[‘గ్రీన్ లైట్ ఏరియా’ అనే కథాసంపుటి వెలువరించిన వడలి రాధాకృష్ణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం వడలి రాధాకృష్ణ గారూ.
వడలి రాధాకృష్ణ: నమస్కారం.
~
ప్రశ్న 1: మీరు రచించిన 20 కథల సంపుటికి శీర్షికగా 7వ కథ ‘గ్రీన్ లైట్ ఏరియా’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ఈ ‘గ్రీన్ లైట్ ఏరియా’ కథ ఓ ప్రముఖ మాసపత్రికలో ప్రచురింపబడినప్పుడు విశిష్ట కధారచయిత శ్రీ శ్రీకంఠస్పూర్తి గారు నాకు ఫోన్ చేసి ‘ఈమధ్య కాలంలో ఏ రచయితా సృశించని మంచి సబ్జెక్ట్ అని, జీవం కల్గిన గొప్ప ఆలోచనాత్మక ఇతివృత్తం’ అని కొనియాడటం నాకు అలవికాని సంతృప్తినిస్తూ వచ్చింది.
జీవితంలో దగా పడిన స్త్రీమూర్తులు, విధివంచితులు, మగాడి చేత వంచనకు గురి అయి, రోజులు గడవని దీనదశలో దిక్కులేక ఒళ్ళు అమ్ముకోవాల్సి రావడం, ఆ పడుపువృత్తిలో కొనసాగుతూన్న ‘రెడ్ లైట్ ఏరియా’ సమాజం తాలూకు అంతరంగ సంవేదనాలు, ఆక్రోశాలు, ఆక్రందనలు; లుప్తమవుతూన్న జీవనేతిహాసాల ఔదార్యతలు, ఉదారతలను స్పృశించి, సమగ్రంగా చర్చకు తెర తీసినప్పుడు – ‘మేము చేస్తున్నది తప్పుగా భావించడం లేదు, మేము మనుషులుగా నలిగిపోతున్నా పునరంకిత భావనలతో మీ సంసార జీవికకు రక్షణ కవచాలుగా నిలువగల్గుతున్నామ’ని హంసలక్ష్మి పాత్ర ద్వారా చెప్పించడం ఈ ప్రపంచాన పడుపు వృత్తి మాటున ‘అమ్మతనాన్ని’ ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నం ఈ ‘గ్రీన్ లైట్ ఏరియా!’ కథ.
‘గ్రీన్ లైట్ ఏరియా’ కథలో జాగృతి వుంది. అర్థం చేసుకుంటే.. కథ చిట్టచివరి ఒక ‘అమ్మా’తో ముగిసింది.
“It is a thought provoking story” అని శ్రీ వల్లూరి విజయకుమార్ గారు చెప్పడం, బహుశా నేను ఈ సంపుటికి ‘గ్రీన్ లైట్ ఏరియా’ కథ పేరును ఖరారు చేయడానికి గట్టి కారణం కాగల్గుతుంది.
ప్రశ్న 2: కవిగా, కథా రచయితగా, మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
వీటన్నింటికిముందు ప్రఖ్యాత సాహితీ విమర్శకులు శ్రీ వడలి మందేశ్వరరావు గారు మాకు దూరపు బంధువు. నాకు తాత వరుస అవుతారు. నాకు స్పూర్తి, ప్రేరణ వారి జీవన గమనం.
కథారచయితలుగా మధురాంతకం రాజారాం మునిపల్లె రాజు, శీలా వీర్రాజు, వేదగిరి రాంబాబు; తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో నాకు సీనియర్, ఇప్పటి ప్రఖ్యాత రచయిత శ్రీ పి.వి.ఆర్. శివకుమార్ గారు ఇత్యాది విశిష్ట కథక చక్రవర్తులు నాకు ఇచ్చిన ప్రోత్సాహాలు ఎన్నటికీ మరువజాలనివి.
నేను అంతకు ముందు కొన్ని రచనలు చేసినా, చాలా సీరియస్‌గా దృష్టి పెట్టి కథారచనలో సాధన చేస్తున్నది 1995 సంవత్సరం నుండే. నా రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, స్వాతి, విపుల ఇత్యాది పత్రికలలో నిరంతరం ప్రచురింపబడటం ద్వారా నాకు నేనుగా కాన్ఫిడెన్స్ లెవెల్‍ను పెంచుకోసాగాను.
తర్వాత కొన్ని సంకలనాలకు కవితలు వ్రాయడం ద్వారా తదనంతర కాలంలో కవిత్వం పట్ల కూడా దృష్టి సారించగలిగాను.
