Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవయిత్రి, కాలమిస్ట్, అనువాదకురాలు శ్రీమతి హిమజ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘మాయా ఏంజిలో కవితలు’ అనే అనువాద కవితా సంపుటి వెలువరించిన హిమజ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం హిమజ గారూ.

హిమజ: నమస్కారం.

~

ప్రశ్న 1. మాయా ఏంజెలో కవితలని అనువదించి పుస్తకంగా వెలువరించినందుకు అభినందనలు. ఇది మీ మూడవ పుస్తకమా?

జ: అభినందనలకు ధన్యవాదాలు. అవును ఇది మూడవ పుస్తకమే. ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ నా పూర్వ కవితా సంకలనాలు.

ప్రశ్న 2. మీరు కవయిత్రి, కథకులు, అనువాదకులు. కాలమిస్ట్. మీ సాహితీ ప్రస్థానం ఎప్పుడు, ఏ ప్రక్రియతో మొదలైందో పాఠకులకు తెలియజేస్తారా?

జ: నా సాహితీ ప్రయాణం కవిత్వంతో మొదలైంది. నా మొట్టమొదటి కవిత, కథ నేను హనుమకొండ పింగళి మహిళా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు, మా కాలేజీ మ్యాగజైన్‌లో అచ్ఛయినాయి. అదే సంవత్సరం మ్యాగజైన్‌కి తెలుగు విభాగంలో సంపాదక బాధ్యతలు నిర్వహించడం నాకో తీపి గురుతు. పెళ్లి తరువాత వెంటనే రాయకపోయినా మా ఇంటి సాహిత్య వాతావరణం వల్ల పఠనానికి దూరం కాలేదు. చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత మొదటగా నేటినిజం ప్రత్యేక సంచికలో 2004లో ‘పాత్ర’ శీర్షికతో ఒక కవిత అచ్చయింది. అప్పటినుంచీ వరుసగా రాస్తున్నాను. ‘కథలే వెతలై’ సంకలనం, కరోనా కథల సంకలనం, వృత్తి కథల సంకలనాల కొరకు కథలు రాసాను. మ్యూజింగ్స్ లాంటి భావనలు, సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ శీర్షికతో సంవత్సరం పాటు సిసి రెడ్డి గారి మనభూమి మాసపత్రికలో కాలమ్ రాసాను. కొంతకాలం భూమికలో పద ప్రహేళిక నిర్వహించాను.

ప్రశ్న 3. ‘సంచీలో దీపం’ పుస్తకానికి ఈ పుస్తకానికి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టుంది? పదేళ్ళ వరకూ మరో పుస్తకం తేకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: అవునండి, గ్యాప్ వచ్చిన మాట నిజమే. ఇల్లనే cage లో నన్ను నేను బంధించుకున్న bird ని నేను (నవ్వుతూ) నిజానికి నాకై నేనే కుటుంబం, బంధాల్లో కూరుకుపోతుంటాను. అంతే కాకుండా తొమ్మిదేళ్లు తీవ్రమైన మోకాలి నొప్పితో నా ప్రొడక్టివ్ టైమ్ బాగా తగ్గిపోయింది. సర్జరీ తరువాత మూడేళ్లుగా -బాగుందిప్పుడు. ఇంతకు మించిన ప్రత్యేక కారణాలేవీ లేవు.

ప్రశ్న 4. మీరు స్వయానా కవయిత్రి, అనువాద కవితల వైపు మళ్ళేలా మిమ్మల్ని ఏది ప్రేరేపించింది?

జ: 2017లో అనుకుంటాను, ఒక అనువాద కవితోత్సవంలో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. అప్పటికి నా దగ్గర అనువాద కవితలు ఏవీ సిద్ధంగా లేవు. ఇంటర్నెట్‌లో కొన్ని ఆంగ్ల కవితలు వెతికి పెట్టుకున్నాను. అతి సులభంగా అర్థం అయ్యి త్వరగా అనువాదానికి లొంగే ఒక కవితను ఎంపిక చేసుకున్నాను. ఆ కవిత ఇది.

Do Not Ask Me to remember – Owen Darnell
Do not ask me to remember,
Don’t try to make me understand,
Let me rest and know you’re with me,
Kiss my cheek and hold my hand.
I’m confused beyond your concept,
Iam sad and sick and lost.
All I know is that I need you To be with me
at all cost.
Do not lose your patience with me,
Do not scold or curse or cry.
I can’t help the way I’m acting,
Can’t be different though I try.
Just remember that I need you,
That the best of me is gone,
Please don’t fail to stand beside me,
Love me til my life is done.

