[‘మయూఖ ముఖాముఖి 2’ అనే పుస్తకం వెలువరించిన అరుణ ధూళిపాళ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం అరుణ ధూళిపాళ గారూ.
అరుణ ధూళిపాళ: నమస్కారమండీ🙏🏼.
~
మయూఖ వెబ్ పత్రిక కోసం ప్రముఖ సాహితీవేత్తలతో మీరు చేసిన ఇంటర్వ్యూలను ‘మయూఖ ముఖాముఖి 2’ అనే పుస్తకంగా వెలువరించినందుకు అభినందనలు. మయూఖకు ఇంటర్వ్యూలు తీసుకోవడం ఎట్లా ప్రారంభమైంది?
జ: ధన్యవాదాలండీ🙏🏼. ఇది నేను చెప్పాలంటే నా ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం నుండి మొదలుపెట్టాలి. సిద్దిపేట బాలికల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మాకు తెలుగు బోధించే లెక్చరర్ టేకులపల్లి గోపాలరెడ్డి గారు అని ఉండేవారు. ఆయన అంధులు. కానీ జన్మతః కాదు. నాలుగేళ్ళ వయస్సులో కళ్లకలక రావడంతో, ఊళ్ళో చేసిన నాటువైద్యం మూలంగా చూపు కోల్పోయారు. ఎంతో కష్టపడి అంధుల పాఠశాలలో చదువుకొని లెక్చరర్ స్థాయికి ఎదిగారు. ఒకే కాలనీలో ఉండడం వల్ల నేను మా స్నేహితురాళ్లతో తరచూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వారి కుటుంబంతో కూడా ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. కళాశాలలో వ్యాస, వక్తృత్వ, పాటల పోటీలు జరిగినప్పుడు నేను పాల్గొనేందుకు తగిన సలహాలిచ్చేవారు. బాగా చదివే విద్యార్థుల మీద గురువులకు ఉండే అభిమానం నాపట్ల ఆయనకు ఉండేది.
అది తెలుగు భాషలో ఉన్నప్పటికి స్క్రిప్ట్ మాత్రం బ్రెయిలీలో ఉంటుంది. నేను ఆయన మీద ఉన్న గౌరవంతో ఒప్పుకున్నాను.
ఆ సమయంలో ఆయన మెదక్ జిల్లా పోచారం అనే గ్రామంలో ఉన్నారు. నేను హైదరాబాదులో ఉన్నాను. డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చాక రోజూ ఆయన ఫోనులో చెబుతుంటే రాసేదాన్ని. నవల అంటే బహుశా ఏ రెండువందల పేజీల వరకు ఉంటుందనుకున్నాను. కానీ 1500 పేజీల వరకు ఉంది. అయినా నేను దాన్ని భారంగానో, నా సమయం వృథాగా అవుతుందనో భావించలేదు. గురువుకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే నా బాధ్యత అనుకున్నాను. దాన్ని ఆయన మూడు భాగాలతో ‘ట్రయాలజీ’గా చేయాలనుకున్నారు. నా ఫ్రెండ్ ‘వల్లి’ దాన్ని డిటిపి చేసింది. నా మేనల్లుడు ప్రవీణ్ కుమార్ ముఖచిత్రం వేశాడు. వారిద్దరి సహకారంతో 500 పేజీలతో పుస్తకం మొదటిభాగం తయారైంది. డా. నందిని సిధారెడ్డి గారి చేతుల మీదుగా సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఆవిష్కరణ అయింది. అది ఆ విధంగా పుస్తక రూపం రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ విషయంలో గోపాల్ రెడ్డి సార్ కుమారుడు కిశోర్ పూర్తిగా సహకరించాడు.
ఆ తరువాతి సంవత్సరం రెండో భాగంతో మరో పుస్తకం వచ్చింది. ప్రస్తుతం ఆ ట్రయాలజీలో మూడవ భాగం ప్రచురణకు సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పుస్తకాన్ని చూసే అవకాశం లేకుండానే ముందు ఏమాత్రం పసిగట్టని రీతిలో మా గురువు గారు ఇటీవలే బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు. వర్తమాన కాలంలో అంత పెద్ద పుస్తకాన్ని చదవడానికి ఎవరికీ తీరిక ఉండడం లేదు కాబట్టి ఆయన కోరిక మేరకు ఈ మొదటి రెండు భాగాలను నేను నా స్వరంతోనే చదివి యూట్యూబ్‌లో అందుబాటులో పెట్టడం జరిగింది.
