[‘ఇల్లొక రాజకీయం’ అనే కవితాసంపుటి వెలువరించిన గీతాంజలి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం గీతాంజలి గారూ.
గీతాంజలి: నమస్కారం.
~
ప్రశ్న 1: ‘ఇల్లొక రాజకీయం’ సీక్వెల్ కవితలు ఎందుకు రాశారు? ఆ శీర్షిక పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా?
జ: ఎందుకు రాసానంటే ఇల్లు మనిషిలాగే రాజకీయాలు చేస్తుంది కాబట్టి. ఖచ్చితంగా ఎలా అంటే రాజ్య పరిపాలనా యంత్రాంగంలో పాలన, అధికారం, ఆలోచనలు, నిర్ణయాలు వంటివి ఎలా తీసుకోబడతాయో అలాగే ఇల్లు కూడా పాలనా యంత్రాంగం లాంటిదే. తరతరాల అధికార, ఆర్థిక సంబంధాలు నెరిపే అధికారిక స్థలం ఇల్లు. ‘ఇల్లొక రాజకీయం’ అనేది ఇంటి లోపలి మారే, రూపొందే కుటుంబ సంబంధాలు, అధికార సమీకరణాల సమాహారాన్ని, కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ రాజకీయాలు అన్నింటినీ సూచించే పదం. ఉదాహరణకి ఇంట్లో ఎవరి మాటెక్కువగా నడుస్తుంది, ఎవరు ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరు నిశబ్దంగా ఉంటూ వాటిని అమలు చేస్తారు, ఎవరు ఎలా మాట్లాడతారు, ఉపయోగించే భాష ఏంటి, కంఠస్వరం ఎలా ఉంటుంది? నిజాలు ఎలా అణిచి వేయబడతాయి, అబద్దాలు ఎలా ప్రచారం అవుతాయి? ఇవి కుటుంబంలో ఎవరు చేస్తారు? ఎవరి స్వరం వినపడుతుంది?ఎవరి శ్రమకి గుర్తింపు ఉంటుంది? ఎవరి శ్రమ నిర్లక్ష్యం లేదా చిన్నచూపు చూడబడుతుంది లేదా ఎవరి కష్టం సహజంగా తీసుకుంటారు? ఇవన్నీ కూడా రాజకీయం లాంటివే. ఇవన్నీ కూడా ‘ఇల్లొక రాజకీయం’ అనే పేరుకి కేంద్ర భావాలు. ఇది స్త్రీల స్వరం, మానవ స్వరం, సామాజిక స్వరం అన్ని కలిపి ఈ నలభై ఒక్క కవితలకి సరిగ్గా సరిపోయే అత్యంత శక్తివంతమైన పేరు ‘ఇల్లొక రాజకీయం’. ‘ఇల్లొక రాజకీయం’ కేవలం ఒక శీర్షిక మాత్రమే కాదు, ఒక ధిక్కార ప్రకటన, ఒక నగ్న సత్యం, ఒక వెలుతురు. ఈ పేరుతో భావోద్వేగం, విమర్శా, తాత్వికత మూడు కలిసిన అనుభూతి కలుగుతుంది. ఈ కవిత సంకలనానికి శీర్షిక కేవలం ఇల్లు అని మాత్రమే పెట్టి ఉంటే సరిపోయేది కాదు. రాజకీయం అన్న పదాన్ని జోడించడం వల్ల శక్తివంతంగా మారింది. ఒహ్హ్! నిజమే కదా, ఇంట్లో ఎన్ని రాజకీయాలు జరుగుతాయి అన్న ప్రశ్న వేసుకోవడం, ఆలోచించడం జరుగుతుంది. నేను తీసుకున్న ఈ వస్తువు లేదా ఇతివృత్తంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇంట్లో సమానత్వం ఎక్కడ మొదలవుతుంది? సమానత్వం అసలుందా? అమ్మల, భార్యల మౌనం, త్యాగం, శ్రమ గౌరవంగా లేదా అగౌరవంగా, గుర్తింపు లేనిదిగా ఎందుకు పరిగణించబడుతుంది? వంట గది ఎందుకు ఎప్పుడూ ఒక్క జెండర్‌కి మాత్రమే పరిమితమవుతుంది? పిల్లల, భార్యల ఇంటి పేర్లలో లోని పితృస్వామ్యం ఎప్పుడు మాయం అవుతుంది? డైనింగ్ టేబుల్ దగ్గర కంచాల్లో ఆహార పదార్థాలు స్త్రీ పురుషులిద్దరికీ వడ్డించడంలో తేడాలెందుకు ఉన్నాయి? ఇంట్లో ఆడపిల్ల కోరికలు, ఆకాంక్షలు ఎందుకు అణిచివేయ బడతాయి? భార్యల మీద మూసుకున్న పడక గదుల్లో దాంపత్యం, పెళ్లి పేరిట జరిగే లైంగిక అత్యాచారాలు ఎందుకు అత్యంత సహజమైనవిగానూ, సీరియస్‌గా పట్టించుకోవలసిన అవసరం లేనివిగా చూడబడుతాయి? లాంటి దైనందిన జీవితాల్లోని పితృస్వామ్యాన్ని నిలదీసే పదునైన ప్రశ్నలతో ‘ఇల్లొక రాజకీయం’ కవితలు ఉంటాయి. ఒక రకంగా ‘ఇల్లొక రాజకీయం’ సామాజిక లింగ లేదా జెండర్ భావోద్వేగ రాజకీయాలకు ప్రతిబింబం లేదా అనుసరణ. ‘ఇల్లొక రాజకీయం’ కవిత్వంలో కుటుంబ సంబంధాల లోతైన విశ్లేషణ జరిగింది. ఇంట్లో అమలయ్యే రాజకీయాలు సామాజిక సత్యాలను అంటే సమాజంలో స్త్రీలపైన అమలవుతున్న అనేక అకృత్యాలను కుడా విప్పి చెప్పేవిగా ఉంటాయి. ఇంటి లోపలి ఆలోచనలు, జెండర్ సంబంధాలు, వివక్ష ఆధిపత్యం, మౌనం, ప్రతిఘటన, పోరాటం, ఆధిపత్యం, అన్యాయంపై ప్రశ్నలు లేవనెత్తటం లాంటి వాటికి ‘ఇల్లొక రాజకీయం’ పేరు సరైనదిగా భావిస్తాను. తాత్వికంగా చూస్తే రాజ్యంలో ఉండే అధికార రాజకీయాలు కాదు కానీ దాదాపు అలాంటివే కుటుంబం లోనూ నడుస్తాయి.
ప్రశ్న 2: ఈ కవితలకి సీక్వెల్ అని ఎందుకు ప్రకటించారు?