ప్రశ్న 3: కవిత/కథ వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: ఇది చాల మంచి ప్రశ్న. నాకు మటుకు కవిత, కథ – వీటిల్లో కవిత్వం వ్రాయడం కొంత కష్టమని అనిపిస్తుంది.
కథా సాహిత్యం అంటే శిల్ప సౌందర్యం, పాత్రల ప్రామాణికం, పాత్రల విస్తృతి, పాత్రలు, సన్నివేశాలు లోని విరుద్ధ నైజాల తాలూకు ప్రకంపనాలు, భావసారూప్యాల తాలూకు వాస్తవాలు..
కానీ కవిత్వం అనేది దానికి తద్భిన్నం! పదాల సాంద్రత ముఖ్యం.. పదప్రయోగాల తాలూకు ప్రయోజనం, ఔచిత్యం, చెప్పాలనుకున్న దాన్ని చెప్పాల్సిన రీతిలో ప్రక్కకు జరగకుండా చెప్పాల్సిరావడం..
ఎలుగెత్తిన ప్రాకృతిక మర్మాలను లోలోపల ప్రభావశీలకంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించాల్సించడం.. అంతలోనే ప్రక్కకు ఒదిగి సరిగా ఆవిష్కరించలేక, బిగించిన ఓ చట్రంలో బందీగా మిగిలిపోవల్సి రావడం, అంతలోనే అనివార్యంగా రాజీపడి రంగరించిన పదాల అల్లికలను తారుమారు చేయాల్సి రావడం.. సమగ్రంగా చెప్పాలంటే కవిత్వ రచనలో సాధన, శోధన చాలా ఎక్కువగా అవసరమవుతాయి.
ప్రశ్న 4: ఇది మీ తొమ్మిదో కథాసంపుటి. మీరు ఇప్పటికి 600కి పైగా కథలు వ్రాశారు. మీ తొలి కథ నాటి నుంచి తాజా కథ వరకూ – పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్‍డేట్ అయ్యారు?
జ: అవునండి. ఈ ‘గ్రీన్ లైట్ ఏరియా’ నా తొమ్మిదవ కధా సంపుటి. కథారచయితగా నేను మూడు తరాల పాఠకున్ని చేరుకోగలిగానని భావిస్తాను.
మొదట్లో ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ముఖ్యపాత్రలను కథలో ప్రవేశ పెట్టాల్సి వచ్చినపుడు, వాటి తాలూకు ఔచిత్యాలను విశదీకరించాల్సి వచినప్పుడు పేజీలకు పేజీల వర్ణనలు వ్రాయాల్సి వచ్చేవి. అప్పటి పాఠక దేవుళ్ళు ఆ తరహా రచనాలను ఎక్కువగా ఆదరించేవారు. ఆ తర్వాత వస్తు సమగ్రత, శిల్ప ప్రామాణికం, ముఖ్య పాత్రల చుట్టూ పరిశ్రమించే ఉపపాత్రల తాలూకు ఉదారతలు.. ఇవన్నీ కథన రీతుల్లో సుస్పష్టంగా చెప్పాల్సి వచ్చేది. అప్పుడే ఆ రచనలు జనాలలో బాగా పండేవి. పత్రికల వారు కూడా ఆ తరహా కథలను బాగా ఆదరించేవారు.
కానీ తర్వాత జనరేషన్లలో మారిన సామాజిక స్థితిగతులు, ప్రపంచం తాలూకు ప్రామాణికాలు, మధ్యలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ తాలూకు సత్ఫలితాలు, దుష్పరిణామాలు.. బలంగా ఎలుగెత్తుతూ ముందుకు పరుగులు తీస్తున్న వాదాలు.. ఇవన్నీ కథా ప్రక్రియ మీద, కథా రచయితల శైలి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతూ వస్తున్నాయి.
అప్పుడు రచయిత సమాజాన్ని సమగ్రంగా చెప్పాల్సిరావడం.. వాస్తవం వెనుకున్న ప్రామాణికతలను, జీవన క్రమాలను గట్టిగా చర్చించాల్చి వచ్చింది.
స్థూలంగా చెప్పాలంటే పత్రికలవారు అప్పట్లో 10 నుండి 16 పేజీల కథలును ప్రోత్సహించేవారు. తర్వాత 8 నుండి 12 పేజీలు.. ఇప్పుడు కేవలం 4 పేజీలకు మించకుండా వ్రాసిన కథలను ఆదరిస్తున్నారు. పాఠక దేవుళ్ళ అభిరుచికి అనుగుణంగా అంతర్లీనంగా కథా కథన రీతుల్లో వస్తున్న మార్పులుగా మనం దీనిని చెప్పుకోవల్సి ఉంటుంది.
