[‘గోధుమ రంగు ఊహ’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీ వంశీకృష్ణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం వంశీకృష్ణ గారూ.
వంశీకృష్ణ: నమస్కారం.
~
జ: ప్రత్యేక కారణం ఏదీ లేదు. పాఠకులలో ఆసక్తిని రేకెత్తించడానికి మాత్రమే ఆ పేరు ఎన్నుకున్నాను. కానీ చాలా కథలలో నాకు తెలియకుండానే మృత్యువు ప్రస్తావన వున్నది. ‘గోధుమ రంగు ఊహ’లో నేను మృత్యువు రంగు గోధుమ అన్నాను. ‘పసుపు పచ్చని సాయంకాలం’లో జీవితం రంగు పసుపు అన్నాను. చాలా కధలలో రంగుల ప్రస్తావన వున్నది కనుక ఆ శీర్షిక ఆప్ట్‌గా సరిపోయింది అనుకుంటున్నాను.
ప్రశ్న 2. మీరు కవిగా, కథా రచయితగా, సినీ వ్యాస రచయితగా, దాదాపు 30 ఏళ్ళ నుండి కృషి చేస్తున్నారు. మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: నా సాహిత్య ప్రయాణం కథకుడు గానే మొదలుఅయింది. నేను ఇంటర్మీడియట్ చదివేరోజులలో ‘ఆదివారం’ అనే పేరుతో ఒక వార పత్రికను ప్రారంభిస్తూ మొదటి సంచిక కోసం ఒక కథల పోటీ పెట్టారు. ఆ కథల పోటీలో నేను రాసిన ‘జీవితం’ అనే కథకు ప్రోత్సాహక బహుమతి లభించింది. ఆ కథ అప్పట్లో ఆంధ్రదేశాన్ని కుదిపివేసిన రమీజాబీ ఇన్సిడెంట్ ప్రేరణగా రాసాను. ఆ తరువాత రాసిన మరికొన్ని కథలు కలిపి ‘వంశీకృష్ణ కథలు’ పేరుతో కథా సంపుటి వేసాను. దానికి జ్యేష్ఠ లిటరరీ అవార్డు లభించింది. ఆ తరువాత కవిత్వంలో పడిపోయాను. ఇప్పటివరకూ ఆరు కవిత్వ సంపుటాలు ప్రచురితం అయ్యాయి. నా మిత్రుడు గుడిపాటి పాలపిట్ట మాస పత్రిక ప్రారంభిస్తూ ఏదయినా ఒక కాలమ్ రాయమని అడిగాడు. అప్పుడు సినిమా కాలం అందులో రాసాను. ఆ తరువాత ఆ సినిమా కాలమ్ నవ తెలంగాణా వారి సోపతిలో కూడా కంటిన్యూ అయింది. పాలపిట్ట సినిమా వ్యాసాలు రెండు సంపుటాలుగా వచ్చాయి. మొదటి సంపుటి ‘25th Frame’. ఈ వ్యాస సంపుటికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వ నంది పురస్కారం లభించింది. పాలపిట్ట వ్యాసాలతోనే మరొక పుస్తకం ‘ఒక దృశ్యం కొన్ని అర్ధ తాత్పర్యాలు’ వచ్చింది. సోపతిలో రాసిన కాలమ్ ‘సినిమా చదవడం ఎలా?’ అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చింది.
ఈ మధ్యలో స్వాతి మాసపత్రికలో వచ్చిన రెండు అనుబంధ నవలలు మరో పది కథలు కలిపి ‘ఉనికి’ అనే పేరుతో రెండవ కథాసంపుటి తీసుకుని వచ్చాను. తాజాగా వచ్చిన నా మూడవ కథా సంపుటి ‘గోధుమ రంగు ఊహ’. మిత్రుడు యాకూబ్ కవిసంగమం లోనూ, అఫ్సర్ సారంగ లోనూ, రాజ గోపాల్ గారి చినుకు మాసపత్రిక లోనూ కాలమ్స్ రాసాను. జాతీయ, అంతర్జాతీయ కవిత్వాన్ని అనువాదం చేశాను. ఒడియా పరిమిత శతపథి కథలు ఉదయినిలో వరుసాగ్గా అనువాదం చేసాను.
