[‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా?’ అనే నవల వెలువరించిన శ్రీ వంశీకృష్ణ పరిమళ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం వంశీకృష్ణ పరిమళ గారూ.
వంశీకృష్ణ పరిమళ: నమస్కారం.
~
ప్రశ్న 1. మీ తొలి నవల ‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా?’ వెలువరించినందుకు అభినందనలు. ఈ సందర్భంగా మీ గురించి మరియు మీ సాహితీ వ్యాసంగం గురించి మా పాఠకులకు వివరిస్తారా?
జ: ముందుగాల నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చిన సంచిక నిర్వాహకులకు ధన్యవాదములు.
నా కలం పేరు వంశీకృష్ణ పరిమళ. మాది హైదరాబాద్ నవబాత్ పహాడ్ దగ్గర ఆదర్శ నగర్ల 3 ఫ్లోర్ల బిల్డింగ్. మా ఇంటికి తూర్పున హుస్సేన్ సాగర్, పడమర బిర్లామందిర్, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఖైరతాబాద్ గణేషుడు ఉత్తరాన బిర్లా ప్లానేటోరియం, అసెంబ్లీ, రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, దక్షిణాన LB స్టేడియమ్, అబిడ్స్, కోటీలు ఎల్లలుగ ఉండుడు తోని బిర్లా టెంపుల్ నుంచి భక్తి భావం, రవీంద్రభారతి, LKT నుంచి సాంస్కృతిక చైతన్యం, గణపతి నవరాత్రులళ్ళ హుస్సేన్ సాగర్ కాడ జరిగే లొల్లిలు చూసి ఎక్కడలేని ఉషారూ, అసెంబ్లీ, LB స్టేడియమ్, RBI, కోటి, అబిడ్స్ ఇలా చుట్టుపక్కల అన్నీ పేద్ద పేద్ద వాటి మధ్యల పెరుగుడుతోని నా అంత అమీర్ లేడన్న ఫీలింగ్ నాకు ఎరికలేకుండనే నా లోపలికి పోయినై.
ఆలు సమోసా, అల్లం రబ్బా రుచులు, ఆదర్శ కేఫ్‌ల టిఫిన్లు, ఆదివారం ఆదివారం ఆస్టోరియా రెస్టారెంట్ల బిర్యానీలు ఓ మస్త్ లైఫ్.
ఇగ సదువేమో సరస్వతి విద్యామందిర్ల. ఆడ మొత్తం సాంస్కృతిక చైతన్యమేనాయే. ఏడాది పొడువునా ఎప్పుడు చూడు భారతం, భాగవతం, సూర్య నమస్కారాలు మొత్తం ఆధ్యాత్మికతనే. దాంట్ల సదువుకుంటా గప్పుడగప్పుడు నాలుగు ఐదు భగవద్గీత శ్లోకాలు బట్టి పట్టుడుతోని ఇగ నా అంత తోపు లేడన్న ఫీలింగ్ అచ్చేది. దానికి తోడు సాయంత్రం పూట, సెలవు రోజులల్ల రవీంద్ర భారతిలో వందరోజుల కళారూపాలు చూసుడు, అన్నమయ్య సప్తాహంల పాటలు ఇనుడు, జంధ్యాల హాస్యోత్సవం లాంటి ప్రోగ్రాంలకు పోయి జోక్స్ మిమిక్రీ చూసుడు ఇవన్నీటితోని ఏకదం జబ్బర్దస్త్ ఉండేది జిందగీ. ఆఖరికి ఎట్లై పోయిందంటే, శనివారం శనివారం మా ఇంటి కాడికి బిచ్చం ఎత్తుకోనికీ వచ్చేటోళ్ల పాట కూడా మస్త్ అనిపించేది గప్పట్ల.
“ఏడూ కొండలా వాడా, ఓ ఎంకాటా రమణా కనులారా కరుణింపా, కదలీ రావేమయ్యా, కదలీ రావేమయ్యా”
ఈ పాట ఇప్పటికి ఇనిపిస్తూనే ఉంటది చెవులల్ల.
కాకపోతే వాస్తవం చూస్తే మా నాన్నది ఆ బిల్డింగ్‌ల వాచ్మాన్ నౌకరి. మా అమ్మ అక్కన్నే ఆ ఆఫీస్ ముందు జాగాల బిర్లా టెంపుల్ దగ్గర కొబ్బరికాయల షాప్ నడిపేది. కానీ గివన్ని నాకేం ఎరుక. నేను మాత్రం నేనేదో పేద్ద అమీర్ నన్నట్టు ఏన్నో ఊహలల్ల ఉండేటోన్ని. మా అమ్మా నాన్నలు కూడా గట్లనే చూసేటోళ్ళు. మీదకేంచి ఓ వైపు బస్తీ మరోవైపు పెద్ద పెద్ద బిల్డింగ్ లండేయి మా ఇంటి పక్కలకు. గట్ల రెండు తీర్ల జీవితం నాకు చిన్నప్పటి సందే అలవాటు అయిపోయింది.
ఇగ నా రచన ముచ్చటకస్తే ఎప్పుడు రాసిన్నో సక్కగ గుర్తుకు లేదు కానీ, మెల్లగ కవితలు రాసుడు షురూ చేసిన. మా ఇస్కూల్ల కూడా చూపెట్టిన. మంచిగనే ఉన్నయి అన్నట్టు గుర్తు. నిజం చెప్పుకుంటామా కానీ, కాకపోతే ఓసారి “ఉపాధ్యాయుడు” అన్న కవితలో ఏదో ప్రాస కోసం “ఉపాధ్యాయుడు- విద్యార్థుల భవిష్యత్ కోసం కొన్నిసార్లు అవుతాడు కర్కషుడు” అని రాసిన. అది చూసి మా సార్ అన్నడు, కర్కషుడు అనకుండా వాక్యం మార్చి, కర్షకుడు అని అంటే ఇంకా బాగుంటుంది అని. నేననుకున్న, కట్టె పట్టుకొని కొట్టినప్పుడు తప్పు లేదు గాని కర్కషుడు అంటే తప్పనిపించిందా అని.
అట్లనే ఓపారి ఈటీవీ ఛానల్ వాళ్ళు “భాగవతం” సీరియల్ టైమ్‌ల భాగవతం గురించి వ్యాసం రాయమని పోటీ పెట్టిర్రు.నేను కురుక్షేత్రంల శ్రీ కృష్ణుని గురించి రాసి, మా ప్రిన్సిపాల్‌కు చూపెట్టి అడిగిన. మా ప్రిన్సిపాల్ అంటది భాగవతంల కురుక్షేత్రం ఎక్కడచ్చిందిరా అని. నాకనపించింది ఇప్పుడు భాగవతంల కృష్ణుని కథ ఉన్నప్పుడు, గదాంట్లనే కురుక్షేత్రం కూడా రావాలె కదా. ‘ఎందుకు రాదు. గదే కృష్ణుడు కదా భారతంల కూడా ఉండేది’ అని గా మేడంకే సక్కగా తెల్వదు అనుకున్న.
అగో గట్ల గప్పుడే తిక్క తిక్క ఉండేది దిమాక్. మీదకేంచి ఎప్పుడుకూడా క్లాస్‌లో ఫస్ట్ ఐదు ర్యాంక్ లల్ల వచ్చేటోన్ని. ఇంకేముంది నాకు నేను నేనో పేద్ద స్రష్ట, ద్రష్టను అనుకునేటోన్ని. ఓపారి బాలభవన్‌ల కవితలు, వ్యాసాల పోటీలు ఉంటే పోయి ఏదేదో బరికినా. కానీ ప్రైజ్ ఏమి రాలే. కానీ అప్పుడెవరో అన్న మాట మంచిగనిపించింది. ప్రైజ్‌లు కాదు ముఖ్యం పార్టిసిపేట్ చేసుడు ముఖ్యం అని. గదే కంటిన్యూ చేస్తున్న ఇప్పటిదాకా. ఇగ ఆ తరువాత నా కిస్మత్ ఉల్టా కొట్టి నా డిప్లొమా ఫస్ట్ ఇయర్ల ఉన్నప్పుడు మా నాన్న బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో స్లాబ్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు పైనుండి కిందపడి చచ్చిపోవుడుతోని, మొత్తం ఉల్టా సీదా అయిపోయింది నా బతుకు. ఏమి అర్థం కాకుండా, అర్థం లేకుండా అయిపోయింది.
గట్లాంటి డిప్రెషన్ టైమ్‌ల నాకు జిందగీ మీద ఇంట్రెస్ట్ పుట్టించిన ముచ్చట ఏదన్నా ఉందంటే, ఏది ఎమన్నా చేసి పెద్ద స్థాయికి చేరుకోవాలి అనిపించుడు. కానీ ఎట్లైతం. సదువుతోని అయితమో లేదో, ఎవనికి తెలుసు. కానీ ఏమైనా చేసి జల్దిన పెద్దోన్ని అయిపోవాలి, అదే ఎట్లా ఎట్లా అని సోచాయించగా, సోచాయించగా, అప్పటికే కవితలు రాస్తున్న కాబట్టి సినిమా గీత రచయిత ఐదాం అని ఫిక్స్ అయిపోయినా. ఏదేదో ప్రయత్నం చేస్తున్న ఇప్పటికి ఇట్లా.
గిది నా నేపథ్యం. నా రచనల ముచ్చటకస్తే రాసి కన్నా వాసి ముఖ్యం అంటరు కాబట్టి. “తలుకుబెలుకు రాళ్లు తట్టడేలా” అన్నట్టు నేను రాసినవే మాట్లాడుకుంటే. నేను రాసిన కవితల్లో “స్నేహం” కవిత, పోతుకూచి సాంబశివరావు గారి “చామంతులు” పుస్తకంలో, “శ్రమదోపిడీ” కవిత, తెలంగాణా సాహితీ వారి “శ్రామిక కవిత” సంకలనంలో, తెలంగాణా ఉద్యమం సందర్బంగా నేను రాసిన తెలంగాణా పాట, ప్రముఖ కవి “అందేశ్రీ” గారు తెచ్చిన “నిప్పుల వాగు” తెలంగాణా ఉద్యమ రచనల సంకలనంలో, “నన్ను వదిలేయండి ప్లీజ్” కవిత, ఈ మధ్య “అమెరికన్ తెలుగు సంఘం” సావనీర్ లో, “లవ్ జీహాద్” కవిత “సంచిక” వెబ్సైటు లో ప్రింట్ అయినయ్. ఇగ నాటకాలు చూస్తే “పిచ్చి శంభవ్వ” నాటకం “గోవాడ మల్లీశ్వరి” గారి స్మారక నాటక పోటీల్లో బహుమతి పొంది, పుస్తకంలో కూడా చోటు పొందింది.
ఇగ కథలు చూసుకుంటే, నేను రాసిన “MLA శంకరన్న” కథ శ్రీ సడ్లపల్లి చిదంబరం రెడ్డి” గారి “తపనా సాహిత్య వేదిక” వారు తెచ్చిన “ఎనుములు -మానవసంబంధాలు” పుస్తకంలో, “కాలం మారింది” కథ సంచిక వెబ్సైటు లో ప్రచురణ అయ్యాయి.
ఈ మధ్య చంపకమాల ఛందస్సులో రాసిన పద్య కావ్యానికి, శ్రీ మారుమాముల దత్తాత్రేయ శర్మ గారి “అవధాన వికాస పరిషత్” వారి నుంచి రెండవ బహుమతి వచ్చింది. అలాగే ఆంధ్రా ప్రాంతం చరిత్ర, గొప్పతనం గురించి నేను యాక్టింగ్ చేస్తూ చెప్పిన లెంతీ డైలాగ్‌కి ‘ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్’ వారి నుంచి బహుమతి వచ్చింది. అట్లా యాక్టర్ నైనా. అట్లనే ప్రముఖ సినిమా దర్శకుడు శ్రీ K విశ్వనాధ్ గారి జీవితం గురించి ‘కళా తపస్వి’ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దానికి నేనే రైటర్, డైరెక్టర్. అట్లనే ఓ ,45 షార్ట్ ఫిల్మ్ లు తీసిన.