ప్రశ్న 5: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: చెప్పాలంటే గత 32 సంవత్సరాలుగా అంతగా అభివృద్ధికి నోచుకోని, వెనకబడిన ప్రాంతమయిన సముద్రతీర పట్టణం చీరాలలో ఉద్యోగరీత్యా నివసిస్తూ ఉన్నాను.
నా చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కువగా స్టూవర్టుపురం ప్రాంత ప్రజానీకానికి సంబంధించిన దయనీయత, వెనుకబాటుతనం.. వేలాది చేనేత కార్మికుల జీవన వెతలు, వృత్తి పట్ల నైరాశ్య ధోరణులు.. సముద్రతీర మత్యకారుల కల్లోల జీవితాలు, విద్వంసకరమైన జీవన వెతలు, అలాగే వ్యవసాయ రంగంలోని రైతన్నల అగచాట్లు, ప్రతికూల వాతావరణ నేపథ్యాలు, దళారీ వ్యవస్థల మోసాలు, వారి దుర్మార్గాలు.. ఇలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీరి అగచాట్లు, హాలాహలాలు ఇవన్నీ నా కథావస్తువులు కాగల్గుతున్నాయి.
శిల్పం ప్రామాణికమై అలరారాలని, శైలిలో సమగ్రత సాధించాలని నిత్యం మథన పడుతూన్నాను. నా కథలు ఆయా వర్గాల మనోభావాలకు దగ్గరవ్వాలని, చదివిన వారికి నా రచనలు సమగ్రమైన లేపనంగా అలరారాలని అనివార్యంగా వస్తువుకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు.
ప్రశ్న 6: “సమాజంలోనూ మనిషి బతుకులోనూ ఉండే సహజత్వం చాలా కథల్లో వ్యక్తమైంది” అని వ్యాఖ్యానించారు విహారి గారు తమ ముందుమాటలో. కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత సన్నిహితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: విహారి గారు తెలుగు సాహితీ ప్రపంచం గర్వింపదగిన అగ్రశ్రేణి సాహితీ విమర్శకులు. వారి మాటలు నాతో సహా ఎందరికో ఐయస్ఐ సర్టిఫికెట్ లాగ నిలుస్తాయి.
నాకు ఈ కథా రచనా వ్యాసంగం ఊపిరిలాంటిది. సమగ్రత నిండిన వస్తువైవిధ్యంతో, రూపాంతరం చెందుతూన్న కాల నైజాలను, సమాజంలోని మార్పులు, ప్రభుత్వం ప్రకటిస్తున్న క్రొంగొత్త విధివిధానాలు, చట్టాలు, వాటి తాలూకు మారుతూన్న సామాజిక పరిణామాలను కథాంశాలుగా తీసుకొని రచనలు చేయాలన్నది నా ఆకాంక్ష. నా తపన కూడాను. ఇంత వరకూ నా అడుగులు అన్నీ అటు వైపుగానే పడుతూ ఉన్నాయి.
ఇంతకు ముందు చెప్పినట్లు చీరాల లాంటి చైతన్యవంతమైన వెనుకబాటు ప్రాంతంలో స్థిరపడటం ఒక విధంగా అదృష్టంగానే భావిస్తాను.
ఇక్కడి సమాజానికి కథాగౌరవాలను ఆపాదించాలని మనసారా కోరుకుంటూన్నవాడిని.
నేను ఉద్యోగం చేసిన ITC కంపెనీలో ప్రాసెసింగ్ మేనేజర్‌ని నేను. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది కార్మికులకు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉండేవాడిని. వారు అందరూ యథేచ్ఛగా వారి సమస్యలను, వ్యక్తిగత విషయాలను నిర్భీతితో నాతో చర్చిస్తూ ఉండేవారు. వాటిలోని భయానకమైన నిజాలు, ప్రగతిదాయక పరిణామాలు, దోపిడీ సమాజం తాలూకూ బాహ్య ప్రపంచం అంతగా పట్టించుకోని ఎన్నో తెలియని విషయాలను ఏకరువు పెడుతూ ఉండేవారు.
అవన్నీ నా రచనలకు ప్రాథమికమైన మూలాలుగా, ఆనక దినుసులుగా అలరారుతాయి. నాది చాలా సున్నితమైన వ్యవహార సరళి!
