్రాన్ సిటీ కూడా. జపాన్‌లో చాలా రోజులు ట్రావెల్ చేశాను. డెన్మార్క్‌లో ట్రావెల్ చేశాను. Faroe ఐలాండ్ నా జీవితంలో ఒక అద్భుతం అన్న మాట కూడా చిన్నదే. స్వర్గం అంటే ఇదేనేమో అనేదానికంటే కూడా ఇంకా ఇంకా అందంగా ఉంది. ఈ ప్రయాణంలో వందల మందిని కలిసాను. ఎంతోమంది సపోర్ట్ చేసారు. కొందరు ఆశ్చర్యపోయారు నవల రాయడం కోసం ఇంత దూరం వచ్చావా అని. సౌత్ ఇండియా ఆల్రెడీ ఎన్నో సార్లు తిరిగాను. కానీ, ఈ నవల కోసం ట్రావెల్ చేయడం కొత్త అనుభూతి. మనిషి అనేవాడు ఆనందంగా జీవించడానికి పుట్టాడనిపిస్తుంది. అదే నిజం కూడా. మనిషిగా పుట్టినందుకు ఈ ప్రపంచమంతా చుట్టేయాలని ఆశ. ట్రావెల్ చేసినంత గొప్పగా ఇంకేమి లేదేమో నా దృష్టిలో. ఒక్క జీవితం. మనతో ఏది రాదూ. మనల్ని మనం గొప్పగా చూసుకుంటే చాలు అనిపించింది ఈ ట్రావెల్ నవల ప్రయాణంలో. నా స్కాటిష్ గర్ల్ నవల నా జీవితంలో గొప్ప అనుభవాలను ఇచ్చింది. ఈ జీవితానికి ఇంతకు మించి ఏమి కావాలి.
ప్రశ్న 13. ఈ నవలకి పాఠకుల ఆదరణ ఎలా ఉంది? విమర్శకుల స్పందన ఎలా ఉంది? నవలని పాఠకులకు ఎలా చేరువ చేయాలనుకుంటున్నారు?
జ: నేను డైరెక్ట్‌గా హైదరాబాద్ బుక్ ఫెయిర్ (డిసెంబర్ 2025) లోనే పబ్లిష్ చేశాను అనివార్య కారణాల వలన. లేకుంటే ఇంకా గొప్పగా పెద్ద స్టార్‌తో పబ్లిష్ చేద్దాం అని ప్లాన్ చేశాను. కొందరు మనుషులు ఆపాలని చూసారు. అయినా ఎవ్వరికి భయపడకుండా నేను సొంతంగా పబ్లిష్ చేసుకున్నాను. అలాగే బుక్ ఫెయిర్‌లో స్టాల్ కూడా సొంతంగా ఈ ఒక్క నవల కోసమే తీసుకున్నాను.
స్కాటిష్ గర్ల్ నవల చదివిన పాఠకులు చాలా గొప్పగా అనుభూతికి లోనవుతున్నారు. ఇలాంటి ఒక కొత్త రకం నరేషన్ ఎప్పుడు చూడలేదు. అలాగే ఆ సినిమాటిక్ విజువల్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంత బాగా నవలను నడిపించారు. తెలుగు పాఠకులకు కొత్తగా వచ్చే రచయితలు కూడా ఇలా ఆలోచించాలి. ఇలాంటి కొత్త తరం నవలలు ఇంకా రాయాలి అనే అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇలాంటి కొత్త దేశాలను దుబాయ్, ఇరాన్, జపాన్, స్కాట్లాండ్ లాంటి ఇంకా ఎన్నో దేశాలను తెలుగు రైటర్స్ కానీ, మిగతా ఏ రైటర్ కూడా రాయలేదు. మాకు అక్కడి ప్రదేశాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క గొప్ప చూపించారు అని ఎంతో ప్రేమను చూపిస్తున్నారు పాఠకులు.
ప్రశ్న 14. భవిష్యత్తులో ఏయే అంశాలను, ఏ ఇతివృత్తాలను నవలలుగా రాయాలనుకుంటున్నారు? వివరించండి.