ఇగ నా సినిమా ప్రయత్నాల్లో భాగంగా ప్రముఖ తెలంగాణా సినిమా దర్శకనిర్మాత శ్రీ ‘పులి అమృత్ గౌడ్’ గారి సహకారం వల్ల “ఖేల్ “ సినిమకి రెండు పాటలు, తరువాత ప్రముఖ సినిమా దర్శకుడు శ్రీ “అల్లాని శ్రీధర్” గారి సినిమాకి ఒక పాట, యువ దర్శకుడు శ్రీ ‘మంచాల నాగరాజు’ గారి ప్రోత్సాహంతో ఈ మధ్యనే విడుదలయిన మాస్ మహారాజ్ రవితేజ గారి అన్న కొడుకు హీరోగా చేసిన ‘మారెమ్మ’ సినిమా లో ఒక పాట రాసిన.
ఇగ అస్సల్ ముచ్చట్లకస్తే గిట్ల పాటలు రాస్తూ, షార్ట్ ఫిల్మ్ లు చేసుకుంటనే, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ ‘సాకేత్ సాయిరాం’ గారి సహాయంతో BPS ఆడియో and వీడియో అనే యూట్యూబ్ ఛానల్ కి 15 పాటలు దాకా రాసిన. గవాటికి మంచి పేరు కూడా వచ్చింది. దాంట్లో భాగంగానే ఓ సినిమా తీద్దాం అన్న ప్రయత్నం లో రాసిన కథనే, నిర్మాతలు దొరక్కపోవడం వల్ల కొంతకాలం మూలకు పోయి, మళ్ళీ కాలక్రమంలో నా కథలోని సందేశాన్ని ప్రేక్షకులకి తప్పకుండా అందించాలి అన్న సంకల్పంతో, శ్రీ జోశ్యుల సూర్య ప్రకాష్ గారి ‘జోశ్యుల పబ్లికేషన్స్’ ద్వారా ‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా’ నవలగా మీ ముందుకు వచ్చుడు జరిగింది.
నేను రాసిన ఈ నవలకు ఈ నడుమనే గిడుగు రామ్మూర్తి పంతులు గారి మనమరాలు శ్రీ గిడుగు కాంతి కృష్ణ గారు, కళా రత్న బిక్కి కృష్ణ గారి ప్రోత్సాహంతో ‘గిడుగు రామ్మూర్తి పంతులు’ జాతీయ అవార్డు కూడా అచ్చింది.
గిట్ల ఈ నా ప్రయాణంల పైన చెప్పినోళ్లే కాకుండా తెలంగాణా సాహితీ మోహన కృష్ణ గారు, తంగిరాల చక్రవర్తి గారు, కామన్ డయాస్ కనకాచారి గారు, సినిమా నిర్మాత మధు వింజమూరి గారు, సంగీత దర్శకుడు నవీన్ గారు, కళా రత్న, వందేభారత్ సినిమా దర్శకుడు మల్లం రమేష్ గారు, నా నవలకు రివ్యూ ఇచ్చిన ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు ఇంకా మస్త్ మంది పెద్దలు, దోస్త్‌లు, ఫేస్బుక్ దోస్తులు మా ఇంట్లోళ్ళు, చుట్టాలు, తెలిసినోళ్లు, గిట్ల ఎంతమంది అడుగడుగునా నాకు ప్రోత్సాహం ఇచ్చిర్రు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
ఇంతవరకు ఓపికతోని నా సుత్తి చదివినందుకు మీకు కూడా ధన్యవాదములు. ఇగ నా నవల ముచ్చట్లు మాట్లాడుకుందాం.
ప్రశ్న 2: ‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా?’ అనే సరదా శీర్షిక వెనుక ఇంత తీవ్రమైన సామాజిక సమస్యను చెప్పాలనుకోవడానికి ప్రేరణ ఏమిటి?
జ: అయితే నేనేం అనుకున్నా అంటే ముందు నేనొక సినిమా దర్శకున్ని, హాస్యరస ప్రధాన సినిమాలు ఇష్టపడేటోన్ని కాబట్టి, జనాలకి మనం చెప్పే ముచ్చట అర్థం కావాలి అంటే ఎంత పెద్ద సమస్యనైన సరళంగా, సరదాగా చర్చ చెయ్యాలే, అట్లా చేస్తేనే ఎక్కువ మందికి నచ్చుతది అన్న ఉద్దేశం తోని నా నవలకు ‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా’ అని టైటిల్ పెట్టిన. ఇది జనరల్‌గా ఊళ్లల్లా పెళ్లి గాని పిల్లగాళ్ళను ఊరోళ్లు అనే మాటనే. అందరికి ఎరికైన మాట కాబట్టి మంచిగుంటది అనిపించింది.
ఇగ మెయిన్‌గా నా నవలల ప్రధాన అంశం లగ్గం, దానికి మించిన అంశం ఆ లగ్గం గురించి సమాజం నుంచి వచ్చే దొబ్బులు. గందుకని ఆ టైటిల్ అయితేనే మంచిగుంటది అనిపించింది. అయితే ముందుగా మీకో ముచ్చట చెప్పాలే. ఈ నవల అన్నది ఊహాజనితంగా రాసింది కాదు. ఇది ఒక వాస్తవిక నవల. మా దోస్త్ ఒకడు ఈ నవలలోని కథానాయకుడి లెక్కనే ఆని జీవితం ల లగ్గం అనే కిరీటం గెలుసుడు కోసం ఘజనీ మహమ్మద్ లెక్క అనేకానేక దండయాత్రలు చేసిండు. అది నేను కండ్లారా చూసిన, చెవులారా విన్నా. నవలల చెప్పినట్టు నిండు జుట్టున్న పిల్లగాడు బట్టతల అచ్చే దాకా లగ్గం కోసం తిరుగుడు అన్నది, ఏదో సరదాగా రాసిన కల్పన కాదు, కండ్ల ముందు చూసిన వాస్తవం.
అదొక్కటే కాదు నవలలో చాలా వరకు ప్రస్తుతం సమాజంలో చూస్తున్నదే. లగ్గం కాలేదని కొందరు పిల్లగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు అని పేపర్ లల్ల చదివినప్పుడు ముందు అంత పేద్ద సమస్య అని అనిపియ్యలే. కానీ ఎప్పుడైతే ఈ నవల/సినిమా కథ రాసుడు షురూ చేసిన్నో అప్పుడు సమజయింది అసలు కథ ఏందో. కర్ణాటక లాంటి రాష్ట్రాలల్ల పెళ్లికి పిల్ల కావాలని MRO లకు లెటర్ పెట్టుడు, మహారాష్ట్ర లో పిల్లగాడు ఓ సైకిల్ మీద తన వివరాలు అన్ని బ్యానర్ కట్టుకొని పిల్ల కోసం గల్లీలు అన్నీ తిరుక్కుంటా చౌరస్తాల నిలబడుడు గిట్ల గమ్మతి గమ్మతి ముచ్చట్లతో పాటు ముందుగాలా చెప్పినట్టు కొందరు ఆత్మహత్య చేసుకునుడు లాంటివి ఏన్నో చదివిన. అవన్నీ చదివినప్పుడు అనిపించింది నేను రాద్దాం అనుకున్నది ఒక మంచి అంశం అని.
ఇగ ప్రశ్నలో మీరన్నట్టు ‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా’ అన్న మాట సరదాగా ఊళ్ళలో అనే మాటనే. ఎట్లాంటి సందర్బంలో ఆ మాట వాడుతున్నరన్నది కూడా ఆలోచన చేయాలే.. ఓ దిక్కు ఆడపిల్లలేమో లగ్గంకి ఒప్పుకోవడానికి ఆకాశాన్ని తాకే డిమాండ్స్ పెడ్తుంటే, ఊళ్ళో పని పాట లేని అమ్మాలక్కలు, పెద్ద మనుషులంత “ఓ పిల్లగా లగ్గం కుదిరిందా” అని అడగడం ఓ తీరున చూస్తే శాడిజం అని అనచ్చు. ఇగ మీరన్నట్టు ఇది సామాజిక సమస్యనా అంటే అవునో కాదో ఏమి చెప్పలేం. వరకట్నాలు, వితంతు పునర్వివాహాలు, సతీ సహగమనాలు వీటిని సామాజిక సమస్యలు అనచ్చు. ఎందుకంటే అక్కడ తర తరాలుగా అబలాగా ఉన్న స్త్రీమూర్తి మీద హింస జరిగింది కాబట్టి. కానీ ప్రస్తుత సమస్య సామాజిక సమస్య ముమ్మాటికీ కాకపోవచ్చు ఇదొక సామాజిక పైత్యం. భస్మాసుర హస్తం లెక్క ఎవని నెత్తిన వాడే పెట్టుకున్న శాపం అనుకోవచ్చు. అమ్మాయిలు డిమాండ్స్ చేసుట్ల తప్పేం లేదు. మస్త్ ఆప్షన్స్ ఉన్నప్పుడు బెటర్ దాన్నే ఎవడైనా సెలెక్ట్ చేసుకుంటడు.
కాకపోతే సమస్య ఏంటిరా అంటే ఏ విలువల కోసం ఎవరు గీసిన చట్రంలో ఎవడు బతుకుతుండు. ఎవరు ఎవన్ని మోసం చేసుకుంటుండు. అసలు వారు నిలబెడదాం అనుకున్న విలువలను నిజాయితీగా పాటిస్తున్నది ఎవరు. దానివల్ల ఉపయోగం ఎమన్నా ఉందా లేదా అన్నదే చర్చ. దాన్నే నవలలో ఓ పాత్ర ద్వారా కూడా ఓ చోట చెప్పించిన. “నా కుల వృత్తో, నా కుల వృత్తో అని అంటీపెట్టుకొని ఉన్న పాపానికి, ఇప్పుడు నా వర్గమోల్లే నాకు పిల్లనిచ్చేందుకు ఎనక ముందు ఐతుర్రు” అని. వృత్తిని బట్టి కులాలున్నాయన్నప్పుడు మరి అదే వృత్తితో జీవితం సాగించేటోని కి తమ పిల్లనియ్యడానికేం రోగం అన్నది సక్కగ నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న.
దీనికెవ్వరు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎన్ని ఆదర్శలున్నా, ప్రాక్టికల్ జీవితం అన్నది అంత తేలిక కాదు. సిద్ధాంతాలు, సాంప్రదాయాల కన్నా రోజువారీ బతుకు గురించే ఎవడైనా ఆలోచన చేస్తడు. ఇక్కడ వాడు ఏ వృత్తి చేస్తున్నడు అన్నది కాదు, వాడి సంపాదన ఎంత అన్నదే ప్రశ్న అయితది. దాంట్లో కూడా తప్పు ఏమి లేదు. కాబట్టి మీరన్నట్టు ఇది సమస్య కాదు. ఇంకోపేరు ఏదన్నా పెట్టుకోవాలి మనమే.
ప్రశ్న 3: మీ నవలలో పెళ్లి ఒక వ్యక్తిగత నిర్ణయం కంటే సామాజిక బాధ్యతగా కనిపిస్తుంది. మన సమాజంలో వివాహం వ్యక్తి స్వేచ్ఛను ఎంతవరకు శాసిస్తోంది?
జ: మనకు స్వాతంత్య్రం వచ్చాక భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన వ్యక్తిగత హక్కులున్నాయ్. కానీ మన జీవితాలన్నవి మన పూర్వికుల నుంచి ఇప్పటి వరకు కూడా మన ఇంటి పెద్ద మాటలను, కుల పెద్ద మాటలను అనుసరించే నడుస్తున్నయి. దాన్ని మనమేం ఒక శిక్ష లెక్క కాదు ఒక బాధ్యత లెక్క , మన పెద్దలకు మనం ఇచ్చే గౌరవం లెక్క భావించి కొనసాగిస్తున్నము. అట్ల మనం చూసుకుంటా లగ్గం అనే ముచ్చటకస్తే ఇక్కడ కూడా వ్యక్తిగతం అనడానికేం లేదు. అసలు లగ్గం చేసుకునుడే వంశాన్ని, కులాన్ని నిలబెట్టడానికి కదా, అట్లనే మన సాంప్రదాయాల్లో అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసే లగ్గం చేసుకోవాలి అన్న ఆదర్శం ఉన్నప్పుడు వ్యక్తిగతం అన్న ప్రశ్నేడ ఉంటది ఇంక.