అప్పట్లో నాకిష్టమైన నాయకుడు రాజీవ్ గాంధీ హత్యానంతరం చాలా వేదనతో కథ వ్రాయాలనుకున్నాను. తెలియని ఆవేదనతో కలం ముందుకు కదలలేదు. ఆ కథను ఎలాగైనా రాయాలనిపించి పనికొట్టుకొని శ్రీ పెరంబుదూర్ వెళ్ళి ఆయన స్మృతివనాన్ని చూసి వచ్చి, దాని తాలూకు అంతరంగ అలజడుల మధ్య ఆ కథను సమర్థవంతంగా వ్రాయగలిగాను. అలాగే మాకు సమీపంలోని చిలకలూరి పేట బస్సు దహనం సంఘటన జరిగిన తర్వాత దాని మీద ఓ కథ వ్రాయాలనుకున్నాను. కానీ వ్రాయలేక పోయాను.
అప్పుడు ఆ ఘటనా స్థలం దగ్గరకు వెళ్ళి ఆవేదనతో అక్కడే ‘కలుపు మొక్కలు’ కథ పూర్తి చేశాను. నాది విచిత్రమైన సున్నిత భావనలు నిండిన వ్యవహార శైలి.
ప్రశ్న 7: “వడలి రాధాకృష్ణ కథలు చదువుతుంటే సముద్రాన్ని, సముద్రమంతటి లోతును కలిగిన మనిషిని దగ్గరగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది” అన్నారు గుడిపాటి గారు తమ ముందుమాటలో. సుదీర్ఘ కాలం పాటు సముద్ర తీర పట్టణంలో నివాసముంటున్న మీకు సముద్రంతో ఎటువంటి అనుబంధం ఉంది? ఈ పుస్తకంలోనే కాకుండా, మీ ఇతర ఏ కథల్లో సముద్రం ప్రధాన పాత్ర అయిందో చెప్తారా?
జ: సాహిత్యపరంగా గుడిపాటి గారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మహనీయులు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
చీరాల, వేటపాలెం, బాపట్ల ప్రాంతాల సముద్రతీరం ఆంధ్రావనిలోనే చాలా ప్రత్యేకమైనది! పేరెన్నిక గన్నదీను!! ఈ ప్రాంత సముద్రం నిత్యం అనేక ఆటుపోట్లకు, ఆనక కొన్ని సౌమనస్యాలకు ప్రతీక అని ఇక్కడ మత్సకారులు చెబుతూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలోని మత్స్య సంపద అపారం. వేరే ప్రాంతాలలో కనిపించని ప్రామాణికమైన మత్స్య సంపద ఇక్కడ జాలరులకు లభిస్తూ ఉంటుంది.
ఈ సముద్రం మీద బ్రతికే కుటుంబాలు కొన్ని వేలు ఇక్కడ ఉన్నాయి. వారి మాటల్ని, వారి భాషలో ఆలకించినపుడు వీరి జీవితాలు ఇంత దుర్భరంగా ఉంటాయా అనిపిస్తుంది. పైకి ఇంత అందంగాను, ఆహ్లాదం గాను ఉండే సాగరం ఉండుండి ఇంత బీభత్సాలను సృష్టిస్తుందా అని బాధపడతాము. నా వంతుగా వారి కల్లోల జీవితాలను కొంతవరకైనా అక్షరీకరించాలన్నది నా తపన.
గణనీయం, సూర్యచంద్రుల నడుమ, నిర్మాల్యం, తరగని వాస్తవం, కాలం కవ్వించింది, తుంటిరెక్క పురుగులు, సముద్రం మూతబడింది, పాలవన్నె, అల్లుడొచ్చేసినాడు, నిమజ్జనం, మరో ఉప్పెన, సముద్రానికి తెలుసు, పాల నురుగు, ఇత్యాది కథలు సముద్ర నేపథ్యంలో వ్రాసినవి.
గతంలో ‘మంచి నీటి సముద్రం’ అనే కథ వ్రాశాను. కానీ ఆ కథలో సముద్ర ప్రస్తావన ఎక్కడా కానరాదు. సముద్ర గాంభీర్యతను మనిషి తత్వంతో వారి తాలూకు తాత్విక భావనలకు అనుసంధానం చేసి వ్రాసిన కథ అది.
ఇవన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడి, కొన్ని బహుమతులను కూడా తెచ్చిపెట్టిన కథలు.