జ: ఇల్లు రాజకీయ కవితలు రాస్తూ సీక్వెల్ కవితలు అని పెట్టాను. ఎందుకంటే ఇంట్లో జరిగే రాజకీయాలు అనంతమైనవి. మనిషి జీవితంలో ప్రతి దశలో పుట్టుక నుంచీ మరణం వరకూ రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఎక్కువగా జెండర్ బయాస్డ్ గానే ఉంటాయి. ఇల్లెలా అందులో నివసించే మనుషుల్ని స్త్రీలుగా, పురుషులుగా తయారు చేస్తుంది? ఏ రాజకీయాల్లోంచి చేస్తుంది? ఎలా స్త్రీ పురుషుల్ని విభజించి పాలిస్తుంది? అలాగే స్త్రీలకు చెందిన జెండర్ రాజకీయాలు వేరుగా ఉంటే, పురుషులకు అందుకు భిన్నమైన జెండర్ రాజకీయాలు ఉంటాయి. పిల్లలకు వేరే రాజకీయాలు ఉంటాయి. ఇంట్లో ఉండే వృద్ధులకు, వృద్ధులతో భిన్నమైన రాజకీయాలు ఉంటాయి. ఒకళ్ళ రాజకీయాలకి మరొకళ్ళ రాజకీయాలకి మధ్య చాలా వైరుధ్యాలతో పాటు సంబంధం ఉంటుంది, గతి తార్కికత ఉంటుంది. కుటుంబంలో రాజకీయాలన్నీ పురుషులకు లాభం, సుఖం, అధికారం ధ్యేయంగా నిర్ణయించబడి, రూపొంది పురుష కేంద్రంగా మాత్రమే కొనసాగుతాయి. స్త్రీలు మాత్రం ఆ రాజకీయాలకు బలవుతూ ఉంటారు. కుటుంబం చుట్టూ, నిరంతరం మారే సమాజ ప్రభావం వల్ల కుటుంబం లోపల జరిగే మార్పులు, అందుకు అనుగుణంగా మారే కుటుంబ అధికార, ఆర్థిక సంబంధాలు, ముఖ్యంగా స్త్రీల మీద పడే ఒత్తిడి, అణిచివేత ఇదంతా ఒక అనంతమైన నిరంతర రాజకీయ ప్రక్రియగా, మనిషి జీవితాంతమూ కొనసాగే రాజకీయాలుగా, ఈ కొనసాగింపు అంటే సీక్వెల్ {సశేషం, కొనసాగింపు, తరువాతి భాగం} అనే అర్థం వచ్చే విధంగా ‘ఇల్లు రాజకీయ సీక్వెల్ కవితలు’ అని పేరు పెట్టాను. పురుషుడి ఆధిపత్య స్థానాన్ని కాపాడుతూ, దాన్ని నిలబెట్టే పురుష కేంద్ర రాజకీయాలు నిత్యము జరిగే స్థలం ఇల్లు. ఇల్లు రాజకీయాలు చేస్తుంది. ఇంట్లోని ప్రతీ గదిలో విభజన రాజకీయాలు కనిపిస్తాయి. ఉదాహరణకి, ఇంట్లోని లివింగ్ రూమ్, బెడ్ రూమ్ రెండూ పురుషుల అధికార స్థానాలని స్థిరపరిస్తే, వంటగది స్త్రీలని అణిచివేసే స్థలంగా ఉంటుంది. ఇది ఇంకో వందేళ్ళు ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఇల్లొక రాజకీయం సీక్వెల్ కవితలు అని పేరు పెట్టాను. ‘ఇల్లొక రాజకీయం’ కేవలం ఒక సాహిత్య సంపుటి మాత్రమే కాదు. ఇంట్లో అమలవుతున్న కుట్ర రాజకీయాల మీద పదాల, వాక్యాల ఆగ్రహ ప్రకటనల రూపంలో ఎక్కుపెట్టిన విప్లవం లాంటిదని నేను అనుకుంటున్నాను. ఈ ‘ఇల్లొక రాజకీయం’ సంపుటి లోని నలభై ఒక్క రాజకీయ కవితల్లో, ఇంటి నాలుగు గోడల మధ్య మూసుకుపోయిన ప్రశ్నలు గోడల్ని చీల్చుకుని ఇంటి బయటకు వచ్చినట్లే అని భావిస్తున్నాను.
ప్రశ్న 3: బయట అందంగా కనిపించే ఇంటి వెనుక ఇంత రాజకీయం ఎందుకుంది? ఎలా ఇది మొదలైంది?
జ: ఇళ్ళ లోపలి రాజకీయాలని తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి, కుటుంబం పుట్టుక మూలాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది. లైంగిక శ్రమ విభజనలోకి. కుటుంబ వ్యవస్థ ఎలా ఏర్పడింది అనే, చారిత్రిక అభివృద్ధి దశల్లోకి తరచి చూడాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు కుటుంబం ఒక ఆర్థిక యూనిట్‌గా లేదా ఒక ఆర్థిక సంబంధంలో అభివృద్ధి చెందిన వ్యవస్థగా అర్థమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో మోనోగామి, కుటుంబ వ్యవస్థ, ఇల్లు అనే నిర్మాణం స్వంత ఆస్తి కాపాడుకోవడానికే ఏర్పడ్డాయి.
కుటుంబం లోపల బయట స్త్రీలు ఏ అధికారాలు హక్కులు లేకుండా ఉక్కిరిబిక్కిరితనంలో, నిరాశా నిస్పృహల మధ్య బతుకుతున్నారు. వివాహం ద్వారా సంక్రమించిన భర్త ఇల్లు, స్త్రీలకి గొప్ప గౌరవాన్ని, భద్రతని ప్రేమని ఇస్తుందనుకోవడం ఒట్టి భ్రమ. ఇల్లు పైకి అందంగా, సమిష్టి లక్షణాలతో కనిపించే క్రూరమైన అణిచివేతల స్థావరం. ఏ మాత్రమూ SAFE PLACE కాదు. ఇక్కడ ప్రేమ, పెళ్లి, పిల్లలు, సంసారం, ఇల్లాలి బాధ్యతలు, మాతృత్వం పేర్లతో స్త్రీ మరింత శ్రమ దోపిడికి గురవుతుంది. ఒక రకంగా ఇల్లు స్త్రీల సమస్త అధికారాలని, హక్కుల్ని గుంజేసుకునే అమానవీయమైన హితృస్వామ్య యూనిట్ తప్ప మరేమీ కాదు. ఇంటిలోని మనుషులు ఇంట్లోని ప్రతి భాగం, ప్రతి గది, ప్రతి వస్తువు, ఆమెను నియంత్రించేవే, అవమానించేవే. పరిమితులు విధించేవే. మూడు పూటలా వంట చేసే మనిషిగా, వంట మనిషిగా పని మనిషిగా మార్చి పడేస్తుంది. ఆమె పునరుత్పత్తి, లైంగిక హక్కులను దోచుకొని పిల్లల్ని కనే గర్భసంచిగా, భర్త కోరికలు తీర్చే లైంగిక వస్తువుగా మార్చబడుతుంది. స్త్రీల లైంగికత్వాన్ని కంట్రోల్ చేస్తూ, స్త్రీల జీవితం చుట్టూ అల్లబడ్డ రాజకీయాలను తయారు చేసిన మనుధర్మ శాస్త్రం, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం, ఫ్యూడల్ వ్యవస్థలోని పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నిస్తూ, పోరాడుతూ నడిచిన స్త్రీల ఉద్యమాలు, వాటికి సమాంతరంగా స్త్రీల నుంచి చాలా సాహిత్యం వచ్చింది. దానికి కొనసాగింపే ఈ ‘ఇల్లొక రాజకీయం’ కవితలు. స్త్రీలని గృహబానిసగా మార్చిపడేసిన కుటుంబ ఆర్థిక నిర్మాణం, ఇల్లు ఇంటి చుట్టూ లోపలి రాజకీయాలు స్త్రీల పట్ల ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తూ వాళ్ళను ఒక లేబరేటరీలో ఎక్స్‌పెరిమెంటల్ యానిమల్స్‌గా తయారుచేసి పడేస్తాయో, స్త్రీలు ఎంత శక్తిహీనంగా నిస్సారంగా మారిపోతారో చెప్పడమే ఈ రాజకీయ కవితల ప్రధాన ఉద్దేశం. ఇంటిలోనీ ప్రతి మూలా, ప్రతి గది, ఇంటి ముందరి వెనకాల ఆవరణలో ఆఖరికి అన్నం కంచం, పడుకునే మంచం లాంటి వస్తువులు, ఇంట్లోని ప్రతి గది, ఆఖరికి నొప్పి తగ్గించే మందులు కూడా స్త్రీల స్థానాన్ని మార్మికంగా ఎలా తెలియజేస్తాయో చెప్పదలుచుకున్నాను. అందుకే బెడ్ రూమ్‌తో పాటు బాత్రూం మీద కూడా కవిత రాశాను, ఇల్లు ఇంటిలోను ప్రతి వస్తువు మీద స్త్రీల జీవితాలకు చెందిన ఏదో ఒక అంశంతో ఉన్న కనెక్షన్‌ని ప్రత్యక్షంగా, ప్రత్యేకంగా చూస్తూ కవితలు రాశాను.
ప్రశ్న 4: మొదటి కవిత ఇల్లు మారాలి అనే కవితకి ప్రేరణ ఏంటి?