కాబట్టి తరాల కెంచి పెండ్లి అన్నది సామజిక బాధ్యతనే. కాకపోతే ఇక్కడ “సమాజం” అన్నప్పుడు, మనకు కనపడే విస్తృత సమాజం కాదు. భారతీయ సమాజం అన్నది ఆరున్నర వేల చిన్న చిన్న సమాజాల, సమూహాల కలయిక. ఇక్కడ ఎవని సమాజం తీరు వాడు బతకాలి బతుకుతాడు అంతే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వాస్తవం అదే.
కాబట్టి నా నవలలో కూడా కథానాయకుడి సంఘర్షణ అదే ఉంటది. ఎన్ని సంబంధాలు పోయినా నా వర్గం లోని పిల్ల దొరికే దాకా ఎదురు చూస్తా అన్నదే కథా నాయకుడి పాలసీ. మన సంప్రదాయం ప్రకారం ఏ వర్గం ఆ వర్గం వాళ్లతోనే సంబంధాలు ఏర్పార్చుకోవాలి అన్నది కథనాయకుడు నమ్మిన సిద్ధాంతం. ఆధునికత అంటే ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు వదలడం కాదు, మన పూర్వికుల వారసత్వాన్ని కొనసాగించినప్పుడే, మన జన్మకొక సార్ధకత అని. ఇది ఒక్క నా కథా నాయకుడి భావనే కాదు సగటు భారతీయుడి మనోగతం అదే ఉంటుంది నాకు తెలిసి. అందుకే ఎవరి వర్గం వారికి గొప్పది.
కానీ సమస్యల్లా ఆర్థిక విషయాలన్నవి ప్రాధాన్యత సంతరించుకున్నప్పుడు, ఆ సమూహ సమాజం అన్నది తన సమాజం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది. తన సమాజాన్ని నమ్ముకున్న సంతోష్ లాంటి వాళ్లకు, ఆ సమాజం ఏమి బహుమానం ఇద్దాం అనుకుంటుంది అన్నది ప్రశ్న. ఒకవేళ సంతోష్ లను పట్టించుకునే సమాజం లేనప్పుడు భవిష్యత్తులో సమాజాన్ని పట్టించుకోని సంతోష్‌లే వస్తారు అన్నది నేను చేద్దాం అనుకున్న హెచ్చరిక. ఇక మీరన్నట్టు వివాహం వ్యక్తి స్వేచ్ఛను శాసించడం అన్నది ఊహాజనిత ప్రశ్న సార్. మన దేశంలో సామాజిక అవలంభికులే తప్పా, వ్యక్తిగత పౌరులు అన్నవాళ్లే లేరు.
పుట్టుక నుంచి చావు వరకు సామాజిక నియంత్రణనే వారి శ్వాస కాబట్టి కొత్తగా హక్కులు హరించబడటానికి ఏమీలేవు అక్కడ. పెళ్లి అన్నది ఇద్దరు మనుషులు కలయిక అనుకున్నప్పుడు వ్యక్తిగతం ప్రశ్న వస్తుంది. కానీ మన దేశంలో పెళ్లి అన్నది సామాజిక ఆదేశం. వంశం గౌరవం కోసం చేయాల్సిన కర్తవ్యం. కాబట్టి వ్యక్తిగతం అంటూ ఏమి ఉండదు.
అట్లనే ఆడా, మగ మధ్య ఆకర్షణ సహజం. కానీ దానికి ప్రేమ అన్న పేరు పెట్టడం మాత్రం ఆధునిక ప్రకోపం. తనకు నచ్చిన అమ్మాయి/అబ్బాయి అన్న సమస్యనే ఉండదు. ఎందుకంటే వివాహం అమ్మాయి అబ్బాయి కోసం కాదు, సమాజం వృద్ధి కోసం అన్నది నేటి యువత తెలుసుకోవాలి. అది చెప్పే చదువులు లేక వ్యక్తిగత ఇష్టాయిష్టాల ముచ్చట వచ్చింది తప్పా 5 ఏళ్ల అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికిచ్చి కట్టబెట్టిన కాలంలో స్వేచ్ఛ ఏంటి, హక్కులు ఏంటి. అదొక బాధ్యత, ఓ సంబరం, ఓ కర్తవ్యం. తన సమాజం బాగు కోసం ఆ సమాజంలోని ప్రతి పౌరుడు నిర్వహించాల్సిన విద్యుక్త ధర్మం. అందుకే నా కథా నాయకుడు మొదటి నుంచి ఇదే మాట చెప్తాడు. పెళ్లి అన్నది మన కోసం కాదు మన సమాజం కోసం అని.
ప్రశ్న 4: సంతోష్ పాత్రను మీరు సమాజానికి బాధితుడిగా చిత్రించారా, లేక ఆ సమాజపు విలువలను తనలో మోస్తున్న వ్యక్తిగా చూపించారా?
జ: సంతోష్‌ను బాధితుడుగా చూపించిన్నా లేకపోతే సమాజం విలువలను మోసెటోని లెక్క చూపించిన్నా అంటే విలువలు మోయడం వల్లే బాధితుడుగా మారిన అల్పజీవి అనుకోవచ్చు. తన కండ్ల ముందరనే ఆధునికత పేరు మీద ఎంతోమంది కట్టుబాట్లు దాటి పోతుంటే, అవి చూసుకుంటా కూడా, ఎందుకట్ల విలువలు అనుకుంటా కూసున్నడు. అట్ల మడి కట్టుకొని కూసున్న సంతోష్‌కి ఆ సమాజం తిరిగి ఏమిచ్చింది అన్నదే నవలలో నా ప్రశ్న. మీకిక్కడ వివాహ పరిచయ వేదిక సన్నివేశం తీసుకుంటే, సంతోష్‌కి తన సమాజం నిర్వహిస్తున్న పరిచయ వేదిక ముందరే ఘోర అవమానం పొందాల్సిన పరిస్థితి దాపురిస్తది.
తమది కానీ వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళకి పిల్లనివ్వడానికి ముందుకచ్చే తమ సమాజం మనుషులు, సమాజం నిర్దేశించిన వృత్తిలో బతుకుతున్న పాపానికి అతనికి పిల్లనివ్వడానికి వెనకాడుతరు. 60 ఏళ్ళు దాటిన అమెరికా పెళ్లి కొడుక్కయినా 18 ఏళ్ళ పిల్లనిస్తాం తప్పా, అందంగా, లక్షణంగా, ఆరోగ్యంగా ఉండి, సమాజం నిర్దేశించిన వృత్తిలో బతుకుతున్న సంతోష్‌కి ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు.
ఇప్పుడు ఇక్కడ సంతోష్‌ను బాధితుడు అనడానికి లేదు సమాజం చేతిలో మోసపోయిన వాడు అనచ్చు, మారిన పరిస్థితులకి అనుగుణంగా మారిపోకుండా, ఇంకా సమాజం కోసమే ఆలోచన చేస్తున్న పిచ్చోడు అనచ్చు. అతని పిచ్చి ఎక్కడిదాకా పోయింది అంటే, తన సమాజం వాళ్లే తనని చీ కొడుతున్న సమయంలో, ఉన్నత ఉద్యోగంలో ఉన్న వేరే సమాజం అమ్మాయి అతన్ని ఇష్టపడి ప్రపోజ్ చేస్తే కూడా, నా చావైనా, బతుకైనా నా సమాజం కోసమే అని ఆమెను తిరస్కరిస్తడు. ఇంత పిచ్చిగా సమాజం కోసం బతకాల్సిన అవసరం ఇంకా ఉందా. దానికి ప్రతిఫలంగా సమాజం అతనికి ఏమి అందిస్తుంది అన్నది ప్రశ్న.
ప్రశ్న 5: ఒకప్పుడు ఆడపిల్లల పెళ్లిళ్ల చుట్టూ తిరిగిన ఆందోళన, ఇప్పుడు మగపిల్లల పెళ్లిళ్లకూ విస్తరించడాన్ని మీరు సామాజిక పరిణామంగా చూస్తారా, వైఫల్యంగా చూస్తారా?
జ: మీరన్నట్టు వరకట్నం ఆచారం అన్నది ఓ గుదిబండలాగా మారిపోయి ఆడపిల్లలను కనడం అంటేనే శాపంగా, పాపముగా పరిణామించింది. అది ఒకప్పుడు అని అనుకుంటాం కానీ, అస్సలు అమ్మాయిలే దొరకని ఈ కాలంలో కూడా సంప్రదాయంగా వరకట్నం ఇచ్చి, మళ్ళీ ఎక్కువ కట్నం కోసం వరకట్నం చావులకు గురువుతున్న అమ్మాయిల గురించి నేటికీ పత్రికల్లో చూస్తూనే ఉన్నాము. కాబట్టి వరకట్నం రూపుమాపబడింది అనడానికి లేదు. అది బాల్య వివాహాలు లెక్కనే ఇంకా నడుస్తూనే ఉంది.
ఇగ మీ ప్రశ్న ముచ్చట కస్తే, ఈ రెండింటిని పోల్చి చూడాల్సిన అవసరం లేదు. కానీ మగపిల్లగాళ్ళకి పెళ్లి అన్నది పేద్ద పరేషాన్ లెక్క అయిపోవడానికి మస్త్ కారణాలున్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గిపోవడం.
నా నవల్లో ఒక దగ్గర రాసినట్టు ఆడపిల్ల పుడితే చాలు, పుట్టగానే చంపుకున్న సమాజానికి ఇది ఆ దేవుడే విధించిన శిక్ష అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సామాజిక పరిణామం అనడానికి ఏమి లేదు. కాకపోతే నేటి కాలం పేదింటి అమ్మాయిలకు దక్కిన వరం అని చెప్పచ్చు. ముఖ్యంగా పేదింటి కుటుంబాలలో అమ్మాయిలకు ఆకాలంల కట్నం పైసలు ఉంటే తప్పా పెళ్లిళ్లు కాకపోయేటివి, పైసలున్న కుటుంబాలతోని సంబంధం అన్నది వాళ్లకి కల అన్నట్టే ఉండేది. కానీ నేడు దేశంల స్త్రీల జనాభా తగ్గిపోవడం వల్ల, నేడు అదే పేదింటి అమ్మాయిలను, కట్నం కూడా అడగకుండా, పెద్ద పెద్ద కుటుంబాల వాళ్లు సంబంధం కలుపుకుంటున్నరు. ఈ విషయాన్ని కూడా సీతయ్య కూతురు పాత్ర ద్వారా చెప్పిన నవలలో.
కానీ ఇదేమి సామాజిక పరిణామం అని అనడానికి లేదు. ఇదేదో అవసరానికి వాడుకోవడం లాంటిది అంతే. డబ్బులున్న పక్క వర్గం పిల్ల కన్నా, డబ్బులు లేని సొంతం వర్గం పిల్ల నయం అనుకునే, వర్గ చైతన్యం అనబడే ఉత్సాహం తప్పా, దీంట్లో తమ వర్గం అమ్మాయిల మీద ప్రేమ తోనో, లేకపోతే వరకట్నం లాంటి ఆచారాల మీద విముఖతతోనో వచ్చిన మార్పులు లేం లెవ్వు. ఏదో అవసరం తీరు మనుషులు అన్నట్టు అంతే.