అసలు విషయానికి వస్తే, మొదటి భాగం ఆవిష్కరణ జరిగిన తర్వాత ‘తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ’ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం జూమ్ వేదికగా జరుపుకునే కవిసమ్మేళనంలో ఈ ‘పుస్తకపరిచయ’ సభా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. రాసింది నేను కాబట్టి ఆ కార్యక్రమంలో నన్నూ భాగస్వామురాలిని చేశారు. ఆ సందర్భంగా నేను కవిత్వం రాస్తానని గోపాల్ రెడ్డి గారు వారికి చెప్పడంతో జంటనగరాల శాఖ వారు నన్ను వారి వాట్సాప్ సమూహంలో చేర్చుకున్నారు. ప్రతీ సోమవారం అందరితో పాటు నేనూ నా కవితను చదివి వినిపించేదాన్ని. ఆ సమూహంలో ఉన్నటువంటి డా. కొండపల్లి నీహారిణి గారు ఒకరోజు నా కవిత విని, బాగుందని మెచ్చుకొని, ఆ కవితను తాను నడిపిస్తున్న అంతర్జాల పత్రిక ‘తరుణి’కి పంపమని కోరడం, అప్పటినుండీ మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడడం జరిగింది.
అదే క్రమంలో ఆమె నడుపుతున్న మరో ద్వైమాసిక సాహిత్య మాస పత్రిక ‘మయూఖ’ కొరకు ఇంటర్వ్యూలు తీసుకునే దిశగా, నువ్వు చేయగలవని ధైర్యం చెప్పి ఇవాళ ఈరోజు మీ అందరి ముందు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది. ఆమె ప్రోత్సాహం, ప్రేరణ నాకు ఎంతో మంది సాహితీమూర్తుల అభిమానాన్ని చూరగొనేట్లు చేసింది. ఇంటర్వ్యూలన్నీ ఒక సంకలనంగా వేయాలనే ఒక సత్సంకల్పం తనకు కలిగినప్పుడు నేను తీసుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల మిగతావన్నీ మొదటి భాగంలోను, నేను తీసుకున్న ఇంటర్వ్యూలన్నీ ప్రత్యేకంగా రెండవ భాగంగా వేయడం జరిగింది.
ఇంటర్వ్యూ చేయాల్సిన సాహితీవేత్తలని ఎలా ఎంచుకున్నారు? వారిని ఏ ఏ ప్రశ్నలు అడగాలని ఎలా నిర్ణయించుకున్నారు? వివరించండి.
జ: నీహారిణి గారి అభిప్రాయం ప్రకారం దాదాపు తెలంగాణలో ఉన్న సాహితీమూర్తులను సమాజానికి పరిచయం చేయాలన్నది మొదటి ఉద్దేశ్యం అయితే, ప్రాంత భేదం కూడా లేకుండా తెలుగు భాషకు సేవ చేసిన వారందరి సాహిత్యాన్ని గురించి, వారి జీవితాన్ని గురించి పూర్తి వివరాలు అందించడం ద్వారా తరువాతి తరాలకు మార్గదర్శనం చేయించాలన్నది మరో కోరిక. దానితో ముందుకు వెళ్లడం జరిగింది. ముందు తనకు తెలిసిన కొంతమందిని పేర్లను తాను లిస్టుగా తయారుచేసుకున్నారు. ఆ పేర్లను నాకు చెప్పడమే కాక అప్పుడప్పుడు తనకు గుర్తుకు వచ్చిన పేర్లను ఎప్పటికప్పుడు పంపుతూ ఉండేవారు. కొంతమంది ప్రముఖ సాహితీవేత్తలు మరొకొన్ని పేర్లను తెలియజేశారు.
ఇక ప్రశ్నల విషయానికి వస్తే నీహారిణి గారికి మయూఖలో వచ్చే ప్రతీ ఇంటర్వ్యూ ఆ సాహితీవేత్తకు చెందిన మోనోగ్రాఫ్ లాగా ఉండాలని, తదనంతరం ఎవరికైనా ఆ సాహితీవేత్తను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వారి సంక్షిప్త జీవితాన్ని తెలియజేసినట్లు ఉండాలని ప్రధాన ఉద్దేశ్యంగా ఉండేది. అందువల్ల జననం నుండి మొదలుకొని ప్రస్తుతం వరకు వారి జీవిత వివరాలను, వారి సాహితీసేవకు సంబంధించిన ప్రశ్నలను తయారుచేసుకునేవాళ్ళం. వారికి సంబంధించిన వివరాలను అన్వేషించేదాన్ని. నీహారిణి గారు కూడా ఎంతో వెతికేవారు. వారి గురించి తెలిసిన వాళ్ళను కూడా కనుక్కునే వాళ్ళం.
