Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి, జర్నలిస్ట్ శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ప్రేమసాక్షి’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం జొన్నలగడ్డ శ్యామల గారూ.

జొన్నలగడ్డ శ్యామల: నమస్కారం.

~

ప్రశ్న 1. మీ తొలి కథా సంపుటి ‘ప్రేమసాక్షి’ వెలువరించినందుకు అభినందనలు. ఈ సందర్భంగా మీ సాహితీ వ్యాసంగం గురించి మా పాఠకులకు వివరిస్తారా? బాలసాహిత్యం నుంచి పెద్దల కథల వరకు మీ ప్రయాణం ఎలా సాగింది?

జ: ముందుగా మీ అభినందనలకు ధన్యవాదాలు. నా సాహిత్య వ్యాసంగం ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనే మొదలైంది. నా నోట్ బుక్ లోనే రెండు కథలు రాసుకున్నాను. అయితే వాటిని ఏ బాలల పత్రికకూ పంపలేదు. పంపాలనే ఆలోచన కూడా లేదు. ఆ రోజుల్లో చందమామ, బాలమిత్ర వంటివి తప్పితే పిల్లల పత్రికలు లేవనే చెప్పాలి. కథలు రాసిన విషయం ఇంట్లో చెప్పలేదు కూడా. ఆ కథలను జాగ్రత్తగా దాచలేదు కూడా. ఆ తర్వాత ఇంటర్‌లో ఉండగా ఆంధ్ర సచిత్ర వారపత్రిక వారి కథల పోటీ ప్రకటన చూసి ఉత్సాహపడ్డాను. కథ రాశాను.. ఒక పేద కుటుంబం. తండ్రి లేడు. తల్లి జబ్బుతో మంచంలో ఉంది. పెద్ద కూతురు టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని.. ఉద్యోగం సాధించి, కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తూ, తల్లికి గర్వకారణం కావడం అందులోని ఇతివృత్తం. ఎన్వలప్‌లో పెట్టి, అడ్రెస్ రాసి పంపాను. హామీపత్రం రాశానో, లేదో గుర్తు లేదు. బహుమతి వస్తుందనే మనసులో ఏ మూలో ఆశ. ఇప్పుడు తలచుకుంటే నా అమాయకత్వానికి నవ్వొస్తుంది. ఆ తర్వాత 80వ దశకంలో ‘పాట తెచ్చిన ప్రమాదం’ అని ఓ హాస్యకథ రాశాను. కథలోని విషయం దృష్ట్యా నా పేరుతో పంపడానికి ఇబ్బంది ఫీలయి మావారి పేరు మీద ‘హాస్యప్రభ’ మాసపత్రికకు పంపాను. ఆ తర్వాత కాలంలో అందులో అసలు ఇబ్బందికరంగా ఫీలవడానికి ఏముందని అనిపించింది. హాస్యప్రభ వారు కథ పేరును ‘చాదస్తపు మగడు’గా మార్చి ప్రచురించారు. ఆ తర్వాత పిల్లలు, ఇంటి బాధ్యతల ఒత్తిడి ఎక్కువై రాయడం కుదరలేదు. ‘ఉదయం’ వారపత్రిక విభాగంలో ఉద్యోగంలో చేరాక, కథలు, నవలలు చదవడం ఉద్యోగంలో భాగం అయింది. అప్పట్లో ప్రతి వారం పత్రికతో పాటు చిన్న నవలను కూడా అందించేవారు. నవలల ఎంపిక కోసం ఎన్నో నవలలు నిత్యం చదవడం వల్ల, సాహిత్యంపై ఆసక్తి మరింత ఇనుమడించింది. పత్రికకు