కాకపోతే సామాజిక వైఫల్యం అనైతే అనచ్చు. ఇక్కడ నేను చెప్పే సమాజం పెద్ద సమాజం కాదు. సమూహ సమాజం. కనీసం తమ సామాజిక వృత్తికి ఓ ఆర్థిక స్వావలంబనా, తమ సమాజంలోని మగ పిల్లగాళ్ళకు పెళ్లికి ఆడపిల్లలు కూడా లేకుండా, ఆ సమాజం ఇంతగా దిగజారి పోవడం అన్నది నిజంగా ఆ సమాజం వైఫల్యమే. ఇక్కడ ఆర్ధిక విషయంలో ఇతర వృత్తులు చేపట్టి బాగుపడచ్చు, కానీ లగ్గం ముచ్చట లో ఇతర సమాజాలతో పెళ్లి సంబంధాలు కలుపుకుంటే అసలు సమాజం ఉనికికి, ఆస్తిత్వానికే ఎసరు వస్తది. తర తరాల సంప్రదాయం మట్టికొట్టుకు పోతది. మరి ఇంత పెద్ద విషయాన్ని పక్కన పెట్టి, ఈ సమాజం పెద్దలు తమ సమాజం సమావేశాల్లో ఏ అంతర్జాతీయ చర్చలు జరిపిస్తున్నరో అన్నది, ప్రతి సమాజం పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా ఆయా సమాజాల సామాజిక వైఫల్యమే అని చెప్పచ్చు.
ప్రశ్న 6: కట్నం కోసం మంచి సంబంధాన్ని వదులుకునే రామయ్య పాత్ర ద్వారా మీరు వ్యక్తుల స్వార్థాన్ని ప్రశ్నించారా, తరతరాలుగా పాతుకుపోయిన వ్యవస్థను ప్రశ్నించారా?
జ: మనం అనుకుంటాం గాని ఈ కట్నం అన్నది దురాచారం కన్నా, ఒక ఇజ్జత్ కా సవాల్ అన్నట్టే ఉన్నది జనాలల్ల. ఆడపిల్లనిస్తున్నాం కాబట్టి కట్నం ఇయ్యాలె, ఇయ్యకపోతే చుట్టపోల్ల దగ్గర ఇజ్జత్ పోతది అని నమ్మేటోళ్ళే ఎక్కువున్నారు దేశంల. అందుకే కట్నం అద్దన్నా ఇస్తరు. మీదాకేంచి అమెరికా, ఆస్ట్రేలియా సంబందాలు తెచ్చుకొని, ఆళ్లకు 50, 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసేటోళ్లు కూడా ఉన్నరు. ఆ చేసుకున్నోడు ఉల్టా వరకట్నం గురించి పిల్ల ఉసురు తీసుడు అన్నది కూడా సదివిన పేపర్లల్ల. గివన్ని చదివినప్పుడు అనిపిస్తది, గా పిల్లకి గంతా గంతా కట్నం ఇచ్చి పెళ్లి చేసుడేంది, ఉల్టా వాడు కట్నం కోసం సంపుడేంది, అసలు ఏ కాలంల ఉన్నరు ఈల్లింకా అని. కాకపోతే ముందుగాలా మాట్లాడుకున్నట్టు మనం ఎంత కట్నం ఇస్తే మన సమాజం ల మనకంత పరపతి పెరుగుతది. కాబట్టి ఉన్నోడి దృష్టి ఎప్పుడు ఎంత కట్నం ఇచ్చినం, లగ్గంకి ఎంత ఖర్చులు పెట్టినం అనే ఉంటది. ఆ చేసుకున్నోడు మానసిక దరిద్రుడయితే, ఇక అది ఆ పిల్ల గాచారం అనుకోవాలి, ఇంకేం అనడానికి లేదు.
ఇగ నా నవల ముచ్చటకస్తే, ఇక్కడ రామయ్యకి కట్నం మీద పిచ్చి అనుడుకన్నా, కొడుకుని అగవకి ఎందుకు కట్టబెట్టాలి, ఇంకో కాడ ఇంకో మంచి సంబంధం అస్తదేమో అన్న ఆశనే ఉంది అనుకోవాలి. అసలు నా నవలల ఇంకో ముఖ్య అంశం ఇంకా పాత కాలం లెక్క కట్నాలు కోసం చూసుకుంటా కూసోకుర్రి, ఇప్పటి కాలంల పిల్ల దొరుకుడే ఎక్కువ. మీరు కట్నం పుట్నం అని కూసుంటే, కొడుకు బతుకు ఆగం చేసినోళ్లు ఐతారానే.
అదే సమయంలో రామయ్య బావమరిది సీతయ్య, నేను పైన చెప్పినట్టు పరపతి కోసం మొదటి ఇద్దరు బిడ్డలకు 20, 20 లక్షలు కట్నాలుతోని పెండ్లిళ్లు చేయించి మూడో బిడ్డా పెండ్లికి పైసలు లేక ఎట్లారా దేవుడా అనే కాడికి అస్తడు. కాకపోతే దేవుని దయవల్ల, నేడు మారిన పరిస్థితుల వల్ల ఆ మూడో బిడ్డకు కూడా, కాని కట్నం అడగకుండా చేసుకునే మంచి సంబంధం అస్తది, మీదికేంచి పెళ్లి ఖర్చులు కూడా పిల్లగానోళ్లే పెట్టుకుంటాం అంటరు. ఇక్కడ ఆడపిల్ల తల్లి తండ్రులకు నేను చెప్పాలి అనుకున్నది ఏందంటే, ఇంకా పాత కాలం ఆలోచనల తోని అప్పులు చేసి, పైసలు ఖర్చులు చేసుకొని కట్నాలు ఇచ్చి లగ్గాలు చేసుడు మానుకోర్రి.
ఇప్పుడు పరిస్థితి మారింది 100కి 85మంది ఆడపిల్లలు ఉన్నారు దేశంల. మరి మీ మీ సమాజంలో ఎంతమంది ఉన్నరో అరుసుకోండి ముందు. ఉట్టిగ ఆగం ఆగం అయి పరపతికి పోయి పిల్లని ఆగం చేసుడు కన్నా, మీ సమాజం ల మంచి మనసున్న పోరగానికిచ్చి పెండ్లి చేయుర్రి, అమెరికా UK ల కోసం ఎగబడి ఆగం కాకుర్రి. కుల వృత్తి ని నమ్ముకొని బతుకుతున్న, మీ సమాజం పోరగాళ్ల బతుకు గురించి కూడా కొంచం ఆలోచన చేయుర్రి అనే.
ఇగ రామయ్య లాంటి కట్నమిష్టులు ఇంకా సమాజంలో మిగిలి ఉంటే, అది ఆళ్ళ కొడుకులకే నష్టం తప్పా, ఇంకేం లేదు అని చెప్పాలనుకున్న. అట్లనే ఇక్కడ రామయ్య స్వార్థం అనడానికి ఏమి లేదు ఎవ్వాళ్ళైనా తమ మంచి కోసమే ఆలోచన చేస్తరు. ఇంత కట్నమిస్తనే పెళ్లికి ఒప్పుకుంటా అనుడు స్వార్థమేమి కాదు, ఆయనకున్న అవకాశం. కాకపోతే ప్రస్తుత కాలంలో ఆ అవకాశం లేదు అంతే. ఆ స్థానంలో అమ్మాయి తరుపున వారు, మాకు ఇట్లాంటి అబ్బాయి అయితేనే ఒప్పుకుంటాం అన్న స్థితికి మారింది. ఇది కూడా స్వార్థం కాదు అవకాశం. కాకపోతే ఇట్లాంటి అవకాశాలు ఉండటం ఎట్లాంటి పరిణామాలకి దారి తీస్తున్నాయ్ అన్నది ఓ తీరుబడి చర్చ అంతే. పాత కాలంలో పెళ్లి అయితలేదని అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నరు, ఇవ్వాళ అబ్బాయిల వంతు గంతే.
ప్రశ్న 7: కులం విషయంలో రామయ్య ఆలోచనలు మారడం నిజమైన పరివర్తనకు సంకేతమా, లేక పరిస్థితుల ముందు మనిషి చేసుకునే రాజీనా?
జ: నేను నా నవలలనే నేను అనుకున్నది స్పష్టంగా చెప్పిన. రామయ్య ఒక్కడు అనుకున్నంత మాత్రాన అక్కడ అయ్యేదేమి లేదు. ఆయన కొడుక్కి ఇంకో కులం సంబంధం రావాల్నాంటే అటుపక్క కులపోళ్ళు కూడా ఒప్పుకోవాలే.
దాంతరువాత కూడా సమాజం వాళ్ళిద్దరిని, వారి ఇండ్లోళ్లను గౌరవంగా చూస్తుంది అన్న నమ్మిక లేదు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎక్కన్నో అమెరికా లో AI ఇంజనీరింగ్ చదివేటోళ్ల గురించి కాదు. ఒకటే ఊరులోని రెండు వేర్వేరు కులాల వాళ్ళు, వైవాహిక సంబంధాలు ఏర్పార్చుకోడానికి, ఆ ఊరిలోని వివిధ సమాజాలు ఒప్పుకుంటయా లెవ్వా అనే.
ఇగ నవలల రామయ్య అవసరం తీరు మారిండా నిజంగానే మారిండా అంటే. రామయ్య ఏమి విలన్ ఏం కాదు. తన కులపోళ్ల పిల్లనే తనకి కోడలుగా రావాలి అనుకుండు నేరమేం కాదు, అదొక సామాజిక ఆచారం, అవసరం, వారసత్వం.
కాబట్టి రామయ్యను తప్పు పట్టడానికి లేదు. అసంటి ఎందరో రామయ్యలు ఇప్పుడు సమాజంలో ప్రశ్నలకు గురవుతున్నారు అని చెప్పనీకి అంతే. మరి నిజంగానే మారిండా అంటే, తొక్కలో కొడుకు పెండ్లి కోసం కులాచారం వదులుకొని, వేరే కులం వాళ్లతోని బంధం కలుపుకోవాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న అస్తది. దానికన్నా కొడుకుని సన్యాసంల కలిపిస్తే నయమేమో. ఇట్లాంటి ప్రతి రామయ్య, కొడుకు కోసం కులాన్ని కాదనుకుంటే రేప్పొద్దున కులాలు ఏడుంటయి. ఇక్కణ్ణే ఇంకో సమస్య అస్తది. ఇప్పుడు రామయ్య అంటే పిల్లగాని తండ్రి కాబట్టి, ఏ కులం పిల్లని చేసుకున్నా వాళ్లకు, వాళ్ళ కులానికి పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే పుట్టె వారసుడు రామయ్య కులానికే చెందుతడు కాబట్టి.
కానీ అదే టైమ్‌లో రామయ్య తోని సంబంధం కలుపుకున్న వేరే కులం పోషయ్య చేసింది తప్పే అయితది కదా. ఓ పక్క తన కులంల పిల్లగాళ్లకు అమ్మాయిలే దొరకని స్థితి ఉన్నప్పుడు, ఈ పోషయ్య పోయి తన కూతుర్ని ఇంకో కులం పిల్లగానికి ఇచ్చి, ఆళ్ళ అంశం నిలబెట్టుడు న్యాయమేనా. దానికన్నా ఆళ్ళ కులంలో పేదోనికి కట్టబెట్టుడు మంచిది కదా. కాబట్టి ఇక్కడ రామయ్య మారిండా లేడా అన్న ప్రశ్న కంటే, రామయ్య మారుడు న్యాయమా, మారకపోవుడు న్యాయమా అన్నదే ప్రశ్న. అందుకే నవలలో చివర్లో హీరో హీరోయిన్ లకు పెళ్లి అయినట్టు చూయించడానికి దైర్యం చాలలే. ఏ దైర్యం తోని ఇది న్యాయం, ఇది అన్యాయం అని చెప్పాలే. హీరోయిన్ పాత్రల ఆ పిల్ల IAS యే కావచ్చు. కానీ సామాజిక నియమం ప్రకారం తన సమాజం పిల్లగాన్నే చేసుకోవాలి కదా, అట్లా కాదనుకున్నప్పుడు ఆమె తన సమాజంకి, తన సమాజంలోని సంతోష్ లాంటి పిల్లగాళ్లకు అన్యాయం చేసినట్టే అయితది కదా.