ప్రశ్న 3. పలు సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలుగా మలిచారు. వీటి వెనుక మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు తోస్తుంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: ఏ రచన కైనా సమాజమే కదా వస్తువు. నా చుట్టూ ఉన్న ఆవరణలో నన్ను వేదనకు గురి చేసే ఏ అంశాన్ని అయినా కథ చేయాలి అనే అనుకుంటాను. కానీ నేను రాసిన కథల కంటే రాయకుండా వదిలేసిన కథలే ఎక్కువ. కవిత్వం అయితే బస్ స్టాప్‌లో నిలబడికూడా మొబైల్ ఓపెన్ చేసి రాయగలం కానీ, కథ అలా కాదు. ఉద్వేగాన్ని భరించడం కంటే ఆలోచనని భరించడమే కష్టం. కవిత ఉద్వేగం అయితే కథ ఆలోచన. వస్తువు మనసులో పడ్డాక వెంటనే రాయడానికి తొందరపడను. మా గురువు గారు పెద్దిభొట్ల లాగా అది మనసులో బాగా నలిగినలిగి బయటకు రావలసిందే. అందుకే నేను చాలా తక్కువ కథలు రాశాను.
ప్రశ్న 4. “పాఠకుడికి ఆలోచించడానికీ, అనుభూతించటానికీ కొంత స్కోప్ ఉండేలా రాయడం అంటే నాకిష్టం” అని అన్నారు మీ ముందుమాటలో. దీని గురించి మరింత వివరిస్తారా?
జ: అలా వుండే కథలు నాకు బాగా నచ్చుతాయి. అందుకే అలాంటి కథలు రాయడానికి ఇష్టపడతాను. బుచ్చిబాబు అజంతా, చాసో కుంకుడాకు, పెద్దిభొట్ల ఏస్ రన్నర్, పాలగుమ్మి గాలివాన, స్వామి చావుకూడు, మెహర్ తరళ మేఘ ఛాయ, పెద్దింటి మొదటి గంట, మన్నెం శారద అమ్మమ్మ పాట, పి.సత్యవతి దమయంతి కూతురు…. ఈ కథలు అన్నీ చెప్పిన దానికంటే చెప్పకుండా వదిలేసిందే ఎక్కువ. ఆ వదిలేసిన దానిని పట్టుకోవడానికి ఆలోచనల్లోకి వెళ్లడం నాకిష్టం. అలా ఆలోచిస్తూ లోలోపలికి వెళ్లడం నిజంగా ఒక ధ్యానం లాంటిది. అది చుట్టూ వున్న సమాజంతో సహా మనలని మనం అంచనా వేసుకోవడానికి కూడా. కారామాస్టారి యజ్ఞం చదివాకా కలిగిన ఆలోచనలతో ఐదారు వ్యాసాలు దాకా రాసాను. కేవలం ఆ కథను అర్ధం చేసుకోవడానికే. అవన్నీ ఎటు వెళ్ళాయో తెలియదు. ఉంటే బావుండేది అనుకుంటాను. కవిత్వం లాగే కథ కూడా, కథకుడు, పాఠకుడు కలిసి చేసే జుగల్బందీ అనుకుంటాను నేను.
ప్రశ్న 5. ప్రింట్ మీడియాలో మీ తొలి కథ నాటి నుంచి ఇటీవలి వాట్సప్ గ్రూపుల/ఫేస్బుక్ కథల వరకూ, ఆడియో కథల వరకూ – పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అయ్యారు?
జ: ప్రింట్ మీడియాను పక్కన పెడితే నాకంటూ పాఠకులు వున్నారు అని నిశ్చయంగా తెలిసింది ఫేస్బుక్ లాంటి సోషల్ మీడీయా గ్రూపు లోకి వచ్చాకే. ప్రింట్ మీడియా నాటి పాఠకులు కాదు ఇప్పటి పాఠకులు. నల్లమల అడవులలో విప్పపూలు వున్నాయన్నట్టు రాస్తే పోపోవోయి నీకేం తెలీదు అని రచయితను పక్కకు నెట్టేస్తారు. నిజానికి పాఠకుడిని ఆకట్టుకోవడానికి ఎవరైనా క్షణం క్షణం అప్ డేట్ అవ్వాల్సిందే సామాజికంగానూ, మానసికంగానూ. నా ‘గోధుమ రంగు ఊహ’లో ‘దుస్తులు’ కథకు కొత్త తరం పాఠకుల నుండి ఎన్ని విమర్శలు వచ్చాయో అన్ని ప్రశంశలు కూడా వచ్చాయి. అలాగే ‘శ్యామకళ్యాణి’ని తరాల అంతరం లేకుండా యూనానిమస్‌గా ఓన్ చేసుకున్నారు. పఠనాసక్తులలో తేడా అని మనం అనుకుంటున్నాము కానీ బేసికల్‌గా వుండే హ్యూమన్ ఎమోషన్స్‌కి, మానవ ఉద్వేగాలకు సాంకేతికతతో పనిలేదు. నా అదృష్టం ఏమిటంటే నా చుట్టూ నా కంటే ముప్పై నలభయ్ ఏళ్ళు తక్కువ ఉన్న కొత్త తరం పిల్లలే వున్నారు. కనుక వాళ్ళ ఉద్వేగాలు, భావావేశాలు నాకు బాగా తెలుసని అనుకుంటాను.