జ: ఇది ఒక మిత్రుడు తను ఇల్లు మారాలి, ఇల్లు వెతుకుతున్నాను అని చెప్తూ తన పాత ఇంట్లో తనతో పెనవేసుకుపోయిన ఇంటికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా బాధపడ్డారు. ముఖ్యంగా ఆయన పుస్తకాలు, అలమర ఆయన కూర్చునే బాల్కనీ, కిటికీ అక్కడ ఆయన ఆలోచిస్తూ గడపడం లేదా పుస్తకాలు చదువుతూ, కాఫీ తాగుతూ గడపడం, ఆ ఇంట్లో జ్ఞాపకాలు, ఆ ఇంటి కోసం పడిన ఆర్థిక ఇబ్బందులు వీటన్నింటి గురించి కలత చెందారు. అది విన్న తర్వాత నాకు ఆ సబ్జెక్టు మీద అంటే ఇల్లు మారేటప్పుడు మనిషి ఎంత సంవేదనకి గురవుతాడు, ఇంటితో ఉండే అనుబంధాన్ని ఎలా ఫీలవుతాడు? ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు ఎంత వేదనకి గురవుతాడు? ఇల్లు కూడా మనిషి లాంటిదే కదా, జీవితాంతం ఉండే మనిషిని విడిచి వెళ్ళేటప్పుడు లేదా మనిషి మరణించినప్పుడు మనం ఎంత బాధకి గురవుతాము అలాగే ఆ ఇల్లు ఎలా వెంటాడుతుంది, ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది అన్నట్టుగా అనిపించి ఇల్లు మారాలి అన్న కవితని ఆ ఇంటిని విడువలేకపోయినతనాన్ని రాశాను. ఇది ప్రేమించిన ఇంటిని వదిలి వెళ్ళేవాళ్ళ బాధ.
ప్రశ్న 5: ఇది మీ ఎన్నో పుస్తకం? ఎన్నో కవిత సంపుటి? మీ సాహిత్య ప్రస్థానం గురించి వివరించండి. ఎప్పుడు ఏ ప్రక్రియతో రచనలు మొదలుపెట్టారు? వివరించండి.
జ: కవిత్వంగా ఇది నా మొదటి పుస్తకము. అయితే చాలా కవిత్వం రాశాను. అవి అచ్చు వేస్తే రెండు మూడు కవితా సంపుటలుగా వస్తాయి. అట్లాగే జాతీయ అంతర్జాతీయ భాషల్లో వచ్చి ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువాదమైన కవితలని తెలుగులో అనువాదం చేసాను. సాహిర్ లుధియాన్వి దగ్గరి నుంచి కాఫ్కా వరకు, కమలా దాస్ దగ్గరి నుంచి మాయా యెంజిలో వరకూ అనువాదం చేశాను. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ట్రాన్స్‌జెండర్ కవితలు అనువాదం చేశాను. బెంగాల్ కవయిత్రి మౌమితా ఆలం కవితలు, మరాటీ రచయిత శరన్ కుమార్ లింబాలే కవిత్వం అనువాదం చేసాను. అవన్నీ కూడా పుస్తకాలుగా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న 6: మీరు నవలలు, కథలు, కవితలు రాశారు. వీటిల్లో ఏది రాయడం మీకు ఏది సులువు? ఎందువల్ల?
జ: ప్రత్యేకంగా ఏది సులువు అని చెప్పలేనండి. ఎందుకంటే ఏ సాహిత్య ప్రక్రియ అయినా సరే ఒక ప్లాన్ ప్రకారం సబ్జెక్టు పట్ల ఒక స్పష్టత ఉన్నప్పుడు కథా, నవల, కవితా నిర్మాణం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు రచన అంత కష్టంగా అనిపించకపోవచ్చు. నేను అన్ని ప్రక్రియల్లో రాయగలను. ఏది కష్టంగా నాకు అనిపించలేదు. అయితే వస్తువు ప్రధానంగా తీసుకున్నప్పుడు కొన్ని వస్తువులు చాలా తీవ్రమైన బాధనీ వేదనని కలిగిస్తాయి. రాయలేని స్థితిలోకి కూడా నెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీల విషాద లైంగిక గాథలను రాస్తున్నప్పుడు, ట్రాన్స్‌జెండర్ సమస్యలు, పిల్లల సెక్సువల్ అబ్యూస్కి సంబంధించిన, పాలమూరు వలస కూలీల జీవితాల్లోని విషాదాన్ని రాస్తున్నప్పుడు, పాలస్తీనా యుద్ధ బాధితుల గురించి రాస్తున్నప్పుడు వేదనకి లోనవుతాను. వస్తు తీవ్రతను బట్టి ఆ రకంగా నేను ఇబ్బంది పడ్డాను కానీ సాహిత్య ప్రక్రియలను రాయడంలో ఎప్పుడూ కూడా ఇబ్బంది పడలేదు. అయితే అన్ని సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం చాలా సులువైన ప్రక్రియగా నేను భావిస్తాను.
ప్రశ్న 7: మీరు సొంతంగా కవిత్వం రాయడమే కాకుండా హిందీ ఇంగ్లీష్ నుంచి కవితలను అనువాదం కూడా చేశారు. మీరు చేసిన అనువాదాలను గమనిస్తే కవితా వస్తువులు గుల్జార్ చిన్న కవితల దగ్గర నుంచి పాలస్తీనా కవుల దీర్ఘ కవితల వరకు గొప్ప విస్తృతి, వైవిధ్యం గోచరిస్తాయి. దీనికి కారణం ఏమిటి?
జ: కవికి ఎప్పుడూ కూడా వస్తు వైవిద్యము ఖచ్చితంగా ఉండాలండి. అట్లాగే వస్తువు విస్తృతి కూడా ఉండాలి. ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా గమనిస్తే కవికి అంతగా వస్తు వైవిధ్యం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన అంశానికి మాత్రమే కట్టుబడి ఉండకుండా జాతీయ అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేకమైన రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను పరిణామాలను గతి తార్కికంగా గమనించడమే కవి, రచయిత చేయవలసిన పని అప్పుడే వస్తు విస్తృతి, వస్తు వైవిధ్యము ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే భిన్నమైన విషయాలపై రాయడానికి, భిన్నమైన అభిప్రాయాలను ప్రకటించడానికి వస్తువు లోని వైవిధ్య ఎంపిక పనికి వస్తుంది. ఒకే రకమైన వస్తువు ఎన్నుకోవడం వలన కవితలో ఒకే రకమైన వైరుధ్యం లేని భావాలు మాత్రమే వ్యక్తమవుతాయి. వైవిధ్యం కవిత్వాన్ని శక్తివంతంగా, ఆసక్తికరంగా మారుస్తుంది. వైవిధ్యం అనేది సమాజం లోని భిన్నమైన అంశాలను సృజించేలా, కళాత్మకంగా వ్యక్తీకరించేలా, పాఠకులను ఆకర్షించేలా చేస్తుంది. రచయితలు భిన్నమైన శైలీ శిల్పాలతో వస్తు వైవిధ్యం మూలంగానే రాయగలుగుతారు. అది ఏదైనా కావచ్చు ఆకలి దగ్గరి నుంచి యుద్ధం దాకా. స్త్రీవాదం దగ్గరినుంచి సామ్రాజ్యవాదం దాకా. దోపిడీ దగ్గరి నుంచి విప్లవం దాకా. ప్రతి క్షణం రాజకీయంగా మారుతున్న సమకాలీన సమాజం రచయితకి అనేక వస్తువులను చూపిస్తూనే ఉంటుంది.
ప్రశ్న 8: కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావవ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతను ఇస్తారు?