జ: రెండో నవల 2023లో మొదలు పెట్టాను. అది ఉజ్బెకిస్తాన్, రష్యా, చైనా, థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో జరుగుతుంది. కొంచం డిఫరెంట్ స్టోరీ. ఇప్పటివరకు ఎక్కడ రాని స్టోరీ ఇది. మూడో నవల కూడా మొదలు పెట్టాను కానీ, కొంచం టైం పడుతుంది నార్త్ కొరియా, కొలంబియా, పనామా, ఈక్వెడార్, మెక్సికో, అమెరికా, కెనడా, నేపాల్, పాకిస్తాన్, భూటాన్ లాంటి దేశాల్లో కథ జరుగుతుంది. నాలుగవ నవల ఉక్రెయిన్ నేపథ్యంలో ఒక అమ్మాయి జీవిత కథ ఆధారంగా రాస్తున్నాను. ఉక్రెయిన్ నుండి ఇజ్రాయెల్ చేరిన అమ్మాయి కథ ఇది. ఇంకోటి ఆఫ్రికాలో జరిగే కథ. ఇలా ఓ నాలుగు పెట్టుకున్నాను. రాబోయే రెండేళ్లలో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఒక కొత్త కథతో సినిమా అలాగే ఒక వెబ్ సిరీస్‌ని డైరెక్షన్ కూడా చేయబోతున్నాను. కానీ, ఎన్ని నవలలు రాసిన స్కాటిష్ గర్ల్ మాత్రం చాలా ప్రత్యేకం. ఇంత శ్రమను నేను ఎప్పుడు పడలేదు. అది కేవలం మాటల్లో చెప్పలేనిది.
ప్రశ్న 15. మీకు మైల్స్ పబ్లికేషన్స్ అనే సొంత ప్రచురణ సంస్థ ఉంది. ఇప్పటిదాకా ఏయే పుస్తకాలు ప్రచురించారు? రాబోయే రోజులలో ఎవరి పుస్తకాలు ప్రచురించబోతున్నారు?
జ: అవునండీ! నేను నా నవల స్కాటిష్ గర్ల్ కోసమే ఈ మైల్స్ పబ్లికేషన్స్ స్టార్ట్ చేశాను. 2025 డిసెంబర్లో స్కాటిష్ గర్ల్ నవలతో పాటు “ది జర్నీ అఫ్ ఏ మదర్” అనే నేషనల్ అవార్డు మూవీ “Mrs. Chatterjee vs Norway” గా వచ్చింది. ఆ నవలను ఇంగ్లీష్ అలాగే భారతీయ రీజినల్ భాషల్లో ట్రాన్స్లేషన్తో పాటు పబ్లిషింగ్ రైట్స్ తీసుకున్నాను. ప్రస్తుతం అయితే కొందరివి కథలు చదువుతున్నాను. మంచి క్వాలిటీ రైటింగ్‌తో ఉంటే తప్పకుండా పబ్లిష్ చేస్తాను. అంతే కానీ వాళ్లు అన్ని బుక్స్ పబ్లిష్ చేసారు, వీళ్ళు ఇన్ని బుక్స్ పబ్లిష్ చేసారు కదా అని నేను టైటిల్స్ కౌంటింగ్ మీద దృష్టి పెట్టను. నా మైల్స్ పబ్లికేషన్స్ నుండి బెస్ట్ బుక్స్ రావాలి అదే నా తపన.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శ్యామ్ మైల్స్టోన్ గారూ.
శ్యామ్ మైల్స్టోన్: ధన్యవాదాలు.
***
రచన: శ్యామ్ మైల్స్టోన్
ప్రచురణ: మైల్స్ పబ్లికేషన్స్
పేజీలు: 250
వెల: ₹ 499/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్: ఫోన్: 9000413413
మైల్స్ పబ్లికేషన్స్, ఫోన్: 9966332681
ఆన్లైన్లో:
https://www.amazon.in/Scottish-Girl-Telugu-Original-Romance/dp/8199430990/
~
‘ది స్కాటిష్ గర్ల్’ నవల సమీక్ష
https://sanchika.com/the-scottish-girl-book-review-kss/