నేను ప్రశ్నావళి తయారుచేసుకున్న తర్వాత నీహారిణి గారు ఒకసారి చెక్ చేసి సవరింపులు చేసేవారు. అన్ని ఇంటర్వ్యూలలో కొన్ని ప్రశ్నలు ఒకే రకంగా ఉంటున్నాయని ఒకరిద్దరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగజీవితాలు మొదలైన వాటి దగ్గర ఒకే రకంగా అనిపించి ఉన్నప్పటికీ వారి పూర్తి జీవితాన్ని సంగ్రహించి ఇవ్వాలన్న కోరిక వల్ల అట్లా కొన్ని ఒకే రకమైన ప్రశ్నలు ఉండేవి. మరొకటి ఏంటంటే ఆన్లైన్ పత్రిక కాబట్టి నిడివి పరిమితి లేకపోవడం ఒక సౌకర్యం కదా! అందువల్ల ప్రతీ ఒక్కరి జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలు తయారు చేసుకునేవాళ్ళం. ఒక్కోసారి నీహారిణి గారు అమెరికాలో ఉంటుండడం వల్ల రెండు దేశాల అననుకూల సమయాల మధ్య కూడా ఎన్నో గంటలు ఈ విషయంలో చర్చించుకునే వాళ్ళం.
ఆయా సాహితీవేత్తల రచనలను మీరు ముందుగానే చదివి ఉంటారు. ముఖాముఖి కోసం ప్రశ్నావళి రూపొందించుకునేందుకు అవే రచనలని కొత్తగా ఎలా చదివారు?
జ: అన్ని రచనలను తప్పనిసరిగా చదవడమని కాదు. ఎందుకంటే అన్నీ మన దగ్గర ఉండవు కదా! ఏమీ తెలుసుకోకుండా వెళ్లడం కూడా సరైంది కాదు. నీహారిణి గారు కూడా ఏవైనా కొన్ని పుస్తకాలు చదవమని చెప్పేవారు.
అందువల్ల కొన్నయినా కచ్చితంగా చదివేదాన్ని. ఆన్లైన్లో కొన్ని చదివేదాన్ని. వారికి సంబంధించి ఇతరులు రాసిన వ్యాసాలు, సమీక్షలు వెతికి ఒక అవగాహన ఏర్పరచుకునేదాన్ని. వారితో ముందుగానే సమయం ఎక్కువగానే ఇవ్వమని కోరేదాన్ని. అందువల్ల వాళ్ళు వారి జీవితాన్ని గురించి సమగ్రంగా వివరిస్తున్నప్పుడు నాకు తెలియని అంశం ఏదైనా ప్రస్తావనకు వచ్చినప్పుడు దానిని నా ప్రశ్నల్లో అదనంగా చేర్చుకునేదాన్ని. ఆ సందర్భంలో కలిగిన సందేహాలను అడిగి నివృత్తి చేసుకొని వివరాలు తెలుసుకునే దాన్ని. ఇక్కడ నా కోణం ఏమిటనే దానికంటే వాళ్ళు ఆ రచన ఏ ఉద్దేశ్యంగా రచించారన్నది, దానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటన్నదే ప్రధానంగా సమాజానికి అవసరం. ఒక్కొక్కప్పుడు పుస్తకం చదివినప్పుడు వారి దృక్కోణం అర్థం కాకపోయి ఉంటే వాళ్ళ మాటల్లో ఆ విషయం పూర్తిగా అవగతమయ్యేది.
ఆచార్య ఎస్.వి. రామారావు దంపతులతో రచయిత్రి
ఓ సాహితీవేత్త రచనని ఇంటర్వ్యూ కోసం మళ్ళీ కొత్తగా చదివినప్పుడు ఆ పుస్తకంలో ఇది వరకు స్ఫురించని కొత్త విషయం ఏదైనా మీకు తట్టిన సందర్భాలున్నాయా?
