[‘గోవింద్ గార్డెన్స్’ అనే పుస్తకం రచించిన శ్రీ రాజ్ వరదా గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
రచయిత గురించి:
శ్రీరాజ్ వరదా స్వస్థలం పార్వతీపురం (ఆంధ్రప్రదేశ్). దివంగత శ్రీ వరదా రవికుమార్ గారు, శ్రీమతి జయలక్ష్మి గార్ల కుమారుడు. ప్రస్తుతం బెంగళూరులో తన భార్య గౌరి శృతి, ఐదేళ్ల కుమారుడు విరాజ్ కార్తీక్‌తో కలిసి నివసిస్తున్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్, Chartered Financial Analyst (CFA) అయిన ఆయన, Capgemini సంస్థలో Associate Director గా పనిచేస్తున్నారు.
ఆయన తొలి రచన ‘గోవింద్ గార్డెన్స్’, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి భజ గోవిందం (మోహముద్గరం) లోని 31 శ్లోకాల సారాన్ని 31 ఆధునిక జీవిత కథల రూపంలో ఆవిష్కరించే వినూత్న ప్రయత్నం. ఈ పుస్తకానికి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారి ముందుమాట లభించడం ఈ రచనకు విశేషమైన గౌరవంగా భావిస్తున్నారు. పాఠకుడు కేవలం కథను చదవడమే కాదు, తన జీవితాన్ని కూడా ఒకసారి ప్రశ్నించుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది.
ఆయన స్థాపించిన A Varada Publication ద్వారా భారతీయ జ్ఞాన సంపదను ఆధునిక పాఠకులకు చేరవేసే రచనలను తెలుగు నుంచి ఇతర భారతీయ భాషల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో గోవింద్ గార్డెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, నారాయణీయం పారాయణ గ్రంథం, అర్ధనారీశ్వర స్తోత్రం ఆధారంగా కొత్త రచనలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.
ఆయన రచనల వెనుక ఉన్న మూల విశ్వాసం ఒక్కటే – “ప్రతి పాఠకుడిలో దాగి ఉన్న అన్వేషకుడిని మేల్కొలపడం.”
~
సంచిక టీమ్: నమస్కారం శ్రీ రాజ్ వరదా గారూ.
శ్రీ రాజ్ వరదా: నమస్కారం.
~
ప్రశ్న 1: ‘గోవింద్ గార్డెన్స్’ పేరిట పుస్తకం వెలువరిస్తున్నందుకు అభినందనలు. ఈ పుస్తకం ప్రచురణ ఉద్దేశాన్ని వివరించండి.
జ: ముందుగా మీ అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ‘గోవింద్ గార్డెన్స్’ పుస్తకం ప్రచురించాలనే ఆలోచన వెనుక ఒకే ఉద్దేశం ఉంది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ‘భజ గోవిందం’ లోని జీవన సందేశాన్ని నేటి పాఠకుడికి సులభంగా, ఆసక్తికరంగా చేరవేయడం. అందుకే ఆ 31 శ్లోకాల భావాన్ని, నేటి సమాజంలో జరిగే 31 జీవితాల కథల రూపంలో చెప్పే ప్రయత్నం చేశాను.
ఈ పుస్తకం చదివిన తర్వాత పాఠకుడికి ‘భజ గోవిందం’ను ఒకసారి చదవాలనిపిస్తే, లేదా తన జీవితాన్ని మరో కోణంలో ఆలోచించాలనే ప్రేరణ కలిగితే, రచయితగా నా ప్రయత్నం సఫలమైనట్టే భావిస్తాను. ఈ పుస్తకం సమాధానాలు చెప్పడం కోసం కాదు; ప్రతి పాఠకుడిలో ఉన్న అన్వేషణను మేల్కొలిపే ఒక చిన్న ఆహ్వానం.
ప్రశ్న 2: భజ గోవిందం (మోహముద్గరం) లోని 31 శ్లోకాల సారాన్ని కథల రూపంలో పాఠకులకు అందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
జ: భజ గోవిందం చిన్నప్పటి నుంచే వింటూ వచ్చాను. కానీ మనలో చాలామందిలాగే, నేనూ చాలా కాలం దాని శబ్దాన్నే ఆస్వాదించాను; అందులోని లోతైన సందేశాన్ని పూర్తిగా గ్రహించలేదు. తర్వాత ప్రతి శ్లోకాన్ని అధ్యయనం చేస్తూ వెళ్లినప్పుడు, ముఖ్యంగా “భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే” అనే మొదటి పాదం నన్ను ఎంతో ఆలోచింపజేసింది. పైకి చూస్తే అది “మూర్ఖుడా!” అని సంబోధించినట్టుగా అనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే, అది ఎవరినీ అవమానించడం కాదు; అజ్ఞానంలో ఉన్న మనందరినీ ప్రేమతో మేల్కొలిపే గురువు పిలుపు.
