[‘మల్లెలూ – మందారాలూ’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి గోళ్ళమూడి కిరణ్మయి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం గోళ్ళమూడి కిరణ్మయి గారూ.
గోళ్ళమూడి కిరణ్మయి: నమస్కారం.
~
ప్రశ్న 1: మీరు రచించిన 39 కథల సంపుటికి శీర్షికగా 25వ కథ ‘మల్లెలూ – మందారాలూ’ పేరునే ఎందుకు ఎంచుకున్నారో చెప్తారా?
జ: ఓ పుస్తకానికి టైటిల్ ఎప్పుడూ ప్రథాన ఆకర్షణ. పేరు వినగానే అందంగా, హత్తుకునేలా, అలాగే క్యాచీగా ఉండాలి అని నా భావన. స్వచ్ఛత, సౌందర్యం రెండూ కలసి ఈ సంపుటి శీర్షికలో మనకు గోచరిస్తాయి. కథలు అన్నీ మనసు లోతుల నుండి భావ పరిమళం అద్దుకుని విరిసిన కథా కుసుమాలు.
‘మల్లెలూ – మందారాలూ’ ఎంచుకోవడానికి కారణం పూచిన ప్రతి పువ్వూ దైవ సన్నిధి కోరుకుంటుంది. ఈ కథలో అంతరార్థం అదే.
ప్రకృతి నాకు ఇష్టమైన సబ్జెక్ట్. నాకు భావుకత ఎక్కువ. సున్నితత్వం ఎక్కువ. వ్రాసిన ప్రతి కథా పాఠకుల హృదయాలను స్పృశించాలి, గుండె తడిమినట్లు ఉండాలి అనుకుంటాను.
రెండేళ్ల క్రితం 45 కథలతో నా మొదటి కథా సంపుటి ‘పారిజాతాలూ – పసిడిపూలూ’ పేరుతో వెలువడింది. చక్కని స్పందన వచ్చింది. నాకు ఎంతో పేరు తీసుకు వచ్చింది. సంతోషాన్ని ఇచ్చింది.
ప్రస్తుత సంపుటి శీర్షికకు కూడా చాలా స్పందన వస్తోంది. ఈ శీర్షిక ఎందరినో ఆకర్షించింది. అందమైన ముఖచిత్రం అదనపు ఆకర్షణ.
ప్రశ్న 2: కవయిత్రిగా, కథా రచయిత్రిగా, గజల్స్ సృజనకారిణిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రక్రియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: బాల్యంలో పన్నెండు ఏళ్ళ వయసు నుండి ప్రాస కవిత్వం అంటే ఇష్టం ఏర్పడింది. కవయిత్రిగా తొలి అడుగు పడింది. న్యూ ఇయర్ కార్డులపై అందమైన గులాబీలు, ఉగాదికి బాపు గారి బొమ్మలతో వచ్చే గ్రీటింగ్ కార్డులు నాకు కవితలు వ్రాయడానికి ప్రేరణగా నిలిచాయి. కేవలం కార్డు మాత్రమే పంపకుండా ఓ చిన్న సందేశం కవితలా వ్రాయడం అలవాటు అయ్యింది. సందర్భాన్ని బట్టి కవితలు వ్రాయడం నా ఫ్రెండ్స్ అవి దాచుకోవడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చేవి.
నేను వ్రాసే ఉత్తరాలు కవితాత్మకంగా ఉండి అవి అందుకున్న వాళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు. ఎదురు చూసేవాళ్ళు. వాటిని లాకర్‌లో దాచుకున్నామని చెప్పినవాళ్ళు ఉన్నారు. ఏళ్ల తర్వాత నాకు చూపించినవాళ్ళు ఉన్నారు.
చిన్నప్పటి నుండి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు కథలు బాగా చదివాను. కథలు, సీరియల్స్, నవలలు చదివాను. మా పెదనాన్న గారి ఇంట్లో అన్ని వారపత్రికలు వచ్చేవి. వేసవి సెలవులలో పుస్తకాల పురుగులా బాగా సద్వినియోగం అయ్యేవి. బహుశా మెదడులో అప్పుడే అంకురం పడి కాలక్రమేణా మొలక ఎత్తింది. కథలు వ్రాయాలి అని బలంగా ఉన్నా ఎలా వ్రాయాలి, పత్రికలు ప్రచురించేలా ఎలా వ్రాయాలి ఇలా సాగేవి ఆలోచనలు.