జ: ఇదీ అని చెప్పలేను కానీ అటువంటి సందర్భాలున్నాయి. నేను తీసుకున్న ఇంటర్వ్యూలన్నీ జ్ఞాన వృద్ధులు, వయస్సు పైబడినవారు, అనుభవజ్ఞులైన సాహితీవేత్తలవే. అంతకుముందు నేను చదివినప్పుడు నా అనుభవానికి, వయస్సుకు అందని దృష్టిలో అర్థం చేసుకొని ఉంటే, కొత్తగా చదవడమని కాకుండా వారి మాటల వల్ల వినూత్న పంథాలో విషయం తెలిసేది. అంటే నా కోణంలో కాకుండా ఈ విషయాన్ని ఇట్లా కూడా ఆలోచించవచ్చా? అని అనిపించేది. వారి పాండిత్యం ముందు నేనెంత?
ముఖాముఖిల కోసం మీ సన్నాహాలు ఎలా ఉండేవి? అధ్యయనం మాత్రమే కాకుండా ప్రయాణాలు, రికార్డింగులు, అనంతరం టైపింగ్.. తదితర అంశాలలో ఎలా సంసిద్ధమయ్యేవారు?
జ: అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుతం నా నివాసం భువనగిరి. మేము తయారు చేసుకున్న లిస్టు ప్రకారం వాళ్లంతా హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో ఉండేవారు.
సంపాదకురాలిగా ముందుగా నీహారిణి గారు వాళ్లకు ఫోన్ చేసి నా గురించి చెప్పి, నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తానని చెప్పేవారు. నా నెంబర్ వాళ్ళకి, వాళ్ళ నెంబర్ నాకు పంపేవారు. తరువాత నేను ఫోన్ చేసి వాళ్లకు కుదిరే టైమ్, నాకు కుదిరే టైమ్ మాట్లాడుకొని అనుకున్న రోజు వెళ్ళేదాన్ని. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లకూడదని నీహారిణి గారు కచ్చితంగా చెప్పిన మాటను వందశాతం అమలుచేశాను. ఈ విషయంలో నాకు మా అబ్బాయి, కోడలు, అమ్మాయి, అల్లుడు, వియ్యపురాలు, మా మేనవదిన, మేనల్లుడు, రంగరాజు పద్మజ గారు, భిన్నూరి మనోహరి గారు హృదయపూర్వకంగా సహకరించారు. ఆయా సందర్భాలలో వీలును బట్టి వీరంతా తోడుగా వచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులగారితో రచయిత్రి
ముందుగా నేను ప్రశ్నావళిని పేపర్లో రాసుకునేదాన్ని. వాళ్ళ ముందు నా ఫోన్ రికార్డింగ్ పెట్టి వారు చెప్పిన సమాధానాలను రికార్డ్ చేసేదాన్ని. ఇంటికి వచ్చాక ఆ రికార్డు అంతా వింటూ ఒక నోట్ బుక్‌లో యథాతథంగా రాసుకునేదాన్ని. ఒక్కోసారి అడిగిన ప్రశ్నకు ఉన్నదున్నట్టుగా కాక వారి జీవితంలోని అనుభవాలను చెప్పే క్రమంలో ఇతర విషయాలనేకంగా వచ్చేవి. వాటిల్లోంచి ప్రశ్న, జవాబుగా సరిదిద్దుకుంటూ టైప్ చేసేదాన్ని. ఇదంతా అవడానికి కనీసం వారం రోజులు పట్టేది. అంతా అయిపోయాక నీహారిణి గారికి పంపి ఆమె బాగుందన్న తరువాత ముఖాముఖి ఎవరికి సంబంధించిందో వారికి పంపేదాన్ని. ఎందుకంటే రికార్డు సరిగా కాకపోతేనో, నాకు సరిగా అర్థం కాకుంటేనో అది పత్రికలోకి వచ్చిన తరువాత ఇబ్బందిపడాల్సి ఉంటుంది. ఇలాంటి గందరగోళాలకు తావు లేకుండా ముందే వారికి పంపేదాన్ని. వారు చూసి ఏవైనా మార్పులు చేర్పులు చెబితే వాటిని సరిదిద్ది పత్రికలో వేసేవాళ్ళం.
ఈ పుస్తకంలో ఉన్న ఏ ఇంటర్వ్యూ కూడా ఫోన్ ద్వారా చేసింది కాదు. నేను ప్రశ్నలు వాట్సాప్‌లో పంపి సమాధానాలు వాళ్ళు రాసి పంపిన పద్ధతీ కాదు. ఎంత దూరమైనా వాళ్ళ ఇంటికి వెళ్లి తీసుకున్నాను. ఆ సమయంలో వాళ్ళు చూపిన ఆదరణ, అభిమానం మరువలేనివి. ఆ అనుభూతులన్నీ పుస్తకంలో రాశాను కూడా.
మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది వెబ్ పత్రిక కాబట్టి నేను తీసుకున్న ఇంటర్వ్యూలలో సాహితీవేత్తల వాయిస్ రికార్డ్ చేసినప్పుడు వారి మాటలను గానీ, వారు పాడిన పద్యం కానీ వారి స్వరంలోనే వినేట్టు ఇంటర్వ్యూ మధ్యమధ్యలో ఆడియో కూడా పెట్టడం జరిగింది. ఆయా సాహితీవేత్తల ఇంటర్వ్యూ లింక్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఈ రికార్డు విషయాన్ని మీరు గమనించవచ్చు. వారి ప్రత్యేకమైన ఫోటోలు, వారి రచనల ఫోటోలు కూడా వేయడం జరిగింది.
ఆచార్య ఒద్దిరాజు మురళీధర రావు గారితో రచయిత్రి
ఈ పుస్తకంలో మీరు ఇంటర్వ్యూ చేసిన 19 మంది సాహితీవేత్తలలో, ఒక పాఠకురాలిగా ఎవరి ప్రభావం మీపై ఎక్కువగా ఉంది?
జ: కేవలం ఈ ఒక్కరే నన్ను ప్రభావితం చేశారని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క సాహితీ భాండాగారం. వారి అనుభవాలు చెప్తుంటే వారు భాషను, సాహిత్యాన్ని ఎంతగా అనుభూతి చెందారో ఎంతగా ప్రేమించారో అర్థమవుతుంది. నిరంతరం భాషామతల్లికి సేవ చేస్తూ జీవితాన్ని గడపాలనే తపన వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ముఖాముఖి అయిపోయి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ నీహారిణి అక్కతో చర్చించేదాన్ని. అంతేకాదు వాళ్ళ గొప్పతనాన్ని మా కొడుకు కోడలుకు, కూతురుకూ చెప్పేదాన్ని. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళ అనుభవాలను చెబుతుంటే అట్లాగే వింటూ ఆశ్చర్యపోయేదాన్ని. కళ్ళు చెమర్చేవి కూడా. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. ప్రతీ ఒక్కరి జీవితం నుండీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అంశాలున్నాయి.
ఈ పుస్తకంలో మీరు ఇంటర్వ్యూ చేసిన 19 మంది సాహితీవేత్తలలో – ప్రతిభాపాండిత్యాలు కాకుండా, కామన్‌గా అనిపించిన ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నాయా?
జ: అవునండీ! ఈ రోజు వాళ్ళున్న పరిస్థితిని చూసి వాళ్ళ జీవితం సాఫీగా జరిగిందనడానికి లేకుండా అందరూ కూడా బాల్యం నుండి అనేక అవస్థలకు గురైన వాళ్లే. మరెన్నో కష్టనష్టాలకు ఓర్చిన వాళ్లే. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సాహిత్యాన్ని పక్కన పెట్టకపోవడం వాళ్లలో ఉన్నతమైన గుణం. అది తరువాతి తరాలకు ఆదర్శం. అవి పేరు కోసమో, పురస్కారాల కోసం చదివినవో, రాసినవో కావు.
“కాలోహ్యనంతః విపులాచ పృథ్వీ..”
‘కాలం అనంతమైంది. భూమి చాలా విస్తృతమైంది. నా రచనలు అర్థం చేసుకునే రస హృదయులు ఇప్పుడు లేకపోవచ్చు. కాలక్రమేణ లభిస్తారు’ అని భవభూతి అన్నట్టు తమకు సాధ్యమైన రీతిలో వాళ్లంతా సాహితీ సుమాలను వెదజల్లుతూనే వచ్చారు. వాటిని ఏరుకోవడం, ఆ సుగంధాలను ఆస్వాదించడం మన వంతు.
శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారితో రచయిత్రి
ఈ పుస్తకంలో ఎవరి ఇంటర్వ్యూ కోసం మీరు మామూలు సమయం కన్నా అధికంగా అధ్యయనం చేయాల్సి వచ్చింది? ఎవరి ఇంటర్వ్యూ ఎక్కువ సమయం తీసుకుంది, ఎందువలన?