ఆ ఒక్క అవగాహనే నాకు ఈ పుస్తకం రాయాలనే ప్రేరణ ఇచ్చింది. భజ గోవిందాన్ని కేవలం పారాయణం చేయడం మాత్రమే కాకుండా, అందులోని ప్రతి శ్లోకాన్ని జీవితంలో ఎలా అనుభవించాలో కథల రూపంలో చూపించాలని అనిపించింది. పాఠకుడు కథ చదివిన తర్వాత, “ఇప్పుడు భజ గోవిందాన్ని మళ్లీ చదవాలి” అనిపిస్తే, అదే ఈ రచనకు నిజమైన విజయం.
ప్రశ్న 3: ఈ ఆలోచనకి కార్యరూపం ఎలా కల్పించారు? ఆలోచన దశ నుండి పుస్తక రూపంలో వచ్చే వరకు జరిగిన ప్రక్రియ ఎలాంటిది?
జ: నిజానికి ఈ ప్రయాణం నా స్నేహితుడు అనిల్ చేసిన ఒక ఫోన్ కాల్‌తో ప్రారంభమైంది. నేను రాసిన కొన్ని చిన్న కథలు చదివిన తర్వాత, వాటిని ఇలాగే ఆపేయకుండా కొనసాగించాలని ఆయన ప్రోత్సహించారు. అదే సమయంలో ఒక రోజు ఇంట్లో అలెక్సాలో భజ గోవిందం వినిపిస్తోంది. ఆ రెండూ కలిసి ఒక ఆలోచనకు నాంది పలికాయి.
మొదటి కథను వాట్సాప్‌లో రాశాను. తర్వాత రెండో కథ, మూడో కథ.. అలా ఒక్కో రోజు ఒక్కో కథ పుడుతూ వెళ్లింది. నిజం చెప్పాలంటే, నేను రాస్తున్నాననే కంటే, ఎవరో నాతో రాయిస్తున్నారనే అనుభూతి ఎక్కువగా కలిగింది. పాఠకులు 31 రోజుల్లో ఈ పుస్తకాన్ని చదవాలని నేను ఆశించినట్లే, ఈ పుస్తకం కూడా దాదాపు 32 రోజుల్లో పూర్తయింది.
ప్రశ్న 4: భజ గోవిందం (మోహముద్గరం) లోని 31 శ్లోకాల సారాన్ని కథల రూపంలో అందించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
జ: అది నాకు చాలా బాధ్యతతో కూడిన పని. ప్రతి కథ రాయడానికి ముందు ఆ శ్లోకంలోని భావాన్ని వివిధ వ్యాఖ్యానాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కథ ఎక్కడా శ్లోకానికి ప్రత్యామ్నాయం కాకూడదు, దాని భావాన్ని నేటి పాఠకుడికి చేరవేసే ఒక వంతెనగా మాత్రమే ఉండాలనే జాగ్రత్త తీసుకున్నాను.
అయితే, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఒక్కో శ్లోకంలో నిక్షిప్తం చేసిన లోతైన తాత్విక అర్థాన్ని పూర్తిగా ఒక కథలో బంధించడం అసాధ్యం. నేను చేసినది, నేటి పట్టణ జీవనశైలికి దగ్గరగా ఉండే ఉదాహరణలతో ఆ భావానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నం పాఠకుడిని అసలు భజ గోవిందం వైపు నడిపిస్తే, అదే నాకు గొప్ప సంతృప్తి.
ప్రశ్న 5: సాధారణంగా భజగోవిందం శ్లోకాలను interpret చేయడం కష్టమని అంటారు. మీరు ఏ అనువాదాలని, ఎవరెవరి వ్యాఖ్యానాలను ప్రామాణికంగా తీసుకున్నారు?
జ: నేను ఒకే అనువాదాన్ని లేదా ఒకే వ్యాఖ్యానాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు. సంస్కృత మూలశ్లోకాన్ని, పదపదార్థాన్ని పరిశీలించడంతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్న పలు అనువాదాలు, సంప్రదాయ వ్యాఖ్యానాలను అధ్యయనం చేశాను. అలాగే శృంగేరి శారదా పీఠం ఆచార్యుల ప్రవచనాలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. వాటి ద్వారా శ్లోకాలలోని తాత్విక భావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం లభించింది.