~

డార్నెల్ తన భార్య అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతున్న సమయంలో ఆమెను సంరక్షించిన అనుభవం తర్వాత ఈ కవితను రాశాడని తెలియవచ్చింది. అందువల్ల ఇది ఎంతో వ్యక్తిగతంగా ఉండి, అనేక కుటుంబాలకు తమ అనుభవాల్లా అనిపించేలా ఉంది. అప్పటికి మా కుటుంబంలోనూ అత్యంత ఆత్మీయురాలు dementia తో బాధపడి 2016లో మరణించారు. అందువల్ల కూడా ఆ కవితని ఎంచుకున్నానేమో, ఆ కవిత అనువాదం ఈ విధంగా వచ్చింది.

అల్జీమర్స్
నాకేదో జ్ఞప్తికి తేవాలని చూడకు
మరేదో అర్థం చేయించాలని యత్నించకు

నన్నిలా విశ్రాంతిగా ఉండనివ్వు
నువ్వు నాతో పాటు అలా ఉండు
నీ చేయి నా చేతిని పట్టుకొని
ఉంటే చాలు

మీ అంచనాలకు అతీతంగా
ఒకానొక అయోమయ స్థితిలో నేను
బాధగా రోగగ్రస్థంగా
నాకు నేనే లేనట్లుగా
నాకు తెలిసిందొక్కటే –
నువు నాతో వున్నావని
కోరేదొక్కటే – నాతోనే ఉండాలని
నిందించకు నన్ను, శపించకు
ఏడవనూ వద్దు నాకై
నిస్సహాయను – నాకిలా ఎందుకైందో
తెలియని దాన్ని
ఎంత ప్రయత్నించినా
మీరనుకున్నట్టు ఉండలేని దాన్ని
నాపై కొంత ప్రేమని కరుణని చూపించు

కణాల విధ్వంసంతో
నా మెదడు ఇచ్చే ఆదేశాలను
నా దేహం, నా కాళ్ళు
ఖాతరు చేయకున్నా
హృదయంతో లంకె
విడిపోలేదీ దేహానికి
నీపై అనురాగంతో
ముడిపడేఉంది అదింకా

నీకివరకు నచ్చిన సుగుణాలు అందాలు
ఇప్పుడేవీ నాలో లేకున్నా
నా పక్కన నిలబడి
నిబ్బరాన్నివ్వడానికి వెనుకాడకు
నా చివరాఖరి శ్వాస దాకా
తోడై నాతో ఉండు!!

ఈ విధంగా అనువాద ప్రక్రియలోకి అడిగిడడం జరిగింది. దీని తరువాత అనువాదానికి అనువుగా ఉండే కవితలు వెతుక్కోవడం అలవాటుగా మారింది.

అందంగా కుదిరిన అనువాదంలోని సొగసును ఆస్వాదించడం మొదలైంది. స్వీయ కవితలు రాయడంలో వచ్చిన గ్యాప్‌ని, వెలితి ఫీలింగ్‌ని అనువాద కవితలు కొంత మేరకు భర్తీ చేస్తున్నాయని అనిపించేది.

ప్రశ్న 5. స్వంతంగా కవిత రాయడం లేదా ఒక కవితని అనువదించడం – మీ దృష్టిలో ఈ రెండిటిలో ఏది కష్టం? ఎందువల్ల?

జ: సృజనాత్మకత పరంగా స్వంత కవిత కష్టం. భాషా నైపుణ్యం పరంగా అనువాదం కష్టం.

ఇష్టమైతే రెండూ సులువేనండి. అయినా ఒక్కోసారి గుండె గొంతుకలోన కొట్లాడుతుంది అన్నట్టుగా మనసులోని భావం ఎంతకూ పదాల్లోకి ఒదగదు.

స్వంత కవిత రాయడానికి సొంత భావాలను, అనుభూతులను పదాలలోకి మార్చాలి. భావం, లయ, ఊహ, భావోద్వేగం అన్నీ సరైన సమన్వయంతో రావాలి.

పదాలు, ఉపమానాలు, లయ – అన్నీ కొత్తగా సృష్టించాల్సి వస్తుంది. స్వీయ కవితా రచనకై కొత్తగా, అసాధారణంగా ఆలోచించాల్సి ఉంటుంది.

మన భావనలను అద్భుతంగా, ప్రభావవంతంగా వ్యక్తం చేయవలసి ఉంటుంది.ఇదివరకు ఎవరూ చెప్పని విధంగా కొత్తగా వ్యక్తీకరించాల్సి ఉంటుంది.

కవితని అనువదించడం: కవితలో ఉన్న భావాలను, భావోద్వేగాలను మరొక భాషలో నిలుపుకోగలగాలి.

శబ్దరూపం, లయ, సరైన పదాన్ని ఎంచుకోవడం, అసలు కవిత సారాన్ని వదిలెయ్యకుండా ఉండటం అవసరం.

