Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథకుడు శ్రీ ఏరువ శ్రీనాథ్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘డబ్బు అమ్మబడును’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీ ఏరువ శ్రీనాథ్ రెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం ఏరువ శ్రీనాథ్ రెడ్డి గారూ.

ఏరువ శ్రీనాథ్ రెడ్డి: నమస్కారం.

~

ప్రశ్న 1. మీ తొలి కథల సంపుటి డబ్బు అమ్మబడునువెలువరించినందుకు అభినందనలు. 13 కథల ఈ సంపుటికి శీర్షికగా చివరి కథ డబ్బు అమ్మబడునుపేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? సంచిక పాఠకుల కోసం వివరంగా చెప్తారా?

జ: ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. అన్నీ కథలు ఒకే జోనర్లో ఉంటే అన్నింటికీ కలిపి ఏకరూపత వచ్చే శీర్షిక పెట్టేవారు ఇంతకుముందు. ఇప్పుడు నా అన్నీ కథల్లో ఏకరూపత డబ్బు.

అన్నీ కథలు ఆల్మోస్ట్ డబ్బు చుట్టూనే తిరుగుతాయి. కాబట్టి ఈ కథా సంకలనానికి ‘డబ్బు అమ్మబడును’ అనే టైటిల్ కంటే సరిపోయేటట్లు ఏముంది చెప్పండి. అందుకే ఈ టైటిల్నే పుస్తక శీర్షికగా పెట్టాను. అందులో ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే.. కథాసంకలనాలకి ఆ కథ సంకలనాలనం లోని ఏదో ఒక కథ టైటిల్నే పుస్తక శీర్షికగా పెట్టడం జరుగుతుంది. నేను కూడా అలాగే ఆలోచించాను. ఈ రెండు అంశాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ టైటిల్నే ఫిక్స్ చేశాను.

చాలామంది టైటిల్ బాగుందని మెచ్చుకుంటున్నారు. కథలు కంటే ముందు చాలామంది టైటిల్ గురించే మాట్లాడుతున్నారు.

అందుకు చాలా సంతోషం. ఈ టైటిల్ వెనుక పెద్ద కథ ఉంది. అది తర్వాత చెప్తాను.

ప్రశ్న 2: వృత్తి రీత్యా మీరు ఇంగ్లీష్ లెక్చరర్. మరి తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఎలా కలిగింది? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరిస్తారా?

జ: అవును నేను వృత్తిరీత్యా ఇంగ్లీష్ లెక్చరర్‌ని. కానీ అది ప్రస్తుతం మాత్రమే. కానీ దీనికి పూర్వం నేను రచయితనే. ముందు రచయితగా పలు సినిమాలకి, సీరియల్స్‌కి పనిచేసిన తర్వాతే అధ్యాపకుడిగా మారాను.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం మీద ఆసక్తి. బాగా పుస్తకాలు చదివేవాడిని. అలా తెలుగు సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది.

సాహితీ ప్రస్థానం అంటే..

ఎక్కువ చదువుతూ ఉన్నాను కాబట్టి, మనం కూడా ఏదైనా రాద్దాం అనిపించి రాయడం మొదలుపెట్టాను.

ప్రశ్న 3: ముందుమాటలో మీ కథల గురించి చెబుతూ, “వారి శిల్ప జ్ఞానం ప్రతి కథలో కదలాడుతుంది. కథ నడుస్తున్నంత సేపూ ప్రధాన పాత్రతో రచయిత జీవిస్తూ కనిపిస్తాడు” అని అన్నారు ఈతకోట సుబ్బారావు గారు. “శ్రీనాథ్ రెడ్డి స్వతహాగా కవి కూడా కావటం వలన, కవిత్వంలో వలె వీరి కథల్లో పదునైన అభివ్యక్తి కనిపిస్తుంది” అని వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయంలో కథకి వస్తువు, శిల్పం, శైలి లో ఏది ప్రధానం? వివరించండి.

జ: అవును. ఈ మాట ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారు. “మీ ప్రతీ కథలో రచయిత కనిపిస్తున్నాడని” నిజమే అది. ఆ ప్రభావం నుండి బయటపడాలి. అక్కడ రచయిత కంటే క్యారెక్టర్ మాట్లాడితేనే కరెక్ట్‌గా ఉంటుంది.

కానీ క్యారెక్టర్‌ని సృష్టించేది రచయితే కదా? దీని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు.

మీరు అడిగినట్టు కథకి వస్తువు, శిల్పం, శైలి మూడు ప్రధానమే. ఈ మూడింటిలో ఏది లేకపోయినా కథ పాఠకులకు చేరదు అని నా అభిప్రాయం.