అంతేకాక, ఇటీవల నాకు ఉడుపి, శృంగేరి, శ్రీరంగం, కుంభకోణం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం వచ్చింది. ఆ ప్రయాణాల్లో పొందిన ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఈ రచనపై ప్రభావం చూపింది. అయితే నా కథలు ఏ ఒక్క వ్యాఖ్యానానికి అనువాదాలు కావు; భజ గోవిందంలోని అసలు సందేశాన్ని నేటి జీవితానికి దగ్గరగా తీసుకువచ్చే ఒక వినయపూర్వక ప్రయత్నం మాత్రమే.
ప్రశ్న 6: ఈ పుస్తకం కోసం ఏ వయసు వారిని లక్ష్యంగా ఎంచుకున్నారు? ఈ పుస్తకం వల్ల వారికి కలిగే లాభం ఏమిటని అనుకుంటున్నారు?
జ: ఈ పుస్తకాన్ని నేను ఒక నిర్దిష్ట వయసు వారిని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. భజ గోవిందంలోని ఒక శ్లోకం మనిషి జీవితంలోని ప్రతి దశను ఎంతో అందంగా చెబుతుంది – “బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోऽపి న సక్తః.” చిన్నప్పుడు ఆటలు, యవ్వనంలో ఇతర ఆకర్షణలు, వృద్ధాప్యంలో చింతలు.. ఇలా ప్రతి వయసులోనూ భగవంతుడిని, జీవిత పరమార్థాన్ని ఆలోచించకుండా ఉండటానికి మనిషికి ఏదో ఒక కారణం ఉంటుందని ఆదిశంకరులు గుర్తు చేస్తున్నారు.
అందుకే ఈ పుస్తకం అన్ని వయసుల వారికీ సంబంధించినది. ఇందులోని కథలు, “జీవితం గురించి ఆలోచించడానికి సరైన సమయం ఇప్పుడే” అనే భావాన్ని సున్నితంగా గుర్తు చేస్తాయి. ఈ పుస్తకం చదివిన తర్వాత పాఠకుడు ఒక్కసారి తన జీవితాన్ని పరిశీలించి, భజ గోవిందంను మరింత లోతుగా చదవాలనే ఆసక్తి కలిగితే, అదే దీనివల్ల కలిగే నిజమైన లాభం.
ప్రశ్న 7: ఆధ్యాత్మిక పుస్తకాలను commercial గా viable చేయడం ఎలా సాధ్యమని భావిస్తున్నారు?
జ: నా దృష్టిలో ఆధ్యాత్మికత, వాణిజ్యం ఒకదానికొకటి విరుద్ధం కావు. మంచి పుస్తకం ఎక్కువ మంది పాఠకులకు చేరాలంటే, అది ప్రచురణ, ముద్రణ, పంపిణీ పరంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా అవసరం. Commercial viability అనేది లక్ష్యం కాదు; మంచి ఆలోచనలు మరింత మందికి చేరేలా చేసే ఒక సాధనం.
నేడు చాలామంది పుస్తకాల కంటే రీల్స్, షార్ట్ వీడియోలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అవి క్షణిక వినోదాన్ని ఇస్తాయి. కానీ ఒక మంచి పుస్తకం మాత్రం మనతో చాలా కాలం ప్రయాణిస్తుంది. అది మన ఆలోచనలను మార్చగలదు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని, జ్ఞానాన్ని అందించగలదు. అందుకే ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా నేటి పాఠకుడికి ఆకర్షణీయంగా, సులభంగా అందించగలిగితే, అవి కూడా విస్తృతంగా ఆదరణ పొందగలవని నేను నమ్ముతున్నాను.
ప్రశ్న 8: ఈ పుస్తకం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనమేమిటని అనుకుంటున్నారు?
జ: ఈ పుస్తకం సమాజాన్ని ఒక్కరోజులో మార్చేస్తుందని నేను చెప్పను. కానీ ప్రతి మార్పు ఒక వ్యక్తి ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఒక పాఠకుడు తన జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుని, తన నిర్ణయాలను మరింత అవగాహనతో తీసుకోవడం ప్రారంభిస్తే, ఆ ప్రభావం కుటుంబంపై, తర్వాత సమాజంపై కూడా కనిపిస్తుంది.
భజ గోవిందం చెప్పే విలువలు కాలాతీతమైనవి. వాటిని నేటి జీవితానికి దగ్గరగా ఉన్న కథల ద్వారా అందించడం వల్ల, ముఖ్యంగా యువతలో చదివే అలవాటు పెరగడం, భారతీయ జ్ఞాన సంపదపై ఆసక్తి పెరగడం, అలాగే జీవితాన్ని కేవలం విజయం లేదా సంపాదన కోణంలో కాకుండా, అర్థవంతంగా చూసే దృష్టి పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను.
ప్రశ్న 9: భగవద్గీత గాని భజగోవిందం గాని వయోవృద్ధుల కోసమని లేదా సాంసారిక విషయాలని త్యజించిన విరాగుల కోసమని ఒక అభిప్రాయం ఉంది. దాన్ని తప్పని ఎలా నిరూపించబోతున్నారు?