జ: నిస్సందేహంగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి ఇంటర్వ్యూ ఎక్కువ సమయం తీసుకుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన తాము రచించిన ‘వేయినదుల వెలుగు’, వెలుగు నడకల హంస అనే కావ్యాలను గురించి చెప్పారు. జగన్మాతకు పరమ భక్తులైనందున ఆ భావపారవశ్యంలో మునిగిపోయారు. నేనూ, నాతో పాటు వచ్చిన మా అబ్బాయి కూడా అంతే అనుభూతికి లోనయ్యాం. ఆ విధంగా ఆధ్యాత్మిక విశేషాలే తప్ప ఇంటర్వ్యూ పూర్తి కాలేదు. రెండవ సారి కూడా మా అబ్బాయి, నేను సార్ వాళ్ళింటికి వెళ్లాం. ఆయన రాసిన కావ్యాలు అప్పటికి 44 ఉన్నాయి. వాటికి సంబంధించిన చర్చతో రెండవసారి కూడా ఇంటర్వ్యూ సమగ్రంగా అవ్వలేదు. చివరగా మిగిలిన కొన్ని ప్రశ్నలను తరువాత ఇద్దరికీ వీలు కుదిరినప్పుడు ఫోనులో మాట్లాడి రికార్డు చేసుకొని పూర్తి చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన పుస్తకాలలో ‘జ్వలిత కౌసల్య’ చదువుతుంటే దానిమీద రివ్యూ రాయాలనిపించింది. రాసి భూమయ్యగారికి పంపాను. బాగుందన్నారు. సాహిత్యరంగంలో తలపండిన వ్యక్తి మెచ్చుకోలు ఒక ప్రేరణగా, బహుమతిగా భావించాను. అదే వరుసలో ఆయన పుస్తకాలన్నీ సమీక్షించి ‘ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం’ అనే పేరుతో పుస్తకం వేశాను. ఆ పుస్తకానికి పలువురు ప్రముఖులు ప్రశంసలందించడం చాలా ఆనందాన్నిచ్చింది.
ఈ పుస్తకంలోని 19 ఇంటర్వ్యూలల్లో ఏదైనా అంతస్సూత్రాన్ని మీరు గమనించారా? ఈ ముఖాముఖిల నడుమ ఏదైనా ఒక మూలధార ఉన్నట్టు మీకు గోచరించిందా?
జ: అంతస్సూత్రం సాహితీ పిపాస. అందరిలో ఉన్న మూలధార సామాజిక ప్రయోజనం. అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ చెప్పిన సమాధానాల్లో నొక్కి వక్కాణించిన అంశం ప్రస్తుత కాలంలోని అధ్యయన లోపం. నిరంతర అభ్యసనం లేకుండా మంచి సాహిత్యం రాదన్నది వారందరి అభిప్రాయం.
ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారితో రచయిత్రి
ఈ సంపుటిలోని ఎవరి ఇంటర్వ్యూ అయినా కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన?
జ: ఈ సమాధానం చెప్పడం కష్టమే సుమా! ఒక కార్యాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాటిని మనం భారంగా, కష్టంగా భావిస్తే ఆ పనిలో విజయం సాధించలేము. ప్రత్యేకంగా వీరి ఇంటర్వ్యూ ఇబ్బంది కలిగించింది అని చెప్పలేను. నేను హైదరాబాద్‌కి దూరంగా ఉండడం వల్ల ప్రయాణం ఇబ్బంది పెట్టేది. దూరాన్ని బట్టి ఒక్కోసారి రెండు గంటలకు పైగా ప్రయాణ సమయం పట్టేది. ఒకటి రెండుసార్లు మేము ఒక తేదీ అనుకొని అంతా సిద్ధమనుకున్నప్పుడు వాళ్లకు గానీ, నాకు గానీ అవాంతరం వచ్చి మళ్లీ ఒక సమయం కుదరడానికి ఇబ్బంది అయింది. వీటన్నింటినీ పక్కకు పెడితే నేను వాళ్ళ దగ్గరనుండి నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. ఇంటికి వచ్చిన ఆడపిల్లగా భావించి బట్టలు పెట్టిన వారూ ఉన్నారు. ఈ కార్యాన్ని నేనెంతో ఆనందంగా చేస్తున్నాను. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను రాసిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి సమగ్ర సాహిత్యం, ఆచార్య మసన చెన్నప్ప గారి సమగ్ర సాహిత్యాలు నాకు గుర్తింపునిచ్చాయి. పి.వి మనోహర రావుగారి పుస్తకాలపై సమీక్ష, విహారి గారి జగన్నాథ పండిత రాయలు నవలపై సమీక్ష, శ్రీ రంగాచార్య గారి ‘జీవనపర్వం’ జీవితచరిత్రపై వ్యాసం, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ‘లేతమబ్బులు’ కవిత్వంపై సమీక్ష, ఆచార్య ఎస్.వి రామారావు గారి విమర్శపై వ్యాసం, గిరిజామనోహర్ గారి జీవితం గురించిన వ్యాసం ఇవన్నీ వివిధ సంకలనాల్లో ప్రచురించబడ్డాయి. వచన కవిత్వంతో మొదలైన నా సాహితీ ప్రయాణం అనేక మార్గాలుగా సాగుతుండడం నమ్మశక్యం కాని విషయం. ఇప్పుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యగారి సాహిత్యాన్ని మొత్తం పరిచయం చేసే పనిలో ఉన్నాను.