కావలసిన వ్యాసాలు, వగైరాలతో పాటు కథలు రాసే ప్రయత్నం మొదలుపెట్టాను. తొలి కథ ‘సుఖీభవ’ రాసి ఆంధ్రప్రభ ఆఫీసుకు వెళ్ళి (అప్పట్లో వారి కార్యాలయం దోమలగూడలో ఉండేది) వారపత్రిక ఎడిటర్ రాజేంద్రగారికి అందించాను. కథ ఎంపిక అయినట్లు ఉత్తరం వచ్చిన రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఆ కథ నా పుట్టింటి ఇంటి పేరుతో (దైతా శ్యామల) ప్రచురితమైంది. కారణం నేను పనిచేసే చోట అభ్యంతరాలు వస్తాయేమో అన్న జంకుతో పుట్టింటి ఇంటి పేరు రాయడమే. అయినా పెళ్ళి అయ్యాక నేను ఇంటిపేరు ఎందుకు మార్చుకోవాలి అన్న ఆలోచన అప్పటికి లేదు. అలా ఓ మూడు కథలు ‘దైతా శ్యామల’ పేరుతోనే ప్రచురితమయ్యాయి. క్రమంగా ఆఫీసులో అభ్యంతరాల గురించిన జంకు పోయింది. ఆ తర్వాత జె.శ్యామల పేరుతో రాయడం మొదలైంది. ఉదయం ఆదివారం పత్రిక, ఉదయం వారపత్రికలలో అడపాతడపా రాస్తూ, ఇతర పత్రికలకు కూడా పంపేదాన్ని. ఉదయం వారపత్రిక ఆగిపోయాక ఉదయం ఆదివారం అనుబంధంలో నా ఉద్యోగం కొనసాగింది. అక్కడ వైవిధ్య భరిత వ్యాసాలు, కథలు, పూతరేకులు, సాధన వంటి కాలమ్స్ రాశాను. ఇతర పత్రికలకు కూడా పంపేదాన్ని. ఆ తర్వాత కాలంలో ‘వార్త’ దినపత్రికలో జేరాక ఎన్నో రకాల ఆర్టికల్స్, కథలు, పుస్తక సమీక్షలు, సాలోచనమ్ పేరుతో కాలమ్ రాశాను. అలాగే ఆకాశవాణిలో కొన్ని కథలు వినిపించాను. ప్రముఖ బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య గారి ప్రోత్సాహంతో 2005లో ‘పిల్లల బొమ్మల జాతక కథలు’, 2006 లో ‘పిల్లల బొమ్మల నసీరుద్దీన్ కథలు’ (పునః కథనాలు) రాయగా, పుస్తకాలుగా వెలువడ్డాయి. 2010 లో నేను రాసిన ‘మెగసెసె బహుమతి పొందిన భారతీయులు’ రెడ్డి రాఘవయ్య గారి సంపాదకత్వంలో ప్రచురితమైంది. ‘సంచిక’ లో యాత్రా కథనాలు, కథలు, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ కాలమ్స్ రాయడం మీకు తెలిసిందే. ఆ తర్వాత బాల సాహిత్యంపై మక్కువ పెరిగి బాలల కథలు రాయడం మొదలుపెట్టాను. ఆ కథలలో కొన్నింటిని ‘సంతోషాల గాలిపటం ‘ పేరిట గత సంవత్సరం (2025) పుస్తకంగా విడుదల చేశాను. ప్రౌఢ సాహిత్యానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 80 కథల వరకు రాశాను. అడపాతడపా కవితలు కూడా రాశాను. సమీక్షలు అనేకం రాశాను. ఉద్యోగపరంగా ఆర్టికల్స్ అసంఖ్యాకంగా రాశాను. ఇప్పుడు నా కథల్లో 34 కథలను ఎంచుకుని ‘ప్రేమసాక్షి’ పేరిట కథా సంపుటిగా వెలువరించాను.