అపురూప అవార్డు అందుకుంటున్న సందర్భం

కొన్ని పదాలు లేదా భావాలు మరొక భాషలో సరిగ్గా ఉండకపోవచ్చు, కాబట్టి సృజనాత్మక మార్పులు చేయాలి. అసలు కవిత రసాన్ని, భావాన్ని, నడకను కొత్త భాషలో ప్రతిఫలింపజేయడం కొంత కష్టం. అయితే మనసు పెట్టి అనువాదం చేయగలిగితే అది ఇష్టంగానే ఉంటుంది.

స్వంత కవితలో కొత్త సృష్టి, సొంత భావాల వ్యక్తీకరణ ఉంటే అనువాదంలో ఇంకొకరి భావాలను అర్థం చెడకుండా అందించగలగడం, సారాంశం, లయని నిలుపుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు ఉంటాయి.

కల్పనా స్వేచ్ఛ, అనువాద నైపుణ్యం రెండింటినీ సమన్వయం చేయాల్సి ఉంటుంది..

ప్రశ్న 6. కవిత్వాన్ని అనువదించడానికి మూల భాష, లక్ష్య భాషలపై పట్టు ఉండడమే కాకుండా, ఇంకా ఏవేవి కీలకమని మీరు భావిస్తున్నారు?

జ: కవిత్వాన్ని అనువదించడానికి భాషలపై పట్టు చాలా ముఖ్యమే. దానితో బాటు మరిన్ని సూక్ష్మ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి కీలకమని నేను భావిస్తాను:

మూల కవితలో ఉన్న పదాల అర్థం మాత్రమే కాదు – వాటి వెనుక ఉన్న భావం, లయ, మౌనాన్ని కూడా పట్టించుకునే సున్నితత్వం అవసరం.

మూలకవిత పుట్టిన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రతీకలు (symbols), పురాణ సూచనలు తెలిసి ఉండాలి. తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే భావం తప్పిపోతుంది. అంతర్జాలంలో వెతికే ఓపిక ఉండాలే గాని ఇవాళ ఎంతో సమాచారం సులభంగానే దొరుకుతుంది. సమయం వెచ్చించాలి.

అంతేకాకుండా, కవి ఏ మానసిక స్థితిలో ఆ పంక్తులు రాశాడో, అతని దృష్టికోణం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

అక్షరానువాదం కంటే భావానువాదం ముఖ్యం. కొన్ని చోట్ల పదాన్ని వదిలి భావాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.

కేవలం అనువాదకుడిగా కాకుండా, లక్ష్యభాషలో మంచి కవిత రాయగలిగి ఉండాలి. సాధ్యమైనంత వ్యవహారిక భాష వాడడం మంచిదని నా అభిప్రాయం.

ఇది నా కవిత కాదు అన్న భావనతో, మూల కవితకు న్యాయం చేయాలనే విధేయత తపన, కలిగి ఉండడం అవసరం.

భాష + కవితా హృదయం + సాంస్కృతిక జ్ఞానం + సృజనాత్మక సాహసం – ఇవన్నీ కలిసినప్పుడే మంచి కవితానువాదం సాధ్యమవుతుందని అనుకుంటాను.

ప్రశ్న 7. మాయా ఏంజిలో కవితలని అనువదించి ప్రచురించడం వెనుక ఉన్న నేపథ్యం వివరిస్తారా?

జ: 2016లో మా అబ్బాయి దగ్గరికి అమెరికాకి వెళ్ళినపుడు నాలుగైదు స్టేట్స్ తిప్పి చూపించాడు. అలా న్యూయార్క్ లోని మేడమ్ టస్సాడ్స్ మైనం ప్రతిమల మ్యూజియంలో అనేక అంతర్జాతీయ ప్రముఖుల ప్రతిమల సరసన మాయా ఏంజిలో మైనం బొమ్మని కూడా చూసి థ్రిల్ అయ్యాను. ఒక నల్లజాతి కవయిత్రికి అరుదైన గౌరవం దక్కింది అక్షరం వల్లే కదా అని క్షణకాలం ఉద్విగ్నమైంది మనసు. బహుశా అప్పటినుంచి తెలియకుండానే మాయా కవితల పైన నా అధ్యయనం మొదలైందేమో. మాయా మైనం విగ్రహంతో ఫోటో తీసుకున్నాను గానీ ఫోన్లు మారిపోవడం వల్ల ఇప్పుడు నా దగ్గర అది లేదు.