కథా రచన అనుకోకుండా జరిగింది. 2019 జనవరిలో తలవని తలంపుగా ఫేస్‌బుక్ మాధ్యమంగా భావుకలో అడుగు పెట్టడం జరిగింది. మార్చిలో ఉగాది కథల పోటీ పెట్టారు.
నాకు ఆ పోటీలో పాల్గొనాలి అని ఆసక్తితో పూర్తి భావుకత జోడించిన కథ ‘ప్రేమలేఖ’ వ్రాసి పంపాను. అలా తొలి కథకు పునాది పడింది.
వికారి నామ సంవత్సరం కథల పోటీలో నా తొలి కథ ప్రేమలేఖ తృతీయ బహుమతి విజేతగా సాహితీ లోకంలో తొలిమెట్టుపై నిలబెట్టింది. ఆ తరువాత నేను వెనుతిరిగి చూడలేదు. ఇప్పటి వరకు రెండు వందల యాబై పైగా కథలు వ్రాసాను.
గత మూడేళ్లుగా గజల్స్ వ్రాస్తున్నాను. నా భావుకతకు నిలువుటద్దం నా గజళ్ళు. నా కలం నుండి జాలువారే భావనలు గజల్ కవయిత్రిగా నన్ను గజల్ సాహితీ వేదికపై నిలబెట్టాయి. ఈ ప్రస్థానం బాగుంది. సంతృప్తిని ఇస్తోంది.
ప్రశ్న 3: కవిత/కథ వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: కవిత/కథ రెండూ నాకు ఇష్టం అయినవే. ఏదీ సులువు కాదు ఏదీ కష్టం కాదు. వచన కవితకు పరిమితులు లేవు. ఎల్లలు లేని ఊహలు అనంతమైనవి. మనసులో మనవైన భావాలు ఝరిలా పొంగాలి. ప్రకృతిలో వస్తువులు అన్నీ కవితకు ముడి సరుకులే.
కథ అంటేనే కల్పన. వాస్తవానికి ఊహను జోడిస్తే అది కథగా రూపు దిద్దుకుంటుంది.
ఓ ఆలోచన కథగా పురుడు పోసుకున్నప్పుడు పడే తపన మాటలకు అందనిది. కథ అలవోకగా వ్రాసినా మంచి కథగా నిలబడాలి అంటే ప్రసవ వేదన తప్పదు. ఉబుసుపోక వ్రాసే కల్పనలు ఆ క్షణానికి ఊపిరి పోస్తాయి కానీ కథా జగత్తులో కలకాలం నిలబడవు.
ప్రశ్న 4: ఇది మీ రెండవ కథాసంపుటి. మీ 12 కథలు ఇతర సంకలనాలలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా, కథలకి మీరు ఇతివృత్తాలను ఎలా ఎంచుకుంటారో వివరిస్తారా?
జ: అవును ఇది రెండవ కథా సంపుటి. నా కథలు అన్నీ చాలా వరకు నిజ జీవితంలో ఎదురైన, చూసిన, విన్న సంఘటనల ఆధారంగా అల్లినవి.
ఏ కథ అయినా ఇతివృత్తమే కేంద్రం. ఒక ఆలోచన చుట్టూ కథ అల్లుతాం కనుక ప్రధాన అంశం ఏమి చెప్పదలచుకున్నాము నిర్దేశించేది అదే. ఎందుకు వ్రాస్తున్నామో కూడా చెప్పేది అదే.
నేను ఎక్కువగా మానవీయ సంబంధాలు, కుటుంబము, విలువలు, బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇచ్చి పుచ్చుకోవడాలు, సామాజిక సమస్యలు, పరిష్కార మార్గాలు, అంతర్లీనంగా సందేశం ఉండేలా ఇతివృత్తం ఎంచుకుంటాను.
12 సంకలనాలలో వచ్చినవి సామాజిక అంశాలతో ముడిపడిన మౌక్తికాలు. ప్రతీ కథ సందేశాన్ని ఇచ్చేవి ఆలోచింపచేసేవి.