ప్రశ్న 2: దాదాపు నాలుగు దశాబ్దాల సాహితీ ప్రస్థానాన్ని తరచి చూసుకుంటే, రచయిత్రిగా మీలో వచ్చిన ప్రధాన మార్పు ఏదని మీరు భావిస్తున్నారు?

జ: అప్పటికి, ఇప్పటికి రచయితగా మార్పు అంటే.. నేను రాసేదాంట్లో ప్రతి చిన్న అంశం మరింత పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం. ఏ విషయం అయినా క్షుణ్ణంగా తెలుసుకునే రాయాలనుకుంటా. ఇప్పటి జనరేషన్ వ్యవహార శైలి, ఆలోచనలు, మాట తీరు, వారి పోకడలు మొదలైన అంశాలు లోతుగా పరిశీలించకుండా, తెలియకుండా సంబంధిత కథలు రాయడం సరికాదనిపిస్తుంది.

ప్రశ్న 3: ఇన్ని సంవత్సరాల తర్వాత మీ తొలి కథా సంపుటి వెలువడింది. పుస్తకరూపంలోకి తీసుకురావడం ఆలస్యం కావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: ఆర్థిక సమస్య ఒక కారణం అయితే, వ్యక్తిగతంగా కూడా పరిస్థితులు అనుకూలించక పోవడం. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఉరుకులు, పరుగులు.. తీరికలేని జీవితం. ఉద్యోగం విరమించాక పిల్లల ప్రోద్బలంతో ఇప్పటికి సాధ్యపడింది.

ప్రశ్న 4: ‘ఉదయం’, ‘వార్త’ వంటి పత్రికల్లో పనిచేసిన అనుభవం, జర్నలిజం ద్వారా వచ్చిన సామాజిక పరిశీలన మీ కథలపై ఎలాంటి ప్రభావం చూపాయి?

జ: మంచి ప్రశ్న. ఉదయం, వార్త.. పత్రికలలో పనిచేయడం వల్ల సమకాలీన అంశాలు, సమస్యలు, మహిళల పట్ల వివక్ష వంటి వాటి పట్ల మంచి అవగాహన కలిగింది. మనస్తత్వాల అధ్యయనం అలవడింది. నా పేరుతో అచ్చయిన తొలి కథ ‘సుఖీభవ’ లోనే అప్పటి కాలంలో ఆడపిల్లల పట్ల ఇంట్లోనే ఎంత వివక్ష ఉండేదో రాశాను.

ప్రశ్న 5: మీ కథల్లో కథాంశం కంటే కథను చెప్పే విధానానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారు? మీ కథన శైలి గురించి వివరించండి.

జ: కథాంశం కంటే అనను. కొన్ని బలమైన కథాంశాలు ఉంటాయి. మరి కొన్ని మామూలు అంశాలు కావచ్చు లేదా హాస్యప్రధానంగా ఉండొచ్చు. ఏదైనా సరే, కథనం పాఠకుడిని ఆకట్టుకుని, చదివించేదిగా ఉండాలి. పాత్రల వర్ణన, వారి సంభాషణ తీరు ఆ పాత్రను పాఠకుడి కళ్ళముందు నిలబెట్టగలగాలి. అలాగే పరిసరాల వర్ణన, సందర్భ కల్పన కూడా కథనంలో కీలకమైనవే. ఇక ప్రకృతి వర్ణనలు కొన్ని కథలకు అవసరం, వాటి వల్లే కథకు అందం వస్తుంది. మరి కొన్ని కథలకు ఆ అవసరం ఉండదు. సౌందర్య దృష్టి బాగా ఉన్న రచయిత ఏ మాత్రం అవకాశం ఉన్నా వర్ణనను పండించడానికి ప్రయత్నిస్తాడు.

ప్రశ్న 6: మీ రచనల్లో వాస్తవికత, సహజత్వం ఎక్కువగా కనిపిస్తాయి. నిజజీవిత సంఘటనలను కథగా మార్చేటప్పుడు వాస్తవం, కల్పన మధ్య సమతుల్యతను ఎలా పాటిస్తారు?

జ: నిజమే. నేను సహజత్వానికే ప్రాధాన్యం ఇస్తాను. అయితే నిజ జీవిత సంఘటనలను ఆధారం చేసుకుని కథ రాసేటప్పుడు తప్పనిసరిగా మార్పులు చేస్తాను, దానికి కల్పన జోడిస్తాను. వీలైనంతవరకు ఆ కల్పన అందులో ఇమిడిపోయేట్లుగా రాస్తాను. అందువల్ల సహజత్వానికి భంగం కలగదు.

ప్రశ్న 7: రచయిత తన అభిప్రాయాలను నేరుగా చెప్పాలా, లేక పాత్రలు – సంఘటనల ద్వారా పాఠకుడే అర్థం చేసుకునేలా చేయాలా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: రచయిత తన అభిప్రాయాలను పాత్రల ద్వారా చెప్పడమే మంచిది. అయితే కథను బట్టి అరుదుగా సూచనగానో, వ్యాఖ్యగానో ఉండడం కూడా జరుగుతుంది. ‘కిటికీ’ కథలో నేను చివరగా ఓ వ్యాఖ్య చేశాను.