ప్రశ్న 8: ప్రేమకూ కుటుంబ గౌరవానికీ మధ్య నలిగిపోయే సంతోష్ ద్వారా, మన సమాజంలో వ్యక్తిగత నిర్ణయాలకు ఉన్న పరిమితులను ఎలా అర్థం చేసుకోవాలి?
జ: అసలీ ప్రేమలు, ఆకర్షణ లన్నవి ఆడ, మగ కలిసి బతికే సమాజం వల్లనే వస్తున్నయి. అందుకని ప్రతి సమాజం ముందు ఓ నెల రోజులు ఓ దగ్గర కూర్చొని, ఏది మంచి ఏది చెడు అన్నది చర్చ చేసుకోవాలే. గొంగళిలో కూసోని ఎంటికలు పడ్తున్నాయ్ అన్నట్టు, పక్క కులం మగ పిల్లలతో సదువులు, కొలువులు చేసే సమాజములో ప్రేమలు పుట్టుడు తప్పు అని మాట్లాడుకున్నంత మాత్రాన అచ్చేది పోయేదేమీ ఉండదు. నిజంగా తమ కులం మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి దారుణాలను ఆపడానికి చర్యలు తీసుకోవాలి.
ఇప్పటికీ స్త్రీలు బురఖా ధరించకపోతే వారికి రక్షణ ఉండదు అనేవారిని చూస్తున్నాం. అదేమీ మూఢత్వం కాదు, వారి స్త్రీ ల రక్షణ కోసం వారు ఏర్పాటు చేసుకున్న విధానం. ఇక్కడ ఆ స్త్రీ లకు హక్కులు ఉండవా అంటే, అక్కడ స్త్రీలు, పురుషులు ఎవ్వరు లేరు, ఉన్నది ఆ మత విశ్వాసులు అంతే. ఆ మతం కోసం, అది చెప్పే నియమాలను పాటించడం వారి ధర్మం.
అట్లనే హిందూ మతంల కూడా అనేక సమాజాల వాళ్ళు ఉన్నరు. వాళ్లు నేటి ఆధునిక విద్యా విధానం వల్ల ప్రేమలు, దోమలు అన్నవి పుట్టి కుల సంకర పరిస్థితులకి నెట్టబడుతున్నరు. కాబట్టి ఆయా సమాజం పెద్దలే కూర్చొని, ఏది మంచి ఏది చెడు అన్న నిర్ణయం తీసుకోవాలి తప్పా, వేరేవాళ్లు చెప్పడానికి ఏమి లేదు.
నా నవలలో కూడా సంతోష్ కొందర్ని ఇష్టపడతడు. అది సహజ ఆకర్షణ అనుకోవచ్చు లేదా నిజంగానే ఓ ప్రేమ బంధం ఏర్పడింది అనుకోవచ్చు.
కానీ ఇక్కడ సమస్య ప్రేమ కాదు పెళ్లి. పెళ్లి అన్నది వ్యక్తిగత నిర్ణయం కాదు, అది సమాజాల భవిష్యత్‌కి సంబందించిన విషయం. కాబట్టి ఓ సమాజ పౌరుడిగా తన సమాజం కోసం త్యాగాలు చేయడం అన్నది ప్రతి పౌరుడి బాధ్యత.
సంతోష్ కూడా అదే చేసిండు. తనని ఇష్టపడే వాళ్ళ కన్నా, తన కులం వాళ్లే తనకు ఇష్టం. ఎందుకంటే తన సమాజం ఉండాలి అంటే తన సమాజం పిల్లతోనే తన జీవితం ఉండాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సమాజాన్ని బలి చేయాలని సంతోష్ ఏనాడూ అనుకోలేదు. కాకపోతే ఏళ్ల తరబడి దండయాత్రలు చేసినా, తన సమాజం తనని అల్లుణ్ణి చేసుకునేందుకు ముందుకు రాకపోవడం, అదే టైమ్‌లో ఇతర సమాజం అమ్మాయి, తనకు ప్రపోజ్ చేయడం లాంటివి సంతోష్ ని ఆలోచన ల పడేసినయ్. నేను చేస్తుంది కరెక్టేనా తప్పా అన్న డైలామాల పడ్డడు. ఇక్కడ సంతోష్ చాలా వరకు కూడా సమాజం దృష్టిలో ఆలోచన చేసిండే తప్ప, కుటుంబానికి చెడ్డ పేరు అన్నది కాదు. దేవుడు ఎవరెవరికి జంట కట్టాన్నో రాసిపెట్టి, వాళ్ళని ఆయా సమాజాలల్ల పుట్టిస్తాడు అని కూడా సంతోష్ ఓ దగ్గర చెప్తడు. కాబట్టి అతని పట్టుదల సమాజం భవిష్యత్ కోసమే. కాకపోతే తన సమాజం నుంచి తిరస్కరణ, అదే సమాజంలో ఇంకొక సమాజం నుంచి ఆహ్వానం అచ్చినప్పుడు మాత్రం కుటుంబం ఇజ్జత్ గురించి ఆలోచన చేసిండు. గిట్ల ఇంకొకళ్ళ జట్టు కట్టుడు కరెక్టేనా,
నేనే కండ్లముందు మంచి జిందగీ ఇడసపెట్టుకొని సమాజం పిచ్చి తోని బతుకుతున్ననా, నేను నా స్వార్థం చూసుకొని ఇంకో సమాజం పిల్లని పెళ్లి చేసుకుంటే రేప్పొద్దున నా సమాజంలో మావోల్లకు విలువ ఉంటదా, ఉండదా అని. గట్ల మీరన్నట్టు సంతోష్ మదనపడ్డడు. అంతకుమించి చేయడానికి సంతోష్ కేమి లేదు. అదంతే అనుకోవాలె ఇగ.
ప్రశ్న 9: ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి సమాజం వారిపట్ల చూపిన వివక్షే కారణమని కమలమ్మ ప్రశ్నిస్తుంది. ఈ సమస్యను పురుషుల వివాహ సంక్షోభం కోణంలో చెప్పాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?
జ: నిజం మాట్లాడుకోవాలంటే ఆ సన్నివేశం రాస్తున్నప్పుడు భావోద్వేగంతో అచ్చిన మాటలు అవి. క్లైమాక్స్‌లో రామయ్య, కమలమ్మ కలిసి మాట్లాడుకున్నప్పుడు అస్తయి ఆ మాటలు. పుట్టిన బిడ్డనేమో వరి గింజ పెట్టి సంపుడాయే, దేశంలో ఎందరో ఆడోళ్ళ మీద అత్యాచారాలు జరగబట్టే. గట్ల ఆడబిడ్డను పుట్టనియక పోతిరి, పుట్టిన బిడ్డను బతకానీయకుండా చేయబడితిరి. ఇంకా ఏమిటీకి ఆ దేవుడు ఆడబిడ్డ ను ఈ భూమి మీదకు పంపిస్తాడు అని రాసిన. నాకు ముఖ్యంగా ఈ సినిమాలు చూసినప్పుడు దాంట్లో స్త్రీలను చూపెట్టే విధానం చూసినప్పుడు, చానా బాధ అనిపిస్తది. అసలు మనం బతుకుతుంది నీతి నియ్యాతి గల సమాజంలోనేనా అనిపిస్తుంది. ఒక స్త్రీని అట్లా వస్తువుగా వాడుకుంటున్న ఇండస్ట్రీ గురించి ఈ జనాలు ఎందుకు పట్టించుకోరు అనిపిస్తది.
ముఖ్యంగా నేను వాట్సాప్ లో కొన్ని సినిమా ఆడిషన్స్ కాల్స్ చదివిన. దాంట్లో ఏమి రాస్తారు అంటే – “లిప్ లాక్ సీన్స్‌కి, ఒప్పుకునే అమ్మాయిలు కావాలి, బోల్డు సీన్స్‌కి ఒప్పుకునే అమ్మాయిలు కావాలి” అని.
అసలు వీళ్ళు సినిమాలే తీస్తుర్రా ఇంకా ఏదైనా చేస్తుర్రా అనిపిస్తది. ఇంత దరిద్రాన్ని ఈ సమాజం ఎందుకు ఉపేక్షిస్తుంది అనిపిస్తుంది. అట్లాంటి కాల్స్‌కి అటెండ్ అయ్యే లేడీ ఆర్టిస్ట్‌లకు ఎట్లాంటి విలువ ఉంటది అక్కడ. వాళ్ల దృష్టిల వీళ్ళు ఎట్ల కనిపిస్తరు. ఇట్లా ఎన్నెన్నో ప్రశ్నలు. ఇవే కాకుండా పత్రికల్లో సామూహిక అత్యాచారాలు గురించి చదివినప్పుడు కూడా చానా బాధ అనిపిస్తది. వీటన్నిటికి సమాజం కారణం కాదా అని అడగాలి అనిపిస్తది. ఆ బాధ తోనే అక్కడ ఆ మాటలు అచ్చినాయ్ కావచ్చు.
ఇగ మీ ప్రశ్న విషయానికి వస్తే, అసలు సంక్షోభం రావడానికి స్త్రీ పురుష నిష్పత్తి తగ్గడం కూడా ఓ కారణమే. పురుషుడు పున్నామ నరకం నుంచి కాపాడతాడు అన్న నమ్మకంతో, నలుగురు, ఐదుగురు అమ్మాయిలు పుట్టినా మళ్ళీ కొడుకు కోసం ప్రయత్నం చేసే వారిని చూసే ఉంటాం. కొడుకు లేకపోతే ఏదో అయిపోతది అన్న స్థితికి దిగజారినం కాబట్టే స్త్రి పురుష నిష్పత్తి తగ్గింది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నట్టు సమాజము చేసిన దానికి శిక్షే నేటి పరిస్థితులు. పలానా సామాజిక వర్గంలో అమ్మాయిలు తక్కువండి అని ఏదో casual గా అంటుంటరు.
కానీ అది ఆ సమాజం, దానిలోని మనుషుల పైశాచిక స్వరూపానికి నిదర్శనం అని మనం భావించచ్చు. ప్రతీ ఒక్కనికీ కొడుకే కావాల్సి వచ్చినప్పుడు, రేప్పొద్దున ఆ కొడుకు పెళ్లి కూడా ఇంకొకని కొడుకుతోనే జరిపించుకునే రోజులు అస్తయి అన్న సోయి ఉండాలి. అమ్మ లేకపోతే నేనెట్లా ఈ భూమి మీదకు అచ్చేటోన్ని అన్న ఎరిక ఉండాలి. అమ్మ లాంటి స్త్రి ల ను సినిమాలు ఇంటర్నెట్లు ఎట్లా చూపిస్తున్నాయి, దాని పర్యావసనం ఏంటి అన్న ఆలోచన ఉండాలి. అవన్నీ ఇడిసిపెట్టి గాలి బతుకు బతికితే, ఏదో రోజు దానికి జవాబు చెప్పాల్సి వస్తది.
జంగల్ మొత్తం ఖరాబ్ బట్టించి బిల్డింగ్లు కట్టుకున్న పాపానికి ఇయ్యాల ఎల్‌నినో పరిస్థితులు రాలేదా. గట్లనే ప్రతీ చర్యకి ప్రతిచర్య అన్నది ఉంటది. ఆడపిల్ల మీద గౌరవం లేని సమాజంలో ఆడపిల్లను పుట్టించాల్సిన అవసరం లేదు అని దేవుడు అనుకుండేమో అని అందుకే రాసిన.
ప్రశ్న 10: నవలలో హాస్యం వెనుక సంతోష్ అనుభవించే తీవ్రమైన ఒంటరితనం దాగి ఉంది. నవ్విస్తూనే పాఠకుడిని కలవరపెట్టడం మీ కథన వ్యూహమా?