సంకలనంలో నా కథ ఉంటే ముందు నీ కథ చదువుతాం అని ఎందరో నాకు చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది.
ప్రశ్న 5: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: ఏ కథకు అయినా వస్తువే మూలం నేపథ్యం.
ప్రకృతిలో లభించే ప్రతి వస్తువూ ప్రధానమే. కాదేదీ కథకు అనర్హం. శిలను అందమైన శిల్పంగా మలచడంలో శైలిది నగిషీ పాత్ర.
వస్తువును కథగా మలిచే విధానం కథన శిల్పం. పాఠకుడు కథ చదువుతున్నపుడు ఆ దృశ్యం కనబడాలి. అదే శిల్పం. నా కథలలో దృశ్యం కనబడుతుంది అని పాఠకులు చెప్పినపుడు కలిగే ఆనందం అనంతం.
శైలి కథకు చక్కని ఆభరణం. పాఠకుడిని ఆసాంతం చదివించే గుణం ఉండాలి. పాఠకుడు కథలో మమేకం కావాలి. చక్కని భాషా పటిమ, వాక్య నిర్మాణం, అలంకారాలు, తనదైన ముద్ర ఉండాలి. నాలోని భావుకత నాకో చక్కని ముద్రను వేసింది. నా శైలి కి మెరుగులు దిద్దింది.
నా దృష్టిలో ఈ మూడు కలసిన కథ అజరామరం.
ప్రశ్న 6: ఈ కథలని పరిశీలిస్తే, క్లుప్తత, చిన్న హాస్యం, సంభాషణలు ప్రధాన ఆకర్షణ అయినట్లు తోస్తుంది. దీనినే మీ కథారచనా శైలిగా పరిగణించవచ్చా?
జ: ఈ కథలు కొన్ని చిన్నవి, నిడివి తక్కువ కథలు. కొన్ని పోస్టుకార్డు కథల కంటే మరి కాస్త నిడివి గల కథలు. అల్ప అక్షరాలలో అనల్ప అర్థాన్ని నింపుకున్నవి. సాధ్యమయినంత క్లుప్తత పాటించి చిరుహాస్యం జోడించి వ్రాసిన కథలు. కథలో సంభాషణలు పాఠకులకు ఉత్సుకతను పెంచుతాయి. అది మీరన్నట్లు ప్రధాన ఆకర్షణ. చిన్న కథలకు సంభాషణ ఆయువుపట్టు. ఒక పేరా కథ రెండు సంభాషణలలో చెప్పగలగాలి. వ్యాసాలుగా వ్రాస్తే కథలు పేలవంగా ఉంటాయి.
పేజీలు తిప్పేసే ప్రమాదం ఉంది. కథ ఎప్పుడూ చదివించేదిగా ఉండాలి. ఆసక్తిని రేకెత్తించాలి.
నా కథా రచనా శైలి హృద్యంగా, సరదాగా, హృదయానికి హత్తుకునేలా, కొసమెరుపుతో ఆలోచింపచేసి సందేశాత్మకంగా ఉంటుంది. ఏ కథకు ఆ కథే వైవిధ్యంగా ఉండాలి. ఒకటే మూస కథలు నా కలానికి దూరం. ఆహ్లాదం, భావుకత నిండిన శైలిలో వ్రాయటానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. పెద్ద కథలలో భావుకత నా శైలికి అద్దం పడతాయి.
ప్రశ్న 7: అవధానాలలో ఆశుకవిగా, పూరణకవిగా పాల్గొన్నారు కదా, అవధానాల పట్ల మీకెప్పుడు, ఎలా ఆసక్తి కలిగింది? మీ కుటుంబంలోగాని బంధువులలోగాని ఎవరైనా అవధాన పండితులున్నారా?
జ: తెలుగు నాకు ప్రియమైన సబ్జెక్టు. హైస్కూల్‌లో తెలుగు బోధించిన వర్ధనీ టీచర్, కుసుమ టీచర్ పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. అలా పద్యాల మీద మక్కువ ఏర్పడింది. తెలుగు పదసంపద పెరిగింది. పద్యాలకు బాటలు వేసింది.
తొలిసారి మేడసాని మోహన్ గారి అష్టావధానం తెలుగు లలిత కళాతోరణంలో వీక్షించడం జరిగింది. అప్పటి నుండి అవధానాల మీద ఆసక్తి కలిగింది. పద్యం వ్రాయాలి అనే కోరిక పట్టుదల పెరిగింది.
శతావధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పన్నెండవ శతావధానంలో ఆశుకవిగా పాల్గొనే అవకాశం అదృష్టం అనుకోకుండా లభించింది. అలాగే కెనడా నుండి శ్రీ నెల్లుట్ల నవీన్ చంద్ర గారి కవితా వేదిక పై శతావధాని శ్రీ ఆముదాల మురళి గారితో నిర్వహించిన మూడు అష్టావధానాలలో రెండు సార్లు పురాణకవిగా మరోసారి ఆశుకవిగా పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమే.
మా బంధువులలో అవధాన పండితులు ఉండి ఉండవచ్చు కానీ మా కుటుంబంలో ఎవరూ లేరు.
ప్రశ్న 8: ‘ఎడబాటు’ కథ – చిత్రానికి కథ వ్రాయమన్న ఓ సందర్భం కోసం వ్రాసిన కథ. ఆ సందర్భం (పోటీ) గురించి, ఆ కథ నేపథ్యం వివరించండి.
జ: ప్రమదాక్షరి గ్రూపులో జ్యోతి వలబోజు గారు ఓ చిత్రం ఇచ్చి మూడు వందల పదాలలో చిన్న కథ వ్రాయమని అడిగారు. ఆ చిత్రంలో ఓ వృద్ధ జంట పార్కులో చెరో చేతికర్ర పట్టుకుని వెళుతూ ఉంటారు.
ఆ కథ నేపథ్యం చెబుతాను. పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రులను ఒకే ఊరిలో ఉన్న ఇద్దరు కొడుకులు చెరి ఆరు నెలలు చెరి ఒకరిని పంచుకుంటారు( ఓ కొడుకు తండ్రిని మరో కొడుకు తల్లిని).
మలి వయసులో ఈ ఎడబాటు వారిని క్రుంగదీస్తుంది. ఆ పెద్దాయన నడక పేరుతో రోజూ పార్కుకు వస్తాడు. ఆయన భార్య పదిహేను రోజులకు ఒకసారి గుడికి వెళుతున్నా అని ఇంట్లో చెప్పి పార్కుకు వచ్చి భర్తను కలుస్తూ ఉంటుంది. నేటి తల్లిదండ్రులు, పిల్లల తీరు తెన్నులు వివరించే కథ. వాస్తవానికి చిరుకల్పన జోడించి వ్రాసిన కథ. వ్రాస్తున్నప్పుడే గుండెను పిండేసిన కథాంశం.
ప్రశ్న 9: ‘మీరా – కొత్తిమీర’ చక్కని కథ. ఈ కథని మీరా నిజజీవితంలో మీకు తెలిసిన వ్యక్తా? లేక కల్పించి సృష్టించిన పాత్రా? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: ‘మీరా – కొత్తిమీర’ యథార్థ గాథ. పేర్లు మాత్రం మార్చబడినవి. పాత్రలు అన్నీ సజీవమే. మీరా నాకు తెలిసిన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ నోరారా అందర్నీ పలకరించే ఓ అందాల భరిణె.
సిటీలో ఉంటూ రోజూ మారుమూల ప్రాంతాలలో పల్లెలో ఉద్యోగం చేసేవారికి సిటీ నుండి వెళ్ళి రావడం ఒక ప్రహసనమే. ప్రయాణమే కష్టం కానీ పల్లెలో స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని ప్రజలు. ఏ ప్రాంతం అయినా పల్లెలు మమతల లోగిళ్ళు, మమకారానికి పట్టుకొమ్మలు.
అలా ఓ పల్లెటూరులో ఉద్యోగం చేసినపుడు తారసపడిన వ్యక్తులు, వస్తువు, వాతావరణం ఈ కథలో ముడిసరుకులు. ఇందులో కొత్తిమీర ప్రధాన వస్తువు. చెలక నుండి తనను కోరుకునే వారిని చేరుకుంది. ఒక భావోద్వేగం నన్ను కుదిపి వేసింది. అది మాటలకు అందనిది.