ప్రశ్న 8: ‘నల్ల నందివర్ధనం’,’తెల్ల చీకటి’ ఈ రెండు కథల పేర్లకీ వస్తువు(నందివర్ధనం/చీకటి)కి ఉండే సహజ లక్షణాన్ని సూచించే విశేషణం కాకుండా, వ్యతిరేక విశేషణాన్ని జోడించారు. ఈ ప్రయోగం గురించి, ఈ కథల నేపథ్యం గురించి చెప్తారా?
జ: మాకు ప్రక్కనే ఉన్న తెనాలి పట్టణంలో ఒక దళిత యువతి రోడ్డుమీద నడిచి వెళుతున్నప్పుడు, పీకల దాకా తాగి ఉన్న యువకులు ఆమెను అపహాస్యం చేయడం మొదలుపెట్టారు. ఆమె తట్టుకోలేక వారికి ఎదురు తిరిగి మాట్లాడింది. ఆ సందర్భంలో దురదృష్టవశాత్తూ అటుగా రోడ్డు మీద వెళ్తూన్న లారీ వెనుక చక్రం క్రిందపడి దుర్మారణం చెందింది.
అది నా ఈ ‘నల్ల నందివర్ధనం’ కథ వ్రాయడాన్ని ప్రేరణ.
ఆమె మరణ సందర్భాన్ని స్థూలంగా విశ్లేషించుకుంటూ వెళ్ళినప్పుడు అనేక సామాజిక నేపథ్యాలు, అసమ జీవన విధానాలు, వర్గ అసమానతలు కానవస్తాయి. దాన్ని వస్తువుగా తీసుకొని సున్నితమైన నందివర్ధనం పుష్పం వంటి చక్కటి పరిమళభరితమైన జీవితాన చిట్లిన చీకటి చారికల వంటి కల్లోల క్రమాలతో అన్వయించి వ్రాసిన ఉదాత్తమైన కథ ఇది. దాని మూలాలకు కొంత పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం చేశాను ఇందులో.
అలాగే ‘తెల్ల చీకటి’ కథలో సోమ శేఖరం పాత్ర ద్వారా మనిషి తాలూకు మహతీమయ అనుసృజనాలను, అలవి కాని అంతరంగ సంవేదనాలను క్రోడీకరించి వ్రాయడం జరిగింది.
తనవైన చరమాంకపు అవసరాల కోసం, లోచూపుతో ఒక మధ్యతరగతి యువ దంపతులను చేరదీసి వారి దగ్గర కొంత ధనాన్ని దాచడం..
ఆ ధనాన్ని ఆసరాగా చేసుకొని వారు కొంత వరకు స్థిరపడటం, ఆనక జీవితాన కొంత పరిణితి సాధించి అందుకున్న ప్రతిఫలాల మూలంగా నిలదొక్కుకొని, ఆ పెద్దాయన పట్ల బాధ్యతను పెంపొందించుకోవడం. ఆ విశ్వాసమై అలరారిన క్రమాన్ని విశదీకరించిన వర్తమాన సమాజ జీవన చిత్రాల తాలూకు శోధన క్రమాన్ని సమగ్రంగా చెప్పడం జరిగింది.
విరోభావనా సంవేదనలను కథలకు శీర్షికలుగా చేసుకొని, వ్యతిరేకమైన ద్వంద్వ నైజాల మధ్య కథాంశాన్ని పరిపుష్టం చేయడానికి చేసిన ప్రయత్నం ద్వారా కథనరీతి మరింత పురిపుష్టం కాగలదని నమ్మినవాడిన నేను.
చీకటి పున్నమి, మంచినీటి సముద్రం, తెల్ల చీకటి, మల్లెపూల ముళ్ళతోట, గ్రీన్ లైట్ ఏరియా ఇత్యాది పేర్లను కథలకు శీర్షికలుగా ఆ క్రమంలోనే పెట్టడం జరిగింది.
ప్రశ్న 9: సముద్రంలో చేపల వేటకీ, భార్యాభర్తల మధ్య ప్రేమకీ నమ్మకానికి ముడిపెట్టి అల్లిన ‘జాలువారు జీవితాలు’ కథలో ప్రస్తావించిన సముద్రపు విష రోగం నిజమేనా లేక కథ కోసం కల్పించారా? మరింత వివరించండి.
జ: జాలరుల జీవితాలలోను, మత్యకారులు సమాజంలోను, సముద్రతీరపు ప్రజానీకం సాగరాన్ని నిత్యం తమ జీవన ధాతువుగా చేసుకున్నవారు కొన్ని వింత వింత భయానకమైన రోగాలకు గురికావడం నేను గమనిస్తూనే ఉన్నాను.