జ: ఒకోని ఏడుపు ఇంకొకనికి నవ్వు పుట్టిస్తది అన్నట్టు, సంతోష్ పడే కష్టాలు చదివేటోళ్లకు నవ్వు తెప్పించచ్చు. కానీ మనసుల మాత్రం వాళ్లల కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంటది. సంతోష్ మీద కొంచం ప్రేమ కూడా పుడతది.
ఒకవేళ అట్లా కాకుండా నేను సంతోష్ జీవితం గురించి విషాదంగా రాసిన్ననుకో, అప్పుడది జనాలకు ఎట్లా అనిపిస్తది అంటే, ఆ ఇగ ఈ సంతోష్ ఏదో పేద్ద దేశోద్దారకుడు, ఇగ వాడికి పెళ్లి కాకుంటే దునియా నడవనే నడవదా అన్న ఆలోచనకి తీసుకొని పోతది.
కాబట్టి జనాలకు సంతోష్ బాధ అర్థం కావాలే అంటే, అతని జీవితంలోని కష్టాలు, చదివే వాళ్లకు విషాదం లెక్క కాకుండా ఓ పజిల్ లెక్క బాధతో నిండిన హాస్యం లెక్క ఉండాలి అనిపించింది.
ముఖ్యంగా అఖిల్ అనే పాత్రతోని మాట్లాడినప్పుడు కానీ, జిమ్ము, బట్టతల ట్రాన్సప్లాంట్ సన్నివేశాలు కానీ, సంతోష్ ఎంత బాధ పడుతున్నడు అన్నవి చెప్పుకుంటనే నవ్విస్తయి.
ముఖ్యంగా నా నవలలో కథా నాయకుడు ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేస్తడు. అది జనాల్లో స్వీకరణ పొందాలి అంటే అతని భావోద్వేగాలు జనాలు అర్ధం చేసుకోవాలే. అందుకని సంతోష్ అనే పాత్రను సమాజము అనబడే రంగుల రట్నం మీద నిలబడి సర్కస్ ఫీట్లు చేసేటోని లెక్క జనాలకి చూపెట్టిన.
సర్కస్‌లో ఆ ఫీట్లు చూసి నవ్వుకుంటూనే, అయ్యో పాపం ఆళ్ళు ఎంత, కష్టపడుతున్నరు అని, జనాలు అనుకుంటూ ఉంటరు. తమకు చేతనైన విధంగా ఆ సర్కస్ వాళ్లకు సహాయం చేయాలి అనుకుంటరు. ఇట్లాంటి కష్టం ఇంకొకరికి రావద్దు అనుకుంటరు.
అట్లనే మన సంతోష్ కష్టాలు చదివిన వాళ్ళు కూడా ఆ కథలో మమేకం అయిపోయి, ఆ పరిస్థితులకి గల కారణాల గురించి, ఓ రెండు మూడు నిముషాలు చర్చ చేసుకొని, దాన్ని overcome చేసేటందుకు చిన్న ప్రయత్నం చేసినా, నా రచనకు ఓ అర్థం ఉంటది. అట్లా కాకుండా నేనేదో దేవదాస్ కథ రాసినట్టు, ఏడుపు సన్నివేశాలు రాసి పడేస్తే, మెయిన్‌గా జనాలకు ఎక్కక పోవచ్చు. ఒకవేళ ఎక్కినా అదేదో విరహ వేదన కావ్యం అయి కూర్చుంటుందే తప్పా, సామాజిక బాధ్యతను ప్రేరేపించేదిగా ఉండదు. మీదికేంచి మనం వివిధ సామజిక సమూహాలను గురించి చర్చ చేస్తున్నాం కాబట్టి, ఒక సమాజం హీరో, ఇంకో సమాజము హీరోయిన్ గురించి మదన పడ్డాడు అని రాస్తే దరిద్రంగ ఉంటది. దానికి తగిన సన్మానం కూడా అయితది జనాల నుంచి.
కాబట్టి అంశాన్ని ప్రేక్షకులు ఆస్వాదించి, ఆలోచించే విధంగా ఉండాలి అనే హాస్యరసం తీసుకున్నా. ఇంకా ముఖ్యం గా ఏందంటే ఈ నవలను ముందు సినిమా కథగా రాసుకున్న కాబట్టి ఎక్కువ జనాలకు రీచ్ ఐతుంది అని హాస్యంను ఎంచుకున్నా.
ప్రశ్న 11: సంతోష్ జీవితంలో ఎదురయ్యే మానసిక సంక్షోభం ద్వారా, పెళ్లిని జీవిత విజయానికి కొలమానంగా చూసే సమాజానికి ఏ ప్రశ్న వేయాలనుకున్నారు?
జ: ఇతర దేశాల సంస్కృతులతోని పోల్చి చూసుకున్నప్పుడు భారతదేశం గొప్పతనం వివాహ బంధంలోనే ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఇవే భారతదేశంకి మకుటం అని కూడా చెప్పచ్చు.
కానీ ఆధునిక కాలంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అన్నవి మొత్తానికి మాయం అయిపోయినయ్. గదే టైమ్‌ల ఈ సహజీవనం సంస్కృతి అన్నది కొత్తగా పుట్టుకొని వస్తుంది.
అయితే మన దేశం ఇంకా అంత దరిద్రంగా తయారు అయిపోలేదు గాని, మనకు కొత్త సమస్య ఏమచ్చిందంటే సమాజాల్లో ఆడపిల్లలు తక్కువ ఉండటం. ఇదో తలకాయ నొప్పి వచ్చింది కొత్తగా.
అయ్యో పిల్లగానికి ఇన్నేళ్లస్తున్నయ్ పెళ్లి కాలేదా ఇంకా, పిల్లకి ఇన్నేళ్లు అచ్చినయ్ ఇంకా పెండ్లి చేయరా. గిదేం పద్దతి . ఏ వయసు ముచ్చట ఆ వయసుల కావాలే. అయ్యింత ఆడపిల్ల కాని పని చేస్తే ఎంత సిగ్గు చేటు.
గిట్ల మన సమాజం మొత్తం ఎప్పుడు చూడు లగ్గం చుట్టే మాట్లాడతది. ఈ మధ్య కుల వృత్తులు నాశనం అయినా కాడి నుంచి మీవోనికి కొలువు దొరికిందా ఏమైనా అన్న ప్రశ్న కూడా వచ్చింది అనుకోర్రి.
కానీ సమాజంకి మొదటి నుంచి పెండ్లి అన్నది ఒక ల్యాండ్ మార్క్. వృత్తులు నాశనం అయినయ్ కాబట్టి ఆ ల్యాండ్ మార్క్‌కి మంచి కొలువు ఉండుడు అవసరం అయింది గాని గప్పట్ల పెళ్ళికి కొలువుకి సంబంధం లేకుండే ఎందుకంటే ఎవ్వరి వృత్తి వారికి ఉంది కదా. ఇంకేం రంది. ఇప్పటిలెక్క డాక్టర్ వైతావా, ఇంజనీర్ ఐతావా అన్న లొల్లి లేకుండే. ఇవన్నీ కుల వృత్తుల విధ్వంసం వల్ల పుట్టుకొని వచ్చిన ముచ్చట్లే.
కాకపోతే అందరికందరు డాక్టర్లైతే పేషెంట్ లెవరుంటరు అన్నట్టు. అందరికీ మంచి నౌకరీ దొరుకుడు అసాధ్యం.
కాకపోతే ప్రయివేట్ సంస్థల్లో కూడా మంచి జీతం, ఉద్యోగ భద్రతా ఉండే వ్యవస్థను తెచ్చుకోవాలి. కానీ మన సర్కార్లకు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా దున్నపోతు మీద వాన పడ్డట్టు, కొంచం కూడా బాధ అనిపియదు కదా కాబట్టి అది కూడా అయ్యేపని కాదు అని చెప్పచ్చు.
ఇగ మనకు మిగిలింది వాస్తవంలో బతుకుడు. అంటే మంచి జీతం ఉన్నోనిదే కాదు, మామూలు పని చేసే టోడు కూడా మనిషే. వానికి కూడా గౌరవం ఇయ్యాలె అన్న సోయి ఏర్పడాలే సమాజంలో. అప్పుడే కుల వృత్తి చేసుకునే వాళ్లకు కూడా పెళ్లికి పిల్లలు దొరుకుతరు.
అసంటివి ఏమి లేనప్పుడు సంతోష్ లాంటి వాళ్లకు ఇదో పెద్ద తలకాయ నొప్పి అయి కూసుంటది. నేనొక చోట రాసిన కూడా, సంతోష్ వాళ్ళ అమ్మతోని అంటాడు “లగ్గం చేసుకుంటా అంటే కులంల పిల్ల దొరకదు, పక్క కులం పిల్లని చేసుకుంటా అంటే అయ్యోప్పుకోడు, సన్యాసంల కలుస్తా అంటే నువ్వొప్పుకోవు, పెళ్లి చేసుకోకుండా ఉంటా అంటే ఈ దిక్కుమాలిన సమాజం ఒకటి లగ్గం అయ్యిందా అయ్యిందా అని సంపుతది” అని. ఇట్లా ఎట్లా బతుకుదాం అన్న సంతోష్ లాంటోళ్లకు పరేషానే ఉంటది.
కాబట్టి మారిన పరిస్థితులకనుగుణంగా సమాజం కూడా మారాలే. పలానా వానికి మంచి నౌకరి, నీకు ఏమి లేదు అంటే. ఎవని బతుకు ఆనిది కదా. అసలు భారతీయ సామాజిక సూత్రం ప్రకారం కుల వృత్తి చేసుకుంటా బ్రతికేటోడే గొప్పోడు, ఎందుకంటే తరాల వారసత్వాన్ని నిలుపుతున్న గొప్ప మనిషి వాడు. అదిడిసిపెట్టి ఓ గింత జీతమ, గీ కొలువా అని ఎక్కిరించుడు మంచి పద్ధతి కాదు. పెండ్లికి మా కులపోడే కావాలి గాని ఆడు కుల వృత్తి చేసుకుంటా బతుకుతా అంటే మాత్రం మేము ఒప్పుకోము అనుడు కూడా మారాలి. కుల వృత్తి ఉన్నప్పుడే కులం బతుకుతది. వృత్తే వద్దు అనుకున్నాక నీకు కులానికి సంబంధం ఏముంది ఇంక. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి.
ఇవేమి పట్టని సమాజం ఎప్పటి లెక్కనే పిల్లగాడికి, పిల్లకి పెళ్లి అవుడు పెద్ద ఘనకార్యం అన్నట్టు తాప తాపకి పెళ్లి అయ్యిందా, పెళ్లి అయ్యిందా అని మాట్లాడతాం అంటే నడవదు కదా. ఆడ కుల వృత్తి కాని కొలువు, మళ్ళీ ఆ కొలువుకి లక్షల్లో జీతం ఉంటేనే పిల్లనిస్తుర్రు అని తెలిసి కూడా, ఏమి తెలియనట్టు అడిగి ఎక్కిరించుడు శునకానందం పొందడం లాంటిదే అని నా అభిప్రాయం.
ప్రశ్న 12: లాస్య ప్రేమకథలో కులం ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. ప్రేమను అంగీకరించలేని సమాజం సంప్రదాయాల పేరుతో ఏ విలువలను కాపాడుకుంటోంది?
జ: మనమేదో నాగరికులం అన్న భ్రమలో కులం ఒక అడ్డుగోడగా నిలుస్తుంది అని అనచ్చు కాని, కులం అన్నది వాస్తవం. కాబట్టి ఈ ప్రేమ, దోమ అన్నది సమాజాలకు పట్టిన పీడ అనచ్చు. అసలు భారతీయ వివాహ వ్యవస్థ ఏర్పాటే తరాలుగా వంశాన్ని కాపాడేందుకు ఏర్పాటు అయినప్పుడు, ఎవరో నచ్చిర్రు అని కులం గోత్రం పట్టింపులు లేకుండా పెళ్లి చేసెయ్యాలి అనడం ఓ రకంగా భస్మాసుర హస్తం.