అన్నీ రకాల దినుసులు సమపాళ్లల్లో వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. కథ కూడా అంతే.

ఎన్ని రకాల దినుసులు ఉన్నా.. చివరికి ఏం కూర అని అడుగుతాం కదా? అలాగే శైలి, శిల్పం చదివించడానికి ఉపయోగపడతాయి. చివరికి పాఠకుడికి వస్తువే గుర్తుంటుంది.

ప్రశ్న 4: “శ్రీనాథ్ రెడ్డి వచనం చదివిస్తుంది. సజీవ జల ప్రవాహంలో నడుస్తూనే, ఒక్కోసారి సందేశాల తొందరలో తడబడుతుంది. కొద్దిపాటి శబ్ద లౌల్యాన్ని, అపరిపక్వపు ఆవేశాన్ని అధిగమించడానికి రచయితకి ఇంకెంతో కాలం పట్టదు. ఇందులోని ఒక్కో కథా ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది” అని మీ కథల గురించి, మీ వచనం గురించి వ్యాఖ్యానించారు తాడి ప్రకాశ్ గారు. ఒక్కో కథకి తగ్గట్టుగా వచనాన్ని ఎలా మార్చుకున్నారు?

జ: తాడి ప్రకాష్ గారు అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. “అపరిపక్వపు ఆవేశం”, “సందేశాల తొందరలో తడబాటు”.

కథలు రాయడం తొలిసారి కాబట్టి ఈ తప్పులు దొర్లాయేమో అని నాకు అనిపిస్తుంది. కాస్త అనుభవం వస్తే వీటి నుండి బయట పడతా.

కథకి తగ్గట్టు వచనాన్ని నేనేమీ మార్చుకోలేదు.

కథే వచనాన్ని వెతుక్కుంది.

ప్రశ్న 5: మీరు కొంతకాలం సినీ రచయితగా పనిచేశారు. సినీ రచయితకీ, కథా రచయితకీ మీ ఉద్దేశంలో, మౌలికమైన వ్యత్యాసం ఏమైనా ఉందా?

జ: అవును నేను కొంతకాలం సినీ రచయితగా పనిచేశాను. సినీ రచయితకి ఆంక్షలతో కూడిన స్వేచ్ఛ ఉంటుంది. అంటే.. అడవిలోనే ఉంటాం కానీ బోనులో ఉంటాం.

వాళ్ళు అడిగింది రాయాలి. వాళ్లకేం కావాలో మనకి ముందే చెబుతారు.

కథా రచయితకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అడవిలో స్వేచ్ఛగా విహరించవచ్చు. మనకి తోచింది రాయవచ్చు. ఎలాంటి నిబంధనలు, సంకెళ్లు ఉండవు. ఇక్కడ ఏమి కావాలో కథ చదివిన పాఠకులు నిర్ణయిస్తారు.

ఇంకా బాగా అర్థం అవ్వాలంటే..

సినీ రచయిత సర్కస్లో ఆడే సింహం. కథా రచయిత అడవిలో విహరించే సింహం.

సర్కస్‌లో సింహానికి మూడు పూటలా మటనూ, టైమ్‌కి టీ, స్నాక్స్ ఉంటాయి. ఒక టైమ్ టేబుల్ ప్రకారం మెనూ ఉంటుంది.

అడవిలో సింహం మాత్రం వేటాడాలి. తప్పదు.

వేటలో ఉన్న మజా తోటలో (circus) ఉంటుందా?

ప్రశ్న 6: మీరు స్వతహాగా కవి కావడం వల్ల, కొన్ని కథలలో వచనం కవితాత్మకంగా ఉంది. ముఖ్యంగా ఉదయాస్తమయాలుకథలో సన్నివేశానికి అనుగుణంగా రవి నోట పలికించిన కవిత ఇందుకు ఉదాహరణ. ఈ కథలోని జీవితమంటే గెలుపేనా? అనే ప్రశ్న – ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి చెప్పండి.

జ: ఉదయాస్తమయాలు.

ఇది కృష్ణానగర్‌లో ఉన్న చాలామంది నిజ జీవిత కథ. ఇందులో రవి నాకు తెలుసు. నిజంగా అతను ఉన్నాడు.

నేను అతనితో కొంతకాలం రూములో ఉన్నాను. అతను ఇప్పటికీ కృష్ణా నగర్‌లో ఉన్నాడు. కృష్ణా నగర్‌లో ఉన్న చాలామంది జీవితాల్ని చెప్పడానికి నేను రవిని ఎంచుకున్నాను.