ప్రశ్న 8: హాస్యాన్ని మీరు సహజంగా పుట్టే భావంగా చూస్తారా, లేక ప్రత్యేకంగా నిర్మిస్తారా? హాస్యాన్ని సామాజిక వ్యాఖ్యానంగా ఎలా ఉపయోగిస్తారు?

జ: వ్యక్తుల్లో హాస్య చతురత కొద్దో గొప్పో సహజంగానే ఉంటుంది. అందువల్ల కథల్లో పాత్రల సంభాషణల్లో సందర్భాన్ని బట్టి హాస్యాన్ని పలికిస్తాను. ఇక హాస్య ప్రధానమైన కథ అయినప్పుడు హాస్యాన్ని నిర్మిస్తాను. ‘కనిపించుట లేదు’ కథలో అంతర్లీనంగా నిరుద్యోగం అంశం ఉంది. అలాగే ‘పం(ఫన్)చ రత్నాలు’ కథలో ప్రస్తుతకాలంలో కొందరి రచనా పోకడల గురించి ప్రస్తావించడం జరిగింది.

ప్రశ్న9: సాధారణ జీవితంలోని మనుషులను కథా పాత్రలుగా మలిచేటప్పుడు వారి వ్యక్తిత్వాన్ని ఎలా గుర్తిస్తారు? పాత్ర ముందుగా పుడుతుందా, కథాంశం ముందుగా పుడుతుందా?

జ: సాధారణ జీవితంలోని మనుషులను సునిశితంగా పరిశీలించాక.. అలాటి వ్యక్తిత్వం గల పాత్రతో కథను ఊహించుకుంటాను. ఒక్కోసారి కథాంశం ముందు పుడుతుంది. అలాంటప్పుడు కథ అల్లికలో నా దృష్టిలో అందుకు అనువుగా ఉన్న వ్యక్తిత్వాన్ని పాత్రగా ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తాను.

ప్రశ్న 10: మీ కథల్లో పాత్రలు పూర్తిగా మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లుగా కాకుండా, సహజమైన మానవ బలహీనతలతో కనిపిస్తాయి. ఈ సహజత్వాన్ని మీరు ఎలా సాధిస్తారు?

జ: నా కథల్లో అనే కాదు సాధారణంగా ఏ మనిషీ కూడా పూర్తిగా మంచిగా, పూర్తిగా చెడ్డగా ఉండడు. కాకపోతే మనుషుల్లో మంచి, చెడులలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. నా ఈ ఆలోచనే కథల్లో కూడా ప్రతిఫలిస్తోందేమో.

ప్రశ్న11: మీ కథల శీర్షికలు, సరళమైన భాష, ప్రారంభం – ముగింపు పద్ధతి ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని నిర్ణయించేటప్పుడు మీరు అనుసరించే విధానం ఏమిటి?

జ: కథల శీర్షికలకు నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఒక్కోసారి కథ పూర్తయినా శీర్షిక దగ్గర ఆగాల్సి వస్తుంది. నచ్చే శీర్షిక స్ఫురించేవరకు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటా. అలాగే ప్రారంభం కూడా. కొన్ని కథలకు ప్రారంభం ఒక పట్టాన నచ్చక కథ ముందుకు సాగదు. అప్పుడు కూడా మళ్ళీ ఆలోచన.. మరో ప్రయత్నం. భాష విషయానికి వస్తే పాత్రలను బట్టి రాయడమే నా పద్ధతి. పద లౌల్యంతో, నా భాషా పటిమనంతా అక్కడ చూపెట్టాలి అనుకుంటే కథ అందం చెడుతుంది, పాఠకుడికి మింగుడుపడదు అన్నది నా ఉద్దేశం. పౌరాణిక కథ అయితే గ్రాంథికం తప్పదు. ఇక ముగింపు అంటే.. ముగింపు పాఠకుడి ఊహకు అందనిదిగా ఉండాలి, ఒక జెర్క్ ఉండాలి అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అలా ఉంటే బాగుంటుంది.. అయితే అన్ని కథలకు దాన్నే వర్తింపచేయక్కరలేదని నా అభిప్రాయం. ముఖ్యంగా అనుభూతి ప్రధానమైన కథల్లో.