జ: నిజానికి అదే అపోహను తొలగించాలనే ఉద్దేశంతో ‘గోవింద్ గార్డెన్స్’ రాశాను. భగవద్గీత కానీ, భజ గోవిందం కానీ జీవితం చివరి దశలో చదవాల్సిన గ్రంథాలు కావు; జీవితాన్ని సరిగ్గా ఎలా జీవించాలో చెప్పే గ్రంథాలు. జీవితం ప్రారంభమైన తర్వాత దారి చూపే పటం అవసరమా, లేక ప్రయాణం పూర్తయ్యాక అవసరమా అనే ప్రశ్న మనం వేసుకోవాలి.
అందుకే ఈ పుస్తకంలోని కథలన్నీ మన చుట్టూ కనిపించే సాధారణ జీవితాల నుంచే వచ్చాయి. ఉద్యోగం, కుటుంబం, సంపాదన, బాధ్యతలు – ఇవన్నీ నిర్వహిస్తూనే ఆధ్యాత్మికతను జీవించవచ్చని చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశం. భజ గోవిందం మనల్ని ప్రపంచాన్ని వదిలేయమని కాదు; ప్రపంచంలో ఉంటూనే వివేకంతో జీవించమని నేర్పుతుంది. అదే సందేశాన్ని నేటి పాఠకుడికి దగ్గర చేయాలనే నా చిన్న ప్రయత్నం.
ప్రశ్న 10: “కొన్నిసార్లు సపోర్ట్ సరిపోదు, నియమాలు పనిచేయవు. అక్కడ ఇంకేదో అవసరం ఉంటుంది” అంటాడు అనిల్ రెండవ కథలో. ఆ ఇంకేదో అనేదాన్ని తెలుసుకోడం ఎలా?
జ: ఆ కథలో అనిల్ చెప్పిన “ఇంకేదో” అనేది ఒక వస్తువు కాదు, ఒక అవగాహన. జీవితంలో కొన్నిసార్లు డబ్బు, పరిచయాలు, నియమాలు, సాంకేతికత అన్నీ ఉన్నా మనసుకు ప్రశాంతత దొరకదు. ఎందుకంటే సమస్య బయట కంటే, మన దృష్టిలోనే ఎక్కువగా ఉంటుంది.
భజ గోవిందం చెప్పేది కూడా అదే. మనలో వివేకం మేల్కొన్నప్పుడు, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం అనే స్పష్టత వచ్చినప్పుడు, ఆ “ఇంకేదో” ఏమిటో మనకు అనుభవంలో తెలుస్తుంది. దాన్ని ఎవరూ బయట నుంచి ఇవ్వలేరు. ప్రతి వ్యక్తి తన జీవిత ప్రయాణంలో స్వయంగా కనుగొనాల్సిన సమాధానం అదే. అందుకే గోవింద్ గార్డెన్స్ కూడా సమాధానాలు ఇవ్వదు; ఆ అన్వేషణను ప్రారంభించే ప్రయత్నం మాత్రమే చేస్తుంది.
ప్రశ్న 11: అన్ని కథల్లో ఇతర పాత్రల ప్రవర్తనని గమనిస్తూ, వారి స్వభావాలని మూర్ఖత్వం అని వ్యాఖ్యానించే తోటమాలి ఆది శంకరయ్య పాత్రకి ఆదిశంకరుల వారు ప్రేరణా?
జ: అవును, ఆది శంకరయ్య పాత్రకు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి నుంచి ప్రేరణ ఉంది. అయితే ఆయనను నేను చారిత్రక వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేయలేదు. భజ గోవిందంలోని జ్ఞానాన్ని నేటి జీవితానికి అనుసంధానించే ఒక మార్గదర్శిగా, తోటమాలి రూపంలో ఆ పాత్రను సృష్టించాను.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆది శంకరయ్య ఎక్కడా ఇతరులను విమర్శించడు. ఆయన చూపించే “మూర్ఖత్వం” అనేది ఒక వ్యక్తిలోని అజ్ఞానం లేదా మోహం మాత్రమే; ఆ వ్యక్తిని కాదు. నిజానికి ఆ కథలు చదివినప్పుడు పాఠకుడు “ఇది వాళ్ల కథ” అని కాకుండా, “ఇందులో నాలో ఎంత ఉంది?” అని తనను తాను ప్రశ్నించుకోవాలి. అదే ఆ పాత్ర ఉద్దేశం.