ప్రశ్న 6. కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: నేనైతే వస్తువుకే ప్రాధాన్యత ఇస్తాను. నా కథా విమర్శ లేదా సినిమా విమర్శ అంతా వస్తువు చుట్టే తిరుగుతుంది. మంచి వస్తువు లేనప్పుడు ఎంత గొప్పశిల్ప చాతుర్యంతో కథను అల్లినా అది ఆత్మ లేని శరీరం లాగా ఉంటుంది అనుకుంటాను. బ్రహ్మదేవుడు అందమైన బొమ్మను తయారు చేసి లోపల ప్రాణం పోయకపోతే ఉపయోగం ఏముంటుంది. గొప్ప శిల్ప సౌందర్యంతో అలరారుతాయి అని మనం అనుకునే ప్రతి కథలోనూ వస్తువు కూడా అంతే బలంగా ఉంటుంది. చలం ఓ పువ్వుపూసింది లో కానీ, కేతు అమ్మవారి నవ్వు లో కానీ కేవలం నిర్మాణ చాతుర్యం మాత్రమే వున్నది అనుకోలేం కదా. మంచి వస్తువు, మంచి శిల్పం రెండింటి సమన్వయం వల్లే గొప్ప కథ పుడుతుంది. విడివిడిగా అవి ఎంత గొప్పగా ఉన్నా పాఠకుడికి సంతృప్తిని ఇవ్వవు.
ప్రశ్న 7. “నిలువ నీరులా ఎప్పుడూ ఒకటే అభిప్రాయం మీద నిలబడి ఉంటే జీవితం నిన్ను దాటుకుని వెళ్ళిపోతుంది” అనేది గొప్ప గమనింపు. ‘ఒక పసుపుపచ్చ సాయంకాలం’ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: ‘పసుపు పచ్చ సాయంకాలం’ కథ వెనుక ఏ నేపథ్యమూ లేదు. కేవలం అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. కానీ అలా చెపితే ఎవరూ నమ్మరు.
ప్రశ్న 8. ‘దుస్తులు’ కథలో తల్లి ధరించే డ్రెస్సులు నచ్చని కొడుకు, ఆమెను ఒప్పించలేక, నలుగురు ఆమె గురించి చేసే కామెంట్లకు తట్టుకోలేక, బలవన్మరణానికి పాల్పడతాడు. కొడుకు మరణంతో అయినా తల్లిలో మార్పు వచ్చిందా, అదీ లేదు. అలాంటప్పుడు కొడుకు పాత్రని చంపాల్సిన అవసరం ఏముంది? కథ మొత్తంలో ఒకే వాక్యంలో తప్ప, మిగతా ఎక్కడా ఆమె భర్త ప్రస్తావన లేకపోవడం అసహజంగా అనిపిస్తుంది కదా? (కొడుకు అనుకునే మాటల్ని బట్టి వాళ్ళు కలిసే ఉంటున్నారని అర్థమవుతుంది.)