ఎందుకంటే సమాజం మొత్తం కులంలో బతుకుతున్నప్పుడు, ఈళ్లిద్దరూ మాత్రం కులం లేనోళ్ళు ఎట్లా ఐతారు. కాబట్టి లాస్య చేసింది చాలా తప్పు అనే మాట్లాడుకోవాలి. అదే కరెక్ట్ పద్దతి.
ఏదో నాలుగు సినిమాల్లో చూపించినంత మాత్రాన మనుషులు అందరు ఒక్కటై పోరు. ఎవరి వర్గం వాళ్ళది. ఎవరి వారసత్వం వాళ్ళది. అది మరిచిపోయి వయసులో ఉండే వ్యామోహాలకు ప్రేమ పేరు పెట్టి సాంప్రదాయాలను నాశనం చేస్తం అన్నది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మార్పు అన్నది వ్యవస్థ నుంచి రావాలి తప్పా వ్యక్తి నుంచి కాదు.
తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హాక్కు అని అనంగానే రియాలిటీ లో స్వాతంత్రం వచ్చేయలేదు కదా, 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్య ప్రకటన వచ్చినంకనే దానికి వాస్తవ రూపం వచ్చింది.
ఎందుకంటే అప్పుడు దానికి సామాజిక ఆమోదం ఉంది కాబట్టి. అట్లా కాకుండా నేను మారితే సమాజం మారుతుంది అన్నట్టు చేస్తే స్వాతంత్రం వచ్చేదే కాదు ఇంకా.
అట్లనే కులం దాటి పెళ్లిళ్లు చేసుకోవడాలు లాంటివి ముర్కత్వం అంతే. తన కులం మీద గౌరవం లేకపోవడమే. కాబట్టి కథలో లాస్య కానీ, ఆ కాకినాడ అమ్మాయి కానీ IAS అమ్మాయి గాని తీసుకున్న నిర్ణయాలు వారి వ్యక్తిగతంగా మంచివేమో కానీ, సామాజికపరంగా హర్షనీయం కావు.
ముఖ్యంగా ఈ లాస్య ఆనేటామే 10th క్లాస్ లనే సంతోష్‌ని ఇష్టపడ్డ అని చెప్తది. బీటెక్ వరకు నువ్వే నా కలల ఉన్నావ్ అని చెప్తది. ఇవన్నీ సినిమాలు ప్రభావం వల్ల వచ్చే ఊహలు తప్పా ఇంకేం కావు. ఒకవేళ అది ఆమె వ్యక్తిగత ఇష్టం అనుకున్నా కూడా ఓ సామాజిక చట్రంలో ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మన ఆలోచనలు, ఇష్టాయిష్టాలు ఉండాలి.
మనం అనుకున్నది ప్రతిదీ అభ్యుదయం అయిపోదుగదా. అది నిజంగా అభ్యుదయం అని అనుకున్నప్పుడు దాన్ని ముందు మనం మన సమాజంలో ప్రతిపాదన చేయాలి. సమాజం తీర్పు పట్టి ముందుకు పోవాలి. అవేమి లేకుండా మనకు మనం ధిక్కరించి ఆ పూటకి విజయం సాధించాం అనుకున్నందు వల్ల, సమాజానికి ఒరిగేది ఏమి ఉండదు. పైగా సంతోష్ లాంటి నిజమైన సామజిక పౌరులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రేమకు కులం అడ్డుగోడ అన్నది సినిమాలు తెచ్చిన పైత్యం.
అసలు ఈ అర్థం పర్థం లేని సదువులు, ఆగమాగం కెరీర్ ప్రయత్నాలే ఆధునికత భరతదేశానికి తెచ్చిన పెద్ద దరిద్రం అన్నది వాస్తవం. ఆ కాలంలో 5 ఏళ్ళకే పెళ్లిళ్లు అయిపోయేవి. మరి వాళ్లకు ప్రేమలు లేనట్టేనా. ఇక్కడ విషయం ఏందంటే. భారతదేశం అనేకానేకా సమాజాల సమూహం. ప్రతి సమాజానికి తమ ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వృత్తులున్నాయి. వాటిని పరిరక్షించుకునే భాగంలోనే వివాహ వ్యవస్థ ఏర్పాటు జరిగింది. కొనసాగుతుంది.
వివాహంకి ప్రధాన కారణం వంశోద్దారణ, కులాన్ని కాపాడుకోవడం. ఆ రెండు విషయాలను వదిలేసి, ఇదేదో వ్యక్తిగతం మొహం కోసం అన్నట్టు మాట్లాడుకోవడం అన్నది పాశ్చాత్య సంస్కృతి, సినిమాల ప్రభావం తప్ప ఇంకేం కాదు.
కాబట్టి ఇలాంటి విశృంఖల భావజాలాన్ని మనం కచ్చితంగా ఖండించాలి. మనిషి తన కుటుంబం కోసం, కులం కోసం, దేశం కోసం బతకాలి తప్పా అతని వ్యక్తిగతం కోసం ఏదైనా చేస్తాను, దేన్నైనా మీరతాను అన్నది చాలా ప్రమాదకర విషయం.
అలా వదిలేస్తే కొన్ని తరాలకు మనిషి ఒంటరి అయిపోయి వినాశనం కోసమే బ్రతకుతడు. కుటుంబాలు, కులాలు ఉన్నప్పుడే నియంత్రణ, మంచి చెడుల విచక్షణ అన్నవి ఉంటాయి. అవేమి లేనప్పుడు అరాచకమే మిగులుతది.
ప్రశ్న 13: కమలమ్మ పాత్రలో కొడుకుపై ప్రేమతోపాటు సామాజిక కట్టుబాట్ల ప్రభావమూ కనిపిస్తుంది. ప్రేమించే తల్లిదండ్రులే పిల్లల స్వేచ్ఛకు అడ్డంకులుగా మారడాన్ని ఎలా విశ్లేషిస్తారు?
జ: నా నవలలో కమలమ్మ పాత్ర తీసుకుంటే, తన కొడుకు రాజా లెక్క బతకాలి అనే మనస్తత్వం ఆమెది. అందరు తల్లులు అట్లనే ఉంటరు. దాన్నే చూపించిన. ఓ దగ్గర సంతోష్ ఒక సంబంధం ఖాయం కావడం కోసం హైదరాబాద్‌ల ఉద్యోగం చేస్తాను అన్నప్పుడు కమలమ్మ “మనకేం తక్కువ బిడ్డా, దిక్కుమాలిన సంబంధం కోసం నువు హైదరాబాద్ పోవన్న, అదేమీ పెద్ద సినిమా హీరోయిన, దానికన్నా మంచి సంబంధం అస్తది తి అంటది”.
అట్లనే సంతోష్ నిర్వేదంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి విఫలం అయి, మళ్ళీ హైదరాబాద్ పోతా అన్నప్పుడు “మళ్ళీ ఏమి చేసుకోనికి రా, ఏడీకి పోవుడు అద్దు” అంటది. అయినా సంతోష్ పోతా అనుడు తోని “ఒరేయ్ మళ్ళీ తాప గట్లాంటి పిచ్చి ఆలోచన అస్తె గనక నీకోసం ఈడ రెండు ముసలి పానాలు బతుకుతున్నయి అని మరిచిపోకు బిడ్డా” అంటది. అట్లా నవల మొత్తం కమలమ్మ పాత్ర ఒక గొప్ప పాత్రగా చెప్పచ్చు. కొడుక్కి పెళ్లి చేయడం కోసం దాదాపు 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేయడం, కండ్ల ముందే తమ్ముని కూతురు సంబంధం పోవడం, ఎన్ని సంబంధాలు చూసినా ఖాయం కాకపోవడం, ఇట్లా సంతోష్‌తో పాటు కమలమ్మ కూడా చానా మానసిక క్షోభకి గురయ్యే పాత్ర.
సామాజిక కట్టుబాట్లు విషయానికి అస్తె కమలమ్మ ఎప్పుడు కూడా పలానా సమాజం అమ్మాయే కోడలు కావాలి అని ఎక్కడా అనదు. కానీ అలాంటి ఆలోచననే లేని పాత్ర ఆనుకోవచ్చు. కాకపోతే తన తమ్ముని కూతురుతో పెళ్లి చేయిస్తే కళ్ళముందే కొడుకు కోడలు ఇద్దరు సంతోషంగ బతుకుతరు అన్న ఆశతో కనిపిస్తుంది. అలా ఆమెది చాలా చిన్న ప్రపంచం అని చెప్పచ్చు. కానీ సంతోష్ బాధలు చూసి, చివరికి తన ప్రపంచాన్ని దాటి వచ్చి రామయ్యతో “ఇంకో కులం అమ్మాయినైనా చూడుర్రి” అని అడుగుతది. అప్పుడు రామయ్య “దా, అందరు నీకే ఇస్తాం అని కుర్చున్నారు, అన్నీ కులాల్లో ఇదే సమస్య అంట, ఆడపిల్లలు తక్కువ ఉన్నారాంట” అని అనంగనే కమలమ్మ తన అంతరంగం ఆవిష్కరణ చేస్తూ “ఆడపిల్లను పుట్టనియక పోతిరి, పుట్టిన స్త్రీలని సమాజంలో బతకనియకుండా చేయబడితిరి, ఇంకా ఆ దేవుడు ఎందుకు పుట్టానిస్తాడు ఆడపిల్లను” అని అంటది. ఈ మాటల ద్వారా ఆమె ప్రపంచం చిన్నదే అయినా, ఆమెకు అన్నింటి గురించి అవగాహనా ఉంది అని తెలుస్తుంది. అట్లనే బిడ్డకు 18 ఏళ్ళకే పెళ్లి చేసి, కొడుకుని మాత్రం ఏళ్ళు వచ్చినా చిన్న మొల్లి లాగా చూస్తున్నావ్ అని సంతోష్ వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ కమలమ్మను అడగడం కమలమ్మ మనస్తత్వం తెలియచేస్తది. అట్లనే శుక్రవారం ఉపాసం చేస్తే జల్దిన లగ్గం అయితది అని తన కొడుకుతోని ఉపాసం చేయించడం, సంతోష్‌కి సంబంధం ఫెయిల్ అయిన ప్రతీ సారి సంతోష్‌కి అండగా ఉంటూ దైర్యం చెప్పడం వంటి సన్నివేశాల్లో ఒక మంచి మనసు గల అమ్మగా కమలమ్మ పాత్రను చూడచ్చు.
ప్రశ్న 14: తెలంగాణ మాండలికాన్ని ఎంచుకోవడం కేవలం కథకు సహజత్వం తీసుకురావడానికేనా, లేక ఆ భాషలోనే చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన సామాజిక సత్యం ఉందా?
జ: నేను తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి తెలంగాణా యాసలో రాద్దాం అని అనుకున్నా. మాములుగా రాసుడు కన్నా యాసలో రాయడం వల్ల ఆ పాత్రను ఒడిసి పట్టుకోవడం తేలిక అయితది అని నా నమ్మకం. ఇక్కడ ఈ పాత్ర తెలుగులో ఎంత గొప్ప పదాలను ప్రయోగిస్తుంది అన్న ముచ్చట కన్నా, ఆ పదం ఆ పాత్ర హృదయం లోంచి వస్తుందా లేదా అన్నదే ముఖ్యం. నేను రాస్తున్నది గ్రామీణ ప్రాంతం మనుషుల నవల. కాబట్టి సంభాషణ అన్నది యాసలో ఉంటేనే రచనకు అందం అని నమ్మి యాసలో రాసిన. మనం ఏ యాస తీసుకున్నా దాంట్లో పదాలు అన్నవి సక్కగ గుండెకు గుచ్చుకునేటట్టు ఉంటయి. వాటిల డ్రామా ఉండదు. ఉన్నదున్నట్టు ఉంటయి. అవతలి వాళ్లకు ఓ వాస్తవిక రచన చదువుతున్నాం అన్న అనుభూతి కలగాలి అంటే కచ్చితంగా యాసలోనే రాయాలి. ప్రేమ, శృంగారం నవలలకు యాస నొప్పదు కావచ్చు కానీ, సామాజిక నవలకు యాస ఓ అందం తెస్తది అని నా ఫీలింగ్. యాసలో రాస్తున్నప్పుడు హాస్య స్పోరక వాక్యాలు కూడా అనుకోకుండా వచ్చి చేరుతుంటయి, దాంతోని రచన ఇంకా బాగా వస్తది అన్నది నా ఆలోచన. అందుకని తెలంగాణా యాసలో రాసుడు జరిగింది.