ప్రశ్న12. 1987 నుంచి రాసిన కథల్లోంచి 34 కథలను ఎంపిక చేసి ‘ప్రేమసాక్షి’ సంపుటిగా తీసుకురావడానికి మీరు పాటించిన ప్రమాణాలు ఏమిటి?

జ: ‘ప్రేమసాక్షి’ కథా సంపుటికి కథలను ఎంపిక చేసేటప్పుడు పాఠకుడిగా ఆలోచించాను. వైవిధ్యం ఉన్న కథలుగా ఉండాలనుకున్నాను. అనుభూతి ప్రధానమైనవి, ఆలోచింపచేసేవి, ప్రేరణనిచ్చేవి, సందేశాత్మకమైనవి, మనో వైజ్ఞానిక సంబంధమైనవి, హాస్యంతో నవ్వించేవి, పౌరాణికాలు.. ఇలా ఎంచుకున్నాను. అలాగే పాత, కొత్తల మేలు కలయికగా ఉండాలని ఇటీవలి కథలను కొన్నింటిని చేర్చాను.

ప్రశ్న13. “శ్యామల గారి కథల్లో వైవిధ్యం ఉంది. ఆమె ఆలోచనా ధోరణిలో మాత్రం వైరుధ్యం లేదు” అని మీ కథల గురించి శ్రీ కె.వి.ఎన్. వర్మ గారు తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను మీరు రచయిత్రిగా ఎలా స్వీకరిస్తారు?

జ: వర్మ గారి పాజిటివ్ వ్యాఖ్యను సంతోషంగా స్వీకరిస్తాను.

ప్రశ్న14. మొదటి కథ ‘ప్రేమసాక్షి’ పేరునే ఈ కథా సంపుటికి శీర్షికగా ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: మొదటి కథ పేరునే కథా సంపుటికి శీర్షికగా ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి: ముఖచిత్రానికి ఆ కథ బాగుంటుంది అనిపించింది. రెండవది: ప్రేమలేఖనే పాత్రగా చేసి కథను నడిపిన ప్రత్యేకత ఆ కథకు ఉండడం.

ప్రశ్న15. ‘ప్రేమసాక్షి’ కథలో ప్రేమలేఖను కథకుడిగా ఎంచుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ ప్రయోగంలో ఎదురైన సవాళ్లు ఏమిటి?

జ: ఒకరి విషయంలో.. కాలేజీలో చదివే రోజుల్లోని సావనీర్ లో తన ఫోటో ఉన్న కాగితం, కొన్నేళ్ళ తర్వాత పల్లీల పొట్లంగా వచ్చి దర్శనమిచ్చిన ఉదంతం ఒకటి నాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ప్రేమసాక్షి’ కథ రాశాను. సవాళ్ళు అంటే ప్రాణం లేని కాగితం స్వగతంగా కథ చెప్పడం.. కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి.

ప్రశ్న 16. మీ ‘మేస్త్రీ’ కథలో ఒక యువతి పట్టుదలని, కుటుంబం పట్ల ఆమెకున్న బాధ్యతని, ఎదగాలనే తపనని చాలా గొప్పగా ప్రదర్శించారు. ఈ కథ వెనుక ఉన్న వాస్తవ ప్రేరణ లేదా నేపథ్యం ఏమిటో వివరిస్తారా?

జ: మే ‘స్త్రీ’ కథకు మనసులో ఆలోచన ఎన్నో ఏళ్ళుగా ఉంది. ‘వార్త’లో ఉద్యోగించిన రోజుల్లో మహిళల ప్రత్యేకం ‘చెలి’లో నిర్మాణ రంగంలో మహిళల స్థానంపై ఆర్టికల్ రాశాను. అందులో ఆడ కూలీలకు తక్కువ కూలీ ఇవ్వడం, పని కూడా నైపుణ్యంతో సంబంధం లేకుండా కేవలం ఇటుక, సిమెంటు బొచ్చెలు మోయడానికే పరిమితం కావడం వగైరాలు చర్చించాను. అది వ్యాసం కాబట్టి నాకు పూర్తి సంతృప్తి కలగలేదు. ప్రజాశక్తి సాహితీ సంస్థ వారి ‘మే డే కథల పోటీ’ ప్రకటన చూసినప్పుడు నాకు ఆ వ్యాసంలోని అంశాన్ని కథగా మలిస్తే.. అనిపించింది. అంతే.. నా ఊహలకు రూపం వచ్చేసింది.