ఈ ఇంటర్వ్యూల నిర్వహణ, పుస్తక రూపంలో ప్రచురణ వెనుక సంపాదకురాలిగా డా. కొండపల్లి నీహారిణి గారి పాత్ర, ప్రోత్సాహాల గురించి చెప్పండి?
జ: పుస్తకం ప్రచురణ సమయానికి ‘మయూఖ’ పత్రిక వయస్సు నాలుగేళ్లు. ఆ నాలుగు సంవత్సరాలలో వచ్చిన ఇంటర్వ్యూలన్నింటినీ ‘మయూఖ ముఖాముఖి సంకలనం’గా పుస్తకరూపం చేయాలన్నది నీహారిణి గారి బలీయమైన కోరిక. నాతో పాటు ‘మయూఖ’కు మరో ఏడుగురు కవి మిత్రులు సాహితీవేత్తల ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మొత్తంగా 44 ఇంటర్వ్యూలు. అందులో నేను తీసుకున్న వారి సంఖ్య 21. అందువల్ల రెండు భాగాలుగా వేయాలనే ఆలోచనతో మొదటి భాగంలో నావి రెండింటితో పాటు మొత్తం 25 గురి ఇంటర్వ్యూలు, మిగతా 19 ఇంటర్వ్యూలతో రెండవభాగంగా ప్రత్యేకంగా నేను తీసుకున్నవి వేయడం జరిగింది.
ఆచార్య మసన చెన్నప్ప గారితో రచయిత్రి
ఇంతకు ముందు చెప్పినట్టు నీహారిణి గారి ప్రోత్సాహం నాకు ఎంతో బలం. మొదటగా ‘మయూఖ’ కొరకు నన్ను ఇంటర్వ్యూ తీసుకోమని అడిగినప్పుడు చేయగలనా? అనే సందేహాన్ని, జంకును వ్యక్తం చేశాను. కానీ తాను ఒక తోబుట్టువులా ఆదరించి నాకు ఎప్పటికప్పుడు తోడ్పాటునందించి “నువ్వు చేయగలవు” అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. దానికి ప్రతిఫలమే ఈ పుస్తకం. సహజంగా పత్రికలో ఒక వ్యక్తి తీసుకున్న ఇంటర్వ్యూ ఒక్కటే ప్రచురిస్తారు కదా! మొదట్లో తాను కూడా అలాగే ప్రచురించడం జరిగింది. కానీ మేము తీసుకోవాల్సిన లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. అందునా ‘మయూఖ’ ద్వైమాసిక పత్రిక. అట్లా చూసుకుంటే మేము సంవత్సరానికి ఆరుగురిని మాత్రమే పరిచయం చేయగలుగుతాం. అందువల్ల మరో అడుగు ముందుకు వేసి నీహారిణి గారు నేను తీసుకున్న రెండు ఇంటర్వ్యూలను ఒకే సంచికలో వేయడం ప్రారంభించారు. అందువల్ల అంతమందిని పరిచయం చేయగలిగాం.