అనువాద కవితోత్సవంలో చదివిన నా మొదటి అనువాద కవితకు మంచి ప్రశంసలే వచ్చినా దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు నేను. తరవాత కొంత కాలానికి నేను చేసిన మాయా poor girl కవిత, అనువాదం పలువురికి బాగా నచ్చింది. అనువాదాలపై దృష్టి పెట్టమని ఒకరిద్దరు కవులు సూచించారు. కొంత ఉత్సాహంతో మంచి కవితలు ఇంటర్నెట్‌లో వెతుకుతూ, ఎక్కువగా మాయా కవితలు అనువాదాలు చేసుకుంటుంటే, ఒకరోజు మావారు రాజేందర్ జింబో మాయా ఏంజిలో కవిత్వ సంపుటి నాకు gift చేసారు. అప్పటినుండి వరసగా మాయా కవితల అనువాదం మొదలైంది. కొంత కాలానికి సాహితీ మిత్రురాలు డా. గీతాంజలి అంతర్జాతీయ అనువాద కవిత్వం గ్రూపులో చేర్చారు నన్ను. అందులో post చేసేదాన్ని. కవితలు అనువాదం బాగా వస్తున్నాయంటూ, ‘సంచిక’ వారికి పంపమని సూచించారు గీతాంజలి. ‘సంచిక’లో నెలకొని ఉన్న మంచి సాహితీ సంస్కారం, రచయితలకు సంపాదకులు ఇచ్చే స్వేచ్ఛ, గౌరవం వల్ల నా అనువాద ప్రయాణం సాఫీగా సాగింది. ధన్యవాదాలు మీకు.

యాభై కవితలు ప్రచురితం అయిన తరువాత పుస్తకం వేయమని కొందరు మిత్రులు అన్నారు. అప్పటి వరకూ అనువాద కవిత వేయాలన్న ఆలోచన లేదు.

“Destiny is not a matter of chance; it is a matter of choice.” – అంటారు గానీ మాయా కవితల విషయంలో chance (అవకాశం) choice (ఎంపిక) రెండూ కలిసి నన్నో అనువాదకురాలిని చేసాయి. సహకరించిన అందరికీ అనేక కృతజ్ఞతలు.

ప్రశ్న 8. “మాయా ఏంజెలో కవిత్వం చదువుకునేందుకు ఇష్టంగా వుంటుంది. అనువదించడం సవాలుగా వుంటుంది” అని వ్యాఖ్యానించారు మీ ముందుమాటలో. అలా ఎందుకనిపించింది? మాయా ఏంజెలో కవిత్వం గురించి, ఆమె కవితా శైలి గురించి వివరించండి.

జ: మాయా ఏంజెలో భాష చాలా సరళంగా అనిపిస్తుంది. కానీ ఆ సరళత వెనుక బలమైన భావోద్వేగం, అనుభవాల గాఢత ఉంటుంది. సాధారణ మాటల్లోనే అసాధారణమైన ఆత్మగౌరవం, బాధ, పోరాటం, ఆశను వ్యక్తపరుస్తారు మాయా.

ఆమె కవిత్వ కేంద్రబిందువు – మానవ గౌరవం. ముఖ్యంగా నల్లజాతి మహిళగా ఆమె ఎదుర్కొన్న వివక్ష, అణచివేత, వాటిని దాటి నిలబడిన ఆత్మవిశ్వాసం పాఠకులను నేరుగా తాకుతుంది. ఆమె కవితలు కేవలం వ్యక్తిగత వేదనగా కాక, సమూహానికి ధైర్యం చెప్పే స్వరంగా ఉంటాయి. చదివినవారిలో శక్తిని నింపుతాయి.అందుకే మాయా కవితలు చదవడానికి ఇష్టంగా ఉంటాయి.

మాయా ఏంజెలో కవిత్వం చదవడం ఒక అనుభవం – అది మనసును తాకుతుంది, నిలబెడుతుంది. కానీ అనువదించడం ఒక పెద్ద బాధ్యత –

ఆఫ్రికన్-అమెరికన్ జీవితం, చరిత్ర, సంగీతం (బ్లూస్, జాజ్), చర్చ్ సంప్రదాయాలు – ఇవి ఆమె కవిత్వంలో సహజంగా కలిసి ఉంటాయి. ఇవి మరో భాషలోకి తీసుకెళ్లేటప్పుడు భావాన్ని మాత్రమే కాదు, ఆ నేపథ్యాన్ని కూడా మోయాలి.

ఆమె మాటల వెనుక ఉన్న చరిత్ర, సంగీతం, ఆత్మగౌరవాన్ని మరో భాషలో సజీవంగా నిలుపాల్సిన బాధ్యత. అందుకే అది సవాలుగా అనిపిస్తుంది. మాయా తన బాధను దాచదు కానీ బాధలోనే ఆశను నాటడం ఆమె ప్రత్యేకత. దాన్ని అంది పుచ్చుకొని అనువాదంలో ఇమడ్చగలిగానా అన్న సంశయం వెంటాడింది నన్ను.

మాయా ఏంజెలో కవితల్లో భాష చాలా సులభంగా, స్పష్టంగా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఆమె భావాలను వ్యక్తం చేస్తుంది.