జ: లయ అంటే ఏంటి? కవిత్వంలో లయ అంటే, సరైన పదాలు, వాక్యాల అమరిక ద్వారా ఏర్పడే ఒక సంగీతాత్మక లేదా ధ్వన్యాత్మక ప్రవాహం. అది కవిత్వానికి ఒక ప్రత్యేకమైన శ్రావ్యతని, ఉచ్ఛారణలని అంటే పలికే పద్దతులని ఏర్పరుస్తుంది. ఆసక్తికరంగా మారుస్తుంది. లయ అనేది కవిత రచన వేగాన్ని, భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. కవిత్వాన్ని భావాత్మకంగా మారుస్తుంది. ఇది చదివే వారిలో ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మొత్తానికి పాఠకుడిలో కలగవలసిన అనుభూతిని కలగచేస్తుంది లయ. లయ అంటే కవిత్వంలో పదాల రూపంలో పునరావృతమయ్యే నమూనా. ఇక వస్తువు చాల ముఖ్యం. వస్తువు లేనిదే కవిత్వం రాయలేము. అయితే వస్తువుని కవిత్వంగా మార్చేది రూపం లేదా శిల్పం. వస్తువుని కవిత్వంగా మార్చే విధానం అంటే శిల్పం, లయ, భాష ఈ మూడింటి మీదా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇవి కవి వస్తువుని వ్యక్తీకరించే కవితా ప్రక్రియలు. కేవలం వస్తువు గురించి సమాచారం ఇవ్వడంగా మాత్రమే కాదు, పాఠకుడిలో భావోద్వేగాలను కలిగించే పనిని సరైన రూపం లేదా శైలి ద్వారా కవి చేయగలగాలి. అయితే వస్తువే కవితా సృజనకు మూలం. వస్తువు ఏ విషయం గురించి కవిత్వం రాయబడిందో చెబుతుంది. వాస్తవానికి వస్తువే ప్రధానమని అనుకుంటాను నేను. వస్తువే శైలిని, శిల్పాన్ని నిర్దేశిస్తుంది. కవిత్వంలో వస్తువుని రచయిత ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు? ఏ విధంగా వ్యక్తీకరిస్తారు అన్న దాని మీదనే శైలీ, శిల్పము ఆధారపడి ఉంటాయి. చాలాసార్లు వస్తు తీవ్రతే శైలీ శిల్పాలని, లయని నిర్దేశిస్తుంది. భావ వ్యక్తీకరణలో {ఆగ్రహము, వ్యంగ్యము, ప్రేమ} కవి తీసుకున్న భావోద్వేగాలు ఏంటి అన్న వాటిని బట్టే శిల్పం తయారవుతుంది. నేను వస్తువుకే ప్రాముఖ్యతను ఇస్తాను. వస్తువుని ఎంత శక్తివంతంగా నేను తీసుకెళ్లాలి అన్న దాని మీదనే నేను దృష్టి పెడతాను. ఆ క్రమంలోనే వస్తువుకి కావలసిన శైలీ శిల్పం అంటే రూపం ఏర్పడుతుంది అని భావిస్తాను.
ప్రశ్న 9: “కవయిత్రిగా నన్ను సజీవంగా, ఉత్సాహంగా ఉంచిన కొత్త కాలం, ఈ రాజకీయ కవితలు రాసిన కాలం. నాకో కొత్త ఊపిరినిచ్చిన కాలం ఈ ఇలు రాజకీయ కవితల కాలం.” అని అన్నారు. ఈ కవితలు ఎందుకింత ప్రత్యేకం మీకు?
అయితే ఈ రాజకీయ కవితలు మటకు నేను డిస్టర్బ్ అవుతూనే నేను ఒక మంచి సబ్జెక్టు మీద, రాయవలసిన సబ్జెక్టు మీద, అవసరం ఉన్న సబ్జెక్టు మీద రాస్తున్నానన్న తృప్తి కలిగించింది. ఎందుకంటే పైకి అందంగా కనిపించే ఇంటి లోపల, ఇంటి వెనకాల, ఇంటి చుట్టు పక్కల ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయి ఆ మనుషుల మధ్య? నాన్నల మధ్య, కూతుర్ల మధ్య, కొడుకుల మధ్య, ముసలి వాళ్ళయిన తల్లిదండ్రులు మధ్య ఎన్ని రాజకీయాలు జరిగిపోతూ ఉంటాయో కదా? అవి ఆర్థికపరమైనవి కావచ్చు, ఆధిపత్యానికి అధికారానికి సంబంధించినవి కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి ఎంత బాధాకరంగా ఉంటాయి, ఎంతగా స్త్రీలు ఇల్లు అనే ఆధిపత్య, ఆర్థిక యూనిట్లో ఉండి అణచివేతలకి గురవుతున్నారు. ఇంటిని ఒక అందమైన సౌధంగా చూపిస్తూ, ప్రేమ కురిపించే ప్రదేశంగా చూపిస్తూ కవిత్వం రాస్తారు. కానీ ఆ ఇంట్లో ఎన్ని అత్యాచారాలు అన్యాయాలు నిశబ్దంగా, సహజమైనవిగా జరిగిపోతుంటాయి? ఆ ఇల్లు స్త్రీలకు ఎన్ని కన్నీళ్లను మిగులుస్తుంది? ఎన్ని బాధల్ని మిగిలిస్తుంది? ఇంట్లో ఉండలేని ఉక్కిరిబిక్కిరితనాన్ని కూడా ఆ ఇళ్ళు స్త్రీలకి కలిగిస్తాయి. అందుకే ఈ కవితలు రాసేటప్పుడు కూడా చాలా వేదనకి గురి అయ్యాను. కానీ ఒక కవిత తర్వాత ఇంకొక కవిత రాస్తూ ఉన్న క్రమంలో ఆ బాధ కొంచెం తగ్గి, తృప్తి మిగిలింది.
ప్రశ్న 10: “ఇల్లు, ఇంటిలోని ప్రతి వస్తువు మీద స్త్రీల జీవితాలకి చెందిన ఏదో ఒక అంశంతో ఉన్న కనెక్షన్‌ని ప్రత్యేకంగా చూస్తూ రాశాను” అని అన్నారు. ఇతివృత్తం/కవితావస్తువు ఒకటే అయినప్పుడు కవితలోని అంశాలు రిపీట్ అవకుండా, ఏయే జాగ్రత్తలు తీసుకున్నారు?
జ: చాలా జాగ్రత్తపడేదానినండి రిపీట్ కాకుండా. ఎందుకంటే ఒక్కటే అంశం మీద మాత్రమే రాస్తున్నప్పుడు వైవిధ్యం ఉండాలి. ప్రతి కవిత, ఇంకొక కవితకి మధ్య అదే పాత కవిత లాగానే ఉంది అనిపించకూడదు. అయితే అలా అనిపించకుండా ఉండడానికి వస్తు వైవిధ్యాన్ని ఎంచుకున్నాను. బెడ్ రూమ్ మీద, బాత్రూం మీద, వంటగది మీద రాశాను. లివింగ్ రూమ్ మీద, కిటికీ మీద, తలుపుల మీద రాశాను, అమ్మ చేతుల మీద, నేల మీద రాసాను. ఇవన్నీ భిన్నమైన ప్రదేశాలు. ఇంట్లో భిన్నమైన పనులు జరిగే ప్రదేశాలు. భిన్నమైన వ్యక్తులు చేసే పనులు జరిగే స్థలాలు ఇవి. కాబట్టి కచ్చితంగా భిన్నత్వం ఉంటుంది. ఆ జాగ్రత్త నేను తీసుకున్నాను. ఇప్పుడు వంట గదిలో జరిగేది, బెడ్ రూమ్‌లో జరగదు. బెడ్రూంలో జరిగేది వంట గదిలో జరగదు. కానీ కష్టపడాల్సి వచ్చింది. ఎక్కడైతే కొన్నిసార్లు రిపీట్ అయింది అనిపించిందో అక్కడ తీసేసాను. కచ్చితంగా ప్రతి వస్తువుకి కంచం దగ్గరనుంచి మంచం వరకు, మందుల దగ్గర నుంచి స్త్రీల చేతుల వరకు వాళ్ళ జీవితాలకి, ఇంటికి, సమాజానికి ఉన్న సంబంధాన్ని కనెక్ట్ చేస్తూ రాయగలిగాను. రాయాలి కూడా. కంచాలు ఎలా భిన్నంగా ఉంటాయి? ఆడ కొంచెం, మగకంచం ఎలా ఉంటాయి? రెండిట్లో తేడా ఏంటి? ఎందుకు ఆడ కొంచెం సన్నగా ఉంటుంది లేదా ఆడ కంచంలో లేదా అమ్మ కంచంలో, కూతురు కంచంలో, తక్కువ ఆహారం ఉంటుంది లేదా రాత్రి చేసిన మిగిలిన ఆహారం ఉంటుంది? నాన్నల, అన్నల, తాతల కంచాలలో అంటే మగవాళ్ల కంచాలలో ఎందుకు పూర్తిగా అన్ని రకాల ఆహార పదార్థాలు, అవీ వేడిగా ఎందుకుంటాయి? ఈ కంచానికి ఎందుకు జెండర్ ఉంది? మంచానికి ఎందుకు జెండర్ ఉంది? లాంటి విషయాలని నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయడం జరిగింది.