రోజువారీ సముద్రంతో మమేకమవుతూ, అక్కడున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కెరటాలు జోరులో, మారిన వాతావరణ హోరులో సమతుల్యత లుప్తమైపోయి సముద్ర గర్భంలోని నీరు ఆవర్తనం చెందడం ద్వారా కొత్త కొత్త అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు ఇక్కడ నిత్యకృత్యం.
వైద్యబృందాలకు కూడా ఈ సమస్యలు సవాలుగా నిలుస్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఈ ‘జాలువారు జీవితాలు’ కథలోని విషరోగం కేవలం కల్పితం! అయినా అటువంటి కొన్ని రోగాలు ప్రతికూల పరిస్థితులను సృష్టించడం ద్వారా సముద్రకారుల జీవితాలను అల్లకల్లోలం చేయడం నాకు తెలుసును.
ప్రశ్న 10: “బహుశా తమ కళ్ళ ముందర ఇన్నాళ్ళూ తిరుగాడిన కుర్రాడు తమ ముందే అమాంతం పైకి ఎదిగిపోయాడన్న ఒకానొక అనిశ్చితి తాలూకు అలజడి వారిని పట్టేసి ఉండొచ్చు” అన్నారు ‘నిదురించని తోట’ కథలో. సాధారణంగా మధ్య తరగతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎదిగి, విడివడి, సొంత కుటుంబం ఏర్పర్చుకుని ఎగువ మధ్యతరగతి విభాగంలోకి మారినప్పుడు ఇలాంటి పరిస్థితులెదురవుతాయి. తమ కుటుంబ సభ్యులలో ఈ అలజడి ఉందని మహర్షి ఎలా గ్రహించాడు? ఈ అలజడికి విరుగుడు ఎలా?
జ: చాలా మంచి ప్రశ్న ఇది! మనుషుల మధ్య అంతర్లీనమై వేళ్ళూనుకుపోయిన జీవనేతిహాసాలను, బ్రతుకు క్రమాలను మర్రి మహర్షి పాత్ర ద్వారా విశదీకరించాలని చేసిన చిరు ప్రయత్నం ‘నిదురించని తోట’ కథ.
ఈ ‘నిదురించని తోట’లో వేళ్ళూనుకున్న బ్రతుకు మర్మాలను తట్టి జాగృతం చేయాలనుకున్న మహర్షిలాంటి అత్యున్నతాధికారి పాత్ర ద్వారా మరో కథలో చెప్పాను.
వారిలో ఆ అలజడిని నియంత్రించడానికి ఓ పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా తమ ఊరిలో ఒక పరిశ్రమను స్థాపించి, అక్కడి వారికి ఉద్యో గావకాశాలను కల్పించాలనుకోవడం, మౌలికమైన సదుపాయాలను. కల్పించడం ద్వారా తను పుట్టిన ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయడం; వాటి కన్నా ముందర ఇప్పటికిప్పుడు తన ఊరిలోని సమర్థులైన కొందరికి ఉద్యోగావకాశాలను కల్పించడం ఇత్యాది విషయాలు చెప్పాను.
ప్రశ్న 11: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: మా చీరాల ఓడరేవు, సముద్రపు ఒడ్డున ఉన్న ITC కంపెనీ గెస్ట్ హౌస్ యావత్ ఆంధ్రదేశంలోనే చాలా ఉన్నతిని సంతరించుకున్నది. ఇటు ప్రకాశం, బాపట్ల జిల్లాల రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, ITC కార్పొరేట్ ఆఫీసు కొలకతాలో వుండే అధికారులతో ఈ గెస్ట్ హౌస్ నిత్యం చాల సందడిగా ఉంటూ ఉంటుంది.
కావాలని గొప్పగొప్ప సాహితీవేత్తలను కూడా ఇక్కడకు ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తూండేవాళ్ళం. అర్ధరాత్రి వేళ నిండు పున్నమి వేళ సముద్ర తీరాన కుర్చీలు వేసుకొని కూర్చుంటే సముద్రపు అలలు సుతారంగా వచ్చి మా కాళ్ళను స్పృశించి వెనక్కిపోవడం.. అదో ప్రత్యేకమైన అనుభూతి. అటువంటి సముద్రతీరంలోని కూర్చొని సముద్రాన్ని, దాని అందాలను, అక్కడున్న విభిన్నమైన జాలరి వర్గాల జీవన సరళిని పరికిస్తూ, అవలోకిస్తూ కలాన్ని వాహకం చేయడం నాకు మటుకు అలవికాని ఆత్మసంతృప్తినిస్తూ ఉంటుంది.