జ: సెలబ్రిటీలు అయిన స్త్రీ పురుషుల జీవితాలలో వాళ్ళ వాళ్ళ సహచరులకు వాళ్ళు సెలబ్రిటీలు అయిన తరువాత పెద్ద్డ పాత్ర ఉండదు. నిజానికి ఆ కథ చంద్రకళ ధరించే దుస్తుల గురించి కాదు. సుధాంశు ఏగోనీ గురించి. చాలా ఏళ్ళ క్రితం ఆంధ్రదేశంలో తరచూ లాకప్పులలో రేప్‌లు జరుగుతూ వున్న కాలంలో ఇనస్పెక్టర్ గారి కూతురు అని నేనొక కథ రాసాను. అయితే ఆ కథలో రేప్ చేసిన ఇనస్పెక్టర్ కూతురు సుధాంశు లాగా చిన్న పిల్ల కాదు. బయటి నుండి వచ్చే ఒత్తిళ్ళనుండి తట్టుకునే శక్తి వున్న అమ్మాయి. అలాంటి అమ్మాయే తల్లడిల్లి పోతుంది బయట తండ్రి గురించి అనుకునే మాటలు వింటూ. ఆ కధలో ఆ కూతురుకి తల్లి తోడు ఉంటుంది. ఈ సుధాంశుకు తోడు ఎవరూ లేరు. తండ్రి ఉన్నాడని కథలో చెప్పారు కనుక తండ్రి తోడు ఉండవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ అప్పటి పురుషుడి మనస్తత్వానికి, ఇప్పటి మనస్తత్వానికి నడుమ చాలా తేడా వుంది. నాన్న నన్నే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అని సుధాంశు అనుకుంటాడు కూడా. నేను మరీ పాతకాలం వాడిలాగా మాట్లాడుతున్నాను అనుకోక పోతే అమ్మను సెక్స్ సింబల్ అనుకోవడాన్ని ఏ పిల్లాడూ తట్టుకోలేడు. ఆ ఎగోనీ లో నుండి వాడు తల్లికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నాడు. వాడికి అది తప్పితే మరొక మార్గం తెలియలేదు. అందుకే చనిపోయాడు. కొడుకు మరణంతో తల్లిలో మార్పు వచ్చిందా అంటే రాదు. వస్తే ఆ క్యారెక్టర్‌కి విలువ ఉండదు. మీకు మంచు లక్ష్మి వివాదాన్ని గుర్తు చేయవలసిన అవసరం లేదు అనే అనుకుంటున్నాను. మీరు అంత నిర్దయగా పిల్లాడిని ఎందుకు చంపారు అని చాలా మంది అడిగారు. చంపక పోతే సుధాంశు క్యారెక్టర్ ఎగోనీకి ముగింపు ఉండదు. కథ అయినా, జీవితం అయినా మనం ఊహించినట్టే వుండవు. కథకుడు పాత్రలను సృష్టించాక వాటి గమనాన్ని చూస్తూ ఉండాలి కానీ నిర్దేశించకూడదు. నేను నిర్దేశించి నట్టు అయితే సుధాంషు బతికేవాడే.
ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారితో
ప్రశ్న 9. ‘గోధుమ రంగు ఊహ’ కథలో, ఒక చోట “ఈ తన్యత మనిషి అస్తిత్వానికే ఎసరు పెడుతున్నప్పుడు పక్కవాడిని ఇంకేం పట్టించుకుంటాము?” అన్నారు. తన్యత అన్న పదానికి మామూలు అర్థం ‘సాగే గుణం’. ఆ పేరాలో ఈ వాక్యానికి ముందున్న వాక్యాలలో ఎవరి జీవితం వాళ్ళకో అగ్ని పర్వతం, ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. ఈ సందర్భంలో తన్యత అనే పదానికి మామూలు అర్థం నప్పదేమో. మీరు ఏ అర్థంతో వాడారో వివరిస్తారా?
జ: తన్యత అంటే ఆ అర్ధం ఉన్నదా నాకు తెలియదు. నేను ఆంగ్ల టెన్షన్ అన్న పదానికి సమానార్థకంగా తన్యత వాడాను. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారొకసారి నాకు జ్యోతిలో ఆయన రాసే శీర్షికకు డిక్టేషన్ ఇస్తూ తన్యత అన్న పదం వాడారు. అర్ధం ఏమిటి అని అడిగితే టెన్షన్‌కి సమానార్థకం అన్నారాయన. టెన్షన్/తన్యత బావుందే అనుకుని గుర్తుపెట్టుకున్నాను. నేను చాలా నా రచనలలో ఆ పదం వాడాను. ఇద్దరు ముగ్గురు అర్ధం ఏమిటీ అని అడిగారు కూడా. ఇప్పుడు మీరు మరొక కొత్త అర్థం చెప్పారు. బావుంది.
ప్రశ్న 10. ‘మౌన’ కథలో తామరాకు, నీటిబొట్టు పోలిక చక్కగా కుదిరింది. అందరికీ అమ్మలా చెందీ, ఎవరికీ చెందకుండా ఉండడమే ఆమెకు బావుంది అన్నారు. విషాదం నుంచి తేరుకునేందుకు వ్యక్తులు విభిన్నమైన పద్ధతులని ఎంచుకుంటారు, కొంత కాలమయ్యాకా, ఎవరి మార్గం వారిదవుతుందని సూచించే ఈ కథలో ‘మౌన’ పాత్ర కల్పితమా? మీకు నిజజీవితంలో తారసపడిన వ్యక్తా?