ఆమె కవిత్వం పాఠకుల్లో ధైర్యం, ఆశ, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అణచివేతకు లోనైనవారు కూడా గర్వంగా నిలబడవచ్చని ఆమె తన జీవితాన్నే ఉదాహరణగా చూపింది.

మాయా జీవిత అనుభవాలు – వివక్ష, బాధ, పోరాటం – ఆమె కవిత్వంలో బలంగా కనిపిస్తాయి. అందువల్ల ఆమె కవితలు నిజాయితీగా, హృదయాన్ని తాకేలా ఉంటాయి.

మాయా ఏంజెలో కవిత్వం కేవలం వ్యక్తిగత భావాలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజానికి మార్గదర్శకంగా ఉంటుంది. సమానత్వం, ప్రశ్నించడం, మానవత్వం ఆమె కవిత్వంలోని ప్రధానమైన బలాలు, విలువలు.

మాయా ఏంజెలో కవిత్వం శక్తివంతమైనది, బలహీనులకు ప్రేరణనిచ్చేది. ఆమె కవితా శైలి సరళమైనదైనా భావపూరితమైనది. అణగారిన వర్గాల స్వరంగా ఆమె కవిత్వం ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది.

ప్రశ్న 9. మాయా ఏంజెలో కవిత్వానికి యథాతథ అనువాదం నప్పుతుందా లేక స్వేచ్ఛానువాదమా? ఈ సంపుటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?

జ: యథాతథ అనువాదంలో పదాల అర్ధం సరిపోతుంది కానీ కవిత్వపు మెలోడి తగ్గుతుంది. స్వేచ్చానువాదంలో భావం, force పాఠకుడి మీద చూపే ప్రభావం ఎక్కువ అనుకుంటాను.

మిశ్రమానువాదం (semi-literal) కూడా చేయవచ్చు, అంటే కొంత పదజాలాన్ని కాపాడుతూ భావాన్ని కూడా సురక్షితంగా ఉంచడం కూడా బాగానే ఉంటుంది.

యథాతథ అనువాదం అర్థం మాత్రమే చెబుతుంది. స్వేచ్ఛానువాదం అనుభూతిని కలిగిస్తుంది.

మాయా ఏంజెలో కవితల్లో నిండిన ఆర్తి, వేదన నిజాయితీ స్వచ్ఛత వంటి మానవ సహజ లక్షణాలు అంతే సహజంగా అందించాలంటే ఆమె కవిత్వానికి స్వేచ్ఛానువాదమే నప్పుతుందని నాకనిపిస్తుంది. నేనయితే భావం చెడకుండా అనువదించడానికే ప్రాధాన్యతనిచ్చాను.

ప్రశ్న 10. అనువాద కవితలకి తెలుగులో శీర్షికలు బాగా నప్పాయి. తెలుగు పేర్లు యాదృచ్ఛికంగా తట్టాయా లేక ప్రయత్నపూర్వకంగా పెట్టినవా?

జ. థాంక్స్ అండి. అనువాదం అంటే కేవలం భాష మార్పు మాత్రమే కాదు గదా – కొంతవరకు పునఃసృష్టి కూడా. కవితా శీర్షిక ఆ పునఃసృష్టిలో ముఖ్యమైన భాగం.

ఒక కవితను అనువదించే క్రమంలో దాన్ని ఎన్నోసార్లు చదవడం జరుగుతుంది. చదివిన వెంటనే అనువాదానికి పూనుకోకపోయినా ఆ కవితకు సంబంధించిన ఆలోచనలు మెదడులో తిరుగుతూనే ఉంటాయి.

కొన్ని శీర్షికలు అకస్మాత్తుగా మెరుపులా తట్టినట్టు అనిపించినా ఆ అకస్మాత్తు కూడా ముందున్న ఆలోచనల ఫలితమే గానీ పూర్తిగా యాదృచ్ఛికం కాదు. నా వరకు శీర్షికల గురించి మరీ ఎక్కువగా కష్టపడలేదనే చెప్పొచ్చు.

మూల శీర్షికకు బదులుగా భావానువాదంలో – కొన్ని సార్లు అసలు శీర్షిక అక్షరార్థంలో తెలుగులోకి రాలేదు.

అప్పుడు – ఈ కవితకు తెలుగు పాఠకుడు ముందుగా ఏ మాటతో ప్రవేశించాలి అని ఆలోచించి శీర్షిక పెట్టాల్సి వచ్చింది. ఉదా: call letters Mrs. VB అన్న కవిత దీనికి ‘శ్వాసించనీ..’ అన్న title సోమ శంకర్ గారు సూచించారు. అసలంటూ నన్ను బతకనిస్తే దేన్నైనా సాధిస్తాను అన్న అర్థంలో.