ప్రశ్న 12: ఆయా పాత్రలకు అంటే లత, మల్లి, విద్వత్, రాణి, అవని, జీవిత్, సాంగత్య్ – లకు ఆ పేర్లు పెట్టడం యాదృచ్ఛికమా లేక వారి స్వభావానికి అనుగుణంగా పెట్టిన ఎంతో ఆలోచించి పెట్టిన పేర్లా?
జ: అవి కేవలం పాత్రల పేర్లు మాత్రమే కాదు. గోవింద్ గార్డెన్స్‌లో లత, మల్లి, విద్వత్, రాణి, అవని, జీవిత్, సాంగత్య్, ఆది శంకరయ్య వంటి పాత్రల పేర్ల నుంచి, గార్డెన్‌లోని మొక్కలు, పూలు, తేనెటీగలు, శ్రీకృష్ణుడి విగ్రహం వరకు దాదాపు ప్రతి అంశం వెనుక ఒక అంతరార్థం ఉంది. అవి కథను అందంగా చూపించడానికి మాత్రమే కాదు; పాఠకుడిని మరింత లోతుగా ఆలోచింపజేయడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన ప్రతీకలు.
ఈ పుస్తకాన్ని ఒకసారి చదివితే కథ కనిపిస్తుంది. రెండోసారి చదివితే ఆ కథ వెనుక దాగి ఉన్న అర్థాలు కనిపిస్తాయి. ప్రతి పేరు, ప్రతి దృశ్యం, ప్రతి చిన్న వివరానికి ఒక కారణం ఉంది. పాఠకుడు వాటిని గమనిస్తూ చదివినప్పుడు, భజ గోవిందంలోని భావం మరింత సహజంగా అనుభూతి అవుతుందని నా నమ్మకం.
ప్రశ్న 13: “మనం మనదనుకున్నది, మన చుట్టూ ఉన్నది – ఏదీ శాశ్వతం కాదు. ఒక్క క్షణంలో దారి మారిపోతుంది” అంటాడు శ్రీరాజ్ 11వ కథలో. ఈ రియలైజేషన్ అతనిలో చాలా తొందరగా వచ్చినట్టు అనిపిస్తోంది కదా? మీరేమంటారు?
జ: నిజానికి శ్రీరాజ్‌కు ఆ అవగాహన ఒక్కసారిగా రాలేదు. ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన – కూలిపోయిన రోడ్డు, మట్టి లేకుండా పెరిగిన మొక్కలు, వర్చువల్ ప్రపంచంలో జీవిస్తున్న జీవిత్, చివరికి ఆది శంకరయ్య చెప్పిన మాట – ఇవన్నీ కలిసి అతనికి ఒకే విషయాన్ని గుర్తు చేశాయి. మనం శాశ్వతం అనుకునే దారి, సంపద, బంధాలు, పరిస్థితులు.. ఏవైనా ఒక్క క్షణంలో మారిపోవచ్చు.
అయితే ఈ కథ చెప్పే సందేశం నిరాశ కాదు. మార్పు అనివార్యం అనే సత్యాన్ని అంగీకరించినప్పుడు, మనం వర్తమానాన్ని మరింత విలువగా జీవిస్తాం. అదే భజ గోవిందం కూడా చెబుతుంది. శాశ్వతం కాని వాటిని శాశ్వతమని పట్టుకోవద్దు; వాటిని ఆస్వాదిస్తూ, వాటి నిజ స్వరూపాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శ్రీరాజ్‌కు ఆ రోజు వచ్చినది అదే అవగాహన.
ప్రశ్న 14: ప్రతి ఇంట్లోను ఆదిశంకరయ్య, మురుమురులాడుతాడు. ఈ ‘మురుమురు’ అన్న పదం ఆంగ్ల పదం Murmur నుంచి తీసుకున్నారా? అంటే సణుగుడు అని అర్థం కదా! నేరుగా సణుగుడు లేదా గొణుగుడు అనే వాడి ఉండచ్చు కదా? లేకపోతే, మరేదైనా అర్థంలో ప్రయోగించారా ఆ పదాన్ని?