కోరి కోరి వీడేవు కొత్తపల్లి
కొత్తిమీర జ్ఞాపకాలు ఎదగిల్లి
అంటూ వ్రాసిన కవిత కథలా మారి పాఠక లోకాన్ని స్పృశిస్తోంది. మొన్న పుస్తక ప్రదర్శనలో సంపుటి తీసుకున్న ఓ పాఠకురాలు లక్ష్మీ ప్రసన్న గారు ‘ఇంటికి వెళ్లగానే మొదట ఈ కథ చదివాను చాలా బాగుంది’ అంటూ తన ఆనందాన్ని నాకు వాట్సాప్‌లో పంచుకున్నారు. ఓ సంబరానికి పునాది వేసారు.
ప్రశ్న 10: ‘సంత బొమ్మాళి’ కథ శీర్షిక చూసినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ఊరు స్ఫురిస్తుంది. కానీ ఈ కథ చదివాక, శీర్షికకి కథకి పెద్దగా సంబంధం లేకపోయినా, పాఠకులు ఏమీ అనుకోరు. సంత నేపథ్యంగా అల్లిన ఈ కథ గురించి మరికాస్త వివరిస్తారా?
జ: ‘సంత బొమ్మాళి’ కథ లో శుక్రవారం సంత నేపథ్యం. బొమ్మాళి అంటే బొమ్మ లేదా అమ్మాయి. సంతలో ఓ పాప కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. పాప తల్లి స్కూల్ టరం ఫీజు కట్టడానికి డబ్బులు లేక పాపను సంతలో కూర్చోబెట్టి మాస్టారి దగ్గరకు వెళుతుంది సమయం కోరడానికి. వారి నిజాయితీ గురించి అల్లిన కథ.
మీరు చెప్పిన సంతబొమ్మాళి రైల్వే స్టేషన్ నేను బెంగాల్ వెళుతున్నపుడు పలుమార్లు చూసాను. పేరు గమ్మత్తుగా ఉంది అనుకున్నాను అప్పుడు.
ఇప్పుడు శుక్రవారం సంత కథ వ్రాసినపుడు యాదృచ్చికంగా ఆ పేరు శీర్షికగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఊరితో కథకు సంబంధం లేదు.
ప్రశ్న 11: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. అన్ని కథలు నచ్చినవే. మనసుకు దగ్గరగా వచ్చినవే. ఆహ్లాదాన్ని కలిగించినవి కొన్ని, ఆవేదన రగిలించినవి కొన్ని, మనసు దోచినవి కొన్ని, గుండెను పిండినవి మరి కొన్ని.
ఈ సంపుటిలో ‘సీతమ్మ మాయమ్మ’ నా మనసుకు మరింత బాగా దగ్గరగా వచ్చిన కథ. తొలినాళ్లలో వ్రాసిన కథ అయినా మంచి డెప్త్ ఉన్న కథ. పెళ్ళి అయ్యి ఏడేళ్లు అయినా పిల్లలు కలగని శ్రావణి IVF కూడా అనుకూలించక అంతరంగంలో సుడులు తిరిగిన తుపాను ఎలా తీరం చేరింది అన్నది ఇతివృత్తం.
ప్రశ్న 12: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఏ కథా కష్టంగా అనిపించలేదు. అన్నీ ఇష్టంగా వ్రాసినవే. ఏ కథ అయినా వ్రాసాక పదిసార్లు చదువుతాను. ఏవైనా మెరుగులు అవసరమా అని ఆలోచిస్తాను. ఈ సంపుటిలో కథలు అన్నీ సాన పెట్టిన కథలే.
ప్రశ్న 13: ‘మల్లెలూ – మందారాలూ’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: నా తొలి కథల సంపుటి ‘పారిజాతాలు పసిడిపూలూ’ నాకు ఆకుపచ్చని తివాచీ పరిచింది. గిడుగు రామమూర్తి పురస్కారంతో గుర్తింపును తీసుకు వచ్చింది. మలి ముద్రణకు ప్రేరణ ఇచ్చింది.
ఆ ప్రేరణతో ఈ రెండవ సంపుటి ‘మల్లెలూ మందారాలూ’ ఇనుమడించిన ఉత్సాహంతో వెలువడింది. ప్రచురణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి అని ఓ మూల అనుకున్నా ఓ సంబరం వెన్నంటి వచ్చింది.