ప్రశ్న 11: కొన్ని కవితలలో ఆర్ద్రమైన అనుభూతి ఉంటే, కొన్ని కవితలలో ఆగ్రహ ప్రకటన ద్యోతకమవుతుంది. ఈ కవితలు రాస్తున్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది?
జ: అవును, ప్రారంభంలో నేను ఇల్లు అనే కాన్సెప్ట్ మీద నాస్టాల్జిక్ పోయెట్రీ రాస్తూ పోయాను. ఇంట్లో ఉండే వస్తువుల మీద, ఇంటి మీద మమకారాన్ని, ఊరు మీద మమకారాన్ని, అమ్మ నాన్నల మీద ప్రేమని, వ్యవసాయం మీద, కోల్పోయిన బాల్యం మీద ఇంటితో బాల్యానికి ఉండే సంబంధాన్ని గురించి నాస్టాల్జిక్‌గా రాసుకుంటూ వెళ్లాను. కానీ మెల్లిగా కొన్ని కవితలు సీరియస్‌గా మారిపోవడం మొదలయ్యాయి. నిజాలు నా ముందు నగ్నంగా నిలబడ్డం మొదలైంది. ఇల్లు, ఇంట్లోని ప్రతీ భాగం, వస్తువు నాతో నిజాలు మాట్లాడ్డం మొదలు పెట్టాయి. ఇంటికి చుట్టబడ్డ పొరలు, తెరలు మెల్లిగా తొలగి ఇంటి అసలు రాజకీయ స్వరూపం నాముందు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టింది. ఇల్లు నాతో మాట్లాడ్డం మొదలు పెట్టింది. ఇంట్లోని మనుషులు కూడా అదృశ్యంగానో, సజీవంగానో ఉన్న మనుషులు కూడా ఇళ్ళల్లోంచి మాట్లాడ్డం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా ఇళ్ళలోని స్త్రీలు. నన్ను నిలేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. అలా వచ్చిందీ ‘ఇల్లొక రాజకీయం’ కవిత్వం. అలా కవిత్వం సీరియస్‌గా మారిపోతున్న క్రమంలో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఉదాహరణకి బెడ్ రూమ్ కవిత రాస్తున్నప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను. అమ్మా నీకు ఇన్ని చేతులు ఎక్కడివే? కవిత రాస్తున్నప్పుడు, ఆమె వెళ్లి పోయింది, కవితలు రాస్తున్నప్పుడు కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను. కానీ ప్రతి అంశాన్ని దాటుకొని వెళ్ళినప్పుడు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. చాలా కొత్త విషయాలు నా మెదడులోకి, మనసులోకి వచ్చేసి అవి కవిత్వంలోకి దూకేసేవి. కొన్నిసార్లు చాలా ఆగ్రహంగా అనిపించేది. ఉదాహరణకి స్త్రీలకు సంబంధించిన బయోలాజికల్ ఇష్యూస్, లైంగిక అంశాలు ఎక్కువగా రాస్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్‌గా అనిపించేది. మేల్, ఫిమేల్ మేనోపాస్ కవిత గురించి, రిటైర్మెంట్ కవిత గురించి రాస్తున్నప్పుడు కూడా బాగా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే ఇవన్నీ చాలా మంది స్త్రీల జీవితాల్లో ఉన్నాయి. మరణించేంత వరకు ఉంటాయి. అందుకనే స్త్రీలకు వంటగది నుంచి విముక్తి వాళ్ళు చచ్చిపోయి కట్టల మీద కాలేదాకా లేదా సమాధిలోకి వెళ్లేదాకా అని రాయవలసిన అవసరం వచ్చింది. ఇదంతా పురుషులు నిజాయితీ లేకుండా ఉండడం మూలంగానే, ఇంటిపని వంటపని స్త్రీలు మాత్రమే చేయాలన్న పితృస్వామిక భావజాలం నరనరాన్న బాల్యం నుంచే జీర్ణించుకోవడం మూలాన్నే జరుగుతోంది. అలా కాకుండా స్త్రీపురుష సమానత్వంపై చైతన్యం ఉన్న, ప్రగతిశీల భావజాలం ఉన్న పురుషులు కూడా జీవితంలో నమ్మిన, చదివిన విలువల పట్ల ఆచరణ లేకపోవడం కూడా ఒక కారణం. విప్లవం సక్సెస్ అయ్యి కమ్యూనిటీ కిచెన్లు ఏర్పడి స్త్రీలు వంటగది నుంచి, ఇంటి పని నుంచి విముక్తి చెందే సామూహిక పోరాటాలు పూర్తిస్థాయిలో జరిగినప్పుడు మాత్రమే ఈ శ్రమదోపిడి పోతుంది. లేదా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు గృహ బానిసల్లాగా పనిచేసే స్త్రీ గృహ కార్మికుల శ్రమదోపిడి పోతుంది.
ప్రశ్న 12: “ఇల్లు కోరల్ని దాచుకున్న ఒక మనిషి” అనే వాక్యం – ఈ సంపుటిలోని పలు కవితలకి సారాంశం అని అనుకోవచ్చు! ‘ఇల్లొక రాజకీయం’ కవిత రాస్తున్నప్పుడో/టైప్ చేస్తున్నప్పుడో ఈ వాక్యం ఎలా తట్టిందో వివరిస్తారా? అభిప్రాయంలో ఏమైనా మార్పు వచ్చిందా?
జ: అవునండి ఇల్లు కూడా ప్రాణం ఉన్న మనిషిలాంటిదే. చాలాసార్లు మనం జీవితాంతం కలిసి ఉండే వ్యక్తులు ఎవరైనా కావచ్చు. అమ్మ నాన్నలు, అక్క చెల్లెళ్లు, భార్యాభర్తలు ఎవరైనా కావచ్చు. వాళ్ళు మారుతున్న క్రమంలో, లేదా మారని క్రమంలో జీవితం వాళ్ళని కఠినంగా మార్చి పడేస్తుంది. అదంతా కూడా ఇంట్లోనే జరిగిపోతుంటుంది. ఇంట్లోనే, వాళ్లలో ఉండే రకరకాల వికారాలు, క్రూరత్వాలు కోరలు చాచుకొని ప్రత్యక్షమవుతాయి. రక్త సంబంధం ఉన్న, లేని ఇంటి మనుషులు ఒక్కసారి ఒకరికొకరు, ఇళ్లల్లోనే క్రూరమైన జంతువులుగా ఎదురు బదురు పడతారు. ఇల్లు కూడా మనిషిలాంటిదే కాబట్టి, మనిషి కూడా ఇల్లు లాంటి వాడే కాబట్టి ఇల్లు కోరలని దాచుకున్న మనిషి అనే వాక్యం రాయవలసి వచ్చింది. స్త్రీ పురుషుల్ని సమానంగా చూడని ఇల్లు, స్త్రీలని అణిచివేసే ఇల్లు, స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దౌర్జన్యాల్ని, గృహహింసని, మానసిక హింసని తలుపులు మూసి దాచిపెట్టే ఇల్లు కోరలున్న మనిషిగా కాక ఇంకా ఎలా ఉంటుంది? కోరలు ఉన్న మనిషిగానే ఉంటుంది కదా? భర్త నుంచి, అత్తింటి నుంచి తీవ్రమైన హింసని అనుభవించి ఆ ఇంటి నుంచి పారిపాయిన స్త్రీ, పుట్టింటి వాళ్ళు తరిమేస్తేనో, పిల్లల కోసమో తిరిగి నిస్సహాయంగా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఆమెకి మళ్ళీ కాటేసే కోరలున్న మనిషిలాగే కదా కనిపించేది? లైంగిక హింస, లేదా ఇష్టం లేకపోయినా బలవంతంగా రేప్ చేసినంత పనిచేసే భర్త ఉండే బెడ్ రూమ్ ఆమెకి మగ బెడ్ రూమ్‌గా లేదా రేపిస్టు బెడ్ రూమ్‌గా కనిపించదా చెప్పండి? ఆ బెడ్ రూమ్‌లో ఆమె ఎప్పటికైనా ప్రశాంతంగా నిద్ర పోగలుగుతుందా? నిద్రపోయినా మంచి అందమైన కలలు వస్తాయా చెప్పండి? ఆ రకంగా పెళ్ళయ్యాక దుష్ట భర్త ఉన్న అత్తిల్లు స్త్రీలకి సేఫ్ ప్లేస్ ఎలా అవుతుంది? ఎలా ఇల్లు మనిషిని ప్రకృతి వైపరీత్యాలైన వర్షం నుంచి, ఎండ నుంచి, వరద నుంచి, తుఫాను నుంచి కాపాడుతుందో, అదే ఇల్లు తలుపులు మూసేసి లోపల జరిగే ఎన్నో దారుణాలను దాచిపెడుతుంది లేదా దారుణాలు చేసేలాగా కూడా ఇల్లు చూస్తుంది. అందుకే ఇల్లు చాల సార్లు మగది లేదా పురుషుడిగా మారిపోతుంది అని రాసాను. ఇల్లు ఒక పెత్తందారి వ్యవస్థలో స్థిరంగా నిలబడే భాగం. ఒక పురుషాధిపత్యాన్ని నిలిపే నిర్మాణం. దాన్ని ఇల్లు ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. స్త్రీలని పురుషుల్ని వేరుగా చూస్తుంది. వాళ్లకి వేరు వేరు గదులను కేటాయిస్తుంది. వేరు వేరు పనులను కేటాయిస్తుంది వేరు, వేరు స్థలాలను కేటాయిస్తుంది, శాసిస్తుంది, భయపెడుతుంది, ప్రేమిస్తుంది, దగ్గఱ తీస్తుంది, దూరం చేస్తుంది. ఇంటి నుంచి బయటికి తరిమేస్తుంది ఆ రకంగా ఇల్లు అనేక రాజకీయాలను చేస్తుంది. ఒక క్రూరమైన మనిషిలాగా కోరల్ని దాచుకుంది అని రాయవలసి వచ్చింది.