ప్రశ్న 15: మీ నవలలో వివాహ సంబంధాలు ఆస్తి, ఉద్యోగం, కులం, హోదా చుట్టూ తిరుగుతాయి. ఈ లెక్కల మధ్య మనిషి వ్యక్తిత్వానికి, ప్రేమకు నిజంగా ఎంత స్థానం మిగిలింది?
జ: నా నవలలో కాదు సమాజంలోనే వివాహ సంబంధాలు ఆస్తి, ఉద్యోగం, హోదా చుట్టూ తిరుగుతున్నాయి.
వీటన్నిమిటి కన్నా ముఖ్యంగా కులం చుట్టూ తిరుగుతున్నాయి. అసలు ఇంతకుముందు చెప్పినట్టు వివాహం ఏర్పాటే వంశాన్ని, కులాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి కులం చుట్టూ తిరగడంలో తప్పు లేదు. కాకపోతే ఆస్తులు చుట్టూ తిరగడం అన్నదే అనర్థాలకు కారణం ఐతుంది. మనకు ఆస్తులు ముఖ్యమా కులం ముఖ్యమా అన్నది ఆయా సమాజాలు ఆలోచన చేసుకోవాలి. కుల వృత్తి గొప్పదా ఇంకో వృత్తి గొప్పదా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఇగ వ్యక్తిగతం, వ్యక్తిత్వం అన్నవి భ్రమ పదార్దాలు. సామాజిక ఛట్రంలో వ్యక్తిగతం ఏమి ఉండదు.
ఇగ సమాజాన్ని కాదనుకొని ఆలోచన చేయడం అన్నది అభ్యుదయం, అదొక గొప్ప వ్యక్తిత్వం అన్నది కూడా ఆధునిక కాలం పైత్యం తప్పా ఇంకొకటి కాదు.
ఇగ యువతి యువకుల ప్రేమ అన్నది పాశ్యత్య పైత్యం. దాన్ని పూర్తిగా ఖండించాలి. వివాహం అన్నది సామాజిక ఆచారం. కాబట్టి ప్రేమ కన్నా సామాజిక నియమమే ఆ సామాజిక పౌరులుగా ఆ యువతి యువకుల విధ్యుక్త ధర్మం కావాలి.
ప్రశ్న 16: చివర్లో సంధ్య ప్రేమను వెల్లడించినా, సంతోష్ వివాహం జరుగుతుందో లేదో తేల్చకుండా కథను ముగించారు. ఈ అసంపూర్ణ ముగింపే మీరు చెప్పాలనుకున్న సంపూర్ణ సందేశమా.
జ: ఇంతకుముందే చెప్పినట్టు అది అసంపూర్ణ ముగింపు అనడం కన్నా, అక్కడ నేనేం చేయాలో తెలియక వదిలేయడం అనచ్చు.
వేల సంవత్సరాల వారసత్వాన్ని తక్కువ చేసేదిగా సంతోష్ సంధ్యకి కులాంతర వివాహం జరిగినట్టు ముగింపు ఇవ్వచ్చు. కానీ సమాజంలో లేని ముగింపు మనం ఎట్లా ఇవ్వగలం.
అంతే కాకుండా తరాల ఆచారాన్ని తక్కువ చేసేటట్టు ఎట్లా ఓ కొత్త వాదం తేగలం. అసలు వివాహ వ్యవస్థ అన్నదే కులం కాపాడుకోసం అయినప్పుడు, కులం దాటి పెళ్లిళ్లు చేసుకోవడం ఒప్పు అనడం కరెక్ట్ కాదు కదా.
వాళ్ళిద్దరికి పెళ్లి నేను కాదు సమాజం చేయ్యాలే. ఒక దిక్కు కులమే ప్రాణంగ బ్రతికే సంతోష్‌కి పిల్ల దొరకత లేదు. దొరుకుతుంది అన్న ఆశ లేదు. ఇట్లాంటి సమయంలో ఇంకో కులం అమ్మాయిని అతను చేసుకోవడం ధర్మమేనా. దానికి అతని కులం ఒకే అంటదా. వాళ్ళు ఓకే అన్నా కూడా, IAS లాంటి పెద్ద ఉద్యోగం చేస్తూ తన కులం వాన్ని కాకుండా ప్రేమ పేరుతో, ఇంకో కులం వ్యక్తితో పెళ్లికి సిద్దపడుతూ సంధ్య తీసుకున్న నిర్ణయం సరైనదేనా. ఇది తన కులం లోని సంతోష్ లాంటి వాళ్లకి చేస్తున్న అన్యాయం కాదా.
కులాన్ని కాపాడుకోవడం కోసం లక్షలాది జనాలు కులంలో అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం తిరుగుతుంటే, కొందరు యువతి యువకులు ప్రేమ పేరుతో కులం దాటి పోతుండటం కరెక్టేనా.
ఇది వారు వాళ్ళ కులాలకు చేస్తున్న అన్యాయం కాదా. ఇట్లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలిసినప్పుడే సంతోష్ సంధ్యల వివాహం గురించి ఓ నిర్ణయం తీసుకోగలం. ఓ చర్చను ప్రజల్లో తేవాలి అని తప్పా, ఓ తీర్మానం చేసెయ్యాలి అని అనుకోవడం రచయిత ఉద్దేశం కావద్దు.
ఎందుకంటే రచయితకి తెలిసిన లోకం చాలా చిన్నది. దాన్ని మించిన దునియా బయట ఎంతో ఉంది. అది చూడకుండనే బావిలో కప్పలాగా బెక బెక మనడం వల్ల సాధించేది ఏమి ఉండదు.
కాబట్టి నవలలో నేను ఆ పెళ్లిని అట్లనే వదిలేసినా. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. పోనీతి అని సమాజము కూడా ఒప్పుకుంటాది.
కానీ అది కాదు కదా ముచ్చట. పైన నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఎవడిస్తడు. సంతోష్ ఇన్నాళ్లు పడ్డ మథనం కరెక్టా, సంధ్య అభ్యుదయం కరెక్టా అంటే, ఏది కరెక్ట్ అందాము అన్నది సమస్య. దానికి సమాజమే జవాబు ఎతుక్కోవాలే..
ప్రశ్న 17: ఈ నవల చదివిన తర్వాత పాఠకుడు తన ఆలోచనను మార్చుకోవాలని మీరు కోరుకునే ఒకే ఒక్క విషయం ఏమిటి?
జ: ఒక్కటేందంటే కుల వృత్తి చేసుకునే వాళ్లకు అమ్మాయిని ఇవ్వడం నామోషిగా భావించకుర్రి అని అయితే చెప్తా.
అదే టైమ్‌లో కులాన్ని దాటి ప్రేమ వివాహాలు చేసుకోండి అని అనుడు అభ్యుదయం కన్నా అసాంఘికమయితది అని కూడా చెప్తా. ఎందుకంటే సమాజము ఒప్పుకోనిది, చెప్పడానికి మనం ఎవరం.
అట్లనే కులానికి గౌరవం ఇచ్చేది ఉంటే, కుల వృత్తులకు అవి చేసేవాళ్లకి కూడా గౌరవం ఇవ్వుర్రి. చూపు దేవుని మీద చిత్తం ప్రసాదం మీద అన్నట్టు, అమెరికా సంబంధం, సాఫ్ట్వేర్ సంబంధంల మీద ప్రేమ పెట్టుకొని, కులం కోసమే బ్రతుకుతున్నాం అన్న డ్రామాలు మానుకోర్రి. మీ కులం పిల్లగానికి మీరే పిల్లనివ్వకపోతే వేరే కులపోడు ఎందుకిస్తడు అన్నది ఆలోచన చేయుర్రి అని మాత్రం చెప్తా.
అట్లనే ప్రేమ వివాహాలు గొప్పవి, ప్రేమ గొప్పది అన్నవి గాలి కబుర్లు. ఒక రచయితగా అలాంటి పైత్యాన్ని సపోర్ట్ చేయద్దు. కాబట్టి వీలైనంత వరకు అమ్మాయిలు కూడా కులం దాటి ప్రేమలు మానుకోండి, మీ కోసం మీ కులాల్లో ఎందరో సంతోష్‌లు ఎదురు చూస్తున్నరు. వారి ఆశలను, జీవితాలను నాశనం చేయకుర్రి అని చెపుదాం అనుకుంటున్న..
ప్రశ్న 18: మీ తదుపరి సాహిత్య ప్రయాణం ఎలా ఉండబోతోంది? త్వరలో మీ నుండి మరో నవల లేదా కథల సంపుటిని ఆశించవచ్చా?
జ: బేసిక్‌గా నాకు సినిమా రచయితగా, దర్శకుడుగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నాలలోనే ఈ నవల రాసుడు జరిగింది. ఇక ముందు కూడా సాధ్యమైనంత వరకు సినిమా ప్రయత్నాలే చేస్తా. కాకపోతే వీలును బట్టి నవలలు, కవితలు, కథలు కూడా రాయడానికి ట్రై చేస్తా. మొన్నోసారి ఆత్మహత్యల మీద ఓ నవల రాయాలనుకున్నా. హాస్య నవల లెక్క కొంచం రాసిన. దాన్ని మళ్ళీ ఇంకా కొంచం డెవలప్ చేయాల్సి ఉంది.
అట్లనే ఒక ఇండియన్ బిచ్చపోడు అమెరికా ప్రెసిడెంట్ కూతుర్ని ప్రేమించి, ఆమె కోసం అమెరికా వెళ్లడం లాంటి ఆలోచనతోని కూడా ఓ నవల రాయడం మొదలు పెట్టిన. వాళ్లకు కులం సమస్య లేదు కాబట్టి ఈజీ గానే రాసేయ్యచ్చు. వీలైతే దాన్ని కూడా పూర్తి చేయాలని ఉంది.
మాక్సిమ్ అయితే ముందు ఈ పిల్లగా నవలను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నా. దాంతో పాటు సోషల్ మీడియా స్టార్ల గురించి ఓ కామెడీ స్టోరీ కూడా ఉంది. దాన్ని కూడా సినిమాగా తేవడానికి ప్రయత్నం చేస్తున్నా.
ఏది ఏమైనా ముందు చెప్పుకున్నట్టు నాదైన ఆలోచనలను, భావజాలాన్ని ప్రక్రియలతో సంబంధం లేకుండా అనేక విధాలుగా ముందుకు తీసుకుపోతు, వీలైనంత త్వరగా సమాజం లో ఓ పెద్ద స్థాయికి చేరిపోవాలన్న ఆశ, ఆలోచన అయితే ఉంది. ఇగ మిగిలిందాంత దేవుని దయా. నా ప్రాప్తం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు వంశీకృష్ణ పరిమళ గారూ.
వంశీకృష్ణ పరిమళ: నాకు, నాకే కాకుండా ఎందరో రచయితలకు అనేక విధాలుగా ప్రోత్సాహం అందిస్తూ, ముందుకు తీసుకొని పోతున్న, సంచిక వెబ్సైటు వారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటూ, మీరిట్లనే ముందుకుపోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు.
***
రచన: వంశీకృష్ణ పరిమళ
ప్రచురణ: జోశ్యుల పబ్లికేషన్స్
పేజీలు: 113
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
వంశీకృష్ణ పరిమళ: 9542932438, 6300852881
~
‘ఓ పిల్లగా..! లగ్గం కుదిరిందా?’ నవల సమీక్ష:
https://sanchika.com/o-pillagaa-laggam-kudirindhaa-book-review-kss/