జ: “మురుమురు” అనేది నేను ఆంగ్లంలోని murmur నుంచి తీసుకున్న పదం కాదు. అది తెలుగు వాడుకలో ఉన్న పదమే. మెల్లగా, తనలో తానే, అందరికీ వినిపించకుండా మాట్లాడడం అనే భావంలో నేను వాడాను. “సణుగుడు” లేదా “గొణుగుడు” అనే పదాల్లో కొంత అసహనం లేదా విసుగు ధ్వనిస్తుంది. కానీ “మురుమురు” అనే పదంలో మాత్రం ఒక మృదుత్వం, మనసాక్షి చేసే నిశ్శబ్ద సంభాషణ కనిపిస్తుంది. అందుకే ఆ పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నాను.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గోవింద్ గార్డెన్స్ లోని అన్ని ఇళ్లలో ఆది శంకరయ్య మురుమురు ఆడలేదు. కొన్ని ఇళ్లలో మాత్రమే ఆయన మురుమురు ఆడతారు; మరికొన్ని ఇళ్లలో అసలు మురుమురే ఆడరు. ఎందుకంటే ఆ ఇంట్లోని పాత్రలే తమ జీవితాల ద్వారా పాఠకుడికి ఎలా జీవించాలో చూపిస్తాయి. కానీ మురుమురు ఆడిన చోట మాత్రం అది ఒక మెల్లని హెచ్చరిక, ఒక ఆత్మపరిశీలన. శ్రీరాజ్, అనిల్ కూడా ఆ మురుమురును తమతో తీసుకుని తర్వాతి ఇంటి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఒక రోజు చూసిన అనుభవం, మరుసటి రోజు కొత్త అవగాహనగా మారుతుంది. ఆ మురుమురు నిజానికి ఆది శంకరయ్యది మాత్రమే కాదు.. ప్రతి పాఠకుడి మనసాక్షి స్వరం.
ప్రశ్న 15: “వెలిగించాల్సింది దీపాలు కాదు.. మనసే” అన్నది అద్భుతమైన పరిశీలన. ఈ అవగాహనని అందరిలో ఎలా కల్గించవచ్చని మీ అభిప్రాయం?
జ: ధన్యవాదాలు. ఆ కథలో నేను చెప్పాలనుకున్నది యాత్రలు, వ్రతాలు, దానాలు లేదా దీపాలు వెలిగించడం తప్పు అని కాదు. అవన్నీ ఎంతో విలువైనవే. కానీ “ఎందుకు చేస్తున్నాం?” అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉన్నప్పుడే అవి సంపూర్ణతను పొందుతాయి. గంగ పాత్రను చూడండి. ఆమె పూరీ జగన్నాథుడి ఆలయానికి వెళ్లింది, అక్కడి నుంచి కృష్ణుడి విగ్రహం కూడా తెచ్చుకుంది. కానీ ఆ విగ్రహంలో కృష్ణుడితో పాటు ఉన్నది ఆయన సోదరి సుభద్రమ్మ, సోదరుడు బలరాముడు అని తెలియక, రుక్మిణి అనుకుంది. యాత్ర జరిగింది, భక్తి కూడా ఉంది. కానీ ఆ యాత్ర వెనుక ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం మాత్రం లోపించింది.
ఈ అవగాహనను ఎవరూ బలవంతంగా కలిగించలేరు. మంచి గురువులు, మంచి పుస్తకాలు, జీవిత అనుభవాలు, ముఖ్యంగా ప్రశ్నించే మనస్తత్వం దానికి దారి చూపుతాయి. ఆచారాన్ని అనుసరించడం ఒక మంచి ప్రారంభం. కానీ ఆ ఆచారం వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినప్పుడు, నిజంగా వెలిగేది దీపం కాదు.. మనసే.
ప్రశ్న 16: “లైఫ్ స్కిల్‌ని జీవితం నేర్పిస్తుంది. గీత అర్థం ఇవాళ రాకపోవచ్చు. కానీ అవసరం వచ్చినప్పుడు ఇవే మాటలు మనసులో పూస్తాయి” అంటుంది ఉపాధ్యాయుడి భార్య, 20వ కథలో. అంటే బాల్యంలో అర్థం కాకపోయినా, చదివి గుర్తుంచుకుంటే, భగవద్గీత శ్లోకాలు తదుపరి జీవితంలో ఉపకరిస్తాయని చెప్పడమే కదా? కానీ ఆటపాటలతో సాగే బాల్యంలోనూ, చదువుల వేటలో గడిచిపోయే కౌమారం లోను, ఉద్యోగ ఉపాధుల అన్వేషణలో సాగే యవ్వనంలోనూ గీతని మనసులో స్థిరంగా నిలుపుకోడం ఎలా? అని మీరు భావిస్తున్నారు?
జ: అవును, అదే భావాన్ని చెప్పాలనుకున్నాను. ఈ కథ పూర్తిగా కల్పితం కాదు; నా జీవితంలో నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరైన దివంగత నేరెళ్ల నారాయణ మూర్తి గారు, పార్వతీపురం సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు, వారి జీవితానికి ప్రేరణగా రాసిన కథ. ఆయన జీవన విధానం, సరళత, పిల్లల పట్ల ప్రేమ, గీతను బోధించిన తీరు నాపై చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా, గుడిసెల్లో, బస్తీల్లో నివసించే చిన్నారులను తన సొంత పిల్లల్లాగే చూసుకుంటూ, వారికి ఉచితంగా భగవద్గీత బోధించేవారు. వారిలో ఎంతో మంది తర్వాత జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగారు. అది గీత ఒక్కటే చేసిన అద్భుతం అని నేను చెప్పను; కానీ చిన్నప్పుడే వారి మనసుల్లో నాటిన విలువల విత్తనం వారి జీవిత ప్రయాణంలో ఎంతో తోడ్పడిందని నేను నమ్ముతాను.