జ: కల్పితమే. చాలాకాలం క్రితం లక్ష్మీకన్నన్ది ఒక కథ చదివాను. భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడి జీవితాంతం మాట్లాడుకోరు. అలా మాట్లాడుకోకుండా ఉండటం అనే పాయింట్ నాకు నచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఈ కథ రాసాను. నేను పెట్టిన పేరు మౌనం. అయితే మా ప్రసేన్ అది మౌన అయితే బావుంటుంది అన్నాడు. మౌన బావుంది అని చాలామంది చెప్పారు. థాంక్యూ సో మచ్ ప్రసేన్.
ప్రశ్న11. “అయినా సంతోషానికి కారణం ఎందుకు? దుఃఖాన్ని నివారించడానికి కారణం కావాలి కానీ” అనేవి చక్కని వాక్యాలు. ‘శ్యామ కళ్యాణి’ కథలో పాత్రోచితంగా సంగీతంలోని రాగాలను ప్రస్తావించారు. మీకు సంగీతంలో అభిరుచి/ప్రవేశం ఉందా? లేక కథ కోసమే తెలుసుకుని రాశారా?
జ: నాకు సంగీతం తెలియదు. కానీ విని, చదివే అలవాటు/అభిరుచి ఉంది. సుధా రఘునాథన్ అంటే ప్రాణం పెట్టేంత అంత ఇష్టం ఉంది.
ఒడియా రచయిత శ్రీ గౌర హరి గారితో
ప్రశ్న12. ఈ సంపుటిలో కథల క్రింద అవి తొలిసారిగా ప్రచురితమైన పత్రికల పేర్లు మాత్రమే ఇచ్చి తేదీలు ఇవ్వలేదు. ఎందుకని? తేదీలు ఇచ్చి ఉంటే కథా పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండి ఉండేది కదా?
జ. తేదీలు కచ్చితమైనవి తెలీదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంటే వదిలివేయడం మంచిది అనుకున్నాను.
ప్రశ్న13. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: శ్యామకల్యాణి, సెలవు ఈ రెండు కథలు నాకిష్టం. ఒకటి జీవించడానికి ఏ అర్థమూ అవసరం లేదు. జీవితానికి జీవించడమే అర్థమూ, పరమార్థమూ అని చెపుతుంది. మరొకటి జీవించే జీవితం ఎలాంటిదైనా దాన్ని సంపూర్ణంగా, ఆత్మ గౌరవంతో, జీవితాన్ని వెలిగించే ప్రాకృతిక సౌందర్యంతో స్వచ్ఛంగా, స్వేచ్ఛగా జీవించకపోతే దాని కంటే మరణమే నయం అని చెపుతుంది.
ప్రశ్న14. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: నిజానికి నేను రాసిన ప్రతి కథను కొంతకాలం ఆగి చదువుకుంటే నాకే నచ్చవు. ఇలా ఎలా రాసాను అనుకుంటాను. ఆ అసంతృప్తి ఎప్పుడూ కథకులకు అవసరం అనుకుంటాను. కష్టం కాదు కానీ ‘కొండమీద’ కథను ఇంకాస్త బాగా రాయవచ్చు అనిపించింది. మరింత హోమ్ వర్క్ చేయాల్సింది అనిపించింది.
ప్రశ్న15. ‘గోధుమ రంగు ఊహ’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ప్రత్యేకమైన అనుభవాలు ఏవీ లేవు. పాఠకుల ఆదరణ బావుంది. సెకండ్ ఎడిషన్‌కి వెళుతున్నది.
ప్రశ్న16. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: ఈ సంవత్సరం ఆఖరు కల్లా ఒక అనువాద కథల సంపుటి తీసుకుని రావలసి వుంది. ప్రముఖ ఒడియా రచయిత పరమిత శతపథి కధలను ఉదయిని వెబ్ మ్యాగజైన్లో వరుసగా అనువాదం చేస్తున్నాను. అలాగే తంజావూరు కలలు మరి కొన్ని పద్యాలు శీర్షికన ఒక కవిత్వ సంపుటి తీసుకుని వస్తున్నాను. పుస్తక రూపం దాల్చవలసిన కవిత్వ, కథా వ్యాసాలూ రెండొందలు పైనే వున్నాయి.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు వంశీకృష్ణ గారూ.
వంశీకృష్ణ: ధన్యవాదాలు.
***
రచన: వంశీకృష్ణ
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
పేజీలు: 135
వెల: ₹ 150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. ఫోన్: 9848787284
వంశీకృష్ణ: ఫోన్: 9573427422
~
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/goduma-rangu-uha
~
‘గోధుమ రంగు ఊహ’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/godhuma-rangu-uha-book-review-kss/