అప్పుడు రాసిన కథే ఈ సంకలనంలోని ‘జాలువారు జీవితాలు’. ఒక పాయింటు అనుకొని దాన్ని మూడు సార్లు పాత్రల స్వభావాన్ని మార్చి వ్రాయడం జరిగింది. కానీ సంతృప్తిగా అనిపించలేదు. నాలుగోసారి వ్రాసిన ఈ కథ ఓ ప్రముఖ కథల పోటీలో ప్రథమ బహుమతిని సాధించి పెట్టింది.
బహుశా ఆ మొదటి మూడు వెర్షన్స్ అయితే అవి పోటీకి నిలబడి ఉండేవి కాదన్నది ఇప్పటికీ నా భావన.
ప్రశ్న 12: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఈ సంపుటిలోని ‘గంప క్రింద కోడిపెట్ట’ అనే కథను వ్రాయడంలో మానసికంగా కొంత ఇబ్బంది అనిపించింది. ముందుగా వస్తువును, కథా ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాను. శిల్ప ప్రమాణాన్ని సరి చేసుకున్నాను. శైలి అయితే అక్కడి రైల్వేస్టేషన్‌కు అనుకూలంగా ఉంటుందని భావించాను.
కానీ కథ లోని ముసలి దంపతులు రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకోవాలన్న పాయింటు నన్ను బాధించింది. అలా వ్రాయడానికి మనసు అంగీకరంచలేదు. కథ పూర్తయిన తర్వాత తీవ్రమైన నైరాశ్యానికి లోనయ్యాను.
రచయితగా నన్ను నేను కించపరుచుకొని దాన్ని కొన్ని నెలల పాటు ఫైల్స్‌లో ఉంచేశాను. ఆ తర్వాత నెమ్మదిగా ఆ దంపతులకు పరిష్కారం సూచించి కథను సుఖాంతం చేద్దామనిపించింది. ఆ దిశగా ప్రయత్నం చేశాను.
కానీ ఆ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీద చిక్కటి చలికాలంలో గంప క్రింద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న కోడిపెట్ట వల్ల కాదు పొమ్మంది. కోడి భాష వలదని నన్ను నిలేసింది.
వ్రాసిన రెండు వెర్షన్ లను బేరీజు వేసుకొని నా గంప క్రింద నక్కి ఉన్న కోడిపెట్ట నైజం బాగా పండాలని ఆ వృద్ధ దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించాను. ఒక బాధ్యత కల్గిన రచయితగా అన్యమనస్కంగా వ్రాసిన కథ ఈ సంకలనంలోని ‘గంప క్రింద కోడిపెట్ట’.
ప్రశ్న 13: ‘గ్రీన్ లైట్ ఏరియా’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: నాకు బాగా నచ్చినది, నాకు అత్యంత ఆత్మసంతృప్తి నిచ్చిన కధాసంపుటి ఇది. “కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచననీ కలిగించాలి. మద్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి” అన్న ఆరుద్రగారి మాటలు ఈ పుస్తక ప్రచురణ సమయంలో చాలా అపురూపంగా అన్పించేవి.
నాకు ముందుండి ఎంతగానో ప్రభావితం చేసే గుడిపాటిగారి చేయూత ఈ సంకలనం ఇంత అత్యద్భుతంగా రావడానికి కారణమయ్యింది.
గతంలో నేను ప్రతి సంకలనంలో ఒక్కో పత్రికలో అప్పటివరకు ప్రచురింపబడిన కథలను ఎంపిక చేసుకొని వాటిలో సంకలనాన్ని ప్రకటించేవాడిని. కానీ ఈసారి మటుకు బహుమతి కథలు – జాలువారు జీవితాలు, నిశీధి నీడ, ఇంతలేసి జీవితాలు, బ్రతుకు ఆవలి జీవితాలు ఇత్యాది కథలు, అలాగే వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న మరికొన్ని కథలు.. ఇవన్నీ సమగ్రంగా నిలిచి నాకు ఎంతో సంతృప్తిని, ఆనందానుభూతులన్నీ కలుగజేస్తున్నాయి.
సమగ్రంగా చెప్పాలంటే ఈ సంకలనంలోని ప్రతి రచనా అనుభవ ప్రేరిత అంశాలుగా, కొంత కల్పన వాస్తవికతల ప్రేరణగా నిలిచి, నా కలానికి బలాన్ని చేకూర్చి నాలో జీవనోత్సాహాన్ని నింపాయని భావిస్తాను.