ఆయన భార్య చెప్పిన “లైఫ్ స్కిల్‌ని జీవితం నేర్పిస్తుంది. గీత అర్థం ఇవాళ రాకపోవచ్చు. కానీ అవసరం వచ్చినప్పుడు ఇవే మాటలు మనసులో పూస్తాయి” అనే భావమే ఈ కథకు ప్రాణం. బాల్యంలో గీతను పూర్తిగా అర్థం చేసుకోవాలని కాదు; దాని విత్తనాన్ని మనసులో నాటాలని. జీవితమే ఒకరోజు ఆ విత్తనాన్ని మొలకెత్తిస్తుంది. అప్పుడు మనం గీతను గుర్తు చేసుకోము.. గీతే మన జీవితాన్ని గుర్తు చేస్తుంది.
ప్రశ్న 17: ప్రతీ కథ చివర పాఠకులకు ప్రశ్నలు వేసి, జవాబులు వ్రాయటానికి స్థలం కేటాయించారు. చదువరులలో ఆలోచనలు రేకెత్తించడానికో లేదా తమను తాము తెలుసుకోడానికో.. ఈ పేజీల్లో రాసుకునే జవాబులు సరిపోతాయని భావిస్తున్నారా? లేక ఇంకేమైనా చేయాలా?
జ: ఆ ప్రశ్నలకు సరైన, తప్పు జవాబులు ఉండవు. అవి పరీక్ష కోసం కాదు; ఆత్మపరిశీలన కోసం. అందుకే ప్రతి కథ చివర పాఠకుడు రెండు నిమిషాలు ఆగి, తన గురించి తాను ఆలోచించాలని ఆ ప్రశ్నలను ఉంచాను. ఆ జవాబులు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. అవి పుస్తకంతో కాదు, మనతో మనం చేసే సంభాషణ.
ఇంకో విషయం కూడా పాఠకులు గమనించాలని కోరుకుంటాను. ప్రతి కథలోని మూడో భాగం, తర్వాతి రోజు కథలోని మొదటి భాగంతో అనుసంధానమై ఉంటుంది. ఒకరోజు చూసిన అనుభవం, ఆ రాత్రి మనసులో మథనమై, మరుసటి రోజు శ్రీరాజ్–అనిల్ సంభాషణలో కొత్త ఆలోచనగా బయటపడుతుంది. అంటే, ఆలోచనలు వెంటనే స్థిరపడవు; వాటికి సమయం కావాలి. నేను ఈ పుస్తకాన్ని 31 రోజుల్లో రాశాను. అలాగే పాఠకుడు కూడా 31 రోజుల ప్రయాణం చేయాలని ఉద్దేశపూర్వకంగానే రూపకల్పన చేశాను.
ఆ ఖాళీ పేజీలు కేవలం జవాబులు రాయడానికి కాదు; ఒక రోజు ఆగి, ఆలోచించి, మన అనుభవాలను కథతో కలిపి చూసుకోవడానికి. ఇంకా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి చదివితే, ఒక్కో కథ ఎన్నో కొత్త సంభాషణలకు, భిన్నమైన ఆలోచనలకు దారి తీస్తుంది. నా దృష్టిలో, ఆ సంభాషణలే ఈ పుస్తకానికి నిజమైన కొనసాగింపు.
ప్రశ్న 18: ఈ పుస్తకాన్ని ఎలా మార్కెటింగ్ చేయదలచారు? ఈ విషయంలో మీ ఆలోచనలేమిటి?
జ: నిజం చెప్పాలంటే, ఈ పుస్తకాన్ని నేను కేవలం అమ్మాలని కాదు, చదివించాలని అనుకుంటున్నాను. అందుకే సాధారణ మార్కెటింగ్ కంటే, పాఠకులతో ఒక ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రయత్నించాను. పుస్తకం విడుదలకు ముందే పాఠకులతో కలిసి 31 రోజుల కౌంట్‌డౌన్, చిన్న కథలు, కామిక్స్, సంభాషణలు పంచుకున్నాం. మొదటి 116 మంది పాఠకులను Founding Readersగా ఆహ్వానించి, ఈ ప్రయాణంలో భాగస్వాములను చేశాం.