‘పిల్లాడిని కొట్టడం చాలా చెడ్డపని’ అన్న కవితకి ఇంకో భావస్పోరక శీర్షిక పెట్టవలసింది అని ఇప్పటికీ అనిపిస్తుంది.

One more round అన్న కవితకు ‘పని వెనుక పని’ అని పెట్టడానికి కొంత సమయం తీసుకున్నాను.

ప్రశ్న 11. ‘మానవ కుటుంబం’ అనే కవితలో “మనమెంత భిన్నంగా ఉన్నప్పటికీ/మనమెన్ని తేడాలతో ఉన్నప్పటికీ/మనమంతా సమానులమే” అనే పాదాలు హైలైట్. ఆ కవిత మూలం లోని సంబంధిత పదాలను తెలిపి, అనువాదంలో ఎలా ఒదిగాయో వివరిస్తారా?

జ. మాయా ఏంజిలో ‘Human Family’ కవితలో మానవ సమాజంలోని రంగు, భాష, మతం, దేశం వంటి భిన్నతలను ఎత్తి చూపుతూ, ప్రతి విభాగానికీ మళ్లీ మళ్లీ “We are more alike, my friends, than we are unalike.” అనే పంక్తిని పునరావృతం చేయడం ద్వారా, భిన్నత్వాలకన్నా సామ్యాలే మానవత్వానికి మూలమని స్పష్టం చేస్తుంది.

మన మధ్య కనిపించే తేడాల కంటే, మనలో ఉన్న సామ్యాలే ఎక్కువ. మనమంతా ఒకే మానవ కుటుంబం. “ఎన్ని తేడాలు ఉన్నా, చివరికి మనమంతా సమానులమే” – అనే సరళమైన, బలమైన రూపంలోకి ఒదిగింది.

ఈ కవితలో పునరావృతంగా వచ్చే ముఖ్యమైన పంక్తి ఇది:

“We are more alike, my friends, than we are unalike.”

అలాగే, ముందు-వెనుక సందర్భంలో ఆమె ఇలా వివిధ భిన్నతలను చెబుతుంది:

“We are more alike than unalike. We are more alike, my friends, than we are unalike.”

మరియు రంగు, భాష, మతం, దేశం, ఆహారం, దుస్తులు మొదలైన తేడాలను చెప్పిన తర్వాత చివరికి ఈ పంక్తితో కవితను ముగిస్తుంది.

“మనమెంత భిన్నంగా ఉన్నప్పటికీ”
“మనమెన్ని తేడాలతో ఉన్నప్పటికీ”

అనే పాదాలు మానవుల మధ్య కనిపించే భిన్నతలను సూచిస్తాయి.

“మనమంతా సమానులమే”

అనే పాదం మూల కవితలోని ప్రధాన సందేశమైన మానవ ఐక్యత, సమానత్వ భావాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తుంది.

ఈ విధంగా మూల కవిత భావం దెబ్బతినకుండా, సహజ తెలుగు భాషా శైలికి అనుగుణంగా మలచడం ద్వారా ఆ భావం అనువాదంలో సహజంగా ఒదిగింది.

ప్రశ్న 12. జీవితం మీద ప్రేమ, బాధలతో పోరాటం, ఓటములెదురైనా మానని స్ఫూర్తిని ప్రదర్శించిన పాఠంకవిత నేపథ్యం గురించి చెప్తారా?

జ. ‘The Lesson’ – ‘పాఠం’ కవిత మాయా ఏంజిలో జీవితానుభవాల నుంచి పుట్టిన జీవిత పాఠం. ఇది ఒక సంఘటన, కథనం కంటే కూడా – బాధల ద్వారా మనిషి నేర్చుకునే అంతర్గత పాఠం గురించి మాట్లాడుతుంది.

ఈ కవిత చెప్పే ‘పాఠం’ ఏమిటంటే:

జీవితం అన్యాయంగా ప్రవర్తించినా,
ఓటములు వరుసగా ఎదురైనా
మన గౌరవాన్ని, ఆశను వదులుకోకపోవడమే
నిజమైన విజయం
బతకడం ఒక పోరాటం,
ఆ పోరాటాన్ని మానకుండా
కొనసాగించడమే విజయం.
మనిషి బతుకు
కన్నీళ్లుగా ఆగిపోకూడదు
నిస్సహాయతగా మిగిలిపోకూడదు
అది – ఆత్మవిశ్వాసంగా మారాలి – స్ఫూర్తినిచ్చే విధంగా ఎదగాలి.

ఇది మాయా ఏంజిలో కవిత్వపు ప్రత్యేకమైన శైలి.

  1. ఈ పుస్తకం లోని ఏ కవిత మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ. నాకు మాయా ఏంజిలో కవిత్వంలో ‘Still I Rise’ చాలా పవర్ఫుల్ కవిత అనిపిస్తుంది.