ఇక పాఠక దేవుళ్ళ ఆదరణ గురించి చెప్పినపుడు అద్దంకిలో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంలోను, వివిధ పత్రికాలలో విశ్లేషణలు చదివి సుదూర ప్రాంతాల నుండి, ఇతర దేశాల నుండి కూడా సందేశాలు పంపడం ద్వారా అభినందించినవారు ఉన్నారు.
మరీ ముఖ్యంగా ఈ ‘గ్రీన్ లైట్ ఏరియా’ కధాసంపుటిపై M.Phil. చేయడానికి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉత్సాహం చూపడం.. చివరగా ఈ కథాసంపుటి ప్రచురింపబడిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉగాది పురస్కారానికి ఎంపిక కావడం.. ఇవన్నీ అలవికాని ఆనందాన్నీ, ఆత్మస్థైర్యాన్ని పంచి ఇవ్వగల్గుతూ ఉన్నాయి.
ప్రశ్న 14: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: తెలుగు సాహితీ లోకంలో కథా సాహిత్యం నా ఊపిరి! అయితే నాతో బాటు వర్ధమాన కథకులు కూడా మంచి మంచి రచనలతో ముందుకు నడవాలని ఆశిస్తున్నవాడిని. అయితే తాజాగా వర్ధమాన రచయితల నుండి మంచి రచనలే వస్తున్నాయి.. కానీ అనతి కాలంలోనే గొప్పవారయిపోవాలని, గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించేయాలన్న కండూతి ఏ మాత్రం సహేతుకం కారాదు వారికి.
సాధన, అద్యాయనాలు మాత్రమే మనని నిలబెడతాయని నమ్మినవాడిని నేను.
ఇంతకు ముందు మీరు సృశించిన వస్తువు ఎంపిక, శిల్ప సౌందర్య ఆవిష్కరణ, శైలి తాలూకు చైతన్యం, ఒరవడిలో కొంత నూతనత్వం సాధించి తీరుతారని ఆశిస్తాను. ఆశావహ దృక్పథం వర్ధమాన కథకులను పరిణితి చెందిన సాహితీవేత్తలుగా తయారు చేస్తుందని భావిస్తున్నాను.
ఇక ఇరవై సంవత్సరాల క్రితం చీరాలలో ‘సహజ సాహితి’ అనే సాహిత్య సేనా సంస్థను ప్రారంభించి ఖర్పులకు ఏ మాత్రం వెనుకాడకుండా సాహితీ సేవ చేస్తున్నాము. ఈ సంస్థకు ఎందరో వదాన్యులు, సాహితీ స్రష్ఠల ఆశీస్సులు ఉన్నాయి. ఈ ‘సహజ సాహితి’ వేదిక ద్వారా సాహిత్యపరమైన వర్క్‌షాపులను నిర్వహించి, కవితా కథారచన ప్రక్రియల్లో మెళకువలను నేర్పించడం, వాక్యనిర్మాణం, వస్తువు ఎంపిక ఇత్యాది విషయాల్లో తర్పీదు ఇప్పించాలని మా ఆకాంక్ష.
ఈమధ్యనే మా చీరాల ప్రాంత కవుల కవితా సంకలనం ‘మా ఊరి మహా సముద్రం’ ముద్రణ దశలో ఉంది. నా వరకు అయితే నా పదవ కథాసంపుటి ‘మల్లెపూల ముళ్ళతోట’ ప్రింటింగ్ పనులను పూర్తి చేసుకొని మొన్ననే వెలుగు చూసింది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు వడలి రాధాకృష్ణ గారూ.
వడలి రాధాకృష్ణ: ధన్యవాదాలు. నాకు ఇంతటి మహత్తరమైన అవకాశం ఇచ్చిన ‘సంచిక’ బృందానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
***
రచన: వడలి రాధాకృష్ణ
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
పేజీలు: 176
వెల: ₹ 200/-
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
ఫోన్: 9848787284
~
గోనెల్ల శేష వరలక్ష్మి
1-75, శ్రీనిలయం, ప్రసాద్ నగర్,
విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ దగ్గర,
ఓడరేవు రోడ్, పేరాల పోస్ట్
చీరాల 522004
బాపట్ల జిల్లా. ఆంధ్రప్రదేశ్
ఫోన్: 9985336444
~
‘గ్రీన్ లైట్ ఏరియా’ కథాసంపుటిపై కొల్లూరి సోమ శంకర్ సమీక్ష చదవండి:
https://sanchika.com/green-light-area-book-review-kss/