ప్రశ్న 17. ‘పడక్కుర్చీ’, ‘అసలైన కొడుకు’ వంటి కథల్లో తండ్రి – కొడుకు సంబంధాన్ని ఆత్మీయంగా చిత్రించారు. తండ్రి పాత్రకు మీ రచనల్లో ఇంత ప్రాధాన్యం రావడానికి కారణం ఏమిటి?

జ: కొన్ని కథల్లో తండ్రి పాత్రకు ప్రాధాన్యానికి కారణం మనసు పొరల్లో నాకు, మా నాన్నపై ఉన్న గొప్ప ఇష్టం కావచ్చు.

ప్రశ్న 18. ‘ఆడపిల్ల’ వంటి కథల్లో స్త్రీ ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అస్తిత్వం వంటి అంశాలను ప్రస్తావించారు. స్త్రీ పాత్రలను నిర్మించేటప్పుడు మీరు ఏ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుంటారు?

జ: ఆడపిల్లల పట్ల సొంత కుటుంబంలోనే తమకెంతో ప్రేమ ఉందంటూనే.. డబ్బు దగ్గరికి వచ్చేసరికి (ఆర్థిక ఇబ్బందులు లేని వారు సైతం) ఆమె పరాయిదన్నట్లు తల్లిదండ్రులు, తోబుట్టువులు చూపే వివక్ష గురించి ఆలోచిస్తే మనసు చెమ్మగిల్లుతుంది. మహిళల పాత్రలు ఆత్మగౌరవంతో, సొంత అస్తిత్వం గురించిన ఆలోచనతో ఉండేలా చిత్రిస్తాను. సుఖీభవ, ఆడపిల్ల, ‘స్మిత’ప్రజ్ఞత, ‘తోడు’దొంగ, అనగనగా ఓ ప్రియంవద వగైరా కథల్లో ఈ విషయం గమనించవచ్చు.

ప్రశ్న 19. ‘నడిచొచ్చిన నైట్‌క్వీన్’, ‘పగిలిన అద్దం’ వంటి కథల్లో సమాజపు అనుమానాలు, పేదరికం, అన్యాయం కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలను కథల ద్వారా చెప్పడం ఎందుకు అవసరమని భావిస్తారు?

జ: ‘పగిలిన అద్దం’.. కథలోని రాజు వంటి బాలలు ఎందరో మనకు తారసపడుతుంటారు. ఇంట్లో పిల్లలకు ‘వాణ్ణి చూడు ఈ వయసులోనే ఎలా సంపాదిస్తున్నాడో’ అని చెపుతారు కానీ ఆ లేత మనసు వ్యథ గురించి ఆలోచించరు. బాల్యం దోపిడీకి గురవటం పట్టించుకోరు. ఆ దృష్ట్యా ఆ పసి మనసు గురించి పట్టించుకోవలసిన అవసరం ఉంది కాబట్టే కథగా రాశాను. ఇక ‘నడిచొచ్చిన నైట్ క్వీన్’ కథలో స్నేహితురాలే… అదీ తన కోసమే వచ్చిన ఆమె మాటను నమ్మక పోవడం అన్నది ఊహని బాధించింది. అందుకే లోకం తీరు అంతేనని, భర్త కూడా అపార్థమే చేసుకుంటాడని నిర్ణయించుకుని ఆమె జాగ్రత్త పడి, మేలు చేసిన వ్యక్తి ఎదురుపడినా పలకరించలేదు. ఇలాంటి విషయాల్లో సంకుచిత ధోరణి విడనాడాలని చెప్పడమే కథ ఉద్దేశం.

ప్రశ్న 20. ‘ఘటన’ కథకి సంబంధించి రామాయణంలోని పాత్రలను, సంఘటనలను కొత్త కోణంలో చూడాలనే ఆలోచన ఎలా వచ్చింది? పురాణాలను ఆధునిక సామాజిక ప్రశ్నలతో అనుసంధానించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటికే అందరికీ తెలిసిన ఇతిహాస కథను మళ్లీ రాసేటప్పుడు ‘కొత్తదనం’ తీసుకురావడం ఎంత కష్టం?