ఎందుకంటే – ఆ కవితలో ఉన్న ఆత్మవిశ్వాసం, గాయాల్ని దాటుకుని నిలబడే ధైర్యం అసాధారణం. అణచివేత, అవమానాలు, చరిత్రలోని బాధలన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ నేను మళ్లీ లేస్తానని చెప్పే స్వరం చాలా శక్తివంతంగా ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తి కథ కాదు; ప్రతి సారి పడిపోయి మళ్లీ లేవాలనుకునే ప్రతి ఒక్కరి గొంతు, కాంక్ష కూడాను.

ఆమె భాషలో కోపం ఉంది, కానీ అదే సమయంలో గర్వం, అందం, ఆశ కూడా ఉన్నాయి. చదివినప్పుడు ఎవరో చేయి పట్టుకుని నువ్వు నిలబడతావు, తిరిగి లేచే హక్కు నీకుందని చెబుతున్నట్టు అనిపిస్తుంది.

మాయా ఏంజిలో రచనల్లో ఇంకొక అద్భుతమైన కవిత ‘Phenomenal Woman’.

ఈ కవిత నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది అందం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ధైర్యమైన సమాధానం. సమాజం పెట్టే కొలమానాలు కాదు, తనలోని ఆత్మవిశ్వాసం, నడక, చూపు, తన స్వరం తన అందం,అని ఆమె చెప్పే తీరు చాలా బలంగా శక్తివంతంగా ఉంటుంది.

ఈ కవిత చదువుతున్నప్పుడు – నేను ఎలా ఉన్నానో అలా ఉండటమే నా శక్తి – అనే భావన మనసులో చదువరుల్లో నాటుకుంటుంది. ఇది ముఖ్యంగా మహిళలకు మాత్రమే కాదు – తమ విలువపై సందేహపడే ప్రతి ఒక్కరికీ తమ వ్యాల్యూని గుర్తు చేసే మంచి కవిత.

మాయా – స్త్రీ ఆత్మవిశ్వాసం, స్వాభిమానము, అంతర్గత సౌందర్యం గురించి, సంప్రదాయపు అందం, సమాజపు ప్రమాణాలకు అతీతంగా, ఒక మహిళ తనను తాను ఎలా ప్రెజెంట్ చేసుకుంటుందో ఈ కవితలో చెప్తుంది.

‘They went home’ – ‘ఎవర్లిళ్లకు వారు’ అన్న కవిత కూడా నాకు బాగా నచ్చిన కవిత. ఈ కవిత లో వాళ్లు వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారనే వాక్యం బాహ్యంగా సాధారణంగా అనిపించినా, లోలోతుల్లో అది భావోద్వేగాల నుంచి పారిపోయారన్న వేదనని సూచిస్తుంది.

వాళ్లు వెళ్లిపోయారన్న భావనతో, మిగిలిపోయిన వారి ఒంటరితనం, నిరాశ ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది.

వేశ్యావృత్తిలో ఉన్నవారితో క్షణికమైన దేహబంధం తప్ప, ఎవరూ జీవితకాలపు అనుబంధం పెంచుకోరన్నది కవయిత్రి గ్రహించిన జీవనసారం.

ఇవే కాకుండా చాలా కవితలున్నాయి నాకు నచ్చినవి. అంతగా నచ్చాయి కాబట్టే మాయా కవిత్వ అనువాదానికి పూనుకున్నాను.

ప్రశ్న 14. ఈ సంపుటిలోని ఏదైనా కవిత అనువదించటం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కవితనైనా ఇంకా మెరుగ్గా అనువదించి ఉండచ్చని అనిపించిందా?

జ. కష్టం అని కాదు కానీ ‘On the Pulse of Morning’ అన్న మాయా పెద్ద కవిత ఒకటి అనువదించకుండా వదిలేసాను. శిల్పం, వాక్య నిర్మాణం, ప్రతీకలు (రాయి, నది, చెట్టు) – ఇవన్నీ కలసి ఉన్నందువల్ల నేరుగా అనువదిస్తే వచనంలా మారిపోవచ్చునేమోనని అనిపించింది. కొంత ఎక్కువ సమయం, శ్రద్ధ తీసుకొని చేస్తే అనువాదం వచ్చేదేమో, పుస్తకం తీసుకొచ్చే తొందరలో కొంత టైమ్ ఫాక్టర్ కూడా ఉండింది.

‘పిల్లాడిని కొట్టడం..’ కవిత కూడా ఎక్కువ సమయం తీసుకుంది. ఆ కవితా నిర్మాణం కొంత క్లిష్టంగా తోచింది. కొంత అనువాదం చేసి ఆపేసి, కొన్నాళ్ళకు మళ్ళీ చదివి రాయాల్సి వచ్చింది.