ఇందులో 90% నిజం. మిగతా పది శాతం కల్పితం.

“జీవితం అంటే గెలుపేనా” అనే ప్రశ్న ప్రశ్నలాగానే ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. దానికి సమాధానం నేను చెప్పలేను.

ఎందుకంటే గెలుపుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినిషన్ ఉంటుంది.

సిరివెన్నెల గారు అన్నట్టు

“ఇలాగే కడదాకా ఓ ప్రశ్నై

ఉంటానంటున్న,

ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్న”.

నా దృష్టిలో ఇది ప్రశ్నగా ఉంటేనే దానికి విలువ. సమాధానం తెలిస్తే తేలిపోతుంది. పలచనవుతుంది.

ప్రశ్న 7: పరువు హత్య నేపథ్యంగా అల్లిన సంపంగికథలో కావేరి తన కథ చెబుతూ “నా బ్రతుకుకి అర్థం దొరికింది, అర్ధాంతరంరంగా అది ముగిసినందుకు” అని అంటుంది. ఈ వాక్యం ద్వారా మీరు చెప్పదలచినదేమిటి? జీవితం హఠాత్తుగా అంతమవడం – బ్రతుకుకి అర్థం ఎలా కల్పిస్తుంది?

జ: బతుకు నిచ్చిన తండ్రే బతకనివ్వలేదు. అర్ధాంతరంగా ఆయువు తీశాడు.

పెట్టిన వాడికే తిట్టే హక్కు, కొట్టే హక్కు ఉంటుంది కదా? తండ్రికి కూతురు మీద అంత ప్రేముంటే చంపడు కదా? ప్రేమ ఉంది కాబట్టే చంపాడు అని నేను అంటున్నాను.

ముత్తయిదుగా పోవాలని ప్రతి భార్యా కోరుకుంటుంది. ప్రతి తండ్రి తన కొడుకు తలకొరివి పెడితే బాగుంటుంది అనుకుంటాడు.

అలాగే ఆ కూతురు కూడా తండ్రి ఒడిలో మరణించింది. తండ్రి తన చేతులతోనే చంపేశాడు. అంతకంటే గొప్ప మరణం ఎవరికి వస్తుంది చెప్పండి. అది ఈ వాక్యం రాయడానికి గల ఉద్దేశం.

జీవితం హఠాత్తుగా అంతమవడం బ్రతుకుకి అర్థం ఎలా వస్తుందని మీరు అడిగారు.

దీనికి నా సమాధానం ఏంటంటే

మనం పడుకునే ముందు మనమే దీపం ఆర్పేస్తాం. అదే ఏ గాలో వచ్చి దీపం ఆరిపోతే తిట్టుకుంటాం.

ప్రశ్న 8: ‘ఊరు ఊపిరి ఆపుకుంది’ కథాంశానికి కథ శీర్షిక చాలా గొప్పగా నప్పింది. శీర్షిక తట్టిన తరువాత కథ వ్రాశారా? లేక కథలోని వాక్యాన్నే శీర్షికగా ఎంచుకున్నారా? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: మొదట ఈ కథకి టైటిల్ ‘ఆదిరెడ్డి ఆత్మహత్య’ అని పెట్టాను. ఆ తరువాత కథ రాస్తున్నప్పుడు ఒక్కసారిగా ‘ఊరు ఊపిరి ఆపుకుంది’ అనే వాక్యం రాశాను.

కథ మొత్తం పూర్తయిన తర్వాత ఈ వాక్యం ఈ కథకి సరిగ్గా సరిపోతుంది కదా అని అనిపించింది. అదే పెట్టాను.

ఈ కథా నేపథ్యం ఏమిటంటే..

ఆదిరెడ్డి నేను చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత ఉద్యోగం రాలేదని, ఊర్లో వాళ్ళు దెప్పి పొడుస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ నా మనసులో పచ్చిగానే ఉంది.

అతని కథ రాసి అతనికి నివాళి అర్పిద్దాం అనుకున్నాను. కథ రాశాను.

ఈ కథ పూర్తిగా ఆదిరెడ్డికే అంకితం.

ప్రశ్న9: ‘కాసులు కురిసిన వేళ’ కథలో అనుకోకుండా వచ్చిపడిన డబ్బు ఓ కుటుంబాన్ని ప్రలోభ పెడుతుంది. చివరిలో ఆ ముగ్గురు తమని తాము దిద్దుకున్నా, మళ్ళీ డబ్బు దొరికినట్టు సూచనప్రాయంగా చెప్పి కథని ముగించారు. తరువాత ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం పాఠకులకే వదిలేయాలని ఎందుకు అనిపించింది?