ప్రశ్న 13: “చూడు, జీవితం మీద అలగకు/పాలిపోకు, వివర్ణమవకు/కాసిని రంగులు అద్దు/మరికాసిన్ని రంగులద్దించుకో” అనే చరణాలను సరిగ్గా అన్వయించుకుంటే గొప్ప సందేశాన్నిస్తాయి. ‘రంగుల ఇల్లు’ కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?
జ: మనిషి రోజు, రోజుకి పాలిపోతూనే ఉంటాడు. జీవితం మనిషి అన్ని రంగుల్ని తీసేసుకుంటుంది. చాలా మంది మనుషులు నమ్మకద్రోహాలకి, అవిశ్వాసాలకి, ఒంటరితనాలకి, మోసాలకి, బీదరికాలకి, వివక్షలకి అవమానాలకి, హింసలకి, మానసిక బాధలకి, నొప్పులకి, రోగాలకి గురి అయ్యే మనుషులు, మనసులోని అన్నీ సప్తవర్ణ రంగుల్లాంటి ఆనందాలను, సంతోషాలను, ఉద్విగ్నతలను మమకారాలను, ప్రేమలు, నవ్వులు అనే అనుభూతులను కోల్పోయి అయితే తెల్లగా పాలిపోయో లేదా నల్లగా ముడుచుకుపోయో దుఖపురంగుని పూసుకుని నిర్లిప్తంగా తిరుగుతూ జీవితాల్ని భారంగా మోస్తూ నవ్వడమే మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. నా కౌన్సిలింగ్ సెంటర్‌కి వస్తూంటారు. అలాంటి మనుషుల గురించే ఈ కవిత. ఒక్క తెలుపు, నలుపులే కాదు జీవితంలో ఇంకా చాలా రంగులు ఉన్నాయ్. అవకాశాలున్నై. ఆశలు ఉన్నాయి. ప్రేమించే మనుషులు ఎక్కడో ఉన్నారు. ఓటమే కాదు, గెలుపు కూడా ఉంది. విషాదమే కాదు ఆనందమూ ఉంది. అన్నీ వేటికవే మనిషిలో నిండే కొత్త రంగులు. బతకడానికి నింపుకోవాల్సిన రంగులు. అలాంటి పాలిపోయిన మనుషులను, మోసే, దాచుకునే, ఓదార్చే, ప్రేమ, ఆశల రంగులు పులిమే అమ్మలాంటి, నాన్నలాంటి ఇళ్ళ గురించే ఈ కవిత. చాలసార్లు పిల్లల నిర్లక్ష్యానికి గురి అయ్యి రంగులు పోయి వెలిసిపోయిన ఇళ్ళ గురించి కూడా ఈ కవిత రాసాను. బాల్యంలో ఉన్న రంగు వేరు ఉంటుంది. యవ్వనంలో ఉన్న రంగులు వేరుగా ఉంటాయి. మధ్య వయసులో ఉండే రంగులు వేరుగా ఉంటాయి. బాధ్యతలు కష్టాలు దుఃఖాలు అనుకోని విషాద పరిణామాలు అన్నీ కూడా మనుషుల్లో సహజంగా ఉండే రంగుల్ని పోగొడతాయి. రంగులు అంటే ఏంటి పాజిటివ్ భావోద్వేగాలు. ఆనందం, ప్రేమ, సంతోషం, పరవశం, ఉద్వేగం ఇవన్నీ రంగులే కదా. వీటన్నింటినీ కోల్పోయాక ఏమీ ఉండదా? ఎందుకు ఉండదు ఉంటుంది! జీవితంలోని సంక్షోభం, లేదా కఠినమైన జీవితం, ఆకలి, దారిద్ర్యం, తీరని కోరికలు, కుల, మత, ప్రాంత వివక్ష – ఇవన్నీ కూడా మనుషుల్లో పూర్తి రంగులతో వెలగకుండా చేస్తాయి. మనిషి రంగులు వెలిసిపోతూనే ఉంటాడు ఆఖరికి వివర్ణమైపోతాడు, పాలిపోతాడు నిస్తేజమై పోతాడు. ఇల్లు కూడా రంగులు కోల్పోవడానికి, పాలిపోవడానికి, కూలిపోవడానికి, ధ్వంసం అయిపోవడానికి, ఎడారి అయిపోవడానికి, ఒంటరి అయిపోవడానికి కారణం రంగులు కోల్పోయిన మనిషే. అందుకే తనకు తాను మనిషి రంగులు అద్దుకోవాలి. అంటే పాజిటివ్‌గా ఆలోచించాలి. సంతోషాల్ని అనుభవించాలి. తన లోపల అన్ని రకాల మాలిన్యపు రంగులని పోగొట్టుకోవాలి, ఆశావహ దృక్పథంతో, కొత్త రంగులతో ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆ కవిత రాశాను.
ప్రశ్న 14: కిటికీ గురించి ‘నాలుగు కిటికీలు’ కవిత చాలా గొప్పగా చెప్పింది. కిటికీ అమ్మగా, నాన్నగా మారడం, మార్మిక చిత్రకారుడిలా, టెలిస్కోప్‍లా అనిపించడం – అద్భుతమైన భావ వ్యక్తీకరణ. ఈ కవిత వ్రాయడానికి స్ఫూర్తి ఏమిటి? రాయడానికి ఎంత కాలం పట్టింది?