మెరుగ్గా అంటే – అది విమర్శకులు చెప్పాల్సిన అంశం. నా వరకు నేను సంతృప్తి పడి రాసినవే అన్ని కవితలూ.

ప్రశ్న 15. ‘మాయా ఏంజెలో కవితలు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకాన్ని పాఠకుల వద్దకు చేర్చేందుకు ఏయే ప్రయత్నాలు చేస్తున్నారు?

జ. నిజానికి మాయా కవితలు గత సంవత్సరమే రావాల్సిన పుస్తకం. పలు కారణాల వల్ల ఒక ఏడాది ఆలస్యంగా వచ్చిన సంపుటి ఇది. ప్రచురణలో ప్రత్యేకంగా ఎదుర్కొన్న అనుభవాలు అంటూ లేవు గాని బాధించే జ్ఞాపకం ఒకటి ఉంది. అది – ఇటీవలే మరణించిన చిరకాల స్నేహితురాలు అనిశెట్టి రజిత ఒక సారి కాల్ చేసి, “మాయా అనువాదాలు బాగుంటున్నాయి హిమా, నువ్వు పుస్తకం వేసుకోవాలనుకుంటే మాత్రం రుద్రమ ప్రచురణలు బ్యానర్ కింద వేద్దాం. ఇంకెవరికీ ఇవ్వకు” అంటూ ఆత్మీయంగా చెప్పింది. ఇవాళ తను మన మధ్య లేదు. రజితకు బాధా తప్త నివాళులు.

ఇకపోతే.. మాయా కవితలు సంకలనానికి మొన్నటి బుక్ ఫెయిర్‌లో చాలా మంచి స్పందన వచ్చింది. మూడు స్టాల్స్ లో పెట్టిన పుస్తకాలన్ని సేల్ అవడం చాలా ఆనందాన్నిచ్చింది. కొంత ఆలోచించి పాఠకులందరికీ ఎలా చేర్చాలన్నది ప్లాన్ చేసుకోవాలి.

మాయా ఏంజిలో కవిత్వం ఇంతవరకు తెలుగులో సంకలనంగా అందుబాటులోకి రాలేదు కనుక యూనివర్సిటీ లైబ్రరీల్లో, కాలేజీ లైబ్రరీల్లో పెట్టగలిగితే వీలైనంత మంది యువతరానికి చేరుతుంది అని అనిపిస్తుంది.

ఈ విషయంగా మీరేమైనా సలహా సూచనలు ఇచ్చినా మంచిదే.

ప్రశ్న 16. కవయిత్రిగా, అనువాదకురాలిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవండి. రెగ్యులర్‌గా రాయాలన్నదే ప్రణాళిక. ఇప్పుడైతే నా మరో కవితా సంపుటి ‘రెండు సంతకాలు’ ప్రూఫ్స్ కరెక్షన్స్ చూస్తున్నాను. కవర్ పేజీ సిద్ధంగా ఉంది. మనవరాలిని చూడటానికి అమెరికా వచ్చాము. తిరిగి రాగానే ఆ పుస్తకం వేసుకోవాలి.

మాయా ఏంజిలో కవితలు ఎక్కువ మంది పాఠకులకు చేరాలన్నది నా అభిమతం.

అనువాదంలో అయితే, కొంతకాలం ‘సంచిక’లో రాసి నిలిపేసిన ‘పోయెట్స్ టుగెదర్’ కాలమ్ మళ్లీ మొదలెడదామని అనుకుంటున్నాను.

ఇప్పుడైతే కవయిత్రి సిల్వియా ప్లాత్ కవిత్వం చదువుతున్నాను. భవిష్యత్తులో ఆమె కవితలూ అనువదిస్తానేమో.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు హిమజ గారూ.

హిమజ: ధన్యవాదాలు. నా అనువాద కవితలకు వేదిక నిచ్చి, ఎంతో స్వతంత్రతతో ప్రోత్సాహ్ననిచ్చిన ‘సంచిక’ ఎడిటర్ శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి, శ్రీ సోమ శంకర్ గారికి అనేక కృతజ్ఞతలు.

***

మాయా ఏంజిలో కవితలు
అనువాదం: హిమజ
ప్రచురణ: ప్రోజ్ పొయెట్రీ ఫోరం, హైదరాబాద్
పేజీలు: 145
వెల: ₹ 150/-
ప్రతులకు:
ప్రోజ్ పొయెట్రీ ఫోరం,
విల్లా నెంబర్ 142, కీర్తి రిచ్‍మండ్ విల్లాస్,
ఫేజ్-1, సన్ సిటీ,
హైదరాబాద్ 500086
ఫోన్: 9441492737
Email: shailihima@gmail.com

 

~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/maya-angelou-kavithalu?

Exit mobile version