ఈ సంపుటి గత డిసెంబర్ నెల (డిసెంబర్ 14 2025న) భావుక సదస్సులో శతావధాని శ్రీమతి అపర్ణ బులుసు గారిచే ఆవిష్కరించబడింది. సభలో స్పందన బాగుంది.
వెంటనే 19వ తేదీ నుండి పుస్తక ప్రదర్శన ప్రారంభం కావడం మరింత ఉత్సాహం వచ్చింది. చాలా మంది పాఠకుల చేతులలో మల్లెలు మందారాలు విరిసాయి. రోజూ వారి స్పందన వినబడుతూనే ఉంది. మనసు రాగ రంజితం అవుతోంది.
ప్రశ్న 14: 39 కథలకి, చివరన కథ ప్రచురితమైన పత్రిక, తేదీల వివరాలు లేవు. తేదీలు ఇచ్చి ఉంటే, కాలానుగుణంగా కథల్లోనూ, రచయిత్రిలోనూ వచ్చిన మార్పులను పాఠకులు గుర్తించేవారు కదా! పరిశోధకులకు కూడా ఉపయుక్తంగా ఉండేది. ఎందుకు వద్దనుకున్నారు?
జ: కథలు అన్నీ ఫేస్‌బుక్ మాధ్యమంగా భావుకలో, ఇతర సంస్థలలో వచ్చినవి. పోటీలలో గెలుపొందినవి కొన్ని. అంత దూరం ఆలోచన చేయలేదు. రాబోవు పుస్తకంలో మీ సూచన తప్పక పాటిస్తాను.
ప్రశ్న 15: కొన్ని కథలను సందర్భోచితంగా, తెలుగు హిందీ సినిమా పాటలతో ముగించారు. మీరు గాయని కూడానా? సంగీతంలో ప్రవేశం/ప్రావీణ్యం ఉందా?
జ: నాకు లలిత కళలు ఇష్టం.. సంగీతం, నృత్యం, కవిత్వం లలో నాకు ప్రవేశం ఉంది. కొన్నిబహుమతులు వచ్చాయి.
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః”
సంగీతం ఇష్టపడని వారు ఉంటారా!
కొన్ని కథలు వ్రాస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని పాటలు హమ్ అవుతుంటాయి. ఆ కథల ముగింపు అలా జరిగింది. నాకూ అలా ముగించడం సంతోషాన్ని ఇచ్చింది.
ప్రశ్న 16: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: సాహిత్యరంగంలో విలువైన రచనలతో నాదైన ముద్రతో ఓ పేజీ నాదిగా సాగడం నా ఆకాంక్ష. ఈ రోజు నాది రేపు కూడా నాది కావాలి అనుకునే ఆశావాదిని.
‘మల్లెలూ – మందారాలూ’ విడుదల జరిగి రెండు నెలలు దాటాయి. ఆ కథాకేళి సంబరం నుండి బయట పడేందుకు కాస్త సమయం పడుతుంది. పొన్నాడ వారి పున్నాగ వనంలో ఇరువది ఐదు శతక పద్యాలకు చక్కని కథలు వ్రాసి ప్రథమ బహుమతి విజేతగా నిలిచాను. పుస్తక రూపం దాల్చే ఆలోచనలు ఉన్నాయి.
కొత్త పుస్తకాలు తప్పకుండా వస్తాయి. పాఠకుల ఆశీస్సులు నడిపిస్తాయి. మరిన్ని విలువైన కథలతో మీ ముందుకు వస్తాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు గోళ్ళమూడి కిరణ్మయి గారూ.
గోళ్ళమూడి కిరణ్మయి: చాలా సంతోషం. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన సంచిక పత్రిక టీమ్‌కు మనఃపూర్వక ధన్యవాదములు.
***
రచన: గోళ్ళమూడి కిరణ్మయి
ప్రచురణ: జెవి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 192
వెల: ₹ 200/-
ప్రతులకు:
జి.వి.ఎన్. చంద్రమోహన్,
ఫోన్: 9866372149
~
గోళ్ళమూడి కిరణ్మయి
ఫోన్: 9000017269 (వాట్సప్ మాత్రమే)
~
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/dp/939472835X
~
‘మల్లెలూ – మందారాలు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/malleloo-mandaaraalu-book-review-kss/