జ: కిటికీ కవిత నేను కరోనా వచ్చి నిమ్స్ హాస్పిటల్‌లో 20 రోజులు ఉన్నప్పుడు రాసిన కవిత. చనిపోతానేమో అని భయపడుతూ ఉన్న కాలం అది. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. చాలా సున్నితమైన కాలం అది. నిమ్స్‌లో నాకు కిటికీ పక్కన బెడ్ ఇచ్చారు. ఆ కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉండేదాన్ని. సాటి రోగులని, హాస్పిటల్స్ స్టాప్‌ని, చెట్లని, ఎండని, నీడల్ని, చెట్ల ఆకులు కప్పెట్టేసే వెలుతురుని, చెట్ల కింద అన్నం తినే కూలివాళ్ళని, వచ్చే పోయే బస్సులని, మనుషుల అరుపుల్ని, కొమ్మల మీద వాలే, ఎగిరే పిట్టల్ని గమనించేదాన్ని. ఆ మానసిక స్థితిలో బోలెడంత ఆశావహ దృక్పథంతో రాసిన కవిత ఇది. ఒకే రోజు లోని నాలుగు కాలాల్లో కిటికి ఎట్లా ఉంటుందో గమనించేదాన్ని. పొద్దున్న పూట కిటికీలోంచి ప్రపంచం ఎలా కనపడుతుంది? అలాగే కిటికీ లోపల సాటి రోగులు వాళ్ళ భావోద్వేగాలు, నర్సులు వాళ్ళ భావోద్వేగాలలో మార్పులు చూసేదాన్ని. మధ్యాహ్నం కిటికీ ఎలా కనపడుతుంది? సాయంత్రం కిటికీ ఏం చూపిస్తుంది? రాత్రికి కిటికీ ఏమవుతుంది? ఇవన్నీ కూడా గమనించి ఆ కవితని రాశాను. కిటికీ టెలిస్కోప్ లాగా కనిపించేది. కిటికీ ఒక పుస్తకం లాగా కనిపించేది. ఒక చిత్రకారుడుగా కనిపించేది. కిటికీ దగ్గరికి వెళ్లి ఎంతో దుఃఖాన్ని వలపోసుకునే బాల్యం, యవ్వనం మన అందరికీ ఉంటుంది. కిటికీ అమ్మగా ఓదార్చడాన్ని, నాన్నగా మారడాన్ని మనము బాల్యం నుంచి చూస్తూనే ఉన్నాము. కిటికీ ప్రపంచాన్ని చూపిస్తుంది కదా. కిటికీ ఎంత చెప్తుంది. కిటికీ మూసేయండి ఒక్కసారి! గది ఎలా ఉంటుంది అప్పుడు? మూసిన కిటికీ అవతలి ప్రపంచాన్ని చూడాలని మనసు ఎంత తన్లాడుతుంది? ఉపిరే ఆడదు కదా? ప్రపంచం మూసుకుపోతుంది కదా కిటికీ మూసుకుపోతే? కిటికీ అమ్మని, ముఖ్యంగా నిత్యం వంటింటి పొయ్యి మంటల్లో కమిలిపోయే అమ్మలని ఎలా చూస్తుంది? చూపిస్తుంది? ఈ ఆలోచనలోంచి కిటికీ మీద నేను నాలుగు చిన్న కవితలు, ఒక దీర్ఘ కవిత రాయడం జరిగింది. ఎంతో కాలం పట్టలేదండి. పడితే ఒక మూడు రోజులు పట్టి ఉండొచ్చు.
ప్రశ్న 15: ఒక కవిత రాశాకా, దాని తాలూకు ఉద్వేగమో/ఉద్విగ్నతో మీలో ఎంత కాలం ఉంటుంది? అలా ఎక్కువ కాలం పాటు మీ మదిని వెంటాడిన ఉద్వేగం ఏ కవితది?
జ: కవిత గురించి చర్చ జరిగినప్పుడు కవిత బాగుందని ఫీడ్ బ్యాక్ వచ్చినప్పుడు లేదా నేను కవిత బాగా రాయగలిగాను అని అనుకున్నప్పుడు లేదా కవిత్వం రాయడానికి ఎంచుకున్న వస్తువు ఆధారంగా ఆ ప్రభావం చాలా కాలం ఉంటుంది. ‘ఇల్లొక రాజకీయం’ కవితా సంకలనంలో ప్రతీ కవిత నాకు బాగా నచ్చిన కవితనే. ముఖ్యంగా ‘బెడ్ రూమ్’ కవిత, ‘అమ్మా నీకిన్నిచేతులు ఎక్కడివే?’, ‘చచ్చిపోయిన ఇల్లు’, ‘రంగుల ఇల్లు’, ‘ఇల్లొక రాజకీయం’, ‘ఆమె వెళ్లి పోయింది’ ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చిన కవితలు. ‘ఇల్లొక రాజకీయం’ కవితలు చదివిన తర్వాత, ప్రతి స్త్రీ మామూలు సాంప్రదాయ భావజాలం, ఫ్యూడల్ భావజాలం ఉన్న స్త్రీల దగ్గర నుంచి ప్రగతిశీల శిబిరాల్లో స్త్రీల సమస్యల మీద, స్త్రీ పురుష సమానత్వం మీద పనిచేస్తున్న హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు, రచయిత్రులు చాలామంది ఫోన్ చేసి – ఇది నా గురించిన కవితే, ఇది నా ఇల్లే, ఇది నా సమస్యనే ఎలా రాశావు అక్కా, నీకు ఎట్లా తెలిసింది? అని తమను తాము ఐడెంటిఫై అయ్యారు. చాలామంది దుఃఖంతోటి మాట్లాడేవాళ్ళు. మెసేజ్‌లు పెట్టే వాళ్ళు. ఎంతో మంది ఒకరికొకరు ఈ కవిత్వం ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్లనే పురుషులు తమని తాము ఐడెంటిఫై చేసుకున్నారు. కొంతమంది పురుషులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అంటూ ఉక్రోషం ఆపుకోలేక రచయిత్రి తన వ్యక్తిగత సమస్యలు రాస్తోంది జనరలైజ్ చేసేస్తోంది అని మాట్లాడిన పురుషులు కూడా ఉన్నారు. ఆ పురుషులు మరీ ముఖ్యంగా ప్రగతిశీల శిబిరాల్లో ఉన్నవాళ్లు, మగ రచయితలు, ఉద్యమకారులు అంతా కూడా ఉడుక్కుంటూ మాట్లాడినవాళ్ళు ఉన్నారు. చర్చించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. కాబట్టి నాకు ఈ కవితలు నచ్చాయి ఎందుకంటే సాహిత్యానికి ఉన్న ప్రయోజనమే ఇలా తమ తప్పుల్ని తాము తడుముకోనేలా, ఉలిక్కిపడేలా చేయడం. సాహిత్యానికి ఖచ్చితంగా సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రజలు లేదా పాఠకులు ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేస్కోవడం, అది వాళ్ళ వ్యక్తిగత సమస్యగానే కాకుండా సామాజిక సమస్యగా గుర్తించడం జరగాలి. రచయితలోని, రచనలోని నిజాయితీని గుర్తించడం కుడా జరిగినప్పుడే ఆ సాహిత్య ప్రయోజనం నెరవేరినట్టు. ఆ రకంగా ఈ కవిత్వం నాకు చాలా తృప్తినిచ్చిన కవిత్వం. చాలా నచ్చిన కవిత్వం, ఏ కవిత మీకు నచ్చింది, ఎందుకు నచ్చింది అంటే ఫలానాది నచ్చింది ఇందువల్ల నచ్చింది అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది రాజకీయ కవిత్వం కాబట్టే నచ్చింది. ఈ రాజకీయం మనం గుర్తుపట్టి బద్దలు కొడుతున్నాం కాబట్టి నచ్చింది.
ప్రశ్న 16: ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి ఎక్కువ కష్టం అనిపించింది?