నిరంతరం ఇంకా తీసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారని అన్వేషణ చేస్తూనే ఉండడం ఆమె సాహిత్యాభిలాషకు నిదర్శనం. మొదటగా 70 ఏళ్లకు పైబడిన వారిని తీసుకోవాలనుకున్నాం. ఆ దిశగానే ఆమె కృషి చేశారు. ఈ పుస్తకాలు రెండూ వచ్చిన తరువాత నేను తీసుకున్న వాటితో కలిపి ఇప్పటికి 32 మందితో నేను ముఖాముఖి నిర్వహించగలిగానంటే ఆశ్చర్యం వేస్తుంది. శ్రద్ధ, పట్టుదల, దృఢ సంకల్పం, కృషి ఇవన్నీ నీహారిణి గారిని ఉత్తమ లక్షణాలు గల సంపాదకురాలిని చేస్తున్నాయి. ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలి. నన్ను కథలు రాయడానికి ప్రోత్సహించి, ఒక కథా సంకలనం వచ్చేట్టుగా చేసి, కథా రచయిత్రిగా నన్ను నిలబెట్టింది కూడా తానే. అందుకు ఈ పత్రిక ద్వారా మరోసారి తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
డా. కూరెళ్ళ విఠలాచార్య గారితో రచయిత్రి
‘మయూఖ ముఖాముఖి 2’ పుస్తకం ప్రచురణలో ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ప్రింటింగ్ సమయంలో కొంత ఇబ్బంది కలిగింది. అప్పుడే నీహారిణి గారు అమెరికా నుండి తిరిగి వచ్చారు. ఆవిష్కరణకు సమయం చాలా తక్కువగా ఉండింది. ప్రత్యేకంగా నాది కాకుండా మొదటిభాగంలో ఇతరులు తీసుకున్న ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఈ రెండు పుస్తకాలకు కవర్ పేజీలు, ప్రూఫ్ రీడింగులు ఇవన్నీ మామూలే కదా! అయినా అనుకున్న సమయానికి పుస్తకాలు రావడంలో డిటిపి చేసిన వినోద్ నారాయణరావు చిక్షే చాలా శ్రమించాడు. కవర్ పేజీలు మా మేనల్లుడు వేశాడు. పుస్తకాలకు ఆదరణ బాగా వచ్చింది. ప్రత్యేకంగా ఫలానా వారి గురించి మీ ఇంటర్వ్యూ చదివామని, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నామని ఎంతోమంది ప్రత్యక్షంగాను, ఫోను ద్వారాను తెలియజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. పరిశోధక విద్యార్థులకు సైతం ఉపయోగపడే అంశాలున్నాయని అంటుంటే ఆ సంతోషం ముందు నేను పడిన కష్టాన్ని మొత్తం మరచిపోయాను. ఏదైనా సాధించడం కోసం కృషి నిర్వహణ జరిగినప్పుడు ఆ తరువాత పొందే ఫలం ఎనలేనిది. నిరీక్షణా ఫలాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి.
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో రచయిత్రి
డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారితో రచయిత్రి
మీ ప్రణాళిక ప్రకారం ఇంకా తీసుకోవాల్సిన ఇంటర్వ్యూలు ఉన్నాయా?
జ: చాలా ఉన్నాయి. ఈ పుస్తకం వచ్చేటప్పటికి మేము అనుకున్నట్టుగా 70 వయస్సు పైబడిన వారిని కొంతమందిని మాత్రమే తీసుకోగలిగాం. అనివార్య కారణాల వల్ల మరికొన్ని చేయలేకపోయాం. అన్వేషించిన కొద్దీ ఎంతోమంది కవి, పండితులు కనిపిస్తూనే ఉన్నారు. మన ప్రాంతంలో ఇంతమంది విద్వన్మూర్తులు ఉండడం గర్వించదగ్గ విషయం. సాధ్యమైనంతవరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
శ్రీ గన్నమరాజు గిరిజామనోహర బాబు గారితో రచయిత్రి
సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: ప్రత్యేకంగా భవిష్యత్తు ప్రణాళిక అంటూ ఏదీ నిర్ధారించుకోలేదండీ. అవకాశాన్ని బట్టి, వీలును బట్టి రాసుకుంటూ పోతున్నాను. అయితే ఇద్దరు ప్రముఖుల పుస్తకాలకు రాసిన సమీక్షకు సంబంధించి పుస్తకాల వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆ రెండు పుస్తకాలను వెలువరిస్తాను. వివిధ పత్రికలలో ప్రచురింపబడిన నా వ్యాసాలన్నీ సంకలనంగా వేయాలని అనుకుంటున్నాను.
శ్రీ విహారి గారితో రచయిత్రి
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు అరుణ ధూళిపాళ గారూ.
అరుణ ధూళిపాళ: ధన్యవాదాలు.🙏.
***
మయూఖ ముఖాముఖి 2 (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం)
పరిచయ కర్త: ధూళిపాళ అరుణ
సంపాదకత్వం: డా. కొండపల్లి నీహారిణి
ప్రచురణ: కొండపల్లి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్
పేజీలు: 351
వెల: ₹ 400/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు,
వినోద్ కుమార్: 9494592727
ధూళిపాళ దత్తాత్రేయ శర్మ: 9000998850
హరిహర త్రిశక్తి కేంద్రం, వెలిగొండ
~
‘మయూఖ ముఖాముఖి 2’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/mayuukha-mukhamukhi-2-book-review-kss/