జ: రామాయణంలోని పాత్రలతో కథ రాయాలనే ఆలోచన కల్పించింది ‘సంచిక’ వారే. ‘రామకథాసుధ’ సంకలనం కోసం రాసింది. అయితే ఉన్న విషయమే మళ్ళీ రాయడం కంటే కొత్తగా ఏదైనా రాయాలి అనిపించింది. అదే సమయంలో పద్మ పురాణం లోని చిలుకల కథను చదవడం జరిగింది. రామాయణంలో ఇతర పాత్రలతో అనేక కథలు వచ్చాయి కానీ నాకు తెలిసి చాకలి వాడి పాత్రతో కథలు రాలేదు. రామాయణంలో కూడా అతడి పాత్ర అపవాదు వేయడం వరకే పరిమితం. ఆ తర్వాత ఆ పాత్ర ఉంటే..? అతడి జీవితం ఎలా ఉంటుంది? ఆలోచన సాగింది. ఆ చిలుకల జంటే చాకలి జంట అయితే..! అంతే.. కథ ముందుకు నడిచింది. రామాయణంలోని పాత్రల ఉదాత్తతకు ఏ మాత్రం భంగం కలగకుండా కథను తీర్చిదిద్దాను.

ప్రశ్న 21. ఈ సంపుటిలో మీకు వ్యక్తిగతంగా అత్యంత దగ్గరగా అనిపించే కథ ఏది? ఎందుకు? మీరు ఇప్పటివరకు రాసిన కథల్లో, మళ్లీ రాయాల్సి వస్తే భిన్నంగా రాయాలనిపించే కథ ఏదైనా ఉందా?

జ: పడక్కుర్చీ. ఎందుకంటే అది నాన్నను స్మరించుకుంటూ రాసింది కాబట్టి. ఇక రాసిన కథను.. అందునా ఒకసారి ప్రచురితమైన కథను మళ్ళీ మార్చి రాయడం నాకెందుకో ఇష్టం ఉండదు.. అనవసరం అనిపిస్తుంది. దానికి బదులు అదే కథాంశంతో భిన్న కోణంలో మరో కథ రాసుకోవచ్చు.

ప్రశ్న 22. ‘ప్రేమసాక్షి’ పుస్తకం చదివిన తర్వాత పాఠకుడి మనసులో ఏ భావన మిగలాలని కోరుకుంటారు?

జ: ‘ప్రేమసాక్షి’ పుస్తకం చదివాక పాఠకుడు మంచి కథలు చదివానన్న సంతృప్తి చెందాలి. కథల గురించి ఆలోచించాలి.. అనుభూతించాలి. చైతన్య శీలత పెంచుకోవాలి. హాయిగా నవ్వుకోవాలి కూడా.

ప్రశ్న 23. యువ రచయితలకు, తెలుగు కథ భవిష్యత్తుకు మీరు చెప్పాలనుకునే ముఖ్యమైన విషయాలు ఏమిటి?

జ: బాగా చదవాలి, లోతుగా ఆలోచించాలి. పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. సమాజానికి మంచి చేసే అక్షరాలకు అప్పుడు శ్రీకారం చుట్టాలి.

ప్రశ్న 24. నాలుగు దశాబ్దాలుగా కథలు రాస్తూ, ఎన్నో పాత్రలను సృష్టించి, ఎన్నో జీవితాలను అక్షరాల్లో ఆవిష్కరించిన రచయిత్రిగా – మీ సాహిత్యాన్ని ఒక్క వాక్యంలో నిర్వచించమంటే ఏం చెబుతారు?

జ: నా మనో సముద్రంలో ఎగసి, పడిన కొన్ని ఆలోచనా కెరటాలకు అక్షర రూపం.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు జొన్నలగడ్డ శ్యామల గారు.

జొన్నలగడ్డ శ్యామల: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.

***

ప్రేమసాక్షి (కథాసంపుటి)
రచన: జొన్నలగడ్డ శ్యామల
పేజీలు: 214
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
జొన్నలగడ్డ శ్యామల: 9989601113
UPI Ph: 9866889513

Exit mobile version