ఈ పుస్తకానికి ఉత్తమమైన మార్కెటింగ్ ప్రకటనలు కాదు; పాఠకుల అనుభవాలే అని నేను నమ్ముతున్నాను. ఒక పాఠకుడు ఈ పుస్తకం గురించి మరో పాఠకుడికి చెప్పడం, స్నేహితులతో కలిసి చదవడం, ఒక్కో కథపై చర్చించడం – అదే దీని నిజమైన ప్రచారం. మంచి పుస్తకానికి చివరికి అత్యంత బలమైన మార్కెటింగ్ పాఠకుడి హృదయం నుంచి వచ్చే సిఫార్సే.
ప్రశ్న 19: మీ ప్రచురణ సంస్థ గురించి, మీ ఆశయాల గురించి చెప్పండి.
జ: A Varada Publication ఒక ప్రచురణ సంస్థ మాత్రమే కాదు; భారతీయ జ్ఞాన సంపదను నేటి పాఠకుడికి సులభంగా, ఆసక్తికరంగా, ఆలోచింపజేసే రూపంలో అందించాలనే ఒక చిన్న ప్రయత్నం. మా ప్రయాణం తెలుగు నుంచి ప్రారంభమైనా, త్వరలోనే ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో కూడా ఇటువంటి రచనలను తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. భాష మారినా, సందేశం మాత్రం ఒకటే.
మా ఆశయం కేవలం పుస్తకాలు ప్రచురించడం కాదు. ప్రతి పాఠకుడిలో దాగి ఉన్న అన్వేషకుడిని మేల్కొలపడం. ఒక మంచి పుస్తకం పాఠకుడిని ఆసక్తి నుంచి అన్వేషణకు, అన్వేషణ నుంచి ఆలోచనకు, ఆలోచన నుంచి అవగాహనకు, చివరికి ఆచరణకు తీసుకెళ్లాలని మేము విశ్వసిస్తున్నాం. అదే మా ప్రచురణ సంస్థకు మూల తత్వం. అందుకే మా ప్రతి పుస్తకం కేవలం ఒక కథను చెప్పడానికి కాదు; ఒక ఆలోచనను వెలిగించడానికి, ఒక అన్వేషణను ప్రారంభించడానికి పుడుతుంది.
ప్రశ్న 20: ప్రచురణ రంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? మీ సంస్థ నుంచి ఏ తరహా పుస్తకాలు రానున్నాయి?
జ: ప్రస్తుతం మా దృష్టి ‘గోవింద్ గార్డెన్స్’ ను మరింత మంది పాఠకులకు చేరవేయడంపైనే ఉంది. త్వరలోనే ఈ పుస్తకాన్ని ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో కూడా తీసుకురావాలని ప్రణాళిక చేస్తున్నాం. అలాగే సులభంగా పారాయణం చేసుకునే ‘నారాయణీయం పారాయణ గ్రంథం’, అర్ధనారీశ్వర స్తోత్రం ఆధారంగా ఒక ఆధునిక కథా రచన వంటి మరికొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎప్పుడు, ఎలా రూపుదిద్దుకుంటాయో కాలమే నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం ‘గోవింద్ గార్డెన్స్’ తెలుగు పుస్తకాన్ని 9731077692 నంబర్‌కు కాల్ చేయడం లేదా వాట్సాప్ చేయడం ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. త్వరలోనే అమెజాన్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. మా ప్రతి పుస్తకం వెనుక ఒకే సంకల్పం ఉంటుంది – ప్రతి పాఠకుడిలో దాగి ఉన్న అన్వేషకుడిని మేల్కొలపడం. ఆ ప్రయాణంలో పాఠకుల ప్రేమ, ఆదరణే మా అతిపెద్ద బలం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ రాజ్ వరదా గారూ.
శ్రీ రాజ్ వరదా: ముందుగా సంచిక పత్రిక బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు సాహిత్యాన్ని, కొత్త రచయితలను, విలువైన రచనలను పాఠకులకు చేరవేయడానికి మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఇటువంటి వేదికలు ఉండటం వల్లే మంచి పుస్తకాలు మరింత మంది పాఠకుల వద్దకు చేరే అవకాశం కలుగుతోంది.
ఈ ఇంటర్వ్యూ ద్వారా ‘గోవింద్ గార్డెన్స్’ గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు. ఈ పుస్తకం పాఠకులను ఆలోచింపజేసి, భారతీయ జ్ఞాన సంపద వైపు మరొక అడుగు వేయించే చిన్న ప్రయత్నంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
***
రచన: శ్రీరాజ్ వరదా
ప్రచురణ: ఎ వరదా పబ్లికేషన్
పేజీలు: 266
వెల: ₹ 516/-
ప్రతులకు:
ఎ వరదా పబ్లికేషన్,
ఫోన్: 9739097692
ఈమెయిల్: care.varadapublications@gmail.com
~
‘గోవింద్ గార్డెన్స్’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/govind-gardens-book-review-kss/