జ: చివరి వాక్యం రాయకుండా ఉండుంటే మీరు ఈ ప్రశ్న అడిగే వారు కాదు కదా (సరదాకి మాత్రమే).

అతనికి చివరి సీటులో బ్యాగు కనపడింది అని మాత్రమే రాశాను.

అది ఏ బ్యాగో చెప్పలేదు కదా! ఒకవేళ స్కూల్ బ్యాగ్ అయ్యుండొచ్చు కదా!

అలా పాఠకులను సస్పెన్స్‌లో పెట్టడం నాకు కొంచెం ఇష్టం.

వాళ్ళ ఊహకే కొన్ని వదిలేయాలి. అన్నీ మనం చెప్పేయకూడదు అని చాలామంది ప్రముఖ రచయితలు చెప్పగా విన్నాను.

ప్రశ్న 10: మనిషిగా మిగిలిపోవడానికీ, దేవుడవడానికీ గల తేడాని చెప్పిన తిరపతి రెడ్డి తీరు మారిందికథకి స్ఫూర్తి ఏంటి? ఇతివృత్తం పాతదే అయినా, కథని నడిపిన తీరు బావుంది. తిరపతి రెడ్డి లాంటి వ్యక్తి ఎవరైనా నిజ జీవితంలో తారసపడ్డారా?

జ: ‘తిరుపతి రెడ్డి తీరు మారింది’ కథకి స్ఫూర్తి.. రోజూ తిరుపతి గురించి పేపర్‌లో వచ్చే వార్తలే. కోట్లకి కోట్లు హుండీలో వేసే బడా బాబులే.

ఆ తిరుమల తిరుపతి చుట్టూ భక్తి ఎక్కడుంది చెప్పండి. అంతా వ్యాపారమే. వ్యవహారమే.

స్వార్థం, భయం తప్ప ఏముంది చెప్పండి. అక్కడికి వెళ్తే కోరికలు తీరుతాయి అనేది స్వార్థం. అమ్మో అక్కడికి వెళ్లకపోతే ఏమవుతుందో అనేది భయం.

నేను చివరిగా 2017లో తిరుపతికి వెళ్లాను. గొర్రెదాటు జనం అనిపించింది. జీవితంలో తిరుపతి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను.

మా ఊళ్లో పోలేరమ్మ తల్లి గుడి ముందు ఉన్న అరుగు మీద కూర్చుని హాయిగా కళ్ళు మూసుకున్నా చాలు అనిపించింది.

తిరుపతిరెడ్డి లాంటి వ్యక్తి ఉన్నాడు మా ఊళ్లోనే. దేవుడి పేరు చెప్పి ఎవరు ఏది అడిగినా ఇచ్చేవాడు. తన దగ్గర పని చేసే ఉద్యోగులకి మాత్రం సమయానికి జీతాలు కూడా ఇవ్వడు.

ఇప్పుడు అతను కోట్లకు పడగెత్తిన వ్యక్తి.

మొన్ననే కలిశాను కూడా ఆ వ్యక్తిని.

ప్రశ్న11: సాధారణంగా రచయితలకి తాము రాసే అన్ని రచనలు నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?

జ: నాకు మాత్రం ఈ సంపుటిలో ‘సంపంగి’, ‘ఉదయాస్తమయాలు’ కథలు బాగా నచ్చాయి. నన్ను ఎక్కువగా హింసించిన కథలు కూడా ఇవే.

ప్రశ్న12. ఈ సంపుటిలోని ఏ కథైనా రాయడం కష్టమనిపించిందా? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘ఉదయాస్తమయాలు’ కథ రాయడం చాలా కష్టం అనిపించింది.

ఎలా చెప్పాలో, ఎక్కడ నుండి మొదలు పెట్టాలో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలో అర్థం కాక చాలా రోజులు సతమతమయ్యాను. అలా కొన్ని రోజుల పాటు నిరంతరంగా ఆలోచిస్తే అప్పుడు తట్టింది ఎలా రాయాలో.

రాసేటప్పుడు ఎన్ని సార్లు ఏడ్చానో. ఇందులో నా జీవితం కూడా ఉందిగా మరి.

మెరుగ్గా రాయాలనిపించిన కథ మాత్రం ‘అద్దె బ్రతుకులు’ ఇంకోసారి తిరగ రాస్తే బాగుండు అనిపించింది.