జ: ఏ కవిత రాయడానికి నాకు కష్టం అనిపించలేదండి. కవితా ధార అలా వెళ్ళిపోయేది. రాత్రింబగళ్లు కవిత గురించిన ఆలోచనలే ఉండేవి కాబట్టి, కవిత వాక్యాలు దొరుకుతూనే ఉండేవి. అవి రాస్తూనే ఉండేదాన్ని. నిద్ర మధ్యలో లేచి కూడా కవిత వాక్యాలు రాసి మళ్ళీ పడుకునేదాన్ని. అంటే నాకు పెద్దగా కష్టం అనిపించలేదు ఎందుకంటే ఇది నడుస్తూ ఉన్న జీవితం! సమాజంలో ఉన్న అన్నీ అవలక్షణాలతో నడుస్తూనే ఉండే జీవితం. ‘ఇల్లొక రాజకీయం’ కవితలు మానవ జీవితం నుంచి, మన చుట్టూ ఉన్న అసమ వర్గ సమాజం నుంచి, మన ఇళ్లల్లోంచి, బెడ్ రూమ్ లోంచి, బాత్రూం లోంచి, వంట గదిలోంచి, ఇళ్ల లోలోపలి గోడల పొరల్లోంచి వచ్చాయి కాబట్టి ఇవి పెద్దగా కష్టం అనిపించని కథలు, కవితలు! రాస్తున్నప్పుడు నొప్పిని కలిగించిన కవితలు. పితృస్వామ్యం వేళ్ళు పాతుకుని ఉన్న ఏ ఇళ్ళల్లో అయితే బాల్యం నుంచీ మనం పుట్టి పెరిగి ఉంటున్నామో, ఆ ఇంట్లో జరిగే లైంగిక రాజకీయాలని రాయడానికి ఏమీ కష్టం అనిపించదు. నేనే కాదు జెండర్ పాలిటిక్స్‌కి బలి అయిపోయే ఏ స్త్రీ అయినా ఈ కవిత్వాన్ని ఇలాగే రాస్తుంది.
ప్రశ్న 17: పుస్తకం ప్రచురణలో ఏవైనా ప్రత్యేక అనుభవాలు ఉన్నాయా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ప్రత్యేకమైన అనుభవాలంటూ ఏమీ లేవండి. అసలు ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి మట్టి ప్రచురణలు ప్రచురణకర్త వేనేపల్లి పాండురంగారావు గారు “వెంటనే వేస్తాను తల్లీ” అని ఒప్పుకున్నారు. ఆయనకీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ కవితలను ప్రచురించిన సంచిక, ఫెడరల్ తెలంగాణ, కొలిమి, దిశ పత్రికల సంపాదకులకి కృతజ్ఞతలు. అడక్కుండానే నేను చేస్తాను అంటూ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆలూరు రాఘవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నీరసపడ్డప్పుడల్లా మీరు రాయగలరు అని నన్ను ప్రోత్సహిస్తూ రాయించి, ఎనభై శాతం కవిత్వాన్ని తన ఫెడరల్ తెలంగాణా పత్రికలో వేసుకున్న, ప్రతీ కవిత తొలి పాఠకులు అయిన ఎడిటర్ జింకా నాగరాజుగారికి ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తకం వేసుకోవడానికి నాకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదు. పాఠకుల ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. వారం వారం నాకు విపరీతమైన ఫోన్లు రావడం, వాట్సాప్ మెసేజ్లు రావడం వాళ్ళు ఐడెంటిఫై అయిన విషయాలు చర్చించడం, చాలా భావోద్వేగాలకి గురవడం జరిగింది. ముఖ్యంగా లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు, కాలేజీ స్టూడెంట్స్, తోటి రచయిత్రులు, రచయితలు అందరూ కూడా చాలా భావోద్వేగానికి లోనవుతూ ఫోన్లు చేసేవారు. చాలా గొప్పగా ఉంది వాళ్ళ స్పందన. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు.
ప్రశ్న 18: సాహిత్య రంగంలో రచయిత్రిగా, సంపాదకురాలుగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? కొత్త పుస్తకాలు ఏమైనా సిద్ధమవుతున్నాయా?
జ: భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ లేవండి. రాయడం ఒక్కటే ఉంది. నిరంతరం రాయడం మాత్రమే ఉంది. రాయాల్సింది చాలా మిగిలే ఉంది. రాయాల్సినవి ఇంకా రెండు మూడు నవలలు ఉన్నాయి. చాలా కథలు ఉన్నాయి, కవిత్వం ఉంది. అలాగే ప్రచురణల బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కథ, కవిత పుస్తకాలు ఇతర సాహిత్యకారులవి వేయదల్చుకున్నాను. అది ‘వెన్నెల గీత ప్రచురణ సంస్థ’ ద్వారా జరుగుతుంది. కొత్త పుస్తకాలు వస్తున్నాయి. నా అనువాద కవితల పుస్తకం వస్తుంది. ట్రాన్స్‌జెండర్ కవితల పుస్తకం వస్తోంది. రెండు మూడు నవలలు వస్తున్నాయి. భారతదేశంలోని మతతత్వ రాజకీయాల మీద రాసిన ‘అత్తరు మునక’ కథా సంకలనం వస్తోంది. ‘విత్ యువర్ పర్మిషన్’ నవల సెకండ్ ప్రింట్ వస్తున్నది. అలాగే ‘హస్బెండ్ స్టిచ్’ పార్ట్’ వన్ తమిళ, మలయాళం, హిందీ భాషల్లో వస్తున్నాయి. కన్నడలో, ఇంగ్లీష్‌లో వచ్చేసింది. మిగతా భాషల్లో అనువాదాలు పూర్తయ్యాయి. అలాగే ‘ఆమె అడవిని జయించింది’ నవల ఇంగ్లీష్‌లో జుబాన్ పబ్లికేషన్స్ వాళ్ళు వేస్తున్నారు. దాన్ని ఇంగ్లీషులోకి ప్రముఖ అనువాదకురాలు డా. సునీతా రాణిగారు అనువాదం చేశారు. అలాగే ఇదే నవలని శ్రీలక్ష్మి గారు, వసంత మేడం గారు ఇద్దరు కలిసి హిందీలో అనువాదం చేశారు. కమ్యూనిస్టు రచయిత్రి రాసిన ముస్లింల స్త్రీల సామాజిక లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య హక్కులకు సంబంధించిన కథల్ని ఇంగ్లీష్, హిందీ నుంచి తెలుగులోకి ‘ఆమె కాలిపోయింది’ గా అనువాదం నేను చేశాను. ఈ కథా సంకలనాన్ని ‘వెన్నెల పిట్ట’ వాళ్ళు ప్రచురించారు. ఉదయని వాళ్ళు ప్రతి ఫోర్ట్ నైట్‌లో వీటిని వేసుకున్నారు. అట్లనే ప్రపంచ వ్యాప్తంగా మహిళా రచయిత్రులు ఎదుర్కొన్న జెండర్ డిస్క్రిమినేషన్‌ని సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాల సంకలనం కూడా తీసుకొస్తున్నాను. ఇవి కొలిమి వెబ్ పత్రికలో వరుసగా ప్రచురితమయ్యాయి. ఇంకొక నాలుగు ఐదు రాస్తే అది కూడా ఒక పుస్తకంగా వస్తుంది. ఇందులో స్త్రీల పురుషుల సెక్స్ సమస్యలకి మూలాల్ని సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో మానసిక కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాసిన వ్యాసాలు ఉన్నాయి. పాఠకులకు చెప్పిన సమాధానాలు కూడా ఇదే కోణంలో చెప్తూ వచ్చాను. ఆ పుస్తకం సిద్ధంగా ఉంది. అట్లనే ‘ఇల్లొక రాజకీయం’ కవిత్వం ఇంగ్లీషులోకి కె.ఎస్.ఆర్. ప్రసాద్ గారు అనువాదం చేశారు. ఇంకొక ఐదారు కవితలు ఆయన అనువాదం పూర్తి చేస్తే ‘ఇల్లొక రాజకీయం’ (House Is Political) గా ఇంగ్లీషులో వస్తోంది. ట్రాన్స్‌జెండర్ పోయెట్స్ రాసిన ఇంగ్లీష్ కవితలు తెలుగులోకి అనువాదం చేశాను. త్వరలో సంకలనంగా వస్తోంది. కొత్త నవల కాస్ట్ అండ్ జెండర్ మీద రాసింది, పూర్తవ వస్తుంది. త్వరలో పబ్లిష్ అవుతుంది. ఇక స్వంత & అనువాద కవితా సంకలనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు గీతాంజలి గారు.
గీతాంజలి: ధన్యవాదాలు.
***
రచన: గీతాంజలి
ప్రచురణ: మట్టి ముద్రణలు
పేజీలు: 225
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
~
పుట్ట పుస్తక శిబిరం
ఆళ్ళగడప, మిర్యాలగుడా 508207
మొబైల్: 98480 15364
~
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/illoka-rajakeeyam?
~
‘ఇల్లొక రాజకీయం’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/illoka-raajakeeyam-book-review-kss/