ప్రశ్న13. డబ్బు అమ్మబడునుపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటిని పాఠకులకు ఎలా దగ్గర చేశారు?

జ: ఈ పుస్తకం ప్రచురణలో చాలా అనుభవాలు ఎదురయ్యాయి.

అబ్బో నిజంగా పురిటి నొప్పులు పడ్డాను. ముందుమాట కోసం ఆరు నెలలు ఆగాను. ఈ కథలను కొన్ని ప్రచురణ సంస్థలు చదివి నెలల పాటు సమాధానం చెప్పలేదు. కొందరు ఇవి వ్యాసాలు అన్నారు. సొంతంగా ప్రచురించుకున్నాను కాబట్టి డబ్బులు దొరక్క ఇబ్బంది పడ్డాను. ఒక మిత్రుడు అప్పుగా ఇస్తే ఈ పుస్తకం మీ ముందుకు తేగలిగాను.

కవర్ పేజీ కోసం పడిన తిప్పలు, ముందు ఈ టైటిల్ అనుకొని, తర్వాత వేరే టైటిల్ పెట్టి, మళ్లీ ఇదే టైటిల్ ఫైనల్ చేసి ఇలా టైటిల్ కోసం, ఫాంట్ కోసం, కలర్ మ్యాచింగ్ కోసం ఇలా చాలా చాలా వేదన అనుభవించాను.

ఈ సంపుటిని అన్వీక్షికి వాళ్ళు ప్రచురించారు.

వారి ద్వారానే ఈ పుస్తకాన్ని పాఠకుల దగ్గరికి చేర్చగలిగాను.

ప్రశ్న14. కథల చివర పత్రికల పేరు, ప్రచురణ తేదీలు లేవు. ఆ వివరాలు ప్రస్తావించకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఇచ్చి ఉంటే తెలుగు కథలపై పరిశోధనలు చేసే వారికి రిఫరెన్స్‌లా ఉండేది కదా!

జ: నిజమే సార్. ఆ వివరాలు కథల చివర ప్రస్తావిస్తే బాగుండేది. నిజంగా ఆ విషయం నేను మర్చిపోయాను. సమయం లేకపోవడం, ఎలాగైనా నవంబర్‌లో తేవాలని హడావుడి, డిసెంబర్‌లో బుక్ ఫెయిర్ ఉంది. వీటివల్ల ఆ పని చేయలేకపోయాను. ఇది నాకు కొంచెం లోటుగానే అనిపించింది.

ప్రశ్న15. రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: రచయితగా అసలు నాకు భవిష్యత్తు ఉంటుందో లేదో నాకు తెలియదు (నవ్వుతూ)..

ప్రణాళికలు ఏమీ లేవు. కొత్త పుస్తకాలు ఏవి సిద్ధం చేయడం లేదు.

కానీ ఒక నవలకు సంబంధించి పరిశోధన చేస్తున్నాను. వస్తువు, ముఖచిత్రం, శీర్షిక రెడీ అయింది.

ఇక రాయడం ఒక్కటే మిగిలింది.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏరువ శ్రీనాథ్ రెడ్డి గారు.

ఏరువ శ్రీనాథ్ రెడ్డి: చివరిగా సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.

నా కథలను ప్రచురించి నన్ను ప్రోత్సహించారు. ఇప్పుడు నన్ను ఈ ఇంటర్వ్యూ చేసి మొదటి ఇంటర్వ్యూగా మంచి అనుభవాన్ని ఇచ్చారు.

ప్రశ్నలు చదివినప్పుడు మాత్రం ఇంత లోతుగా సమీక్ష చేశారా అని నాకు ఆనందం కలిగింది.

ఇంత మంచి సమీక్ష, ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

కథలు వెళ్లాల్సింది ‘కంచికి కాదు సంచికకి’ అని నా అభిప్రాయం.

Thank you 🙏🙏🙏.

***

డబ్బు అమ్మబడును (కథలు)
రచన: ఏరువ శ్రీనాథ్ రెడ్డి
ప్రచురణ: అన్వీక్షికి పబ్లిషర్స్ పై. లి.
పేజీలు: 180
వెల: ₹ 200.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
అన్వీక్షికి పబ్లిషర్స్ పై. లి. ఫోన్. 7659877744
ఆన్‌లైన్‍లో:
https://www.amazon.in/DABBU-AMMABADUNU-YERUVA-SRINATH-REDDY/dp/9395117494

 

~

‘డబ్బు అమ్మబడును’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/dabbu-ammabadunu-book-review-kss/

Exit mobile version